S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరుగుతో క్యాన్సర్ నివారణ

ఆహారం అంటే విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వీటి గురించే ఆలోచిస్తుంటాం ఎప్పుడూ. అవీ ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనవి కూడా భోజన పదార్థాల్లో ఉండాలి. వాటినీ మనం పట్టించుకోవాలి.
పెరుగు, పీచు ఇవి రెండూ భోజనాన్ని సంపూర్ణం చేస్తాయి. కేవలం పెరుగన్నంతో కడుపు నిండదు. పెరుగన్నం తినకపోయినా కడుపు నిండదు. పోషకాలన్నీ తగుపాళ్లలో ఉన్న ఆహారాన్ని సుష్టుగా తింటేనే కడుపు నిండినట్టు! ఉపయోగం లేని పోషకాలు లేని, సారం లేని జంక్ ఫుడ్స్ కంఠపర్యంతం తిన్నా అది కడుపు నిండినట్టు కాదు. పెరుగుతో చేసిన వంటకాలు, పీచు పదార్థాలున్న కూరగాయలతో కూడిన వంటకాలు తగినంతగా లేకపోతే ఆ భోజనం సంపూర్ణ భోజనం కాబోదు.
పెరుగుని ప్రో-బయటిక్ అనీ, ఆహార పీచు (డయటరీ ఫైబర్)ని ‘ప్రీ-బయటిక్’ అనీ పిలుస్తారు. ప్రోబయటిక్, ప్రీబయటిక్ పదార్థాలు తగినంత ఉన్నప్పుడే అది సంపూర్ణ భోజనం అవుతుంది. లేనిది ఎంత రుచికరమైనదైనా రిచ్చి కాదు!
మాంసాహారులు, శాకాహారులు తాము చాలా ఖరీదైన భోజనం చేస్తున్నామని భావిస్తారు. ఖరీదు మనం కొనే షాపులోనూ, తినే హోటల్లోనూ ఉంటుందే గానీ, తినే తిండిలో ఉన్నదా అనేది ప్రశ్న. తింటున్న ఆహారం ఎంత రుచిగా ఉండాలో అంత రిచ్చిగానూ ఉండాలి. ఆహారంలో రిచ్చి అనేది దానిలోని పోషకాల మీద ఆధారపడి ఉంటుంది. మనం తినే తిఫిన్లు, చిరుతిళ్లు, స్పైసీ కర్రీల్లో ఈ పోషకాల రిచ్చిని రుచి మరుగుపరిచేస్తోంది.
నాలుగు కట్టల పాలకూరతో చేసిన పప్పుని అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు, చెప్పా పెట్టకుండా వచ్చిన చుట్టం, పనక్క, బెగ్గరాంటీ, రిక్షా అంకులు (పిల్లలు ఇలానే పిలుస్తుంటారు) వీళ్ళందరికీ పంచగా ఒక్కొక్కరికి మూడాకులో నాలుగాకులో వస్తాయి. 3 లేదా 4 ఆకులు తిని ‘మేం రోజూ ఆకుకూరే తింటాం అండీ..’ అంటే ఉపయోగం ఏమీ ఉండదు. శాకాహారుల భోజనంలో శాకాలు తక్కువగా ఉండటం చేత మనం రిచ్చి ఫుడ్డు తినట్లేదనే చెప్పాలి. ‘ప్రీ బయటిక్’ గుణాలు పూర్తిగా మన ఆహారం ద్వారా మనకు అందాలంటే, కూర ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినగలగాలి! మసాలాలు, చింతపండు అతిగా కలిపి వండటం వలన మనం కొద్ది కూరని ఎక్కువ అన్నంలో కలిపి తినవలసి వస్తోంది. గరిటెడు సొరకాయ పులుసు కూరలో రెండో మూడో కూర ముక్కలుంటాయి. మిగతాదంతా పులుసు ఉంటుంది. అందుకనే తినేది శాకాహారమైనా అందులో శాకాలు తక్కువగా ఉంటున్నాయని మరీమరీ హెచ్చరించవలసి వస్తోంది.
కొంతమందికి పెరుగు లేదా చల్ల అంటే ఎలర్జీ. పక్కింట్లో చల్ల చిలుకుతున్నా ఆ వాసనకి వాంతి చేసుకునే వారున్నారు. ఇంకొంతమందికి పెరుగు లేదా చల్ల అంటే అశ్రద్ధ. చల్లనీళ్లలో ఉపయోగపడేదేమీ లేదని చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. పెరుగుతో చేసిన పదార్థాలను ప్రోబయటిక్ అని ఎందుకన్నారో వీరికి తెలీదు. యాంటీ బయటిక్స్ ఒక మార్గంలో శరీరాన్ని సంరక్షించే బాధ్యత నెరవేరుస్తుంటే ప్రోబయటిక్స్ మరో మార్గంలో ఈ రక్షణ కార్యాన్ని నెరవేరుస్తున్నాయి. రెండింటి గుణధర్మాలూ ఒకటే! పనిచేసే విధానంలోనే మార్పు. ప్రతిరోజూ యాంటీ బయాటిక్స్‌ని కొని మింగకూడదు కాబట్టి, ప్రోబయటిక్సుని ఆహారం ద్వారా తీసుకోవటం తప్పనిసరి.
పెరుగులో ఉపయోగపడే బాక్టీరియా ఉంటుంది. ఈ ఉపయోగకారక బాక్టీరియా పేగుల్ని సంరక్షిస్తుంది. మన ఆహారంలో ప్రోబయటిక్స్ పుష్కలంగా ఉన్నప్పుడే జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటుంది. జీర్ణకోశం చెడితే సమస్త అనారోగ్యాలకూ తలుపు తెరిచినట్టే అవుతుంది! రోగాలకు రాచమార్గాన్ని మూసేయాలంటే కోట తలుపులు బలంగా ఉండాలి. ప్రోబయటిక్స్ ఆ బాధ్యత నెరవేరుస్తాయి.
ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధిని నివారించే ఉత్తమ ఆహార పదార్థం ఏదని ప్రశ్నిస్తే పెరుగు పచ్చడిని ప్రముఖంగా చెప్పాలి. పెరుగు పచ్చడిలో పెరుగు, కూర ముక్కలూ ఉంటాయి. పెరుగులో ఉండే ఉపయోగకారక బాక్టీరియా, కూరల్లో ఉండే ఆహార పీచు ఇవి రెండూ కేన్సర్ నిరోధకాలు కాబట్టి పెరుగు పచ్చడి దివ్యౌషధమే!
పెరుగుని లేదా చల్ల/ మజ్జిగని పొయ్యి ఎక్కించి వండితే దానిలోని ప్రోబయటిక్ గుణాలు నశిస్తాయి. ఫ్రిజ్‌లో పెడితే దానిలోని ఉపయోగకారక బాక్టీరియా నిస్తేజం అవుతుంది. చాలామంది తాము తింటున్న కంచానే్న ఫ్రిజ్‌లోకి తీసుకెళ్లి పెరుగుని వడ్డించుకుంటూ ఉంటారు. ఇవతలకు తెస్తే చల్లదనం తగ్గిపోతుందని..! ఇది మంచి అలవాటు కాదు. పెరుగులో ఉండే బాక్టీరియా మనకు ఉపయోగపడాలంటే దాన్ని వేడీ, చల్లదనం లేని చోట గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచాలి.
కూరలన్నింటినీ పచ్చిగానే తినాలనే నియమం ఏదీ లేదు. కేరెట్, బీట్‌రూట్, టమోటా, కీరదోస, సొర, బీర, పొట్ల, బూడిద గుమ్మడి, గుమ్మడి లాంటి కూరగాయల్ని వండకుండానే తినదగినవిగా ఉంటాయి. కూరల్ని వండవచ్చు.
(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com