S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందరి బంధం

‘మన పెళ్లై ఇంకా సంవత్సరం కూడా నిండలేదు. అప్పుడే ఏమిటీ గొడవలు?’ అన్నాడు శ్రీనివాసరావు.
‘అన్నిటికీ కారణం మీ అమ్మ’ అంది నాగశ్రీ.
‘నేనేం చేశానమ్మా?’ అంది రమణమ్మ.
అత్త రమణమ్మ వైపు తిరిగి ‘చేసేదంతా చేసి నంగనాచిలా నటించకు!’ అని, భర్త శ్రీనివాసరావు వైపు తిరిగి ‘నీ తల్లికి నా మీద అనుమానం. ఇంకా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ నన్ను సాధిస్తుంది’ అంది నాగశ్రీ.
‘నాకు నీ మీద ఏ అనుమానం లేదమ్మా. నువ్వు ఒక్కదానివే బయటకు వెళ్లినప్పుడు - రోజులు బాగాలేవని ఆరా తీస్తుంటాను. నేను నిన్ను సాధించటం ఏమిటమ్మా - ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెపుతూంటాను. అంతే’ అంది రమణమ్మ.
‘ఇదంతా అనవసరం. ఈ ఇంట్లో మీ అమ్మయినా ఉండాలి. నేనైనా ఉండాలి’ తెగేసి చెప్పింది నాగశ్రీ.
* * *
శ్రీనివాసరావు చిన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు. నోటి మంచితనం గల రమణమ్మ వంట మనిషిగా పనిచేసి కొడుకుని చదివించింది. మొత్తానికి ఉన్న చిన్న రేకుల ఇంటిని అమ్మకుండానే కొడుకుని ప్రయోజకుణ్ణి చేసింది.
‘పెళ్లాం పోతే మరో పెళ్లాం దొరుకుతుంది. తల్లి పోతే మరో తల్లి దొరకదు. నేను నాగశ్రీని వదిలేస్తానమ్మా’ అన్నాడు శ్రీనివాసరావు ఆవేశంగా.
‘తప్పురా శీనూ. అలా మాట్లాడకు! భార్య మనసుకు కష్టం కలిగించకు. నేనేం ఊరు విడిచి వెళ్లటం లేదుగా. ఈ ఊళ్లోనే మరోచోట ఉంటాను. నీకు చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసి వెళ్లు’ అంది రమణమ్మ.
ఉన్నట్టుండి తన తండ్రి చనిపోయిన రోజు గుర్తొచ్చింది శ్రీనివాసరావుకు. అప్పుడు తన వయసు పది సంవత్సరాలు. ఇంటి ముందు తండ్రి శవం ఉంది. తల్లి ఏడ్చిఏడ్చి తండ్రి శవం మీద పడి స్పృహ తప్పింది. అప్పుడు ఆమెపై నీళ్లు చల్లి లేపారు. ‘్భర్త పోయాడని బాధపడకు. నీ భర్త నీకు బంగారం లాంటి కొడుకును ఇచ్చాడు. వాడు నిన్ను కంటికిరెప్పలా చూసుకుంటాడు’ అని తల్లిని ఓదార్చారు. అప్పుడు అమ్మ తనను కౌగిలించుకుంది. ఆమె కన్నీళ్లతో తన తల తడిచిపోయింది.
తల్లి అతన్ని పట్టుకుని కదపటంతో గతం నుండి బయటకు వచ్చాడు శ్రీనివాసరావు. ‘పొద్దు పోయింది ఇంటికెళ్లు’ అంది రమణమ్మ.
చేసేది లేక ఆ వృద్ధాశ్రమం నుండి బయటకు వచ్చాడు శ్రీనివాసరావు.
రమణమ్మ ఎప్పుడూ సమయం, డబ్బూ వృథా చేయకూడదు అనేది.
‘అమ్మా నాగశ్రీ, పాతకాలంలో టైలరింగు చేయటం, ఈ కాలంలో బ్యూటీపార్లర్ నడపటం చదువుకున్న ఆడవాళ్లకు లాభసాగా ఉంది. జీవితంలో లెక్క ముఖ్యం. ఏదైనా పారేసినా లెక్కెట్టి పారెయ్యాలి’ అనేది రమణమ్మ కోడలితో.
‘నేనేం నీలాగా మొగుడు చచ్చినదాన్ని కాదు. నేను ఉద్యోగస్థుడి పెళ్లాన్ని. నాకు అంత కర్మ పట్టలేదు. నేనేం లెక్కలేనిదాన్ని కాదు. నువ్వే లెక్క తప్పిన దానివి’ అనేది నాగశ్రీ అత్తతో.
* * *
శ్రీనివాసరావు ఉదయం ఆఫీసుకు వెళతాడు. సాయంత్రానికి గానీ ఇంటికి రాడు. అదే అత్త ఉంటే అన్నిటికీ ఆరాయే. ఇప్పుడు అత్త లేదు.
పక్క ఇళ్లలో గంటల తరబడి ఉంటోంది. అవసరం లేకున్నా షాపింగ్‌కు వెళుతోంది. స్నేహితురాళ్లతో ఫోన్‌లో మాట్లాడటం, టీవీ చూడటం - నాగశ్రీ స్వేచ్ఛకు అడ్డులేదు. ఇంట్లో అత్తచేసే పనులు చేయటానికి పనిమనిషిని పెట్టుకుంది.
తన పుట్టింటి వాళ్లను నెలకు రెండుసార్లు తన ఇంటికి రప్పించి, వచ్చిన ప్రతిసారీ పదిహేను రోజులు ఉంచుకుని పంపాలనేది ఆమె ఆశ.
శ్రీనివాసరావు ఏదైనా చెప్పబోతే ‘మీకేమీ తెలియదు. మీ అమ్మ పెంపకంలో మీరు మరీ ఆదిమానవుడి లాగా తయారయ్యారు. కాలం మారింది. మనమూ మారాలి’ అనేది.
* * *
నాగశ్రీ పెళ్లికి రెండు సంవత్సరాల ముందే ఆమె తల్లి చనిపోయింది. ఈ మధ్యనే నాగశ్రీ తమ్ముడి పెళ్లైంది. దానితో ఆమె తండ్రి బాధ్యతలు తీరిపోయాయి. తమ్ముడి భార్యను చక్కని చుక్క అని అందరూ మెచ్చుకున్నారు.
తమ్ముడి పెళ్లైన ఆరు నెలలకు ఒకరోజు తండ్రి నుండి ఫోన్ వచ్చింది. అయితే ఆయన తనను తాను ఉండే ఇంటికి కాక వేరే చోటుకు రమ్మన్నాడు. వెళ్లింది నాగశ్రీ.
అది ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం. అక్కడ తండ్రిని చూడగానే నాగశ్రీకి నోట మాట రాలేదు.
‘నీ మరదలికి నేను భారమై పోయానమ్మా. నేను ఆమెను అనుమానిస్తున్నానంట. సాధిస్తున్నానంట. తను నాకు చాకిరీ చేయలేకపోతోందట. నేను అక్కడే ఉంటే తను నీ తమ్ముడితో కాపురం చేయనంది.
వాడి కాపురం చెడగొట్టటం ఇష్టంలేక నేను ఇక్కడికి వచ్చానమ్మా’ చెప్పాడు నాగశ్రీ తండ్రి.
తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది నాగశ్రీ. కొద్దిసేపటికి ‘తమ్ముడే కాదు నేనూ నీ సంతానానే్న. వాడు చూడకపోయినా నేనున్నాను. నాతో నా ఇంటికి రా నాన్నా!’ అంది నాగశ్రీ.
‘అల్లుడు మంచివాడు. నేను అక్కడికి వచ్చినా కాదనడు. కానీ మీ అత్తను వృద్ధాశ్రమంలో ఉంచి నేను మీ ఇంట్లో ఉండటం బాగోదు’ అన్నాడు నాగశ్రీ తండ్రి.
చేసేది లేక ఇంటికొచ్చింది నాగశ్రీ.
* * *
‘ఏవండీ! మీ అమ్మను ఇంటికి తెచ్చుకుందాం’ అంది నాగశ్రీ ఒకరోజు భర్తతో.
ఆశ్చర్యంతో ‘ఎందుకు?’ అన్నాడు శ్రీనివాసరావు.
‘ఎందుకేమిటి? ఎంతైనా ఆమె అత్త కాకపోతుందా? నేను కోడలిని కాకపోతానా?’
‘అక్కడైనా ఆమెను మనశ్శాంతిగా ఉండనియ్. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి - నీతో తిట్టించటం నా వల్ల కాదు’
పట్టుపట్టింది నాగశ్రీ. ‘అయితే నువ్వే వెళ్లి ఆమెను ఒప్పించి తీసుకురా’ అన్నాడు శ్రీనివాసరావు.
రెండు మూడుసార్లు వృద్ధాశ్రమానికి వెళ్లింది. అత్తను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది నాగశ్రీ.
అత్త ఇంటికొచ్చిన నెల రోజుల తర్వాత, భర్తకు తన తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి చెప్పింది.
‘ఆయనను మన ఇంటికి తీసుకొద్దాం’ అంది.
‘నీ ఇష్టం’ అన్నాడు శ్రీనివాసరావు.
హుషారుగా తన పుట్టిన ఊరికి వెళ్లింది నాగశ్రీ. తండ్రి ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లింది. ఆయన అక్కడ లేడు. కంగారుపడి తమ్ముడి ఇంటికి వెళ్లింది. తన తండ్రి అక్కడే ఉన్నాడు. తమ్ముడి భార్య ఆయనకు టీ అందిస్తూ కనిపించింది.
తండ్రి వంక చూసి ‘నాన్నా! నువ్వేంటి ఇక్కడ?’ అంది.
‘అవునమ్మా, నీ మరదలికి ఏమైందో ఏమో. నా దగ్గరకు వచ్చింది. నన్ను బ్రతిమిలాడి ఇక్కడికి తీసుకొచ్చింది’ అన్నాడు నాగశ్రీ తండ్రి.
‘వదినా.. నేను మారిపోయాను. నా ఇద్దరు అన్నలూ వాదులాడుకుని నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చారు. అప్పుడు తెలిసింది నాకు ఆ బాధ ఏమిటో. అందుకని..’ చెప్పుకుపోతున్న మరదలి వంక చూస్తూ ఉండిపోయింది నాగశ్రీ.

===============================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కళ్లేపల్లి తిరుమలరావు.. 9177074280