S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సైసై దాదా.. సై.. సై..

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)..
పరిచయం అవసరం లేని పేరు..
ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అధికార దండం..
కోట్లకు పడగలెత్తిన సంస్థ..
అంతేకాదు.. ప్రభుత్వేతర సంస్థల కింద నమోదైన కారణంగా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదన్న వాదనతో దశాబ్దాలపాటు ప్రజల అభిమానాన్ని సొమ్ముగా మార్చుకుంటున్న సంస్థ. సుప్రీం కోర్టు నియమించిన లోధ కమిటీ సిఫార్సులు.. వాటిని అమలు చేయాల్సిందేనన్న ఆదేశాలు.. పాలనాధికారుల (సీఓఏ) బృందం ఆజమాయిషీ.. వంటి అంకుశాలు లేకపోతే.., బీసీసీఐని నిలువరించడం ఎవరితరం కాదన్నది వాస్తవం. ఈ మదగజాన్ని ఎక్కిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏ విధంగా దానిని అదుపు చేస్తాడో? ఎంత వరకూ సుప్రీం కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూస్తాడో? అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు, విమర్శలు, అవినీతి, క్రమశిక్షణా రాహిత్యం వంటి సమస్యలకు ఏ విధంగా చెక్ చెప్తాడో చూడాలి. బీసీసీఐ మైదానంలో అతని ఇన్నింగ్స్ హిట్టా? ఫట్టా? అన్నది ఆసక్తిని రేపుతున్నది.
సీఓఏ అంకుశం
బీసీసీఐ ఇష్టారాజ్య వైఖరిని సీఓఏ కొంత వరకూ అడ్డుకుంది. ఈ కమిటీ ఆర్భాటపు ప్రకటనలు.. పర్యటనల హంగామాలు చేయలేదు.. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పిలో కనిపించే ఏకాగ్రతతో పని చేస్తున్నది. విభేదాలు తలెత్తినా, సభ్యులు రాజీనామా చేసినా ఏమాత్రం చలించకుండా ముందుకు సాగుతున్నది. మూడో కంటికి తెలియకుండా, సుప్రీం కోర్టు తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది. ఆరంభంలో సీఓఏను తక్కువ అంచనా వేసిన బోర్డు, దాని సభ్య సంఘాల అధికారులు క్రమంగా దారిలోకి వస్తున్నారు. లోధా సిఫార్సుల అమలుకు బలమైన పునాది పడుతున్నదని చెప్పాలి. అటు విదేశాలతో సిరీస్‌లకు, ఇటు దేశవాళీ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అన్ని వ్యవహారాలు సీఓఏ పర్యవేక్షణలో జరిగిపోతున్నాయి. భారత క్రికెట్‌ను సీఓఏ చక్కదిద్దుతున్నది. గంగూలీ సహకారం కూడా ఉంటే, అతి తక్కువ కాలంలోనే బీసీసీఐ కొత్త రూపంతో వెలిగిపోవడం ఖాయం.
బీసీసీఐ పాలనా వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడంతోపాటు, క్రికెట్‌లో వేళ్లూనుకున్న అవినీతిని పెకళించడానికి విశ్రాంత న్యాయమూర్తి లోధా నేతృత్వంలోని కమిటీ ఎన్నో ప్రతిపాదనలు చేసింది. వాటిని అమలు చేయడానికి సుప్రీం కోర్టు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. మాజీ కంప్‌ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ అధ్యక్షతన, ప్రారంభంలో నలుగురు సభ్యులతోఈ కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఎన్నో బాధ్యతలను అప్పచెప్పింది. వాటిలో ప్రధానమైనది లోధా సిఫార్సుల అమలు చేయడం. తొలుత ఈ కమిటీలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక నిపుణుడు విక్రం లిమాయే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సభ్యులుగా ఉన్నారు. అయితే, సమయాభారం వల్ల తాను కొనసాగలేకపోతున్నట్టు ప్రకటించిన రామచంద్ర గుహ సీఓఏ నుంచి వైదొలిగాడు. కొన్ని అంశాల్లో తలెత్తిన విభేదాల కారణంగా విక్రం లిమాయే కూడా రాజీనామా చేశాడు. దీనితో వినోద్ రాయ్, ఎడుల్జీ మాత్రమే మిగిలారు. అయినప్పటికీ, సీఓఏ తన పంథాను మార్చుకోలేదు. ఇటీవలే వినోద్ రాయ్, ఎడుల్జీ మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ఈ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పాత్ర కీలకంగా మారింది.
గుత్త్ధాపత్యం
స్వచ్ఛంద సంస్థల చట్టం కింద నమోదైనప్పటికీ, దేశంలో క్రికెట్‌కు బీసీసీఐ పర్యాయపదమైంది. క్రీడను తన గుప్పిట్లో ఉంచుకొని రాజ్యం చలాయిస్తున్నది. దేశంలో క్రికెట్‌కున్న విపరీతమైన ఆదరణే పునాదిగా, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న సంస్థగా ఎదిగింది. ప్రపంచ క్రికెట్‌ను కూడా శాసించే స్థాయికి చేరింది. బీసీసీఐఐకి ఒకానొక దశలో సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోలేదు. 2013లో జరిగిన ఆరో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ తర్వాత చోటు చేసుకున్న తీవ్రమైన పరిణామాలను కూడా తేలిగ్గా తీసుకుంది. ముకుల్ ముద్గల్ రెండు దశల్లో జరిపిన విచారణను పట్టించుకోలేదు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దోషులపై చేపట్టాల్సిన చర్యలను ఖరారు చేయడానికి, దేశ క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించడానికి లోధా నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్టు నియమించినా స్పందించలేదు. లోధా ప్రతిపాదనలను సైతం బుట్టదాఖలు చేసింది. వీటిని అమలు చేసి తీరాలంటూ సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ స్పందించలేదు. ఆ దిశగా అడుగులు వేయలేదు. స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా తాత్సారం చేసిన బీసీసీఐ చివరికి ఒకానొద దశలో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైంది. కానీ, తన పంథాను మార్చుకోలేదు. మూడు పర్యాయాలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించిందేకానీ, లోధా సిఫార్సుల అమలుపై నిర్ణయాలు తీసుకోలేదు. కుంటి సాకులు చెప్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించిన బీసీసీఐపై సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించక తప్పలేదు. సీఓఏను నియమించి, బీసీసీఐ దూకుడుకు పగ్గాలు వేసింది.
బయటి వ్యక్తులదే రాజ్యం
దశాబ్దాల తరబడి బోర్డు వ్యవహారాలను క్రికెట్‌తో సంబంధం లేని బయటి వ్యక్తులే తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. చాలాకాలం తర్వాత గంగూలీ రూపంలో ఓ క్రికెటర్ మళ్లీ బోర్డు అధ్యక్ష పదవిని చేపట్టాడు. అయితే, ఇన్నాళ్లూ ఆధిపత్యాన్ని చెలాయించిన బడా వ్యాపార, వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు హఠాత్తుగా పెత్తనాన్ని వదులుకుంటారా? అన్నది అనుమానమే. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారు బీసీసీఐని శాసిస్తునే ఉంటారన్న వాదన లేకపోలేదు. క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేసిందని ఇప్పటికే వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి బీసీసీఐని గంగూలీ ఏ విధంగా బయటపడేస్తాడో చూడాలి. భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా, కెప్టెన్‌గా తాను చూపిన మొండి వైఖరిని, ధైర్యాన్ని బోర్డు చైర్మన్ హోదాలోనూ కనబరుస్తాడా? తనదైన ముద్ర వేస్తాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. గతంలో బోర్డు అధికారులు క్రికెట్‌ను వ్యాపారంగా మార్చడానికి, కోట్లాది రూపాయలు ఆర్జించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే, లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ఆర్థికాంశాల కంటే, ప్రక్షాళనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
చేతలు అవసరం..
బీసీసీఐ ప్రక్షాళన జరగాలంటే మాటలు కాదు.. చేతలే అవసరం.. గంగూలీకి మాటల కంటే చేష్టలకే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పేరుంది. ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చని, క్రికెట్ అభివృద్ధే తన లక్ష్యమని ప్రకటించిన అతనికి మిగతా అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తుందా? లేదా? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. క్రికెట్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్నవాడు కాబట్టి, అత్యుత్తమ సేవలు అందించే అవకాశాలు లేకపోలేదు. బోర్డులో వ్యవహారాలు, తీసుకునే నిర్ణయాలు క్రికెటర్లను ప్రోత్సహించేవిగా ఉండేలా గంగూలీ ప్రయత్నించడం ఖాయం. ఎంతమంది అతనికి మద్దతునిస్తారనేదే ప్రశ్న.
అప్రతిహత ప్రయాణం
ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీసీఐ 1928 నుంచి తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నది. అంతర్గత విభేదాలు, సమస్యలు తప్ప బీసీసీఐకి ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. 1912లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో మొట్టమొదటిసారి పర్యటించింది. పాటియాలా మహారాజు భూపీందర్ సింగ్ నాయకత్వం వహించిన ఈ జట్టు ఇంగ్లాండ్‌లో చక్కటి ఆటతో ఆకట్టుకుంది. ఆతర్వాత ఆర్థర్ గిలియన్ నాయకత్వంలో ఎంసీసీ జట్టు భారత్‌లో పర్యటించింది. అప్పుడు కూడా భారత ఆటగాళ్లు అద్వితీయ ప్రతిభ కనబరిచారు. దీనితో టెస్టు మ్యాచ్‌లు ఆడే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. సభ్యత్వం ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, వందలాది సంస్థాలు, సామంతరాజులతో నిండివున్న భారత్‌లో క్రికెట్‌కు ఒకే సంస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ సూచనకు అనుగుణంగా 1927 నవంబర్ 21న ఢిల్లీలో జరిగిన సమావేశానికి సింధ్, పంజాబ్, పాటియాలా, ఢిల్లీ, యునైటెడ్ ప్రావీన్స్, రాజపుతానా, అల్వార్, భోపాల్, గ్వాలియర్, బరోడా, కథియవార్, సెంట్రల్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు కలిపి ఒకే క్రికెట్ బోర్డు ఉండాలని నిర్ణయించారు. అదే ఏడాది డిసెంబర్ 10న తాత్కాలికంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పేరుతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని, 1928 డిసెంబర్‌లో బీసీసీఐ అధికారికంగా ఏర్పడింది. అప్పటి మద్రాసులో వ్యాపారేతర సంస్థ కింద బీసీసీఐ నమోదైంది. ఆర్‌ఇ గ్రాంట్ గోవన్ తొలి అధ్యక్షుడిగా, ఆంథోనీ డి మెలో మొదటి కార్యదర్శిగా వ్యవహరించారు.
విశ్వరూపం
క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీసీసీఐ తిరుగలేని రీతిలో ఎదిగింది. బోర్డులో ఇప్పుడు నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ నుంచి మూడు నాన్ ప్లేయింగ్ సంఘాలతోపాటు 27 రాష్ట్రాల నుంచి క్రికెట్ సంఘాలకు సభ్యత్వం ఉంది. దేశం తరఫున వివిధ జట్లను ఎంపిక చేయడం నుంచి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే వరకూ క్రికెట్‌కు సంబంధించిన అన్ని హక్కులు బీసీసీఐ సొంతం. ఈ హక్కులతోనే కోట్లకు పడగలెత్తింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం తీసుకోవడం లేదు కాబట్టి ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదన్నది నిన్నమొన్నటి వరకూ బీసీసీఐ వాదన. అధికారికంగా బోర్డు ప్రకటించిన లెక్కలను అనుసరించి తాజా ఆదాయం 140 మిలియన్ డాలర్లు (సుమారు 868 కోట్ల రూపాయలు). నిబంధనవాళిని అనుసరించి ఆస్తిఅప్పుల చిట్టాను బహిర్గతం చేయాల్సిన అవసరం బీసీసీఐకి లేదు. అయితే, స్థూల అంచనాల ప్రకారం ప్రపంచ మీడియా హక్కులపై కుదిరిన కాంట్రాక్టు కింద బీసీసీఐకి సుమారు 1,000 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తున్నది. అధికారిక కిట్ స్పాన్సర్‌షిప్, జాతీయ జట్టు అధికారిక స్పాన్సర్, న్యూట్రల్ వెన్యూ వనే్డ మ్యాచ్‌లకు స్పాన్సర్‌షిప్, హోటల్, ట్రావెల్, గ్రౌండ్ స్పాన్సర్‌షిప్ వంటి వివిధ హక్కుల అమ్మకాల ద్వారా బీసీసీఐకి ఏటా మరో 450 మిలియన్ డాలర్ల (సుమారు 2,000 కోట్ల రూపాయలు) ఆదాయం వస్తున్నదని అంచనా. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను బంగారు బాతుగా అభివర్ణించవచ్చు. బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్నది. ఇంత భారీ ఆదాయం ఉంది కాబట్టే, బీసీసీఐపై పట్టు కోసం రాజకీయ నేతల నుంచి, వ్యాపార, పారిశ్రామిక వేత్తల వరకూ ప్రతి ఒక్కరూ పోటీ పడతారు. తమకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడేలా పావులు కదుపుతారు. ఇలాంటి ఆధిపత్య పోరాటంలో గెలవడం గంగూలీకి అసాధ్యం కాకపోవచ్చేమోగానీ సులభం మాత్రం కాదు.
ప్రపంచ క్రికెట్‌పై పెత్తనం
ప్రపంచ క్రికెట్‌పై బీసీసీఐ పెత్తనాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఇన్నాళ్లూ పరోక్షంగా శాసిస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు ప్రత్యక్షంగానే అధికారాన్ని చూపెడుతున్నది. టెస్టు హోదాగల 12 దేశాల్లో ‘బిగ్ త్రీ’గా పేరుపడిన భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌పై ఆజమాషి చెలాయస్తున్నాయ. ఈ మూడు దేశాల్లోనూ భారత్ ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఎన్నో సందర్భాల్లో ఐసీసీని వ్యతిరేకిస్తూ వీధికెక్కి రాద్ధాంతం చేసిన బీసీసీఐ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నది. నిజానికి భారత్ ఇంతగా అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించడానికి కారణాలు లేకపోలేదు. ఐసీసీకి వస్తున్న ఆదాయంలో సుమారు 80 శాతం బీసీసీఐ నుంచే వెళుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులు ఉన్న క్రీడా సంస్థగా ఎదిగిన బీసీసీఐ చాలాకాలంగా ప్రపంచ క్రికెట్‌ను, ఐసీసీని శాసిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఐసీసీకి అడ్డుతగులుతూ తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ తంతును మిగతా దేశాలు ఏవగించుకుంటున్నా పట్టించుకో లేదు. అత్యధిక ఆయాన్ని బీసీసీఐ సంపాదించి పెడుతుంటే, మిగతా 20 శాతాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అందిస్తున్నాయి. ఐసీసీలో పూర్తి స్థాయి సభ్యత్వం 12 దేశాలకు ఉంటే, మూడు దేశాలే ఆదాయాన్ని సమకూర్చడం, మిగతా తొమ్మది దేశాలు వాటాలను పొందడం ఆనవాయితీగా మారింది. క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ దేశాల్లోనూ లభిస్తున్న ఆదాయం తక్కువే. మన దేశంలోనే అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు పరుగులు తీస్తారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతారు కాబట్టే, డబ్బు మూటలు పట్టుకొని స్పాన్సర్లు క్యూ కడతారు. బహుళ జాతి సంస్థలు భారీ ప్రకటనలను గుప్పిస్తాయి. ఇక క్రికెటర్లు నటించే ప్రకటనలకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆటగాడు ప్రకటనల్లో కనిపించి చెప్తే చాలు.. ఎంత నాసిరకమైన వస్తువునైనా కొనుక్కునే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. వినియోగ వస్తువులకు అతి పెద్ద మార్కెట్ ఉన్న భారత్‌లో క్రికెట్‌ను మించిన ఉత్తమ ప్రచార సాధనం మరొకటి లేదన్నది వాస్తవం. దీనిని బహుళజాతి సంస్థలు ఎప్పుడో తెలుసుకున్నాయ. అటు ఆటగాళ్లు.. ఇటు వాణిజ్య సంస్థలు.. మరోవైపు బీసీసీఐ.. ఈ మూడు ముక్కలాటలో అంతా భాగస్వాములే. ఎవరి వాటా వారిదే. అందరూ లాభస్తులే. జేబులకు చిల్లులు పడుతున్నా పట్టించుకోని వీరాభిమానులు ఉన్నంతకాలం తమ పని సజావుగా సాగుతుందనే బడా వ్యాపార సంస్థలకు తెలిసిన నిజం. కింది స్థాయి మ్యాచ్‌లకు కూడా స్టేడియాలు కిక్కిరిసిపోవడం, నిర్వాహకులకు భారీగా ఆదాయం రావడం మన దేశంలో మాత్రమే కనిపించే ఆచారం. ప్రపంచ క్రికెట్‌లోనే 80 శాతం భారత్ నుంచి వెళుతున్నదంటే, ఇక్కడ క్రికెట్‌కు ఏ స్థాయి అభిమానులు ఉన్నారో ఊహించుకోవచ్చు. వీరి అభిమానానే్న బీసీసీఐ సొమ్ము చేసుకుంటున్నది. కాసుల పంట పండిస్తున్నది. ఐపీఎల్ వంటి ఆకర్షణీయ ఈవెంట్స్‌ను ప్రవేశపెట్టి అభిమానులను మరింతగా పెంచుకుంది. ప్రపంచ క్రికెట్‌పై పట్టు సంపాదించింది. భారత్ ఆధిపత్యానికి గండి కొట్టడానికి మిగతా దేశాలు ప్రయత్నిస్తునే ఉన్నాయ. ఇవి ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి. బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఐసీసీతో గంగూలీ ఏ విధంగా నెట్టుకొస్తాడన్నది కూడా గమనించాల్సిన అంశం.
‘స్వయం ప్రతిపత్తి’ ముసుగులో బిసిసిఐ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి. స్వచ్ఛంద సంస్థ కింద
బిసిసిఐకి పన్ను మినహాయింపు ఉండేది. అయితే, ఆదాయపన్ను శాఖ ఈ మినహాయింపును 2007-08 సీజన్ నుంచి ఎత్తివేసింది. 2009-2010 ఆర్థిక సంవత్సరం నాటికి బిసిసిఐ 413 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉండగా, 41.91 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసింది. మిగతా సొమ్మును కట్టాల్సిన అవసరం లేదంటూ భీష్మించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రకరకాల విధానాల్లో పన్ను ఎగవేతకు పాల్పడుతునే ఉంది. వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించకపోగా, రాయతీలు ఇవ్వాలని, ఫ్లడ్ లైట్లకు విద్యుత్ నుంచి మైదానాలను నిర్వహించేందుకు నీటి సరఫరా వరకూ అన్నింటినీ ఉచితంగానే ఇవ్వాలని పట్టుబడుతున్నది. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు బందోబస్తు ఏర్పాట్లను స్థానిక పోలీసులే చూసుకుంటున్నారు. అంటే, ఈ రకంగానూ బీసీసీఐకి ఖర్చు లేదు. వందలు, వేల కోట్ల రూపాయలను బీసీసీఐ అధికారుల నుంచి కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ వరకూ ప్రతి ఒక్కరూ కొల్లగొడుతునే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. స్వచ్ఛంద సంస్థ కాబట్టి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) తనకు వర్తించదని వాదిస్తున్న బీసీసీఐ పన్నులను కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నది కఠోర వాస్తవం. ఈ అక్రమాలకు బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ చెక్ పెడతాడో? అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాడో చూడాలి.
ఇష్టారాజ్యం
బీసీసీఐది ఇష్టారాజ్యమని చెప్పడానికి ఉదంతాలు ఎన్నో ఉన్నాయ. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఐసీసీ పాలక మండలి తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని తప్పుపట్టి, వ్యతిరేకించి చివరికి తన పంతాన్ని నెగ్గించుకోవడం బీసీసీఐ అలవాటు. బోర్డు వైఖరికి కొన్ని ఉదాహరణలు.. క్రీడాకారులు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడకుండా కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)ను సైతం బీసీసీఐ ఖాతరు చేయలేదు. ఒక మేజర్ టోర్నీకి ముందు ఆరు నెలలు, పోటీలు ముసిగిన తర్వాత ఆరు నెలల పాటు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో స్పష్టమైన వివరాలను ఇవ్వాలని వాడా జారీ చేసిన ఆదేశాలను మిగతా దేశాలన్నీ పాటిస్తుంటే, బీసీసీఐ మాత్రం బుట్టదాఖలు చేసింది. ఈ విధంగా ఆరు నెలల ముందుగానే తాము ఎక్కడ ఉంటామో చెప్పాలనడం అన్యాయమని, దీని వల్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని భారత క్రికెటర్లు నానా యాగీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వివరాలు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. బీసీసీఐ వారికి వంతపాడింది. వాడాకు నేరుగా బీసీసీఐపైగానీ, భారత క్రికెటర్లపైగానీ చర్యలు తీసుకునే అధికారం లేదు. దీనితో ఐసీసీని ఆశ్రయించింది. కానీ, బీసీసీఐ కాదన్న తర్వాత అవుననే ధైర్యం ఐసీసీకి లేకపోయింది. వాడా నిబంధనలను అమలు చేయాల్సిందిగా భారత్‌ను డిమాండ్ చేయలేకపోయంది. సాకర్ నుంచి టెన్నిస్ వరకూ అన్ని క్రీడలకు సంబంధించిన వివిధ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు, సమాఖ్యలు వాడా ఆదేశాలను పాటిస్తుంటే, బీసీసీఐ మాత్రం ఇప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఐసీసీ కూడా ఆ విషయాన్ని మరచిపోయినట్టే నటిస్తోంది. తిరుగులేని ధన బలంతో బిసిసిఐ ప్రపంచ క్రికెట్‌నేగాక, యావత్ క్రీడారంగాన్ని శాసిస్తున్నదనడానికి ఇదో తార్కారణం. అంతకు ముందు, 2001లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ బంతిని ట్యాంపరింగ్ చేశాడని మ్యాచ్ రిఫరీ మైక్ డెన్నిస్ కూడా ధ్రువీకరించాడు. అయితే, బీసీసీఐ ఒత్తిడి మేరకు సచిన్‌పై చర్యకు ఉపక్రమించే ధైర్యం ఐసిసి చేయలేకపోయింది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన ఘర్షణ చాలా మందికి తెలిసిందే. తనను ‘మంకీ’ అంటూ జాతిని ఉద్దేశించి హేళన చేశాడని సైమండ్స్ చేసిన ఆరోపణలపై మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్ తీవ్రంగా స్పందించాడు. భజ్జీపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు వేశాడు. అయితే, బీసీసీఐ రంగంలోకి దిగడంతో పరిస్థితి మారింది. అప్పటి వరకూ నోరు మెదపని సచిన్ కల్పించుకొని, సైమండ్స్‌ను భజ్జీ ఏమీ అనలేదని చెప్పాడు. నల్లజాతీయుడైనందువల్లే సైమండ్స్‌ను భజ్జీ తిట్టాడనడం పొరపాటని తేల్చిచెప్పాడు. పరోక్షంగా బీసీసీఐ తెచ్చిన ఒత్తిడికి లొంగిన ఐసీసీ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. సచిన్ లాంటి గొప్ప ఆటగాడు సాక్ష్యమిచ్చాడు కాబట్టి భజ్జీని నిర్దోషిగా భావిస్తున్నట్టు ప్రకటించింది. అతనిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఐసీసీపై బీసీసీఐకి ఉన్న పట్టు ఏమిటో ఈ సంఘటన చెప్పకనే చెప్తున్నది.
ఫీల్డ్ అంపైర్లు తీసుకునే నిర్ణయాన్ని సవాలు చేసే అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్)ను బీసీసీఐ కొన్ని సుమారు దశాబ్దం పాటు వ్యతిరేకించింది. మిగతా దేశాలన్నీ డీఆర్‌ఎస్‌కు అనుకూలంగా స్పందిస్తూ, ద్వైపాక్షిక సిరీస్‌లలో అమలు చేస్తుంటే, భారత్ మాత్రం ససేమిరా అన్నది. డీఆర్‌ఎస్ సందర్భంగా అనుసరించే సాంకేతిక విధానాల్లో పొరపాట్లు ఉన్నాయని భారత్ వాదన. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం తప్పుకాదంటూనే డీఆర్‌ఎస్ అమలులో మాత్రం సవాలక్ష లోపాలను వెతికే ప్రయత్నం చేసింది. ఏ చిన్న పొరపాటు కనిపించినా దానిని భూతద్దంలో చూపిస్తూ, డీఆర్‌ఎస్‌ను అమలు చేసేది లేదని తేల్చిచెప్పింది. టెస్టు హోదాగల పనె్నండు దేశాలతోపాటు, అసోసియేట్, అఫ్లియేట్ సభ్యత్వం ఉన్న బోర్డులు సైతం డీఆర్‌ఎస్‌ను అమలు చేయాలని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఐసీసీ భారత్ విషయంలో మాత్రం నోరు మెదపలేకపోయంది. మిగతా దేశాలు ద్వైపాక్షిక, బహుముఖ పోటీల్లో డీఆర్‌ఎస్ ఉండితీరాలని పట్టుబడుతుండడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరికి పాక్షికంగా డీఆర్‌ఎస్‌కు అంగీకరించింది. కానీ ఐసీసీ మాత్రం బీసీసీఐని ఆదేశించ లేకపోయందనేది వాస్తవం. *
*
బీసీసీఐ నిర్వహించే పోటీలు

కార్పొరేట్ ట్రోఫీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
ఇరానీ కప్
ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీ
రంజీ ట్రోఫీ
దులీప్ ట్రోఫీ
విజయ్ హజారే ట్రోఫీ
దేవధర్ ట్రోఫీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
విజ్జీ ట్రోఫీ
*
బీసీసీఐ అధ్యక్షులు వీరే..

1928-1933: ఆర్‌ఇ గ్రాంట్ గోవన్
1933-1935: సికందర్ హయాత్ ఖాన్
1935-1937: హమీదుల్లా ఖాన్
1937-1938: కేఎస్ దిగ్విజయ్ సింగ్‌జీ
1938-1946: పీ. సుబ్బరాయన్
1946-1951: ఆంథోనీ డి మెలో
1951-1954: జేసీ ముఖర్జీ
1954-1956: విజయ ఆనంద గజపతి రాజు
1956-1958: సర్దార్ సుర్జీత్ సింగ్ మజిథియా
1958-1960: ఆర్‌కే పటేల్
1960-1963: ఎంఏ చిదంబరం
1963-1966: ఫతేసింగ్‌రావు గైక్వాడ్
1966-1969: జేఆర్ ఇరానీ
1969-1972: ఏఎన్ ఘోష్
1972-1975: పీఎం రుంగ్తా
1975-1977: రాంప్రకాష్ మెహ్రా
1977-1980: ఎం. చిన్నస్వామి
1980-1982: ఎస్‌కే వాంఖడే
1982-1985: ఎన్‌కేపీ సాల్వే
1985-1988: శ్రీరామన్
1988-1990: బీఎన్ దత్
1990-1993: మాధవరావు సింధియా
1993-1996: ఐఎస్ బింద్రా
1996-1999: రాజ్ సింగ్ దుంగార్పూర్
1999-2001: ఏసీ ముత్తయ్య
2001-2004: జగ్మోహన్ దాల్మియా
2004-2005: రణ్‌బీర్ సింగ్ మహేంద్ర
2005-2008: శరద్ పవార్
2008-2011: శశాంక్ మనోహర్
2011-2013: ఎన్. శ్రీనివాసన్
2013-2013: జగ్మోహన్ దాల్మియా (తాత్కాలికం)
2013-2015: ఎన్. శ్రీనివాసన్
2015: జగ్మోహన్ దాల్మియా (అదే ఏడాది మృతి చెందాడు)
2015-2016: శశాంక్ మనోహర్
(ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన కారణంగా రాజీనామా).
2016-2017: అనురాగ్ ఠాకూర్
(సుప్రీం కోర్టు ఆదేశాలతో రాజీనామా)
2017-2019: సీకే ఖన్నా (తాత్కాలికం)
2019: సౌరవ్ గంగూలీ.
*
దాదా వర్సెస్ దీదీ!
నిన్నమొన్నటి వరకూ ఒకరికొకరు మద్దతునిచ్చుకున్న బీసీసీఐ అధ్యక్షుడు ‘దాదా’ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమత బెనర్జీ ఇక ముందు ప్రత్యర్థులుగా మారుతారా? పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నదా? గంగూలీ ద్వారా మమతను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నదా? అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ. అధికార తృణమూల్ పార్టీకి, ముఖ్యమంత్రి మమతకు గంగూలీ అభిమాని. అందుకే, ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ప్రకటించాడు. మమత కూడా గంగూలీకి పలు సందర్భాల్లో అండగా నిలిచింది. బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించింది. పశ్చిమ బెంగాల్‌లో మమతను దెబ్బకొట్టడానికి సరైన ఆయుధం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి గంగూలీ కనిపించాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రకటించిన సమయంలో, మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడు రజత్ శర్మ నుంచి తీవ్రమైన పోటీ తప్పేలా కనిపించకపోవడంతో బెంబేలెత్తిన గంగూలీకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపద్భాందవుడిగా దర్శనమిచ్చాడు. అమిత్ షా కుమారుడు జై షా, అస్సాం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బిశ్వ శర్మతో గంగూలీ కలిశాడు. అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న శర్మ, జై షాను, గంగూలీని వెంటబెట్టుకొని వెళ్లి, అమిత్ షాతో సమావేశమయ్యాడు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నామని గంగూలీ చెప్తున్నప్పటికీ, 2021లో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పావులు కదుపుతున్న బీజేపీ వ్యూహంలో భాగంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులు భారీగా ఉన్నారు. క్రికెటర్‌గా గంగూలీ అందరికీ సుపరచితుడే. అయితే, అతను ఇండియన్ సూపర్ లీగ్ (్ఫట్‌బాల్ టోర్నమెంట్)లో ఏటీకే ఫ్రాంచైజీకి సహ భాగస్వామి. స్థానికంగా జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరయ్యే గంగూలీ, ఇప్పుడు ఏటీకే భాగస్వామి హోదాలో, ఆ జట్టు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆడే మ్యాచ్‌లను ప్రత్యేకంగా వెళ్లి చూస్తున్నాడు. దీనితో ఫుట్‌బాల్ అభిమానులనూ గంగూలీ ఆకట్టుకోగలిగాడు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన క్రమంలోనే, పశ్చిమ బెంగాల్‌లోనూ తన ఉనికిని చాటుకుంది. దిలీప్ ఘోష్ నేతృత్వంలో ఆ పార్టీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 2014లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌తో నువ్వా? నేనా? అంటూ తలపడే స్థాయికి ఎదిగింది. తృణమూల్ గత ఎన్నికల్లో 34 సీట్లు కొల్లగొడితే, ఈసారి 22 సీట్లతో సంతృప్తి చెందింది. పశ్చిమ బెంగాల్‌లో బలంగా పాదం మోపగలిగామన్న నమ్మకం పెరగడంతో, ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. గంగూలీని కూలింగ్ పీరియడ్ పూర్తయ్యేలోగా పార్టీలో కీలకంగా మార్చేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే అతనితో అమిత్ షా భేటీ అయినట్టు చెప్తున్నారు. పరిశీలకుల అంచనాలు నిజమైతే, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘దాదా’ వర్సెస్ ‘దీదీ’ పోరు తప్పకపోవచ్చు.

- బీఎస్‌ఎస్ మైత్రేయ