S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టెక్నాలజీ

హిమగిరి బ్యాంక్ లిమిటెడ్, బాలకనకపురం బ్రాంచికి అది ప్రతిరోజూ లాగా మరొక వర్కింగ్ డే. కానీ ఆ రోజు మిగిలిన రోజుల్లాగా ఉండబోవట్లేదని ఆ రోజు ఉదయం అందులోకి అడుగు పెడుతున్న బ్రాంచ్ మేనేజర్ గోపాలరావుకి ఆ క్షణంలో తెలియదు.
బాలకనకపురం బ్రాంచ్ విజయవాడ రీజియన్ క్రిందికి వస్తుంది. విజయవాడకి 50 కి.మీ. దూరంలో ఉంది. తాలూకా ఆఫీసు ఉన్న ఊరు. అంత పెద్దది కాదు అంత చిన్నదీ కాదు. ఆ ప్రాంతంలో వ్యవసాయమే ముఖ్యమైన వృత్తి. కాబట్టి ఆ బ్రాంచ్ ఇచ్చే అప్పుల్లో ఎక్కువ శాతం వ్యవసాయ రుణాలే. వ్యవసాయం కోసం బంగారు నగలు తాకట్టు పెట్టుకుని ఇచ్చే అప్పుల్ని కూడా వ్యవసాయ రుణాలుగానే లెక్క కడతారు.
ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఒక గోల్డ్ లోన్ కస్టమర్ వచ్చి తన లోన్ అకౌంట్ కింద బాకీ మొత్తం కట్టేసి తాను తాకట్టు పెట్టిన నగ - చంద్రహారం - తిరిగి ఇమ్మని అడిగాడు. ఆఫీసర్ భాస్కర్ మేనేజర్ గదిలోకి వచ్చి, ‘సార్, గోల్డ్ లోన్ ప్యాకెట్ తియ్యాలి. సేఫ్ తెరవాలండీ’ అంటూ డబ్బు కట్టిన క్రెడిట్ వోచర్ చూపించాడు. బ్యాంకుల్లో సేఫ్‌కి రెండు తాళం చేతులు ఉంటాయి. దీన్ని ‘డబుల్ లాక్ సిస్టం’ అంటారు. దీనికి ఫస్ట్ కీ, సెకండ్ కీ అని ఉంటాయి. కాబట్టి రెండూ పెట్టి తీస్తేనే కానీ సేఫ్ తెరవలేరు. చిన్న బ్రాంచీలలో ఫస్ట్ కీ బ్రాంచ్ మేనేజర్ కస్టడీలోనే ఉంటుంది. రెండోది ఒక ఆఫీసరు చేతిలో ఉంటుంది. అందుకే గోపాలరావుని సేఫ్ తెరవటానికి రమ్మన్నాడు.
సేఫ్ రూమ్‌లో సేఫ్ తెరిచి రిజిస్టర్‌లో వోచెర్ మీద ఉన్న గోల్డ్ లోన్ అకౌంట్ నెంబర్ ‘టేకెన్ అవుట్’లో ఎంట్రీ వేసి, గోల్డ్ లోన్ పాకెట్స్ ఉన్న ట్రేలో నుంచి ప్యాకెట్ తీశాడు భాస్కర్. సాధారణంగా ప్యాకెట్‌ని బయటికి తీసికెళ్లి పార్టీకి నగలు ఇస్తున్నప్పుడు తెరుస్తారు. కానీ ఆ రోజు అతని టైం బావుండి సేఫ్ రూమ్‌లోనే ప్యాకెట్ తెరచి అందులో ఉన్న వాటిని బయటికి తీశాడు మేనేజర్ ఎదురుగానే. షాక్! అందులో నగలేవీ లేవు. నాలుగు వాడేసిన స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయి.
బ్రాంచ్ మేనేజర్ గోపాలరావుకి చెమటలు పట్టాయి. పది నిమిషాల తర్జనభర్జన తరువాత, ‘ఆడిట్’ జరుగుతోంది. రెండ్రోజులు ఆగి రమ్మని చెబుదాం’ అని నిర్ణయించుకుని ఆ ఖాతాదారుకి నచ్చజెప్పి పంపించాడు. మేనేజర్ అదృష్టం కొద్దీ ఆ ఖాతాదారుకి ఆ నగల అవసరం వెంటనే లేకపోయింది. అదే, ఏ పెళ్లో ఉండి ఆ నగలు వెంటనే కావలసి ఉండుంటే గొడవ అయిపోయి ఉండేది.
సాధారణంగా బ్యాంకు వాళ్లు గోల్డ్ లోన్ కోసం చిన్నచిన్న గుడ్డ సంచీలు కుట్టించుకుంటారు. అప్పునకు తాకట్టు పెట్టుకున్న నగలని అటువంటి ఒక సంచీలో పెట్టి దాని మీద లోన్ నెంబర్ రాసి సీరియల్ ఆర్డర్‌లో ఒక ట్రేల పెట్టి సేఫ్‌లో పెడతారు. అసలు గోల్డ్ లోన్ సంచీ సంచీయే లేకపోయుంటే లోపల పెట్టటం మరిచి పోయామేమోననో వెతికేవాళ్లు. కానీ సంచీ ఉండి, అందలో నగలకు బదులు స్పార్క్ ప్లగ్స్ కనపడేటప్పటికి ఇది ఎవరో చేసిన పని అని తెలిసిపోతోంది. ఇది చూసి గోపాలరావుకి చెమటలు పట్టాయి. తానూ, ఆఫీసర్ భాస్కరూ ఇద్దరే సేఫ్‌ని హేండిల్ చేసేది. తమకి తెలియకుండా ఎలా జరిగింది? అర్థం కావట్లేదు.
ఆఫీసర్ భాస్కర్ పనిలో నేర్పుగల వ్యక్తి. మేనేజర్‌కి చేదోడువాదోడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందువల్ల సేఫ్ రూమ్‌లో ఇద్దరూ అనుకున్నట్టుగా ఈ విషయాన్ని ఆఫీసులో మరెవరికీ చెప్పలేదు. ఆఫీసులో వీరిద్దరూ కాకుండా ముగ్గురు క్లర్కులు, ఇద్దరు ప్యూన్లు పని చేస్తున్నారు.
సాయంత్రం అందరూ వెళ్లిపోయిన తరువాత గోపాలరావూ, భాస్కరూ కూర్చుని చర్చించుకుంటున్నారు. గోల్డ్ లోన్ లెడ్జర్ తీసి అప్పు ఇచ్చిన తేదీ చూశారు. 4 నెలల క్రింది తేదీ. ఈ నాలుగు నెలల్లో తమ ఇద్దరలో ఎవరూ సెలవు పెట్టలేదు. మళ్లీ లోన్ లెడ్జర్ తీసి తాకట్టు పెట్టిన నగల వివరాలు చూశారు. ఒక్కటే ఐటమ్. చంద్రహారం. లోన్ అప్లికేషన్ మీద ఆ నగని పరీక్షించి దాని బరువు ఫలానా అనీ, అది 22 క్యారట్ల బంగారంతో చేసినదనీ ధృవీకరించి పెట్టిన ‘గోల్డ్ అప్రైజర్’ సంతకం ఉంది.
ఎంతసేపు కూర్చుని చర్చించినా ఏమీ తేలలేదు. తమలో ఎవరన్నా సెలవులో వెళ్లామేమోనని మళ్లీ అటెండన్స్ రిజిస్టర్ తీసి చూశారు. అలా జరిగి ఉంటే ఆ చోటులో సీనియర్ క్లర్క్ చేతికి ఒక తాళం చెవి ఇస్తారు. ఈ నాలుగు నెలల్లో ఎవరూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఇక ఎంతసేపు కూచున్నా లాభం లేదని ఆ రోజుకి ఆఫీసు కట్టేసి ఇళ్లకెళ్లిపోయారు. ఇద్దరికీ ఆ రాత్రి నిద్రపట్టలేదు. సేఫ్‌లో ఉన్నది ఏది పోయినా దాని బాధ్యత ‘కీ హోల్డర్స్’గా తమ ఇద్దరిదీ - 50 - 50. ఎందుకంటే సేఫ్ తాళం చేతులు తమ ఇద్దరి దగ్గరే వున్నాయి.
40 ఏళ్ల క్రిందట బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడతామంటే వద్దంటే వద్దని యూనియన్లు గొడవ గొడవ చేశాయి. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని గోలగోల చేశారు. స్ట్రైక్‌లు చేశారు. ఇది ఎలా ఉండిందంటే, టైప్‌రైటర్ ప్రవేశం సమయంలో ‘కాలిగ్రాఫర్స్’ అంతా వెళ్లి బ్రిటన్ రాణికి అభ్యర్థన పెట్టారట. టైప్‌రైటర్లు వస్తే తమకి పని ఉండదని, వాటి ప్రవేశం ఆపమనీ. కంప్యూటర్లు రావడానికి ముందు టైపురైటర్లు లేని ప్రపంచం ఊహించుకుంటే మతిపోతుంది. సీలింగ్ ఫ్యాన్లు రాక మునుపు ఫంకా పుల్లర్స్ ఉండేవారు. వాళ్లు కూడా ఫ్యాన్లని ప్రవేశపెట్టవద్దు. మా బతుకుతెరువు పోతుంది అని, ఈ రోజు ఫ్యాన్లు లేకుండా ఊహించుకుంటే పిచ్చెక్కిపోతుంది. అలాగే ఈ రోజు టెక్నాలజీ లేకుండా మన జీవితాలు ఊహించుకుంటే అలాగే అనిపిస్తుంది. కాలం తీసుకొచ్చే మార్పుల్ని ఎవరూ ఆపలేరు. మహా అయితే కొన్నాళ్లపాటు అడ్డుకోగలరు. అంతే.
ఇప్పుడు గోపాలరావుని భాస్కర్‌ని రక్షించింది టెక్నాలజీయే.
రాత్రంతా నిద్ర పట్టక తెల్లవారుతుండగా గోపాలరావు కునుకు తీశాడు. ఆ సమయంలో అతనికి ఒక కల వచ్చింది. తనను ఇంటర్నల్ ఆడిట్‌కి బదిలీ చేశారని. ఆడిట్ అనేది చాలా ముఖ్యమైన డిపార్ట్‌మెంట్. ఈ మాట బ్యాంకులో అందరూ అధికార్లూ ఒప్పుకుంటారు. కానీ ఆఫీసర్లని పోస్ట్ చేసేప్పుడు మాత్రం సెకండ్ రేట్ ఆఫీసర్లని మాత్రమే ఆడిట్‌కి వేస్తారు. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్‌లో ఫెయిల్ అయిన వాళ్లనీ, పనిష్ చేద్దామనుకున్న వాళ్లనీ ఆడిట్‌కి వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ రేట్ ఆఫీసర్లు బ్రాంచ్ బ్యాంకింగ్‌కి కావాలి. ఇంకా క్రెడిట్, ఫారిన్ ఎక్స్చేంజీ లాంటి డిపార్ట్‌మెంట్లకు కవాలి. అందువల్ల ఆ కల గోపాలరావు పాలిట పీడ కల అయింది. మర్నాడు ఆఫీసులో కాస్త కస్టమర్ల హడావిడి తగ్గిన తరువాత భాస్కర్‌ని పిలిచి తన పీడకల గురించి చెప్పాడు.
‘అలా ఏమీ జరగదు లెండి సార్!’ అన్నాడు భాస్కర్ ఓదార్పుగా.
తిరిగి తన సీటుకి వచ్చి పనిలో పడిపోయాడు. సాయంత్రం మేనేజర్ మధ్యాహ్నం తనతో ఆయన కల గురించి అన్న మాటలు, అదే, తనని ఇంటర్నల్ ఆడిట్‌కి పోస్ట్ చేశారన్న మాట గుర్తుకి వచ్చి ఒక్కసారి ఏదో వెలిగినట్టయి భాస్కర్ మేనేజర్ గదికి గబగబా వెళ్లాడు. వెళ్లి తనకి వచ్చిన అనుమానం అతనితో చెప్పాడు. ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు.
సాయంత్రం స్ట్ఫా అంతా వెళ్లిపోయే వరకూ ఆగి, షట్టర్ కిందికి లాగేసి మేనేజర్ గదిలో కూర్చుని కొన్ని తారీఖులు నోట్ చేసుకున్నారు. ఆ తారీఖుల సిసిటీవీ ఫుటేజ్ తీసి ప్లే చేశారు. ఫుటేజ్‌లో కనపడ్డ దృశ్యాన్ని చూసి ఇద్దరూ ఒక్కసారి అవాక్కయ్యారు. ఇద్దరూ కాసేపు మాటామంతీ లేకుండా ఉండిపోయారు.
మొట్టమొదట ఆ సిసిటీవీ ఫుటేజ్ ఉన్న డ్రైవ్‌ని తీసి సేఫ్‌లో పెట్టారు. మళ్లీ బయటికి తీసి దాని చోటులో పెట్టి కావలసిన డేట్స్ ఫుటేజ్‌ని ఒక పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేసి ఒరిజినల్ డ్రైవ్‌ని సేఫ్‌లో పెట్టేశారు. తరువాత మేనేజర్ గోపాలరావు ఆ పెన్ డ్రైవ్ తీసుకుని బయల్దేరి విజయవాడ వెళ్లాడు. అక్కడే తన రీజినల్ మేనేజర్ ఉండేది. విషయం అంతా ఆయనతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ఫుటేజ్ చూశారు. పెన్ డ్రైవ్ రీజినల్ మేనేజర్ దగ్గర వదిలేసి గోపాలరావు బాలకనకపురం వెళ్లిపోయాడు.
మర్నాడు రీజినల్ మేనేజర్ తన రీజియన్‌లో ఇంటర్నల్ ఆడిటర్లుగా పని చేస్తున్న ఇద్దరిలో ఒకడైన దుర్గాప్రసాద్‌ని తన గదికి పిలిచాడు. క్రితం రోజే ఆయన ఏదో బ్రాంచ్ ఆడిట్ ముగించి వచ్చి కూచుని రిపోర్ట్ రాసుకుంటున్నాడు.
‘బాల కనకపురం బ్రాంచ్‌ని మీరు ఆడిట్ చేశారా?’ అని అడిగాడు ఆర్.ఎం.
‘అవును సార్. నేనే చేశాను’ దుర్గాప్రసాద్ చెప్పాడు.
‘ఎలా ఉంది బ్రాంచ్?’
‘పరవాలేదండీ. బాగానే ఉంది’
‘కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది?’
‘బాగానే ఉంది సార్’
‘ఏం బాగా ఉండడం? నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది చూడండి’ అని పెన్ డ్రైవ్ తన కంప్యూటర్‌లో పెట్టి ‘రన్’ చేశాడు. అందులో ఒక సిసిటీవీ ఫుటేజ్ రన్ అవుతోంది. దుర్గాప్రసాద్ దాని వంకే చూస్తున్నాడు. ఆర్.ఎం. అతని ముఖం వంకే చూస్తున్నాడు. ఫుటేజ్ ముందుకు నడుస్తున్న కొద్దీ దుర్గాప్రసాద్ మొహంలో రంగులు మారడం చాలా స్పష్టంగా కనపడుతోంది.
ఫుటేజ్‌లో కనపడ్డది ఏమిటంటే - గోల్డ్ లోన్ బాగ్స్ ఉన్న ట్రే తెచ్చి భాస్కర్ ఆడిటర్ టేబుల్ మీద పెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆడిటర్ దుర్గాప్రసాద్ గోల్డ్ లోన్ బ్యాగ్స్ కొన్నిటిని ‘రాన్‌డమ్’ చెక్ చేస్తున్నాడు. గంట గడిచింది. అప్పటికి 90 శాతం బ్యాగ్స్ చెక్ చేయటం అయిపోయింది. అప్పుడు ప్యూన్ వచ్చి భాస్కర్‌తో ఏదో చెప్పగా భాస్కర్ గదిలో నించి బయటికి వెళ్లాడు. భాస్కర్ వెళ్లగానే దుర్గాప్రసాద్ తాను చెక్ చేసేసిన బ్యాగ్స్‌లో నుంచి ఒక బ్యాగ్ తీసి అందులో ఉన్న చంద్రహారాన్ని తన మెడలో వేసుకుని తన హ్యాండ్ బాగ్‌లో నుంచి స్పార్క్ ప్లగ్స్‌ని ఆ బ్యాగ్‌లో పెట్టి ట్రేలో పెట్టేసి, ఏమీ ఎరగనట్టు మిగిలిన లోన్ అకౌంట్స్ తాలూకు నగలని చెక్ చేస్తూ కూర్చున్నాడు. భాస్కర్ తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఒక పావుగంట అయిన తరువాత ట్రే భాస్కర్‌కి హేండోవర్ చేశాడు.
ఫుటేజ్ చూసిన తరువాత దుర్గాప్రసాద్ మొహంలో నెత్తురుచుక్క లేదు.
అరగంటలో చంద్రహారంతోపాటు తన రాజీనామా కూడా తెచ్చి ఇచ్చి రీజినల్ మేనేజర్ కాళ్లు పట్టుకున్నాడు.
చంద్రహారం గోల్డ్‌లోన్ కస్టమర్‌కి అందింది. గోపాలరావు, భాస్కర్ ఊపిరి పీల్చుకున్నారు.
===============================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-రెండుచింతల మురళీకృష్ణ.. 9866071588