రంగు కల్తీలు
Published Saturday, 26 October 2019హానికర ధ్రవ్యాలు కలపకుండా సురక్షితంగా వండిన వంటకాన్ని ‘ఆహారం’ అని నిర్వచనం ఇస్తే, మనం వండే తీరులో మార్పులకు అవకాశం ఏర్పడుతుంది.
పసుపు, కారం, బియ్యప్పిండి, జొన్నపిండి, శనగపిండి, గోధుమపిండి ఇలాంటి వాటిని దగ్గరుండి మరపట్టించుకోవటం ఉత్తమం. పసుపు కొమ్ములు కొనుక్కెళ్లి మరాడిస్తే నిఖార్సయిన పసుపు మనకు దొరుకుతుంది. ఈ చిన్న పనికి బద్ధకించి బజారు పసుపు మీద ఆధారపడితే రోగాల బారిన పడినట్టే! ముఖ్యంగా పసుపు, కారం వీటిలో రంగు రసాయనాలు ఎక్కువగా కల్తీ కలిసే ప్రమాదం ఉంది. రంగులు కేన్సర్ లాంటి వ్యాధులకు కారణాలు.
ఆకుపచ్చ రంగు కారప్పూస, నీలం రంగు బూంది, ఇంకా రంగురంగుల స్వీట్లూ హాట్లను రంగు చూసి వ్యామోహపడితే, మన మీద ‘రంగు పడుద్ది’ అంటారే అలాంటిది జరుగుతుంది. విషాలను తెచ్చుకుని, వాటిని మరింత విషపూరితంగా వండుకు తినే పద్ధతిని మనం మానగలగాలి.
శరీర తత్వానికి సరిపడే వాటిని తిన్నప్పుడు అవి సమస్థితిని కలిగిస్తాయి. వేడి శరీర తత్వం ఉన్నవారు వేడి చేసేవి ఎక్కువగా తింటే శరీరంలో అనేక వేడి లక్షణాలు పుట్టి ఇబ్బంది కలిగిస్తాయి. బాధను కలిగించేది ఏదైనా అది విషంతో సమానమే! మనం ఎంతో కమ్మగా వండుకుని ఇష్టంగా తింటున్న వంటకాల్లో ‘ఇది మనుషులు తినేందుకు కాదు’ అని లేబుల్ అంటించ తీరాల్సినవి కూడా ఉంటున్నాయి. వాటిని గమనించకపోతే, కేన్సర్, సొరియాసిస్, బొల్లి, ఎలర్జీ వ్యాధులు అకారణంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. వాటి మీద మనకు అవగాహన ఉండాలి.
అతిగా వండితే కేన్సర్
నిప్పుల మీద మాడ్చిన వంటకాలు, సలసలా కాగే నూనెలో వేగిన కూరలు, అధిక ఉష్ణోగ్రత దగ్గర వండిన వంటకాలు రొమ్ము కేన్సర్, ఇతర అవయవాలలో వచ్చే కేన్సర్లకు కారణం అవుతాయని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి.
మన ఆహార పదార్థాల్లో వండవలసిన అవసరం లేనివీ, కొద్దిగా వండితే సరిపోయేవి, ఎక్కువగా వండవలసినవీ, ఇలా అనేకం ఉన్నాయి. టమోటా, సొర, బూడిద గుమ్మడి, కొత్తిమీద, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి ఇలాంటి వాటిని పొయ్యి మీద పెట్టి వండకుండానే వివిధ వంటకాలు చేసుకోవచ్చు. లేదా కొద్దిపాటి ఉష్ణోగ్రత దగ్గర ఉమ్మగిల చేసి కావలసిన వంటకం తయారుచేసుకోవచ్చు. కానీ, కోమలమైన ఈ కూరగాయల్ని అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం, ముఖ్యంగా బియ్యం లేదా మాంసంతోపాటూ కుక్కర్లో పెట్టి వండటం వలన అపకారం ఎక్కువగా జరుగుతుంది.
కూరగాయలకు కొంత వేడిని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. అంతకు మించి వేడినందిస్తే ఆ ఆహార ద్రవ్యం మాడి విషపూరితవౌతుంది. చిన్న నేతి గినె్నని ‘గాడిపొయ్యి’ మీద పెట్టి కాస్తే, ఆ నెయ్యి మాడిపోయి, విషపూరితమైన వాంతి, వికారాలతోపాటు కేన్సర్ లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. కూరగాయలైనా అంతే!
నరక లోకంలో పాపుల్ని వేయించినట్టు సలసలా కాగిన నూనెలో వేయించి వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులు, దొండకాయ బొగ్గుల్ని ఉప్పు, కారం చల్లుకుని కూరంటే ఇదే అన్నట్టుగా తినటం కేన్సర్ కారణాలలో ఒకటని గమనించాలి. హానికారక ఆహారాల పట్ల వ్యామోహం పెరిగి, ఆరోగ్య స్పృహ తగ్గిపోతే కేన్సర్ దగ్గరౌతుందన్న మాట!
అవసరమైన దానికన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర నూనెలో వేగిన వడియాలు, అప్పడాలు, ఆలు చిప్స్, ఇతర వేపుళ్లు రొమ్ము కేన్సర్‌కు, పాంక్రియాజ్ కేన్సర్‌కు కూడా కారణం అవుతాయంటున్నారు శాస్తవ్రేత్తలు.
ఇవి కమ్మని విషాలు. విష కన్యల వంటివి. వాటి ఆకర్షణలో మనం చిక్కుకు పోకూడదు. మాంసానిక్కూడా అధిక ఉష్ణోగ్రత విషతుల్యమే అవుతుంది. ఎక్కువ వేడి మీద ఎక్కువసేపు వండితే అమృతం కూడా విషంగా మారిపోతుంది. వంటకాలు మాడినకొద్దీ అందులో ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుట్టి అది కేన్సర్ లాంటి వ్యాధులకు దారి తీస్తుందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
వేడి ఎక్కువగా తగిలినప్పుడు ఆహార ద్రవ్యంలోని పిండి పదార్థాల్లో అమైనో యాసిడ్లు, కొవ్వు పదార్థాలతో కార్బన్ పరమాణువులు సంఘర్షణ పొందుతాయి. దానివలన ఎక్రిలమైడ్ విష రసాయనం ఏర్పడుతుంది. కొవ్వు ఎక్కువగా కలిసిన మాంసం, నూనెలో బాగా వేగిన కూరలు, బజ్జీలు, పునుగులు వగైరా వంటకాలలో ఈ ఎక్రిలమైడ్ ఎక్కువగా పుడుతుంది. ఇవి జీవకణాలలోని డిఎన్‌ఏలో మార్పులకు కారణం అవుతాయి. ఈ మార్పులు కేన్సర్ కణాల పుట్టుకు దారితీస్తాయి. సినిమాకు వెళ్లినప్పుడు మనం సరదాగా తినే 100 గ్రాముల ఆలూ చిప్స్ చాలట కేన్సర్ రావటానికి. అధిక ఉష్ణోగ్రత దగ్గర అవి నూనెలో వేగటమే ఈ అనర్థానికి కారణం.