S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కీర్తికాంక్ష

బిజినెస్ మాగ్నెట్ హర్షవర్థన్ తన ఆఫీసులో అసహనంగా అటు ఇటూ తిరుగుతున్నాడు. పిఏ వచ్చింది కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకాలు తీసుకుంది. అన్యమనస్కంగానే సంతకాలు పెట్టాడు. ఆమె హర్షవర్థన్ వైపు చూస్తూ ఎనీ ప్రాబ్లం సర్.. వినయంగా అడిగింది. ‘నో యు కెన్ గో’ చిరాగ్గా అన్నాడు. వెంటనే ఆమె ఆ చాంబర్ నుండి బయటికి వచ్చేసింది.
నలభై అయిదేళ్ళ హర్షవర్థన్ పేరున్న బిజినెస్‌మాన్. చూడటానికి అతను ఆరడుగుల ఎత్తుతో ఆరోగ్యంగా.. ఆకర్షణీయంగా ఉంటాడు. నిరంతరం బిజినెస్ అభివృద్ధికై ఆలోచిస్తాడు. తండ్రి స్థాపించిన బిజినెస్‌ని అతను అనేక రాష్ట్రాల్లో విస్తరించాడు. అందమైన అనుకూలవతియైన భార్య, ఇద్దరు పిల్లలు, ఏ లోటు లేకుండా ఆనందంగా గడిచిపోతున్న జీవితం. కాని ఓ నాలుగు రోజుల నుండి ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటున్నాడు. భార్య ఇందిర అతని డల్‌నెస్‌కి కారణమేంటని ఎన్నిసార్లు అడిగినా.. ఏం లేదని దాటవేస్తూ వచ్చాడు.
అతని చింతకి కారణం.. క్రిందటి ఆదివారం ప్రముఖ సాహితి సంస్థవారు ఓ సభకి హర్షవర్థన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హర్షవర్థన్ చేతులమీదుగా ఓ కవికి సన్మానం ఏర్పాటుచేశారు. ఏదో సభలే.. నాలుగు మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. తీరా చూస్తే ఆ కవి ఎవరో కాదు.. అతని చిన్ననాటి ఫ్రెండే.. ముఖ్య అతిథిగా పాల్గొన్న తనని నామమాత్రంగా పొగిడి, కవియైన తన ఫ్రెండ్‌ని మాత్రం సభలో ఉన్నవారంతా ఆకాశానికి ఎత్తేశారు. అతని రచనలు గొప్పవని, అతని డైలాగ్స్ అమూల్యమని, అతని పాటలు అద్భుతమని.. అతను సాక్షాత్తు సరస్వతి పుత్రుడని.. ఇలా కవిని అందులోనూ ఫ్రెండ్‌ని పొగుడుతుంటే హర్షవర్థన్‌కి అసూయ మొదలైంది. చిన్నవాళ్లు కవిగారి కాళ్ళకు దండాలు పెట్టేస్తున్నారు, కొందరు ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. చివరగా సభలో కవిగారి ప్రసంగం...
అనర్గళంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో మధ్యలో చురుక్కులు చమక్కులతో మాట్లాడిన తీరు ఆద్యంతం రసవత్తరంగా సాగిపోయింది. ఎక్కడా డాంబిక ప్రదర్శన చేయలేదు. అతను చెప్పాలనుకున్నది చాలా సూటిగా స్పష్టంగా చెప్పాడు. జనం గుండెల్లో గుచ్చుకుందది. అందుకే అందరూ కేరింతలు కొట్టారు. చప్పట్లతో సభ మారుమ్రోగిపోయింది. హర్షవర్థన్ మొఖం మాడిపోయింది.
ఇంటికి వచ్చిన దగ్గరనుండి అతనిలో ఇవే ఆలోచనలు. ఏముందీ ఆ కవిలో.. మామూలు దుస్తులలో.. సభవారు పంపిన కారులో వచ్చాడు. అతని తండ్రి స్వార్జితమైన పాత పెంకుటింట్లో ఉంటాడు, గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తునన్నాడు. తను కోటీశ్వరుడు.. తన స్వార్జితంతో కట్టుకున్న పెద్ద ఇల్లు.. రెండు కార్లు.. ఖరీదైన బట్టల్లో సిన్మా స్టార్‌లో ఉంటాను. అయినా జనం తన కన్నా కవికి ఎక్కువ విలువ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నాడు.
ఆఫ్టరాల్ అతనో చిరుద్యోగి.. అసమర్థుడు.. అనామకుడు హర్షవర్థన్ దృష్టిలో.. కాని జనం అతనికిస్తున్న గౌరవం చూస్తుంటే జెలసి పుట్టుకొచ్చింది. బిజినెస్‌మాన్‌గా తన ఆఫీసులో తన కింద పనిచేస్తున్నవాళ్ళు.. పార్ట్‌నర్స్.. స్నేహితులు.. వీళ్ళకి మాత్రమే తెలుసు.
కవికి ఆ సంస్థవారు ‘కళాభిరామ’ బిరుదు ఇచ్చారు అది పుచ్చుకున్న కవి ఎంత పొంగిపోయాడో.. అది తన చూపుని దాటిపోలేదు.. అదే అదే హర్షవర్థన్‌ని బాధపెడుతోంది. ఎందుకిలా జరిగింది.. ఏంటీ కారణం.. బాగా ఆలోచించిన తరువాత హర్షవర్థన్‌కి బోధపడింది. అది కవిగారి రచనా పటిమ. నిజమే.. చాలాబాగా రాస్తాడు. నాకు ఆ టాలెంట్ లేదా.. అలా నేను రాయలేనా.. తనని తాను ప్రశ్నించుకున్నాడు. చిన్నప్పుడు ఎన్నిసార్లు వ్యాసరచన పోటీల్లో పాల్గొనలేదూ.. ఎప్పుడూ బహుమతులు వచ్చేవి. అప్పటినుండి అలా ప్రాక్టీసు చేసి ఉంటే.. ఈ కవికన్నా మించి రాసేవాడ్నేమో. కానీ కాలం కలిసిరాలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టేజిమీద ఎన్నిసార్లు బిజినెస్ మీటింగులకై మాట్లాడలేదు. అందరూ బాగా మాట్లాడావని మెచ్చుకున్నారు. ఆ మాటల్ని.. కాగితంమీద పెడితే.. ఎస్.. తప్పులేదు. సాహిత్య రచన నేనూ చేయగలను.. ఈ హర్షవర్థన్ ఏంటో జనాలకు చూపిస్తాను. తనకు తానే మోటివేట్ చేసుకున్నాడు.
నాలుగు రోజులుగా మధనపడ్డాక.. ఆఖరుకి సాహిత్య రచనకు శ్రీకారం చుట్టాలని అనుకున్నాడు. అప్పుడే అతని దృష్టి ఇంట్లో భార్య తెప్పించుకునే పత్రికమీద పడింది. ప్రపంచ తెలుగు మహాసభలు అమెరికాలో జరుగుగతున్నాయంట. మంచి కథకి పట్ట్భాషేకం.. ప్రకటన చూడగానే సన్నగా ఈలవేశాడు.. ఇది నాకోసమే.. ఆ గొప్ప కథను నేను రాస్తాను.. డిసైడ్ అయిపోయాడు.
భార్యకి తన ఆలోచన చెప్పాడు. ఆమె కొంతసేపు ఆలోచించింది.. ఓకె మీ ఇష్టం.. బెస్ట్ ఆఫ్‌లక్ చెప్పింది. ఆమెకు తెలుసు, హర్షవర్థన్ ఎంత మొండివాడో.. ఏది వద్దంటే.. అదే చేస్తాడు. అతని ఇగోని హర్ట్ చేయడం ఇష్టంలేదామెకు.
హర్షవర్థన్ అంతా ప్లాన్ చేసుకున్నాడు. తన ఆలోచనలను అక్షర రూపంలో పెట్టాలి.. ఏకాంతం కావాలి. ఇంట్లో.. ఆఫీసులో కుదురదు. అందుకే ఆ నగరంలోని బీచ్ ఒడ్డున వున్న ఫైవ్‌స్టార్ హోటల్లో నాలుగు రోజులకు రూం బుక్ చేసుకున్నాడు. రూం నుండి బీచ్ వ్యూ బాగా కనిపిస్తుంది. అక్కడ అంతా జన సంచారం లేదు. ప్రకృతిని చూస్తే ఆలోచన్లు వస్తాయి.. అందరూ అనుకునే మాట అమలుపరిచాడు.
నాలుగు రోజులు తన అపాయింట్‌మెంట్స్‌ని కాన్సిల్ చేసుకున్నాడు. హోటల్ రూం బాల్కనీలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఆలోచించసాగాడు.. ఏం రాద్దామా అని. సామాన్యుల జీవిత సంఘర్షణలు.. బడుగు జీవి వెతలే కథలకు ముఖ్యం.. అని అతనికి అనిపించింది. రైతుల కష్టాలు పేపర్లో చదువుతున్నారందరూ... అందులో కొత్తగా రాసేదేముందీ.. రైతు కథలు వద్దు.. అనుకున్నాడు.
అతని చూపు సముద్రపు ఒడ్డున వున్నజాలర్లమీద పడింది. వాళ్ళకోసం రాద్దామని నిర్ణయించుకున్నాడు. రెండు రోజులు వాళ్ళని అబ్జర్వు చేశాడు. సముద్రంలోకి చేపలవేటకై ఎప్పుడు వెళుతున్నారు.. ఎప్పుడు చేపలు పట్టుకొని వస్తున్నారు.. అంతా గమనించాడు. జాలర్లకోసం నెట్‌లో బాగా సెర్చ్ చేశాడు. వాళ్ళ జీవన విధానం.. వాళ్ళ వేషభాషలు.. వాళ్ళ పూరి గుడిసెలు.. వాళ్ళ మాట తీరుతెన్నులు.. వగైరా అంతా ఆకళింపు చేసుకున్నాడు. ఒక్కవాళ్ళ దగ్గరనుండి వచ్చే చేపల కంపుని తప్ప మూడో రోజు తన ప్రతిభతో ఓ జాలరి కుటుంబ కథకు ప్రాణం పోశాడు. కథకి అలల బ్రతుకులు అని పేరు పెట్టాడు. చాలా హృద్యంగా సాగిందీ కథ. నాలుగో రోజు కథని ఫెయిర్ చేసి ఓ పత్రికకు ఎడిటర్ అయిన తన ఫ్రెండుని పిలిచి చూపించాడు. ఆ ఎడిటర్ ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు. నీలో ఈ ప్రతిభ కూడా ఉందా.. మెచ్చుకోలుగా చూశాడు. కథలోని కరుణకి అతను కరిగిపోయాడు. కథ ఆసాంతం చదివి ‘అద్భుతం’ అని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్ హర్షా.. చేయి తిరిగిన రచయితలా ఎంత కాన్ఫిడెన్స్‌గా రాసావ్.. నీదే మొదటి బహుమతి.. ఢంకా వాయించి మరీ చెప్పాడు. హర్షవర్థన్ గర్వంగా తల ఎగరేశాడు.
నెల రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించారు. నిజంగా ఆ కథకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కథల సెలెక్షన్‌లో ఎడిటర్ కూడా మెంబరే. అమెరికాలో జరిగే సభలో హాజరై ఆ కథకు పురస్కారం అందుకోవాలి. కథకి వచ్చే బహుమతి హర్షవర్థన్ దృష్టిలో ఏం పెద్ద కాదు. కేవలం కథ ద్వారా వచ్చే కీర్తి మాత్రమే కావాలి. అన్ని పేపర్లు పత్రికల్లో తన ఫొటో రావాలి. టీవీ చానల్స్‌లో వెలిగిపోవాలి. జనం గుర్తించాలి. ఇదే అతనికి కావాలి. అమెరికాకి భార్యా పిల్లలతో వెళ్లిరావడానికి ఫ్లైట్ టిక్స్ బుక్ చేయించాడు. ఆ సభలో అతన్ని అందరూ పొగుడుతుంటే మరిన్ని రచనలు చేయాలని ప్రోత్సహించారు. చేయి తిరిగిన కథకుడు రాసినట్లుగా సాగింది.. జాలర్ల కష్టాలు కళ్ళకు కట్టినట్లు.. ఆ జాలరి కుటుంబంలో మనిషివలె.. చాలా నేచురల్‌గా రాశారు. యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్.. నిజంగా మీకు సరస్వతీ అనుగ్రహం ఉంది. ఇలా ఒకరి తరువాత ఒకరు పొగిడారు. చాలా హేపీగా ఫీలయ్యాడు. ఎడిటర్‌గారు కూడా ఈ కథ రాయడానికి హర్ష జాలర్ల లైఫ్‌ని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేశాడు. అందుకే ఈ గ్రేట్ స్టోరీ రాయగలిగాడు అన్నాడు హర్షవర్థన్ భుజం తడుతూ. ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు హర్షవర్థన్.
ఇండియా వచ్చాక ఈ సందర్భంగా ఫ్రెండ్స్‌కి పార్టీ.. అదే బీచ్ హోటల్‌లో అరేంజ్ చేశాడు. పెద్దవాళ్ళంతా పార్టీకి హాజరయ్యారు. టీవీ చానల్స్ వాళ్లు వచ్చారు. కడుపునిండా ఆరగించారు. ఇక్కడ కూడా అందరూ అతన్ని పొగుడుతున్నారు. పార్టీ పూర్తి అయింది. అందర్నీ సెండాఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చాడు.
అంతలో ఇద్దరు జాలర్లు ఆరబెట్టిన వలల్ని మూటలా కట్టి.. భుజంమీద వేసుకొని మోసుకుంటూ వెళుతున్నారు.. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు.
ఒరే.. ఆ కారు సూడరా.. ఒరే.. ఆ కారు సూడరా.. సొరసేపనాగా ఎంత నిగనిగలాడుతుందో.. సిల్వర్ కలర్ బియండబ్ల్యూ కారు చూస్తూ అన్నారు. ఆ కారు హర్షవర్థన్‌ది. నియాన్ లైట్ల వెలుగులో మెరుస్తుందది. వాళ్ళు ఆ కారు దగ్గర ఆగారు. ఇద్దరిలో ఒక జాలరి కారుమీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు.
అది చూసి అల్లంత దూరాన వున్న హర్షవర్థన్ గట్టిగా అరుస్తూ అక్కడికి వచ్చాడు.
‘‘యూ డర్టీ రాస్కెల్స్.. మీ బ్లడీ చేతులతో కారును టచ్ చేస్తారా.. హౌ డేర్ యూ.. నేస్టీఫెలోస్.. వాళ్ళని అసహ్యంగా చూస్తూ వాళ్ళమీద విరుచుకుపడ్డాడు.
జాలర్లు బిత్తరపోయారు. వాళ్ళల్లో పెద్దాయన తప్పయిపోనాది బావూ.. అని వొంగి క్షమించమని అర్థించాడు.
హర్షవర్థన్ మాటలకి అక్కడున్న అతిథులు అదిరిపడ్డారు, ఇన్‌క్లూడింగ్ ఎడిటర్‌తో సహా.
===========================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-రావాడ శ్యామల 94943 29652