S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆచరణ తోడుంటే.. అద్భుతాలు మన వెంటే..

ఈనాడు సమాజానికి కావలసింది సాధన కాదు. కొలదిపాటి సాధనతో కూడిన బహుళార్థ సాధక కార్యాచరణ. మన దేశంలో ఇప్పుడు జరగవలసింది మతపరమైన పని అంతా ప్రజోపయోగ కార్యక్రమాలలో వినియోగింపబడాలి. అప్పుడు దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం ఏ రీతిగా ముందుకు పరుగెడుతుందో మీరే ఊహించుకోవచ్చు. దేశంలో అనేక చోట్ల నేడు భజనలు, పూజలు, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిర్మాణాత్మకమైన పని కదా. ఇదే పని భక్తియార్ ఖిల్జీ సమయంలో జరిగింది. ఆయన ఢిల్లీలో కొద్దిమంది సైనికులతో బయలుదేరి కలకత్తా వరకు నిరాటంకంగా జైత్రయాత్ర చేశాడు. దారిలో ఆయనను అడ్డుకొన్న వారే లేకపోయారు. వారికి సంబంధం లేదని మిన్నకున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారు అనేది మాకవసరం. మాకు వ్యక్తిగతంగా చెడు జరగనంత వరకు అన్న భావనలో ప్రజలు ఉన్నారు. దీనివలన దేశం ఈనాడు ఈ దుస్థితిని ఎదుర్కొనుచున్నది. ఈ మత సంబంధిత పనులు, పూజలు సమాజ నిర్మాణానికి తోడ్పడవు.
ప్రతి ప్రణాళికకు ఒక వ్యతిరేక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఆయుధానికి ఒక వ్యతిరేక ఆయుధం ఉంటుంది. ఇదే స్థితి వివేకానందుని స్మారక నిర్మాణ వేళ రనడేకు ఎదురైంది. సిమెంట్ కాంక్రీటుతో స్మారకాన్ని నిర్మించుట తన లక్ష్యం కాదని, స్వామి వివేకానందుని వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలచి జీవనీ శక్తితో తొణికిసలాడెడి స్ఫూర్తిదాయకమైన స్మారకాన్ని నిర్మించుటే తన లక్ష్యమని ప్రకటించాడు. ఇదే భావి భారతాన్ని ఆవిష్కరించుటకు స్ఫూర్తి నివ్వగలదని భావించారు.
స్వామి వివేకానందుడు భారతీయులకు అందించిన మంత్రము - ‘మానవ సేవయే మాధవ సేవ’ - భగవంతుణ్ణి కోరికలు కోరమని స్వామీజీ చెప్పలేదు. గుహలలో కూర్చొని తపస్సు చేయమని చెప్పలేదు. సమాజంలో నిలబడి సమాజం మధ్యన జీవించు’ అన్నారు. సన్యాసులు కానీ, నిజమైన సమాజ సేవకులతో కూడిన సన్యాసుల సంస్థను నిర్మించుటకై కృషి చేశారు. స్వామీజీ ఆత్మవిశ్వాసం కలిగిన నూతన సమాజాన్ని నిర్మించ యత్నించాడు.
అత్యంత శక్తితో కూడిన మంత్ర మరియు వాక్ శక్తులకు వారసులైన భారతీయులే నేడు వారి నిజ జీవితాలలో అత్యంత పిరికివారుగా, భయశాలురుగా రూపుదాల్చారు. ఓవైపు మరణం లేదని చెప్పెడి మంత్రాలను వల్లిస్తూ, మరోవైపు భయంతో నిండిన జీవితాన్ని జీవిస్తుండుట అత్యంత శోచనీయం మరియు హృదయ విదారకం. భారతదేశం తిరిగి తన పూర్వపు ఔన్నత్యాన్ని పొందవలయునన్నచో ప్రజలు పైన చెప్పిన భయాన్ని వీడి, కార్యోన్ముఖులు కావాలి.
వ్యక్తులుగా భారతీయులు గొప్పవారే కానీ ఏ ఇద్దరు ఒక ఉమ్మడి లక్ష్య సాధనకై కలిసి పని చేయజాలని దుస్థితి భారతీయులది. భారతదేశాన్ని జయించిన మహమ్మదీయులు లేక క్రైస్తవులు, మంగోలియన్లు లేక ఐరోపా వాసులు విజయం సాధించుటకు కారణం వారిలోగల ఐక్యత, కలసి పనిచేసెడి గుణము. ఇదే మన శత్రువుల నుండి మనం నేర్చుకొనవలసిన సత్యము.
మన వేదాలలోని మంత్రాలు నిరంతరం మనలో సామూహిక శక్తి యొక్క విలువలను పెంచి పోషించుటకు తోడ్పాటు నందించాయి. దీనిని ‘యజ్ఞ’ మాధ్యమంగా చేపట్టుటకు తోడ్పాటు నందించాయి. ఇదే మనలను పూర్వము ప్రపంచంలో ఒక గొప్ప జాతిగా శక్తిగా నిలిపింది. కానీ కాలక్రమేణా మనము ఈ శక్తిని జారవిడచుకున్నాం. దీనితో మనము మన సర్వస్వాన్ని కోల్పోయాం. చివరకు మన స్వాతంత్య్రాన్ని కూడా కోల్పోయాం. ఇప్పుడు మనము సామూహిక శక్తిగా ఆవిర్భవించి, తిరిగి మన జాతి పూర్వపు ఔన్నత్యాన్ని పొందేలా కృషి చేయాలి. విశ్వ గురుస్థానాన్ని అలంకరింపచేయాలి.
దేవుని పూజించుట అనగా ప్రపంచానికి సమాజానికి దూరమగుట కాదు. ఆచరణపూజ్యానికి ఆయన వ్యతిరేకి. అంతా మాయ అనెడి దానిలో మునిగిపోవుట తెలివిలేనితనం మరియు బాధ్యతా రాహిత్యం. స్వామీజీ ఇట్టి వారితో యుద్ధం ప్రకటించారు. నీ చుట్టూ ఉన్న వారిలో భగవంతుని చూడలేని వాడివి ఎచ్చటనూ చూడలేవు అన్నారు. దీనికై తన జీవితమంతా పోరాడారు. ఉపనిషత్ సారాంశమిదియే. పనియే పూజించదగింది. మానవ సేవయే మాధవ సేవ.
సాంబారు తయారుచేయుటకు పప్పు - ఉప్పు వాడతారు. సాధన ఉప్పుతో సమానం అట్లే పని పప్పుతో సమానం. వీని రెండింటి మధ్య నిష్పత్తి చక్కగా ఉన్నప్పుడే ఆ వంటకము లేక ఆ వ్యక్తిత్వము పరిపూర్ణంగా ఉంటాయి. వివిధ ఆధ్యాత్మిక శక్తులతోపాటు మనము కూడా ఎదగాలి. అంతేకానీ ఒక వర్గంగా మారరాదు. వివేకానందుడు ప్రజలను సాధకులుగా కాక కార్మోన్ముఖులుగా తయారుచేయుటకు కన్యాకుమారిలో ధ్యానం చేశాడు.
మన దేశంలో జరుగుతున్న మత సంబంధిత ప్రజా కార్యక్రమాలు దేశ పునర్నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికై ఉపయుక్తమైనచో ఉత్పన్నమయ్యెడి ఫలితాలు నిజంగా ఊహ కందవు. ఆ ఫలితాలు ఒక అద్భుతమైన శక్తిగా ఉద్భవిస్తుంది. దేశంలోని ప్రజలనేకులు, మత సంబంధిత కార్యక్రమాలలో తలమునకలై ఉన్నారు, భజనలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. సత్సంగాలు నిర్వహిస్తున్నారు. కీర్తనలు పాడుతున్నారు, ఇదంతా దేశ, సమాజ నిర్మాణానికి తోడ్పడవు. ఇవన్నీ కదలిక లేని ప్రాణశక్తి లోపించిన చర్యలతో సమానం. భక్తియార్ ఖిల్జీ కాలంలో కూడా మన దేశం ఎన్నో మత సంబంధ పనులలో నిండిపోయి ఉంది. కానీ ఏమి జరిగింది? ఆయన కొద్దిమంది గుర్రపు రౌతులతో ఢిల్లీలో బయలుదేరి తిన్నగా కలకత్తా చేరాడు. అక్కడి రాజ్యాన్ని ఆక్రమించాడు. మార్గమధ్యంలో ఆయనను ఎవ్వరూ ఎదిరించలేదు. ప్రజలంతా తమకు సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఎవ్వరు వస్తున్నారు? వారు ఎందుకు వచ్చారు? ఏమి తీసికెళ్తున్నారు? వారి రాక వలన నష్టం కల్గిందా? లాభం కల్గిందా? ఇంతటి పట్టరాని స్థితిలో జనులు ఉండుట వలననే ఈ దేశానికి ఈ దుస్థితి సంభవించింది. ఇటువంటి మత సంబంధిత కార్యకలాపాలు దైవ సంబంధిత ఆలోచనలు ఎట్టి నిర్మాణాత్మకమైన పనులకు దారి తీయవు. ఇట్టి పనులు అటు దేశానికి, ఇటు సమాజానికి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. స్వామీజీ అనేక పర్యాయాలు ప్రజలను మేల్కొల్పుటకు ప్రయత్నించాడు. ఇట్టి అచేతన నుండి, చేతనత్వంలోనికి వారిని నడిపించుటకు కృషి సల్పాడు.
స్వామీజీని దేవుడు అవతారంగా చూడరాదు. మనము ఎదుర్కొనెడి సమస్యల పరిష్కారానికై అవతారాలు మనకు తోడ్పడవు. ఒక సామాన్య మానవునికి మార్గదర్శనం ఇవ్వగలగాలి. ఒక అవతార పురుషుడు ఇట్టి మార్గదర్శనాన్ని అందింపజాలడు. దీనిని మరో సామాన్య మానవుడు మాత్రమే ఇవ్వగలడు.
స్వామీజీ కేవలం ఆయన తపశ్శక్తితో ఇంతటి గొప్పవాడు కాగలిగాడు. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన తన జీవితంలో అనేకానేక కష్టాలు అనుభవించాడు. దారిద్య్రంలో మగ్గిపోయాడు. అన్నం లభించక పస్తులున్నారు. కటిక నేలపై నిద్రించాడు. డిగ్రీ సాధించిన తదుపరి ఉద్యోగ వేటలో ఎన్నో బాధల ననుభవించాడు. అట్లే ఆధ్యాత్మిక జీవన యానంలో కూడా అనేక కష్టాల నెదుర్కొన్నాడు. రామకృష్ణ పరమహంసను తొలుత నమ్మలేదు. దేవుడున్నాడని కూడా నమ్మలేదు. ఇట్టివాడే సామాన్య మానవులకు మార్గదర్శనం అందివ్వగలడు. రాముడు, కృష్ణుడు వీరిని మనము అవతారాలుగా చూస్తున్నాము. వారిని ఆదర్శంగా తీసికొని అనుసరించుటకు బదులుగా, వారిని మానవ స్థాయికి పైనున్న వ్యక్తులుగా చూపి, వారిని అనుసరించి మన జీవితాలను చక్కదిద్దుకొనుటకు బదులుగా వారిని పూజించుటతో సరిపుచ్చుకుంటున్నాం. ఇదే మన జాతికి పట్టిన దుర్గతి. మనం అనుసరించవలసిన వారిని దేవునిగా చూపించి మానవ బాధ్యతల నుండి తప్పుకొనుచున్నాం. ఆయన భగవంతుడు కావున ఆ పనులు చేయగలిగాడు. కావున ఆ పనులు మనం చెయ్యనక్కరలేదు అనెడి భావనలను జీర్ణించుకొన్నాం. మానవులు గొప్ప పనులు చేయజాలరని మన నమ్మకం. దీని ఫలితంగా మన మహా పురుషులందరిని భగవంతుని అవతారాలుగా మార్చివేశాం. వారిని ఆ దృష్టితోనే చూడసాగాం. మన దేశంలో మానవ గరిమను గుర్తించి తగిన రీతిలో గౌరవించుట అలవరచుకొనలేదు. ఎవరైనా మానవాతీతమైన పనులు నిర్వహిస్తే వారిలోని నైపుణ్యత, పట్టుదల, సంకల్పం, కృషి, మున్నగునవి దీనికి కారణమని మనం అంగీకరించుటకు సిద్ధంగాలేము. ఈ లోపాన్ని మనం అధిగమించాలి.
వివేకానందుడు మనలానే ఒక సామాన్య మానవుడుగా జన్మించాడు. మనలోవలె బలహీనతలు ఆయనలో కూడా ఉన్నాయి. అన్నింటిని అధిగమిస్తూ వచ్చాడు. కాలగమనంలో ఆయనకు శ్రీరామకృష్ణ పరమహంస గారితో పరిచయమైంది. ఆయన ద్వారా మనలోని మానసిక శక్తులను పెంపొందించుకొనుటకు కావలసిన జ్ఞానాన్ని, శక్తిసంపదలను, సాధనలను అందిపుచ్చుకున్నాడు. ఆయన ఒక అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. దైవీ గుణాలను పెంపొందించుకున్నాడు. ఆయన ఈ శక్తులను 39 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అందుకో గలిగాడు, అదే శంకరాచార్యుడు 32 సం.ల వయస్సు వచ్చేసరికి అందుకోగలిగాడు. స్వామి వివేకానందుడు అనేకసార్లు చెప్పారు - ‘మీకు దేవునిపై నమ్మకమున్నచో మీపై మీకు విశ్వాసము ఉండాలి. మీరు ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు చేయగలరరు. ప్రతి మనిషిలోనూ ఆత్మ దైవాంశం కల్గినదే. దీనిని మన ప్రజల మనస్సులలో భావనలలో నింపాలి. ఇదే ఇప్పుడు కావలసింది. మనలో అంతర్గతంగా నిబిడీకృతమై దాగియున్న శక్తిని మనం వెలికి తెచ్చి ఉపయోగించాలి. ఆయా రంగాలలోనున్న గొప్ప వారితో ఈ విషయాలను చర్చించాలి. చరిత్ర మనకందించిన వానిని, గొప్పవారి జీవితాలు మన కందించిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ అత్యంత ఉచ్ఛస్థితికి ఎదగవచ్చని వేదాలు, ఉపనిషత్‌లు తెలుపుతున్నాయి.
తనపై తనకు నమ్మకమున్న వాడు దేనినైనా సాధించగలడు. ఇట్టి ఆత్మవిశ్వాసాన్ని తన దేశ పౌరులలో నింపేందుకు వివేకానందుడు అవిరళ కృషి చేశారు. మనలోని ప్రతి ఒక్కరిలో ఎంతో శక్తి దాగి వుంది. దానిని సక్రమంగా వినియోగింపజాలకున్నాం. దానిని వెలికి తీయుట కూడా చేతకాని వారు అనేకులు ఉన్నారు. వారిలో నిక్షిప్తమై యున్న అంతర్గత శక్తిని ఉపయోగింపజాలకున్నారు. అట్లు చేసినవాడు వారు ఆకాశాన్ని, నక్షత్రాలను తాకగలరు. వీరికి అడ్డుగా ఏది నిలువజాలదు. ఇట్టి ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పబలం ప్రజలలో ఉన్న తమోగుణాన్ని, సోమరితనాన్ని తొలగించి వారిలో చేతనత్వాన్ని నింపాలి. మతతత్వం చాటున పాతుకుపోయిన ప్రజలలోని జడత్వాన్ని, అదృష్టం, నుదుటి రాత మున్నగు వానిపైనున్న భ్రమలనన్నింటిని తొలగించాలి. వివిధ ఆధ్యాత్మిక సంస్థల జెండాల క్రింద ఉన్నవారి నందరినీ మేల్కొల్పి, జాతి ఉమ్మడి లక్ష్యాన్ని వారికి తెలియజెప్పాలి. అందరినీ ఒకే వేదికపైకి తేవాలి. ఒక భారత జాతిగా వీరంతా ఐకమత్యముగా ఏకం కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, జాతి నంతటిని ఒకే త్రాటిపై నడిపించవలసిన అవసరం నేడు ఎంతగానో ఉంది’ అన్నారు వివేకానందుడు.
మన లక్ష్యాన్ని మనమే నిర్ణయించుకుంటాం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ‘నీవు ఈ రోజు ఉన్న స్థితిగతులకు గత జన్మలలో నీవు చేసిన పనులే కారణం.’ నీ భాగ్యానికి నీవే నిర్మాతవు. అయాచితంగా, అప్రయత్నంగా లేక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినచో అది ప్రమాదవశాత్తు కాక మరొకటి కాదు. అది ఒక సంఘటన మాత్రమే అని గుర్తించండి. ప్రతి సంఘటనకు కార్యము, కారణము ఉంటాయి.
మనము పశ్చిమ దేశాలను విమర్శిస్తుంటాం. వారిది భౌతిక వాదము, మనము ఆధ్యాత్మికత తెలుసుకున్నవారం. మనం చనిపోయిన తరువాత ఏమవుతాం? మన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పటికీ పశ్చిమ దేశాలలో అనేక మంది చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. చర్చి ఫాదర్లుగా సన్యాసి సన్యాసినులుగా మారుచున్నారు. వారివారి కుటుంబాలు వారిని ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నారు. వారి కుటుంబంలోని ఒక వ్యక్తిని చర్చి సేవకై, భగవంతుని సేవకై నియోగించామని ఆనందిస్తూ, విందులు, వినోదాలు పంచుకుంటారు. ఇందు వలననే మన దేశంలో వేల సంఖ్యలో మిషనరీలు ఏర్పడ్డాయి. కానీ మనలో ఈ తెగువ, ఈ సేవాభావం ఏమైనాయి? మాటలకు పరిమితమై పోయాం, చేతలకు దూరమైనాం. బాల్యం నుండి మనం ఆచరణకు దూరంగా ఉంటున్నాం! కర్తవ్య పాలనకు దూరం, బాధ్యతలకు దూరం.
ఎదుటి వారి సహాయం లేనిదే మనం అడుగు ముందుకు వేయజాలకున్నాం. మన ఋషులు, మునులు వాక్రుచ్చిన దానికి వ్యతిరిక్తంగా మనం నడుచుకొనుచున్నాం! దీని నుండి మన జాతి బయటపడాలి. ఋషుల వెంట, మునుల వెంట, గారడీ వాళ్ల వెంట పడుతూ వారి ఆశీర్వాదాలకై వెంపర్లాడుతున్నాం. అడ్డదారులలో ప్రయాణిస్తూ అతి తక్కువ కాలంలో, శ్రమ లేకుండా వరాలను పొందాలనెడి కోరికలతో కొట్టుమిట్టాడుచున్నాం. దీనితో ఒక బలహీనమైన జాతిగా, వ్యక్తులుగా మరియు అసంఘటితంగా కూడా రూపుదాల్చాం. ఒక బలమైన అవతార పురుషుడు, ముని, ఋషి లాంటి వాడు వచ్చి మనల ఉద్ధరించాలి అనెడి వాంఛలకు, ఆలోచనలకు బందీలమైనాం. ‘అహం బ్రహ్మస్మి’ అనెడి ఉపనిషద్ వాక్యాన్ని మనకు అన్వయించుకొని తదనుగుణంగా మన జీవన విదానాన్ని రూపొందించజాలకున్నాం. ప్రతి ఆత్మ వస్తుతః దైవాంశతో కూడి ఉన్నది. ఆత్మకు చావు లేదు. అమృతాన్ని సేవించిన వారము అంటూ ఉంటాం! కానీ నిజ జీవితంలో మనం ఇలాంటి భావనలతో జీవించుట లేదు. స్వామి వివేకానందున మాటల్లో - ‘మీకు నిజంగా ఈ దేశంలోనున్న 33 కోట్ల దేవీ దేవతలందు విశ్వాసమున్నచో మొదట మీపై మీకు విశ్వాసముండాలి. తొలుత ‘నరుడు నారాయణునిగా ఎదుగుతాడు’ అనెడిది మన జాతి ప్రగాఢ విశ్వాసం. దీనిని మన ఋషులు, మునులు వారి నిజ జీవితంలో పరీక్షించుకొని నిగ్గు తేల్చిన జీవిత సత్యాలు. దీని సాధనకై ప్రతి వ్యక్తి తీవ్ర సాధన చేయాలి. అప్పుడు ఈ విశ్వంలో మనం దేనినైనా సాధించగలం. ఆనాడు ఈ దేశం విశ్వ గురుత్వాన్ని పొందగలదు.
-ఆంగ్ల మూలం: ఏకనాథ్ రనడే "Story of Vivekananda Rock Memorial"

తెనుగు సంకలనం: ఎ. వేణుగోపాలరెడ్డి