S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డార్క్ అవెన్యూ-1( కొత్త సీరియల్ ప్రారంభం)

కొత్త సీరియల్ ప్రారంభం

లాజిక్‌కు అందకుండా సైన్సుకు చిక్కకుండా బ్లాక్ మేజిక్‌కు దగ్గరగా దుప్పటి ముసుగేసిన చీకటిలో దాగి వున్న మిస్టరీ హిస్టరీ.. డార్క్ అవెన్యూలోకి అన్యులకు ప్రవేశం నిషిద్ధం..
* * *
ప్రారంభానికి ముందు
ఎడతెరిపి లేకుండా వర్షం. వాతావరణ శాఖ హెచ్చరికల జారీ.. నగరం జలమయం.. కుండపోతలో నగరం తడిసిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వర్షం చీకటి అస్తవ్యస్తమైన జన జీవితం.. వర్షం భయంతో జనం వీధుల్లోకి రావడం మానేశారు. టీవీల్లో వాతావరణ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోవడం వల్ల రేడియోలను ఆశ్రయించారు. స్మార్ట్ ఫోన్స్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు.
* * *
ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని ఆ కాలనీలో ఓ మూలకు విసిరి వేయబడ్డట్టు వున్న ఇల్లు. ఇటీవలే ఆ కాలనీలో ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇంకా చాలా ఇళ్లు నిర్మాణ దశలోనే వున్నాయి. కొన్ని మొండి గోడలతో వున్నాయి. దూరం నుంచి చూస్తే ఆ కాలనీ హారర్ సినిమాలో సెట్‌లా కనిపిస్తోంది.
చాలా తక్కువ సంఖ్యలో వున్న ఇళ్లలో మరీ మూలగా వున్న ఇల్లు అది.
ఆ కాలనీలో కరెంట్ పోయింది. కాలనీని చీకటి చుట్టేసింది.. ఒకానొక భయంకరమైన వాతావరణం.
* * *
‘కరెంట్ పోయింది..’ సంతోషంగా చెప్పింది క్యాండిల్ వెలిగిస్తూ సుమారు యాభై ఏళ్ల వయసున్న ఆ మహిళ. ఆమె మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కరెంట్ పోవడం ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె మొహంలో సంతోషమే చెప్పకనే చెబుతోంది. ఆ మహిళ పేరు చంద్రకళ. ఆమె మొహం పాలిపోయి ఉంది. ఏదో భయానికి గురవుతున్నట్టు ఉంది.
‘అవును.. కరెంట్ ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నాను’ అంటూ ముప్పయేళ్లున్న మరో మహిళ అంది. ఆమె పుస్తకాల ర్యాక్ దగ్గరికి వెళ్లింది. అక్కడ వున్నా పాత దినపత్రికలని చేతిలోకి తీసుకుంది. ఆ న్యూస్ పేపర్‌ను ఆ ఇంటి కిటికీలకు అతికేస్తుంది..
ఆ మహిళ పేరు చంద్రప్రభ.. చాలా జాగ్రత్తగా కిటికీల మధ్య ఏ మాత్రం సందులు లేకుండా దినపత్రికలను అతికేస్తుంది. పాతికేళ్ల వయసున్న ఇంకో అమ్మాయి టేబుల్ మీద వున్నా సెల్‌ఫోన్ తీసింది. చుట్టూ చూసింది. తనను ఎవరూ గమనించడం లేదనే విషయం నిర్ధారించుకుంది. అయినా ఆమెలో చిన్న అనుమానం.. సెల్‌ఫోన్‌తో బయటకు నడిచింది. బయట వర్షం పడుతూనే ఉంది. బయట దృశ్యాలను షూట్ చేస్తోంది.. అప్పుడప్పుడు తనను ఎవరైనా గమనిస్తున్నారాని పరిశీలిస్తోంది.
ఆ అమ్మాయి పేరు చంద్రలేఖ...
ఆ చీకటిలో తమ ఇంట్లోకి ప్రవేశించే శక్తులను గమనిస్తోంది.
ముప్పయ్యేళ్ల వయసున్న మహిళ చంద్రప్రభ తన చేతిలో వున్న దినపత్రికలను చేతిలోకి తీసుకుని.. వాటిని కిటికీలకు అతికిస్తుంది.. మధ్యమధ్య అతికించిన పత్రికల్లో నుంచి సందులు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. చంద్రప్రభ, చేతిలో వున్న ఆ పేపర్స్‌లో కొన్నింటిలో ఒక వార్త కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది..
కొద్దికాలం క్రిందటి దినపత్రిక అది.
‘అంతుచిక్కని డార్క్ అవెన్యూ రహస్యం...’ అన్న హెడ్డింగ్ పెద్ద అక్షరాల్లో.
హెడ్డింగ్ కింద వార్త.. డార్క్ అవెన్యూ ఫొటో...
ఆ ఫొటో ఆ ఇంటిదే...
ఆ ఇంట్లో వున్న ముగ్గురి ఫొటోలు
ఆ ఫొటోల్లో వున్నది
చంద్రకళ, చంద్రప్రభ, చంద్రలేఖ.
తల్లీకూతుళ్లు వాళ్లు...
* * *
జంగానియా
నగరానికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న ఒక ఆటవిక ప్రాంతం.. అడవి మధ్యలో వున్న ఒక కుగ్రామం. ఆటవిక ప్రాంతం వరకే బస్సు సౌకర్యం ఉంది. అది దాటాక నడుచుకుంటూ వెళ్తారు ఆ అడవిలో వున్న జంగానియా జాతి ప్రజలు.
అక్కడ చిన్నచిన్న ఇళ్లు ఆ ఊళ్లలోని ప్రజలకు చాలామందికి కరెన్సీ నోట్లు ఎలా వుంటాయో తెలియదు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు దళారులు వాల్లకు చిల్లర నాణెలు ఇస్తారు.
పుట్టతేనె, కాయగూరలు పండిస్తారు. అక్కడ అరుదుగా రంగురాళ్లు దొరుకుతాయన్న ప్రచారం ఉంది. వాటిని దళారులు వస్తు మారకంతో కొనుక్కుంటారన్న ప్రచారం కూడా ఉంది.
ఈ ఊళ్లకు భిన్నంగా వుండే ప్రాంతం జంగానియా.. హీత్రోచీ భాషలో జంగానియా అంటే ఆత్మలు ప్రేతాత్మలు తిరిగేచోటు అని అర్థం. చిన్నచిన్న ఊళ్లలో వుండే ఆటవికులు సైతం జంగానియా వైపు కనె్నత్తి చూడరు.. దూరంగా విసిరి పారేసినట్టు ఉంటుంది. ఆ ఊళ్లో ఉండేవి పాడుబడిన ఇల్లు.. మొండి గోడలు.. సమాధులు.. జంగానియాను చూడ్డానికి వచ్చిన వాళ్లలో చాలామంది ప్రమాదవశాత్తు చనిపోయారనే వార్త ప్రచారంలో వుంది. కానీ జంగానియాలో అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడ తిరిగే ప్రేతాత్మలు చంపేశాయని చాలామంది అంటారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా చేతబడులు మీద బ్లాక్‌మేజిక్ మీద నమ్మకం వున్న వాళ్లు ప్రతీ ఆదివారం అర్ధరాత్రి జంగానియాకు వస్తారు.. ప్రాణాల మీద ఆశ వదులుకుని.
అక్కడ వున్న మగవాళ్లే.. చిన్న పిల్లాడు కూడా చేతబడి చేస్తాడని చుట్టుపక్కల వాళ్లు చెప్పుకుంటారు. జంగానియాలో వున్న అతి పెద్ద వయసున్న వాళ్లలో తీశ్మార్ ఒకడు. అతని వయసు తొంభై తొమ్మిదేళ్లు. అయినా అతని గొంతులో ఒక విధమైన తీవ్రత.
అమెరికా లాంటి అణ్వాయుధ దేశంలోనూ చేతబడులున్నాయన్న నమ్మకం వున్నా రోజుల్లో ప్రజలు చేతబడులు మూఢంగా నమ్మడంలో వింతేముంది?
తీశ్మార్ వయసు తొంభై తొమ్మిది.. ఇంకా ఎక్కువే అంటారు కొందరు. పొడవాటి గడ్డం.. ఎప్పుడూ ఎర్రగా వుండే కళ్లు.. ఆ ప్రాంతంలో దొరికే ఆకుపసర్లతో తయారయ్యే ఒక ద్రవ పదార్థమే అతని ఆహారం అంటారు.
అతను ఉదయమంతా కనిపించడు.. సూర్యాస్తమయం తర్వాత చీకట్లు కమ్ముకున్నాక మాత్రమే బయటకు వస్తాడని చెప్పుకుంటారు. జంగానియాలో మంత్రగాళ్లు వెలుతురును చూస్తే శక్తులను కోల్పోతారని ఒక నమ్మకం.
అర్ధరాత్రి.. స్మశానంలో ఒక కాలుతున్న చితికి సమీపంలో కూచొని కాలుతోన్న శవం వైపు చూస్తూ...
తీశ్మార్..
ఆ...పేయ్...
* * *
ఉలిక్కిపడి కళ్లు తెరిచింది భార్గవి.. కళ్లు మూసుకుని ఇయర్ ఫోన్స్‌లో జంగానియా గురించిన సమాచారాన్ని వింటున్న భార్గవికి సడెన్‌గా తనకు ఈ సమాచారాన్ని పంపిన పావని గొంతు కాకుండా మగ గొంతు.. అది ఒక వృద్ధుడి గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది.
అంతా చీకటి.. రాత్రి పనె్నండు కావస్తోంది.. ఆమె భయాన్ని రీసౌండ్‌లా వినిపిస్తూ పురాతన కాలం నాటి గోడ గడియారం పనె్నండు గంటలు కొట్టింది. ఒక్కో గంట కొడుతుంటే ఒళ్లు జలదరిస్తోంది. రికార్డు సడన్‌గా ఆగిపోయింది. మొహమంతా చెమట.. ఇన్వర్టర్ వున్నా ఫ్యాన్ పని చేయడంలేదు. ఎవరో కిటికీ దగ్గరి నుంచి పరుగెత్తినట్టు అనిపించింది. ఒక్క గెంతులో కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ తలుపు తెరిచి చూసింది.
ఎవరూ లేరు...
జంగానియాకు సంబంధించిన సమాచారాన్ని పావని ఆడియో టేప్ ద్వారా భార్గవికి పంపించింది. భార్గవి ఆ ఆడియో టేప్ వింటుంది.. సడన్‌గా పావని గొంతు బదులు ఒక వృద్ధుడి గొంతు వినిపించింది.. పావని కొన్ని చోట్ల కథలా వివరించి ఆడియోలో పంపించింది.
స్వతహాగా భార్గవి ధైర్యస్థురాలు..
అయినా ఆ క్షణం భయపడింది. ఆత్మల గురించి క్షుద్రశక్తుల గురించి ఎప్పటి నుంచో ఒక డాక్యుమెంటరీ తీయాలని కోరిక భార్గవికి. పావని జంగానియాకు సంబంధించిన సమాచారం ఇచ్చింది. అలాగే జంగానియాకు సంబంధించిన ఆడియో పంపించింది.
అది వింటూ ఉండగానే మధ్యలో ఒక గొంతు. అదీ తొంభై యేళ్లకు పైబడిన గొంతు వినిపించింది.
ఒకవేళ ఇది తన భ్రమ కాదు కదా అనుకుంది.
వెంటనే ఆడియో మొదటి నుంచి వినడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇందాకా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే మళ్లీ ‘ఆపేయ్’ అన్న గొంతు వినిపించింది.
ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. గాలికి కర్టెన్స్ అటూ ఇటూ ఊగుతున్నాయి. ఒక్కసారిగా ఆ కర్టెన్స్ వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించి ఒళ్లు జలదరించింది.
భయానికి లాజిక్కు అక్కర్లేదు.
భార్గవి అటుఇటు పచార్లు చేస్తూ కిచెన్‌లోకి వెళ్లింది. కాఫీ తాగితే తప్ప మైండ్ రేష్ ఇవ్వదేమో అనిపించింది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి షాకైంది.. కిచెన్‌లో స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి.. కాఫీ పొడి డబ్బా పక్కనే ఉంది.
తను కిచెన్‌లోకే రాలేదు. పాలు వేడి చేయలేదు. పాల ప్యాకెట్ ఫ్రిజ్‌లో వుంది.
స్టవ్ ఆన్ చేయలేదు.. అయినా స్టవ్ మీద పాలు మరగడం ఏమిటి?
కిచెన్‌లో నుంచి బయటకు వచ్చింది. కిచెన్‌లోకి వెళ్లాలంటే భయమేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. దాహం వేస్తోంది. వాటర్ జగ్ తీసుకుంది. అందులో వాటర్ లెవన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే ఫ్రిజ్ దగ్గరికి వెళ్లమోయి షాకయింది. వాటర్ జగ్ బరువుగా ఉంది. అందులో నీళ్లు నిండుగా వున్నాయి.
చిన్న కేకతో జగ్ జారవిడిచింది. భళ్లున శబ్దం చేస్తూ జగ్ పగిలిపోయింది. నేలవైపు చూసింది. వాటర్ జగ్ బద్దలైంది. నీళ్లు నేల మీద పడలేదు.
అంటే వాటర్ జగ్‌లో నీళ్లు లేవా? తాను భ్రమ పడిందా? భయంతో అనుమానంతో కిచెన్‌లోకి వెళ్లింది. మరోసారి షాకైంది. కిచెన్‌లో పాలు స్టవ్ మీద లేవు.. కాఫీ పొడి డబ్బా లేదు.. స్టవ్ ఆన్‌లోనే లేదు. స్టవ్ వెలగడం లేదు.
మొహమంతా చెమటలు...
ఒక్క పరుగున హాలులోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద వాటర్ జగ్ వుంది. నేల మీద క్లీన్‌గా వుంది. వాటర్ జగ్ కిందపడి బద్దలైన దాఖలాలు లేవు.
అప్పుడే భార్గవి మొబైల్ రింగ్ అయ్యింది.
ఒక్క ఉదుటున మొబైల్ దగ్గరికి వెళ్లింది. డిస్‌ప్లే మీద పావని పేరు చూసి లిఫ్ట్ చేసి ‘పావని ఎక్కడున్నావ్? అసలు ఏం జరిగిందంటే..?’ భార్గవి మాటలు పూర్తి కాకుండానే ‘నేను ఆంటీని.. పావని అమ్మను.. పావనికి యాక్సిడెంట్ అయ్యింది. నిన్ను వెంటనే కలవాలంది. మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండొద్దని చెప్పమని చెప్పింది.. నీ దగ్గర వున్న ఆడియో వెంటనే కాల్చేయమని చెప్పింది.. స్టార్ హాస్పిటల్‌కు వెంటనే బయల్దేరమ్మా.. పావని చెప్పిన విషయాలు గుర్తుంచుకో..’ అటువైపు నుంచి పావని తల్లి గొంతు కంగారుగా వుంది.
* * *
భార్గవి టీపాయ్ మీద వున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆడియో టేప్ దగ్గరికి

వెళ్లేసరికి ఒక్కసారిగా ఆ టేప్ తగలబడిపోతోంది.
ఒక ఉదుటున బయటకు వచ్చి తాళం వేసి కారు బయటకు తీసింది. కారు రోడ్డు మీదికి వచ్చింది.
* * *
కారు డ్రైవ్ చేస్తున్నా ఇంకా భయం.. వణుకు తగ్గలేదు. తాను చూసినదంతా నిజమేనా? ఒక విధమైన భ్రమలో ఉన్నదా? ఎప్పుడూ అదే పనిగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుందా? ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా రోడ్డుకు ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూసింది.. తొంభై ఏళ్లు దాటిన వృద్ధుడు పొడవాటి తెల్లగడ్డం.. కోపంగా తనవంకే చూస్తూ రోడ్డుకు అడ్డంగా...
అతను అతను అతను
తీశ్మార్...
ఆడియోలో పావని వర్ణించినట్టు సరాసరి జంగానియా నుంచి ఇక్కడికి వచ్చినట్టు..
సడన్ బ్రేక్‌తో కారు ఆపింది.. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.. రోడ్డు మీద ఎవరూ లేరు. అంతా తన భ్రమేనా?
కారు హాస్పిటల్ ముందాగింది.
హాస్పిటల్‌లోకి అడుగుపెడుతుంటే భార్గవి కాళ్లు వణుకుతున్నాయి. స్వతహాగా ధైర్యస్తురాలే కానీ జరుగుతున్న.. జరిగిన సంఘటనలు ఆమెను భయంలోకి నెట్టేశాయి. రిసెప్షన్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ పావని తల్లిగారు కనిపించారు.
‘ఆంటీ పావనికి ఇప్పుడెలా ఉంది?’ కంగారు అడిగింది భార్గవి. ‘ఇప్పుడిప్పుడే కొద్దిగా స్పృహలోకి వచ్చింది. రాగానే నీకెలా ఉందని నువ్వొచ్చావా?’ అని అడిగింది. రూమ్‌లోకి షిఫ్ట్ చేశాం’ చెప్పింది పావని వున్నా రూమ్ వైపు తీసుకువెళ్తూ.
* * *
చాలా నీరసంగా ఉంది పావని. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పావనిని అలా చూడలేక పోయింది.
‘అసలు ఏమైందే?’ కంగారుగా అడిగింది భార్గవి.
పావని తల్లి వైపు చూసింది. ‘మీరు మాట్లాడుతూ ఉండండి.. ఫ్లాస్క్‌లో మీ కోసం కాఫీ తీసుకువస్తాను’ అంటూ తల్లి ఫ్లాస్క్ తీసుకుని బయటకు నడిచింది.
‘నీకు ఆడియో టేప్ పంపించి నేను తిరిగి కారులో వస్తున్నాను.. అప్పుడు ఏమైందంటే..’ కళ్లు మూసుకుంది.
పావని.. ఇంకా ఆ సంఘటన కళ్ల ముందు కనిపిస్తూ భయపెడుతూనే ఉంది.
కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటన ఆమెకు గుర్తొచ్చింది. కళ్ల ముందు కనిపించింది.
* * *
పావని కారు డ్రైవ్ చేస్తోంది. పాటలు వింటూ డ్రైవ్ చేయడం ఆమెకు నచ్చదు. అందుకే కారులో వున్న ఆడియో ప్లేయర్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, పాటలు వింటూ డ్రైవ్ చేయడం, పక్కవారితో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం లాంటి విషయాలకు ఆమె పూర్తిగా వ్యతిరేకం. యాక్సిడెంట్స్ వీటివల్ల జరుగుతాయని డ్రైవ్ చేసేప్పుడు మన దృష్టి డ్రైవింగ్ మీద మాత్రమే ఉండాలని చెబుతుంటుంది.
పావని దృష్టి రోడ్డు మీదే వుంది. సరిగ్గా అప్పుడే కారులో వున్న ప్లేయర్‌లో నుంచి ఒక పాత పాట ప్లే అవుతోంది. అదీ పాత తెలుగు పాట ‘నిను వీడని నీడను నేను..’ అన్న పాత పాట...
ఒక్క క్షణం షాకయింది. తన కారులో పాట వినిపించడమే.. అదీ తను ప్లే బటన్ నొక్కకుండానే.. అయినా పాట ఎక్కడిది.. పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ అయి లేదు...
బటన్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యింది. బటన్ ఆఫ్ చేసింది. ఒక్క క్షణం గందరగోళంగా అనిపించింది. ఉదయం నుంచి పని అలసట.. ముందు ఇంటికెళ్లి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగితే కానీ ఈ కన్‌ఫ్యూజన్ పోదు’ అనుకుంది. కారు కొద్ది దూరం వెళ్లగానే ఆడియో వినిపించసాగింది సిస్టం నుంచి.
‘మా గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెబుతున్నావ్.. ఆ ఆడియో టేప్‌ను తగలబెట్టేయమని చెప్పు..’ అన్న స్వరం వినిపించింది. ఆ స్వరంలో ఆజ్ఞ వుంది.. హెచ్చరిక వుంది.. సడన్ బ్రేక్‌తో కారాగింది.. తాను బ్రేక్ వేయకుండానే.. ముందుకు తూలి సీట్ బెల్ట్ ఉండటం వల్ల సేవ్ అయ్యింది. తన కాలు బ్రేక్ మీద లేదు. అయినా కారు ఆగింది.. ఎదురుగా చూసింది. ఒక వృద్ధుడు దాదాపు వందేళ్ల వయసులా కనిపిస్తున్నాడు. తీక్షణంగా తన వైపే చూస్తూ రోడ్డు దాటాడు...
భయంతో వణికిపోయింది. ఒక్క క్షణం తలను వెనక్కి వాల్చింది.. తల విదిల్చి కారును ముందుకు పోనిచ్చింది.
భయంతో బ్రేక్ మీద కాలేసింది. సడెన్ బ్రేక్‌తో కారు ఆగింది.. ఎదురుగా కుడివైపు నుంచి వస్తోన్న టెంపోను గుద్దేసి ముందుకు వెళ్లి చెట్టుకు తగిలి ఆగిపోయింది.
* * *
‘నేను కళ్లు తెరిచి చూసేసరికి హాస్పిటల్‌లో వున్నాను. నాకు నీ గురించే భయం వేసింది. ఎందుకైనా మంచిది ఆ టేప్‌ను తగలబెట్టేసేయ్’ చెప్పింది పావని. ఇంకా ఆమె భయం తాలూకు హ్యాంగోవర్‌లోనే ఉంది.
భార్గవి జరిగినదంతా వివరంగా చెప్పింది. ‘దీనిని బట్టి చూస్తుంటే అతీత శక్తులు దెయ్యాలు ఆత్మలు నిజంగానే వున్నాయని అనిపిస్తుంది’ అంది భార్గవి.
‘నాకూ అలానే అనిపిస్తోంది. అయినా అవన్నీ మనకెందుకు? నాకు ఎందుకో మొదటిసారి భయం వేస్తోంది. ప్రాక్టికల్ అనుభవం కదా?’ అంది. ఆమెలో ఇంకా భయం తగ్గలేదు. ఇంకా తననెవరో వెన్నాడుతున్నారనే భయంతోనే వుంది.
‘అయినా నాకెందుకో ఇంకా జరిగినది నమ్మాలని అనిపించడం లేదు’ అంది భార్గవి.
‘ఇంత జరిగినా నీకు అనిపించడం లేదా?’ అడిగింది పావని.
‘ఏమో ఇద్దరికీ ఒకేలాంటి అనుభవాలు... అయినా సరే మనం ఒకసారి జంగానియా వెళ్లొస్తే...’ పావని వైపు చూసి అంది భార్గవి.
ఆ మాటతో ఉలిక్కిపడింది ‘ఏం మాట్లాడుతున్నావ్ భార్గవి? ఇంత జరిగాక కూడా నువ్వు..?’
‘ఇంత జరిగింది కాబట్టే వెళదామని అనుకుంటున్నా’ అంది భార్గవి.
అప్పుడే వచ్చింది పావని తల్లి. వీళ్ల మాటలు విన్నది.. వెంటనే తను అంది.
‘పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇంకా ఇలాంటి పనులు దెయ్యాల గురించి ఆత్మల గురించి పరిశోధనలు చేస్తే అది మరింత ప్రమాదకరం.’
‘సరే ఆంటీ ముందు పావనిని రెస్ట్ తీసుకోని’ ఇక ఆ టాపిక్ పావని తల్లి ముందుకు తీసుకురావడం ఇష్టం లేక... అంది. ఎందుకంటే ఒక తల్లిగా ఆమె భయంలో అర్థం వుంది.
‘ఆంటీ మీరు ఇంటికి వెళ్లండి. బాగా అలసిపోయారు. నేను క్యాబ్ బుక్ చేస్తాను. పావని దగ్గర నేను ఉంటాను. రేపు ఉదయమే డిశ్చార్చి చేస్తానన్నారు. చేయగానే నేను పావనిని ఇంటి దగ్గర దిగబెడుతాను’ చెప్పింది భార్గవి.
తను కూతురి దగ్గర ఉండి చేసేది లేదు. పైగా భార్గవి కూడా ఉంటానని అన్నది. అందుకే వెంటనే సరేనంది.
భార్గవి క్యాబ్ బుక్ చేసింది. అయిదే నిమిషాల్లో క్యాబ్ వచ్చింది. క్యాబ్ వెళ్లేవరకూ ఉండి భార్గవి పావని దగ్గరికి వచ్చింది. అర్ధరాత్రి కావడం మూలాన హాస్పిటల్‌లో పెద్దగా రద్దీ లేదు. రిసెప్షనిస్ట్ ఓ కునుకు తీద్దామనుకున్నది. అలాగే టేబుల్ మీద ఒరిగిపోయింది తల పెట్టి. ‘చెప్పు పావని ఏం చేద్దాం?’ భార్గవి అడిగింది పావనిని.

(ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి