S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దుఃఖ నివారిణి శ్రీదుర్గామాత

‘అనిర్వేద శ్రీయో మూల మనిర్వేదః పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్దేషు ప్రవర్తకః కరోతి సఫలం కర్మ యత్తత్కరోతిసః తస్మాద నిర్వేద కృతం యత్న చేష్టే అహముత్తమం’ - శ్రీమద్రామాయణం
ఇది శ్రీమద్రామాయణం ద్వారా, వాల్మీకి మహర్షి భావి తరముల వారికి అందించిన మహోదాత్త సందేశం. నిర్వేదమంటే విచారము, దుఃఖము లేకుండుట. శ్రీయో మూలమంటే - శ్రేయస్సునకు మూల కారణం. దుఃఖము లేకుండా ఉండటమే ఐశ్వర్యమునకు మూల కారణం. అదే పరమ సుఖం. దుఃఖము లేకుండా ఉంటే సకల కార్యములు, సకల వాంఛలు నెరవేరుతాయి. కనుక దుఃఖాన్ని దరిచేరనీయకుండా ప్రతి వారూ ప్రయత్నించాలి. దుఃఖము, విచార భారంతో, మానవుడు కృంగిపోతాడు. దుఃఖ భారాన్ని తొలగించుకొని ద్విగుణీకృతోత్సాహంతో, ధైర్య సాహసములతో, మానవుడు ముందడుగు వేయాలన్న గొప్ప సందేశాన్ని మనకందించారు, వాల్మీకి మహర్షి. అటువంటి దుఃఖాన్ని పోగొట్టే దుఃఖ నివారిణి, దుఃఖ హంత్రిణి, దుర్గామాత.
దుర్గామాతను ప్రతిరోజూ మనం అర్చిస్తున్నా, శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు పూజిస్తే దుఃఖాన్ని, భయాన్ని, భ్రమని తొలగించి, ఆత్మస్థైర్యాన్ని, మనోనిశ్చలతను ప్రసాదిస్తుంది - దుర్గాదేవి.
అందుకే, మనకు సుఖ సంతోషాలనిచ్చే పండుగలను జరుపుకోవటం. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారములకు స్ఫూర్తినిచ్చేవి పండుగలు. ప్రతి కుటుంబంలోను ఉండే, కష్టాలను దుఃఖాన్ని, విచారాన్ని మరపించి, నూతన తేజోత్సాహాన్ని పంచి ఇచ్చేవి - పండుగలు. ఆధ్యాత్మిక ధార్మిక చింతనను కలుగజేసి, ఆనందంతో పరస్పరం కలుసుకొనేటట్లు చేసేవి పండుగలు. పండుగలలో ఒక పరమార్థం ఉంటుంది, అందుకే వాటిని సంప్రదాయాలుగా ఏర్పాటు చేశారు మన మహర్షులు.
అటువంటి పండుగలలో ముఖ్యమైన పండుగలు, శ్రీదేవీ శరన్నవ రాత్రి పూజా మహోత్సవములు, ముఖ్యమయినవి. అందులో, దుర్గాష్టమీ పూజ ముఖ్యస్థానం వహిస్తుంది.
దుర్గామాత ఆలయాలు మన దేశంలో ఎన్నో చోట్ల ఉన్నా, విజయవాడలోని కనకదుర్గ ఆలయం, ప్రసిద్ధి చెందింది. క్షేత్రము, తీర్థము, దైవము - అనే ఈ మూడు, దేనికవే పవిత్రమైనవి. అవి మూడూ త్రిపుటిగా ఒక్కచోటే నెలకొని ఉంటే, అది మహా పవిత్రమైన పుణ్య క్షేత్రముగా ప్రసిద్ధి చెందుతుంది. క్షేత్రమ - ఇంద్రకీలాద్రి, తీర్థము - పవిత్ర కృష్ణానది, దైవము - స్వయంభువు శ్రీకనక దుర్గాదేవి, మరి ఆ ప్రదేశము - విజయవాడ.
కృతయుగానికి పూర్వమే, కీలుడనే శాక్తేయుడు జగన్మాతను గూర్చి దీక్షతో తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమైన తల్లి, వరం కోరుకోమని అడిగింది. కీలుడు, జగజ్జననిని, తన హృదయ స్థానంలో వసించమని వేడుకుంటాడు. సంతసించిన జగన్మాత, కీలుడిని పర్వత రూపంగా ఉండమని, కాలాంతరంలో అతని కోర్కె తీరుతుందని చెప్పింది. ఆ విధంగానే కీలుడు పర్వత రూపంలో ‘కీలాద్రి’గా స్థిరపడ్డాడు. గమ్మా రాక కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు. మహిషాసుర వధానంతరం, దుర్గా స్వరూపంలో కీలాద్రిపై స్వయంభువుగా వెలసింది. కీలుని కోర్కె తీర్చింది. జగన్మాతను సేవించటానికి, ఇంద్రాది దేవతలు వస్తూ ఉండటంతో, కీలాద్రి ‘ఇంద్ర కీలాద్రి’గా మారింది. ఇంద్ర కీలాద్రిపై కొలువుతీరింది జగన్మాత - దుర్గాదేవి, మహిషాసుర మర్దిని రూపంలో. ఇది కృతయుగములోని విషయం.
శ్రీరామచంద్రుడు, సర్వకార్య విజయ ప్రదాయిని అయిన శ్రీదుర్గామాతను ఆరాధించి, తల్లి అనుగ్రహంతో, కరుణా కటాక్షములతో రావణాసురుని జయించినా ఉన్నది. త్రేతాయుగం నాటి వృత్తాంతము.
పాండవులు అజ్ఞాత వాసము గడుపుటకు విరాటుని రాజ్య ప్రవేశము చేయుటకు ముందుగా, ధర్మరాజు దురిత నివారిణి దుఃఖ హంత్రిణి అయిన దుర్గాదేవి స్తోత్రాన్ని జపించి, ఆ జగన్మాత అనుగ్రహముతో, విజయమును పొందాడు. ‘అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం యశోదాగర్భ సంభూతాం నారాయణ వరప్రియాం, నందగోపకులే జాతం మంగళ్యాం కులవర్థినీమ్ కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీ శిలాతట వినిక్షిస్తాం’ ఆకాశం ప్రతి గామినీం వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబర ధరాం, దేవీ ఖడ్గ భాటక ధారిణీం భారవతరణే పుణ్యే యే స్మరంతి సదాశివాం’ అని ధర్మరాజు దుర్గాదేవిని స్తోత్రం చేసినట్లు వ్యాస భగవానులు మనకు మహాభారతంలో వివరించారు. ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి శ్రీదుర్గామాత అనుగ్రహం లభించి, కష్టముల నుండి బయటపడతారని చెప్పబడింది. పారాయణ చేసి ఫలితములను పొంది, అనుభవపూర్వకముగా వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వారున్నారు.
మహాభారతంలో భీష్మ పర్వంలో అర్జునుడు ‘దుర్గాస్తుతి’ చేసిన విషయం తెలియపరచబడింది. అక్కడ దుర్గాదేవిని, వాగ్దేవీ స్వరూప మహా సరస్వతిగాను, వేద మాతగానూ స్తుతించాడు. ‘స్వాహాకార స్వధాచైవ కరాకాష్ఠా సరస్వతీ సావిత్రీ వేదమాతాచ తథా వేదాన్త ఉచ్యతే’ అని ప్రార్థించాడు, దుర్గామాతను. ఇది ద్వాపర యుగంలోని దుర్గామాత విశేషాలు.
అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి, భిల్లుని రూపంలో వచ్చిన శివునితో మల్లయుద్ధం గావించి పాశుపతాస్త్రాన్ని అనగా ‘శక్తి’ని పొంది, విరాజితుడైనాడు. ఇది దుర్గాదేవి కటాక్షంగా విశదపరచబడింది.
అర్జునుడు, ఇంద్రకీలాద్రి దిగువ భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పరమశివుణ్ణి మెప్పించి అఖండమైన అస్త్రాన్ని పొందిన దానికి చిహ్నంగా ‘విజయేశ్వరాలయం’ నెలకొన్నది. బ్రహ్మాస్ర్తిశ్వరీ అమ్మవారు, గంగా పార్వతీ అమ్మవార్లతో ఎంతో ప్రశాంతంగా ఉంటుందీ ఆలయం. ఈ ఆలయంలో గురువారం దక్షిణామూర్తి వారికి అర్చనలు, సోమవారం శివాభిషేకములు, మంగళవారంనాడు బ్రహ్మాస్ర్తిశ్వరీ అమ్మవారికి పూజలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. మహాశక్తి దుర్గామాత విజయానికి సూచనగా ఈ ఊరికి విజయవాడ అని పేరొచ్చింది. విజయుడు అంటే అర్జునుడు.
జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసిన దుర్గమను దర్శించారు. తల్లి భీకర స్వరూపురాలుగా వెలసింది. జగద్గురువులు అమ్మను, తన భీకరాకృతిని, ప్రసన్న వదనంగా చేయమని ఎందుకంటే, సామాన్యులు భీకరాకృతిని వీక్షించలేరని ప్రార్థించి, శ్రీచక్రమును ప్రతిష్ఠ గావించారు. అప్పటి నుండి తల్లి, ప్రసన్న వదనంతో, భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృక్షంగా, కటాక్షిస్తోంది. ఇది కలియుగములోనిది.
మహిమాన్వితమైన మహా దుర్గపావన చరిత్ర నాలుగు యుగములందూ ప్రసిద్ధమైనది.
పూర్వము మాధవ వర్మ అనే రాజు, ప్రజారంజకంగా ధర్మ పరిపాలన చేస్తున్నాడు. ఒకరోజున అతని కుమారుడు కట్టిన గుర్రపు బండి క్రింద పడి, నిరుపేద అయిన ఒక బాలుడు మరణించాడు. ధర్మప్రభువైన మాధవవర్మ, కన్నకుమారుడికి మరణశిక్ష విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతోషించి, దుర్గాదేవి, ఆ బాలుణ్ణి జీవింపజేసి, కనక వర్షము కురిపించిందని, ఆనాటి నుండే జగన్మాతకు ‘కనకదుర్గాదేవి’ నామము సార్థకమైనదని చెప్తారు.
ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా విచ్చేసిన, దుర్గామాత కనక వర్ణంతో, దేదీప్యమానంగా, వెలుగు లీనుతూ ప్రకాశిస్తున్న కారణంగా కనకదుర్గ అయిందని ఐతిహ్యం. ఆదిశంకరుల నిర్దేశం మేరకు, ఇక్కడి దుర్గామాతకు కుంకుమతో పూజ, లలితా సహస్ర నామంతో జరుగుతుంది.
ద్, ఉ, ఋ, గ్, ఆ అను అక్షరముల కలయికయే ‘దుర్గ’, అనగా సర్వ పాపములను శమింపచేసి, శమదమాది గుణ సంపత్తి నొసగి, సంసారాంబుధిని దాటించి, తరింపజేయు మార్గమును చూసి, దుష్టులకు వశముగాని అజేయ శక్తులను భక్తుల కొసగి, రక్షణ ఇవ్వగల దుర్గము అనగా ఒక కోట వంటిది - శ్రీ దుర్గాదేవి.
అగ్నిస్వరూపంగా ఈ సమస్త జగత్తును సస్యశ్యామలంగా సుభిక్షంగా చేసి దుఃఖముల బారి నుండి రక్షించి సదాశ్రేయస్సును ఇస్తుంది. భక్తులు తరించే మంచి మార్గాన్ని చూపి, జీవిత పరమార్థాన్ని తెలియజేసి, సంప్రాప్తింపజేస్తుంది. అందుకే దుర్గా సూక్షంలో ‘కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తస్నాదుర్గిః ప్రచోదయాత్’ అని చెప్పబడింది.
లోక కల్యాణం, లోక పోషణ - శ్రీ మహాదుర్గ లక్ష్యం. దుష్టశిక్షణలో ఎంత కాఠిన్యం వహిస్తుందో, శిష్ట రక్షణలో అంత దయార్ద్ర హృదయం. భావనా శక్తిని ప్రసాదించే తల్లి - దుర్గామాత. అద్వైత ఐక్యతా భావనతో భయాన్ని తొలగించి, భక్త్భివాన్ని కలిగించి, శాంభవీ ముద్రతో భక్తులకు అభయమిచ్చి, ఆశ్రయమిచ్చి శ్రేయస్సును చేకూర్చి, భవాన్ని విభవంగా అందించే భవాని - శ్రీ దుర్గాదేవి. అందుకే, మంచి భావనా శక్తిని ప్రసాదించమని పరమ భాగవతోత్తముడు పోతన, శరణాగతితో, ఆర్ద్రతతో ఆర్తిగా అపార భక్తి తత్పరతతో దుర్గామాతను ప్రార్థించాడు.
అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపూటమ్మ, బొందె
ర్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చిన యమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృతాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటత్వ సంపదల్
భావనా పటిమతో కవిత్వ సంపదల్ని ప్రసాదించే అమ్మ - దుర్గమ్మ.
ఈ పద్యాన్ని చదువుకుంటూ అంతరార్థాన్ని తెలిసికోవటానికి ప్రయత్నిద్దాం. ముగురమ్మలు ఎవరు? మూలపుటమ్మ ఎవరు? మూలపుటమ్మ ఎవరో ఆయనే చెప్పాడు - దుర్గాదేవి అని.
దుర్గాదేవి అంటే శివుని అర్ధాంగి పార్వతి అని ప్రసిద్ధ గదా. అయితే ఈ ముగురమ్మలలో పార్వతీదేవి లేదా? సరస్వతీ, లక్ష్మీ, పార్వతీ వీరు ముగ్గురూ చేరితేనే, ముగురమ్మలవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - త్రిమూర్తులు అయినట్లు. కానీ చివరలో ‘దుర్గమాయమ్మ’ అన్నాడు పోతన.
పోతన మనసులో ఉన్నది, దుర్గ అంటే పార్వతి కాదు. ఎంతో కష్టం మీద గానీ గ్రహించలేనిదేదో అది, ‘దుర్గ’. పరమాత్మ మాయాశక్తికీ ‘దుర్గ’ అని పేరు. అన్నింటికి మూలభూతమయినది, ఆ శక్తి, ఆదిశక్తి పరాశక్తి - ఆది పరాశక్తి ఆ మహాశక్తే, సృష్టించవలసి సరస్వతి అయింది. పోషించవలసి లక్ష్మీదేవి అయింది. ఉపసంహరించవలసి పార్వతి అయింది. వీరికి మూలభూతమైన ఏకైక శక్తి - ఆ పరాశక్తి. కనుక ఆ పరాశక్తే ఈ ముగురమ్మలకు మూలపుటమ్మ అయింది.
మరి, త్రిమూర్తులు గదా సృష్టి, స్థితి, లయలు చేసేది? అవును వారే చేసేది. అయితే వారు స్వయంగా తమ పాటికి తాము చేయలేరా పనులు. తమతమ శక్తులను ఆధారంగా చేసికొని చేస్తారు. ‘శక్తి’ కూడా వారిని ఆశ్రయించి ఉంటుంది. కనుక వారు ముగ్గురే ముగురమ్మలు. త్రిగుణాత్మకమయిన ఈ మూల ప్రకృతే, ముగురమ్మలకు మూలపుటమ్మ అయింది. ఆ మూలపుటమ్మ, ఆ జగన్మాతే - శ్రీదుర్గామాత.
ఇంతేకాదు, ఇందులో గొప్ప నిగూఢ మంత్రశాస్త్ర రహస్యాలు ఇమిడి ఉన్నాయి. నామాలు ఉచ్చరించేటప్పుడు, క్రీం ఐం హ్రీం శ్రీం - అని ముందు ఉచ్చరించి, తరువాత నామం చదువుతాం - ఈ మూడింటి విశేషమే ఓంకారంతో నాలుగు - మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని నాల్గవ పాదంలో, చివరలో ఉదహరించారు, పరమ భాగవతోత్తముడైన, పోతన.
దుర్గముడనే రాక్షసుడు, వేద విజ్ఞానాన్ని తన వద్దే నిక్షిప్తమయ్యేటట్లుగా బ్రహ్మ వద్ద వరం పొంది ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు. వర్షములు లేక, పంటలు పండక అనావృష్టితో ప్రజలు అలమటిస్తున్నారు. ప్రజలకు అన్నపానాదులు లేవు. దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేవతలందరూ, పరాశక్తికి ఈ వృత్తాంతం తెలిసి, రక్షింపమని ప్రార్థించారు. ‘వతాక్షి’ అయిన కరుణామయి, కన్నుల నుండి సంతతధారగా, సర్పోషములతో కూడిన వర్షము తొమ్మిది రోజులు వర్షించగా, సర్వజలాశయములు నిండి, సస్యశ్యామలమయినది. తన హస్తములందుండిన శాకములతో గూడిన భోజన పదార్థములను సమంగా అందరికీ పంచి, ‘శాకంబరి’ అయింది - శ్రీ దుర్గామాత. వర్షాకాల ప్రారంభంలో శాకంబరి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు దుర్గామాతకు.
జాతకరీత్యా రాహు మహర్దశ జరుగుచున్నవారు, అంతర్దశ జరుగుతున్నవారు, జాతకంలో రాహువు ఈ స్థానంలో ఉన్నవారు, మార్కండేయ పురాణంలోని, దేవీసప్తశతలోని ‘కీలకస్తోత్రం’ ‘అర్గల స్తోత్రం’ ముఖ్యంగా, ‘దేవీకవచం స్తోత్రం’ పారాయణ చేసి (చేయించుకుని) తీర్థ ప్రసాదం తీసికొంటే, చండీహోమం చేస్తే, దోషములు తొలగి, సర్వకార్యసిద్ధి చేకూరుతుంది. ఇది దుర్గామాత అనుగ్రహము.
దరిద్రుని శ్రీమంతునిగాను, బలములేని వారిని, బలహీనులను బలవంతులుగాను, బుద్ధిహీనుని జ్ఞానిగాను, యుద్ధమున భయముతో కంపించు వానిని శౌర్యవంతునిగను, మనుష్యుని దేవతామయునిగాను, తన కరుణా కటాక్షములతో చేసే దయామయి - శ్రీ దుర్గామాత.
‘క్షేపిత పశుపాశ వ్యతికరః పరానందాభిభ్యం రసయత రసం’ అని వచించారు - శ్రీ శంకర భగవత్పాదులు, సౌందర్య లహరిలో. పశుపతి అగు సదాశివునితో కలిసియున్న పరాశక్తి, ఆదిత్య మండలాంతర్గతమైన బైందవీ శక్తినిచ్చి, అవిద్యాకరమైన పాశబంధాన్ని, విమోచనము కల్గించు మాత - దుర్గాదేవి. ఇక్కడ పశువు అంటే జీవుడు, పాశము అంటే ‘అవిద్య’. పశుపాశము అనగా జీవ అవిద్యల సంబంధమును నశింపజేసి, పరమానంద మనబడు జ్యోతి రూపముగా సదాశివ తత్త్వాత్మకమును ప్రసాదించు భగవతి - శ్రీ దుర్గామాత.
ద్వైతభావం వల్ల భయం కలుగుతుంది. ఐక్యభావంతో ‘భక్తి’ జనిస్తుంది. భయాన్ని తొలగించుకొని, భక్తిని పెంపొందించుకుంటే అభయమిచ్చి,
ఆశ్రయమిచ్చి, శ్రేయస్సును చేకూర్చి, భవాన్ని విభవంగా అందించే జగన్మాత దుర్గ్భావాని.
‘నమస్తే జగచ్చింత్య మాన స్వరూపే
నమస్తే మహాయోగిని జ్ఞానరూపే
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే’
హిమాచలకుమారి, హ్రీంకార సరసీరుహ భ్రమం, రమాభారతీ నయని, రాజీవ చంద్రవదని, శంభురంజని, భ్రమాత్మక విశ్వజనని, వనదుర్గా మహా మంత్రావాహన శృంగేరీ పీఠ స్థిత శారదాంబ, కామకోటి పీఠ నిలయ, దుందుభి వాద్య భేద నాద వినోదిని, మోదిని, వీణావాదిని, సంవేదిని, అభేదిని, శ్రీరంజని, నిరంజని, జయజనని, కేనోపనిషత్ప్రత్తి పాదిత ‘ఉమా హైమవతీ’ బహుశోభమాన - శ్రీ దుర్గాదేవి.
దుర్గాదేవిని, సంపూర్ణ శరణాగతితో వేడికొంటే, ప్రార్థిస్తే, ఆరాధిస్తే, ఉపాసిస్తే, దుర్లభమైన, దుర్గమమైన వాటిని కూడా ఛేదించి, మన దుఃఖాన్ని పోగొట్టి, సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. దుర్గ నామంలో దైత్య నాశనం, విఘ్న నాశనం, అగిబీజత్వం, సర్వపాపహరం - దర్శనమవుతాయి. దుర్గాదేవిని గురించి, స్కాంద పురాణం, దేవీభాగవతం, బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం, బ్రహ్మదైవర్త పురాణం పేర్కొనబడింది.
‘దుర్గ’ అనగా ‘అగ్ని’ యజ్ఞ యాగాది కార్యములు చేసిన దానికన్నా నిశ్చలమైన మనసులో దుర్గాదేవిని ఆరాధిస్తే, మిన్న అయిన అగ్ని కార్య ఫలితాన్ని ఇస్తుంది దుర్గామాత. అగ్ని - సంసార సముద్రమును, అనేక కష్టాలనే దుర్గములను (కోటలను) పడవ లాగా దాటిస్తుంది. ‘నావేవ సింధూ దురితాత్యగ్నిః తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే’ కనుక అగ్నియే దుర్గ, దుర్గయే అగ్ని. రామాయణంలోని సుందరకాండలో అశోక వనాన ఉన్న సీతాదేవియే, నవదుర్గ వన దుర్గ. అగ్నిహోత్ర స్వరూపిణి. పాతివ్రత్యాగ్ని హోత్రాంగా జ్వలించిపోతోంది అని పేర్కొనబడింది. ఇది దుర్గాదేవి స్వరూపం.
భారతీయ సంస్కృతిలో ప్రతి స్ర్తి.. గృహలక్ష్మి. ఇంటికి దీపం. జ్ఞానదీపం దుర్గాదేవి స్వరూపమే. దుర్గ అంటే పరం జ్యోతిస్సు.. పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా’ అని, ‘దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖప్రదా’ అని పేర్కొనబడింది, లలితా సహస్ర నామంలో.
మహా పుణ్యక్షేత్రం శ్రీశైలంలో, భ్రమరాంబా మాతకు నవదుర్గల అలంకారములతో నవరాత్రి పూజలు వైభవోపేతంగా జరుపుతారు. వాటి వివరాలు పరిశీలిద్దాం.
శైలపుత్రి: దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిగా అవతరించి, ఆత్మార్పణం చేసికొని, హిమవంతుని కుమార్తెగా, పార్వతీదేవిగా ఆవిర్భవించి శైలపుత్రి, శైలబాల, దుర్గగా ప్రసిద్ధమైనది. మనఃకారకుడైన చంద్రుడి ఆశీస్సులను అనుగ్రహింపజేస్తుంది. అనగా ఈ మాతను సేవిస్తే, నిశ్చల చిత్తం, నిర్మల మనస్సు కలుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడంటే, తల్లే. శైలపుత్రి, పార్వతీదేవి, పరమశివుని తన తపస్సుతో మెప్పించి వివాహమాడింది. పార్వతీ పరమేశ్వరులది, అర్ధనారీశ్వర తత్త్వమే గదా.
బ్రహ్మచారిణి: పరమశివుడిని పతిగా కోరి, తపస్సు చేసిన పార్వతీ రూపం బ్రహ్మచారిణి. ఈ తల్లిని ఆరాధిస్తే త్వరితగతిని కన్యలకు వివాహములు జరుగుతాయి. గ్రహములలో కుజ గ్రహము భార్యాభర్తలకు కించిత్తు ఎడబాటు కలిగించే గ్రహం. అసలు వివాహములను, ఆలస్యం చేస్తాడు. జాతక చక్రంలో కుజుడు 1,2,4,7,8,12 స్థానము లందుంటే కుజదోషము. బ్రహ్మచారిణి అవతారికలో మాతను ప్రార్థిస్తూ, ఉపాసిస్తే, కుజదోషములు తొలగి, శీఘ్రంగా వివాహములు జరుగుతాయని చెప్తారు.
చంద్రఘంట: ఘంటాకృతిలోని చంద్రవంకను తలపై ధరించిన జగన్మాత, అమృత స్వరూపిణి. ఈ తల్లిని ఆరాధిస్తే లలిత కళలన్నీ నేర్చుకో గలుగుతారు. సంగీత, సాహిత్య నాట్య శిల్ప కళలలో సిద్ధహస్తులవుతారు. చిత్రలేఖనమందు నిష్ణాతులవుతారు. సర్వశుభములు కలుగుతాయి. శుక్ర గ్రహానుగ్రహం కలుగుతుంది. శుక్ర గ్రహ దోషములు తొలగుతాయి.
కూష్మాండ దుర్గ: కూష్మాండం అంటే మంచి గుమ్మడి కాయ. గుమ్మడికాయ బ్రహ్మాండాలకు సంకేతం. కాలాధి దేవత. ‘కాలానికి రాణి సద్గుణ శీలి’ అన్నాడు శ్యామశాస్ర్తీ. తల్లి కరుణా కటాక్ష వీక్షణాలతో, బ్రహ్మాండాలను సృజించి కాపాడే తల్లి. కాలాధి దేవత. కాల చక్రాన్ని తన సంచారంతో నడిపేవాడు - సూర్య భగవానుడు. ప్రాణికోటికి ప్రాణాధారమైనవాడు, సూర్యుడు. మానవాభ్యుదయానికి మంగళ తోరణం - సూర్యకిరణం. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత’ అందరికీ ఆరోగ్య భాగ్యాన్నిచ్చేవాడు సూర్యభగవానుడు. సూర్యుని అనుగ్రహాన్ని ప్రసరింపజేసే మాత - కూష్మాండ దుర్గ.
స్కందమాత: స్కందుడంటే కుమారస్వామి. ఆరు ముఖముల వేల్పు కుమారస్వామి. ఆయనే్న సుబ్రహ్మణేశ్వరుడంటారు. సంపూర్ణ జ్ఞాన ప్రదాత. బ్రహ్మదేవునికి కూడా ఓంకార ప్రణవ నాదాన్ని వివరించిన స్వామి. షట్చక్రములలో ఉండే కుండలినీ శక్తియే స్కందమాత. ‘యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా’ కుజ, బుధ గ్రహానుగ్రహాల్ని, ఈ మాత ఆరాధనతో పొందుతారు. కాలేయ, జీర్ణకోశ వ్యాధులు, రక్తసంబంధిత వ్యాధులు నయమవుతాయి.
కాత్యాయనీ దుర్గ: కాత్యాయన మహర్షికి, తనిచ్చిన వరాన్ని తీర్చేందుకు, ఆయన బిడ్డగా అవతరించి, ఆ భాగ్యాన్ని ఆయనకు ప్రసాదించిన కరుణామయి. తదుపరి, మహిషాసుర వధ గావించి, లోక కల్యాణం గావించింది. ధన, విద్యా, వాక్కు, కుటుంబ, గృహ, వాహన కారకుడైన బృహస్పతి అనుగ్రహాన్ని ప్రసాదింపజేసే మాత. కాత్యాయనే దుర్గ. ‘కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధమహి తన్నోదుర్గిః ప్రచోదయాత్’ అన్నది దుర్గాసూక్తం.
కాళరాత్రి: భయంకరాకృతియైనా, భక్తులకు అభయాన్నిచ్చే మాత. ‘కాళరాత్య్రాది శక్త్యౌ ఘ వృతా స్నిగ్దౌదన ప్రియా’ అన్నది, లలితా సహస్ర నామ స్తోత్రం. రావణునికి హితబోధ చేస్తూ, ఆంజనేయుడు, సీతమ్మ ఎవరో కాదు, ‘కాళరాత్రి’ నీ లంకా రాజ్యాన్ని తృటిలో భస్మీపటలం చేయగల మహాశక్తి, ఇప్పటికైనా సీతమ్మను శ్రీరామునికి అప్పజెప్పమన్నాడు.
మహాగౌరి: గౌరవర్ణం. సర్వ శుభములను కటాక్షించే తల్లి. గొప్ప తపశ్శక్తి, జ్ఞానశక్తి కల్గిన తల్లి. మంగళ గౌరీ దేవిగా కొలుస్తారు. వివాహములో, మంగళ సూత్రములను, గౌరీదేవి అనుగ్రహం కోసం పూజించి, తరువాత వరుడు వధువు మెడలో కడతాడు. పెండ్లి కుమార్తె చేత ముందుగా గౌరీపూజ చేయిస్తారు. ‘మ్రింగెడి వాడు విభుంజడని.. మంగళ సూత్రమ్మును మది నెంత నమ్మినదో’ అంటాడు పోతన. రాహు దోషములు తొలగి, సుఖ జీవితానందాన్ని పొందుతారు.
సిద్ధ్ధిత్రి: పరమశివుడు సర్వసిద్ధులను పొందాడు, కారణం? పరాశక్తి పరిపూర్ణ శక్తి వలన. ‘శివశక్త్యాయక్తో..’ అన్నారు ఆదిశంకరులు. ఆ మహాశక్తే సిద్ధిదాత్రి - దుర్గామాత. ఆధ్యాత్మికతను ఇచ్చి, జీవిత పరమార్థాన్ని తెలియజేసి, అందరితో ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యమనే జ్ఞానాన్నిచ్చి, ‘సోహం’ భావాన్ని వెలుగును కరుణించే దుర్గామాత - సిద్ధ్ధిత్రి. కేతు గ్రహానుగ్రహాన్ని కటాక్షిస్తుంది.
దుర్గాదేవి పూజానంతరం, మరునాడు మహర్నవమి - మహిషాసుర మర్దినీదేవి పూజ. దీనితో శ్రీదేవీ నవరాత్రి పూజా మహోత్సవములు ముగిస్తాయి. తరువాతి రోజు విజయదశమి. మకుటాయమానమైన పండుగ. శ్రీ రాజరాజేశ్వరీ జగన్మాత ఆరాధన.
వంశవతి, శివయువతి, పాలయమాం శాంభవి.. దురిత ధ్వంసి జనని, అని వంశవతీ రాగంతో కీర్తించాడు, ముత్తుస్వామి దీక్షితులు. ప్రపంచమందలి జీవరాశి యను వంశమునకు తల్లి- శ్రీ దుర్గామాత. స్వరములు ఏడు. వాటికి ఇరువది రెండు శ్రుతులు. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమమునకు నాలుగు, పంచమమునకు నాలుగు, దైవతమునకు మూడు, నిషాదమునకు రెండు, అన్నీ కలిసి ఇరువది రెండు. ఈ ఇరువది రెండు స్తుతి స్వరూపిణి, శ్రీ దుర్గామాత.
శక్తిస్వరూపాన్ని తెలిసికొని, స్ర్తిలను జననీ సోదరీ భావంతో గౌరవించి, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని, కాంక్షించాలని, శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో జగన్మాత హితవు పలుకుతోంది, హెచ్చరిస్తోంది.
*

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464