S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కందమూలాలు

ఫురాణ కాలంలో ఋషులు అడవుల్లో కందమూలాలు తిని జీవించే వారని మన గ్రంథాలు చెప్తున్నాయి. కందమూలాలు అంటే దుంపకూరలు. వీటినే గడ్డలని కూడా మన వాళ్లు పిలుస్తుంటారు. కంద దుంప, పెండలం దుంప, చిలకడ దుంప, చేమదుంప, బంగాళాదుంప, కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి వీటినే మనం కందమూలాలు అంటున్నాం. పెండలం, కర్రపెండలం లాంటివి ఉన్నా అవి మనకు పెద్దగా మార్కెట్లోకి రావటంలేదు. దుంపకూరలు అంటే ఇవి మాత్రమే అని మనం అనుకోవటం సహజం. అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి కూడా దుంప కూరల్లోకే వస్తాయి.
షుగరు వ్యాధి, స్థూలకాయం, కీళ్లనొప్పులు, ఎలర్జీ వ్యాధులతో బాధపడే వ్యక్తులు ఈ దుంప కూరల్ని తినాలంటే భయపడతారు. వీటిని గొప్ప ఆహార ద్రవ్యం అంటే చాలామంది ఒప్పుకోరు. అది వాస్తవం కూడా!
ప్రస్తుతం మనకు దొరుకుతున్న దుంప కూరల్లో కేరెట్, ఆలు, బీట్‌రూట్, ముల్లంగి, చిలకడ దుంప ఇవేవీ మనవి కావు. పోర్చుగీసుల కాలంలో అవి విదేశాల నుండి మనకు సంక్రమించినవే! పురాణ కాలం నాటి ఋషులకు వీటి గురించి తెలియదు. వీటి వివరాలు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో ఉండవు. అత్యాధునిక వైద్య గ్రంథకర్తలు మాత్రమే తమ అనుభవం మీద వీటి గుణగణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆధునిక వైద్య శాస్తప్రరంగా మాత్రమే వీటి పోషక విలువలు, ఆరోగ్య ప్రభావం గురించి మనకు తెలుస్తోంది. మరి పురాణ కాలంలో వానప్రస్థాశ్రమం గడుపుతున్న ఋషులు తిన్న కంద మూలాలు ఏవి? వాటి ఆరోగ్య ప్రభావం ఏమిటి? సంపూర్ణ ఆహార పదార్థాలుగా వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? ఈనాటి సమాజానికి వాటి అవసరం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకటమే ఈ వ్యాసం లక్ష్యం.
అరటి దుంప కూర, పప్పు, పచ్చడి
అరటి గెల కోసేసిన తరువాత అరటి చెట్లను కొట్టేస్తుంటారు మనవాళ్లు. పూల మొక్క అంటే పూలు మాత్రమేననీ, పండ్ల మొక్క అంటే పండ్లు మాత్రమేననీ అనుకోవటం వలన మనమే నష్టపోతున్నాం. అరటి పువ్వు, అరటి కాండం ఎలా ఆహార ద్రవ్యాలుగా ఉపయోగపడతాయో మనం చర్చించాం. చెట్టుని నరికేశాక దాని దుంపని అవతల పారేస్తున్నారు. అలా పారేయకండి. కంద, కేరెట్ మాదిరే దీన్ని కూడా కూర, పప్పు, పచ్చడి ఇలా రకరకాలుగా వండుకోవచ్చు. కావాలంటే ఆలు పరోటా, ఆలుబజ్జీ లాగానే అరటి దుంప పరోటాలూ, అరటి దుంప బజ్జీలు కూడా వండుకుని కమ్మగా తినవచ్చు.
వండటం ఒక కళ. దేన్ని ఏ విధంగా వండాలో ఈ కళాకారులకు బాగా తెలుసు.
అరటి దుంప ఎలాంటి వివాదాలు లేని ఉత్తమ ఆహార ద్రవ్యం. అమితంగా చలవ చేస్తుంది. వేడి వలన కలిగే, పెరిగే జబ్బులు, బీపీ, ఎసిడిటీ, మూత్రాశయ వ్యాధులు, చర్మ వ్యాధులు, అరికాళ్ల మంటలు, కళ్ల మంటలు, కడుపులో మంట ఇలాంటి వ్యాధి లక్షణాలు తగ్గటానికి అరటి దుంప ఒక ఔషధ ద్రవ్యంగా ఉపయోగపడుతుంది.
వాత వ్యాధులతో బాధపడేవారు తరచూ అరటి దుంపలతో ఏదైనా ఒక వంటకం చేసుకుని తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలో కఫాన్ని విపరీతంగా పెంచే వ్యాధుల్లో కూడా ఇది ఔషధంగా పని చేస్తుంది.
బీపీ నుండి షుగరు దాకా అన్ని వ్యాధులలోనూ దీన్ని ఔషధం తీసుకోవటం అవసరం అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. తరచూ వేడి చేసే శరీర తత్త్వం ఉన్నవారికి ఇది బాగా మేలు చేస్తుంది.
దీన్ని వండుకోవటం కుదరకపోతే అరటి దుంపని కడిగి శుభ్రం చేసి, చెక్కు తీసి, సన్నని ముక్కలుగా తరిగి ఎండించిన దంచిన పొడితో ముప్పొద్దులా టీ కాచుకుని తాగండి. ఏ రూపాన తీసుకున్నా ఈ దుంప మన కడుపులోకి చేరటమే ముఖ్యం.
కలువ/ తామర దుంపల కూర, పప్పు, పచ్చడి
కలువ దుంపలు, తామర దుంపలు చెరువులు, కొలనులు, తటాకాల్లో నీటి అడుగున భూమిలో పాతుకుని ఉంటాయి. వాటి నుండి తామర తూడు పెరిగా ఆకులూ, పూలూ నీటిపైన పరచుకుంటాయి. చెరువులు ఎండిపోయినా, భూమి లోపల దుంప పదిలంగా ఉండి మళ్లీ నీళ్లు రాగానే మొలకలేసి మొక్కలౌతాయి.
కలువ దుంప, తామర దుంపలకు వైద్య ప్రయోజనాలు ఒక్కటే! చలవనిస్తాయి, పుష్టినిస్తాయి. బలకరంగా పని చేస్తాయి. పూవుల మాదిరే ఇవి కూడా గుండెను శక్తిమంతం చేస్తాయి. రక్తప్రసారంలో ఉద్రేకాన్ని తగ్గించి శాంతింప చేస్తాయి. అందువలన బీపీ పెరగకుండా అదుపులో ఉంటుంది. షుగరు వ్యాధిలో కలిగే ఉపద్రవాలు దీని వలన తగ్గుతాయి. దీని రసం తీసుకుని పాలు కలిపి కమ్మని పాయసం కాచుకుంటారు. దుంపలను సన్నగా తరిగి కూరపప్పు, పులుసు, పచ్చడి వగైరా చేసుకుంటారు. గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. అకారణ గర్భస్రావాలు కాకుండా కాపాడుతుంది. గర్భవతులకు కలిగే బాధల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వేడిని, కడుపులో ఎసిడిటీని తగ్గించి శరీరంలో తేలికదనం కలిగేలా చేస్తాయి. రసం తీసి పాలు వగైరా కలిపి పాయసం కాచుకుంటే చాలా శక్తిమంతంగా పని చేస్తుంది.
షుగరు వ్యాధిని తగ్గించే ద్రవ్యాలలో తెల్లకలువ దుంపలకు ప్రసిద్ధి. స్ర్తిలకు కలిగే తెల్లబట్ట వ్యాధిలో ఇది ఎర్రకలువ దుంపలు జ్వరాన్ని తగ్గిస్తాయి. గర్భాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమీపించేప్పుడు కలిగే స్ర్తిల వ్యాధులకు ఇవి గొప్ప నివారణ ఔషధం. తరచూ గర్భస్రావాలు అవుతున్న వారికి దీన్ని ఇస్తూ ఉంటే గర్భం నిలుస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఎసిడిటీని తగ్గిస్తాయి. వికారం, వాంతుల్ని కూడా తగ్గిస్తాయి. వేవిళ్లను నివారిస్తాయి. మనసుకు సంతోషాన్నిస్తాయి.
అతిగా రక్తస్రావం అయ్యేవారికి తామర, కలువ దుంపలు రక్తస్రావాన్ని ఆపేందుకు సహకరిస్తాయి. శరీరంలో విష దోషాలను పోగొట్టి కేన్సర్ లాంటి వ్యాధులను రానీయకుండా శరీరానికి రక్షణ నిస్తాయి.
అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారికి కలువ, తామర, అరటి దుంపలు ఔషధంగా పనిచేసి వ్యాధి త్వరగా తగ్గేలా చేస్తాయి. దుంపల్ని ఉడికించి, పెరుగులో కలిపి పెరుగుపచ్చడిలా చేసుకుని ప్రతీరోజూ ఉదయం పూట తింటే అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ పెప్టిక్ అల్సర్లు ఇంకా ఇతర జీర్ణకోశ వ్యాధులు నివారిస్తాయి.
అతిగా తినకూడదు. కష్టంగా అరుగుతాయి. జీర్ణశక్తిని బట్టి తీసుకోవాలి.
నేలతాడి దుంపల పాయసం
భగవంతుడిచ్చిన వరాలలో నేలతాడిగడ్డలు ఒకటి. వీటిని కమ్మని ఆహార పదార్థాలుగా తినమనే దేవుడిచ్చాడు.
మనం వినిపించుకోకపోతే నష్టం మనకే కదా!
నేలతాడి చెట్టుని ముసాలీ, వారాహీ, తాలమూలీ అని వైద్య గ్రంథాలలో పిలుస్తారు. నల్లగా, తెల్లగా రెండు రకాలుగా ఉంటుంది. దీని దుంపలు సన్నగా పొడవుగా ఉంటాయి. రైతులు వీటి విలువ తెలుసుకుని పండిస్తే, ప్రజలు విలువ తెలుసుకుని వాడుకుంటూ ఉంటే అకారణంగా వ్యాధుల పాలిట పడకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్లం అవుతాం.
ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని లైంగిక శక్తిని పెంచే ద్రవ్యాలలో ఒకటిగా (ఎఫ్రొడిజియాక్స్) చెప్తారు. బలకరమైన ఔషధాల్లో ఒకటి. ఇంకా ఇతర ఔషధ ప్రయోజనాలు కూడా దీనికున్నాయి. శరీరానికి సుఖంగా ఉండే పరిస్థితిని కలిగిస్తాయి. అనీజీగా, నలతగా ఉన్నదనిపించటం దీని వలన తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా క్షీణింపజేసే వ్యాధుల్లో దీన్ని ఔషధంగా ప్రయోగిస్తారు.
నిజానికి నేలతాడి లేత దుంపలు కూరగాయల మార్కెట్లోకొస్తే సామాన్య మానవుడికి ఒక అద్భుత బలకర ఔషధం అందుబాటులోకి వచ్చినట్టే లెక్క. సుఖ సంసారాన్ని పెంచే ద్రవ్యం చేతికి అందితే అంతకు మించిన వరం ఇంకేముంటుంది?
నేలతాడి గడ్డలు అని మూలికలు అమ్మే షాపుల్లో లేదా, పెద్ద పచారీ షాపుల్లో అడగండి దొరుకుతాయి. ఎండించిన దుంపలే దొరుకుతాయి. వాటి శుభ్రం చేసుకుని మెత్తగా దంచిన పొడిని అరచెంచా నుండీ ఒక చెంచా వరకూ తీసుకుని, వేడిపాలలో వేసుకుని జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలకులు, జీడిపప్పు వగైరా చేర్చి తాగండి. రోజూ ఉదయం పూట లేదా రాత్రిపూట తీసుకోవచ్చు. చిక్కిపోతున్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు సంకోచం లేకుండా ఇస్తే, చదువు శ్రమను తట్టుకోగలుగుతారు. ఆటగాళ్లు, పోటుగాళ్లకు ఇది వారి శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.
ఉబ్బసం తగ్గుతుంది. ఊపిరితిత్తులు బలసంపన్నం అవుతాయి. ఆయాసం ఆగుతుంది. శొంఠి పొడి, నేలతాడి గడ్డల పొడి సమానంగా తీసుకుని పెరుగులో కలిపి తింటే విరేచనాలు ఆగుతాయి. వాముపొడితో కలిపి తింటే దగ్గు ఆగుతుంది.
పిల్లిపీచర దుంపల కూర, పప్పు, పచ్చడి, పాయసం
శతావరి అనేది ఆయుర్వేద ఔషధాల గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ పరిచయం ఉన్న పేరే! పిల్లిపీచర, పెద్ద పిల్లిపీచర ఇలా పిలుస్తారు. పెద్దదైనా చిన్నదైనా గుణాలు ఒక్కటే! ఇది కూడా కూరగాయల మార్కెట్లోకి తేవలసిన ఆహార ద్రవ్యమే! అవగాహన లేకపోవటం వలన మనం కోల్పోతున్న ప్రకృతి వరాలలో ఇది ఒకటి!

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com