S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాయేలమ్మ

రాయేలమ్మ చనిపోయే నాటికి ఎనే్నళ్లో తెలియదు. అప్పటికే ఆమె భర్త గతించాడు.
ఆమె తన పదమూడో ఏట నించి నలభై అయిదో ఏటి దాకా పనె్నండు మంది పిల్లలకు తల్లి అయింది.
ఆమె పెద్ద కొడుక్కు ముప్పై ఏళ్లున్నప్పడు, ఆమె చివరి కొడుకు పుట్టాడు. ఆమె కడుపుడికింది.
తన పెద్ద మనుమడికి పనె్నండేళ్లు. తన చిన్న కొడుక్కు ఏడాది దాటింది.
ఆమె పిల్లలు పనె్నండు మందిలో గిరిగీసినట్లు ఆరుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు.
ఆమె కాలం చేసే నాటికి డెబ్బై ఇద్దరు మనుమళ్లు మనుమరాళ్లు. ఆమె గతించాక పద్దెనిమిది మంది మనుమ సంతానం కలిగారు.
తాను సంతానవతి కావటం ఆనందం. అందరూ వేజండ్ల పల్లెలో పుట్టారు.
ఆమె తన అనుభవంతో తన కూతుళ్లకు పురుళ్లు వచ్చినా, కోడళ్లకు కాన్పులయినా, ఆమె దగ్గరుండి సత్కార్యం సక్రమంగా జరిగేట్టు చూచేది.
అప్పటి నుంచి పల్లెలో ఏ తల్లికి పిల్లో పిల్లోడో పుడుతున్నా, రాయేలమ్మను పిలవమనే వాళ్లు. ఆమె వెళ్లేది. సులువు సూత్రం చెప్పేది. పుట్టిన పసిగుడ్డును పట్టుకొనేది.
అప్పటి నుంచి రాయేలమ్మ మంత్రసానిగా చెలామణి అయింది.
చుట్టుపక్కల గ్రామాలలో ఏ స్ర్తికి అయినా నొప్పులు వస్తుంటే మగవాళ్లు ఉరుకులు పరుగుల మీద, వేజండ్ల మాదిగ పల్లెకు వచ్చి, రాయేలమ్మను తీసుకొని పోయి, కాన్పు అయిందాకా నొప్పులు పడే ఆడమనిషిని అప్పగించి, మగవాళ్లు, ఇళ్లు వదిలి చెట్టూ పుట్ట అండన చేరేవాళ్లు.
రాయేలమ్మ కాన్పు చేసిన అన్ని సందర్భాలలో తల్లీబిడ్డ క్షేమంగా ఉండే వాళ్లు. ఆమె హస్తవాసి గొప్పది అని పెద్ద పేరు.
వేజండ్ల గ్రామంలో ఆసాములు సంపన్నులైతే గర్భిణీని గుంటూరో తెనాలో రైల్లో తీసుకుపోయేవాళ్లు. హాస్పిటళ్లలో కాన్పు అయ్యాక, ఉంటే తల్లీబిడ్డను, లేకుంటే తల్లినో బిడ్డనో వేజండ్ల గ్రామానికి తీసుకొని వచ్చేవాళ్లు.
పేద రైతుల భార్యలు మాత్రం వేజండ్ల గ్రామంలోనే పిల్లల్ని కనేవాళ్లు. కష్ట కాన్పు అయితే రాయేలమ్మను పిలిచేవాళ్లు. ఆమె వెళ్లేది. కాన్పు చేసి వచ్చేది.
రాయేలమ్మ అనుభవం, చాకచక్యం, సులువు సూత్రం తెలిసిన వాళ్లు ఆమె సహాయం అర్థించకుండా ఉండేవాళ్లు కాదు.
ఆ రోజుల్లో వేజండ్ల మాదిగపల్లెలో కానీ, వేజండ్ల గ్రామంలో కానీ, కోడూరు, సుద్దపల్లి, బుడంపాడు, వడ్లమూడి, సేకూరు, సెలపాడు ఊరు వాడల్లో కానీ పిల్లలు విరివిగా పుట్టేవాళ్లు. రోజుకొక పురుటి కబురు ఆహ్వానం అయినా ఉండేవి.
రాయేలమ్మ యంత్రంలాగా ఆ వూరూ ఈ వూరూ తిరుగుతూ ఉండేది. కాన్పులు చేస్తూ వుండేది.
వేజండ్ల మాదిగ పల్లెకు చుట్టుపక్కల ఉన్న అరడజను ఊరు వాడల్లో ఉన్న పాతికేళ్ల వయస్సు కంటే తక్కువ వున్న వాళ్లలో ముప్పాతిక మువీసం మందిని ఆమే మొదట తాకింది. మొదట పట్టుకొంది. బొడ్డు కోసింది. బిడ్డల్ని అప్పగించింది. మాయపడేదాకా ఉండేది. మాయను తీసుకుపోయి స్మశానంలో పూడ్చిపెట్టి వచ్చేది.
ఎవురయినా ఎగుర్లాడుతుంటే ‘నీ బొడ్డు కోసింది నేనేరా’ అని గదురుకొనేది.
ఎక్కడ కాన్పు చేసినా ఎంతో కొంత ముట్టేది. ఉన్నవాళ్లు ఉన్నంత రాలిన కాడికి గోవింద. ఇచ్చింది పుచ్చుకొని వచ్చేది. ఆమె పాచీరలకు లెక్కే లేదు.
తనకు ఎక్కువయిన పాచీరలు కోడళ్లకిచ్చేది. కూతుళ్ల కిచ్చేది కాదు.
పల్లెలో ఒక్క కూతురే ఉంది. తల్లికీ బిడ్డకు తగాదా! మాట్లాడుకోరు. కూతురుకు ఆమె తన బహుమతి పాచీర లిచ్చేది కాదు.
ఇంకో కూతురు తలసెడి వచ్చి పుట్టినూళ్లో స్థిరపడింది. ఆమె అడిగేదీ కాదు. ఈమె ఇచ్చేదీ కాదు.
అందువల్ల ఆమెకు లభించిన పాచీరలు కోడేళ్లకే ఇచ్చేది. ఆరుగురు కోడళ్లు, నలభై మందికి పైగా మనుమరాళ్లు.
వీళ్లు ఓణీలు వేసుకోవాలంటే నాయనమ్మ ఇచ్చే పాచీరే గతి.
ఏ ఊళ్లోనూ ఆసాముల ఇళ్లలోకి మాదిగల్ని రానిచ్చేవాళ్లు కాదు.
అత్యవసరం అయితే మగవాళ్లు, మాదిగ వాళ్లు, వచ్చి పనిచేసి వెళ్లిపోతారు.
ఆడవాళ్లు, మాదిగ ఆడవాళ్లు రారు. వచ్చినా లోనికి రారు. ఒకవేల వస్తే తిష్ఠ వేసుకొని కూర్చోరు. ఏదంటే అది అంటుకోరు.
రాయేలమ్మకు ఈ నియమాలు ఏవీ వర్తించవు. నేరుగా నట్టింటోకి పోతుంది. గర్భిణీ స్ర్తి పొట్ట మీద ఆముదం రాస్తుంది. ఏదేదో చేస్తుంది. బిడ్డను పట్టుకొంటుంది. సొంతం వాళ్లకు అప్పగిస్తుంది.
రాయేలమ్మ మాదిగ స్ర్తియే కావచ్చు, కానీ అంటరానితనం జయించింది.
బ్రాహ్మణుల ఇళ్లలోకి మాదిగలకు ప్రవేశం ఉండదు. కానీ రాయేలమ్మకు ఏ ఇల్లు అయినా ఘంటాపథం.
పిలిచినా పోతుంది. కానుపు అని తెలిస్తే పిలవకపోయినా పోతుంది.
ఆమెకు ఆటంకం లేదు. అడ్డగింపు లేదు. పైగా ఆహ్వానం ఉంటుంది. ఆదరణ ఉంటుంది. ఆత్మీయత దొరుకుతుంది. అనురాగం పొందుతుంది. ఒక్కోసారి గౌరవ మర్యాదలు సంపాదించుకొంటుంది.
భర్త చనిపోయినా, ఒక్కతే తన ఇంట్లో తానుండేది. తానే వండుకు తినేది. ఏ కొడుకింటికీ పోదు. ఏ కూతురింటికీ వెళ్లదు. తన పనులు తానే చేసుకొనేది.
మంత్రసాని కావటాన, చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెల్లో, పిల్లలు పుట్టటంలో కొదవ లేకపోవటాన, పని తక్కువ లేదు. రాబడికి లోపం లేదు. బ్రతుకుతెరువుకు భయం లేదు.
శేషయ్య, పెద్ద కొడుకు, డెబ్బై అయిదేళ్లు. ఎనిమిది మంది పిల్లలు. నలుగురు పిల్లలు, నలుగురు ఆడపిల్లలు.
ఆ లెక్కన అయిదుగురు కొడుకులకు, ఎక్కడున్నా అయిదుగురు కూతుళ్లకు మనుమలు, మనుమరాళల్లు, రాయేలమ్మకు తెలుసు.
చివరి కూతురికి ముగ్గురే పిల్లలు. చివరి కొడుక్కు ఒక్కతే కూతురు. వీళ్లిద్దరినీ ‘వొగుడాకులు’ అనేది రాయేలమ్మ. అది తిట్టు. ఎండు ఆకులు. అంటే కడుపారా పిల్లల్ని కనలేదని కోపం. సరుూ్యసారం లేని బతుకులని ఎగతాళి. తన వొంట్లో బలం తగ్గాక పుట్టిన బలహీనులని ఆమె తాత్పర్యం.
ఆమెకు మనుమ సంతానం వరకే లెక్క కానీ, మునిమనుమ సంతానం కానీ, మునిముని మనుమ సంతానం కానీ, లెక్కలేదు.
కోడళ్లు ‘బువ్వ తిందువు రమ్మంటే’ ‘నీ పిల్లాజెల్లను, కడుపు నిండా పెట్టి, బాగా చూసుకో’ అనేది.
తల సెడి పుట్టింటికి వచ్చిన కూతురు కానీ, ఇల్లరికం వచ్చిన అల్లుడు మరణిస్తే, విధవ అయిన ఉన్నూరు చిన్నకూతురు కానీ ‘బువ్వ తినమ్మా’ అంటే ‘మీ అగచాట్లు మీరు పడండి’ అనేది.
రెట్టించి బలవంతపెడితే, కాలూ సెరుూ్య కదలనప్పుడు, ‘తింటే కొడుకింట్లో తింటాను కానీ, అల్లుడింట్లో చేయి కడగను’ అనేది.
‘నీకు కూతుళ్లింత కాని వాళ్లయ్యారా?’ అంటే, ‘ఒకయ్య చేతిలో బెడితే పరాయోళ్లే’ అని జవాబు చెప్పేది.
తొంభై ఏళ్లు వచ్చినా ఆమెకు చూపు తగ్గలేదు. పళ్లూడలేదు. ఆకలి తగ్గలేదు. కానీ ఆరడుగుల మనిషి కదా క్రమక్రమంగా వంగిపోతూ ఉంది.
ఆమెకు బెల్లం తింటం చాలా ఇష్టం. ఎవరు ‘కొంచెం పెట్టు నాయనమ్మా’ అని బ్రతిమాలినా తిడుతుంది కాని పెట్టదు.
ఆమె ఇంట్లో చెరుకు బెల్లంతోపాటు ఈత బెల్లం తాటిబెల్లం గోనె సంచుల్లో ఉండేవి. ‘బెల్లం సుట్టూ ఈగలు మూగుతాయి’ అని పీల్లాపీసు వెంటబడితే కసురుకొనేది.
ఆమె ఇంట్లో ఉన్న ఏమయినా పెడుతుంది. ఏదయినా ఇస్తుంది. కానీ బెల్లం పెట్టదు.
ఆమె వంగి, కుంగిపోవటంతో మంత్రసాని పనులు తగ్గించుకొంది.
దూరపూళ్లు నడిచిపోలేదు.
‘ఎడ్లబండి కట్టుకొని వస్తే, బండిలో వెళ్లి కానుపు సుఖంగా జరిగేట్టు చూచి వచ్చేది.
‘నా వల్ల కాదు’ అనేది కాదు.
‘వీడు పేగు మెడకు చుట్టుకొన్నాడు’ అని సుతారంగా పేగు తప్పించి, తలకాయ పట్టుకొని ముక్కమని గర్భిణీ స్ర్తిని ఆదేశించి పిల్లవాణ్ణి గుంజి పేగు కోసేది.
ఒక తల్లికి బిడ్డ అడ్డం తిరిగి కానుపు కష్టం అవుతుంటే పొట్ట మీద చేయి తిప్పే, తలపాటుకు వచ్చేట్టు చేసేది.
ప్రసవంలో తల్లి కానీ, బిడ్డ కానీ చనిపోవటం ఆమె చేతుల్లో జరిగేది కాదు.
అందుకే అంత వృద్ధురాలయినా ఆమె సహాయ సహకారాలు కాదనేది కాదు.
కానీ, క్రమంగా పక్కపల్లెలకు వెళ్లటం మానేసింది.
వేజండ్ల పల్లెలోనో, ఊరిలోనో కానుపు అంటే కాదనేది కాదు.
అయితే తల్లిని, బిడ్డను తన చేతులతో ఆరాధించటం అనేది, ఆశీర్వదించటం అనేది - చేతకాకపోతే, పక్కనున్న ఆడవాళ్లకు ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్పేది.
కనీసం గర్భిణీ స్ర్తి పొట్ట తాకమనేవాళ్లు. ఆమె తాకితే సుఖ ప్రసవం అని వాళ్ల నమ్మకం.
రాయేలమ్మ వచ్చింది అని, నీ పొట్ట తాకింది అని చెబితేనే గర్భిణీ స్ర్తి నొప్పులు మర్చిపోయేది.
రాయేలమ్మ ఇల్లు కదలలేని స్థితిలో మంచాన పడి, తాను కన్నపిల్లల్ని, తన పిల్లలు కన్నపిల్లల్ని, తాను కానుపు చేయించిన పిల్లల్ని, తాను ఈ లోకంలోకి తెచ్చిన పిల్లల్ని తలుసుకొని అంతులేని ఆనందం పొందేది.
తాను కనలేని స్థితికి కుమిలిపోవటం మానేశాక, తాను కానుపులు చేయించలేని పరిస్థితి వచ్చాక, దుఃఖం కలిగేది.
‘కానీ, ఇంతే ప్రాప్తం’ అని తనను తాను సంబాళించుకొనేది.
ఎవరు కబురు చేసినా, బండి కట్టుకొని వచ్చినా పోలేకపోయే పరిస్థితి రావటంతో రాయేలమ్మ బాధ పడసాగింది.
పల్లెలో కానుపయినా పోవటం కుదరటం లేదు. పోవచ్చు. రావచ్చు. కానీ కానుపు అయిందాకా నిరీక్షించటం ఆమెకు సాధ్యం కావటంలేదు.
ఏ గర్భవతిని అయినా ఇంటికి తీసుకొని వస్తే, ఏం చేయాల్సిందీ, ఎట్లా చేయాల్సిందీ, మంచం మీద నుంచే చెప్పే స్థితికి వచ్చింది ఆమె.
ఆమె అన్నం వండుకోవటం లేదు. ఆకలిగా ఉంటే బెల్లం తినేది.
ఎవరినీ అన్నం పంపమని కబురు చేసేది కాదు.
ఎవరి పనుల్లో వాళ్లుండటం వల్ల ‘అత్త ఎట్లా ఉందో’ అని ఏ కోడలూ ఆలోచించేది కాదు. ‘బాగానే ఉంటది’ అనుకొనేవాళ్లు కొడుకులు.
ఎవరి మీదా ఆధారపడేది కాదు.
రాయేలమ్మకు శుభ్రం ఎక్కువ. స్నానం చేయకుండా ఉండే మనిషి కాదు.
కానీ, రెండు డబరాల నీళ్లు వంటి మీద దిమ్మరించుకొందామనుకొన్నా సాధ్యం కావటంలేదు.
గోనే సంచిలో ఉండే బెల్లం గడ్డలు అన్నీ అయిపోయాయి.
‘తనకు కాలం తీరింది’ అనుకోసాగింది.
చచ్చిపోయే ముందు స్నానం చేయాలనుకొంది.
చనిపోయాక ఎలాగూ స్నానం చేయిస్తారు.
వస్తూ పోతూ వాళ్లూ వీళ్లూ పలకరిస్తుంటారు. ‘ఆఁ! వూఁ!’ అంటూ ఉంటుంది.
జీవితమంతా ఎవరి మీదా ఆధారపడలేదు.
ముసలి ముంపున ఎవరి ఎదానా పడరాదని రాయేలమ్మ అభీష్టం.
బావిలో పడితే స్నానం చేసినట్లు ఆనందంగా ఉంటుంది.
రాయేలమ్మకు ఈత రాదు.
చనిపోవటం కూడా సుఖంగా ఉండాలని ఆమె సంకల్పం.
బావిలో పడితే తల్లి గర్భంలో పడ్డట్లే!

ఎవరో వస్తారు. బయటికి తీస్తారు. పాడె కడతారు. పాతి పెడతారు.
బావిలోంచి తనను బయటకు తీయటానికి, గర్భసంచిలోంచి తనను అప్పుడే పుట్టిన బిడ్డగా బయటకు తీయటానికి ఎవరు మంత్రసాని అవుతారు?
దేవుడే! దేవుడే మంత్రసాని! డాక్టరు!!
ఆలోచించుకొంటున్న కొద్దీ ఆనందం అధికం కాసాగింది.
ఆమె దృష్టిలో రెండు బావులున్నాయి.
పల్లె మాదిగలు తాగటానికి నీళ్లు తోడి తెచ్చుకొనే బావి ఇంతకాలం దాహ బాధ తీర్చింది. ఇక ఇప్పుడు తన స్నాన బాధ కూడా తీరిస్తే మేలే!
రాయేలమ్మ ఆలోచనకు ఏదో అంతరాయం కలిగింది.
‘సెవం ఉన్న బాయి నీల్లు ఎట్టా తాగుతారీ జనం’ అని దిగులు పడింది.
కోట్ల వాళ్లది పొలం బావి ఉంది. వెడల్పు ఎక్కువ. లోతు ఎక్కువ.
దూకినా దొర్లినా నీళ్లలోనే పడవచ్చు. రాతి గోడకు కొట్టుకొని నడుం విరిగో, తల పగిలో శవం అయ్యే పరిస్థితి ఉండదు.
తను ప్రాణం పోసిన జనం ఇంతమంది ఉన్నారు.
వీళ్లను చూచుకొంటూ బ్రతకవచ్చు.
కానీ, ఎవరైనా ఎంతకాలం జీవిస్తారు?
వెళ్లవలసిందే! వచ్చిన పని అయిపోయింది. ఆయువు తీరాక అర నిమిషం ఉండటం సాధ్యమా? అసాధ్యం!
చేయవలసిన పని, చేయగలిగిన పని, చేయలేనప్పుడు వెళ్లటమే మార్గం. అనివార్యం. గత్యంతరం లేదు.
రంగస్థలం మీద మాయల ఫకీరు ఎంతసేపు పగలబడి నవ్వగలడు?
గుండెలు పట్టేయవూ?
ఎవరి మీదా ఆధారపడకుండా, తెరచాటుకు పోవటమే ధన్యం.
కర్ర పోటేసుకొంటూ నడిచే రాయేలమ్మ కర్ర పారేసి నడవసాగింది.
కోట్ల వాళ్ల పొలం బావి కొంచెం దూరమే! అయినా నడవగలిగింది.
వంగిపోయిన రాయేలమ్మ, నడుస్తుంటే నిటారుగా నిలబడ్డ భావన కలిగింది.
నెమ్మదిగా నడిచే రాయేలమ్మ గబగబా నడుస్తున్న అనుభూతికి లోనయింది.
కోట్ల వాళ్ల బావి మీద గానే భర్త చేయి పట్టుకొని వచ్చి, వేజండ్ల మాదిగ పల్లె చేరింది.
తాను కని పెంచిన పిల్లల్ని తలుచుకొంటే ‘ఒకనాటి యువతిని’ అనుకోసాగింది.
బావి దగ్గరకు వచ్చాక చెప్పులు విడిచి దూరంగా పెట్టింది.
‘గంగలో చెప్పులు పడనిస్తానా?’ అనుకొంది.
కనీ పెంచిన తన తల్లిదండ్రులు తనను మళ్లీ అక్కున చేర్చుకొంటారనుకొంది. ఆశించింది.
చిన్నపిల్లలాగా చిందులు వేసింది.
పసిపిల్లలాగా మారాం చేసింది.
పాలు తాగాలనుకొనే పసిబిడ్డలాగా నీళ్లు తాగటానికి ముందుకు వచ్చింది.
ఒక స్తన్యం జీవితం, మరో స్తన్యం మరణం. తల్లి ఇటు నుంచి అటు మార్చుకొంటుంది. అంతే జీవితం! అంతే మరణం. అదే ఉదయం. అదే సాయంత్రం.
జీవితం తాగిన తాము, మరణం తాగటానికి సిద్ధమయింది.
బావి ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. అమ్మలాగా రెండు చేతులూ చాచింది, బావి.
అమ్మ ఆలింగనం ఎంత సుఖం!
రాయేలమ్మ ముందుకు వచ్చింది.
తల్లి ఎత్తుకొంది.
బావిలో రాయి పడ్డట్టు రాయేలమ్మకు అనిపించింది.
ముద్ద మింగిన నోరు మూసుకొన్నట్లు బావి వౌనంగా ఉంది.

================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఆచార్య కొలకలూరి ఇనాక్.. 9440243433