S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కందమూలాలు-3

పెనే్నరు దుంప హల్వా, టీ, పాయసం
అశ్వగంధ పేరుతో ప్రసిద్ధమైన ఈ మూలిక ఒక దుంప కూర. దీన్ని కూరగా వండుకోవటానికి అనుకూలంగా లేనప్పుడు దీనితో హల్వా చేసుకుంటారు. పాయసం కాచుకుంటారు. టీ కాచుకుని తాగవచ్చు కూడా! ఈ దుంపకు గుర్రం వాసన ఉంటుంది. అందుకని అశ్వగంథ అన్నారు. కూరగా తినటానికి అనుకూలత ఉండదు. సుగంధద్రవ్యాలు కలిపి స్వీట్లు తయారుచేసుకోవచ్చు. పాయసం, టీ కాచుకోవచ్చు!
ఆయుర్వేద ఔషధాలలో అశ్వగంధాది లేహ్యం ప్రసిద్ధి. ఇంకా అనేక వనమూలికలు కలిపి తయారుచేసిన ఔషధం ఇది. దీన్ని ఇంట్లో హల్వాలాగా వండుకోవచ్చు. బాగా మెత్తగా దంచిన పెనే్నరు దుంప చూర్ణాన్ని తగినంత మోతాదులో ఏలకులు, నెయ్యి, పచ్చ కర్పూరం, జీడిపప్పు వగైరా కలిపి పంచదార లేదా బెల్లం పాకం పట్టి తయారుచేసిన హల్వాగానీ, లేదా పాలు పోసి కాచిన పాయసం గాని అమోఘమైన ఔషధ ప్రయోజనాలను కలిగిస్తుంది.
క్షీణింపచేసే వ్యాధులున్న వారికి ఇది తక్షణ శక్తినిచ్చి సాధారణ స్థితి నెలకొనేలా చేస్తుంది. ముఖ్యంగా టీబీ, ఎయిడ్స్, హెపటైటిస్ లాంటి క్షీణింపచేసే వ్యాధులు వచ్చినవారికి బలం క్షీణించక ముందునుండే అశ్వగంధని ఇవ్వటం మొదలుపెడితే, ఈ రోజు జరిగే ప్రమాదాన్ని రేపటికి వాయిదా వేయటం సాధ్యం అవుతుంది.
కఫం అడ్డుపడి ఊపిరి ఆడనట్టుగా ఉండేవారికి ఇది కఫదోషాన్ని తగ్గిస్తుంది. కీళ్ళవాతం, నడుంనొప్పి, మోకాళ్ళనొప్పులు వగైరా అన్ని వాత వ్యాధులలోనూ తప్పనిసరిగా తిని తీరవలసిన ఔషధద్రవ్యం ఇది. ఏ వైద్య విధానంలో మందులు వాడుతున్నవారైనా సరే అశ్వగంధను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒక గంట ఎడం ఇచ్చి ఆ మందులు వాడుకుంటే ఎలాంటి ఇబ్బందీ కలగదు.
ఉబ్బసం రోగులూ, ఇతర ఎలర్జీ వ్యాధులతో బాధపడేవారు అశ్వగంధని ప్రతిరోజూ తీసుకుంటుంటే ఎలర్జీ తీవ్రత, జలుబు, పడిసెభారం తగ్గుతాయి.
షుగరు వ్యాధి వున్నవారికి ఈ పెనే్నరు దుంప తక్షణ శక్తిదాయినిగా పనిచేస్తుంది. తీపి లేకుండా రోజూ రెండు పూటలా అశ్వగంధ చూర్ణాన్ని షుగరు రోగులు పాలలో కలిపి కాచుకుని తాగటం ఒక మంచి అలవాటు.
రక్తదోషాలు తగ్గుతాయి. చర్మవ్యాధుల్లో సుగంధపాల వేళ్ళు పైబెరడు దంచిన పొడిని, పెనే్నరు పొడినీ సమానంగా కలిపి చిక్కగా టీ కాచుకుని లేదా పాయసం కాచుకుని తాగితే చర్మానికి కాంతి కలుగుతుంది. మంచి రంగు వస్తారు. శరీర లావణ్యం పెరుగుతుంది. మొటిమలతో బాధపడే స్ర్తి పురుషులిద్దరికీ ఇది మంచి ఔషధం. ప్రసవానంతరం బాలింతలకు పెనే్నరు పొడిని పైన చెప్పిన పద్ధతుల్లో రోజూ రెండు లేక మూడుసార్లు ఇస్తూ ఉంటే ఆరోగ్యవంతమైన తల్లిపాలు కలుగుతాయి. గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. బాలింతలకు వచ్చే వాత వ్యాధులు కలగకుండా ఉంటాయి.
పెనే్నరు దుంపలు ఎండినవే మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చుకుని శుభ్రం చేసుకుని మెత్తగా దంచిన పొడిని నేతితో వేయించి యాలకులు, పచ్చకర్పూరం లాంటి సుగంధద్రవ్యాలు కలిపి పాకం పట్టుకుని రోజూ ప్రొద్దున, సాయంత్రం పిల్లలకు పెట్టండి. చాలా ఏపుగా ఎదుగుతారు. అలసట, శ్రమ తగ్గుతాయి. జ్ఞాపకశక్తిపెరిగి రాణిస్తారు.
స్ర్తి పురుషుల్లో సంతానం కలగకపోవటానికి వివిధ దోషాలు కారణం అవుతాయి. ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం పెనే్నరు దుంపల పొడి ఒక చెంచా మోతాదులో గ్లాసు వేడి పాలలో వేసుకుని భార్యాభర్తలిద్దరూ రెండు పూటలా తాగుతుంటే గర్భాశయ దోషాలు, వీర్యంలో విత్యకణాలు లేకపోవటం ఇవి సరి అవుతాయి. లైంగికశక్తి పెరుగుతుంది.
మెట్టతామర దుంపలతో కూర, పచ్చడి, హల్వా.. ఇలాంటివి తినాలని చెప్పేది ఎందుకంటే బంగాళా దుంపలు తప్ప మరో దుంప కూర లేదనుకునే తెలుగింటి పిల్లలకు, అంతకుమించిన ఔషధ గుణాలున్న ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు మనకూ ఉన్న సంగతి తెలియజేయడానికే! ఆలూ దుంపలు చేమదుంపలు, చిలకడదుంపలు, కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి వగైరా దుంప కూరలు. ఇవి 3-4 వందల ఏళ్ళ క్రితం వరకు మన పూర్వులకు తెలియవు. పోర్చుగీసుల కాలంలోనూ, బ్రిటీష్‌వారి కాలంలోనూ ఈ దుంపలు మనకు పరిచయం అయి, ఇవి మన వారసత్వ సంపద అన్నంతగా మనం వాటిని వాడేయటం మొదలుపెట్టాం. వాటిమీద మోజులో మనవైన దుంపకూరల్ని మరచిపోవటమూ మొదలుపెట్టాము.
మెట్టతామర వౌలికంగా కంద, పెండలం లాగే దుంపకూరల మొక్క. మనం దాన్ని క్రోటన్ మొక్కగా మాత్రమే భావించుకుంటున్నాం. ఇది మనకు మనం చేసుకునే అన్యాయాలలో ఒకటి.
ఆయుర్వేద శాస్త్రంలో మెట్టతామరను స్థలకమలం అన్నారు. భూమీద పెరిగే తామర అనే అర్థంలోనే మెట్టతామరను స్థలకమలం అన్నారు. ఇది పద్మంలాగే, వేడిని తగ్గిస్తుంది. కొద్దిగా కారంగా చేదుగా వగరుగా ఉంటుంది. కఫాన్ని, వాతాన్ని జయిస్తుంది. మూత్రవ్యాధులమీద బాగా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తుంది. మూత్రపిండాల కారణంగానూ, పేగులలో దోషాల కారణంగానూ వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. ఉబ్బస రోగులకు మేలు చేస్తుంది. ఎలర్జీ వ్యాధుల్లో ఎలర్జీ తీవ్రతను తగ్గిస్తుంది. శరీర దోషాలను పోగొడుతుంది అని ఈ వైద్య గ్రంథంలో ఉంది. ఇన్ని సుగుణాలలో కొన్ని మనం తింటున్న విదేశీ దుంపల్లో ఉన్నప్పటికీ, శక్తివంతమైన ఔషధ గుణాలు దీనికున్నంతగా వాటికి ఉండవు.
మెట్టతామర దుంపలతో పూర్వం కూర వండుకునేవారని వస్తుగుణ మహోదధి అనే గ్రంథంలో వుంది. ఈ దుంపలతో పచ్చడి చేసుకోవచ్చు. లేదా పాకం పట్టి హల్వా చేసుకోవచ్చు. తినటం ప్రధానం. రుచిగా, ఆరోగ్యదాయకంగా వండుకోవటం గురించి మీరు ఆలోచించండి.
సాలమిస్రి దుంపల సూపు
హోటళ్లలో సూపు పేరుతో రకరకాల పానీయాలను అమ్ముతుంటారు. ప్రధాన ఆహారానికి ముందు ఎక్కువమంది దీన్ని ఉపాహారంగా మొదట తీసుకుని ఆ తరువాత మిగిలినవి తినటం చాలామందికి ఒక అలవాటు. సాలామిస్రి దుంపల పొడిని అన్నంలో వేసి బాగా మెత్తగా ఉడికించి వార్ని గంజితో సూపు తయారుచేసుకుని తాగుతుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. శక్తిదాయకమైన దుంపకూరల్లో సాలామిస్రికి సాటిరాగల దుంప మరొకటి లేదు. దీన్ని ఆహార పదార్థాల్లో ఒక భాగం చేసుకోవటంలో మన యుక్తి ఉపయోగపడాలి.
సాలామిస్రి దుంపల్ని సంస్కృతంలో జీవనీ, సుథామూలీ పేర్లతో పిలుస్తారు. వనమూలికలు అమ్మే షాపుల్లో సాలామిస్రి ఎండిన దుంపలు దొరుకుతాయి. కొంచెం ఖరీదైనవే!
ముఖ్యంగా సాలిమిస్రి పురుషుల వీర్యకణాలు పెరగటానికి ప్రధానంగా వాడతారు. మానసికంగా ఏర్పడే జడత్వం, నపుంసకత్వాలకు ఇది పరమ ఔషధం. షుగరు వ్యాధి వున్నవారికి శక్తినిచ్చి బలసంపన్నుల్ని చేస్తుందిట. షుగరు వ్యాధి ఉపద్రవాలను తగ్గిస్తుంది. అమితంగా చలవ చేస్తుంది. పాలలో ఉడకబెట్టి పాయసం కాచుకుని రోజూ తాగవచ్చు కూడా! శీఘ్రస్ఖలనంతో బాధపడేవారకి ఈ పాయసాన్ని తాగిస్తే, వారు వయాగ్రగణ్యులవుతారు.
క్షయ, ఎయిడ్స్ తదితర క్షీణింపజేసే వ్యాధుల్లో ఇది జవజీవాల్ని కల్పిస్తుంది. మూత్రపిండాల్ని బలసంపన్నం చేస్తుంది. అమీబియాసి, ఇతర పేగుల వ్యాధుల్లో బాగా ఉపయోగపడుతుంది. అన్ని వ్యాధుల్లోనూ ఇది పనిచేస్తుంది. చిక్కి శల్యమైపోతున్నవారికి ఇది ఇచ్చి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. ఈ దుంపల సూపుతోగానీ, పాయసంతోగానీ ఏ ఔషధం వేసుకున్నా అది రెట్టింపు శక్తిమంతంగా పనిచేస్తుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com