S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలివి మాత్రమేనా..?

తనకేదీ తెలియదని తెలుసుకోవడమే మనిషి తెలివికి గమ్యం - జోసెఫ్ అడిసన్
* * *
ఈ ప్రపంచంలో ఏ కొంచెం ఆలోచనగల తల్లిదండ్రులు అయినా తమ పిల్లలను తప్పకుండా బడికి పంపిస్తారు. బడిలో, కాలేజీలో ఆపైన జరిగే కార్యక్రమాన్ని చదువు అంటారు. ఈ చదువు పేరున మనుషుల మెదడులోకి కొంత సమాచారాన్ని పంపిస్తారు. ఈ సమాచారం రకరకాలుగా ఉంటుంది. మొదట్లో అందరికీ ఒకే రకం సమాచారం అందించినప్పటికీ, రానురాను మార్గాలు విడిపోతాయి. కొంతమంది సామాజిక శాస్త్రాలు చదువుతారు. మరి కొంతమంది విజ్ఞానశాస్త్రాలు చదువుతారు. కొందరు కళలు, మరి కొందరు సాంకేతిక విద్య చదువుకుంటారు. మొత్తానికి ఈ కార్యక్రమం పేరు చదువు. అంటే ఎక్కడో రాసిపెట్టి ఉన్న కొన్ని అంశాలను చదవడం మాత్రమే. తరగతిలో 30 మంది ఉంటే వాళ్లందరికీ ఒకే రకం సమాచారాన్ని అందజేస్తారు. కానీ అందరికీ ఒకే రకంగా అర్థం కాదు. అది వారివారి బుద్ధిశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధినిబట్టి కొందరు చెప్పిన విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. అర్థంతోపాటు అవగాహన, అవలోకనం ఇలాంటివి కూడా తోడు కావాలంటే వారికి బుద్ధిశక్తి ఉండాలి. చదువు పేరున అందేది సమాచారం. ఇంటలిజెన్స్ అనే బుద్ధిశక్తి ఆధారంగా ఆ చదువు తెలివిగా మారుతుంది. అంటే చదువుకున్న ఆ వ్యక్తులకు విషయాలు తెలుస్తాయి. విషయాలు తెలిసినంత మాత్రాన ఎవరికి ఏ రకంగానూ ప్రయోజనం ఉండదు. వాటిని స్వంత అనుభవాలతో అన్వయించుకుని, అర్థం చేసుకుని వాడుకునే పరిస్థితి ఏర్పడాలి. అప్పుడు కేవలం బడి, పుస్తకాల వల్ల మాత్రమే కాక ప్రపంచంలో అనుభవం కారణంగా కూడా కొంత తెలివి తోడవుతుంది. గురువులు పావు భాగం మాత్రమే చెబుతారు. మరొక పావుభాగం తోటి సహపాఠుల వల్ల అందుతుంది. మరో పావు భాగం చర్చ వలన దొరుకుతుంది. మరొక పావుభాగం కాలం గడచిన మీదట అంటే అనుభవం ప్రకారం అందుతుంది.. అంటూ చెప్పిన ఒక శ్లోకం ఉంది. కనుక చదువు అన్నది పుస్తకాలతో పూర్తి కాదు, అని అర్థం చేసుకోవాలి. బడిలో కేవలం సమాచారం ఇచ్చి పంపించినందు వల్ల పిల్లలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందిన తెలివిని అర్థం చేసుకుని తెలివిగా వాడుకోగలిగితే తెలివి కలిగే పద్ధతిలో పిల్లలను ముందుకు నడిపించాలి. సమాచారం అంటే ఇన్ఫర్మేషన్. శక్తి అంటే ఇంటలిజెన్స్. అవగాహన అంటే అండర్‌స్టాండింగ్. తెలుగులో మాత్రం తెలివి అని ఒకటే మాట ఉంది. తెలుగు కొంతకాలానికి తెలివితేటలుగా మారుతుంది. అంటే అందులోని మడ్డి కిందకి దిగి తేట తెలివి పైకి తేలుతుంది. దానివల్ల మనిషికి విజ్ఞత పెరుగుతుంది. అంటే మంచిచెడ్డలు తెలుస్తాయి. విషయాల మధ్య పరస్పర సంబంధాలు తెలుస్తాయి. వాటివల్ల మునుముందు జరగబోయే ప్రభావాలు అర్థమవుతాయి. గతంలో జరిగిన సంగతులు గురించి అంతా బాగా తెలుస్తుంది. ఈ విజ్ఞతను ఆధారంగా మనుషులు జ్ఞానులు, విజ్ఞానులు అవుతారు. మామూలుగా జ్ఞానం ఉంటే జ్ఞానులు. అందులోనూ విశిష్టమైన జ్ఞానం ఉంటే విజ్ఞానులు.
విజ్ఞానం అనగానే అందరికీ సైన్స్ గుర్తుకు వచ్చే ప్రమాదం ఉంది. సైన్స్‌ను సామాన్య విజ్ఞానం అనడం అలవాటు చేశారు. లేదా శాస్త్ర విజ్ఞానం అంటున్నారు. మరి సామాజిక విజ్ఞానం కూడా విజ్ఞానమే. అది కూడా విద్యగా, సమాచారంగా మిగిలినంత కాలం ఎందుకూ పనికిరాదు. అన్నిరకాల విద్య, తెలివి అన్నవి మనిషి మెదడులో చేరిన తరువాత అయినా విజ్ఞానం అన్న స్థాయికి చేరాలి. ఇదంతా విద్యతో మొదలవుతుంది. విద్య గలవారు విద్వాంసులు. విద్వాంసులు పండితులు కాగలుగుతారు. కానీ విద్వాంసులు అందరూ జ్ఞానులు, విజ్ఞానులు కానవసరం లేదు. భాష ఎంత చదువుకున్నా కొంతమంది రచయితలు, కవులు కాలేకపోయారు. భాష గురించి పట్టించుకోకుండా బతికిన వారు కూడా గొప్ప రచనలు చేయగలుగుతారు. విద్యకు, విద్వాంసులకు ప్రయోగాత్మకంగా ఉండే తెలివికి తేడా ఇక్కడ కనబడుతుంది. సంగీతం నేర్పించేవాళ్లు అందరూ గొప్ప గాయకులు, వాద్యకారులు కానవసరం లేదు. వారికి సంగీత శాస్త్రం తెలుస్తుంది. పాడడం తెలియకపోవచ్చు. పాడడం కూడా తెలుస్తుంది. కానీ ప్రజారంజకంగా పాడడం తెలియకపోవచ్చు. ఆర్థికశాస్త్రం చదువుకున్న వాళ్లు అందరూ దేశానికి ఆర్థిక మంత్రులు, నిపుణులు కాజాలరు. ఆర్థికమంత్రి అయిన రాజకీయ నాయకులకు విషయం గురించిన అవగాహన ఉంటే చాలు. విద్యకు, విజ్ఞానానికి ఇదే తేడా. మరి ఏదో చదువుకున్నందుకు విజ్ఞానం కలిగినవారు అవసరం మీద ఎన్ని సంగతులు అయినా నేర్చుకో గలుగుతారు. విజ్ఞత అన్నది కొందరికి అనుకోకుండానే ఏర్పడుతుంది. కొందరికి కృషి వల్ల ఏర్పడుతుంది. నేను గ్రాడ్యుయేషన్ స్థాయిలో సైన్స్ చదువుకున్నాను. అందునా జీవశాస్త్రం చదువుకున్నాను. కానీ రకరకాల పరిస్థితుల వల్ల నాకు సాహిత్యంలో చక్కని రుచి కలిగింది. పెద్ద శ్రమ లేకుండానే నాకు ఎం.ఏ.లో సీటు దొరికింది. నిజానికి అందరికన్నా ఉత్తమ స్థాయిలో సీటు దొరికింది అని చెప్పారు. కానీ ఆ చదువుని వదిలి అందరికన్నా అథమ స్థాయిలో వెళ్లి సైన్స్ విద్యలో చేరాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ మెడల్‌తో బయటికి వచ్చాను. తర్వాత సమాచార రంగంలో ప్రవేశించాను. సంగీతం గురించి కృషి చేశాను. చిన్నప్పటి నుండి ఉన్న ఆసక్తి ప్రకారం సాహిత్యాన్ని కూడా వదిలిపెట్టలేదు. అందులోనూ కావలసినంత కృషి చేసి, ఎంతో చదివాను. కొంత రాశాను. అందరూ బాగుంది అన్నారు కూడా. అన్నిటిని పక్కనపెట్టి రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ కూడా మంచి పేరే వచ్చింది. ఉద్యోగం పోయింది. అది వేరే విషయం. అతి తెలివివల్ల పోయి ఉంటుంది.
అనువాదాలు మొదలుపెట్టి తెలుగు యూనివర్సిటీ వారి బహుమతి అందుకున్నాను. టీవీ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టి నంది బహుమతి గెలుచుకున్నాను. సంగీతం పాడు లేదు కానీ, దాని గురించి ఎంతో కృషి చేశాను. అక్కడ కూడా చాలా వచ్చింది. మరి ఎవరి గురించో చెప్పడం ఇష్టం లేక నా గురించి నేనే చెబుతున్నాను.
చదువుకున్నది ఒకటి అయితే, ప్రపంచంలో అనుసరించిన మార్గం మరొకటి. నేను జంతుశాస్త్రం చదువుకున్నాను. ఎందుకో తెలియక చదువుకున్నాను. ఆ కాలంలో సంగతులు చెప్పేవారు ఎవరూ లేరు. జంతుశాస్త్రం చదువుకున్న వారు ఆ తరువాత అందుకు సంబంధించిన రంగాలలో పని చేయాలంటే అంతగా అవకాశాలు లేవు. కొంతమంది చేపల పెంపకం విభాగానికి వెళ్లారు. మరెవరైనా గొర్రెలు, మేకలు, పశువులు వంటి వాటి పెంపకంలోకి వెళ్లారు ఏమో నాకు తెలియదు. అయినా చేపలు పెంచడానికి మొత్తం జంతుశాస్త్రం చదువుకోవలసిన అవసరం లేదు. మన చదువు తీరు ఇలా ఉంది. అవి నిజానికి విజ్ఞానానికి దారితీసే పద్ధతి కాదు. అన్ని చదువుల తీరు ఇలాగే ఉంది. చదువుకున్నవారు చాలాకాలం పాటు మళ్లీ చదువు చెప్పి తమలాంటి కొంతమందిని తయారుచేయడం ఒకటే జరుగుతుండేది. సాంకేతిక విద్య వచ్చిన తరువాత పద్ధతి కొంత మారింది. అయినా వౌలిక విద్య బోధన జరుగుతూనే ఉన్నది. ప్రయోజనాలను గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఆలోచించి అక్కడక్కడ కొన్ని ప్రయోగాలు చేశారు. వాటి వల్ల గొప్పగా ఫలితాలు కనిపించినట్టు లేదు.
మనిషిని తెలివిగల వాడుగా మార్చాలని చదువు మొదలుపెడతారు. కానీ బడిలో వేసిన వాళ్లు అందరూ తెలివిగా ముందుకు సాగుతారు అన్న నమ్మకం లేదు. ఈ ప్రపంచానికి చదువు లేకుండా ఉన్న మనుషులు కూడా అవసరమే. చదువుకున్న వారు కూడా చదువుతో సంబంధం లేని పనులు చేయడం తెలిసినదే.
విజ్ఞానం అన్నది సంస్కృతం మాట. దానికి తెలుగు ఏమిటి? దాన్ని కూడా తెలివి అంటే అంతకు ముందు ప్రసక్తికి వచ్చిన తెలివి ఏమవుతుంది? కనుక తెలుగులో తెలివికి తేడాలు ఉన్నాయి. కలిపి ఒకటే మాట ఉన్నది. కోశవాన్ పండితః అని సంస్కృత మాట ఒకటి ఉంది. అంటే పుస్తకములు గలవాడు పండితుడు అని అర్థం. అందుకని బహుశా హైస్కూల్ గురువు రాధాకృష్ణగారు పుస్తకాలను కనీసం తల కింద పెట్టుకొని పడుకోండి అని సలహా ఇచ్చారు. పుస్తకాలు తెలివి మస్తకంలోకి చేరడానికి అది మాత్రం మార్గం కాదు. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా లాభం లేదు. ప్రపంచాన్ని పరిశీలించగల శక్తి ఒకటి ఉండాలి. బడిలో చెప్పని సంగతులను స్వంతంగా నేర్చుకునే పద్ధతి ఒకటి ఉండాలి. ఎవరంతకు వారే అక్కడిదాకా వెళ్లి తీరాలి. లేకుంటే వాళ్లకు వాళ్లే పనికిరారు. పడి ఉండదె పేర్మి పాము పది నూరేండ్లున్, అన్నట్టు పరిస్థితి ఉంటుంది.
తెలివి గురించి ఇవాళ కొత్తగా తెలుసుకోవలసి వస్తున్నది. తెలుసు అంటే విజ్ఞానం. తెలుసా లేక నీవు తెలుసు అనుకుంటున్నావా అన్న ప్రశ్న ఎదురటితే మరో పరిస్థితి పుడుతుంది. కొన్ని విషయాలను తెలుసు అని నిరూపించవచ్చు. కొన్ని మన నమ్మకాలు, ఊహలుగా మాత్రమే నిలిచిపోతాయి. అవగాహనకు విజ్ఞానానికి తేడా ఎక్కడ.

-కె.బి.గోపాలం