S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విదుర ధననీతి

శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా కొన్ని అంశాల్లో పాశ్చాత్యుల ముద్ర పడితే కానీ మనలో కొందరికి నమ్మకం కలగదు. డెల్‌కార్నీ కాదు కదా వారి తాతల కన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు కాలానికి చెందిన ఎందరో భారతీయ మహనీయులు మనకెన్నో జీవిత సత్యాలను, విజయవంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పారు. ఆర్థిక వ్యవహారాలు అనగానే మనకు కౌటిల్యుడు గుర్తుకు రావచ్చు కానీ కౌటిల్యుని కన్నా వేల సంవత్సరాల ముందు కాలానికి చెందిన మహాభారతంలో సైతం ఆర్థిక వ్యవహారాలపై ఈ కాలంలో సైతం ఉపయోగపడే విధంగా ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు విదురుడు.
నిజం. మహాభారత యుద్ధ కాలంలో ఆందోళనతో ఉన్న ధృతరాష్ట్రుడు వివిధ అంశాలపై విదురునితో చర్చలు జరుపుతాడు. ఆందోళనతో ఉన్న తన మనసుకు ఉపశమనం కలిగే విధంగా కొన్ని సత్యాలను వివరించమని కోరుతాడు. ధర్మానికి సంబంధించి నీ కన్నా ఎక్కువ తెలిసిన వారు లేరు నాకు వివరించు అని అడుగుతాడు. ఆ సందర్భంలో విదురుడు చెప్పిన ఎన్నో జీవిత సత్యాలు, రాజధర్మాల్లో ధనానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అవి ఈ కాలానికి సైతం మనకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన సీక్రెట్ పుస్తకం గురించి తెలిసిందే. మనం ఏది కోరుకుంటే అది సాధ్యం అవుతుందని చెబుతుందీ సీక్రెట్ పుస్తకం.
ఈ మాటను విదురుడు ఎప్పుడో చెప్పాడు. నిరంతరం మనం దేని గురించి ఆలోచిస్తామో, కావాలని కోరుకుంటామో అది సాకారం అవుతుంది అంటాడు విదురుడు. నిరంతరం మనం సమస్య గురించి ఆలోచిస్తే, చిన్న సమస్య కూడా పెద్దది అవుతుంది. కానీ సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఆలోచించాల్సింది సమస్య గురించి కాదు. ఆ సమస్య పరిష్కారం గురించి.
నేను పేదవాణ్ణి నా జీవితం ఇంతే... పేదవాడిగానే పుట్టాను. పేదవాడిగానే పెరిగాను. పేదవాడిగానే జీవితం ముగుస్తుంది అని నిరంతరం మీరు పేదరికం గురించే ఆలోచిస్తే నిజంగా మీరు ఆలోచించిన విధంగానే మీ జీవితం సాగుతుంది. అలానే ముగుస్తుంది. దానికి బదులు నేను సంపన్నుడిని కావాలి, నాలాంటి ఎంతో మంది జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. వారు సంపన్నులు అయినప్పుడు నేనెందుకు కాను. నేను కూడా సంపన్నుడిని అవుతాను అని నిరంతరం సంపన్నుడిగా మారేందు కోసం ఆలోచిస్తే సాకారం అవుతుంది అని చెబుతాడు విదురుడు. సంపన్నుల జీవితాలను పరిశీలించండి, సామాన్య కుటుంబం నుంచి వారు ఎలా ఎదిగారు, వారి జీవిత లక్ష్యాలను ఎలా సాధించారో పరిశీలించండి. విజయం సాధించిన వారు రాసిన పుస్తకాలు చదవండి. వ్యాపారంలో వారు ఎదిగిన తీరుపై వచ్చిన పుస్తకాలు చదవండి. వారి ఉపన్యాసాలు వినండి. ఎంతో కొంత అది మీ విజయానికి ఒక మార్గం చూపవచ్చు. వారిని విజయతీరాలకు చేర్చిన లక్షణాలు మీకూ అలవడతాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయడం నుంచి జీవితాన్ని ప్రారంభించిన అంబానీ నిరంతరం పేదరికం గురించి ఆలోచిస్తే ఇప్పుడతని కుటుంబం ఈ స్థాయిలో ఉండేది కాదు. దేశంలోకెల్లా సంపన్నుడిగా మారేవారు కాదు. నిరంతరం సంపన్నుడిని కావాలని తనకు తానే పాఠాలు చెప్పుకున్నారు. ఆలోచించారు. సాకారం చేసుకున్నారు.
విజయం సాధించిన వారిలో కామన్‌గా కనిపించే లక్షణం. వారు ఎక్కువగా మాట్లాడటం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీకు తెలిసిందే మీరు మాట్లాడతారు. కానీ వినడం వల్ల మీకు తెలియని విషయం తెలుస్తుంది. నేర్చుకోవడం అనేది వారి జీవితంలో నిరంతర ప్రక్రియ.
మీ మిత్రులు ఎవరో చెప్పండి, మీరు ఎలాంటి వారో చెబుతాను అంటారు. మిత్రుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. సంపన్నులు కావాలి అనేది మీ లక్షణం అయినప్పుడు వారి నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకునే విధంగా మీ మిత్ర బృందం ఉండాలి. చెడు వ్యసనాలు కలిగిన వారితో మీ స్నేహం ఉంటుంది. క్రమంగా మీపై ఆ ప్రభావం పడుతుంది.
* ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం కావచ్చు. ఒక కొత్త పని మొదలు పెట్టడం కావచ్చు. లాభనష్టాలు, సమస్యలు అన్నీ ఆలోచించి ప్రారంభించాలి. ఈ పని నేను మొదలు పెట్టాల్సింది కాదు అని మొదలు పెట్టిన తరువాత బాధపడాల్సిన సందర్భం రాకుండా ఉండాలి. మీకు స్వయంగా తెలిసిన రంగంలోనే ప్రవేశించాలి. స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏదైనా వ్యాపారం కావచ్చు. ఎవరికో బోలెడు లాభాలు వచ్చాయని ఎవరో చెబితే మీకు పరిచయం లేని ఆ రంగంలో ప్రవేశిస్తే మీ చేతులు కాలుతాయి. ఆసక్తి ఉంటే ఆ రంగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతనే ప్రవేశించాలి. స్వయంగా అనుభవం ఉండాలి. డబ్బు పెట్టుబడి పెట్టేప్పుడు తొందరపాటు పనికి రాదు.
సంపన్నుడివి కావాలి అంటే ఆరు దుర్గుణాలకు దూరంగా ఉండాలి అంటాడు విదురుడు. ఈ ఆరు దుర్గుణాలు ఉన్నవాడు జీవితంలో సంపన్నుడు కాలేడు. జీవితంలో ఎదగలేడు అంటాడు విదురుడు. అతి నిద్ర, అకారణ భయం, అలసత్వం, కోపం, విసుగు, నిర్లక్ష్యం వంటి లక్షాలు ఉన్నవారికి సంపద దరి చేరదు అంటాడు విదురుడు.
నమ్మదగని వారిని ఎప్పుడు నమ్మవద్దు. ఇక విశ్వసించిన వారిని సైతం ఎంత వరకు విశ్వసించాలో అంత వరకే విశ్వసించాలి. పూర్తిగా విశ్వసించినప్పుడు అలాంటి వారు మీకు వ్యతిరేకంగా పని చేసినప్పుడు ఆ విశ్వాస ఘాతకాన్ని తట్టుకోవడం కష్టం అని విదురుడు ఎప్పుడో చెప్పాడు.
మరి సుఖంగా ఉండాలి అంటే ఏం కావాలి అంటే ఈ కాలంలో మనం ఏం చెప్పుకుంటున్నామో విదురుడు ఆ కాలంలోనే వాటిని గుర్తించి చెప్పాడు. ధనం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి. చెప్పిన మాట విని తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు, అనుకూలవతి , ప్రియభాషిణి అయిన శ్రీమతి, ధనార్జనకు అవసరం అయిన విద్య ఉన్న జీవితం సుఖంగా సంపన్నవంతంగా ఉంటుంది అంటాడు విదురుడు.
కాలం మారింది. వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఐనా ఈ కాలానికి సైతం ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో విద్య ఉన్నవాడే సంపన్నుడు. నిరంతరం జీవితానికి ఉపయోగపడే విద్యను మించిన ధనం ఉండదు. ఒకసారి ఉద్యోగంలో చేరాము ఇక నేర్చుకోవలసిందేమీ లేదు. రిటైర్‌మెంట్ వరకు జీవితం గడిచిపోతుంది అనుకునే కాలం కాదు ఇది. విద్య అంటే ఇప్పుడు నిరంతరం అప్‌డేట్ కావాలి, కొత్త నైపుణ్యాలు అవసరం. విద్య మీకు ధైర్యం ఇస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. మిమ్ములను సంపన్నుడిని చేస్తుంది.

-బి.మురళి