నేను.. వౌన కౌపీనాన్ని
Published Saturday, 24 August 2019-1-
నేను
మహర్షిని
రమణాచలాన్ని
వౌనక్షేత్ర మునివాసాన్ని
అచల శిఖర అరుణ నేత్రాన్ని
మూలతాడున వౌన కౌపీనాన్ని
రాచపండున మృత్యువలయాన్ని
స్వాత్మతరించిన అమృతత్వాన్ని.
*
అరుణ శిఖరాన శ్రీచక్రాన్ని
శిఖర గర్భాన నవ మండలాన్ని
అష్ట దిగ్బంధన లింగ ప్రాకారాన్ని
అనాచ్ఛాదిత రూప విలాసాన్ని
గిరి ప్రదక్షిణన పథ సవ్వడిని
అంతర్వీక్షణన ఆత్మసంహితాన్ని
జ్యోతిదర్శనాన జ్యోతిర్మండలాన్ని.
*
రమణ మహర్షిని
రమణుల మహర్షిని
అరుణాచల భూతిని
రమణాచల విభూతిని
అగ్నియోగ వౌన యాగాన్ని
ఆత్మపుటల అక్షరాభ్యాసాన్ని
తారక రాజయోగ నిఘంటువుని.
-2-
నేను
స్వరూప జగతిని
నన్ను నేను దహించుకున్నవాడిని
మనసుకు అంత్యక్రియలు జరిపిన వాడిని.
*
కాను, సప్త్ధాతు తనువును
కాను, జ్ఞానేంద్రియ సంపదను
కాను, కర్మేంద్రియ సంహితను
కాను, పంచవృత్తుల పేటికను
కాను, పంచవాయువుల వేదికను
కాను, సుషుప్త అజ్ఞాన మండలాన్ని
కాను, స్వరూపాన్ని వీడిన దృశ్యాన్ని
కాను, కల్పిత సర్ప జ్ఞానాన్ని
అవును,
నేను అధిష్టాన రజు జ్ఞానాన్ని
నేను ఎవడను రమణుడను
-3-
నేను
స్వకల్ప సంకల్పాన్ని
నా జన్మ నా సంకల్పం
నా మరణం నా స్వకల్పం
*
నేను
సన్యసించిన నయనాన్ని
నా లోచనే స్వర్గం
నా ఆలోచనే నరకం
నా నవలోచనే నిర్వికల్పం
*
నేను
నడిచొచ్చిన నగ్నత్వాన్ని
కాను, ధరించిన కాషాయాన్ని
కాను, కరుణించిన జీవితాన్ని
అవును, అరుణ వేదాన్ని.
*
నేను
నిత్యక్రియల అతీతప్రజ్ఞను
నిన్నటిన కర్మను
నేటిన కర్తను
రేపటిన క్రియను
*
నేను
మార్మిక వౌనాన్ని
సమరస సహస్రారాన్ని
నర నర గురుత్వాన్ని
నవ నాడుల అమరత్వాన్ని
*
నేను
నిజ మనుజుడను
మాటన మర్మజ్ఞుడను
బాటన వౌన బోధను
లోకాన మరలిరాని వాడను
-4-
నేను ఎవరు?
నాలోకి నిష్క్రమణ
ఆత్మానే్వషణా పథం
ప్రశ్నలోని సమాధానం.
*
నేను ఎవరు?
నాలో నేను ఉండటం ఇహం
నాలో నేను లేకుండటం పరం
నాలో నేను ఉంటూ
ఉండకుండా పోవటం యోగం
అవును, జీవన యోగం ఇహానిది
యోగ జీవనం పరానిది
*
నేను ఎవరు?
తపన తపస్సు మహస్సు స్రోతస్సు
నేను మనసు వశమైతే తాపం
మనసు శరీరవశమైతే తపన
శరీరం ఆత్మవశమైతే తపస్సు
ఆత్మ పరవశమైతే మహస్సు
నేను నిర్వాణమైతే మహాస్రోతస్సు
*
నేను ఎవరు?
కాను, మీటుతున్న మనసును
కాను, మారుతున్న తనువును
కాను, తరలుతున్న వయసును
అవును, మారని తత్వాన్ని
ఇహ పర వౌనాన్ని.
*
నేను ఎవరు?
కాను, నాకు నేను భిన్నాన్ని
కాదు, నాకు ఏ ప్రకృతీ భిన్నం
అవును, నేను అభిన్నాన్ని
అభేదాన్ని
అభేద్యాన్ని
*
నేను ఎవరు?
సర్వాంగ సర్వసంగ పరిత్యాగిని
రూపాన పరిక్రమించిన అరూపాన్ని
గురుత్వాన్ని అందుకున్న ఆత్మదర్శిని
వ్యక్తిత్వాన్ని కమ్మేసిన గికత్వాన్ని.