S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవ్విపోదురు గాక..

‘ఒపీనియన్స్ ఛేంజ్ చేస్తే గానీ పొలిటీషియన్ కాడు..’ అని ‘కన్యాశుల్కం’లో గిరీశం చెప్పినట్టు.. నేడు మన రాజకీయ నాయకుల్లో చాలామంది తమ ఒపీనియన్స్‌ను తరచూ మార్చుకోవడమే కాదు.. అవకాశం దొరికినపుడు, అవసరం అనిపించినపుడు నిర్భీతిగా, నిర్లజ్జగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. పదవుల కోసమో, సొంత పనుల కోసమో కాదు.. ‘ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి, నియోజకవర్గం అభివృద్ధిని ఆశిస్తూ’ తాము పార్టీ మారుతున్నట్టు ఫిరాయింపులకు పాల్పడే నేతలు ‘అరిగిపోయిన రికార్డు’ వినిపిస్తూనే ఉన్నారు. కారణాలు ఏమైనా- ‘గోడ దూకే’ ప్రజాప్రతినిధుల వల్ల ప్రజాస్వామ్యం మాత్రం అపహాస్యం పాలవుతోంది. ప్రజలేమి అనుకొన్నా- ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు..’ అన్నట్టు మన రాజకీయ నేతల వైఖరిలో మార్పు రావడం లేదు.
***
ఎన్నికల రుతువులో గడపగడపకూ వచ్చే నాయకులు తాము చేయబోయేదీ, తమ పార్టీ లక్ష్యాలు వివరించి వోట్లు అడగడం, ప్రజలు వారిని నమ్మి గెలిపించడం.. గెలిచిన తర్వాత ఏదో ఒక సాకుతో అధికార పార్టీలోకి ఫిరాయించడం నిత్యం మనం చూస్తున్నదే. కనీసం టిక్కెట్ ఇచ్చి బలపరచిన పార్టీకి కూడా చెప్పాపెట్టకుండా ఫిరాయించి నేతలు మరో పార్టీలోకి మారడం ఇపుడు షరామామూలై పోయింది. గతంలో ఏదో ఒక సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించిన వార్తలు వినేవాళ్లం. ఇపుడు అనునిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఫిరాయింపులు జరగడం, ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం, మరో ప్రభుత్వం అధికారంలోకి రావడం, కొంత కాలం తర్వాత ఆ ప్రభుత్వాలు సైతం గద్దెదిగడం నిత్యకృత్యంగా మారింది.
ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ గత ముప్పై ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులు చూస్తునే ఉన్నాం. న్యాయస్థానాల వరకూ ఆ వివాదాలు వెళ్లినా చట్టంలో స్పష్టత కొరవడటంతో ప్రజాకాంక్ష నెరవేరడం లేదు. అప్పటికప్పుడు లాభాపేక్షతో పార్టీలు మారుతున్న నేతలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. అంతా తెలిసినా ప్రజలు తిరిగి వారిని ఎన్నుకోక తప్పని అనివార్య పరిస్థితి సైతం ఏర్పడుతోంది.
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా దాదాపు నెల రోజులపాటు కర్నాటక రాజకీయాలు అనేక మలుపులు తిరిగడంతో మరో మారు పార్టీ ఫిరాయింపుల వ్యవహారం విస్తృత చర్చకు తావిచ్చింది. ‘ఎవరి కంపు వారికి ఇంపు’ అన్నట్టు ఫిరాయింపుల రొంపి నుండి రాజకీయ ప్రయోజనాలు నొల్లుకోవడంలో అన్ని పార్టీలదీ ‘తిలా పాపం తలా పిడికెడు’గానే ఉంది. గత ఏడాది మేలో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజార్టీకి తొమ్మిది సీట్లు కొరతపడినా, ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. 78 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా జేడీఎస్‌తో స్నేహం కలిపి పట్టుమని 37 స్థానాలకే పరిమితమైన కుమార స్వామికి ముఖ్యమంత్రిత్వం అప్పగించింది. సీఎం పీఠం అధిష్ఠించినప్పటి నుంచీ కుమార స్వామి సర్కారు పరిస్థితి దినదిన గండంగానే సాగింది. అతి తక్కువ సీట్లు గెలిచిన కుమార స్వామికి సీఎం పదవిని అప్పగించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోయారు. అలక వహించిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, విశ్వాస పరీక్షలో కుమార స్వామి ఓటమి చెందడంతో చివరికి భాజపా నేత యడియూరప్ప సీఎం పదవిని చేపట్టారు.
ఫిరాయింపులకు ఏ పార్టీ కూడా అతీతం కాదని అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ‘శకునం చెప్పిన బల్లి తానే కుడితిలో పడ్డట్టు’ విలువల గురించి పరితపించిపోయే పార్టీలు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా వాసిగెక్కిన భారతదేశంలో ఫిరాయింపుల వ్యవహారం ఎవరికైనా ఏవగింపును కలిగించక మానదు. భారతీయ రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఒకటి. 1967 తర్వాత భారత రాజకీయాల్లో ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. దీనికి పరిష్కారంగానే 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పదో షెడ్యూలులో చేర్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. అయినా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగానే జరుగుతున్నాయి. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఫిరాయింపులకు అతీతం కానే కాదని చరిత్ర తేటతెల్లం చేస్తోంది.
ఫిరాయింపులు అంటే..?
రాజకీయాల్లో ఒక పార్టీ ‘మేనిఫెస్టో’ (ఎన్నికల ప్రణాళిక) ఆధారంగా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తర్వాత- మరో పార్టీ పట్ల విధేయత చూపడం లేదా మరో పార్టీలో చేరడం లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులైతే పార్లమెంటులో, శాసనసభ్యులైతే శాసనసభలో ఓటు వేయడం లేదా ఓటు వేయకుండా గైర్హాజరు కావడాన్ని పార్టీ ఫిరాయింపుగా వ్యవహరిస్తారు. పార్టీ ఫిరాయింపులు లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీలకే పరిమితం కాలేదు. తాజాగా తెలంగాణలోని శాసనమండలిలోనూ ఫిరాయింపులు జరిగాయి. పార్టీ గుర్తులేకుండా స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికైన సభ్యుడు ఏదైనా పార్టీలో చేరినా, నియామకం జరిగిన ఆరు నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినా దానిని పార్టీ ఫిరాయింపుగానే పరిగణిస్తారు.
గత చరిత్ర
భారత ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులు స్వాతంత్య్రం రాకపూర్వమే ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937లో శాసనసభల ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో కొంత మంది ముస్లిం లీగ్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్‌లో చేరి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అంతకంటే ముందే మాంట్‌ఫోర్టు సంస్కరణల సమయంలోనే సెంట్రల్ లెజిస్లేచర్ సభ్యుడు శ్యాంలాల్ నెహ్రూ కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపొంది, బ్రిటిష్ వర్గం వైపు ఫిరాయించారు. కాంగ్రెస్ వర్గం నాయకుడిగా ఉన్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆ చర్యను దుయ్యబట్టి ఆయనను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు.
1948లో పార్టీ వీడిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సభ్యులు అంతా పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. 1950లో ఉత్తరప్రదేశ్‌లో 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి ‘జన కాంగ్రెస్ పార్టీ’ని ఏర్పాటు చేసుకున్నారు. 1958లో ఏకంగా 98 మంది సభ్యులు అధికార పార్టీ నుండి బయటకువచ్చి సంపూర్ణానంద ప్రభుత్వాన్ని కూలదోశారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుండి ట్రావెన్‌కోర్ -కొచ్చిన్‌కు చెందిన తనూ పిళ్లై కూడా పార్టీ ఫిరాయించారు. ఫిరాయింపుల ప్రకంపనలతో ప్రముఖ పార్టీలు అల్లకల్లోలానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1967 మధ్యలో ఉత్తర ప్రదేశ్, మద్రాస్ , కేరళ, రాజస్థాన్ లాంటి అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు రాజీనామాలు చేయాల్సి రావడం లేదా మెజార్టీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి , పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజార్టీని సాధించడం వంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మద్రాసు రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికల (1952) తర్వాత మెజార్టీ లేకున్నా గవర్నర్ ఆహ్వానంతో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన పార్టీ ఫిరాయింపులతో ఆయన మెజార్టీ సాధించారు. మరికొన్ని సందర్భాల్లో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో స్థానం సంపాదించడమేగాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఉదంతం సందర్భం హర్యానాలో చోటుచేసుకొంది.
భారత రాజకీయాల్లో 1967 సంవత్సరాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. 1967లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేరళ, మద్రాస్ , పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మెజార్టీని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 187కి 165 స్థానాలు, అస్సాంలో 126కు 73, గుజరాత్‌లో 168కి 93, హర్యానాలో 81కి 58, జమ్మూ కశ్మీర్‌లో 75కు 61, ఎంపీలో 296కు 167, మహారాష్టల్రో 270కి 203, మైసూరు రాష్ట్రంలో 260కి 126 సీట్లను కాంగ్రెస్ సాధించింది. లోక్‌సభలో 520 స్థానాలకు గానూ 283 స్థానాలను కాంగ్రెస్ సాధించింది. ఎన్నికల్లో మెజార్టీ సాధించకపోయినా అతి పెద్ద పార్టీగా అవతరించి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, పార్టీ ఫిరాయింపుల ద్వారా కావల్సిన మెజార్టీని సాధించుకుందని పరాస్ దివాన్ రాసిన ‘ఆయారాం గయారాం ది పాలిటిక్స్ ఆఫ్ డిఫెక్షన్’ అనే గ్రంథంలో వివరించారు. పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు రద్దుకావడం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడటం సాధారణ విషయంగా మారిపోయింది. మూల్‌చంద్ శ్యాం రాసిన ‘పాలిటిక్స్ ఆఫ్ డిఫెక్షన్స్ అండ్ డెమొక్రసీ’ గ్రంథం ఆధారంగా 1957 నుండి 1967 వరకూ కాంగ్రెస్ పార్టీ నుండి 92 మంది పార్టీ మారగా, 419 మంది కాంగ్రెస్‌లో చేరారు. 1967లో 175 మంది కాంగ్రెస్‌ను వీడగా, 139 మంది కాంగ్రెస్‌లో చేరారు. అదే కాలంలో ప్రజాసోషలిస్టు పార్టీ నుండి 93 మంది వేరే పార్టీలో చేరగా, పీఎస్పీలోకి 11 మంది చేరారు. నాలుగో సార్వత్రిక ఎన్నికలకు, ఐదో సార్వత్రిక ఎన్నికలకు మధ్యలో 2000 సార్లు పార్టీ ఫిరాయింపులు జరిగినట్టు రికార్డు అయింది. 1971 నాటికి దాదాపు 50 శాతం మంది పార్టీలు మారిపోయారు. 1972 నాటి రికార్డులు చూస్తే అన్ని రాష్ట్రాల్లో కలిపి 4వేల మంది పార్టీలు ఫిరాయించారు, కొంత మంది స్వల్పవ్యవధిలోనే ఐదుమార్లు పార్టీ మారిన సందర్భాలున్నాయి.
పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు రద్దుకావడం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం సాధారణ విషయంగా మారిపోయింది. 1967లో మార్చి -డిసెంబర్ మధ్య తొమ్మిది నెలల కాలంలో మొత్తం 3447 మంది శాసనసభ్యుల్లో 314 మంది అంటే 9 శాతం మంది ఫిరాయింపులకు పాల్పడ్డారు. 1972-77 మధ్య కాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక శాసనసభ్యుడు ఐదు రోజుల్లో ఐదు పార్టీలు మారాడు. ఇలా మన దేశ రాజకీయాల్లో ‘ఆయారాం గయారాం’ సంస్కృతి ప్రాచుర్యం పొందింది. అప్పటి గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే యూపీలో 352 మంది, ఎంపీలో 262 మంది, బిహార్‌లో 202 మంది, గుజరాత్‌లో 158 మంది, ఏపీలో 130 మంది, పంజాబ్‌లో 130 మంది, హర్యానాలో 109 మంది, మైసూరులో 102 మంది, ఒడిశాలో 64 మంది , కేరళలో 40 మంది, రాజస్థాన్‌లో 31 మంది, తమిళనాడులో 20 మంది, మహారాష్టల్రో 20 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 12 మంది, అస్సాంలో నలుగురు, జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు పార్టీలు ఫిరాయించినట్టు పరాస్ దావన్ తన పుస్తకంలో వివరించారు.
2016లో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతకు పార్టీ ఫిరాయింపులే కారణమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 45 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 44 మంది ముఖ్యమంత్రి సహా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్‌లో విలీనం అయ్యారు. తమిళనాడులో అనిశ్చితి, కొంతకాలం గోవాలో పరిస్థితులు మనకు తెలిసినవే. రాష్ట్రాల్లోనే కాకుండా ఈ ఫిరాయింపుల సంస్కృతి కేంద్రంలోనూ కొంతకాలం కొనసాగింది. 1990-95 మధ్యకాలంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. 1990లో చంద్రశేఖర్ ప్రధాన మంత్రి కావడానికి, 1991లో పీవీ నరసింహరావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 1995 నాటికి మెజార్టీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులే కారణం.
ఎందుకీ ఫిరాయింపులు?
పార్టీ సిద్ధాంతాలతో పనిలేకుండా అనైతికంగా, అవకాశవాదంతో అధికారం కోసం ప్రజా ప్రతినిధులు పార్టీలు మారుతున్నారనేది సుస్పష్టం. ప్రభుత్వంలో పలుకుబడి, తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు, ధనం, ఇతర అంశాలు ఫిరాయింపులకు కారణమవుతున్నాయి. సంఖ్యాపరంగా శాసనసభలో సాధారణ మెజార్టీకి దగ్గరగా ఉన్నట్టయితే మెజార్టీ సాధించేందుకు ఎక్కువగా ఫిరాయింపులు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం నిరంకుశ నిర్ణయాలకు నిరసనగానూ ఫిరాయింపులు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్నపుడు పార్టీ అధికారంలోకి రాదని భావించినా లేదా అదే పార్టీలో తమకు భవిష్యత్ లేదనుకున్నా కూడా ఫిరాయింపులు జరగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోకి స్వతంత్ర అభ్యర్ధులు గోడ దూకడం సర్వ సాధారణం. ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా ఫిరాయింపుల చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకుని ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయకుండానే అధికార పార్టీ పట్ల విధేయత ప్రకటించి మంత్రి పదవులు సంపాదించిన వైనం మనం తెలంగాణ రాష్ట్రంలో చూశాం. ప్రజలు కూడా పార్టీ ఫిరాయింపులను పెద్ద తప్పుగా భావించకపోగా, తిరిగి ఆ నేతలను ఎన్నుకోవడం విచిత్రం. ఇవి కాకుండా పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వ0 లేకపోవడం, పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ లోపించడం, ముఠా రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు కూడా ఫిరాయింపులకు కారణమవుతున్నాయి.
వైబీ చవాన్ కమిటీ
అప్పటి హోం మంత్రి వైబీ చవాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో న్యాయశాఖా మంత్రి గోవింద మీనన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రామ్ సుభాగ్ సింగ్, పెండేకంటి వెంకట సుబ్బయ్య, జయప్రకాశ్ నారాయణ్, హెచ్‌ఎన్ కుంజ్రు, సీకే దఫ్తరి, హెచ్‌ఎం సీర్వాయి, ఎంసీ సెతల్వాద్, మోహన్ కుమార మంగళం, ప్రొఫెసర్ ఎన్‌జీ రంగా (స్వతంత్ర పార్టీ), ప్రొఫెసర్ బలరాజ్ మధోక్ (జనసంఘ్), ఎస్‌ఎన్ ద్వివేది (పీఎస్పీ), మధూ లిమాయే (ఎస్‌ఎస్‌పీ), భూమేష్ గుప్తా (సీపీఐ), పి. రామమూర్తి (సీపీఎం), అంబజ్‌హగన్ (డీఎంకే), ఎన్‌సీ ఛటర్జీ (ప్రోగ్రెసివ్ గ్రూప్), రఘువీర్ శాస్ర్తీ(నిర్దాలియా సంఘటన్), డాక్టర్ కర్నిసింగ్ (ఇండిపెండెంట్) సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ఆరుసార్లు సమావేశమై విస్తృతంగా చర్చించిన తర్వాత 1969 ఫిబ్రవరి 18న లోక్‌సభకు నివేదికను సమర్పించింది. ఫిరాయింపులను నిషేధించేందుకు రాజకీయ పార్టీలకు ప్రవర్తనా నియమావళి ఉండాలని, దిగువ సభలో సభ్యులు కాని వారిని మంత్రివర్గంలోకి తీసుకోరాదని సూచించారు. వైబీ చవాన్ కమిటీ నివేదిక ప్రకారం 1967 మార్చి, 1968 ఫిబ్రవరి మధ్య 12 నెలల కాలంలో 438 మంది శాసనసభ్యులు దేశంలో పార్టీలు ఫిరాయించారు. పదవీ వ్యామోహమే ఫిరాయింపులకు ఆ రోజుల్లో ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో పార్టీ ఫిరాయించిన 210 మంది సభ్యుల్లో 116 మంది మంత్రులు అయ్యారు. వీరి సహకారంతోనే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విచిత్రం ఏమంటే ఈ పార్టీల ప్రభుత్వాలే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని పట్టుబట్టాయి. 1973లో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినా అది చట్టంగా ఆమోదం పొందకముందే 1977లో లోక్‌సభ రద్దయింది. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రభుత్వం ఒక క్యాబినెట్ కమిటీని నియమించింది. 1978 ఆగస్టు 28న ఫిరాయింపుల నిరోధానికి 48 వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. చాలామంది సభ్యులు బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో బిల్లును సభ ముందు ఉంచలేకపోయారు.
1984 డిసెంబర్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలైంది. 1985 జనవరిలో రాజ్యాంగంలో 52వ సవరణ బిల్లుగా మూడోసారి లోక్‌సభ ముందుకు వచ్చింది. లోక్‌సభలో 1985 జనవరి 30న, మరుసటి రోజు రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదం పొందడంతో అది చట్టంగా మారింది. 1985 మార్చి 1 నుండి అమలులోకి వచ్చింది. దీంతో రాజ్యాంగంలోని 101, 102, 190, 191 అధికరణాల్లో సవరణలు చేశారు. రాజ్యాంగంలోని 102(2)వ నిబంధన ద్వారా పార్లమెంటు సభ్యులు, 191(2) నిబంధన ద్వారా రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతలకు వివరణను 10వ షెడ్యూలులో చేర్చారు. 101(1)(ఈ), 191(1)(ఈ) ద్వారా అనర్హత చట్టానికి సంబంధించిన అధికారాన్ని పార్లమెంటుకు దఖలు చేశారు. ఆ విధంగా 10వ షెడ్యూలు రాజకీయ ఫిరాయింపుల చట్టానికి చిరునామాగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం-1985 ప్రకారం ఏదైనా పార్టీ తరఫున ఎన్నికై, ఆ తర్వాత స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం లేదా పార్టీ అనుమతి లేకుండా గైర్హాజరైనపుడు ఈ అనర్హత చట్టం వర్తిస్తుంది. అయితే పార్టీ మొత్తం సభ్యుల్లో మూడోవంతు చీలిక వర్గంగా వేరుపడినపుడు, పార్టీ మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల సభ్యుల అంగీకారంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు విలీనం అయినపుడు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ తమ పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేసినపుడు లేదా పదవీకాలం తర్వాత తిరిగి అదే పార్టీలో చేరినపుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. చట్టసభలో సభ్యత్వం రద్దు కాదు. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై ఎగువ సభలో చైర్మన్, దిగువ సభలో స్పీకర్‌లకే నిర్ణయాధికారం ఉంటుంది. అనర్హతకు సంబంధించిన నిర్ణయాధికారం న్యాయస్థానాలకు లేదు. స్పీకర్‌కు నిర్ణయాధికారం ఉన్నా, ఆ నిర్ణయాలపై న్యాయస్థానాలు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం ఉంటుందని కిహోటో హోలాహాన్ వెర్సస్ జాచిహు కేసు(ఏఐఆర్ 1993 ఎస్సీ 412) లోనూ, రవి ఎస్ నాయక్ వెర్సస్ భారత ప్రభుత్వం (ఏఐఆర్ 1994 ఎస్సీ 1558) కేసులోనూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విశ్వనాథన్ వెర్సస్ స్పీకర్ ఆఫ్ తమిళనాడు అసెంబ్లీ (1996- ఎస్సీ 353), డాక్టర్ కాశీనాథ్ జీ జాల్మీ వెర్సస్ గోవా అసెంబ్లీ స్పీకర్ (1993-ఎస్సీ 703), రాజేంద్రసింగ్ రాణా వెర్సస్ స్వామి ప్రసాద్ వౌర్యా అండ్ అదర్స్ (2007-ఎస్సీసీ 270), కులదీప్ నయ్యర్ వెర్సస్ భారత ప్రభుత్వం కేసులో శాసనసభ్యుడు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా పదో షెడ్యూలులోని అనర్హత వేటు వేసే చట్టం వర్తించదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందుకే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి శాసనసభ్యులకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉండదు.
ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మలేషియా, యుకేల్లో ఫిరాయింపులున్నా, అక్కడ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా పార్టీ మారగానే పదవిని కోల్పోతాడు. అయితే బంగ్లాదేశ్, కెన్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో మాత్రం ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉంది.
1985లో రూపొందించిన చట్టంలో లొసుగులు ఉన్నాయని భావించిన కేంద్రప్రభుత్వం 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరిన్ని మార్పులు చేసింది. రాజ్యాంగంలోని 75(1బి)ని చేర్చడం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులైన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా సభ పదవీకాలం ముగిసే వరకూ లేదా తిరిగి సభకు ఎన్నికయ్యే వరకూ నియమించరాదు. రాజ్యాంగంలోని 361(బి) నిబంధన ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా అనర్హుడైన చట్టసభ సభ్యుడిని అనర్హత పొందిన నాటి నుండి పదవీకాలం ముగిసే వరకూ లేదా తిరిగి సభకు ఎన్నికయ్యే వరకూ లాభదాయకమైన రాజకీయ పదవుల్లో నియమించరాదని చట్టాన్ని సవరించారు. 1990లో దినిష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలపై ఇచ్చిన నివేదిక, ఎన్నికల చట్టాల్లో సంస్కరణలపై ‘లా కమిషన్’ ఇచ్చిన 170వ నివేదిక, 2002 మార్చి 31న రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ ఇచ్చిన నివేదిక ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి అనేక సూచనలు చేశాయి.
ఆగని ఫిరాయింపులు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత కూడా అవి ఆగకపోవడానికి అనేక కారణాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసే నిర్ణయాధికారం స్పీకర్‌కు ఉండటం, స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయాలను తీసుకునే కాలవ్యవధి ఆధారపడి ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలు నెలలు లేదా వారాలు పట్టొచ్చు. నిర్ణయాలకు కాల వ్యవధి అవసరం. నిర్ణయాధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల సంఘానికి లేదా స్వతంత్ర కమిషన్‌కు అప్పగించాలి. ఫిరాయింపులు మూడింట రెండొంతులు చట్టబద్ధం కావడం వల్ల కూడా వ్యవహారం అభాసుపాలవుతోంది. కనుక ఒక పార్టీ మేనిఫెస్టోపై ఎన్నికై మరో మేనిఫెస్టో ఉన్న పార్టీలో విలీనం కావడాన్ని రద్దు చేయాలి.
ఏం చేయాలి?
రాజకీయ అస్థిరతకు, అసమర్థతకు, అవినీతికి, అనైతిక పాలనకు, రాజకీయ పదవుల ప్రాముఖ్యత తగ్గిపోవడానికి, అధికారుల ప్రాబల్యం పెరగడానికి, ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీ కాకుండా నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే- పార్టీ ఫిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాలి. పార్టీ మారే అవకాశానికి తావివ్వరాదు, ఒక వేళ మారాలంటే ఎన్నికైన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో దిగి గెలవాల్సిందే అనే రీతిన చట్ట సవరణ చేయాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పదికాలాల పాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడాలని పార్టీలు భావించనంతకాలం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటాయి.
*

తెలుగువాడితోనే మేల్కొలుపు
నిజానికి పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల మీద చర్చ మొదలుపెట్టిందే తెలుగువాడు. 1967 ఆగస్టు 11వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలుగువాడైన పెండేకంటి వెంకటసుబ్బయ్య ఈ అంశంపై అనధికార తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చ మొదలు పెట్టారు. దాంతో అదే ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో దేశ రాజధానిలో జరిగిన స్పీకర్ల సభలో ఒక తీర్మానం ఆమోదించారు. పెండేకంటి ప్రవేశపెట్టిన చర్చతో డిసెంబర్ 8న లోక్‌సభలో ఒక తీర్మానం చేస్తూ సభ్యులు పార్టీ ఫిరాయించడాన్ని నిషేధించేందుకు తగిన సలహా ఇచ్చే నిమిత్తం పార్టీ నేతలతో, రాజ్యాంగ నిపుణులతో ఒక కమిటీ వేయాలని సభ కోరింది. దీని ఫలితమే వైబీ చవాన్ కమిటీ. ఈ కమిటీకి సంబంధించి ఆనాటి లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్ ‘ది పాలిటిక్స్ ఆఫ్ పవర్, డిఫెక్షన్స్ అండ్ స్టేట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో కళ్లకు కట్టినట్టు రాశారు.
పీవీకీ తప్పలేదు..
తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు లోక్‌సభలో రెండుమార్లు విలీనం అయ్యారు. మొదటిసారి 1992లో విలీనం అయ్యారు. ఆనాడు లోక్‌సభలో పార్టీ చీలిపోయిన అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పీవీ నరసింహరావు మైనార్టీ ప్రభుత్వం నడుపుతున్నారు. ఆ ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాసం తీర్మానం విషయంలో టీడీపీ సభ్యులు రాజీపడ్డారు. తీర్మానంపై ఓటింగ్ సమయంలో 13 మంది టీడీపీ సభ్యుల్లో 8 మంది గైర్హాజరయ్యారు. వీరంతా తర్వాత భూపతిరాజు విజయకుమార్ రాజు నేతృత్వంలోని ఒక వర్గంగా ఏర్పడి లోక్‌సభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని అప్పటి స్పీకర్ శివరాజ్ వీ పాటిల్‌ను కోరారు. తర్వాత తాము కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నామని దాని పేరు తెలుగుదేశం (వీ) అని పేర్కొనడంతో స్పీకర్ దానిని గుర్తించారు. 1992 ఆగస్టు 20న తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవ్వాలని నిర్ణయించిందని, దానికి అంగీకరించాలని స్పీకర్‌ను కోరారు. ఆగస్టు 24న పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి టీడీపీ(వి) సభ్యులు కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రకటించారు. ఆగస్టు 27న స్పీకర్ శివరాజ్ పాటిల్ ఆ విలీనాన్ని ఆమోదించారు. ఆరోజు జరిగిన దానికీ ఇటీవల (2019 జూన్ 20న) నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు భాజపాలో విలీనం అయిన ఉదంతానికి ఫిరాయింపు విధానంలో ఏ మాత్రం తేడాలేదు. ఆ రోజు పీవీ నరసింహరావు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించగా, ఈనాడు నేతలు రాజకీయ స్వభావాన్ని మార్చుకున్నారు. ప్రత్యేర్థి పార్టీని ఓడించడం అనే లక్ష్యం కంటే మరికొంచెం పెద్దదిగా ఎదుటి పార్టీని నిర్మూలించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతోంది.

-బీవీ ప్రసాద్ 98499 98090