S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరస్వతీ తత్త్వం

‘ఈ సరస్వతి ఎవరు?’
‘బ్రహ్మపత్ని’
‘బ్రహ్మ ఎవరు?’
‘విష్ణుపుత్రుడు’
‘ఐతే, ఈ విష్ణువెవరు?
‘త్రిమూర్తుల్లో ఒకరు’
‘ఎవరా త్రిమూర్తులు?’
‘బ్రహ్మ, విష్ణువు, శివుడు’
‘ఈ ముగ్గురేం చేస్తారు?’
‘బ్రహ్మ సృష్టికీ, విష్ణువు స్థితికీ, శివుడు లయకీ కారకులు’
‘బాగుంది. ఐతే ఈ సరస్వతి తల్లిదండ్రులెవరు?’
‘తల్లి ఎవరో తెలీదు. కానీ తండ్రి మాత్రం బ్రహ్మ. ఆమె బ్రహ్మపుత్రిక’
‘అదేమిటి? ఆమె బ్రహ్మపత్ని అన్నారు కదా?’
‘అవును నిజమే. ఆమెకు తండ్రీ అతడే! పెనిమిటీ అతడే!’
‘ఇదేమిటి విడ్డూరంగా? తన కూతుర్నే తాను పెళ్లాడాడా బ్రహ్మ?’
‘అవును’
‘ఎందుకని?’
‘తెలీదు’
‘పాపం కదా?’
‘దేవతలకు పాపపుణ్యాలుండవు’ (అంతేకాదు ఆమె విశ్వమాత కూడా)
‘పోనీ, బ్రహ్మకు తల్లిదండ్రులెవరు?’
‘బ్రహ్మకు తండ్రి ఉన్నాడు కానీ, తల్లి లేదు’
‘అదేమిటి?’
‘లక్ష్మీదేవి ఉంది. కానీ ఆమె ఇతనికి కని పెంచిన తల్లి కాదు’
‘మరి?’
‘విష్ణు గర్భంలోంచి ఒక అందమైన, సున్నితమైన తామరతూడు పుట్టుకొచ్చింది. అది అలా ఆకాశంలోకి పెరుగుతూ పెరుగుతూ పైపైకి వెళ్లింది. అప్పుడు దాని చివర్లో ఒక మొగ్గ వేసింది. ఆ మొగ్గ వికసించి, ఒక వెలుగులీనే అందాల కమలమై పోయింది. ఆ కమల గర్భంలోంచి పుట్టుకొచ్చాడీ చతుర్ముఖ బ్రహ్మ. అందుకే ఆయనకి కమలాసునుడనీ, కమలయోని అని సంస్కృతంలోనూ, తమ్మిచూలి, తెలిదమ్మి గద్దియ గొలువుండు రాయడనీ’ తెలుగులోనూ పేర్లు’
‘ఐతే, లక్ష్మీదేవిని కూడా కమలయనీ, కమలాసనియనీ, పద్మాసనియనీ అంటాం కదా?’
‘నిజమే. కమలాన్ని చేతిలో ధరించింది కాబట్టి ‘కమల’యనీ, కమలమే ఆసనంగా గలది కాబట్టి ‘కమలాసని’యనీ అంటాం.’
‘అదేమిటి? ఇద్దరూ ఒకే కమలంపై కూర్చుంటారా?’
‘కాదు. మరో కమలంపై కూర్చుంటుంది లక్ష్మి’
‘ఇవేం కథలండోయ్ బాబూ?.. పోనీ, ఈ బ్రహ్మా సరస్వతులకేమైనా సంతానం ఉందా? లేదా?’
‘లేకేం. బ్రహ్మ మనస్సు నుండి సప్తర్షులూ, ప్రజాపతులూ జన్మించారు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడే కదా?’
‘బాగుంది. విష్ణువుకి నాభి నుండి కొడుకు పుడితే, వీరికి మనస్సు నుండి పుట్టారన్న మాట’
‘అవును’
‘ఎందుకిలా, అర్థంపర్థం లేని కథలల్లి, మన తలలకెత్తి, మన ప్రాణాలు తోడేస్తున్నారండీ మన పెద్దలు?’
‘అలా అనకండి. వాటికి అర్థమూ ఉంది. అంతరార్థమూ ఉంది. చివరికి పరమార్థమూ ఉంది. కానీ, వాటిని పట్టుకొని, వివరించినవాడూ విశే్లషించినవాడూ లేడు.’
‘బాగుంది. ఐతే, ఈ పురాణాల కర్త వేదవ్యాసుడంటారు కదా? ఆయన ఇలాంటి కథల్ని ఎందుకు సృష్టించాడంటారు?’
‘ఆయన తప్పు లేదు. తప్పంతా మనదే! వాళ్లు మార్మికంగా చెప్పారు. మనం ఆలోచిస్తామనీ, తర్కిస్తామనీ, అర్థాన్నీ, అంతరార్థాన్నీ, ప్రతీకాత్మకతనీ పట్టుకొంటామనీ, వాటిని నెమరేస్తూ ఆనందార్ణవంలో తలమునకలవుతామనీ భావించారు వాళ్లు’
‘ఐతే ఎలాగండి బాబూ?’
‘అందుకే తాళంతోపాటు తాళం చెవినీ ఇచ్చినట్లు, తర్క శాస్త్రాన్ని కూడా మనకు ఇచ్చి వెళ్లారు కదా?’
‘ఏమిచ్చారో ఏమో! ఏ తర్క శాస్త్ర పండితుడూ నోరు విప్పడు కదా?’
‘‘నిజమే. మీరన్నట్లుగా మనం మన తలపాగాల క్రిందా, తలగడల క్రిందా, శిరస్త్రాణాల క్రిందా మన తలల్నీ, మేధస్సునీ కప్పిపెట్టాం. మన తర్కశాస్త్ర పరిజ్ఞానాన్ని తుంగలో త్రొక్కేశాం. అన్వయం లేదు కదా! అందువల్ల శాస్త్రం శాస్త్రంగానే మిగిలిపోయింది. యుగ యుగాలు గడిచినా, మన ఆర్ష సాహిత్యం ఒక అంతుబట్టని రహస్యం (మిస్టరీ)గానే మిగిలిపోయింది.’
‘ఎందుకని?’
‘చెప్పానుగా! అదొక మార్మిక సాహిత్యం. ఒక గుప్తనిధి. అనంత పద్మనాభాలయం సంగతి తెలుసు కదా? అలాంటిది. త్రవ్విన కొద్దీ రహస్యాలే! రతనాలే! మరో విధంగా అదొక మహాప్రహేళిక. అనగా, ఒక పెద్ద పొడుపు కథ. దాని పొడుపు అందరికీ తెలుసు. కానీ విడుపు నూటికొక్కనికి కాదు, కోటికొక్కనికీ తెలీదు. తెలిసినవాడు చెప్పడు. తెలియని వాడు వాగుతూనే ఉంటాడు. రాళ్లేస్తూనే ఉంటాడు. అందువల్ల మన సాహిత్యం కోతి చేతి కొబ్బరికాయైంది. పిట్టకథల్ని చెప్పేవారే కానీ, అర్థాన్నీ, అంతరార్థాన్నీ విడమర్చి చెప్పేవారే కనిపించరు.’
‘ఇంతకీ ఈ కథలకు అంతరార్థం ఏమిటంటారు?’
‘విష్ణవ్యాప్తౌ’ కాబట్టి తన శక్తిత్రయమైన వెలుతురూ, వేడిమీ, విద్యుత్తుల చేత విశ్వమంతా వ్యాపించే, సూర్యనక్షత్రమే ఈ విష్ణువు. అతని తల తూర్పున ఉంటే పాదాలు (అనగా కిరణాలు) పశ్చిమాన ఉంటాయి. పశ్చిమాన తల ఉంటే పాదాలు తూర్పున ఉంటాయి. అతడే విష్ణువు. అతడు క్షీరసాగరంలో వేయిపడగల శేషునిపై శయనించి ఉంటాడు. ఇచట ‘క్షీర’మనగా వెలుగు. క్షీరసాగరమనగా వెలుగుల సాగరం. చివరికి క్షీరసాగర మథనమన్నా వెలుగుల మధనమే. ‘తక్షకుడ’న నల్లని మేఘమే. ‘మంథర పర్వత’మన ధరిత్రియే. అది ఎప్పుడూ గిరగిరా తిరుగుతూ, చీకటి వెలుగుల్ని మథిస్తూ ఉంటుంది కదా? దేవదానవులనగా వెలుగూ, చీకట్లకు ప్రతిరూపాలైన తెల్లని, నల్లని మబ్బులే! అప్పుడు విషం పుట్టిందంటే చీకట్లు పుట్టాయనే అర్థం. వాటిని సూర్యప్రతీకయైన శివుడు గ్రోలాడనీ, ఆ వేళ సూర్యుడే (విష్ణువే) చంద్రుడై, అనగా జగన్మోహినియై, అమృతాన్ని (వెనె్నల వెలుగుల్ని) దేవతలకి వడ్డించాడనీ దాని అంతరార్థం?’
‘అవునా?’
‘అవును. ఇక్కడ ‘మంథర’ ధరిత్రి యనుకొన్నాం కదా? ఈ ‘మంథర’యే మళ్లీ మనకు రామాయణంలో కనిపిస్తుంది. ‘వేదమే రామాయణం’గా అవతరించింది కదా? అందుకే.
శ్లో: వేదవేద్యే పరేపుంపి జాతే దశరథాత్మజే॥
వేదః ప్రాచేత సాదాసీతాః సాక్షాత్ రామాయణాత్మనా’ అన్నారు.
క్షీర సాగర మథనంలో మొదట విషం పుట్టినట్లుగా కైకేయి మొదట్లో మొదట విషపుటాలోచనలు పుట్టాయి. ఆ విషాన్ని సూర్యప్రతీకయైన రాముడు స్వీకరించాడు. చివర్లో మళ్లీ అమృతవృష్టియే! అది విశ్వకళ్యాణ కారకమైన శ్రీ సీతారాముల పట్ట్భాషేకం సుభిక్షమైన రామరాజ్యం’
‘ఐతే ఈ మంథర పర్వతమెలా అయింది?’
‘పర్వత’మంటే ఒక్క కొండే కాదు. ఆకాశమూ పర్వతమే. భూమి కూడా పర్వతమే. బాలకృష్ణుడెత్తిన గోవర్థన పర్వతమిదే! రావణుడెత్తిన కైలాస పర్వతమూ ఇదే! చివరికి హనుమ తన అరచేత తెచ్చిన సంజీవనీ పర్వతమిదే!’
(అంతేకాదు మన శరీరమూ ఒక పర్వతమే) ధరిత్రి లోపలా, బయటా ఆకాశమే! శూన్యమే!! అనగా ఆమెయే వేదాల్లోని ‘ద్యావాపృథ్వీ’ అనగా ఆకసంతో కూడిన ధరిత్రి’.
‘నిజమా?’
‘నిజం. ఇక మళ్లీ విషయానికొస్తే, లెక్కకందని మబ్బులే శేషుని వేయి శిరస్సులు. ఆ మబ్బులు మెత్తగాను ఉంటాయి. విషం (నీరు) కక్కుతూనూ ఉంటాయి. పొట్టపైన ప్రాకుతుంటాయి. అందుకే అవి ఉరగములు లేదా భుజంగములు. కాబట్టి మబ్బుల పానుపే శేషశయ్య’
‘బాగుంది. ఐతే ఆ తామరతూడూ, కమలం విషయమో?’
‘అదే చెప్పబోతున్నా. అతని నాభిలోంచి సున్నితమైన సుదీర్ఘమైన కిరణాలు అనంతాకాశంలోకి దూసుకెళ్తుంటాయి. అవే తామరతూళ్లు. వాటి చివరన ప్రకాశం వికసిస్తుంది ఒక మనోహర పుష్పరాజంలా. అదే కమలం. ఆ తెల్లని కమలంలోంచి పుట్టుకొచ్చినవాడే చంద్రుడు. అతడే చతుర్ముఖ బ్రహ్మ. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. అందువల్ల అతడు నపుంసకుడని పండితుల అభిప్రాయం. కాబట్టి మిగతా దేవతలకు వలె అతనికి గుళ్లూ లేవు. అర్చనలూ లేవు. చివరికి సంతానమూ లేదు.’
‘ఐతే ఈ బ్రహ్మకు నాలుగు ముఖాలేమిటి?’
‘ఒక బంతిని చేతిలోకి తీసుకొని చూడండి. దానికి నాలుగువైపులా నాలుగు ముఖాలుంటాయి. అలాగే చంద్రునికీ ఉంటాయి. అందుకే అతన్ని ‘చతుర్ముఖ బ్రహ్మ’ అంటున్నాం.
అతనిలోంచి పుట్టుకొచ్చిన ప్రకాశం అతని చుట్టూ ఒక ప్రవాహంలా తిరుగుతూ ఉంటుంది. అదే వెనె్నల. (ఈ వెనె్నలే విశ్వయజ్ఞంలోని సోమరసం. ‘సోమః’ అనగా చంద్రుడు. సోమరసమనగా వెనె్నల. ఇది వర్షధారలతో కలిసి, సముద్రమనే కళశంలో కురుస్తుంది. ఆదిత్యుడనే ఇంద్రునకు సమర్పింపబడుతుంది.
అతనికి సోమరసమంటే ప్రాణం. రోజూ దాన్ని సేవిస్తాడు. అమావాస్య నాటికి చంద్రుడనే గినె్న ఖాళీ అవుతుంది. (నిరుక్తమ్). ఆమెయే సరస్వతి. ఆమె చంద్రునిలోంచి పుట్టింది కాబట్టి అతనికి కూతురు వంటిది. కానీ, ఆమె అతని చుట్టే తిరుగుతోంది. ఛాయలా అతనే్న అనుసరిస్తోంది కాబట్టి అతని ధర్మపత్ని అయింది. తన చుట్టూ తిరిగే సరస్వతిని చూడ్డానికని అతనికి నాలుగు ముఖాలు పుట్టాయిట! అంటే, సరస్వతిని (అనగా సాహిత్యాన్ని లేదా వాఙ్మయాన్ని) అర్థం చేసుకోడానికి నాలుగు వేదాలూ తెలియాలి. నాలుగు దృక్కోణాలూ తెలియాలని దాని అంతరార్థం.
చివరికి శివకేశవుల విషయమైనా అంతే! వీరిరువురూ సూర్యప్రతీకలే. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు (శ్లో.ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః.. అని కదా) అందువల్ల వారివారి ప్రకాశాలే వారివారి ధర్మపత్నులు.
సూర్యప్రకాశం సూర్యున్ని వదిలి దూరంగా వెళ్తూంటుంది. శివునిపై అలిగి పార్వతి, విష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కూడా కొంతకాలం దూరంగా వెళ్లి మళ్లీ వచ్చి కలిసిపోతుంటారు.
‘ఐతే సరస్వతికి అనేక నామాలున్నాయి కదా? వాటి మాటేమిటి?’
‘మాటది ప్రవాహ స్వరూపం. కాబట్టి వాగ్దేవి సరస్వతి’ అయింది.
(సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ. ఈ.సీ. అంతటా కలిగినది) బ్రహ్మ సంబంధిని కాబట్టి ‘బ్రాహ్మి’ అయింది. ప్రకాశం క్రీడిస్తుంది. కాబట్టి భారతి (్భ+రతి) అయింది. సూర్యప్రకాశమే పరావర్తనం చెంది వెనె్నలగా మారుతోంది కదా? అందువల్ల ఆమె సూర్యచంద్రుల కోలాటమాడుతుందన్న మాట. పలుకుబడునది కాబట్టి ‘పలుకులమ్మ’ అయింది. ‘వాణీ, వాగ్దేవీ’ అయింది. శరత్కాలమందలి వెనె్నల వంటిది కాబట్టి ‘శారద’ అయింది. అందుకే, సరస్వతిని ‘సర్వశుక్ల’గా అభివర్ణించారు కవులు. చంద్రునిలో మచ్చ ఉంటుందేమో కానీ, వెనె్నల్లో ఉండదు కదా. ఈ వెనె్నలే నదిలా ప్రవహిస్తూ, విశ్వమంతటా వ్యాపించి ఒక మహాసముద్రమై పోతుంది.
వాణి నాద స్వరూపిణి. నాదం లేక సంగీత సాహిత్యాలు లేని జీవకోటి లేదు. అసలు సృష్టియే లేదు. ప్రణవంలోంచే ఆవిర్భవించిందని వేద పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రణవం సరస్వతియే. అనగా ఆ విధంగా నాదమూలం, సృష్టిమూలం ఈ తల్లియే!
ప్రవాహ గుణం కలిగిందే నది. కాబట్టి ప్రతి నదీ సరస్వతీ స్వరూపమే. వ్యాపకత్వం కలది కాబట్టి సముద్రమూ సరస్వతియే. పంచభూతాల్లోనూ వ్యాపకత్వముంది కాబట్టి ఆమెది మహావిశ్వ స్వరూపం. అనగా మహావిశ్వమే మహా సరస్వతి. ఇదే సమగ్ర దృష్టి. స్థూల దృష్టి.
(ప్రవాహ గుణం కలిగిందే సరస్వతి. అందువల్ల మేఘాల్లోని నీరు క్రిందికి, భూమీదికి ప్రవహిస్తే, వర్షమే, అదే సముద్రమై పోతుంది. ఈ వర్షం వల్ల పాడీ, పంటా, ఆరోగ్యమూ, ఐశ్వర్యమూ, విజ్ఞానమూ, ఆనందమూ.. సర్వమూ సమకూరుతాయి. అందువల్ల అన్నింటిపై అధికారాన్ని కలిగి ఉంటుంది సరస్వతి. అనగా ఆమె విశ్వాధినేత్రి (నిరుక్తమ్) ‘సరస్వతిని ఒక నదియనీ, అది భూమి లోపల పారే అంతర్వాహినియనీ అంటారు కదా?’
‘అవును. ఆమె అంతర్వాహినియే. అది ఒక్క భూమిలోపలే కాదు. మన లోపలా ప్రవహిస్తుంది. ఆమెకొక చేతిలో పుస్తకం మరో చేతిలో వీణియ ఉంటాయి. ఇది త్రితంత్రీవీణ. అరవై రకాల వీణలుంటాయిట. మన మస్తకమే ఈ పుస్తకం. మన వెనె్నముకే ఈ వీణియ. వెనె్నముకకు వీణాదండమనీ, ‘మేరు పర్వతమనీ’ పేర్లు. ఈ వీణకు మూడు తీగలున్నట్లే, మన వెనె్నముకలోనూ మూడు నాడులుంటాయి. అవే ఇడా, పింగళా, సుషుమ్నానాడులు. వీనిగుండా సరస్వతీ దేవి ఒక అంతర్వాహినిగా ప్రవహించి, సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. ఒక సముద్రమై ఉప్పొంగుతుంది. ఇది ఆధ్యాత్మిక దృక్కోణం లేదా ప్రాణిదృష్టి.’
‘మరి, ఆధిభౌతిక దృక్కోణమంటే?’
‘ఆధిభౌతిక దృక్కోణంలో సరస్వతి భూగర్భంలో ప్రవహించే ఒక అంతర్వాహిని. అది పారుతూ పారుతూ వెళ్లి, ఎడారిలో ఒయాసిస్సుగా పైకి తేలుతుంది. చివరికి హిమాలయాల్లోని మానస సరోవరమూ ఇదేనంటున్నారు. అందులో ఈదులాడే హంసలం మనమే! ఆ హంసలను అధిరోహించి, నడిపించే హంసవాహినియే ఈ శారద!’
‘దీని వెనక ఇంత కథ ఉందంటారా?’
‘ఉంది. ఇంతకు వెయ్యింతలుంది. నేనందించింది సహస్రాంశం మాత్రమే’
‘దీన్ని తెలుసుకునే మార్గం?’
‘ఒక్కటే! మన అంతర్నేత్రం లేదా జ్ఞాననేత్రం తెరచుకోవాలి. దానికై మనం అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అప్పుడు ఆ దేవియే తన చేతినందిస్తుంది. మనల్ని తన ప్రవాహంలో కలుపుకొని ప్రవహింపజేస్తుంది. సహస్రారానికి చేరుస్తుంది. అదియే తపస్సు. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ కదా? అప్పుడు మనం బ్రహ్మ స్వరూపులం అవుతాం! మనలోనా, బయటా తిరుగుతూ ఉంటుంది శారద కులుకుతూ! వెనె్నలల నొలుకుతూ! ఆ స్థితికి చేరుకున్నాడు కాబట్టే ‘వాణి నా రాణి’ అన్నాడు మహాకవి పిల్లలమర్రి పినవీరభద్రుడు! ఇచ్చట ‘రాణి’యంటే ఒక్క భార్యయనే కాదు. అధినేత్రియని కూడా అర్థం. అదీ సంగతి.

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087