S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారత నదీనదాలు

కొంతకాలం కింద నేను భారతదేశం పేరు జనగణమన లాంటి అంశాలను గురించి రాసినట్టు ఉన్నాను. లోకాభిరామం మొదలుపెట్టినప్పుడే ఇందులోని అంశాలకు ఒక పరిధి లేదని నిర్ణయం జరిగింది. కనుక నాకు ఆసక్తికరంగా తోచిన అన్ని సంగతులు రాస్తున్నాను. పాఠకులు ఆదరిస్తున్నారనే అనుకుంటున్నాను. భారతదేశం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపించాయి. అందరూ చదువుతారని చదవాలని నా కోరిక.
దక్షిణ ఆసియా నైరుతి భాగంలోగల సింధునదికి ఏడు ఉపనదులు ఉన్నాయి. అవన్నీ ఒకే నదిలో భాగాలు. కనుక వాటన్నింటినీ కలిపి సింధు అని అంటారు. ఆ మాటకు సముద్రం లేదా పెద్ద జలాశయం అని అర్థం. అక్కడివారు ఆ నదులను సప్త-సింధు అంటారు. అంటే ఏడు సముద్రాలు లేదా ఏడు నదులు అని అర్థం. ఇక ఆ ప్రాంతానికి సప్త నదుల భూమి అని కూడా పేరు ఉంది. అందులో పంజాబ్ ముఖ్యమైనది. ఆ ప్రాంతంలో అయిదుప్రధాన నదులున్నాయి. అవి ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సత్లేజ్ అన్నవి. అవన్నీ కలిసి ఆరవదయిన సింధునదిలోకి ప్రవహిస్తాయి. ఆ తరువాత ఆ నది సరస్వతిలో కలుస్తుంది. ఈ చివరి నది ప్రస్తుతం రాజస్థాన్ ఎడారులలో చిన్నవాగుగా మిగిలిపోయింది. సింధు నదిని టిబెట్ వాసులు సెంగే చౌ (సింహ నది) అంటారు. చైనావారు దాన్ని యిందు అంటారు.
ప్రాచీన పర్షియన్‌లు అంటే ఇరానియన్‌లు సింధు నదిని హిందు అన్నారు. వారి భాషలోని ‘హా’అన్న అక్షరం సంస్కృతంలోని ‘స’కారానికి సమానం. తరువాత గ్రీకులు ‘హా’కారాన్ని వదిలిపెట్టి ‘ఇండోస్’ అనేకొత్త పేరు ఏర్పాటు చేశారు. లాటిన్‌లో ఈ పేరును రాస్తే ‘ఇండస్’ అవుతుంది. ఈనాటికీ నదీ వ్యవస్థకు ఈ పేరే కొనసాగుతున్నది. ఇక రోమన్‌లు మొత్తం ఉపఖండానికి ఈ పేరును స్థిరంచేశారు. అందులోనుండి ‘ఇండియా’ అన్న పేరు పుట్టింది. యూరోపు దేశాలవారు కలకాలంగా ‘ఇండియా’ అన్న మాటను వాడుతున్నారు. ఇండియాకు హిందువుల దేశం అని అర్థం వచ్చే ‘హిందూస్తాన్’ అన్న పేరును దండెత్తివచ్చిన ఇస్లాంవారు పెట్టారు. హిందువులు పాటించే వైదిక మతానికి హిందూయిజం, హిందూమతం వారి సంస్కృతికి హిందూ సంస్కృతి అన్న పేర్లు వచ్చాయి. అదే భారతీయ సంస్కృతి.
భారతదేశ వాసులు తమ దేశాన్ని ‘్భరతం’ అంటారు. దుష్యంతుని కుమారుడయిన భరత చక్రవర్తి వల్ల ఈ పేరు వచ్చింది. భరతుడు పాలించిన భూమి ‘్భరతవర్షం’ ప్రాచీన సంస్కృత సాహిత్యంలో చెప్పిన ప్రకారం భరతవర్షంలో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, దక్షిణ ఆప్ఘనిస్తాన్ భాగాలు చేరి ఉంటాయి. భరత చక్రవర్తి ఈ మొత్తం ప్రాంతాన్ని పరిపాలించాడు. విష్ణుపురాణంలో భారతవర్షం కింది విధంగా వర్ణింపబడి వుంది.
ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం
వర్షం తత్ భారతం నామ భారతా యత్ర సంతతి.
అంటే తూర్పున హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం మధ్యగల ప్రాంతాన్ని భారతవర్షం అంటారు ఆ ప్రాంతంలో వుండే వారే భారతీయులు అని అర్థం.
భారత అన్నమాటకు సంస్కృతం ప్రకారం కూడా అర్థం వుంది. ‘్భ’ అంటే జ్ఞానం లేదా వెలుగు. ‘రత’ అంటే మగ్నమయి చేయడం. అందుకు భరతుడు అన్న వ్యక్తి జ్ఞానం కొరకు వెతికినవాడు. భారతదేశం కూడా ఈ మార్గంలోనే కొనసాగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ (1) ప్రకారం ‘్భరత’ అన్న మాటను దేశానికి రాజ్యాంగపరమయిన పేరుగా గుర్తించారు. (ఇండియా అంటే భారతం అన్నది రాష్ట్రాల సమాహారం) దేశాధి దేవతను ‘్భరతమాత’ (తల్లి) అన్నారు. ఈ రకంగా దేశాన్ని స్ర్తిలింగంగా భావించారు.
చారిత్రకంగా భారతదేశంలో లెక్కలేనన్ని రాజ్యాలు ఉన్నాయి. అవి చక్రవర్తులు, రాజుల పాలనలో వున్నాయి. వారికింద రకరకాల సామంత ప్రభువులు, స్థానాధిపతులు ఉన్నారు. సుదీర్ఘమయిన చరిత్రలో ఒక్క అశోక చక్రవర్తి (304-232 క్రీ.పూ.; 268-232 క్రీ.పూ.) పాలనలో తప్ప ఈ ప్రాంతమంతా ఒకే దేశంగా ఏనాడూ ఉండలేదు.
దక్షిణ ఆసియా ఉపఖండం పడమట హిందుకుష్, బలూచీ కొండల నుండి: ఉత్తరాన, వాయువ్యంలో హిమాలయాల నుండి; తూర్పు బర్మా కొండల నుండి; దక్షిణ హిందూ మహాసముద్రం వరకు విస్తరించింది. హృదయాకారంలో ఉండే ఈ ఉపఖండం నిడివి ఉత్తరం నుండి దక్షిణానికి సుమారు 3,200 కిలోమీటర్లు (2000 మైళ్లు). ఇక బంగాళాఖాతం (పూర్వ సమద్రం అంటే తూర్పునగల సముద్రం) తూర్పు తీరానికి తాకి వుంటుంది. ఇక పశ్చిమ తీరంలో అరేబియన్ సముద్రం (పశ్చిమ సముద్రం) ఉంటుంది. ఈ రెండు సముద్రాలు దక్షిణాన హిందూ మహాసముద్రానికి కలుస్తాయి. దానికి ప్రాచీన నామం దక్షిణ సముద్రం. ఉపఖండంలోని పెద్ద భాగం ఇండియన్ టెక్టానిక్ ప్లేట్‌మీద వుంటుంది. ఇది ఇండియన్, ఆస్ట్రేలియన్ ప్లేట్‌లోని ఒక చిన్న భాగం. ఉపఖండం రాను రాను యూరోపియన్ ప్లేట్‌కు వెళ్లి తాకింది. దానికిందకు దూరింది. కోటి సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు పుట్టాయి. వాటికి పాత పేరు హిమవంతం. భూగ్రహంమీద అవే ఎత్తయిన కొండలు. వాటిలోని ఎవరెస్ట్ శిఖరం 8,850 మీటర్లు (29,028 అడుగులు) ఎత్తు వుంటుంది. అది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. తరువాతి స్థానం వివాదాస్పదమయిన కశ్మీర్‌లోని కారకోరంలోని కె-2 పర్వతం (8611 మీటర్లు / 28,244 అడుగులు). ఇక కాంచన్‌జంగ అన్న పర్వతం (8,598 మీటర్లు / 28,201 అడుగులు) భారతదేశంలో వుంటుంది.
అధునాతన భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరంగా 6.44 మరియు 35.3 ఉత్తర అక్షాంశాల మధ్యన అలాగే 68.7-97.25 తూర్పు రేఖాంశాల మధ్య వుంటుంది. ఈ రకంగా ఈ భూప్రాంతంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులు చోటుచేసుకుంటాయి. సంవత్సరాలు కొనసాగే కరువు ప్రాంతాలు ఒకవైపు, భూగోళంమీద అన్నిటికన్నా ఎక్కువ వర్షపాతం (1,080 సెంటిమీటర్లు లేదా 425 అంగుళాలు) ప్రతి సంవత్సరం కురిసే మేఘాలయలోని చిరపుంజి) ఇందులోని భాగాలే. ఇక భౌగోళిక నిర్మాణాలను గమనిస్తే, ద్వీపకల్పంలో ప్రీ కేంబ్రియన్ గ్రానైట్‌లు (500-2000 మిలియన్ సంవత్సరాల నాటివి) నుండి ఉత్తర సినోజాయిక్ పర్వతశ్రేణులు (60 మిలియన్ సంవత్సరాల నాటివి) ఇక్కడ ఉన్నాయి. తీర ప్రదేశం నిడివి 7,517 కిలోమీటర్లు (4,669 మైళ్లు) అందులో 5,423 కిలోమీటర్లు (3,368 మైళ్ళు) ప్రధాన భూభాగం చుట్టూ మిగతా 2,094 కిలోమీటర్లు (1,300 మైళ్ళు) అండమాన్, నికోబార్, లక్షద్వీప్ ద్వీపాల చుట్టూవుంటుంది.
భౌగోళికంగా ద్వీపకల్పాన్ని అడ్డంగా మూడు భాగాలుగా విభజించారు. ఉత్తరాన పర్వతశ్రేణులు. కిందనే మైదాన ప్రాంతాలు. ఇక దక్షిణాన ప్రధాన ద్వీపకల్ప భాగం అన్నవి ఆ భాగాలు. ఇందులో చివరిది బహుశా ఒకప్పుడు ఆఫ్రికాలో భాగం అయి ఉంటుంది. ఉత్తరాన వున్న పర్వతశ్రేణులు ఆర్కిటిక్ నుండి వచ్చే మంచు గాలుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇక దిణ ఆసియా మంచు దండయాత్ర దారులకు కూడా అడ్డుగా నిలుస్తాయి. 30 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి పైన వుండే హిందూ మైదానాలలో సగటు ఉష్ణోగ్రత జనవరిలో 10 డిగ్రీల సెంటిగ్రేడ్ (50 డిగ్రీల ఫా) వుంటుంది. ఇక ద్వీపకల్పంలోని మిగతా భాగంలో ఉష్ణోఘ్రత 27 డిగ్రీల సెం. (80 డిగ్రీల ఫా.) వుంటుంది. దేశపు దక్షిణం కొన భూమధ్య రేఖపైన 8 డిగ్రీల అక్షాంశాన్ని తాకుతుంది. ఇక అక్కడ సంవత్సరమంతా ఉష్ణమండలం నుండి సమశీతోష్ణ పద్ధతిలో సాగుతుంది. భారతదేశపు వాతావరణాన్ని ప్రధానంగా వేడి ప్రాంతంగా వర్ణించవచ్చు. దేశంలో ఉత్తరంలో వాయువ్యంలో వుండే సింధు- యమున - గంగ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోనూ దక్షిణ ద్వీపకల్పంలోని మహానది - గోదావరి- కృష్ణ - కావేరీ నదీ వ్యవస్థలోని భూములలో భారతీయ సంస్కృతి పుట్టి పెరిగింది. గంగ తరువాత రెండవ స్థానాన్ని ఆక్రమించే సింధు ప్రాంతం వ్యాపార పరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడికి దక్షిణ టిబెట్ హిమానీ నదాల నీరు అందుతుంది. మానస సరోవరం ప్రాంతంలో అంటే టిబెటన్ పీఠభూమిలో పుట్టి ఈ నిడుపాటి నది 3,200 కిలోమీటర్లు (2000 మైళ్ళు) హిమాలయాల నుండి నైరుతి దిశగా కాశ్మీరు గుండా ప్రవహిస్తుంది. అక్కడ అది ఒక్కసారిగా దక్షిణానికి మళ్లుతుంది. నంగపర్వత్ లోయలను కోస్తూ అది మలకంద్ కనుమకు చేరుతుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే కాబూల్ నదితో కలుస్తుంది. రెండు నదులు గాంధార (ప్రస్తుతం ఆప్ఘానిస్తాన్‌లోని కాందహార్) ప్రాంతాన్ని కైబర్ కనుమ మీద కలుపుతాయి. ఈ కనుమ పశ్చిమ దేశాల నుండి భారతదేశంలోకి దండెత్తివచ్చిన వారికి చారిత్రక దారిగా దొరికింది. ఇక నది చివరగా పంజాబ్, సింధు ప్రాంతాలలో ప్రవహించి చివరకు పాకిస్తాన్‌లోని కరాచీకి ఆగ్నేయ భాగంలో సముద్రంలో కలుస్తుంది. నదిలో ఏటా ప్రవహించే 207 బిలియన్ ఘనపు మీటర్ల నీరు నైలు నది ప్రవాహానికన్నా రెండు రెట్లు ఎక్కువ.

-కె.బి.గోపాలం