టెలిగ్రాం
Published Saturday, 16 April 2016అప్పుడప్పుడు పాత ఫొటో ఆల్బమ్‌లు చూస్తూ ఉండాలి. ఆ పాత ఫొటోలు మనకి ఎన్నో విషయాలని గుర్తుకు తెస్తాయి. అప్పటి వేషధారణ, హెయిర్‌స్టైల్, అప్పటి మిత్రులు ఇలా ఎన్నో.
ఈ మధ్య ఓసారి ముప్పై సంవత్సరాల క్రితం నాటి నా పెళ్లి ఆల్బమ్ తీసి చూశాను. ఎన్నో జ్ఞాపకాలు, ఆలోచనలు. చివర్లో టెలిగ్రామ్‌లు కూడా అతికించి పెట్టాను. అందులో ఒకటి ఓ సీనియర్ కవి మిత్రుడు మోహనప్రసాద్ పంపింది. అది సరదాగా ఉంది. సినిమాలోని పాటతో టెలిగ్రాం.
‘పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని/ చల్లగ కాలం గడపాలోయ్
జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్’
టెలిగ్రామ్‌లు చూస్తుంటే ఆలోచనలు టెలిగ్రామ్‌ల చుట్టూ పరిభ్రమించాయి. పెళ్లి సమయంలో తప్ప మిగతా సమయాల్లో టెలిగ్రామ్ అన్న పదం భయం కలిగించేది.
మా బాపు దవాఖానాకి ఎదురుగా పోస్ట్ ఆఫీస్ ఉండేది. చిన్నప్పుడు సరదాగా అక్కడికి వెళ్లి చూసేవాడిని. ఆ టెలిగ్రామ్ భాష అర్థం కాకపోయేది. ఆ టెలిగ్రామ్ విద్యని నేర్చుకున్న వ్యక్తులకి మాత్రమే ఆ భాష అర్థమయ్యేది.
కాలక్రమంలో టెలిఫోన్ ద్వారా టెలిగ్రామ్ విషయాలని తపాలా సిబ్బందికి చెప్పేవాళ్లు. వాళ్లు ఆ విషయాలను టెలిగ్రామ్‌లో రాసి అందజేసేవారు. శుభాకాంక్షలు చెప్పడానికి ఎక్కువగా ఆ టెలిగ్రామ్‌లని ఉపయోగించేవాళ్లం. టెలిగ్రామ్ ఖర్చు తక్కువ కావడానికి శుభాకాంక్షలు లిస్టుని కూడా తపాలా సిబ్బంది పెట్టేవాళ్లు. అందులో నుంచి నచ్చిన నెంబర్‌ని రాసేవాళ్లం.
ఒకే ఒక్కసారి టెలిగ్రామ్‌ను మరో రకంగా మా బాపు ఉపయోగించాడు. దాదాపు యాభై సంవత్సరాల క్రితం మాట. మా పెద్దన్నయ్య గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు మా రెండో అన్నయ్య హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. ఆయనకు ఆ సమాచారం పంపించడానికి టెలిగ్రామ్‌ని శుభాకాంక్షలకి కాకుండా మరో రకంగా ఉపయోగించడం జరిగింది.
చాలా పెళ్లి పత్రికలు వచ్చేవి. వాటికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు మాకు ఉన్న ఏకైక సాధనం టెలిగ్రామ్. తరువాత పరిస్థితులు మారిపోయాయి. గ్రీటింగ్ కార్డ్స్, టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు, సంక్షిప్త సమాచారాలు ఇట్లా ఎన్నో సదుపాయాలు వచ్చాయి. ఇప్పటి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లు, ఫేస్‌టైంలు, స్కైప్‌లు ఇట్లా ఎన్నో.
మా పిల్లలు టెలిగ్రామ్‌లు పంపించలేదు. కానీ వాళ్ల బర్త్‌డేలకి టెలిగ్రామ్‌లని అందుకున్నారు. వాళ్లు ఆరవ తరగతి వచ్చేవరకి వాళ్లకి టెలిగ్రామ్ అన్నది పాఠంగా మారిపోయింది. ఈ ఆధునిక సౌకర్యాలు ఎన్నో వచ్చినా అప్పుడప్పుడు టెలిగ్రామ్ ప్రాముఖ్యం కన్పించేది. పదవ తరగతి ఫలితాలు వచ్చినప్పుడు తెలిసిన వాళ్లకి టెలిగ్రామ్‌లు పంపేవాళ్లం. అదే విధంగా మా పిల్లలు పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పాసైనప్పుడు టెలిగ్రామ్‌లు ఇంటికి వచ్చేవి.
టెలిగ్రామ్ అన్న పదం ఇంట్లో విన్పించినప్పుడల్లా ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవి. ఎన్నో మాటలు ఇంట్లో దొర్లేవి. జులై 2013లో టెలిగ్రామ్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో టెలిగ్రాం అంతరించి పోతుందని, ఆ వ్యవస్థని ఆపేస్తున్నారన్న వార్త టెలిగ్రామ్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది.
టెలిగ్రామ్‌కి చివిర రోజు జులై 14, 2013. ఎంతోమంది చివరి టెలిగ్రామ్‌లు పంపించారు. నేనూ పంపిద్దామని అనుకున్నాను. పంపించలేదు. నాకు ఎవరైనా పంపిస్తారేమోనని చూశాను. ఎవరూ పంపించలేదు. 163 సంవత్సరాల పాటు మన దేశంలో పనిచేసిన టెలిగ్రామ్ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
నేను చెయ్యని పనుల జాబితాలో పంపించని టెలిగ్రామ్ మిగిలిపోయింది.
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.