S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వరం మారుతోంది..

మీ అమ్మాయి పెళ్లి కోసమేనా మీ ఆలోచన మా బ్యాంకులో పొదుపు చేయండి. పెళ్లి నాటికి అవసరమైన డబ్బు మీ చేతికి అందుతుంది. ఇలాంటి ప్రకటనలు మనం బోలెడు చూశాం. ఇంకా చూస్తున్నాం. అమ్మాయి పెళ్లి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనేక పథకాలు ప్రారంభించారు కూడా.. గతంలో యుటిఐ వారు అమ్మాయి పెళ్లి నాటికి మెచ్యూర్ అయ్యే పథకాన్ని ప్రకటిస్తే అనూహ్య స్పందన లభించింది. సుకన్య సమృద్థి యోజన ఇలాంటి ఓ పథకం.
ఇలాంటి పథకాలను నమ్ముకొనే వారు లక్షల్లో ఉంటారు. ఆడ పిల్ల పుట్టింది అనగానే తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చు ఎలా అనే ఆలోచన మొదలవుతుంది. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు.
గృహ నిర్మాణం ఇప్పుడు కొంత సులభం అయింది. పన్ను ఆదా కోసం ఇళ్లు కడుతున్నారు. బ్యాంకులు కూడా ఇంటి నిర్మాణానికి చాలా ఈజీగా రుణాలు ఇస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా పెళ్లి అనేది ఆడపిల్లల తల్లిదండ్రులను కలవర పెట్టే అంశమే. మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్ల పుట్టింది అనగానే పెళ్లిని దృష్టిలో పెట్టుకుని డబ్బు కూడపెట్టడం మొదలు పెడతారు.
కాలం ఇంతగా మారినా ఈ పరిస్థితి, ఈ అవసరంలో మార్పు లేకపోవడం ఆశ్చర్యకరమే.
విషయం ఏమంటే ఈ మధ్య అర్థిక అంశాలకు సంబంధించిన సలహాల్లో ఒక ఆంగ్ల పత్రికలో ఉత్తరాదికి చెందిన ఒక అమ్మాయి ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది.
తల్లిదండ్రులకు ఆ అమ్మాయి అంటే ఎంతో ప్రేమ. ఆమె జీవితం బాగుండాలని క్రమపద్ధతిలో పొదుపు చేశారు. కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్న పొదుపు కాబట్టి అది మంచి మొత్తంగానే తయారైంది. ఆ అమ్మాయి పెళ్లి కోసం అని ఆ డబ్బును ముట్టుకోకుండా కూడబెట్టారు. ఇప్పుడు సమస్య ఏమంటే? ఆ అమ్మాయికి తాను ఉద్యోగం చేయడం కన్నా ఏదైనా సొంత వ్యాపారం నిర్వహించాలనే ఆలోచన ఉంది. తన పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బును తన స్టార్టప్ కోసం ఇవ్వాలని ఆ అమ్మాయి కోరింది. కానీ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు స్టార్టప్ దెబ్బతింటే పెళ్లి ఎలా అనేది తల్లిదండ్రుల ఆందోళన. అమ్మాయి ఆలోచన తప్పు కాదు, తల్లిదండ్రుల ఆందోళనలో వాస్తవం ఉంది.
ఇలా చేయండి అని ఉచిత సలహా ఇవ్వడం ఈజీనే కాని అది ఆచరించే వాళ్లు లాభనష్టాలను అనుభవించాలి. ఇలాంటి అంశాలను చూస్తున్నప్పుడు యువత స్వరం మారుతోంది, దానికి తగ్గట్టు తల్లిందండ్రుల ఆలోచనలు కూడా మారుతున్నాయి.
ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలి? అని ప్రశ్న వినిపిస్తే, ఇతరులకు సంబంధించిన సమస్య ఐతే అమ్మాయి కోరినట్టు ఆ డబ్బును అమ్మాయి చేయబోయే వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించాలి అని సలహా వినిపిస్తుంది. ఇదే సొంత విషయానికి వస్తే అమ్మాయి పెళ్లి ముందు స్టార్టప్ గీర్టప్ జాన్తా నై అనే సమాధానం వస్తుంది. వారు ప్రారంభించే కొత్త వ్యాపారం నిలుస్తుందో లేదో, ఉన్న డబ్బంతా అందులో పెడితే ఇక పెళ్లి చేయడం ఎలా అనే భయం ఉంటుంది.
ఏ నిర్ణయాన్ని తప్పు పట్టలేం. ఎవరి సమస్యవారిది. ఐతే యువతలోనో, పెద్ద వారి ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది.
ఆడపిల్లలు పెళ్లి కన్నా తాము జీవితంలో స్థిరపడడం ముఖ్యం అని భావిస్తున్నారు. జీవితం అంతా ఒకరిపై ఆధారపడడం కాదు ఉద్యోగం చేస్తూ సొంతంగా సంపాదించడం లేదా? ఏదైనా స్టార్టప్ ద్వారా వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రవేశించి తన కాళ్ల మీద తాను నిలబడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లికి రెండవ ప్రాధాన్యత ఇస్తున్నారు.
పెద్ద సంఖ్యలో కనిపించక పోవచ్చు కానీ ఇలాంటి ఆలోచనలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య కూడా బాగానే ఉంది.
ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాను అంటే ప్రోత్సహించే వారు కనిపిస్తున్నారు. మార్పు చిన్నగానే మొదలవుతుంది. ఒకరు విజయం సాధిస్తే ఆ మార్గంలో పయనించే వారు మరెంత మందో ఉంటారు. ఓయో హోటల్స్ యాప్‌ను ప్రారంభించింది ఓ కుర్రాడు. నిజామాబాద్‌కు చెందిన ఐటి ఉద్యోగులు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ప్రైవేటు బస్సుల కోసం పడిన ఇబ్బందుల నుంచి రెడ్ బస్ యాప్ పుట్టింది. ఓయో ఐనా రెడ్ బస్ ఐనా వందల కోట్ల రూపాయల సంపద తెచ్చి పెట్టింది.
కొత్త తరం కుర్రాళ్లు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదాం అనే అంశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో ఒక రంగంలో తమ ప్రతిభను చూపించుకున్న తరువాతనే జీవితంలో స్థిరపడే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
పెళ్లి కోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం అవసరమా? అదే డబ్బును వారు వారికి నచ్చిన రంగంలో పెట్టుబడి పెట్టి పైకి ఎదగాలని ప్రయత్నిస్తుంటే దాన్ని ప్రోత్సహిస్తే తప్పేమిటి?
పిల్లలు పుట్టగానే వారి చదువు కోసం, పెళ్లి కోసం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడతారు. కడుపు మాడ్చుకుని కూడబెట్టడానికి సిద్ధపడతారు. చదువు, పెళ్లికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే వారికి నచ్చిన రంగంలో నిలబడేందుకు తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టలేరా? కేవలం ఉత్సాహం, ఆసక్తి ఉంటే సరిపోదు. నిజంగా వ్యాపార రంగంలో నిలబడగలరా? కష్టపడగలరా? చూడాలి. అవసరం ఐతే కొంత కాలం ఉద్యోగం చేసి అనుభవం గడించిన తరువాత కోరుకున్న విధంగా వ్యాపార రంగంలో ప్రవేశించేందుకు ప్రోత్సహించవచ్చు.
కుర్రాళ్ల ఆలోచనలు మారుతున్నట్టు పెద్దల ఆలోచనలు కూడా మారాలి. ఉద్యోగంలోనే మా జీవితం గడిచిపోయింది. మీ జీవితం కూడా అలానే గడిచిపోవాలి అని కోరుకోవడం సరికాదు. పిల్లలకు ఆసక్తి ఉంటే వ్యాపార రంగంలో ప్రోత్సహించాల్సిందే.
ఉద్యోగం చేయడం కన్నా నలుగురికి ఉద్యోగాలు కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న వారికి ప్రోత్సాహం అవసరం. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. కాలం మారింది, యువత స్వరం మారుతోంది. పెద్దలు కూడా దీన్ని గ్రహించాలి.

-బి.మురళి