S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎవరు చెప్పాలి?

ఊరికంతా అప్పిగాడు లోకువ, అప్పిగానికి నేను లోకువ అన్నాడట ఆ మహానుభావుడు ఎవరో, అప్పిగానికి తాను ఊరికి లోకువ అన్న సంగతి గురించి బాధ లేదు. తనకు కూడా ఎవరో ఒకరు లోకువ అయితే చాలు. ఇది ఒక అప్పిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు. మన దేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది. మానావమానములను సమానముగా చూడవలెనని సూత్రం చెప్పగలిగిన దేశం మనది. తుల్య నిందా స్తుతిర్మౌనేః అని గదా సూక్తి! రాజపూజ్య అవమానాలు గ్రహచారం కొద్దీ వచ్చేవి మాత్రమే అనుకోగలిగిన మంచి సంప్రదాయం మనది. దూషణ భూషణ తిరస్కారాలకు చలించని గట్టి మనుషులం మనమంతా. అవమానం భరించినందుకు కొంప మునగకపోవచ్చు. అలాగని అన్యాయాన్ని కూడా అంతే సులభంగా భరించడం మనకు అలవాటయింది. ఇందులో కొంచెం తంటా ఉంది. రాజకీయాల్లో తప్ప ఓడిపోయిన వారికి ఎవ్వరికీ కోపం రాదు. అందుకే మన వాళ్లు ఆటల్లో ఓడి కూడా జల్సా చేసుకోగలరు. కోర్టులో వ్యాజ్యం పోయి ఇల్లు గుల్ల అయినా సరే పర్వాలేదు. ఎందుకు ఓడితిమి అన్న చర్చ మనసులో బాధను మాత్రం కలిగించదు. అంగడి వారు చచ్చు పుచ్చు వస్తువులను అంటగడితే ఎందుకిలా అని అడిగే సత్తా లేదు. అన్నింటికీ ఒకటే ఊరడింపు. ప్రారబ్దమిట్లుండగా ఒరులనను పనిలేదు అని త్యాగరాజ స్వామి వారు పాడి చెప్పారు. ఖర్మం ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అని సరిపెట్టుకోవడం మన పద్ధతి. అడిగితే తంతారేమోనన్న భయం కూడా ఓ మూలన కొంత లేకపోలేదు. అంతా కలిపితే తాత్పర్యం ఒకటే. అవసరం లేని వాళ్లు కూడా అన్యాయం చేయడానికి అడుగు ముందుకు వేస్తారు.
జంటనగరాల్లో ఆటో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించిన వారందరికీ ఒక అనుభవం ఎదురయింది ఉంటుంది. నాకు రెండు చక్రాలు, నాలుగు చక్రాలు తెలియవు కనుక ఆటోల మీద ఆధారపడతాను. కొత్తగా వచ్చిన ఓలా, ఉబెర్‌లు కూడా అన్యాయంగానే ఉన్నాయని నా అభిప్రాయం. యక్షులు గంధర్వులు విమానాల్లో తిరిగి ఏదో శాపం కారణంగా భూలోకం మీదకు వచ్చిన జాతి వారు విమానాలను, రథాలను మరిచిపోలేక ఆటోలు నడుపుతున్నారని ఒక పెద్ద మనిషి నాకు విడమర్చి చెప్పారు. అది అక్షరాల నిజం అనిపిస్తుంది. వారు మీరు అడిగిన చోటికి వస్తానంటే గొప్ప అనుగ్రహం ప్రసాదించినట్టే లెక్క. ఈ మధ్యన అసలు ఆటో వాళ్లు అసలు నీ దగ్గర పైసలు ఉన్నాయా అన్నట్టు చూస్తున్నారని నాకు అనుమానంగా ఉంటుంది. ఆ రథంలో కూర్చున్న తర్వాత మొదలవుతుంది కథ. మీటరు మినిమం కిలోమీటర్ల దూరం కాకముందే పరుగుపెట్టడం మొదలవుతుంది. ఈ రహస్యం చాలామంది ఆటో ఎక్కే వాళ్లకు తెలియదు. నిత్యము ఎక్కే వాళ్లకు కూడా అంత ధ్యాస ఉండదు. ఉన్నా సరే ఎవరికి తెలుసు అనుకుని ఊరుకుంటారు. ఈ మధ్యన అసలు మీటర్ మీద నడిచే ఆటోలు లేకుండా అయినయి. పాత కాలంలో రిక్షాల వలె బేరాలు ఆడవలసి ఉంటుంది. ఎక్కడో సకృత్తుగా మీటర్‌తో వచ్చే ఆటో దొరికినప్పటికి చేరవలసిన చోటికి వెళ్లిన తరువాత అది ఒక భయంకరమైన అంకెను చూపిస్తుంది. మామూలుగా 60 కావలసిన చోటికి 66, 70 ఆపైన ఎంతైనా చూపిస్తుంది. ఎలక్ట్రానిక్ మీటర్లు రాక ముందు ఈ పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. డిజిటల్ మీటర్‌లలో ఈ బాధలేదు అన్నారు. కానీ చూస్తుండగానే వాటిని కూడా గోల్‌మాల్ చేసే పద్ధతులు మనవాళ్లు తెలుసుకున్నారు. అంకెలు చూచిన మీ అంతరాత్మ ఘోషించింది అనుకోండి. ఇక జరిగిన అన్యాయానికి తోడుగా అవమానం కూడా ఎదురై సిద్ధంగా నిలబడుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా ఆటో ఎక్కావా, అని అనిపించుకుంటే ఆశ్చర్యం లేనే లేదు. మంచితనం మీద నమ్మకం గల గంధర్వుడు అయితే, ఏం చేయమంటావు పెట్రోల్ బంక్ వాళ్లు. ఆటో సొంతదారుడు నన్ను మోసం చేస్తుంటే నేను నిన్ను ఎంచుకున్నాను మోసం చేయడానికి అంటాడు. నీవు వెళ్లి మరెవరినైనా వెతికి చేతనైనంత మోసం చెయ్యి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేస్తాడు. అది నాకు చేతకాదు అన్నారే అనుకోండి, అర్భకుడా అన్నట్టు నీ వైపు చూస్తాడు. బతుకు దారి గురించి విడమర్చి చెప్పిన యోగి లాంటి కటాక్ష వీక్షణం మన మీద పడవేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరి మనకు రక్షణగా తాత్వికత అనే రక్షణ కవచం ఉండనే ఉంటుంది. మళ్లీ నా ఖర్మ లాంటివి, గుర్తు తెచ్చుకోవాలి. తాత్వికతను, కొంచెం భయాన్ని మేళవించి అంతకన్నా ఫిలసాఫికల్ నవ్వు ముఖమంతా పూసుకుని జేబులో లేదా పర్సులో చేయి పెట్టక తప్పదు. గంధర్వులు పూర్తిగా రూపాయలే గానీ చిల్లర పుచ్చుకునే కాలం ఎప్పుడో గడిచిపోయింది.
ఈ మధ్యన చిల్లర అంటే ఐదు రూపాయలు కూడా లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితి. పది రూపాయలకు పూర్తి చేసి చెల్లింపులు జరపాలి. ఖర్మం కొద్దీ 5 రూపాయల నోట్లు, అంతకు చిన్న బిళ్లలు కనుక నీ వద్ద కనిపించాయంటే, గంధర్వుడు నిన్ను పురుగులాగా చూడడం మొదలు పెడతాడు. నేనే దొరికానా అని నేను ఒకరి చేత అనిపించుకున్నాను. ఇక మరీ పెద్ద నోట్లతో సమస్య మరొక రకంగా ఉంటుంది. గంధర్వుల వద్ద వందకు కూడా చిల్లర ఉండదు. ఉంటుంది అనుకుంటే అది మన మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఆ సంగతి మనం అర్థం చేసుకోవడానికి అక్కడ ఒక చిత్రమైన నాటకం జరుగుతుంది. మొత్తానికి కొంత అదనపు ఖర్చు, కొంత అన్యాయం, మరి కొంత జ్ఞానోదయంతో యాత్ర ముగుస్తుంది. తెలివితక్కువ కొద్దీ నోరు చేసుకోవడానికి పూనుకుంటే ఎదురుగా తిట్లు రావన్న గ్యారంటీ లేదు. పోలీసులకు మరొకరికో ఫిర్యాదు చేయాలనుకోవడం కన్నా తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. ప్రపంచంలో రక్షకులు అనుకున్న వారంతా దొంగలతో గట్లు పంచుకున్న వారే గానీ మామూలు మనిషి మాట వినే వారు కాదన్నది అనుభవం మీద తెలిసిన సత్యం. ఈ ఆటోల మీటర్లకు బాధ్యులైన ప్రభుత్వ శాఖ వారు జరుగుతున్న అన్యాయాలను అన్నింటిని హాయిగా నవ్వుతూ చూస్తున్నారు కానీ అందులో కలుగజేసుకునే ప్రయత్నం చేయడం లేదు అంటే ఎంతమంది నమ్ముతారు? నేను ఏకంగా హైదరాబాదు ఆటోలను గురించి ఇంటర్నెట్‌లో అదేదో డాట్‌కామ్‌లో పిటిషన్ మొదలుపెట్టాను. వారం అయింది. రెండు వారాలు అయినయి. కదలిక లేదు. నెట్ వాడుతున్న వారు ఎవరూ ఆటోలు వాడరేమో అన్న అనుమానం మొదలయింది. నోరు మూసుకుని ఉండిపోయాను. అంతా మోసం! అంతా అన్యాయం!! తిరువనంతపురంలో ఒక మిత్రుడు కనిపించిన ప్రతి ఆటో మీద కోర్ట్ కేసు వేసే అందరినీ తికమక పెట్టడం నాకు బాగా తెలుసు. చివరికి అతను కూడా బహుశా తన ప్రయత్నాలు మానుకొని ఉంటాడు. స్వయంగా లాయర్ కాబట్టి ఖర్చు లేకుండా కావల్సినన్ని కేసులు వేశాడు. కానీ ఒక మనిషి ఒక వర్గంతో, అందునా అధికారుల అండ గల వర్గంతో పోరాడ కలగడం అసాధ్యం కాదా?
ఆటోవాళ్లు అన్యాయం చేస్తున్నారు అన్న సంగతి మహా ఘనత వహించిన ప్రభుత్వం వారికి తెలియకుండా ఉండదు. ఇన్ని సమస్యలు ఉండగా ఇదొకటా అన్న ధోరణి తప్ప నిర్లక్ష్యానికి కారణం మరొకటి కాదు. మామూలు మనుషుల గోల ఎవరికీ పట్టదు. పట్టిన పక్షంలో సమస్యకు సమాధానం ఒక పూటలో దొరుకుతుందని నా నమ్మకం. ఈ వ్యాసం తుంపును సదరు సర్కారు వారికి ఎవరయినా అందిస్తే ఎంతో బాగుంటుంది. కార్డు ముక్కలను పిటిషన్‌లుగా తీసుకుంటారట. నా వ్యాసాన్ని కూడా అట్లాగే తీసుకుంటే మంచి జరుగుతుంది.
అన్యాయం గురించి గొంతు చించుకుని గోల చేయడం కన్నా అర్థం లేని పని మరొకటి లేదని అనుభవం మీద మనకు అందరికీ తెలుసు. పోలీసుస్టేషన్‌కు వెళ్లడం కంటే వ్యభిచార గృహానికి, లేదా కల్లు పాకకు వెళ్లడం గౌరవంగా ఉంటుంది అనుకునే పరిస్థితి మనది. ఒక ట్రాఫిక్ పోలీసాయనకు ఒకానొక సాయంత్రం మందే మాతరం సమయం గనుక నా మీద వల్లమాలిన కోపం వచ్చింది. మాయావిడ చిన్న పొరపాటు చేసింది. అతను అవమానకరంగా మాట్లాడసాగాడు. ఇద్దరమూ గౌరవంగా బతుకుతున్న వాళ్లమే. తప్పు ఒప్పుకుంటున్నాము అని ఏదో చెప్పబోయాను. అతనికి తిక్క రేగినట్టుంది. బూతులకు దిగాడు. జర్నలిస్టు సోదరులను పిలిచి గోల చేసి ఉండవచ్చు. కానీ అక్కడ పరిస్థితి శృతిమించి రాగాన పడుతున్నది. మందు ప్రభావంలో సోదరుడు మితిమీరుతున్నాడు. అసలు సంగతి, మేము మెడికల్ ఎమర్జెన్సీలోకి వెళ్తున్నాము. అడిగిన డబ్బు ఇచ్చి రసీదు లేకుండానే బయట పడినట్టు గుర్తు.
ఇక కోర్టుకు వెళ్లడంకన్నా కనకష్టమైన పని మరొకటి లేదు. న్యాయం కోసం న్యాయస్థానానికి వెళితే అక్కడ ఆ సరుకు దొరుకుతుందన్న నమ్మకం అసలు లేదు. అధవా దొరికిన ఆలోగా ఈ మనిషి మిగిలే అవకాశం ఉండదు. న్యాయం దొరికే లోపల దాని అవసరం తీరిపోతుంది. ఇంతకూ అన్యాయం చేసేందుకు వీళ్లు మాత్రమేనా అనేది అసలైన ప్రశ్న! అందరికంటే ముందు నాకు అనుభవంలో ఉన్న విషయం కనుక ఆటో వాళ్లు గుర్తుకు వచ్చారు. నేను ఈ వ్యాసం రాశాను అన్న సంగతి తెలిస్తే, వాళ్లంతా చేరి నాకు దేహశుద్ధి చేస్తారేమో? చేస్తే బాగుండును. టీవీ చానల్ వాళ్లందరినీ పిలిచి పెద్ద గోల సృష్టించి విషయానికి ప్రచారం కలిగించగల అవకాశం దొరుకుతుంది. అక్కడికి టీవీ వాళ్లు నేను ఎప్పుడు పిలుస్తానా అని ఎదురుచూస్తూ కూచున్నారని అనుకోవడం నా తెలివితక్కువతనం. వాళ్ల అన్యాయం పద్ధతులు వాళ్లకూ ఉంటాయి.
ఒకరు అన్యాయం చేయడానికి వంద మంది కారణం అవుతున్నారు. పెట్రోల్ వాళ్లు తక్కువ పోస్తారు. చూచే వాళ్లు తక్కువ తూస్తారు. ఈ సంగతి అనుభవం లేకుంటే కోఠికి వెళ్లి ఏవైనా పళ్లు కొని చూడండి. దిమ్మ తిరుగుతుంది. కిలో అని ఇచ్చిన పళ్లు ఇంటికి వస్తే ఆరు ఏడు వందల గ్రాములుగా మిగిలితే చాలు. కొలిచి ఇచ్చేవాళ్లు తక్కువ కొలిస్తే, కొలిచి తీసుకునే వాళ్లు ఎక్కువ కొలుస్తారు. జనాభా వాళ్లు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే మనుషుల సంఖ్య ఒకటి అయితే రేషన్ కార్డు వాళ్లకు చెప్పే సంఖ్య ఇంకొకటి. ఇప్పుడు ఆధార్ కార్డు అని ఒకటి తయారుచేసి మనుషుల ఫొటోలు కూడా తీసి చూస్తున్నారు కనుక కొంచెం పరిస్థితి మెరుగైందేమో ఏమో తెలియదు. పొద్దున హైదరాబాద్‌లో ఓటు వేసి సాయంత్రం లోగా ఏరు దాటి అక్కడ మళ్లీ ఓటు వేసిన వాళ్లు ఉన్నారని విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ రకంగా మనుషులు రెండు రెండు చోట్ల బతుకుతున్నారు. ఇటువంటి అన్యాయాన్ని భరించడం కష్టం కాదు అనుకుంటే పొరపాటే. అందరూ ఇదే పని చేస్తే కొన్ని లెక్కల ప్రకారం దేశ జనాభా రెండింతలు అవుతుంది. అందవలసిన తిండి నిజంగా అవసరమైన చోట అందనే అందదు.
సర్కారు వారు బడి లేదా ఆసుపత్రి కట్టిస్తారు. దానికి ఇంత ఖర్చయిందని ఒక లెక్క చూపుతారు. ఆ భవనాన్ని కట్టిన గుత్తేదారు పక్కనే బడికి ఆరంతలు ఉండే బంగ్లా కట్టుకుంటాడు. ఆ బంగ్లా కట్టడం ఎట్లా వీలయింది అన్న సంగతి మొత్తం ప్రపంచానికి తెలిసి ఉంటుంది. కానీ ఎవరూ గొంతు ఎత్తరు. మన పని కాదని అందరూ అనుకుంటారు. బంగ్లా కట్టడం మన పని కాదు. కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం మన పని అంతకన్నా కాదు. అది ప్రజాధనం అన్న మాట ఎవరికీ గుర్తు రాదు. కరకరలాడే రూపాయి నోట్లు పోసిన చోట జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తి ధైర్యం లేనివాళ్లు ఈ రకమైన ప్రజాధనం గురించి మాట్లాడవచ్చు అని అనుకోవడం కూడా ఉండదు. కొని తెచ్చిన గుడ్డ వారం రోజులలో పోయి తడిపిన ప్రతిసారికి జానెడు తక్కువ అయితే మరో దేశంలోనైతే ఆ గుడ్డ తయారుచేసిన ఫలానా కంపెనీ మీద నష్టపరిహారం దానికి తోడు మానసిక క్షోభ కలిగింది అంటూ దానికి కూడా వెలకట్టి పెద్ద ఎత్తున దావా వేస్తారు. కంపెనీ వారు కిక్కురుమనకుండా ఆ సమ్మెతో ఇచ్చి సరుకును దుకాణం నుంచి తొలగిస్తారు కూడా.
ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే. అడిగే దిక్కు లేకపోతే అది అలా పెరుగుతూనే ఉంటుంది మరి.

-కె.బి.గోపాలం