S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బయో ఇంధనానికి ఏదీ ప్రోత్సాహం?

భారత గత యూపీఏ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల వ్యయం తగ్గించడం, వాతావరణ కాలుష్య నివారణకు, విలువైన విదేశీమారక ద్రవ్యం మదింపుకోసం జీవ ఇంధనాల ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి నిలిపింది. ఇంధన భద్రతే విదేశాంగ విధానాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్న ప్రస్తుత కాలంలో, శిలాజ ఇంధనాల నిల్వలు రోజురోజుకూ అడుగంటి పోతున్న కారణంగానేకాక, భూ ఉష్ణోగ్రతా వ్యాకోచానికి దారి తీస్తున్న బొగ్గు పులుసు వాయువుల విడుదలను అరికట్టడానికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం అనివార్యంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భావించింది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలు (బయో ఫ్యూయెల్స్) అన్ని విధాలా లాభసాటిగా గుర్తించారు. శిలాజ ఇంధనమైన పెట్రోలు స్థానంలో కర్బనం తక్కువగా ఉండే బయో డీజిల్‌ను ప్రత్యామ్నాయ రవాణా ఇంధనంగా అభివృద్ధి చేసే దిశలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో బయో ఇంధన ఉత్పత్తులపై దృష్టి నిలిపింది. బయోడీజిల్ విపణి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావించి, నిర్ధారించి, చమురు ధరలు పెరిగిపోవడాన్ని దృష్టియందుంచుకుని భారత దేశంలో బయో డీజిల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా కృషి చేసింది. బయో డీజిల్ అనగా కానుగ (శాస్ర్తియ నామం:పినే్నటా) గింజలు లేదా పెద్ద నేపాళం (జప్రోటా) గింజలనుండి తీసే నూనె. బయోడీజిల్‌ను రెండు దశాబ్దాల క్రితమే గుర్తించినా, అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతున్నది. సస్టేనెబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ (సూత్ర) అనే సంస్థ బెంగళూరులో బయో డీజిల్ తయారీ, వినియోగాలపై విస్తృత పరిశోధన జరిపింది. తత్ఫలితంగా బెంగుళూరు పరిసర ప్రాంతాలతో ముందుగా ట్రాక్టర్లను బయో డీజిల్‌తో నడపడం జరిగింది. యూరోపియన్ దేశాలలో ఉత్పత్తి అయిన డీజిల్‌లో 2శాతం బయో డీజిల్‌ను మిశ్రమిస్తున్నారు. గత భారత ప్రభుత్వం కూడా మొత్తం రవాణా ఇంధనాలలో జీవ ఇంధనాలను 20శాతానికి పెంచాలనే లక్ష్య నిర్దేశం చేసుకుంది. బంజరు భూములు అధికంగాగల భారతావనిలో జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి పలు పెద్ద సంస్థలు ప్రయత్నించాయి. కానుగ సాగుకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు. కానుగ చెట్లు నెలకు ఒకటి, రెండు తడులతో మామిడి చెట్లంత పెరుగుతాయి. గృహావరణాల్లో, రోడ్ల కిరువైపులా కానుగ నాటితే ఆహ్లాదకరమైన నీడతోపాటు, వేణ్ణీళ్ళకు చన్నీళ్లలా ఆదాయం పెరుగుతుంది. ఈ చెట్లు 5సంవత్సరాలకు కాపు ప్రారంభించి 30ఏళ్ళ వరకు పంటనిస్తాయి. కానుగ స్వయంగా చీడ పీడల నివారణి అయినందున దానిపై ఎటువంటి చీడపీడలుండవు. ఈక్రమంలోనే 2006-08 మధ్య కాలంలో రాష్ట్రంలో జీల ఇంధన మొక్కల పెంపకాన్ని చేపట్టారు. అవిభక్త కరీంనగర్ జిల్లాలో కానుగ 75వేల ఎకరాలలో, జిట్రోపి 25వేల ఎకరాలలో మొత్తం లక్ష ఎకరాలలో జీవ ఇంధన మొక్కల పెంపకం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పెట్టుకుంది. దీనికోసం రైతులను, స్వచ్చంద సంఘాలను, పంచాయతీలను ప్రోత్సహించింది. ఒకొక్క రైతుకు 5ఎకరాల వరకు సాయం చేయాలని నిర్ణయించారు. భారత ప్రభుత్వం కానుగకు 6రూపాయల మద్దతు ధరను నిర్ణయించింది. బయోడీజిల్ కొనుగోలు రేటును 25రూపాయలుగా నిర్ణయించింది. పంట వేసుకోవడానికి 40% బ్యాంకుల ద్వారా, 60% సబ్సిడీని అందించే చర్యలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిర ప్రభ, వాటర్‌షెడ్ పథకాల ద్వారా చేపట్టు ఎస్సీ, ఎస్టీ అసైన్ భూములకు 100% రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. స్వశక్తి మహిళా సంఘాలచే ప్రభుత్వ బీడు భూములలో చేపట్టుటకు 100% రాయితీ అందిస్తామంది. ప్రతి వంద రైతులకు అనుసంధాన కార్యకర్తలకు నెలకు 1500 చొప్పున ఏర్పాటు చేసే నిర్ణయం గైకొంది. ప్రతి మండలానికి ప్లాంటేషన్ మేనేజర్, బయోడీజిల్ కొరకు 4వేల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ భూములలో కానుగ మొక్కలను పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ సంఘాలకు, పంచాయితీలకు, అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే పలు చోట్ల 2006-07, 08లలో రోడుకిరువైపులా, అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలను నాటి, పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. బ్లాక్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్‌పై రాష్ట్రంలో కోట్లు ఖర్చు చేశారు. 2007-08లోనూ కొనసాగించారు. ఇందిర ప్రభ అటకెక్కగా, సబ్సిడీలు మటుమాయమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించినట్లు పంటకు మద్దతు ధర చెల్లించడం కాని, కొనుగోలు చేసిన దాఖలాలు లేనేలేవు. కోట్లాది రూపాయల అంచనాలతో ప్రణాళికా బద్దంగా మొక్కల పెంపుదలకు కార్యాచరణ రూపొందించి అట్టహాసంగా పెంపకాలను చేపట్టినా, అది ఆచరణ శూన్యమే అయింది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494