S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వీక్లీ’యే ‘చింతనం’ - అదే ‘మంథనం’

సంఘజీవనంలో తలమ్ముకున్న బ్రతుకుల్లో రెండు రకాల స్వేచ్ఛలుంటాయి. ఒకటేమో మైదానం మధ్యలో ఒక ‘రాట’పాతి - దానికి, నిన్నో తాడువేసి కట్టి - ‘ఏలుకో ఈ పరిధి అంతా నీదే!’ అనడం. రెండోది - గదిలో నిన్ను పెట్టి, ‘ఇదంతా నీదే యధేచ్ఛగా ‘తిరుగు’ అనడం.
అలాగా, ఇప్పుడు ‘వీక్లీ’లోకి వచ్చాకా - రాంగానే ‘కటకటాల గది’లోకి వచ్చినట్లయింది. దినపత్రికలో ఉండే వెసులుబాటు వేరు. అది నిత్యనూతనం. మొత్తానికి వారపత్రిక ఆఫీసు, ఉమ్మడి హాలు మూల నుంచి ముందు గదిలోకి మారింది. సెగలోంచి పొగలోకి వచ్చినట్లైంది. క్రింద నించి మెట్లు ఎక్కంగానే, గదిలో మూడు ద్వారాలు కనబడతాయి. ఒకటేమో తిన్నగా రాధాకృష్ణగారి ఛాంబర్‌లోకి, రెండోది ఎడంప్రక్క సర్క్యులేషన్ వగైరాలలోకి - మూడోది కుడిప్రక్క నుంచి వారపత్రిక ‘ప్రెస్’లోకి - ప్రూఫ్ రీడర్ల బల్ల దగ్గరికి పోతాయి. లోనికి ప్రవేశించే ద్వారం ప్రక్కనే వున్న ‘కిటికీ మూల’లో నా బల్ల వేయించుకున్నాను. అక్కడికి ఫ్యాన్‌గాలి అందదు అన్నారు అందరూ, నా సహచరులు. అయినా, అదే ‘బెటరు’ అన్నాను నేను. చిన్నప్పట్నుంచీ నేను ‘కేమిల్ క్యాట్ కమ్ బెనారస్’నే. అంటే ‘ఒంటిపిల్లి రాకాశి’నే. మా మేనత్త కూతుళ్లు అలానే ఉడికించేవాళ్లు నన్ను. ప్రక్క గోడకి క్లార్కు శాస్ర్తీ కాక మరో ఇద్దరు ‘సబ్’లు. అటు తర్వాత ఎలాగో ఒక డొక్కు ‘్ఫంకా’ సంపాదించాను లెండి. కానీ, మా పని ఎలా వుందీ? అంటే - జనాలు వస్తూ వుండటం - ‘సర్క్యులేషన్’ ఎటండీ’, అనో, ‘రాధాకృష్ణ గారున్నారా?’ అనో అడగటం. ‘ఎంక్వయిరీ ఆఫీసు బ్రతుకై పోయింది సార్!’ అనేవాడు మా వాశిరాజు.
నేనా? నాడు, మాకు ఫౌంటెన్ పెన్స్ లేవు గనుక ఓ ముదురు నల్లములికి పెన్సిల్‌ని, ‘ఇలా’ పట్టుకుని - ప్రెస్‌లోకి వెళ్లిపోయేవాణ్ని. అక్కడ ‘స్టోన్’ మీద పేజీలు పెట్టుకోవడమే పని. నా చేతులకి ‘మయి’ అంటి వుండేది. అంటే ‘మసి’ - ఎప్పుడూ అలా అంటుకొని వుండేది. రెండు చేతులతో ఆ ‘బ్లాకు’ యిటు ఈ ‘బాక్సు’ అటూ అంటూ, పూసుకునేవాణ్ని కనుక - పెన్సిల్‌ని (రెండు చేతులతో పని చేయడం కోసం) నోట్లో పెట్టుకుని వుండేవాణ్ని. ఆఫీసు వారు ఇచ్చిన ఖాకీ డ్రస్సు తేడా తప్ప - వర్కర్లతో కలిసిపోయేవాణ్ని. నేనో ‘అక్షర కూలీ’ని!
‘ఎవరో వచ్చారు సామీ!’ అని, తాపీగా - శ్రీమాన్ రామారావు అటెండర్ వచ్చేవాడు. నా బల్ల ఎదురుగా ఒక కుర్చీ ఉండేది. ‘ఇన్‌ఛార్జి’ని కదా? మరి. డైలీలో ‘సబ్’ల బల్ల ముందు ‘నో ఛెయిర్స్’. క్రిందికి వెళ్లి టైమాఫీసులో మాట్లాడేవారు - ఎవరేనా వస్తే. ఐతే, ఇక్కడికి వచ్చేవాళ్లు అఫీషియల్ గెస్టులు కదా. కనుక ఒక్కోసారి ప్రక్క డిపార్టుమెంట్‌లో నుంచి మరో కుర్చీనెత్తుకొచ్చేవాళ్లు మా వాళ్లు. ఎదురుగా రూపాయి కాసంత బొట్టుతో, గుండ్రని మొహం, దబ్బపండు రంగు ఛాయగల పెద్ద ముత్తయిదువ ఒకామె కూర్చుని ఉన్నది. నేను స్టైల్‌గా (ఉత్తదే.. నేను మామూలుగానే వస్తాను, కానీ అలా అనేవాళ్లు) వచ్చి, పెన్సిల్ నోటిలోనుంచి తీసి, ‘గ్లాసు’లో అదే నా పెన్‌స్టాండ్ లెండి - పడేసి కూర్చున్నాను. ఆమె ప్రసన్నంగా, వాత్సల్యంగా చూస్తూ, ‘బాబూ! వీరాజీగారు ఎప్పుడొస్తారు?’ అనడిగింది సంకోచంగా. నేను నవ్వేసి, లేచి నిలబడి ‘నమస్తే’ అని, తిరిగి కూర్చొని ‘నేనే వీరాజీని. చెప్పండి’ అన్నాను. ఆమె భర్త, పెద్దాయన చనువు తీసుకుని - ‘వీరాజీ, అంటే ఇంత కుర్రాడనుకోలేదు. సారీ. ఎంతో ‘పెద్దాయన’ అయి ఉంటాడు అనుకున్నాం’ అంటూ అపాలజీ ఇస్తూ వుంటే, నేను అన్నాను ‘తప్పకుండా ‘పెద్దాణ్ని’ అవుతాలెండి సార్’ అన్నాను. ‘కాలం ఆగదుగా?’ అని ముక్తాయింపు ఇచ్చాను.
ఆమె ‘వెండి మబ్బు’ నవల సీరియల్ రాస్తున్న రచయిత్రి శ్రీమతి శర్వాణిగారు. ‘త్రివేణి’ రాసిందే మరొక నవల - కన్నడ హిట్ నవల ‘తామరకొలను’ నవలను (తెలుగులోకి ఈమె అనువాదం) ఇవ్వటానికీ - ఓసారి కొత్త ‘ఇన్‌ఛార్జి’ని చూసేద్దామనీ వచ్చిందట. భర్తగారు ‘ఎస్కార్టు’ చేశారన్నమాట.
ఎంతో చనువుగా, వాత్సల్యంగా మాట్లాడేరు వాళ్లు. ‘మీసకట్టు ఫుల్‌గా లేదు. పోనీ కళ్లజోడు అయినా ఉందా? అంటే అదీ లేదు’ అంటూ నవ్వేశాడాయన. ‘రేపు పెళ్లయితే, ఆ రెండూ వస్తాయి లెండి’ అన్నదామె - శర్వాణిగారు. ఆయన కూడా నావైపు ‘ఎలిజబుల్ బ్యాచిలర్’గా చూడటాన్ని - నాలోని ‘రచయిత’ గ్రహించాడు. వారికి ‘తీన్‌కన్యా’ - ముగ్గురమ్మాయిలు. అందులో పెద్దమ్మాయి పెళ్లీడుది. నేను వీక్లీ నుంచి బెజవాడ డైలీకి వెళ్లిపోయినా గుడివాడలో వుంటున్న వారితో స్నేహానురాగాలు కొనసాగాయి. ఇలాగ రచయితలు, లేదా రచయిత్రులు రావడం ‘రొటీన్’ అయిపోయింది. (తిరుపతి పోతే - తిరుగుదలలో మద్రాసు - అందులో తంబుచెట్టి స్ట్రీట్ ‘మస్టు’)
ఇదే ‘చూపు’ నా మీద - మా శ్రీరాములు గారికీ, అకౌంటెంట్ నరసింహారావు గారికీ కూడా వుండటం నేను పసిగట్టాను. శ్రీరాములుగారు వాళ్లింటికి కూడా తీసుకువెళ్లారు. నాతో ఆయన ‘కాంప్లెక్స్’ లేకుండా - సినిమా ప్రీవ్యూలకి కూడా వచ్చేవారు. ‘షో’ అయిపోయినాక థియేటర్ నుండి - ఆయనటు, నేనిటూ వెళ్లిపోయేవాళ్లం. డైలీ ఇన్‌ఛార్జి శ్రీరాములుగారి దగ్గర నుండి నేను కొద్దిరోజులలోనే చాలా నేర్చుకున్నాను. అయినా తరచు కనబడేవారు. తాజ్‌మహల్ హోటల్ (చిన్న ‘తాజ్’లెండి) ప్రక్కన బొడ్డపాటి వారి సందులో ఇల్లు తీసుకుని ఆయన, బెజవాడ వచ్చాకా కాపురం పెట్టారు. అది వాళ్ల ఆఫీసుకి ఓ వంద గజాల దూరంలో ఉంది. మా నాన్నగారి ఇంటికి పొరుగు.
అద్సరే.. సాయంకాలాలు మా సభాపతితోనో ‘రాం.ప్ర.’తోనో - పాండీబజారు ‘నారాయణ కేఫ్’కి (గంటకు పైగా బస్సు యాత్ర చేసి) పోయి - ‘పెసరట్టు’ తిని - (అప్పుడది ఓ ‘్ఫ్యడ్) టి.నగర్ ఫుట్‌పాత్ మీద - ‘వాకింగ్’ చేసి - అక్కడికే సినిమా పక్షులు విహారార్థం వచ్చేవారు. ఆనక ఇంటికి పోవడం. ఇక శనివారం సాయంకాలం వచ్చిందీ అంటే - మైలాపూర్ లజ్‌కార్నర్ మీదుగా పోయి ‘శుకనివాస్’లో పుల్కా, మిల్లిగినె్నలో ముద్ద పెసర పప్పు - వెనిగర్‌లో నానబెట్టిన ఉల్లిచెక్క కిలిపి ఇచ్చిన పుల్కా తినడం వగైరా ‘హాబీ’లు బెజవాడ వచ్చాకా మటుమాయమయిపోయాయ్. ఏమైతేనేం.. గదిలో ఫ్రీడమ్ దొరికిందిగా. ‘లయన్ టేమ్డ్’ అనేవాళ్లు ఫ్రెండ్స్ నన్ను. సరదాగా పెద్దలు మద్రాసులో.
హాయిగా తంబుచెట్టి గారి ప్రక్క వీధిలో వున్న కేథలిక్ సెంటర్‌కి పోయేవాణ్ని. అక్కడ వైఎంసిఏలో సరదాగా గడిపేవాళ్లం. అది కూడా, ఇక్కడతో ‘సఫా’ అయింది. అక్కడ అందరూ ‘కార్డ్స్’ కాదు గానీ - చాలామంది ‘యంగ్స్’ ‘బిలియర్డ్స్’ ఆడేవాళ్లు. ‘క్యూస్టిక్’ అందించి ‘వాంగో సార్. యూ ఆర్ వెరీ యంగ్. మీరు బిల్లియర్డ్స్ ఆడాలి’ అనేవాళ్లు. ‘టైము లేదు’ అని తప్పించుకునేవాణ్ని. నా చేతిలో చిన్నప్పటి నుంచే, ఒక చేతిరుమాలు ‘్ఫ్యషన్’గా ఉండేది. మా చిన్నప్పుడు చేతిలో రుమాలు వూపుతూ లేదా, ఉత్త ‘కీ చైన్’ అయినా వూపుతూ నడవటం ఫ్యాషన్. ఒకటి రెండుసార్లు ఇలాంటి సందర్భాలలో - అటు తిరిగి రుమాలుతో కన్నీళ్లు ఒత్తుకున్న సంగతి - ఆఖరికి మా సభాపతికి కూడా తెలియదు.
గంటకి పధ్నాలుగణాలు గెస్ట్ ఛార్జి ఇవ్వాలి. ‘క్యూస్టిక్’కి బాడుగ తప్పదుగా. పధ్నాలుగు అణాలే! ‘నేను’ ‘డబ్బులు’ సంపాదించుకుంటున్నానే గానీ ‘డబ్బు’ అనేదాన్ని ఆర్జించటం లేదు’ అనేవాణ్ని నేను నవ్వుతూ. సరే! ఇంతకీ ‘సభాపతి అవర్‌ఘల్’ ఎవరో చెప్పనే లేదు కదా? ‘్భరతి’ పత్రికకి తెలుగులో వ్యాసాలు రాసే, అతి సుకుమార తమిళ యువకుడు. మెడికల్ కాలేజీ పేథాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిమాన్‌స్ట్రేటర్ అయినా జూనియర్ లెక్చరర్‌లాగా క్లాసులు కూడా తీసుకునేవాడు. నా రచనలు చదివిన నా వీర అభిమాని. ఇప్పుడు నా క్లోజ్‌ఫ్రెండ్ కూడాను.
ఒకసారి నేను వర్కింగ్ జర్నలిస్ట్‌ల కార్యాలయం నుంచి - అక్కడ మవుంట్ రోడ్‌లో - యమ్.యస్. శర్మ గారు, ‘బస్సు’ ఎక్కించగా - ఇంటికి వచ్చేస్తున్నాను. ‘సెంట్రల్ స్టేషన్’ స్టాపులో బస్సెక్కాడు సభాపతి. బైదిబై సెంట్రల్ స్టేషన్‌కి ఎదురుగా వుండేదే గవర్నమెంటు పెద్దాసుపత్రి. దాన్నానుకునే మెడికల్ కాలేజీ వగైరా.. అంచేత అది ఆతని బస్‌స్టాప్ కావచ్చును.
ఇంకేముందీ? షరా మామూలేగా.. మేమిద్దరం బస్ లోపల ‘రాడ్’కి వ్రేలాడుతున్నాం. ముందు వరసలో, లేడీస్ సీట్లలో సీతాకోక చిలుకలు (మా పరిభాష) అంటే మెడిసన్ చదివే విద్యార్థినులు కూర్చున్నారు. అంతలో కండక్టర్ గంట రాడు లాగి - ‘పూకడై.. పూకడై.. ఏరుంగో.. ఏరుంగో’ అంటూంటే - వాళ్లు వయ్యారంగా లేచి, దిగటానికి ఉటంకిస్తూ - వాళ్లల్లో వాళ్లు - ముసిముసి నవ్వులతో మొదలుపెట్టి - ఆనక కిలకిలా నవ్వేస్తూ దిగిపోయారు. ‘పూకడై’ అంటే పూల మార్కెట్టు అన్నమాట. సభాపతి నన్ను ఇలా పొడిచి ‘దే ఆర్ ఆంధ్రా గాళ్స్’ అన్నాడు. తర్వాత కండక్టర్ ‘పాయ్‌కడై.. పాయ్‌కడై’ అంటున్నాడు. (అనగా ‘చాపల’ బజారు) నేనడిగాను - ‘తంబీ! ఎలా చెప్పావు, వాళ్లు తెలుగు వాళ్లని?’ అని. మనవాడు ‘పూకడై’ అనరుస్తూ వుంటే - తమిళ పిల్లలకి ఏ ‘శే్లష’ శృంగార శబ్ధం స్ఫురించదు. కానీ, తెలుగు మెడికోస్ చాలామందే ఉన్నారు. వాళ్లకా మాటకి.. ‘హిహి’ అంటూ నవ్వేశాడు, అదోలాగ - ఎప్పుడూ సీరియస్‌గా ఉండే మావాడు. చాలా విషయాల్లో నాకు ‘గైడు’.
అలా మొదలయింది మా స్నేహం. నాన్నగారికి సభాపతి అంటే చాలా ఇష్టం. ‘డెలికేట్ డాల్’ అనేవారు. మళ్లీ నాకు క్యాంపస్ ఫ్రెండ్స్ లాంటి ఫ్రెండ్ దొరికాడు. గానీ ఆ ‘లైఫ్’ ఏదీ? ఇప్పుడు ఆదివారం కూడా ‘కొలువు’ వుండెనే! ‘ఏమి జలమంబేమి జీవనంబో..’
అది అట్లుండ నిండు. నాకు ఇది అలవాటే. ‘పనస పండు విప్పిపెడితే తినలేని బ్రామ్మడు దిక్కులు దిక్కులు చూశాట్ట’ అనేది మా సత్యం అత్త. ‘నీ, సిగ్గు కాకులు ఎత్తుకెళ్లా’ అని ఓ పోటు పొడిచేది.
బోస్‌రోడ్డు - అదే చైనా బజార్ పెద్ద రోడ్డు మీద మా ‘పత్రికలు’ పరిచిపెట్టారా? లేదా? సాయంకాలం అయిందిగా, మా వీక్లీలు ఎలా కదులుతున్నాయి? ఇదే ‘యావ’ ఎంతసేపూ. ‘ప్రభ’ బుధవారం తేదీ గలది ముందు శనివారం వచ్చేది. దాంతో ఏదో సామెత చెబుతారే - ‘ముందొచ్చిన వాడే వరుడు’ అలా, ఎగరేసుకు పోయేవారు పాఠకులు. మేము మాత్రం ఏమయినా తక్కువ తిన్నామా? పై బుధవారం వీక్లీ రుూ ముందు గురువారమే పెట్టేశాం. గానీ వాళ్లు ముందు బుధోరమే వచ్చేశారు. అలా మేము ‘అడ్వాన్సు’ అయిపోయాం. ఇప్పటికీ వారపత్రికలకి ఇదే ‘ఒరవడి’. కానీ, ఇలా ఇలా ‘పబ్లిషింగ్ డేట్’ కన్నా ముందుకీ, పది రోజులకన్నా, ఎక్కువ (తేడా) రాకూడదు. అది ‘రూలు’. దీనికో కమ్మరి కిటుకు కనిపెట్టాం. యస్.ఆర్.గారి బుర్ర పాదరసంలాగా పనిచేస్తుంది. బుధవారం కాదు; దాని ముందు శుక్రవారానికి ప్రచురణ తేదీని - రెండో కంటి వాడికి తెలియకుండా జరిపేశాం. దీంతో రెండ్రోజులు అడ్వాంటేజ్ వచ్చింది.
ఆ రోజులే వేరు. అది వారపత్రికల ‘జమానా’. అక్షరమ్ముక్కలు వచ్చిన అందరికీ పత్రికలే కావాలి. ఎన్నో మాస, పక్ష పత్రికలో వుండేవి. కానీ ‘వీక్లీ’ లే టాప్!
మన వీక్లీకి అనగా ఆంధ్ర సచిత్ర వారపత్రికకి ఎవ్వరికీ లేని మరో ప్రత్యేకత కూడా ఉండేది. వాటిలో ఒకటి ఊమెన్ కార్టూన్. అతను ‘శంకర్ వీక్లీ’ లెవెల్‌ను కూడా దాటేసిన రాజకీయ వ్యంగ్య చిత్ర ‘విశ్వకర్మ’ లాంటివాడు. ఓల్డ్ జీనియస్. అలాంటి అతని ‘్ఫల్‌పేజీ’ ఒక క్రేజ్. అది మా వీక్లీ స్పెషల్. కేరికేచరింగ్ మాస్టర్ ఊమెన్‌జీ. నెహ్రూ, మొరార్జీ, రాజాజీలనే కాదు మామూలు ఛోటామోటా నాయకుల బొమ్మలు కూడా - వాళ్లు ఎదురుగ్గా వచ్చి మన ముందు నిలబడ్డట్లు - వాళ్ల వ్యంగ్యరూప రాజములను అమోఘంగా గీసేవాడు. ఐడియాల విషయం, సరే, శంకర్ ది గ్రేట్ - శంకర్స్ వీక్లీ టాప్ - కానీ, ఏదీ? డైలీకి రాజకీయ నాయకుల వ్యంగ్య రూప విలాసాలతో వ్యాఖ్యలు, చురకలు అందించటం మన వాళ్లకి అనితర సాధ్యం అయింది. ఎంత ప్రయత్నించామో తెలుగులో ఫుల్‌టైమ్ కార్టూనిస్టులు అప్పట్లో దొరకలేదు.
అయితే మా హయాంలో ‘బాపూ’ విశ్వరూపం ధరించాడు. అది బంగారుబొమ్మల కాలం. అది ఉభయతారకం. కాగా - కొత్తవాళ్లవి సంసార పక్షపు ‘సజీవ చిత్రాలు’ అనిపించేటంత గొప్ప కార్టూన్లూ చెలరేగాయి. కార్టూనిస్ట్ జయదేవ్ బాబులు, బాబులు, సుబ్బారావ్‌లు, శంకులు, రామకృష్ణలు, తులసీరామ్‌లు - అలా ఎందరో. రాగతి పండరి (ఒన్ అండ్ ఓన్లీ ఒన్!) వీళ్లంతా అమెచ్యూర్‌లే. ప్రొఫెషనల్స్ అవటానికి ఛాన్సు లేదు. మా తమ్ముడు ఫుల్ టైమర్‌గా అయ్యేవాడే గానీ - ప్రభకి ఆపాటికే స్ట్ఫార్‌గా అమరిపోవడంతో అది కుదరలేదు. అధికాంశం పోకెట్ కార్టూనే్ల తెలుగు దినపత్రికలని డామినేట్ చేశాయి.
అందుకే కొందరన్నారు - ‘ఊమన్’ చేతనే ‘లోకం పోకడ’ వేయించకపోతే - ఆ సింగిల్ కాలమ్‌కి మన వాళ్లనే లాక్కోరాదా?’ అని. మేమూ అనుకున్నాం గానీ ‘ఊమెన్’కున్న గ్లామరూ, పాపులారిటీని ‘ఇంకా ఎక్కువగా సొమ్ము చేసుకోవాలి’ అనుకున్నాం. అతను ప్రత్యర్థి వారపత్రికకి ‘జోబీ కార్టూన్లు’ వేసి ఇవ్వకుండా ఆపాలన్నదే మా ధ్యేయం. ‘లోకం పోకడ’ బొమ్మలు కూడా అతనే వెయ్యాలి’ అన్నది మా నిర్ణయం. శ్రీ ఊమెన్‌ని ఇంటర్వ్యూ చెయ్యాలనుకున్నాను. కానీ, ఆయన ‘చిక్కడు - దొరకడు’. పైగా చెవిలో చెవిటి మిషన్ ఒకటీ. అతను చాలా పెద్దవాడు - వయసులో కూడా. అతనికి తెలుగు రాదు. అదో మైనస్ పాయింట్. ఆ రోజుల్లో ఫొటోలు తియ్యడమే గగనం. గానీ, ఊమెన్‌గారు మాత్రం ‘తెలుగు లైఫ్’ని - మన జీవన శైలిని - ముఖ్యంగా ‘జై ఆంధ్రా మూమెంట్’లో బాగా పట్టేశాడు. అందుకే ‘మరోడు’ ఆ జాగాలో దూరలేకపోయాడు.
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com