చరిత్రకూ ఒక చరిత్ర
Published Saturday, 29 June 2019మానవజాతి చరిత్ర గురించి పరిణామం గురించి ఈ మధ్యన కొత్త పద్ధతిలో విశే్లషణలు చెప్పే పుస్తకాలు కొన్ని వచ్చాయి. వాటిని సంపాదించి చదువుతున్నాను. అలాగే మరొక పక్కన ఉర్దూ సాహిత్యంలో గజల్ పాత్ర గురించి చదువుతున్నాను. సీరియస్ విషయాలు చదువుతుంటే కొంచెం బుర్ర వాచిన భావన కలుగుతుంది. అటువంటి సందర్భంలో లైట్‌గా ఒకటి రెండు నవలలు చదవడం నాకు అలవాటు. పెర్రీ మేసన్ డిటెక్టివ్ నవల ఒకటి చదివాను. లాస్‌ఏంజెల్స్ నగరంలో తెలిసిన వీధులు స్థలాల మధ్య మళ్లీ తిరుగుతున్న భావన కలిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘మా బాబు’ నవల కూడా ఒక్కరోజులో చదివేశాను. చాలా గొప్ప రచన. ఒక కాపు యువకుని జీవితాన్ని ఆత్మాశ్రయంగా పెద్దాయన చెప్పిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఈలోగా పురాణవైర గ్రంథమాల గుర్తుకు వచ్చింది. చరిత్రను పడమటి వారు విడిగా మార్చి చెప్పారని ఆయన తనకు తెలిసిన చరిత్రను తిరగరాశారు. అయితే దాన్ని చరిత్ర రాస్తే ఎంతో బాగుండును. ఆయన ఆ సమాచారాన్ని నవలలుగా రాశారు. చదివిన వారు కూడా వాటిని నవలలుగా మాత్రమే చదివారు. అది చరిత్ర అన్న భావన ఎవరికీ మిగలలేదు. ఆరు నదులు అన్న నవలలో విశ్వనాథ వారు నాగరికత మన దేశం నుంచి ప్రపంచానికి విస్తరించిన తీరును వివరించారు. ఆ సమాచారాన్ని పరిశోధన పత్రాల పద్ధతిలో ప్రచురించి ఉంటే గొప్ప ప్రభావం ఉండేది అని నా భావన.
మిత్రుడు గాంధీగారు నన్ను భారతదేశ చరిత్ర గురించి తెలుగులో రాయమన్నారు. నేను ఆ పని చెయ్యలేదు. అందుకు నిజమైన కారణం లేదు. ఇప్పుడు మళ్లీ ఒకసారి దృష్టి చరిత్రవైపు మళ్లింది. ఈ మధ్యన నేను ఆసియా దేశాలైన పర్షియా, మంగోలియా, జపాన్, కొరియాల చరిత్రను తవ్వి చదివే ప్రయత్నంలో ఉన్నాను అని ఒకప్పుడు ఎప్పుడో చెప్పినట్టు ఉన్నాను. ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఎన్నో విచిత్రమయిన విశేషాలు ముందుకు వస్తున్నవి. వాటిని ప్రపంచంతో పంచుకోవాలన్న కోరిక బలపడుతున్నది. ఎన్ని పనులని చేయను. అలుపు లేకుండా ఏదో చేస్తూనే ఉన్నాను. నా బతుకు మార్గం ఇంక అదే.
మానవ జాతి మొత్తానికి పరిణామ క్రమం అని ఒకటి చెప్పి అందులో ఎన్నో విశేషాలు చెబుతారు. అది మొత్తం జాతి యొక్క చరిత్ర. నేను ఈ మాట అంటే చాలామందికి నచ్చదు. చరిత్ర అనగానే అందులో రాజులూ, యుద్ధాలూ మొదలైనవి ఉండి తీరాలి. మొత్తం జాతి మారిన తీరును గురించి చెబితే అది చరిత్ర కాదు అన్న భావన అందరికీ బలంగా ఉంది. మనకు తెలిసిన చరిత్రలో రాజులు ఉంటారు. నిజానికి ప్రజలు ఉండరు. ఆ మధ్యన నేను రాజ్‌మోహన్ గాంధీ గారిని కలిశాను. ఆయన అటు మహాత్మాగాంధీకి, చక్రవర్తి రాజగోపాలచారి గారికి, మనవడు. మీ తాత గురించి దేశానికి మొత్తానికి తెలుసు. వారి తాతలు గురించి తెలుసునా అని అడిగాను. ఆయన నవ్వాడు. ఇక మా తాత గురించి నాకు కూడా తెలియదు అన్నాను. చరిత్ర అనగానే దేశాలు, రాజులూ, యుద్ధాలు మొదలైన అంశాలను గురించి చెబుతారు. దాన్ని మనం మాక్రో హిస్టరీ అనవచ్చు. మా ఊరి గురించి మా తాతగారి గురించి తెలియాలంటే దాన్ని సూక్ష్మ చరిత్ర లేదా మైక్రో హిస్టరీ అనాలి అన్నాను. ఆయన చాలా సంతోషించారు. ఇంతకు ఎప్పుడు మొదలైంది అన్నది ఇక్కడ ప్రశ్న. తెలుసుకోవడం కష్టం ఏమీ కాలేదు.
మనకు తెలిసిన ఈ చరిత్రకు ఒక చరిత్ర ఉంది. పాతకాలం నుంచి చదువుకున్న వారు కానీ చదువు లేనివారు గానీ అన్ని సమాజాల వారు తమ విషయాలను గుర్తుంచుకుని, గుర్తించుకుని నమోదు చేసి పెట్టే పద్ధతిని పాటించాలి. మొదట్లో ఇటువంటి రచనలు కేవలం దైవ సంబంధమైన విషయాలను మాత్రమే ప్రస్తావించాయి. ఆ తరువాత కొంచెం తెలిసిన సమాజాల వారు తమ ప్రభువు రాక కార్యాలను గురించి ఎప్పటికప్పుడు రాసి పెట్టడం మొదలుపెట్టారు. రాత మొదట్లో మట్టి పలకల మీద జరిగింది. తరువాత వాళ్లు కట్టిన గుడి గోడల మీదకు ఎక్కింది. గ్రీకు దేశంలో ప్రాచీన కాలంలో హెరోడోటస్, తుసిడిడెస్ క్రీ.పూ. ఐదవ శతాబ్దంలోనే చరిత్రను గురించి విషయ సేకరణ అనే పద్ధతిని ప్రారంభించారు. హిస్టరీ అన్న మాటను మొట్టమొదటగా వాడిన వారు హెరోడోటస్. ఆ మాటకు విషయ సేకరణ అని అర్థం. పెల్లోపోనీసియన్ యుద్ధం గురించి అతను రాసిన వివరాలు మొట్టమొదటి చరిత్ర గ్రంథంగా చెప్పుకోవచ్చు. అయితే అందులో దేవతల విచిత్రాలను గురించి కూడా కొంత ప్రసక్తి ఉంది. యుద్ధాలలో దేవతల పాత్ర ఎంతో ఉందని అతను రాశాడు. యుద్ధం గురించిన వివరణాత్మక వర్ణన, రాజకీయపరమైన విభేదాలు, దౌత్యం, చివరకు నిర్ణయాలు ఇదే అతని దృష్టిలో చరిత్ర. ఈ పద్ధతి ఇవాళ్టి వరకూ కూడా కొనసాగుతున్నది అంటే ఆశ్చర్యం లేదు కదా.
మనం ఇవాళ ఉన్నచోటికి ఎలా చేరాము అన్నది ఒక ప్రశ్న. దానికి జవాబు చెబితే అది చరిత్ర. సామాజికపరంగా మనం ఇవాళ ఉన్న పరిస్థితికి ఎలా చేరాము అన్న ప్రశ్నకు జవాబు చెబితే మాత్రం అవి చరిత్ర కాదు. క్రీ.పూ.200 ప్రాంతంలో హెలెనిక్ చరిత్రకారులు పాలిబియస్, ఆ తరువాత చరిత్రకారుడు లివీ కూడా రోమ్ చరిత్ర గురించి రాశారు. అది కేవలం ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన విషయం అయినా దాన్ని యూనివర్సల్ హిస్టరీ అన్నారు. రోమ్ గురించి రాసినది నిజానికి మరీ పాతకాలానికి సంబంధించిన విషయం కాదు. మన దేశంలో రామాయణ భారత కథలు రాశారు. వాటిని పురాణాలు అనలేదు. ఇతిహాసాలు అన్నారు. అంటే అది చరిత్ర. అయితే రాముడిని, కృష్ణుడిని దేవుడిగా చూచిన భారతీయులు దాన్ని చరిత్రగా చూడటం మాత్రం మరిచిపోయారు. మనవారికి కాలం గురించిన లెక్కల మీద పెద్ద పట్టు లేదు. అభూత కల్పనలు చెప్పడం అంతకంటే ఎక్కువ అలవాటు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది. రాముడు ఎంత బతికినా కొంతకాలమే బతికాడు. మరి త్రేతాయుగంలో రామాయణం కాకుండా మరొక విశేషం ఏదీ జరగలేదా అన్న ప్రశ్న ఎవరూ అడగలేదు. ఇదే సమస్యను ద్వాపర యుగానికి కూడా అనుసంధించి చెప్పవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన రోజున లేదా ఆ తరువాత కొంతకాలానికి కలియుగం మొదలైంది అంటుంది భాగవత పురాణం. అంతకు ముందు కొన్ని తరాల చరిత్ర తెలుస్తూనే ఉన్నది. దానే్న మహాభారతం అన్నారు. దానిని ఐదవ వేదం అని కూడా అన్నారు. ఆ దెబ్బతో అది మనిషి తెలుసుకోవలసిన చరిత్ర కాకుండా మరేదోగా మిగిలిపోయింది. ఆ సంగతి పక్కనపెట్టినా సరే ద్వాపర యుగంలో కురువంశం తప్ప అంతకు ముందు చరిత్ర ఏమైంది? ఇది అసలు ప్రశ్న. విశ్వనాథ సత్యనారాయణ గారు గ్రామ పురాణవైర గ్రంథమాలలో ఈ విషయాలనే వివరించారు అంటే ఆశ్చర్యం లేదు. పురాణాలు ఇతిహాసాల పేరున మనకు చెబుతున్న కాల ప్రమాణాలు లెక్క తప్పు అని ఆయన అర్థం చేసుకున్నారు. యుగం ముగిసే ప్రళయం రావలసిన అవసరం లేదని కూడా ఆయన అనుకుంటున్నట్లు తోస్తుంది. భగవంతునితో వైరము, నాస్తికధూమము, దిండు కింద పోకచెక్క, చిట్టీ చెట్లను గాజులు లాంటి పేర్లతో ఆయన చరిత్ర చెబితే అది చరిత్రగా ఎవరికీ వినిపించలేదు. కనిపించలేదు. మనకు తెలిసి వచ్చిన తరువాత వాటిని చరిత్ర ఆధారంగా చెప్పిన నవలలు అనుకుని అందరూ చదివారు.
ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్ర చదువుతున్నప్పుడు నా మెదడులో ఒక ప్రశ్న గట్టిగా మోగుతుంది. అక్కడ ఆ సంఘటనలు జరుగుతున్న సందర్భంలో మన దేశంలో ఎవరు ఉన్నారు ఏమి జరుగుతూ ఉంది. ఈ రకమైన వివరాలతో ఒక పెద్ద టైమ్ లైన్ చార్ట్ తయారుచేయాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ అందుకు నాకున్న హంగులు సరిపోవు. సామాజిక శాస్త్రాలను గురించి ప్రపంచ స్థాయిలో చాలా పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో చాలా వాటిని నేను కూడా చదివే ప్రయత్నం చేశాను. ప్రతి చోట నా మెదడులో పుట్టే మొదటి ప్రశ్న ఒక్కటే. అందులో భారతదేశపు ప్రసక్తి ఎంత ఉంది అన్నది. సామాజిక శాస్త్రం గురించి రాసినా, సైన్స్ గురించి రాసినా పడమటి వారికి భారతదేశం ఎందుకో అంతగా గుర్తుండదు. అయితే 0 అనే శూన్యం గురించి చెప్పి మన దేశానికి ఎంతో మేలు చేద్దాము అనుకుంటారు. ఇక్కడ వచ్చిన లోహశాస్త్రం మొదలైన వాటిని ప్రపంచానికి చెప్పాలని మన వాళ్లు కూడా అనుకున్నట్లు కనిపించదు. అసలు ఆసియా దేశాల గురించే కొంత ఉదాసీనత పడమటి వారి మెదడులో ఉన్న సంగతి కొత్త కాదు.
వ్యవసాయం అన్నది మానవ జాతి చరిత్రలో ఒక గొప్ప భాగం. ప్రపంచంలో వ్యవసాయం అన్ని చోట్ల పుట్టిన తీరు గురించి చెపుతారు గాని, భారతదేశం, చైనాలోని పంటల ప్రసక్తి అక్కడ కనిపించదు. ఐదు ఆరు ధాన్యాలను ప్రధానంగా తింటున్నాము. వాటిలో వరి ముఖ్యమైనది. ప్రపంచంలో అన్ని చోట్లకన్నా ఈ పంట మన దేశంలో చైనాలో ఎక్కువగా ఉంది. కలకాలంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ చరిత్రలో ఈ అంశాన్ని ఎంత వివరించారు అన్న సంగతి గురించి తెలుసుకోవాలి.
విశ్వనాథ వారికి నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజుల కథలు దొరికాయి. వాటిని కూడా నవలలు రాశారు. అంతేగానీ మన రాజుల కథలు మాత్రం దొరికినట్టు కనిపించదు. చివరికి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజుల గురించి కూడా కొంతకాలం వరకు మాత్రమే తెలుసు. అంతకు ముందు ఇక్కడ జరిగిన వివరాలు అంతగా తెలియవు.
నేను చరిత్ర విద్యార్థిని కాదు. కేవలం ఆసక్తి కొద్దీ చరిత్ర గురించి ఆలోచిస్తున్నాను చెబుతున్నాను. ఈ విషయం గురించి మరింత మంచి సమాచారం తెలిసినవారు మన లాంటి వాళ్లకు అందరికీ దాన్ని అందజేయాలి. నా ఉత్సాహం నీలో నేను ఏదైనా పొరపాటు మాటలు ప్రస్తావించి ఉంటే ఆ విషయం కూడా నాకు చెప్పాలి. నాకే కాదు ప్రపంచానికి మొత్తానికి చెప్పాలి. మహాభారత యుద్ధం జరిగి కేవలం 5వేల సంవత్సరాలు మాత్రమే అయింది అంటారు. అంటే కలియుగం మొదలై ఐదువేల సంవత్సరాలు మాత్రమే అయిందా? రామాయణం అంతకు ముందు జరిగింది. అయోధ్యకు పోతే అక్కడ పోనీ అని ఒక నాలుగు చూపిస్తారు. దశరథుని ఇల్లు అని ఒక చిన్న ఇంటిని చూపిస్తారు. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి అని చెబితే నమ్మడం ఎలాగ?
బుద్ధుడు క్రీస్తు పూర్వం మూడు నాలుగు వందల సంవత్సరాల నాటి వాడు. నాకు నీ మీద అంత నమ్మకం లేదు. కానీ ఇక్కడ వాటి అవసరం ఉంది. బుద్ధునికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ఇదిగో ఇదే చెట్టు అని అక్కడ ఒక బోగి వృక్షాన్ని చూపిస్తారు. వేల ఏళ్లు దాటిన ఆ చెట్టు అలాగే నిలిచి ఉందా? రాజుల చరిత్ర కానీ, సంస్కృతిలో మరొక సంగతికి సంబంధించిన విషయం కానీ, చరిత్రను చెబితే బాగుంటుంది. మసిపూసి మారేడు కాయ చేస్తే దాన్ని ప్రజలు నమ్మరు.