విలువ
Published Saturday, 29 June 2019ఈ మధ్య ఓ మిత్రుడు ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడిగాడు. కొంచెం మాట్లాడే పని ఉంది అని చెప్పాడు. అతను మిత్రుడు అనే బదులు తెలిసిన వ్యక్తి అంటే నిజంగా ఉంటుంది.
సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వచ్చాడు. టీ తాగిన తరువాత అతను వచ్చిన పని గురించి అడిగాను. చెప్పాడు. అతని కొడుక్కి ఓ రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఓ వారం రోజులు మాత్రమే ఇద్దరూ కలిసి ఉన్నారు. అతను అమెరికాకు వెళ్లిపోయాడు. రెండు మూడుసార్లు టికెట్లు పంపించినా ఆమె అక్కడికి వెళ్లలేదు. అతనితో ఆమె మాట్లాడటం కూడా మానేసింది. చివరికి అతను విడాకుల కోసం హైదరాబాద్‌లో దరఖాస్తు చేశాడు. అది విచారణలో ఉంది. త్వరగా విడాకులు వచ్చే అవకాశం ఉందా? అమెరికాలో విడాకులు తీసుకుంటే ఇక్కడ చెల్లుబాటు అవుతుందా? ఇలాంటి లక్షా తొంభై ప్రశ్నలు అతను అడిగాడు. అన్నింటికీ ఓపికగా జవాబు చెప్పాను.
అతనికి నచ్చిన జవాబు లభించలేదు. బాధపడ్డాడు. విచారించాడు. కొడుకు జీవితం పాడైపోతుందని దుఃఖించాడు. అతన్ని ఓదార్చడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
కొంత సమయం తరువాత మామూలు ప్రశ్నలు వేశాడు. కొంత సమయం తర్వాత అతను ఓ గమ్మతె్తైన ప్రశ్న వేశాడు.
‘మీరు ఇప్పుడు పదవీ విరమణ చేశారు కదా? మీకు ఎలా కాలక్షేపం అవుతుంది’ అని.
ఆ వ్యక్తి కూడా పదవీ విరమణ చేశాడు.
‘నాకు టైం దొరకడంలేదు. ఐదు పత్రికలకి కాలమ్స్ రాయాలి. ‘లా’ పుస్తకాలు, కవిత్వం కథలూ సరేసరి. వారానికి మూడు రోజులు కోర్టుకి వెళ్తుంటాను’ అని చెప్పాను.
‘దాదాపు రెండు గంటల సమయం మీ కోసం వెచ్చించాను. అది తిరిగిరానిది. మామూలుగా అయితే ఈ సమయానికి చార్జి చేయాలి. మీకు నేను ఏమీ చార్జి చేయకపోవడం వల్ల మీకు అలా ప్రశ్న అడగాలని అన్పించింది’ అని చెబుదామని అనుకున్నాను. కానీ చెప్పలేదు.
అతని అమాయకపు ప్రశ్నకి నాలో నేను నవ్వుకొని ఊరుకున్నాను.
అంతే!
సమయానికి విలువ కట్టగలమా?