S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతరిక్షంలో సొంతిల్లు!

ఒకవైపు రెండో చంద్రయానానికి సిద్ధపడుతూ.. మరోవైపు మూడేళ్లలో ముగ్గురు వ్యోమగాములతో గగనయానానికి అడుగులేస్తూ.. ఇంకోవైపు మనకంటూ సొంతంగా ఓ ‘అంతరిక్ష కేంద్రం’ నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తూ ‘ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) దూకుడును పెంచింది. తొలినాళ్లలో కొన్ని అపజయాలు, అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ‘ఇస్రో’ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. 1963 నవంబర్ 21న తుంబా (కేరళ)లోని ‘ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్’ నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగంతో ప్రారంభమైన ‘ఇస్రో’ సుదీర్ఘ ప్రస్థానంలో ‘గఘన’ విజయాలెనె్నన్నో! ఇపుడు మరో అడుగు ముందుకేసి భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ‘ఇస్రో’ వ్యూహరచన చేసింది. ఒకదానిని మించి మరొకటి అన్నట్టు స్వదేశీ రాకెట్లను తయారుచేస్తూ చంద్రయానాలను, మంగళయానాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న ‘ఇస్రో’కు రోదసి కేంద్రం ఏర్పాటు అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే- గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘గగన యానాన్ని’ ప్రకటించిన గడువులోగానే సుసాధ్యం చేస్తామని మన అంతరిక్ష శాస్తవ్రేత్తలు సగర్వంగా స్పష్టం చేశారు. అమెరికా, రష్యా, జపాన్, కెనడా దేశాల నేతృత్వంలో పనిచేస్తున్న ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ (ఐఎస్‌ఎస్) ప్రాజెక్టులో భారత్ భాగస్వామ్యం కాబోదని ‘ఇస్రో’ చైర్మన్ డాక్టర్ కె.శివన్ అధికారికంగా ప్రకటించారు. మనకంటూ రోదసిలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇపుడు ‘ఇస్రో’ బహిరంగంగా స్పష్టం చేసినప్పటికీ, ఇందుకు సంబంధించిన కృషి వాస్తవానికి మూడేళ్లుగా కొనసాగుతోంది. చిన్నదో, పెద్దదో సొంతంగా అంతరిక్ష స్థావరం ఏర్పాటు చేసుకోవడం మానవయానానికి, రోదసి విహారాలకు, వాతావరణ పరిశోధనలకు ప్రణాళికలు వేస్తున్న భారత్‌కు ఎంతో అవసరం. ఈ స్థావరం ఏర్పాటైతే వ్యోమగాములు తరలింపు, మార్పిడి వంటి ప్రక్రియలు సులభ సాధ్యమవుతాయి. మనకు నచ్చిన, మన అవసరాలకు తగ్గట్టు మరిన్ని ప్రయోగాలకు వీలుంటుంది.
రోదసి కేంద్రాలు ఎందుకు?
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం మూడు దేశాలే సొంతంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించుకోగలిగాయి. మరికొనే్నళ్లలో ఆ దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచేందుకు కార్యాచరణ మొదలైంది. రోదసి వాతావరణం, మైక్రో గ్రావిటీ (సూక్ష్మ గురుత్వాకర్షణ) పై పరిశోధనలు చేసేందుకు దాదాపు 15 దేశాల భాగస్వామ్యంతో దిగువ భూ కక్ష్యలో ఇప్పటికే ‘అంతర్జాతీయ పరిశోధన కేంద్రం’ ఏర్పాటు చేశాయి. ఆ కేంద్రంలో వ్యోమగాములు రోజుల తరబడి ఉంటూ పరిశోధనలు చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న ఏకైక పరిశోధన కేంద్రం ఇదే. చైనా సొంతంగా నిర్మించిన పరిశోధన కేంద్రం ‘టియాంగాంగ్-2’ ఇప్పటికే రోదసిలో ఉంది. ఇదే కోవలో భారత్ సైతం సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2022 నాటికి లేదా అంతకన్నా ముందు పూర్తయ్యే ‘గగన్‌యాన్’కు పొడిగింపుగా- రోదసిలో మన స్థావరం నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 2022 నాటికి ‘గగన్‌యాన్ మిషన్’ను పూర్తి చేయాలని ‘ఇస్రో’ సంకల్పించింది. ఈ నేపథ్యంలో 2022 తర్వాత అంతరిక్ష కేంద్రం కలను సాకారం చేసేందుకు మన శాస్తవ్రేత్తలు వ్యూహరచనకు పదును పెడుతున్నారు. చంద్రుడి పైకి, గ్రహ శకలాలపైకి మానవ సహిత యాత్రల్లో భాగస్వామ్యం వహించేందుకు, రాబోయే రెండు,మూడేళ్లలో శుక్రుడి వద్దకు వ్యోమనౌకను పంపేందుకు సిద్ధపడుతున్న మన దేశం అంతరిక్ష కేంద్రాన్ని మాత్రం సొంత సాంకేతిక పరిజ్ఞానంతోనే ఏర్పాటు చేస్తుంది.
ప్రతిపాదిత రోదసి కేంద్రం పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుందని ‘ఇస్రో’ చైర్మన్ శివన్ ప్రకటించారు. దాని బరువు ఇరవై టన్నులుగా ఉంటుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ప్రయోగాలకు దాన్ని వినియోగిస్తారు. ఈ కేంద్రం వల్ల వీలైనంత ఎక్కువ మందిని అంతరిక్ష యానానికి పంపే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అయిదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికతతో మానవ సహిత అంతరిక్ష యాత్రను ‘గగన్‌యాన్’ పేరిట నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ‘ఇస్రో’ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు సమాంతరంగా సన్నాహాలు చేస్తోంది.
పదివేల కోట్లతో పదేళ్లలోగా..
భారతీయ వ్యోమగాములను సొంతంగా రోదసిలోకి పంపేందుకు సుమారు పదివేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే అంతరిక్ష కేంద్రం నిర్మాణం రాబోయే పదేళ్ల కాలంలో పూర్తవుతుందని ‘ఇస్రో’ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుతానికి ప్రతిపాదన దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ‘పచ్చజెండా’ ఊపి, ఏటా తగినంతగా నిధులు విడుదల చేస్తే 2030 నాటికి అంతరిక్ష కేంద్రం కల సాకారమవుతుంది. ‘యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ’కి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా (నాసా), జపాన్ (జాక్సా), కెనడా (సీఎస్‌ఏ), రష్కా (రాస్కామాస్) దేశాలు ఉమ్మడిగా గతంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) బరువు 420 టన్నులు కాగా, మన ‘ఇస్రో’ నిర్మించబోయే రోదసి కేంద్రం బరువు ఇరవై టన్నులుగా ఉంటుంది. తొలిదశలో ఈ కేంద్రంలో వ్యోమగాములు పదిహేను- ఇరవై రోజులు గడిపేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత క్రమంగా వ్యోమగాములు విడిది చేసే కాలాన్ని విస్తరిస్తారు. ఐఎస్‌ఎస్‌తో గానీ, మరే దేశంతో గానీ ఎలాంటి భాగస్వామ్యం లేకుండా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మన శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి అతి తక్కువగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో మానవ శరీరాలతో పాటు మొక్కలు, వివిధ బాక్టీరియాలు, ఇతర జీవులు ఎలా స్పందిస్తాయన్న అంశంపై ఈ కేంద్రంలో విస్తృతంగా పరిశోధనలు చేపడతారు.
ఎందుకోసం..
అంతరిక్ష కేంద్రాల ఏర్పాటు, వాటి నిర్వహణకు ఎన్నో కారణాలున్నాయి. రోదసి పర్యాటకం, వృక్షజాలం, జీవజాలంపై పరిశోధనలు, వాతావరణంపై అధ్యయనం, పారిశ్రామిక అవసరాలు వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలకు అంతరిక్ష కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయి. వ్యోమగాములు ఇతర గ్రహాలపై సంచరించాలంటే సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది. భారరహిత స్థితిలో మానవ శరీరంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాలు ఎలా ఉంటాయి? సూక్ష్మ గురుత్వాకర్షణ వల్ల మానవ జీవనం ఎలా ఉంటుంది? వంటి అనేక అంశాలను తెలుసుకొనేందుకు, ఆ దిశగా పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష కేంద్రాలు ఉపయోగపడతాయి. భూ వాతావరణం, సముద్రాలు, అడవులు, భూసారం, పర్యావరణ పరిస్థితులపై అధ్యయనానికి రోదసి కేంద్రాలు వినియోగపడతాయి. అంతరిక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసే టెలిస్కోప్‌ల ద్వారా భూమితో పాటు ఇతర గ్రహాలపై పరిస్థితులను పరిశీలించే వీలుంటుంది. అంతరిక్ష కేంద్రాలు విడిది కేంద్రాలుగానూ ఉపయోగపడే వీలున్నందున రోదసి పర్యాటకానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతరిక్షంలో కొత్త ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా రోదసి కేంద్రాలు సేవలందిస్తాయి.
భూమికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో వ్యోమగాములు కొన్ని రోజుల పాటు గడిపేందుకు అంబరవీధిలో చేపట్టే నిర్మాణాన్ని ‘అంతరిక్ష కేంద్రం’గా పిలుస్తారు. భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగాను దీన్ని అభివర్ణించవచ్చు. అంతరిక్ష కేంద్రం మొత్తం నిర్మాణాన్ని ఒకేసారి గగనతలంలోకి తరలించడం అసాధ్యం. అందుకే రాకెట్ల ద్వారా దశల వారీగా దీన్ని గగనవీధిలోకి పంపించాలి. భూమిమీద నుంచే నియంత్రిస్తూ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం ఏర్పడాలి. వివిధ దశల్లో జరిగే ఈ అనుసంధాన ప్రక్రియలో వ్యోమగాముల సేవలు సైతం అవసరం అవుతాయి. అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగిన అనంతరం అందులో వ్యోమగాములు నివాసం ఉండేందుకు వీలుంటుంది. ఈ కేంద్రాలకు గురుత్వాకర్షణ శక్తి ఉండదు గనుక భవిష్యత్‌లో అంతరిక్ష ఆవాసాలకు కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి అవసరం అవుతుంది. ఈ దృష్ట్యా రోదసి కేంద్రాలకు ‘భ్రమణ సామర్ధ్యం’ ఉండాలి. దీని వల్ల కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి లభిస్తుంది. భారీ వ్యోమనౌక మాదిరి భూమి చుట్టూ నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించే అంతరిక్ష కేంద్రానికి పెద్ద పెద్ద సౌర ఫలకాల ద్వారా విద్యుత్ అందుతుంది. దాంతో అక్కడ వ్యోమగాములు సులభంగా విడిది చేసేందుకు, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌కు నాలుగు టన్నుల బరువును తీసుకువెళ్లే సామర్ధ్యం ఉంది. ఈ రాకెట్‌నే అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ‘వాహక నౌక’గా వాడే అవకాశం ఉంది. అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తయ్యాక, వ్యోమగాములను అక్కడికి పంపడం, వారిని తిరిగి భూమిమీదకు తీసుకొని రావడం వంటివి కీలకమైన పనులు. కక్ష్యలోని అంతరిక్ష కేంద్రం లేదా దాని విడిభాగాలకు వాహక నౌకను అనుసంధానించడం, అక్కడి వ్యోమగాములకు అవసరమయ్యే ఆహారం, నీరు, మందులు, ఇతర సరుకులను చేరవేయడానికి అత్యాధునిక ‘డాకింగ్’ పరిజానం అవసరం. ఈ సాంకేతికతను సమకూర్చుకొనేందుకు మూడేళ్ల క్రితమే వివిధ ప్రాజెక్టులను ‘ఇస్రో’ చేపట్టింది. అంతరిక్ష కేంద్రంతో జరిగే అనుసంధాన కార్యక్రమంలో రోబోటిక్ పరిజ్ఞానాన్ని కూడా వినియోగించాల్సి ఉంటుంది.
రోదసి కేంద్రాల చరిత్ర..
వివిధ దేశాలకు సంబంధించి అంతరిక్ష కేంద్రాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. విశ్వవ్యాప్తంగా చూస్తే తొలి అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పిన ఘనత రష్యాకు దక్కింది. సోవియట్ యూనియన్‌గా ఉన్న కాలంలోనే- 1971లో రష్యా శాస్తవ్రేత్తలు ‘సెల్యూట్-1’ పేరిట రోదసి కేంద్రాన్ని రూపొందించారు. ‘స్కైలాబ్’ పేరిట అమెరికా 1973లో తన తొలి అంతరిక్ష కేంద్రాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలో రెండో అంతరిక్ష కేంద్రమైన ‘స్కైలాబ్’ 1979లో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ‘స్కైలాబ్’ తమ నివాసాలపై ఎక్కడ కూలిపోతుందోనన్న భయాందోళనలు అప్పట్లో వివిధ దేశాల్లో నెలకొన్నాయి. రష్యా శాస్తవ్రేత్తలు 1986లో ‘మిర్’ పేరిట మరో అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగించగా- అది 2000 నవంబర్ 16న భూ వాతావరణంలో ప్రవేశించి బూడిదైంది.
అమెరికా, రష్యా, జపాన్, కెనడా సహా 18 దేశాలతో పాటు ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటైంది. 1998 నుంచి దీన్ని విస్తరిస్తుండగా, ప్రస్తుతం దీని బరువు 420 టన్నులకు చేరింది. 2000వ సంత్సరంలో మొట్టమొదటి సారిగా ఓ వ్యోమగామి ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టగా, 2011లో దీనికి చివరి మాడ్యూల్‌ను జత చేశారు. ఐదేళ్ల అనంతరం ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు నివాసం ఉండేలా ఏర్పాట్లు చేశారు. 2030వ సంవత్సరం వరకూ పనిచేసే ఈ అంతరిక్ష కేంద్రంలో- తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్నపుడు మొక్కలు ఎలా పెరుగుతాయి? జీవజాలం ఎలా ఉంటుంది? పదార్థాల భౌతిక ధర్మాలు మార్పు చెందుతాయా? బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల మనుగడ ఎలా ఉంటుంది? వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త రకాల ఔషధాలు, వ్యాధి నిరోధక టీకాలు, సురక్షిత మంచినీరు, మేలైన వైద్య సహాయం వంటి అనేక అంశాలకు సంబంధించి ఐఎస్‌ఎస్‌లో ఇప్పటికే కొత్త ఆవిష్కరణలు వెలుగు చూశాయి.
1998లో నిర్మాణం పూర్తి చేసుకొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి దాదాపు 250 మైళ్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకూ సుమారు 230 మంది వ్యోమగాములు దీన్ని సందర్శించారు. 2000వ సంవత్సరం నవంబర్‌లో తొలి వ్యోమగామి ఇందులో నివాసం ఉన్నారు. ఈ కేంద్రంలో ఆరుగురు వ్యోమగాములు నివసించే వీలుంది. భారత సంతతికి చెందిన మహిళలు సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఈ కేంద్రానికి వెళ్లారు. ఇక, చైనా 2011లో ‘తియాంగాంగ్-1’, 2016లో ‘తియాంగాంగ్-2’ పేరిట వ్యోమనౌకలను ప్రయోగించి, సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన మూడవ దేశంగా కీర్తిని ఆర్జించింది. ఇందులో ‘తియాంగాంగ్-1’ 2017 సెప్టెంబర్‌లో భూ వాతావరణంలో ప్రవేశించి కాలిపోయింది.

*
రైతు కుటుంబం నుంచి రోదసి శాస్తవ్రేత్త..
వచ్చే నెలలో ‘చంద్రయాన్-2’ ప్రయోగం, 2020 ప్రథమార్ధంలో సూర్యుడిపై ‘ఆదిత్య-ఎల్ 1’ వాహకనౌక ప్రయోగం, ఆ తర్వాత రెండు మూడేళ్లకు శుక్రగ్రహంపై అధ్యయనానికి ఫ్రాన్స్‌తో కలసి మరో ప్రయోగం.. వీటన్నింటికీ మించి 2030 నాటికి భారత్‌కు సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు.. ఇందుకు విస్పష్టమైన ప్రణాళికలను రూపొందించిన ఘనత ‘ఇస్రో’ చైర్మన్ డాక్టర్ కె.శివన్‌కే దక్కుతుంది. అంతర్జాతీయ పర్యాటకంపై గాక- వాతావరణ మార్పులు, జీవజాలంపై తక్కువ గురుత్వాకర్షణ ప్రభావం, ఔషధ రంగంలో నవీన ఆవిష్కరణలు.. ఇవే ఆయన ప్రాధాన్యతలు..
ఏభై ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ‘్భరత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో)కు 9వ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న డాక్టర్ కైలాసవాదివూ శివన్ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, స్వశక్తితో ప్రఖ్యాత రోదసి శాస్తవ్రేత్తగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తరక్కన్‌విల్వై ఆయన స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. కఠోర శ్రమతో సవాళ్లను అధిగమించవచ్చని నమ్మిన ఆయన చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఆలోచించేవారు. కుటుంబ పెద్దల మార్గదర్శకత్వం, కోచింగ్ క్లాసులకు వెళ్లే స్థోమత లేకపోయినా తనకంటూ ఓ లక్ష్యం ఏర్పరచుకొని ఉన్నత చదువులు చదివారు. తమ కుటుంబంలో డిగ్రీ చదివిన తొలి విద్యార్థిగా పేరు పొందారు. మద్రాస్ సాంకేతిక సంస్థ (ఎంఐటీ) నుంచి 1980లో ఆయన ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ సాధించారు. అదే సబ్జక్టులో బెంగళూరు ఐఐఎస్‌సీ నుంచి పీజీ చేశారు. 1982లో ‘ఇస్రో’లో చేరారు. అక్కడ అనేక ఉపగ్రహ వాహకనౌకల రూపకల్పనలో పనిచేసి ప్రఖ్యాత శాస్తవ్రేత్తల నుంచి ప్రశంసలు పొందారు. 2006లో ముంబయి ఐఐటీ నుంచి డాక్టరేట్ చేశారు. 2014లో సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకొన్నారు. ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ తదితర రంగాల్లో అనేక జాతీయ స్థాయి సంస్థలకు గౌరవ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతరిక్ష మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2015లో ‘ఇస్రో’ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 2017లో ఒకేసారి 104 రాకెట్లను అంతరిక్షంలోకి ఒకే వాహకనౌక ద్వారా పంపి ప్రపంచ రికార్డును సాధించారు. అంతరిక్ష రంగంలో చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. మూడు దశాబ్దాలుగా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎన్నో ప్రయోగాలకు, పరిశోధనలకు నేతృత్వం వహించారు. ‘ఇస్రో’ సారథిగా పనుల ఒత్తిడి ఉన్నా, ఏడాదికో సారైనా స్వగ్రామానికి వెళ్లి అక్కడి ఆలయంలో పూజలు చేయడం ఆయనకు అలవాటు. చంద్రయాన్-2, గగన్‌యాన్‌లతో పాటు భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వంటివి సఫలం కావాలన్నదే తన ఆకాంక్ష అని శివన్ చెబుతుంటారు.

భారత్ ప్రతిష్ట మరింత ఎత్తుకు..

‘ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని సంకల్పించడం అమితానందాన్ని కలిగిస్తోంది.. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భవిష్యత్‌లో ప్రపంచ దేశాలకు భారత్ నాయకత్వం వహించబోతోంది.. అంతరిక్ష రంగంలో భారత్ ప్రతిష్టను ‘ఇస్రో’ మరింతగా ఇనుమడింపజేస్తుంది..’ అని ప్రఖ్యాత అంతరిక్ష శాస్తవ్రేత్త, ఇస్రో మాజీ అధ్యక్షుడు జి.మాధవన్ నాయర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేశీయ అవసరాలకు తగ్గట్టుగా చిన్న తరహా అంతరిక్ష కేంద్రం నిర్మాణం ఆవశ్యకత గురించి తాను గతంలో ఇస్రో చైర్మన్‌గా ఉన్నపుడు ప్రతిపాదన చేసినట్టు నాయర్ గుర్తు చేశారు. మన శాస్తవ్రేత్తలు తక్కువ ఖర్చుతో పరిశోధనలు చేసేందుకు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉండాలన్నారు. ‘ఇస్రో’ వద్ద ఉన్న ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్-3’ రాకెట్ ద్వారా పది టన్నుల బరువును సులభంగా తీసుకువెళ్లవచ్చని, ఈ నేపథ్యంలో ఇరవై టన్నుల బరువుండే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మన దేశానికి అసాధ్యమేమీ కాదన్నారు. 2022 నాటికి రోదసిలోకి మానవ సహిత యాత్రను చేపట్టే స్థాయికి భారత్ చేరుకొంటుందని ఆయన అన్నారు. ‘గగన్‌యాన్’ ప్రాజెక్టు పూర్తయ్యాక సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందన్నారు. అంతరిక్ష కేంద్రం ఆవిర్భవిస్తే ‘ఇస్రో’ ప్రస్థానంలో అదొక మైలురాయి అవుతుందన్నారు. వచ్చే దశాబ్ద కాలం ‘ఇస్రో’కు అత్యంత కీలకంగా ఉండబోతోందని నాయర్ అభిప్రాయపడ్డారు.

అంతరిక్ష యాత్రికులకో శుభవార్త

రోదసిపై విహరించాలనుకొనే యాత్రికుల కోసం అమెరికాకు చెందిన ‘నాసా’ (జాతీయ వైమానిక, అంతరిక్ష నిర్వహణ సంస్థ) ఓ ప్యాకేజీని ప్రకటించింది. అంతరిక్ష పర్యాటకం వాణిజ్యపరంగా కొత్తపుంతలు తొక్కేలా ‘నాసా’ ప్రకటించిన ఈ ప్యాకేజీ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అంతరిక్ష పర్యాటకులకు ఒక రాత్రికి 35వేల డాలర్లను రుసుముగా వసూలు చేస్తారు. ప్రైవేటు వ్యోమగాములు ‘అంతర్జాతీయ రోదసి కేంద్రం’ (ఐఎస్‌ఎస్) ద్వారా అంతరిక్షంలో 30 రోజుల వరకూ విహరించవచ్చు. వాణిజ్యపరంగా ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకొనేందుకు ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ (ఐఎస్‌ఎస్) దోహదపడుతుందని ‘నాసా’ ముఖ్య వాణిజ్య అధికారి జెఫ్ డెవిట్ ప్రకటించారు. అంతరిక్ష విహారంలో పాల్గొనేవారు వైద్యం, శిక్షణ అంశాలకు సంబంధించి ఖర్చులను భరించాల్సి ఉంటుంది. యాత్రికులను అంతరిక్షంలోకి తీసుకుపోవడానికి ‘స్పేస్ ఎక్స్’, ‘బోయింగ్’ అనే ప్రైవేటు సంస్థల సేవలను ‘నాసా’ వినియోగించుకొంటుంది. అంతరిక్ష కేంద్రం సేవలను వాణిజ్యపరంగా వినియోగించరాదని గతంలో ఆంక్షలు విధించుకొన్న ‘నాసా’ ఇపుడు అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకొంది. రష్యా సహకారంలో నిర్మించిన ‘అంతర్జాతీయ రోదసి కేంద్రం’ 1998లో పనిచేయడం ప్రారంభించాక ‘నాసా’ వైఖరిలో క్రమంగా మార్పు వస్తోంది. అమెరికాకు చెందిన వాణిజ్యవేత్త డెన్నిస్ టిటో 2001లో రష్యాకు ఇరవై మిలియన్ డాలర్లను చెల్లించి తొలిసారిగా అంతరిక్షంలో విహరించారు. అంతర్జాతీయ రోదసి కేంద్రాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది స్పష్టం చేశాక, అందుకు అనుగుణంగా ‘నాసా’ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. 2025 నాటికి ‘నాసా’కు ప్రభుత్వ పరంగా నిధుల కేటాయింపులను నిలిపివేయాలన్నది ట్రంప్ ఆలోచన.
పరిశోధనలకు, ఉపాధికి ఊతం..
సుమారు పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ‘అంతరిక్ష కేంద్రం’ ప్రాజెక్టు అవసరాల్లో అరవై శాతం ప్రైవేటు రంగం నుంచే తీరబోతున్నందున ఉపాధి రంగంలో అవకాశాలు విస్తృతం అవుతాయి. అంతరిక్ష రంగంలో విస్పష్ట ప్రణాళికలతో, వినూత్న విధానాలతో ‘ఇస్రో’ సాగిస్తున్న ప్రస్థానంలో సత్ఫలితాలు చేకూరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. *

-పి.ఎస్.ఆర్.