S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్దల సాంగత్యము

చింతామణి నాగేశ రామచంద్రరావు అంటే ఎవరో మీకు ఎంతమందికి తెలుసు. నాకు అనుమానమే. కానీ ఆయనకు భారతరత్న ఇచ్చిన రోజునే సచిన్ తెండూల్కర్ అనే మరొక అబ్బాయి కూడా అదే గౌరవాన్ని అందజేశారు. సచిన్ గురించి తెలియని వారు బహుశా ఉండరు అని నా అనుమానం. ఈ దేశంలో సైన్సుకు గల గౌరవం అటువంటిది. సి.ఎన్.ఆర్.రావు నిజంగా గొప్ప రసాయన శాస్తవ్రేత్త. ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద పేరు ఉన్న మనిషి. ఆయన నిజంగా మంచివాడు గనుక ఒక కుర్రవాడు కూడా అదే బహుమానం జరుగుతున్న రోజున అతని సరసన నిలబడి అదే గౌరవాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అది పెద్ద మనసున్నకు ఉదాహరణ. ఈ దేశంలో ముందు సినిమా, తరువాత క్రికెట్, ఆ తరువాత ఈ రెండూ కూడా కలగలసిన రాజకీయం తన ప్రజలకు మరొకటి తెలియదు అని నేను ముందు నుంచి నెత్తిన గొంతు పెట్టుకుని అరుస్తూనే ఉన్నాను. కళలు ఎవరికీ పట్టవు. సాహిత్యం అంతకన్నా అవసరం లేదు. సంగీతం అంటే ఏమిటో తెలియదు. ఈ ఏడుపు ఎందుకు కానీ సిఎన్‌ఆర్ రావు గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది అని చెప్పుకోవడానికి మనసు ఉవ్విళ్లూరుతున్నది.
ఆంధ్రప్రదేశ్ అకాడెమీ అని ఒక సంస్థ ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆ సంస్థ ఆయా పేర్లతో కొనసాగుతూ ఉన్నట్లు లెక్క. వాళ్లు ఏమీ చేయటం లేదు అని నేను అనను. చేయగలిగింది చేస్తూనే ఉన్నారు. అయినా అది ప్రజలకు తెలియదు. సి.ఎన్.ఆర్. రావు ఒకప్పుడు ఈ సంస్థలో ఉపన్యాసం చేయడానికి హైదరాబాద్ వచ్చారు. మామూలుగానే నేను ఆ మీటింగులో అందరికన్నా ముందు వరుసలో హాజరయ్యాను. గొప్ప చెప్పుకోను గానీ నాటి నుంచి నేటి వరకు సైన్స్ అనగానే నాకు ఒళ్లు ఝల్లుమంటుంది. నోట్లో నాలుక ఉంది. గలగల మాట్లాడుతాను కనుక నన్ను మీటింగ్‌కే కాదు, తరువాత జరిగే విందుకు కూడా పిలిచేవరు. అదే పద్ధతిలో ఆర్.ఆర్. ల్యాబ్స్‌లో విందు జరిగింది. నేను అందులో పాల్గొన్నాను. బహుశా ఆనాడే అనుకుంటాను, బస్సులో వస్తుంటే ఎవరో నా జేబులో పర్సు కొట్టేశారు. ఇందులో ఉన్న వాళ్లంతా పెద్దవాళ్లు. వాళ్లకు కార్లు, రాకపోక సౌకర్యాలు ఉంటాయి. ఏమీ ఉండవు. నేను ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు వెళ్లినా అభిమానంగా నన్ను తిరుగుదారిలో దించేవారు. చీఫ్ సెక్రటరీగా ఉన్న రామారావుగారు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించుకున్న డాక్టర్ ఎ.వి. రామారావుగారు లాంటి వారంతా మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. అది పక్కనపెడితే ఆ రోజున విందులో నేను సి.ఎన్.ఆర్. రావు గారి పక్కన కూర్చుని కబుర్లు చెపుతూ భోజనం చేయడం బాగా గుర్తుంది. ఆయన గారి అల్లుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను నాకు ఇంచుమించు మిత్రుడు. ఆ సంగతి తెలిసిన తరువాత రావు గారు నా మీద మరింత అభిమానం కనబరచారు. తరువాత ఒకటి రెండు సందర్భాలలో కూడా ఆయనను కలిసి మాట్లాడినట్టు గుర్తుంది. గొప్పవాళ్ల నుజాల మీద ఎక్కి ప్రపంచం చూడడం అంటే బహుశా ఇదేనేమో. మనకంటే చిన్నవాళ్లతో కలిసి తిరుగుతూ ఉంటే, సరదాగా ఉండవచ్చు కానీ అందులో మనకు నేర్చుకోవడానికి ఏమీ దొరకకపోవచ్చు. పెద్దలతో పాటు గడిపిన కాలంలో మనం కూడా కొంచెం పెద్దవాళ్లం అవుతాము. ఈ మాట నేను అనుభవంతో చెబుతున్నాను. ఇంట్లో గానీ, బయట ప్రపంచంలో గానీ నాకు పెద్దల మధ్య గడపటం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, ఇష్టం. మి వి రామన్ సంస్థకు డైరెక్టర్‌గా చేసిన రామశేషన్, ప్రఖ్యాత అంతరిక్ష శాస్తవ్రేత్త జయంత్ నార్లీకర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మహేశ్ దయాళ్ ఇలా ఎన్ని పేర్లయినా చెప్పగలను. అందరితోనూ వ్యక్తిగత స్థాయిలో మైత్రి కుదిరింది అంటే నా మటుకు నాకు గొప్పగానే కనబడుతుంది. నేను సామాన్యుడిని. మాన్యులతో మెలగటం మరి గొప్ప కాదా.
ఉడిపి రామచంద్రరావు అన్న పేరు చెబితే కూడా మీకు చాలామందికి ఏమీ తోచకపోవచ్చు. ఆయనే యు.ఆర్.రావు గారు. మన దేశంలోని అంతరిక్ష పరిశోధన ప్రగతికి ఆయన ఆధారంగా చాలాకాలం నిలిచారు. ఆయన కూడా ఇలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం అయ్యారు. ఆయన ఉపన్యాసం జరిగిన మరో రోజున రాఖీ పండుగ. చాలామందికి శ్రావణ పూర్ణిమ కేవలం రాఖీ పండుగగా మాత్రమే మిగులుతుంది. సాంప్రదాయ బ్రాహ్మణులకు మాత్రం ఆ రోజు ఉపాకర్మ చేసుకోవలసి ఉంటుంది. సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతాలు, అనే జంధ్యాలు మార్చుకొనవలసి ఉంటుంది. దానితోబాటు మరో తరంగాలు కూడా ఉంటాయి. రావుగారు ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నాను. మరునాడు సాయంత్రం వరకు ఆయన నగరంలోనే ఉంటాయి. రావుగారు ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నాను. మరునాడు సాయంత్రం వరకు ఆయన నగరంలోనే ఉంటారు. చాదస్తుడుని చాలామంది కొట్టివేయవచ్చు గానీ, ఆయనకు జంధ్యాలు మార్చుకోవలసిన అవసరం ముందు సాయంత్రం నుంచే బుర్రలో తిరుగుతున్నది. అక్కడ వున్న ఒక పెద్దాయన ముందు విషయం ప్రస్తావించారు కూడా. ఆ పెద్ద మనిషికి ఏమీ పాలుపోలేదు. ఇటువంటి విషయాలలో నా వల్ల ఏదో జరుగుతుందన్న నమ్మకం కలిగి రావు గారిని నాకు పరిచయం చేశారు. రావుగారు కర్ణాటకకు చెందిన మనిషి. బహుశా మధ్వ సంప్రదాయం అయి ఉంటుందని ఊహించాను. ఆ సంగతే ఆయనతో అన్నాను కూడా. ఆయన అవును అవును అంటూ ఆనందపడిపోయాడు. ఆయనతో ఉండి ఏర్పాట్లు చేస్తున్న పెద్ద మనిషిని పిలిచి మరునాడు రావుగారిని రాఘవేంద్ర మఠానికి తీసుకుపోవలసిందిగా సలహా ఇచ్చాను. ఆ సంగతి విని ఆయన ఎంతో పొంగిపోయారు. నా గురించి నేను చెప్పను గానీ, ఎదుటి వారి అవసరాలను కనుక్కొని వారికి తగిన ఏర్పాట్లు చేయడంలో గొప్ప ఆనందం ఉంది. రావుగారితో పరిచయం కొంత కాలం అలాగే కొనసాగింది.
ప్రొఫెసర్ ఎన్.జి.కె. మీనన్ గారు కేవలం గొప్ప శాస్తవ్రేత్త మాత్రమే కాక కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొంతకాలం పని చేశారు. ఆయనతో నాకు మంచి పరిచయం ఉండేది. పుణెలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో మిత్రుడు శేఖర్‌తో కలిసి తయారుచేసిన ఇండియన్ సైంటిస్ట్ డాట్‌కాం అనే వెబ్‌సైట్‌ను ఆవిష్కరింపజేశాము. సిఎస్‌ఐఆర్‌ఆర్ సంస్థ డైరెక్టర్ జనరల్ మషేల్కర్‌గారు కూడా ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీనన్ గారు, తదితరులు మమ్మల్ని మెచ్చుకున్న తీరు ఇవ్వాళ్టికి కూడా గుర్తుంది. కానీ ఎందుకో ఆ వెబ్‌సైట్ ముందుకు నడవలేదు. ఈ వరుసలో నాకు, కె.ఆర్.నారాయణన్, ప్రొఫెసర్ యశ్‌పాల్ గారలతో గల పరిచయం కూడా గుర్తుకు వస్తున్నది. యశ్ పాల్ గారితో కలిసి అప్పటికి నగరంలో అన్నిటికన్నా పెద్ద హోటల్ అయిన బంజారాలో చేసిన భోజనం గుర్తు ఉన్నది. భోజనాలు ముగిసిన తరువాత ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. తన మేనల్లుడు అదే హోటల్‌లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు. నేను నా పరిచయాలను ఉపయోగించి, ఆ అబ్బాయిని పిలిపించాను, మామ, అల్లుడు ప్రేమగా మాట్లాడుకున్నారు. పెద్దాయన నాకు ధన్యవాదాలు కూడా చెప్పాడు. తలలుచుకుంటే ఇవన్నీ కళ్ల ముందు సినిమాలాగా కనపడుతున్నాయి. ఆ కాలం ఏమైంది. అప్పటి చలాకీతనం అంతా ఏమైంది. దృశ్యాల తరువాత కళ్ల ముందు ఈ ప్రశ్నలు కదలాడుతున్నాయి.
బ్రిటన్‌లో సైన్స్ విషయంగా అన్నిటికన్నా పెద్ద సంస్థ అయిన బ్రిటిష్ సైన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రొఫెసర్ విల్సన్‌ను బంజారా హోటల్‌లో ఇంటర్వ్యూ చేసిన విషయం, ఇంతకు ముందు ఎక్కడో చెప్పినట్టు గుర్తు వస్తున్నది. నాకు ఇదే చిక్కు. ఈ విషయాన్ని ఎత్తుకున్నా ఇదివరకే చెప్పాను ఏమో అన్న భావం కలుగుతుంది. అప్పుడు చదివిన వాళ్లు ఇప్పుడు కూడా చదువుతున్నారని నాకు ఒక భావం ఉందేమో. ఒక విషయాన్ని రెండుసార్లు చెప్పినందుకు కొంప మునిగేది లేదు అని నాకు నేనే రచ్చ చెప్పుకోవాలి.
పెద్దవాళ్లు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. వారిలో కొంతమంది వెళ్లిపోయారు కూడా. పాలమూరు నుంచి పట్నం దాక మిత్రుడుగా కొనసాగిన వయోవృద్ధుడు హరి ఆదిశేషువు గారు అటువంటి వారిలో అందరికన్నా ముందు గుర్తుకు వస్తారు. ఆయన ధోవతి కూడా సరిగా కట్టేవాడు కాదు. ఎడ్యుకేషన్ కాలేజీలో అధ్యాపకుడుగా పని చేస్తున్నప్పటికీ, అడ్డ పంచె కట్టుకుని హాయిగా తిరుగుతూ ఉండేవాడు. చదవడం వ్యసనం కనుక నా మిత్రుడు పుస్తకాల దుకాణం దగ్గర ఆయనతో బాగా మాట్లాడే అవకాశం దొరికింది. నేను పట్నం చేరిన తరువాత ఆయన కూడా నగరానికి వచ్చారు. ఆ లోపల నేను భువనగిరిలో ఉండగా ఆయన కూడా అక్కడ కనిపించారు. ఈ రకంగా మేము చాలాకాలంపాటు కలుస్తూ ఉన్నాము. ఒకరోజు నేను ఒక్కడినే ముఖం ముడుచుకుని కూర్చున్నాను. ఆయన మామూలుగా ఆ దారిన వెడుతూ నన్ను పలకరించడానికి నా ముందుకు వచ్చారు. విషయం ఏమిటి అని అడిగారు. రెండు రోజులలో సర్ సి వి రామన్ గురించి రాయవలసి ఉంది. కొత్తగా చెప్పడానికి కొన్ని సంగతులు అయినా ఉండాలని మెటీరియల్ కొరకు తాపత్రయపడుతున్నాను. ఈ కాలంలాగా అప్పట్లో ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు లేవు. ఏమీ లేకుండానే పేరు సంపాదించుకున్నాము. ఈ సౌకర్యాలు ఉంటే ఏం చేసేవాళ్లం అనిపిస్తుంది. ఆదిశేషు గారు మామూలుగా మాట్లాడి వెళ్లిపోయారు. సాయంత్రం లోపల మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. చేతిలో ఒక చిన్న సంచి ఉన్నది. అందులో సి వి రామన్‌కు నోబెల్ బహుమతి ప్రకటించిన నాటి వార్తాపత్రికతో సహా, భవన్స్ జర్నల్ వారి రామన్ ప్రత్యేక సంచిక ఇలాంటి మరెన్నో కాగితాలు ఉన్నాయి. ఆ సంచిని నా ముందు పడవేసి ఆనందంగా ఒక నవ్వు నవ్వి ఆయన వెళ్లిపోయారు. ఆయన వద్ద ఇటువంటి సామగ్రి ఇంటి నిండా ఉండేదట. గోడ పక్కన మొత్తంగా అల్మారాలు, వాటిలో ప్రతి దాని మీద మరొక ఇనుప పెట్టే, అన్నిటిలోనూ పుస్తకాలు కాగితాలు. భార్యాపిల్లలకు ముసలాయన పద్ధతి నచ్చలేదు. వింత ఏమిటంటే, పెద్దాయన వాళ్లందరినీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. వాళ్లు నిజంగానే వెళ్లిపోయారు. తాను ఉన్నంతకాలం, సంజీవరెడ్డి నగర్‌లో ముసలాయన తన కాగితాల మధ్యన ఆనందంగా పడి ఉన్నాడు. నేను మాత్రం జీవితమనే బండి చక్రాలలో నలిగి తిరుగుతూ మరోసారి ఆయనను చూడను కూడా చూడలేకపోయాను. కృతజ్ఞత లేనివారు అంటే వారికి నాకంటే నిలువెత్తు ఉదాహరణ మరొకటి ఉండదు.

-కె.బి.గోపాలం