S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవాళికి మహోపయోగం

‘యోగీశ్వరం ప్రణమ్యాం’
‘యోగాభ్యాసే సమారంభే’
..యోగం చేస్తే ఈశ్వరునికి ప్రణామం చేసినట్టే. యోగాను అభ్యసిస్తే ఏదైనా సాధ్యమే! అని మన ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. యోగా అత్యంత పురాతనమైనది. వేదకాలం నుంచి దీని ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రుగ్వేదంలో క్రీ.పూ. 3000 సంవత్సరాల నుంచీ యోగ ప్రక్రియ కొనసాగుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. యోగ సంప్రదాయాన్ని గురించి విస్తృతంగా చర్చించిన గ్రంథం 'భగవద్గీత’. క్రీ.పూ. 500 ప్రాంతానికి చెందిన ఈ ఉద్గ్రంథంలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం వంటి రకరకాల యోగ భావనపై సవివరమైన చర్చ కనిపిస్తుంది. ఇంతటి విస్తృతార్థంలో చర్చనీయాంశంగా ఉన్న ‘యోగ’ సంవిధానానికి ఒక రకంగా క్రీ.శ. 200లలో పతంజలి మహర్షి తన ‘అష్టాంగ యోగం’ ద్వారా ఒక నిర్దిష్టతను తీసుకువచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు సహా సనాతన ఆలోచనాధోరణిలో ఎక్కడెక్కడో ఉన్న సూత్రాలన్నింటినీ క్రోడీకరించి ‘యమం, నియమం’ వంటి అంశాలతో ‘అష్టాంగ యోగ’ను సిద్ధం చేశారు పతంజలి మహర్షి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అష్ట(8) సూత్రాల్లో మొదటి నాలుగూ బాహ్యమైన శరీరానికి సంబంధించినవి అయితే, తరువాతి నాలుగూ అంతరంగానికి అంటే మనస్సుకు సంబంధించినవి. ఈ ఎనిమిదింటిలో మూడోది యోగాసనాలు. ఏడోది ధ్యానం, ఎనిమిదోది సమాధి! ఈ అష్టాంగాలను పరిశీలిస్తే మనకు యోగా అన్నది శరీరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే.. మనసును కూడా దానికి జత చేస్తుందని, మనిషిని వ్యక్తిగానూ, సంఘజీవిగానూ.. ముఖ్యంగా సుఖసంతోషాలతో జీవించే సమగ్ర ప్రాణిగా తీర్చిదిద్దేందుకు సమాయత్తం చేస్తుందని అర్థమవుతుంది. పతంజలి మహర్షి కృషి తర్వాత.. ఎందరెందరో యోగ సాధకులు శరీరానికి పునరుజ్జీవన శక్తులు సాధించి పెట్టటం, ఆయుర్వేదాన్ని విస్తరించటం వంటి లక్ష్యాలతో శారీరక అంశాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ‘తంత్రయోగం’ వంటివాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. వీటిలో శుద్ధి, శోధన వంటి పేర్లతో శరీరానికి, ప్రాణానికి మిక్కిలి ప్రాధాన్యం ఇవ్వటం కనబడుతుంది. ఈ దశల నుంచి రూపుదిద్దుకున్నదే ‘హఠయోగం’. దేహంలోని వివిధ స్థాయిల్లో ఉండే కుండలిని, చక్రాల వంటివన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అనంతర కాలంలో 1800, 1900 శతాబ్దాల్లో యోగ సాధకులు, గురువులు పాశ్చాత్య దేశాలను సందర్శించి యోగ విధానాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించటం ఆరంభించారు. 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద యోగ సంప్రదాయాన్ని పాశ్చాత్య సమాజానికి బలంగా పరిచయం చేశారు.
‘మనోవాక్కాయ కర్మలను ఒకటిగా చేసి మీ ఆలోచనలను నిర్మలంగా చేసుకునేందుకు ప్రయత్నించి చూడండి.. ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో..’ అన్నాడు మహాత్ముడు. అలా మనసు, వాక్కు, కర్మలను నియంత్రణలోకి తీసుకొచ్చే మహత్తర సాధనం యోగ! భారతీయ సంస్కృతీ వైభవానికి ప్రబల తార్కాణం యోగ. మనసుకు శాంతిని, శరీరానికి దృఢత్వాన్ని, చిత్తానికి ఓర్పును చేకూర్చే గొప్ప విద్య ఇది. ఆత్మను, శరీరాన్నీ నిరంతరం లయబద్ధం చేస్తుండే అద్భుత సాధన క్రియ యోగ. ఇది ఒక మతం కాదు.. ఇదో జీవన విధానం! జాతి, సంస్కృతులకు అతీతమైన స్వస్థ విద్య యోగ.. మనిషినీ, ప్రకృతినీ, జీవాన్నీ, పర్యావరణాన్నీ సమైక్యం చేసే సమన్వయ అనుభూతి ఇది. అందుకే ఆదిశంకరాచార్య, మహా అవతార్ బాబాజీ, పరమహంస యోగానంద, కాకభుషుండులు వంటి యోగి పుంగవులు ఈ దేశంలో కాలినడకన బయలుదేరి యోగవిద్యను ప్రపంచానికి పరిచయం చేశారు.
స్వయం పరిశీలన
యోగ గురించి తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. నీ సహజ రూపం ఏమిటో, నీ వాస్తవ స్వభావం ఏదో తెలుసుకోవడానికి.. హిమాలయాల దాకా వెళ్లాల్సిన పని లేదు.. బాబాల చుట్టూ కూడా తిరగక్కర లేదు.. ఐదు సంవత్సరాల పిల్లల్ని గమనిస్తే చాలు. మనకు సమాధానం దొరికిపోతుంది. ఎందుకంటే ఆ పసివాళ్లు బుల్లి బుల్లి అడుగులేస్తూ ఇల్లంతా పరిగెడతారు, ఆడుతూ పాడుతూ జానెడంత నడుమును చక్రంలా తిప్పేస్తారు. ఏమాత్రం కష్టపడకుండా విల్లులా ఒంగిపోతారు. చేతులతో పాదాల్ని సునాయాసనంగా పట్టుకుంటారు. అమాయకమైన, నిర్మలమైన మోముతో కాసేపు మారాం చేసినా.. మరు నిముషంలో హాయిగా నవ్వేస్తారు. వారికి ద్వేషం అంటే ఏమిటో తెలియదు. అసూయ, స్వార్థాలు ఎలా ఉంటాయో తెలీదు.. అదే నిత్య యోగ స్థితి! ఒకప్పుడు మనమూ అలాగే ఉండేవాళ్లం.. మన స్వభావమూ దాదాపుగా అదే.. శరీరంలోని అనారోగ్యాల్ని, మనసులోని జాడ్యాల్ని తొలగించుకుంటే.. మిగిలేది పసిపాప లాంటి తత్త్వమే.. అదే మనం. ఆ చెత్తనంతా వదిలించుకోవడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మార్గం.. యోగ.
కూర్చోవడం, లేవడం వంటివి నిత్యజీవితంలో భాగం. ఎన్నిసార్లయినా సునాయసంగా కూర్చోగలగాలి, ఎన్నిసార్లయినా అనాయాసంగా లేవగలగాలి. దీనివల్ల మోకాళ్లకు వ్యాయామమూ అవుతుంది. పొట్టపై ఒత్తిడి పడుతుంది. పిక్క బలమూ పెరుగుతుంది. కానీ నేడు మనమేమో.. బాసిం పట్టేసుకుని కూర్చోవడం దాదాపుగా మరిచిపోయాం. దాదాపుగా ఆ అలవాటే మర్చిపోయాం. పొరపాటున కూర్చున్నామా.. ఇక అంతే.. లేవలేము. లేచామా.. కూర్చోలేము.. ఇదీ పరిస్థితి. భోజనానికి బల్ల కావాలి.. పూజ చేయాలంటే స్టూలు కావాలి. సేద తీరాలంటే కుర్చీ ఉండాలి.. ఇదీ నేటి పరిస్థితి. సృష్టికర్త మన శరీరాన్ని నేలపై కూర్చోవడానికి అనువుగా, రబ్బరుబొమ్మతో పోటీపడేలా రూపొందించాడు. శరీరంలోని ప్రతి భాగాన్నీ ఏమాత్రం కష్టపడకుండా హాయిగా అందుకోగలగాలి. మనిషే.. బద్ధకంతో ఆ వెసులుబాటును దూరం చేసుకున్నాడు. ఫలితంగా బిర్రబిగుసుకుపోయాడు. అయినా.. ఇప్పటికీ మించిపోయింది లేదు.. యోగ అండగా ఉంది. సిద్ధాసనం, పద్మాసనం, సుఖాసనం మనిషిని బుద్ధిగా కూర్చోబెడతాయి. మనిషి నిలబడితే రామబాణం గుర్తుకు రావాలి. అంత నిటారుగా ఉండాల్సిన మనం నానా వంకర్లూ పోతున్నాం. వాలినట్టుగా మెడ దగ్గరో వంపు, ఒంగినట్టుగా వెనె్నముక దగ్గరో వంపు, జారినట్టుగా నడుము దగ్గరో వంపు... ఇలా మొత్తంగా అన్నీ వక్రాలే.. ‘తాడాసనం’ వాలులేకుండా నిలబడటం నేర్పుతుంది. త్రికోణాసనం, ధనురాసనం, పశ్చిమోత్తాసనం కొయ్యబారిపోయిన నడుమును మెల్లగా, విల్లులా వంచేస్తాయి. పాదహస్తాసనాన్ని సాధన చేస్తే.. చేతులతో పాదాన్ని ముట్టుకోవడం పెద్ద శ్రమేం కాదు.. భుజంగాసనం, ధనురాసనం, చక్రాసనం.. ఇలా రుషి పరంపర వందల కొద్దీ ఆసనాల్ని కానుకగా ఇచ్చింది. ఇవన్నీ శరీరంపై నియంత్రణ సాధించడానికి ఉద్దేశించినవే.. రోజువారీ జీవితంలో.. మన శరీరంలో మహా అయితే పాతిక, ముప్ఫై శాతానికి మించి కదలిక ఉండదు. అదే ఆసనాలతో నూటికి నూరు శాతం చైతన్యం వస్తుంది. దీనివల్ల అవయవాలన్నీ స్వాధీనంలో ఉంటాయి. చెప్పినట్లు నడుచుకుంటాయి.
యోగ-వ్యాయామం
యోగాసనాలు చూడటానికి వ్యాయామాల మాదిరే ఉంటాయి కానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. వ్యాయామాల్లో బలానికి, వేగానికీ ప్రాధాన్యం ఎక్కువ. దీనివల్ల కండరాలు పెరిగి, శారీరక దారుఢ్యం మెరుగవుతుంది. అయితే మనం ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో దానికి సంబంధించిన కండరాలే పెరుగుతాయి. కానీ యోగా ఇలా కాదు.. శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. కండరాలు పెరగడం కంటే శారీరక కదలికలు, వాటికి దోహదం చేసే బంధనాలు, స్నాయువుల వంటివన్నీ పటిష్టంగా తయారవుతాయి. యోగాలో కదలికలు నెమ్మదిగా జరిగితే సాధారణ వ్యాయామాల్లో
వేగంగా సాగుతాయి. యోగాలో స్పందనల వేగం, రక్తపోటు స్థిరంగా ఉంటాయి. వ్యాయామంలో ఇవన్నీ పెరుగుతాయి. యోగాలో సంకల్పిత, అసంకల్పిత కండరాలు రెంటిపైనా ప్రభావం ఉంటుంది. వ్యాయామంలో మాత్రం సంకల్పిత కండరాల మీదే ప్రభావం ఎక్కువ. కాబట్టి యోగ, వ్యాయామం ఒకటి కాదు. దేని ప్రయోజనం దానిదే.. దేన్నీ తక్కువ చెయ్యటానికీ లేదు. యోగా శారీరక-మానసిక ఆరోగ్యాలు రెంటికీ ప్రాధాన్యం ఇస్తే.. శారీరక సమర్థతకు, దారుఢ్యానికీ వ్యాయామాలు ఉపకరిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అవయవాల పనితీరు మెరుగవ్వటానికి ప్రత్యేక వ్యాయామాలు అవసరమవుతాయి కూడా. యోగా సాధనకు కేవలం వ్యాయామం గానే కాదు.. సంపూర్ణమైన జీవన విధానంగా గుర్తించాలి.
యోగనిద్ర
ఒత్తిడి, భయం, అభద్రత, అసంతృప్తితో పాటు ఆధునిక జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అనేకానేక సవాళ్లను అధిగమించడానికి మహర్షులు ప్రసాదించిన అతి గొప్ప కానుక ‘యోగనిద్ర’. ప్రజ్ఞను పెంచే జ్ఞాన నిద్ర. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటే ఒత్తిడి. అంతులేని లక్ష్యాలు, పదోన్నతుల ప్రయత్నాల కోసం పాట్లు, కుటుంబ జీవితంలో కలతలు.. ఇలా ఎన్నో.. ఎక్కడ కాస్త తేడా వచ్చినా పరుగులో వెనుకబడతాం.. అంసతృప్తి, భయం, అభద్రత వంటివి మనసు మూలాల్లో పేరుకుపోతున్నాయి. కుళ్లి కంపుకొడుతున్నాయి. ఆ ప్రభావం లక్షకాళ్ల జెర్రిలా ఒంటిపైకి పాకుతోంది. అధిక రక్తపోట్లు, నిద్రలేమి సమస్యలు కూడా వీటి ప్రతిఫలాలే.. ఒకటేమిటి..? ఇలా అన్నింటికీ మనసే కారణం. దాదాపు 36 శాతం ప్రజలు ఏదో ఒక సమయంలో ‘కుంగుబాటు’ బారిన పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. భారతదేశం ఆత్మహత్యల దేశంగా రికార్డులకెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం ఆత్మహత్యలు మన దేశంలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో.. మనోశక్తి పెంచుకోవడానికి మహర్షులు ఓ మహత్తరమైన మార్గాన్ని చూపించారు అదే.. యోగనిద్ర.
అనుభవజ్ఞులైన న్యూరాలజిస్టులు, దిగ్గజాల్లాంటి శాస్తవ్రేత్తలు ఓ భారతీయ యోగిని పరిశీలించాలనుకున్నారట. అనుకున్న విధంగానే అత్యాధునిక పరికరాల్ని తెప్పించారట. అలాగే ఓ స్వామీజీని కూడా పిలిపించారట. ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిపోతున్న భారతీయ యోగి ‘స్వామిరామ’ అక్కడికి చేరుకున్నారట. నిపుణులంతా చిరునవ్వుతో ఆయనకు స్వాగతం పలికికారట. కొద్దిసేపటికి స్వామీజీ శవాసనంలోకి వెళ్లిపోయి.. ప్రశాంతంగా కళ్లు మూసుకున్నారట. నిపుణులు ఆయన తలచుట్టూ ఏవో మీటలు అమర్చారు. మధ్యమధ్యలో శాస్తవ్రేత్తలు ఆయనను ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ స్వామీజీ నుండి ఎలాంటి సమాధానాలూ లేవు. అరగంట తర్వాత స్వామీజీ కళ్లు తెరిచారు. శాస్తవ్రేత్తలు ఆయన మెదడు పనితీరును విశ్లేషించే పనిలో పడ్డారు. అధ్యయన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అప్పటిదాకా స్వామీజీ మెదడులోని ఓ పొర ప్రగాఢ నిద్రాస్థితిలో ఉంది. అంతకంటే ఉన్నతమైన మరో పొర మాత్రం పూర్తి చైతన్య స్థితిలో ఉంది. అందుకు సాక్ష్యంగా.. స్వామీజీ శాస్తవ్రేత్తలు అడిగిన ప్రతి ప్రశ్ననూ గుర్తుచేస్తూ.. వాటికి సమాధానాలు కూడా ఇచ్చారు. వారికేమీ అర్థం కాలేదు.. స్వామీజీని వారు అడిగారు.. ‘అసలు ఇది ఎలా సాధ్యమైంది?’ అని.. దానికి స్వామీజీ నవ్వుతూ.. ‘దీన్నే తురీయ అవస్థ అంటారు. యోగనిద్రలోని అత్యున్నత స్థితి’ అని సమాధానమిచ్చి నిష్క్రమించాడు. అప్పుడు అందరి మనసులో ఒక్కటే ప్రశ్న.. ‘యోగనిద్ర’ అంటే ఏమిటని..?
నిద్ర, యోగనిద్ర ఒకటి కాదు. నిద్రలో మెదడు బాహ్య పరిస్థితులపై దాదాపు నియంత్రణను కోల్పోతుంది. చూడలేం, వినలేం, మాట్లాడలేం, స్పందించలేం. కానీ.. యోగనిద్రలో.. (మిగతా 12వ పేజీలో)
సాధకుడి మెదడులో ఓ పొర పరిపూర్ణమైన విశ్రాంతిని పొందుతూ ఉంటే, అంతకంటే ఉన్నతమైన మరోపొర మహా చైతన్యస్థితిలో ఉంటుంది. యోగనిద్ర అనేది అటు నిద్రా కాదు, ఇటు మెలకువా కాదు. కాబట్టే ఉపనిషత్తులు దీన్ని ‘చేతన నిద్ర’ అన్నాయి. మహర్షులు, సన్యాసులు పూర్వాశ్రమ వాసనల్ని తొలగించుకోవడానికి ఈ ప్రక్రియను ఉపయోగించుకునేవారు. కడుపులోని పిండం కూడా యోగనిద్రలోనే ఉంటుందని పెద్దలు చెబుతూండటం మనం వింటూనే ఉంటాం. యోగనిద్ర చాలా సులభమైన ప్రక్రియ. దీనికోసం తలకింద, కాళ్లు పైనా పెట్టి శీర్షాసనాలు వేయక్కరలేదు. ఖరీదైన వ్యాయామ పరికరాలతో పనేలేదు. తొలిదశలో అనుభవజ్ఞుడైన యోగాచార్యుడి దిశానిర్దేశం చాలు. తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. అరగంట యోగనిద్ర నాలుగు గంటల గాఢనిద్రతో సమానం. ఉదయం, సాయంత్రం యోగనిద్రకు అనువైన సమయాలు. యోగ తర్వాత కొంత సమయాన్ని కేటాయించినా సరిపోతుంది. భోజనం తర్వాత యోగనిద్ర సరికాదు. అప్పుడు యోగం చెదిరిపోయి నిద్రే మిగులుతుంది. ఇది చేసేటప్పుడు హాయిగా, ప్రశాంతంగా శవాసనంలో పడుకోవాలి. ఒంట్లోని అని భాగాలు దేనికదే స్వతంత్రంగా సేదతీరాలి. అరచేతులు ఆకాశం చూస్తున్నట్టుగా ఉండాలి. ఏ భాగంపైనా ఒత్తిడి ఉండకూడదు. బలవంతంగా రెప్పవాలుస్తున్నట్లు కాకుండా, ప్రశాంతంగా కళ్లు మూసుకోవాలి. యోగనిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు.
మార్కండేయ పురాణంలో భాగంగా ఉన్న ‘దుర్గాసప్తశతి’. కల్పాంతంలో యావత్ సృష్టినీ తనలో ఇముడ్చుకున్న శ్రీమహావిష్ణువు శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న దృశ్యం కళ్లకు కడుతుంది. భారతీయత యోగనిద్రకు దైవత్వాన్నిచ్చింది. ఆ పేరుతో ఓ యోగదేవతను సృష్టించింది. యోగ నిద్రాదేవి నివాసం.. విష్ణుమూర్తి కనురెప్పలు.. మళ్లీ సృష్టిని ఆరంభించాల్సి సమయం వచ్చినప్పుడు ‘ఆదిమధ్యాంత రహితుడైన మహావిష్ణువును మేల్కొలుపు తల్లీ!’ అని బ్రహ్మదేవుడు యోగనిద్రాదేవిని ప్రార్థించాడట. ఆదిశంకరుడు తన ‘తారావళి’లో యోగనిద్ర ప్రశస్తిని వివరించాడు. యోగనిద్ర స్థితిలో మాయ కరిగిపోతుంది.. అహం అంతరిస్తుంది.. ఇంద్రియాలకూ, మనసుకూ మధ్య సంబంధం తెగిపోతుంది. యోగులు అనుభవించే ఆ దివ్య చైతన్యమే యోగనిద్ర.. ఆధునిక యుగంలో స్వామి సత్యానంద సరస్వతి, స్వామి రామ తదితరులు యోగనిద్రకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించారు. వివిధ విశ్వవిద్యాలయాలు కూడా యోగనిద్ర ప్రభావాన్నీ, ఫలితాన్నీ శాస్ర్తియంగా బేరీజు వేస్తున్నాయి.
*
యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భారతీయ తత్త్వవేత్తలు ప్రపంచానికి చాటి చెప్పారు. నిజానికి ఒకప్పటి జీవన పరిస్థితులతో పోలిస్తే నేటి ఆధునిక కాలంలోనే దీని అవసరం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ముఖ్య ఉద్దేశం. యోగా అనే పదం సంస్కృతంలోని ‘యుజ’ అనేదాని నుంచి వచ్చింది. యుజ అంటే చేరడం, ఏకం చేయడం, కలయిక అనే అర్థాలు వస్తాయి. శరీరం, మనసును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం. దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన యోగాశాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి ఆమోదంతో యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. దేశదేశాలు జరుపుకునే పండుగైంది. ఐదువేల సంవత్సరాలుగా భారతీయ జీవన విధానంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న యోగ నేడు విశ్వవ్యాప్తమైంది. విశ్వమానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి సహస్రాధిక వేదికయై ఊరూరా ఉత్సవమైంది. ప్రపంచమంతా మరోసారి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి సన్నద్ధమైంది. జూన్ 21 ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అందుకే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితిలో నరేంద్రమోదీ 2014లో ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనకు ఐరాస ఆమోదం తెలపడంతో యోగా దినోత్సవాన్ని 2015, జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవం వేడుకలకు 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 36 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 నిముషాల పాటు 21 యోగాసనాలు వేశారు. దీంతో రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకేసారి 35,985 మంది యోగాసనాలు వేయడం ఒక రికార్డయితే, 84 దేశాలు పాల్గొనడం మరో రికార్డు.
భారతీయ సంస్కృతీ వైభవానికి చిహ్నమైన ప్రాచీన యోగవిద్య ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ప్రాక్ పశ్చిమాలు ఏకమవుతున్నాయి.. అమెరికా, చైనా, యూకే, జపాన్.. ఇలా దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రజలు యోగసాధకులవుతున్నారు.
అమెరికా
వాషింగ్టన్ నుంచి టెక్సాస్ నగరం వరకూ యోగ సాధన ప్రజలను ఆకర్షిస్తోంది. వాషింగ్టన్‌లో, హోస్టన్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్థానిక సంస్థలతో కలిసి యోగా కార్యక్రమాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నాయి. శాంతి, సామరస్యానికి దోహదపడే యోగాను మన దేశం ప్రపంచానికి అందించిందని భారత దౌత్యకార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఏర్పాటు చేసే సన్నాహక కార్యక్రమాల్లో దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, అమెరికా ప్రభుత్వ అధికారులు, వివిధ నగరాల మేయర్లు పాల్గొంటున్నారు.
జపాన్
జపాన్‌లో యోగా సందడి ఎప్పుడో మొదలైంది. జపాన్ సంస్కృతి, సాంప్రదాయాలకు యోగా దగ్గరగా ఉండటంతో ఈ దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఈ సంప్రదాయ విద్యను ప్రోత్సహించేందుకు ఇప్పటికే జపాన్ ఒక పార్లమెంటరీ బృందాన్ని ఏర్పాటు చేసింది. యోగాను ప్రోత్సహించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలిదేశం జపాన్.
ఫ్రాన్స్
ఫ్రాన్స్ అనగా ఈఫిల్ టవర్ గుర్తుకొస్తుంది. పారిస్ నగరంలోని ఈ చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశం యోగా సాధకులతో కళకళలాడుతోంది. యోగా పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతుందనటానికి అక్కడ ఏర్పాటవుతున్న యోగా స్టూడియోలు, శిక్షణ కేంద్రాలే నిదర్శనం. వివిధ రకాలైన భారతీయ యోగా విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారు.
ఈజిప్టు
ఈజిప్టు రాజధాని కైరోలోనే కాకుండా అలగ్జాండ్రియా, ఇస్మాలియా నగరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ఈసారి నిర్వహించనున్నారు. సన్నాహక చర్యల్లో భాగంగా వౌలానా ఆజాద్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ (ఎంఏసీఐసీ) ‘శాంతియుత సహజీవనానికి యోగ’ అనే పేరుతో ఒక సదస్సును నిర్వహించింది. కేరళలో శిక్షణ పొందిన ఈజిప్టు యోగా శిక్షకుడు హలాబరాకత్ ఈజిప్టులో యోగా సాధకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
చైనా
అంతర్జాతీయ యోగా దినోత్సవం మనదేశంలో ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా చైనాలో కూడా జరుగుతుంది. గత కొనే్నళ్లుగా చైనాలో యోగా ఎంతో ప్రజాదరణ పొందుతోంది. భారత్ నుంచి వెళ్లిన యోగా శిక్షకులు ఇక్కడ యోగా సాధకులను తయారుచేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ యోగాదినోత్సవం చైనాలో పెద్ద పండుగ. దీన్ని పురస్కరించుకుని కేవలం బీజింగ్‌లోనే కాకుండా పలు నగరాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన, ఎంతో పురాతనమైన చైనా గోడ వద్ద నిర్వహించే యోగా కార్యక్రమాలు అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నాయి.
యూకే
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాలు బ్రిటన్‌లోని ప్రముఖ నగరాల్లో సందడిగా జరుగుతున్నాయి. లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ ప్రతిసారీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా ఉంటోంది. ఇక్కడ యోగాభ్యాసాలు, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. లండన్ మేయర్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరుకానుండటం ప్రధాన ఆకర్షణ.
పాకిస్తాన్
ముస్లిం దేశమైనప్పటికీ పాకిస్తాన్‌లో యోగా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. పాకిస్తానీ రామ్‌దేవ్ బాబాగా పేరొందిన షంషాద్ హైదర్ అక్కడ యోగా సంస్కృతిని విస్తరింపజేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. లాహోర్ నగరంలో ఎన్నో యోగా శిక్షణ కేంద్రాలు, క్లబ్‌లు వెలిశాయి. ఆత్మశాంతి, శారీరక దృఢత్వం కోసం యోగా చేసే మేలును పరిగణనలోకి తీసుకుని ఆ దేశంలో మతానికి అతీతంగా ఎంతోమంది యోగా వైపు ఆకర్షితులు అవుతున్నారు. పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.
ఎందరో యోగర్షులు
భారతీయ యోగ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు ఎందరో.. యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా పాటించి ప్రజలందరికీ దగ్గర చేయాలని భారతదేశం చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలన్నీ ముక్తకంఠంతో ఒప్పుకున్నాయంటే.. అందుకు కారణం.. అప్పటికే ఆయా దేశాలకు యోగాతో పరిచయం ఉండటం, దాని ప్రత్యేకతలపై అవగాహన ఉండటమే. అందుకు కృషి చేసినవారిలో టి.కృష్ణమాచార్య, బీకే ఎస్ అయ్యంగార్, మహర్షి మహేష్ యోగి తదితరులున్నారు.
టి. కృష్ణమాచార్య
ఆయుర్వేద వైద్య విధానాలను యోగాతో మిళితం చేసి, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను ఆవిష్కరించిన ఆధునిక యోగా సాధకుడు టి. కృష్ణమాచార్య. కర్ణాటకలోని చిత్రదుర్గ ఈయన స్వస్థలం. ‘హఠయోగ’ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనుడు. కృష్ణమాచార్య మైసూర్ మహారాజా అండదండలతో దేశమంతా పర్యటించారు. యోగాపై ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇచ్చారు. ‘విన్యాస’ విద్యలో పేరుగాంచారు. యోగాపై ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు, పద్యాలు రచించారు. నిండు నూరేళ్లు జీవించిన ఈయన 1989లో మరణించారు.
బీకేఎస్ అయ్యంగార్
టి.కృష్ణమాచార్య శిష్యుల్లో అయ్యంగార్ ఒకరు. ఈయన చిన్నతనంలో ఎన్నో జబ్బులతో బాధపడ్డారు. అందువల్ల శారీరకంగా బలహీనంగా ఉండేవారు. ఆ సమయంలో ఆయనకు యోగాతో పరిచయం ఏర్పడింది. నిరంతర సాధనతో ఇందులో నైపుణ్యం సాధించారు. పతంజలి యోగ సూత్రాలను తనదైన శైలితో పరిపుష్టం చేసి ‘అయ్యంగార్ యోగ’ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఘనత ఆయనది. 1966లో అయ్యంగార్ రాసిన పుస్తకం ‘లైట్ ఆన్ యోగ’ను 19 భాషల్లోకి అనువదించారు. దీన్ని ‘యోగ బైబిల్’ అని కూడా అంటారు.
స్వామి శివానంద
తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించారు శివానంద. ఈయన వైద్యుడు. తదుపరి కాలంలో ఉత్తరాఖండ్‌లోని రుషీకేష్‌ను తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. బ్రిటీష్ పాలనలో ఉన్న మలేషియాలో వైద్యుడిగా దశాబ్దకాలం పాటు సేవలందించారు. మనిషికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వైద్యం పూర్తిగా నయం చేయలేకపోతుందనే ఆలోచనతో మథనపడుతూ యోగ సాధకునిగా మారారు. యోగ సాధనలో పాటించాల్సిన 18 లక్షణాలను వివరిస్తూ ఒక గీతం కూడా రచించారు శివానంద. హఠయోగ, కర్మయోగ, మాస్టర్ యోగలోని ప్రత్యేకతలను కలబోసి ‘త్రిమూర్తి యోగ’ను శిష్యులకు బోధించారు.
పట్ట్భా జోయిస్
‘అష్టాంగ యోగ’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన విన్యాస యోగ సృష్టికర్త కె.పట్ట్భా జోయిస్. 1927లో కర్ణాటకలోని హసన్‌లో కృష్ణమాచార్య ఉపన్యాసానికి హాజరైన తరువాత ఈయనకు యోగపై ఆసక్తి కలిగింది. అప్పుడు ఈయన వయస్సు పనె్నండు సంవత్సరాలు. వెంటనే కృష్ణమాచార్య శిష్య బృందంలో చేరిపోయారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో యోగ సాధన చేశారు. దేశమంతటా పర్యటించారు. మైసూరు సమీపంలోని యోగ సాధన క్షేత్రాలు నెలకొల్పి ఎందరికో ‘యోగ గురు’ అయ్యారు.
మహర్షి మహేష్
‘పారమార్థిక ధ్యాన’ విధానాన్ని ఆవిష్కరించిన యోగా గురు మహర్షి మహేష్ యోగి. పాపమార్థిక ధ్యాన విధానంలో దాదాపు 50,000 మంది శిష్యులను తయారుచేశారు. ఈ పద్ధతికి ఆకర్షితులైన వారిలో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లైంట్ ఈస్ట్‌వుడ్ ఒకరు. భారతదేశంతో పాటు కెనడా, యూఎస్, యూకే, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో ఈయన ఉపన్యాసాలు ఇచ్చారు. పారమార్థక ధ్యాన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఈయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ధ్యాన, విద్యా కేంద్రాలను స్థాపించారు.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి