S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్థిక తప్పులు

తిరుపతికి వెళ్లాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కనీసం రెండు నెలల ముందు ఒక ప్రణాళిక రూపొందించుకుంటుంది. దైవదర్శనానికి, వసతి, ప్రయాణం, ఇవన్నీ సాఫీగా సాగాలి అంటే కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ప్రణాళిక చేసుకుంటేనే తిరుపతి యాత్ర విజయవంతం అవుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేసుకోక పోయినా అప్పటికప్పుడు కూడా తిరుపతికి వెళ్లవచ్చు. రైలులో నిలబడి రోజంతా ప్రయాణం చేయాలి. దైవదర్శనానికి రోజంతా క్యూలో నిలబడాలి. రెండు మూడు నెలల ముందుగా ప్రణాళిక చేసుకుంటే యాత్ర సుఖంగా సాగుతుంది. అప్పటికప్పుడు వెళితే ఖర్చు అంతే కానీ యాత్ర భారంగా సాగుతుంది. తిరుపతి యాత్ర సుఖవంతంగా సాగేందుకు రెండు మూడునెలల ముందే ప్రణాళిక రూపొందించుకుంటే మొత్తం జీవితానికి అవసరం ఐన ఆర్థిక ప్రణాళిక ఎంత ముందుగా తయారు చేసుకోవాలి. ఎంత ముందు అనే మాట పక్కన పెట్టి చాలా మందికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలనే విషయమే తెలియదు. భగవంతుడిపై భారం వేసి జీవిత ప్రయాణం సాగించేస్తుంటారు. జీవితం అనుకున్న విధంగా సుఖవంతంగా సాగాలి అంటే కచ్చితంగా సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం.
మన ఆదాయం ఎంత? భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు వంటి ఖర్చులు అన్నింటికీ ముందు నుంచే ఒక ప్రణాళిక అవసరం. లేక పోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అప్పటికప్పుడు ఆర్థిక అవసరాల కోసం అప్పుల కోసం పరుగులు తీయడంలోనే జీవితం గడిచిపోతుంది.
అనుభవించు రాజా! అంటూ సంపాదించింది ఎప్పటికప్పుడే ఖర్చు చేస్తే జీవితం రక్తకన్నీరు అవుతుంది.
ఈ మధ్య టీవిలో వస్తున్న ఒక ప్రకటన గుర్తుకు వచ్చింది. ఒక అమ్మాయి తన మొదటి నెల జీతం చెక్కును చేతిలో పట్టుకుని ఇప్పుడు నేను మా నాన్న ముఖాన్ని తలెత్తుకుని చూస్తాను. నాన్నతో కలిసి హోటల్‌కు వెళతాను. బిల్లు నేనే చెల్లిస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. సంపాదించడం మొదలు పెట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రకటనలో చక్కగా చెప్పారు.
ఐటి చదువుల్లో చిన్న వయసులోనే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఐతే భవిష్యత్తు గురించి, జీవితం గురించి, భవిష్యత్తు అవసరాల గురించి వీరిలో అవగాహన కొంత తక్కువే. అప్పటి వరకు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడ్డవారు, ఉద్యోగంలో చేరగానే మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలో ప్రణాళికలు వేసుకుంటారు కానీ వచ్చే రోజుల కోసం ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోరు.
మొదటి నెల జీతంతో అమ్మా నాన్నలకు ఏదైనా బహుమతి ఇవ్వాలని, ఫ్రెండ్స్‌కు మంచి పార్టీ ఇవ్వాలి అనే ఆలోచన సహజమే. కానీ వీటి కన్నా ముందు మొదటి నెల నుంచే భవిష్యత్తు గురించి ఆలోచించడం అంత కన్నా ముఖ్యం.
ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఈ కాలంలో మొదటి నెల నుంచే సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. మొదటి నెల జీతంతో తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వడం కన్నా మొదటి నెల నుంచే భవిష్యత్తు కోసం పొదుపు అనేది ప్రారంభిస్తే తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ సంతోషపడతారు.
కనీసం ఐదువందల రూపాయల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయవచ్చు. సిస్టమెటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా మీకు తెలియకుండానే భారీ మొత్తం తయారవుతుంది. మీ ఖాతా ఉన్న బ్యాంకుకే నెల నెల సిప్‌కు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలి. ఇది మొదటి నెల నుంచే ప్రారంభిస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టు అవుతుంది.
ఆర్థిక ప్రణాళిక తప్పని సరిగా రూపొందించుకోవాలి.
ప్రస్తుత మీ ఆదాయం, మీ అవసరాలు, మీ ఇనె్వస్ట్‌మెంట్, మీ భవిష్యత్తు అవసరాలు వీటన్నిటిపై మీకో అంచనా ఉండాలి. భవిష్యత్తు అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పటి నుంచే మీ జీతంలో ఎంత మొత్తం ఇనె్వస్ట్ చేయాలో అవగాహన అంచనా ఉండాలి.
ఆర్థిక అంశాల్లో చాలా మంది చేసే కామన్ తప్పుల జాబితా ఒకటి ఈ మధ్య ఆర్థిక నిపుణులు రూపొందించారు.
* చాలా మంది తమ ఆదాయం ఎంతో ఖర్చు అంతే చేస్తారు. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థిక స్వేచ్ఛ లభించదు. ఆదాయం కన్నా ఖర్చు ఎప్పుడూ తక్కువగానే ఉండాలి. ఆదాయం పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి.
* చాలా మంది పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తారు. రోజులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. సమస్యలు వచ్చినప్పుడే పొదుపు ఇనె్వస్ట్‌మెంట్ గురించి ఆలోచించడం కాదు. ఉద్యోగంలో చేరిన మొదటి నెలనే దీని గురించి ఆలోచించాలి. ఇప్పటికే ఆలస్యం అయితే అసలు లేని దాని కన్నా ఎప్పుడో ఒకప్పుడు బెటర్ అని ఇప్పుడే ప్రారంభించండి.
* చాలా మంది ఇన్స్యురెన్స్‌ను పెట్టుబడిగా భావిస్తారు. ఇన్స్యురెన్స్ ఎప్పుడూ పెట్టుబడి కాదు. పెట్టుబడిని ఇన్స్యురెన్స్‌ను వేరువేరుగా చూడాలి రెండింటిని కలుపవద్దు.
* మార్కెట్ పడిపోతున్నప్పుడు సిప్‌ను నిలిపివేస్తారు. ఒకసారి సిప్‌ను ప్రారంభించాక మార్కెట్ పెరుగుతున్నా, తగ్గుతున్నా సిప్‌ను నిలిపివేయవద్దు.
* ఒకసారి పెట్టుబడి పెట్టి ఇక వదిలివేయవద్దు. ఫోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి.
* కొంత మంది ఒక ఏడాది కోసం ఇనె్వస్ట్ చేస్తారు. ఇనె్వస్ట్‌మెంట్ అనేది నిరంతరం సాగుతూనే ఉండాలి. ఏడాది కోసం కాదు, సంపాదించడం కొనసాగుతున్నంత కాలం ఇనె్వస్ట్‌మెంట్ కొనసాగించాలి.
* కుటుంబానికి ఆరోగ్య బీమా అవసరం. ఆస్పత్రి పాలైతే కుటుంబ ఆర్థిక పరిస్థితి తలక్రిందులవుతుంది.
* ఆరునెలల జీతం అత్యవసర నిధి కింద సమకూర్చుకోవాలి.
సహజంగా మన చేతిలో ఎంత డబ్బు ఉంటే మనకు ఆ స్థాయికి తగిన ఖర్చులు కళ్ల ముందు నృత్యం చేస్తుంటాయి. పొదుపును, ఇనె్వస్ట్‌మెంట్‌ను సైతం ఒక ఖర్చుగానే భావించి ముందుగా పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌కు సంబంధించిన ఖర్చులు మినహాయించి మిగిలిన ఖర్చులపై దృష్టి పెట్టాలి.
ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే అలాంటి వ్యక్తులు జీవితంలో అద్భుతంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు.

-బి.మురళి