S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ స్పీడు బ్రేకర్లు!

భెజవాడ గాంధీనగర్ ‘పాత పుస్తకాల షాపులు’ అన్నది పేరే గాని మద్రాసు నుంచి నేరుగా పాకెట్ బుక్స్ - అలంకార్ దుర్గామందిరాల మధ్య ఏరియాలో ఉన్న ‘సెకండ్ హ్యాండ్ బుక్‌షాపులకి’ రిలీజ్ అయిపోయేవి, వాటిలో విశ్వప్రసాద్ ‘డాక్టర్’ మరియు ప్రసాద్‌ల బుక్స్, ధనికొండ వగైరాల బుక్స్ ఉండేవి - ధనికొండ రాసిన ‘క్లియోపాత్ర’ ఇంత లావు పుస్తకం. ఈ బుక్స్‌కి వేరే టైపూ కాగితం - ఆర్ట్ పేపరు కవరు వుండేది. అదో వెరైటీ. అప్పట్లో డిటెక్టివ్ కథ రాయనివాడు రచయితే కాడు అన్నట్లుండేది.
నేను భోజనం చేసే లాడ్జ్‌కి దగ్గరలోనే ధనికొండ వారి ‘క్రాంతిప్రెస్’ టి.నగర్ ఫ్రెండ్ ద్వారా ‘ధనికొండ’ పరిచయం కాగా అప్పుడప్పుడు అక్కడ - ఆయన ప్రెస్సులోకి తొంగిచూసేవాణ్ని. సందర్భం ఏమిటి అంటే - 1961లో శాంతారాం - రెండోసారి తన మూడవ భార్య సంధ్య కోసం ‘స్ర్తి’ -అర్థాత్ (అనగా) శకుంతల’ అంటూ పంచవర్ణ శోభిత ‘ భారీ చిత్రం’ తీశాడు. అసలు సంధ్య అనే తార 1932లో పుట్టినప్పటికే ఈ ‘లెజెండరీ ఫిగర్’ వి.శాంతారామ్‌గారు ముప్పయి సంవత్సరాల వాడు.
1957 నాటి ‘శకుంతల’ చిత్రం - శాంతారాంగారు అతని రెండో భార్య జయశ్రీ శకుంతలగా, నటుడు తేనెకళ్ల చంద్రమోహన్ దుష్యంతుడుగా తీశాడు. అది కళాఖండమై, బాక్సాఫీసు దగ్గర విజయం సాధించింది. ‘సంధ్య’తో (అది ఆయన పెట్టిన వెండితెర పేరు ఆమెకు) తాను తన అరవైయ్యోపడిలో నటించాడు. అద్భుతమైన ‘దో ఆంఖే బారాహాత్’ లాంటి సందేశాత్మక చిత్రాలతో సహా ఎన్నో సినిమాలు తీశాడు. మొత్తం ముగ్గురు భార్యలలో ‘చక్రాలంతేసి’ కనులున్న ‘జయశ్రీ’ గ్లామరస్ స్టార్ కాగా, అచ్చం ఆమె కంఠస్వరం లాగే వున్నదీ ఈమె గొంతు అంటూ ‘సంధ్య’ని ఆయన ‘అమర్‌భూపాలి’ టాలెంట్ సెర్చ్‌లో ఎంపిక చేసుకున్నాడు. ఆమె అసలు పేరు విజయ దేశ్‌ముఖ్. సరే, సంధ్య కేవలం భర్త తీసిన, డైరెక్ట్ చేసిన సినిమాలే (18) చేసింది. ‘స్ర్తి’ పేరిట శాంతారామ్ ‘శకుంతల’ను భారీఎత్తున తీసి, రిలీజు చేస్తున్నప్పుడు - విశ్వప్రసాద్ ‘శకుంతల’ నవల సరసవత్తరంగా పాకెట్ బుక్స్ చదివే పాఠకుల కోసం కమ్మగా ‘వండుతున్నాడు’. ఈ ఫిలిప్ రిలీజ్‌తోపాటుగా శకుంతల పాకెట్ బుక్‌ని రిలీజ్ చేసెయ్యాలని యుద్ధ ప్రాతిపదికన నవల రాసేస్తూ, శాంతారామ్ ‘స్ర్తి’ని చూసి ఆనక దీనికి ఏమైనా మెరుగులూ మలుపులూ కావాలేమో పెడదాం అన్న చర్చ జరిగింది.
మద్రాస్‌లో మవుంట్ రోడ్డులో ‘శాంతి’ థియేటర్ శివాజీ గణేశన్ లీజుకు తీసుకోవడంతో అతని ఫ్యాన్స్‌కి ఓ దేవాలయం అయిపోయింది. అందులో ఈ రెండో శకుంతల ఆఫ్ శాంతారామ్ విడుదల అయింది.
ఎలాగో టిక్కెట్‌లు తొలిరోజు సెకండ్ షోకు సంపాదించారు. ‘వీరాజీ’ కూడా రావాలన్నారు. ‘ఈ పాపులర్ రైటర్స్ సెట్టు’ అంతా సినిమా చూశాక అతని వ్యాఖ్యలు, సలహాలు మనకి కావాలి అన్నాడు. విశ్వప్రసాద్ - తప్పదుగా.
టి.నగర్ నుంచి అంతా సినిమా హాలు చేరుకున్నారు. హిందీ సినిమాకి అంత.. ఇసుక వేస్తే రాలనట్లు జనమా? జయలలితా, ఎం.జి.ఆర్.ల కాంబినేషన్‌లా ఉంది ఇది. చూశాం. ఇంటర్వెల్‌లోనే అనాలసిస్ మొదలు. మొత్తానికి తెలుగు పాకెట్ బుక్ శకుంతల కూడా ఆంధ్రాలో ఆ వారంలోనే రిలీజ్ అయింది. విశ్వప్రసాద్; డాక్టర్ (కలం పేరు)లు బ్రదర్స్ అనుకుంటాను. మా ప్రసాద్ రాసిన షాజహాన్‌కి ఎంతో క్రేజు. కొడవటిగంటి వారు కూడా టి.వి.శంకరమ్ పేరుతో అపరాధ (పరిశోధన) ప్రక్రియకి లొంగిపోయారు - ఈ వీరాజీ కూడా ‘డైమండ్ కింగ్’గా కొన్ని డిటెక్టివ్ కథలు (ఉన్నాయిగా ఇంగ్లీషు ఆధారాలు) రాశాడు అంటే ఆశ్చర్యపోకండి.. అప్పట్లో అక్షరాస్యత శాతం తక్కువ. అయినా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు అన్ని తరగతుల వాళ్లు ఏదో ఒక నవల, మ్యాగజైను చదివేవాళ్లు. అద్దె పుస్తకాల షాపులు వెలిశాయి. ‘మూడు పుస్తకాలు ఆరు రీడర్స్’గా ఇంటింటా విజయ ప్రవేశం చేశాయి పాకెట్ బుక్స్. ఈ ‘అగ్రశ్రేణి సినిమా పత్రికల రచయితలతో పరిచయం - ‘చిత్ర’ ఆఫీసు సమావేశాలు - సినిమా షూటింగ్ సందర్శనలు వగైరాలు అన్నీ నాకు ఈ లోకం పోకడని తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి. హేమాహేమీలంతా సందర్భం పెట్టుకొని పార్టీలు లాంటివి పెట్టుకోడం కూడా వుండేది.
ఇంట్లో వాళ్లు పుట్టింటికి వెళితే ఏదేనా సందర్భంతో ఆ ‘ఇల్లు’ ఫ్రెండ్స్ కందరికీ జాతీయం.
‘ముందీ విశ్వామిత్రుణ్ని ఇంటికి త్రోసెయ్యండి’ అనేవాళ్లు పెద్దలు కొలను, ధనికొండ లాంటి వాళ్లు. నాకు కుతూహలం, ప్రలోభం - మందు లేవు గానీ విజయాసక్తి మాత్రం ఉండేది చాలా. (మరి జర్నలిస్టును కదా?!) టి.నగర్ నుంచి పదకొండు-ఎ బస్సు షరా మామూలే. మా నాన్నగారికి ప్రసాద్ అంటే వాత్సల్యం ఉండేది. ‘చూడండి సార్! నేను మీ వాడి దారిలోనికి మాత్రం రాలేను. ది టూ లేట్. కానీ మీవాణ్ణి మాత్రం ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా కాపాడుకుంటాను’ అనేవాడు దొడ్డ మనిషి. గొప్ప హృదయమున్న ‘జీనియస్’ నేను బెజవాడ డైలీకి వెళ్లిపోయాక రాంప్రసాద్ పాలపర్తి అలియాస్ ప్రసాద్ అనే ఫ్రెండ్ నాకు దూరమయ్యాడు. ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందే కదా.
అతని శిష్యుడొకడు రాగిణి అనే రంగుల కథల పత్రిక మొదలెతూ ఉంటే నువ్వు వాడి తొలి సంచికకు కథ రాయాల్సిందే అన్నాడు. దాని పేరు ‘సుబ్బారావు - వంట కథ లేదా నళినీ ప్రేమ గాథ - ఆశ్చర్యం మన వారపత్రికలు పది, పదిహేను రూపాయలు ఓ కథకి పారితోషికంగా ఇవ్వడానికి ఠాఠాలు గుణిస్తున్న రోజుల్లో వంద రూపాయలు పువ్వుల్లో పెట్టి కాదు గానీ, రెండు ఏపిల్స్‌తో కలిపి ఇచ్చాడా ఎడిటర్. సందర్భం వచ్చింది కదా అని అదే జ్ఞాపకం వస్తోంది.
1961 చివరిలో నేను ‘నా డైలీ డెస్క్’ మీద ‘బాతుముక్కు పాళీ - కొయ్య కలం’తో ఏదో రాసుకుంటూ ఉంటే (నా చొక్కాను చూస్తే తెలుస్తుంది. సిరా ఎక్కువగా వాడేవాణ్ణో? షర్టు నిండా మరకలే.)
వీక్లీ ‘శాస్ర్తీ’గారు (క్లర్క్) వచ్చాడు.
‘బాబూ! ఇక్కడో సంతకం పెట్టండి’ అంటూ లెడ్జర్ ఒకటి తెరిచాడు. ‘ఎందుకు’ అన్నట్లు కనులు ఎగరేశాను. అయ్యవారు చెప్పారు. ఇది మీరు ‘భారతి’లో రాసిన ‘ఎందుకు?’ అన్న కథకు పారితోషికం. పదిహేను రూపాయలు అందించాడు. అదే నాకు ఆంధ్రపత్రిక సంస్థ ఒక రచయితగా ఇచ్చిన చివరి పారితోషికం. ఒంటి మీదకు పూనకం వచ్చినంత సంతోషం.
‘అయ్యవారెంత మంచివాడు?’ ఈ ‘కథ’ని ‘నీలం హరి’గారు ఇంగ్లీషులోకి అనువాదం చేశారు ఆనక. లండన్ నుంచి వెలువడే ‘్థట్’ మ్యాగజీన్‌లో వచ్చింది. అలాగే మరోసారి ‘ఆఫ్ మేమన్ - బాండేజ్’ అనే పేరుతో సస్యశ్రీగారు ఒడిశా - సాహిత్య అకాడెమీ వారి క్వార్టర్లీ మ్యాగజీన్ కోసం అనువాదం చేశారు. ఆనక ఒరియాలోకి వెళ్లింది.
అయ్యవారు అన్నారే ‘గ్రైండింగ్ స్టోను’కి ముక్కు. అది నిజమయింది. నా క్రియేటివ్ రచనలు అన్నీ ఆంధ్రపత్రికకే ‘అమూల్యం’గా అంకితమయ్యాయి.
ఓసారి రాధాకృష్ణగారు అన్నాడు అదేమిటి సార్! మీరూ నేనూ పారితోషికం తీసుకోవడం ఏమిటి? అని!!
అవను ‘వీరాజీ’ ఇంటి పేరే ‘ఆంధ్రపత్రిక’ అయిపోయింది. ‘సార్’ సార్ - అనుకోవడం అప్పుడప్పుడు పిన్నాపెద్దల మధ్య ఉండేది మద్రాసులో. పెద్దల గదిలోకి వెళ్లే ముందు చెప్పులు తీసి - లోనికి పోవడం ముచ్చటగా సబార్డినేట్స్‌ని కూడా ‘ఆమా సామీ’ అనడం - అదొక సంప్రదాయం అయిపోయింది.
మన ‘అక్కినేని’ ఇంటికి నేను పోయినప్పుడు తను షూటింగ్ పూర్తి చేసుకొని మేకప్ తీసేసి వచ్చి కారు దిగుతూనే ‘హాయ్’ అంటూ నన్ను పలకరించాడు. తెల్ల లుంగీ దాని మీద అరచేతుల స్లాకు షర్టూ తొడిగాడు. నేను ఎగాదిగా చూడడం గమనించి అంతే.. వేషం అక్కడే వదిలేస్తాం.. వాళ్లిచ్చిన కాస్టూమ్స్ అక్కడే వొగ్గేస్తాం. అలాగే డైలాగులూ అక్కడే వొదిలేస్తాం. మన ‘లాగుల’తో మనం వచ్చేస్తాం...’ గలగలా నవ్వేశాడు హీరో.
అంతలో తనకి ఎవరో ట్రిబుల్ ఫైవ్ సిగరెట్ డబ్బా తెరిచి అందించారు. ‘ఇదేమిటి?’ అంటూ ఓ.సిగానేగా. ఓసీ అయితే ఓకే. ఏమైనా కొట్టేస్తాము’ అంటూ ఆ ‘్ఫ్యగ్’ అందుకున్నాడు. ఆ హీరో ‘ఓసి’ అంటే ‘ఉల్ఫా’గా ‘అప్పణంగా’ ఏదైనా వస్తే అని అర్థంట!
అదొక జార్గాన్.
రాధాకృష్ణగారు తన మాటని చివరి దాకా నిలబెట్టుకున్నాడు. నేను కథకి గానీ, నవలకి గానీ పైసా పారితోషికం తీసుకోలేదు. కాకపోతే నేను ఏమి రాసినా, అది పత్రికలో వెయ్యడానికి ‘బ్లాంకెట్ ఎండార్సుమెంట్’ ఉండేది. ఇది రాస్తున్నాను అని సందర్భవశాత్తు చెప్పడమే గానీ, చూపించలేదు. చూపెట్టినా కంపోజు అయినాక చూస్తాను లెండి అని దాటవేసేవాడు ఆయన. ఆయనకు నాకు అఫీషియల్ దైనందిన ప్రచురణల విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం ఇద్దరం - ఒకటికి రెండుసార్లు చదువుకునేవారం.
అచ్చు అయినాకా - ఏదైనా పితూరీలు చాడీలు వస్తే తప్ప అడిగేవాడే కాదు. నా రష్యా పర్యటన తరువాత ‘రష్యా యాత్రానందం’ సీరియల్ రాస్తున్నాను డైలీలో ’82లో...
‘చాలా బాగుందిట’ నిన్న మాస్కో మీద ఏదో రాశారుటగా డైలీలో ‘అమ్మ’ చెప్పింది అన్నాడోసారి. ‘అమ్మ’గారంటే శ్రీమతి కామాక్షమ్మగారు. శంభుప్రసాద్ గారి అర్ధాంగి. ఆంధ్రపత్రిక యొక్క సంపూర్ణ అధికారిణి అని అనుకునేవాణ్ణి నేను. కామాక్షమ్మగారు నన్ను కాపాడుతూ వచ్చిన ‘అదృశ్య దేవత’ అన్నది నా నమ్మకం (శిరసా నమామి).
ఒక్కొక్కసారి రాధాకృష్ణగారు ‘మా సిస్టర్ చెప్పింది’ మీరు రాసేది చాలా బాగా, సరదాగా వుందిటగా..’ అంటూ కితాబు ఇచ్చేవాడు.
అంతలో 1962లో వర్కింగ్ జర్నలిస్టులు వేజ్‌బోర్డు వచ్చింది. అది నా దినపత్రికలో ఉద్యోగానికి ఓ కామా పెట్టింది. నా ఆశల మీద అనుకోకుండా చన్నీళ్లు జల్లింది. అదే జీవితం అనుకున్నది ఎప్పుడూ జరగదు.. అనుకోనిది అకస్మాత్తుగా జరుగుతుంది..!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com