నేను... కలికాలాన్ని..
Published Monday, 3 June 2019
కాలమిత్రమా! మిత్ర కాలమా!
ఏవీ నిరుటి ప్రత్యూష పవనాలు
ఏవీ ఆ బాలభానుడి తనూ విలాసాలు
ఏవీ అలనాటి ప్రాతర్వర్ణ సమ్మేళనాలు
బ్రాహ్మీముహూర్త ధ్యానమగ్నత ఏదీ
తొలికిరణ పారవశ్య ప్రవృత్తి ఏదీ
ఆలింగనామోదపు అరమోడ్పు ముద్రలేవీ
ప్రకృతికి సుప్రభాత సేవలేవీ?
మిత్రమా! ఈ సంకేతాల సంవేదన లేమిటి?
**
కాల మిత్రమా! కలి కాలమా!
మనసును కాదని వొళ్లు విరుచుకుంటున్నావా
పచ్చని కాదని పిలవనితనానికి వలసపోతున్నావా
జనారణ్య మేధోవిలసన సంకలన మవుతున్నావా
మానవనగర యంత్ర తంత్ర కృతి అవుతున్నావా?
మహానగరానికి కాసుల కాలుష్యం కురిపిస్తున్నావా
భవనాలయాలకు ఇంకుడు వరాలిస్తున్నావా
మిత్రమా! ఈ సంవేదనల సంకేతాలేమిటి?
***
మిత్ర కాలమా! కాల భైరవమా!
ఒకప్పుడు నువ్వు కదిలిన కాలానివి
ఇప్పుడు కనలిన కాలానివి
నాడు ప్రవహించిన కాలానివి
నేడు ప్రకోపించిన కాలానివి
నీ గుండె లయ తప్పిందేమిటి మిత్రమా!
నీ లెక్క తప్పుతున్న దేమిటి మిత్ర కాలమా!
****
మిత్ర భైరవమా! కాల మిత్రమా!
ఈ ఉరుము లేమిటి మెరుపులేమిటి
నేల తడవని వానగా
మేఘం వొట్టిపోవట మేమిటి
పంట పొలాల పాతాళ గంగలేమిటి
గిరుల మధ్య ఆనకట్ట లేమిటి
నదుల సంయోగాలేమిటి
సాగర సంగమాలేమిటి
సంగమించని మనిషితనంపై
తిరగబడుతున్నావా మిత్రమా
ప్రకోపిస్తున్న తెలివిని ఔపోసన పట్టలేక
ప్రళయానికి అవతారిక అవుతున్నావా
భవబంధాలకు అగోచర మవుతున్నావా
నా కనె్నర్రకు కలికాల మవుతున్నావా?
**
అయినా, నేను నేనేలే
నువ్వు నువ్వేలే
అన్నట్టు, నీకు తెలుసా
నేను నీకు
కాల చక్రాన్ని! కాల తర్కాన్ని!
కాల తంత్రాన్ని! కాల జ్ఞానాన్ని!
అవును, నేను
కాల విస్ఫోటనాన్ని, కాల మథనాన్ని.
*