S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-14

‘నిజంగా యూవార్ గ్రేట్ ప్రభూ’ అంటూ అతన్ని చుట్టేసి అభినందనలతో ముంచేశాడు.
ప్రభు హాయిగా నవ్వేశాడు.
‘అభినందనలు చెప్పాల్సింది నాక్కాదు చంద్రా’ అన్నాడు మెరుస్తున్న కళ్లతో.
‘మరి? ఆ నర్స్‌కా?’
‘ఊహుఁ మన గౌతమికి!’
‘గౌతమికా?’
‘ఎస్! ఆనాడు ‘క్లూ’గా అవతరించి, తర్వాత గౌతమిలా దర్శనం ఇచ్చి, ఇప్పుడు పరువు ప్రతిష్ఠల కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, సాహసవంతులైన మగాళ్లు సైతం అడుగుపెట్టడానికి జంకే సింగపడవిలోకి దూసుకుపోయిన గౌతమి! ఆమెని మనం అభినందించాల్సింది’ ఒకలాంటి గర్వంగా అన్నాడు ప్రభు.
‘అంటే గౌతమి క్షేమంగా ఉందని తెలిసిందా...’ ఆతృతగా అన్నాడు చంద్ర.
‘లేదు. కానీ ఆమె క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం నాకుంది. అసలీ ప్లాన్సన్నీ ఆమెవే. ఇన్ని పథకాలు, ఇంత తెలివిగా వేసిన గౌతమి, ఆ అడవిలోనించి బైట పడటం పెద్ద కష్టమేం కాదు. ఆమె వస్తే అభినందించడమే కాదు తనకి ఘనసన్మానం చేయించాలి’ చిన్నపిల్లాడిలా అన్నాడు ప్రభు.
‘చేద్దాం! ఘన సన్మానమే కాదు. ఆమెకి చెయ్యాల్సినవి చాలా వున్నాయి. ఆమె మనకి చేసిన సహాయాలన్నీ ఒకెత్తు. పోలీసు బలగాలు కూడా చూడని అడవిని, బ్లాక్‌టైగర్ని చూసి క్షేమంగా తిరిగొచ్చిన ఆమెకెన్ని సన్మానాలు చేసినా అవి తక్కువే అవుతాయి’ అన్నాడు చంద్ర ప్రభు భుజం మీద ఆప్యాయంగా చెయ్యేసి.
‘ఇంక నేను వెళ్లి రానా’ లేస్తూ అన్నాడు ప్రభు.
‘నత్తింగ్ డూయింగ్! ఇంతసేపుండి, భోం చేయకుండా వెళ్తావా? తీరిగ్గా కూర్చుని భోంచేసి ఎన్నాళ్లయిందో అనిపిస్తోంది పద’ అంటూ లేచాడు చంద్ర.
ఇద్దరూ కలిసి తలుపు తీసుకుని బైటికొచ్చేసరికి ఓ పక్కగా వున్న వంటవాళ్లు, చంద్ర అనుమతితో భోజనాలు టేబిల్ మీద సిద్ధం చేశారు. చాలా రోజుల తర్వాత మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా తిన్నారు.
* * *
దొరే బ్లాక్‌టైగర్ అని తెలిశాక గౌతమిలో ఉత్సాహం పెరిగిపోయింది. అంతేకాదు. వాళ్లిచ్చిన జావ ఆమెకి నచ్చలేదని గూడెపు ఆడవాళ్లు ఆమెకి రకరకాల అడవి పళ్లు, తేనె, పాలు లాంటివి ఇచ్చారు. చిన్ని అడవిలోని కొన్ని ప్రదేశాలు చూపించింది.
నగరంలోకన్నా వాళ్లకి మంచి ఆహారం ఉందని గ్రహించిన గౌతమి ఆశ్చర్యపోయింది.
చాలాచోట్ల చదును చేసి మొక్కజొన్నలు, రాగులు లాంటివి చాలా పండిస్తున్నారు. ఆవులు, మేకలు మందలు మందలుగా బలంగా ఉన్నాయి. అయితే క్రూరమృగాలు తిరిగే ఆ అడవిలో సాధువు జంతువులు అంత స్వేచ్ఛగా ఎలా ఉన్నాయో ఆమెకర్థం కాలేదు. అదే చిన్నితో అంటే-
‘పొద్దుపోయాక అన్నింటినీ కంచె దొడ్లలోకి తోలేస్తాం. అదీగాక మా బాబా గొంతు వింటే సింహాలు సైతం పిల్లుల్లా అయిపోతాయి’ అంటూ నవ్వేసిందామె.
‘ఇంత చక్కని సంపద వుండగా ఇంకా స్మగ్లింగ్ లాంటివెందుకు చేస్తున్నారు?’ అంది గౌతమి.
‘స్మగ్లింగా?’
‘అదే. పులులు వాటిని చంపి, వాటి చర్మాలని విదేశాలకమ్మడం, ఏనుగుల్ని చంపి దంతాలు అమ్మడం లాంటివి’
‘ఏవిటి.. పులుల్ని, ఏనుగుల్ని చంపడమా?’ కస్సుమంది చిన్ని. ఆమె కోపం చూసి హడలిపోయింది గౌతమి.
‘అదే.. మా నగరాల్లోని కొన్ని అడవుల్లో చాలామంది చేస్తారు. వీరప్పన్ అని ఒకడున్నాడు. అతనికదే వృత్తి’ అంటూ ఆమెకర్థమయ్యేలా చెప్పింది.
‘వాడెవడో మాకు తెలీదు. కానీ మేమంతా మాతో పాటే వాటినీ చూసుకుంటాం. చిరతలకి, సింహాలకి ఏమైనా గాయాలైతే తనకే గాయం అయినంతగా బాధపడి పసర్లు వేసి కట్లు కడతాం. అందుకే అవి మా జోలికి రావు. పెంపుడు జంతువుల్లా తిరుగుతాయి’ గర్వంగా అంది చిన్ని.
‘నిజంగా మీరు చాలా మంచి వాళ్లు’ మనస్ఫూర్తిగా అంది గౌతమి.
‘ఇంతకీ మా బాబాతో నీకేం పని?’ అంది చిన్ని కుతూహలంగా.
‘అది రహస్యం. దొరకి చెప్పాక మీకే తెలుస్తుంది’ నవ్వింది గౌతమి. మరి మాట్లాడలేదు చిన్ని.
అయితే గౌతమికి దొరతో మాట్లాడే అవకాశం రాలేదు. కారణం మరో అడవిలో వుండే బంధువుకి సుస్తీ ఉందని కబురొస్తే రెండు రోజుల్లో వచ్చేస్తాననీ, గౌతమిని జాగ్రత్తగా చూసుకోమనీ చెప్పి వెళ్లిపోయాడు.
నీరసం వచ్చేసింది గౌతమికి.
‘కంగారుపడకు. దొర ఎక్కడా ఎక్కువ రోజులుండడు’ అన్నాడు సిద్దు నవ్వుతూ.
ఆ రాత్రి చిన్ని దగ్గరే పడుకుంది గౌతమి.
పూర్తిగా తెల్లవారకుండానే జోగి పరిగెత్తుకొచ్చి-
‘టైగరొచ్చేశాడు’ అని చెప్పి పరుగెత్తాడు.
దొర వచ్చేశాడా?’ ఉత్సాహంగా అంది గౌతమి.
‘బాబా కాదు. మా బావ’ నవ్వింది చిన్ని.
‘బావా?’
‘అవును. మా బావ చాలా మంచివాడు’ మెరుస్తున్న కళ్లతో అంది చిన్ని. అతని మాట వినగానే ఆమెలో వచ్చిన మార్పు గమనించింది గౌతమి.
‘మీ బావకి పెళ్లైందా?’ అంది.
ఆ మాటకి చిన్ని మొహంలో మార్పొచ్చేసింది.
‘ఏం? కాకపోతే నువ్వు చేసుకుంటావా?’ అంది తీక్షణంగా. ఆ ప్రశ్నకి క్షణం బిత్తరపోయింది గౌతమి.
‘్ఛ! నేనెందుకు చేసుకుంటాను. నీలాంటి చక్కని మరదలుంటే’ అంది ఆమె చెయ్యి సున్నితంగా నొక్కుతూ.
చిన్ని మొహంలోకి కాంతి వచ్చేసింది.
‘ఏం అనుకోకు. మా బావంటే నాకు చాలా ఇష్టం. అందమైన ఏ ఆడపిల్లయినా తన గురించి మాట్లాడితే నాకు పిచ్చెక్కినట్లుంటుంది’ అంది అమాయకంగా.
‘అలా అయితే పెళ్లి చేసుకోవచ్చుగా?’ అంది గౌతమి సన్నగా నవ్వుతూ. చిన్ని మొహంలో నీలినీడలు ఆక్రమించాయి.
‘చెప్పు చిన్నీ! మీ ఇళ్లలో చాలా చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తారని విన్నాను. మరి మీరింత దాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’ అంది గౌతమి మృదువుగా. చిన్ని అవివాహిత అని ఆమె ఎప్పుడో గ్రహించింది. చిన్ని భారంగా నిట్టూర్చి-
‘నాకు మా బావంటే ఇష్టమే కానీ తనకి నేనంటే ఇష్టం లేదు’ అంది దిగులుగా.
‘అతనికి నువ్వంటే ఇష్టం లేదా?’ విస్మయంగా అంది గౌతమి.
‘అది కాదు. నేనంటే ఇష్టమే. కానీ నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు.’
‘ఏం?’
‘తెలియదు’
‘ఎవర్నయినా ప్రేమించాడేమో?’
‘అలాంటిదేం లేదు. మా నాన్న పెళ్లి మాట ఎత్తితే నాకు పెళ్లి మీద ధ్యాస లేదు’ అంటాడు. మా పెద్దమ్మ కూతురు నాకన్నా బావుంటుంది. అయినా దాన్నీ చేసుకోనంటే, మా పెద్దమ్మ దానికి పెళ్లిచేసి ఒరిస్సా అడవులకి పంపేసింది.
‘అతను కాదన్నప్పుడు నువ్వూ వేరే అతన్ని చేసుకోవచ్చుగా? నీకు తగిన వాళ్లు ఇక్కడెవరూ లేరా?’
‘్ఛ! వేరే వాళ్లని నేనెందుకు చేసుకుంటాను’ కంపరంగా అంది చిన్ని.
‘మరతను నిన్ను చేసుకోనన్నాడుగా?’
‘అంటే మాత్రం ఏం? ఏనాటికైనా తన మనసు మారుతుందని నా ఆశ. ఒకవేళ మారకపోయినా బాధలేదు. బావని కళ్లారా చూసుకుంటూ జీవితాంతం ఇలాగే గడిపేస్తాను. చివరికి బావ ఒళ్లో తల పెట్టుకుని చచ్చిపోతాను. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయినా ఒళ్లో కన్ను మూయడానికి ఒప్పుకోకపోడు’ తడికళ్లతోనే నవ్వింది చిన్ని. ఆమె ప్రేమారాధనలకి విస్తుపోయింది గౌతమి.
‘అన్నట్టు మీ బావ పేరేంటి?’ అంది ఏదో ఆలోచిస్తూ.
‘జింబో... అయ్యో కబుర్లలో పడి బావ దగ్గరికెళ్లాలన్న సంగతే మర్చిపోయాను’ అంటూ లేడిలా పరుగు తీసింది చిన్ని. గౌతమి అలా నిల్చుండిపోయింది.
* * *
బలాఢ్యుడైన ఓ యువకుడు తను తెచ్చిన సంచుల్లోంచి గాజులు, రిబ్బన్ల లాంటివి అందరికీ పంచుతున్నాడు. పిల్లా పెద్దా అని లేకుండా అతని చుట్టూ చేరి, అతనిచ్చినవి చూసి మురిసిపోతున్నారు. అతనటు నగరవాసిలా లేడు. ఇటు ఆటవికుల్లానూ లేడు. బలమైన ఓ పల్లెటూరి యువకుడిలా ఉన్నాడు. మంచి ఛాయతో ఒత్తయిన జుట్టు, మీసకట్టుతో ఆకర్షణీయంగా వున్నాడు. ఆడవాళ్లు పెద్దలు అతని యోగ క్షేమాలడుగుతున్నారు. జోగి మంచినీళ్లందించి నెమలీకల విసనకర్రతో విసురుతున్నాడు. ఆ యువకుడిచ్చిన గాజులు చూసి మురిసిపోతోంది చిన్ని.
‘అందరికీ అన్నీ తెచ్చావ్. మరి కొత్త అక్కకేం తెచ్చావ్?’ అందో అయిదేళ్ల పిల్ల.
‘కొత్త అక్కా?’ చిత్రంగా చూశాడతను.
‘పట్నం నించి ఓ పిల్ల దారితప్పి వచ్చిందిలే. అవునూ.. పట్నంలో గొడవలేం లేవుగా?’ అందో యువతి మాట మారుస్తూ. అతను ప్రతిదానికీ చిరాకు పడిపోతాడని ఆమెకి తెలుసు. అతను మాత్రం ఆమె మాటకి జవాబు చెప్పకుండానే.
‘ఎవరా పిల్ల?’ అన్నాడు గంభీరంగా.
‘గౌతమి. చాలా మంచిది. నాకు మంచి నేస్తం అయింది కూడా’ గర్వంగా అంది చన్ని.
అతని కళ్లు ఎర్రబారాయి. చేతుల్లో వున్న వస్తువులు కిందపడేసి.
‘ఎక్కడుందా పిల్ల?’ అన్నాడు విసురుగా.
హడలిపోయారంత. బైటివాళ్లు అడవిలో అడుగుపెట్టారంటేనే అతనికి ఆవేశం వచ్చేస్తుంది.
పెద్దలు అతన్నాపేశారు. పిల్లలు భయంగా చూస్తున్నారు.
‘ముందు కాస్త ఏదైనా తిందువుగాని రారా జింబో!’ అందో నడివయస్కురాలు. అతని కళ్లలోని ఆవేశాన్ని గమనించి-
‘తొందరపడకు జింబో! మీ మామతో ఏదో పనుండి వచ్చింది. ఈలోగా అతను చింతలతోపుకెళ్లాడు. తను రాగానే మాట్లాడి వెళ్లిపోతుంది’ అనునయంగా అన్నాడో వృద్ధుడు.
‘ఇందాక దారితప్పి వచ్చిందన్నారు?’ అన్నాడతను తీక్షణంగా.
గతుక్కుమన్నట్టు చూశారంతా.
‘అబ్బబ్బ! ఇంక ఆ పిల్ల సంగతి వదిలెయ్యి. దొరకి ఆమె బాగా తెలిసిన పిల్లేనట. తనొచ్చేదాకా భద్రంగా చూసుకోమని చెప్పి మరీ వెళ్లాడు’ అన్నాడొకతను.
‘మామకి తెలిసిన పిల్లా?’ పెద్దగా నవ్వాడు జింబో.
చిత్రంగా చూశారంతా.
‘మీరంతా ఎంత పిచ్చివాళ్లు తాతా! మావ పట్నాలకేసి వెళ్లడంగానీ, నగరవాసులు ఇటుకేసి రావడంగానీ జరిగిందా? అలాంటిది మావకి తెలిసిన పిల్లంటే మీరెలా నమ్మారు? ఆమె కచ్చితంగా పోలీసులు పంపిన మనిషే. అసలు తను అడవిలోకొస్తుంటే మనవాళ్లెలా రానిచ్చారు?’ అన్నాడతను చిరాగ్గా.
ఆమె రావడం, పులి బారి నుంచి రక్షించడం, దొరకీ ఆమెకీ మధ్యన జరిగిన సంభాషణ మొత్తం చెప్పారంతా కలిసి.
ఆలోచనలో పడ్డాడు జింబో.
అప్పడే గౌతమి వచ్చిందక్కడికి. క్షణం ఆమె అందానికీ ఆకర్షణకీ నిర్ఘాంతపోయినట్టు చూస్తూండిపోయాడు జింబో.
‘హాయ్ జింబో! ఎలా వున్నావు?’ అందామె అతని దగ్గరగా వచ్చి. హాయిగా నవ్వుతూ. ఆమె గొంతు, నవ్వు చూసి మరింత నిర్ఘాంతపోయాడతను.
‘ఏవిటి. గుర్తు పట్టలేదు కదూ? నేనూ నిన్ను గుర్తుపట్టలేదు. అప్పుడు మరీ చిన్నదాన్ని కదా!’ మళ్లీ నవ్విందామె.
‘ఎవరు నువ్వు?’ తేరుకున్న జింబో గంభీరంగా అన్నాడు.
‘అబ్బబ్బ! ఈ ప్రశ్న ఇప్పటికి వందసార్లు వేశారు. ఓపిగ్గా చెప్పాను. ఇంక నావల్లకాదు. దొర వచ్చాక అతనే్న అడిగి తెలుసుకో’ అంటూ వెళ్లిపోయింది గౌతమి.
అయోమయంగా కూలబడిపోయాడు జింబో.
ఆడవాళ్లు నవ్వుకుంటూ అతను తినడానికేవో తెచ్చిపెట్టారు.
* * *
సాయంత్రం పేషెంట్స్‌ని అన్యమనస్కంగా చూశాడు అనిల్. అతని నిర్లక్ష్యం వల్ల పేషెంట్స్ సంఖ్య కూడా తగ్గింది. అతని ధ్యాసంతా గౌతమి మీదే ఉంది. ఎలాగైనా గౌతమిని క్షేమంగా తన దగ్గరికి చేర్చాలని వెయ్యి దేవుళ్లకి మొక్కుకుంటున్నాడు. అతని బాధ గమనించిన లూసీ చాలావరకు పేషెంట్స్‌ని తనే చూసుకుంటోంది. దాని మూలంగానో ఏమో ఆమె మీద కాస్త అభిమానం పెరిగింది.
‘సార్! ట్వంటీ ఫోర్ నెంబర్ బెడ్ పేషెంట్‌కి సెలైన్ పెట్టాను. ఇప్పుడు బానే ఉన్నాడు’ అంటూ వచ్చింది లూసీ.
‘్థంక్స్ లూసీ’ అప్రయత్నంగా అన్నాడతను.
‘సర్! మీతో కాస్త మాట్లాడాలి’ మెల్లగా అందామె.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
‘ప్లీజ్! మీరోసారి మీ రూమ్‌లోకొస్తే ఓ ముఖ్య విషయం చెప్తాను’ అందామె.
‘పద’ అంటూ అటుకేసి నడిచాడు అనిల్. ఒకప్పుడైతే ఆమెని కొట్టినంత పని చేసేవాడు. కానీ ఇప్పుడతను వైద్యపరంగా ఆమె మీదే ఆధారపడుతున్నాడు మరి.
రూమ్‌లోకెళ్లాక-
‘చెప్పు? ఏమిటి’ అన్నాడు ఆతృతగా.
‘మన హాస్పిటల్ మీద ఎవరి కన్నో పడింది సార్’
‘ఏవిటి?’ అర్థం కానట్టు చూశాడతను.
‘అవును సర్! నల్లగా, దృఢంగా ఉన్న ఓ వ్యక్తి హాస్పిటల్ పరిసరాల్లో తిరుగుతున్నాడు. ఈ విషయం వాచ్‌మన్‌కి, రామయ్యకీ కూడా చెప్పాను. వాళ్లు వెళ్లేసరికి మాయమవుతున్నాడు.’
‘మన హాస్పిటల్ దగ్గరా? ఎవరై ఉంటారు’ కింది పెదవి పళ్ల కింద నొక్కుతూ అన్నాడు అనిల్.
‘ఎవడో దొంగ అయుంటాడు’
‘దొంగలకి మన హాస్పిటల్‌లో ఏం ఉంటుంది?’ నవ్వాడు అనిల్.
‘వాళ్లకేం కావాలో? ఏం ఉందని ఆశించారో? ఎందుకైనా మంచిది. వాచ్‌మన్‌నీ వాళ్లనీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నా మాట అంత పట్టించుకోరు’ వేడికోలుగా అంది లూసీ.
‘అలాగే.. ఇక్కడుండడానికి నీకు భయంగా ఉందా?’ అన్నాడతను.
‘నాకు భయం ఏవిటి సర్? తిండిలేని సమయంలో మేడమ్ నన్నిక్కడ పెట్టారు. పెద్ద మనసుతో మీరు నాకు అన్ని సదుపాయాలూ చేశారు. మీ కోసం నా ప్రాణాలు పోయినా బాధలేదు. మీరు, మేడమ్ ఈ హాస్పిటల్‌ల్లో కళకళలాడుతూ తిరిగితే నాకంతే చాలు’ అంది లూసీ గద్గద స్వరంతో.
‘్థంక్యూ! థాంక్యూ వెరీమచ్ లూసీ’ అంటూ బైటకొచ్చేశాడు అనిల్. తర్వాత నైట్‌డ్యూటీ వార్డ్ బాయ్‌కీ, వాచ్‌మన్‌కీ అతని పనులు చేసే రామయ్యకి వంద జాగ్రత్తలు, హెచ్చరికలూ చేసి వెళ్లిపోయాడు అనిల్.
అతను వెళ్లిపోయాక స్నానం చేసి, భోంచేసి ఓసారి పేషెంట్స్‌ని చూసి రామయ్యా వాళ్లని హెచ్చరించి తన గదిలోకెళ్లిపోయింది లూసీ.
ఆమె మీద చిరాకు పెరిగిపోతోంది రామయ్యికీ, వాచ్‌మన్‌కీ. వాళ్ల దృష్టిలో ఆమె తిరుగుబోతే కాదు. అనిల్‌ని కూడా పడేసిన మోసగత్తె. అనిల్ ఆమెకంత విలువ ఇవ్వడం వాళ్లకసలు నచ్చలేదు. అందుకే ఎలాగైనా ఆమె నిజ స్వరూపాన్ని మరింత పెద్దది చేసి యజమాని ఆమెని పంపేసేలా చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నారు.
పదకొండు గంటలయ్యేసరికి హాస్పిటల్ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా అయిపోయాయి.
ఇటీవల అనిల్ హాస్పిటల్ గురించి పెద్దగా పట్టించుకోక పోవడం వాళ్లకి ప్లస్ పాయింటై పోయింది.
అయితే అనిల్ వెళ్తూ ఇచ్చిన వార్నింగ్ వాళ్లకి నీరసాన్ని తెప్పించింది. మరో అరగంట తర్వాత వార్డ్‌బోయ్ పిల్లిలా వచ్చి లూసీ గదిలోకి తొంగి చూసి, ఆమె గాఢనిద్రలో వుండడంతో రామయ్యా వాళ్ల దగ్గరికొచ్చాడు. నిద్రపట్టని రామయ్య-
‘ఏంటిలా వచ్చావ్?’ అన్నాడు.
‘నీకు తెలియందేం ఉంది మావా? జీతాలు నినే్నగా ఇచ్చారు. చుక్కపడక నాలుక పీకేస్తోంది. రా అలా వెళ్లొద్దాం’ అన్నాడు వార్డ్‌బాయ్ గుసగుసగా.
రామయ్యకి ప్రాణం లేచొచ్చినట్టయింది. అయినా ధైర్యంలేక-
‘నువ్వెళ్లు నేను రాను’ అనేవాడు. ఈ అలికిడికి వాచ్‌మన్ వచ్చేశాడు. విషయం అర్థమయింది. అతనికీ మందు అలవాటు బానే ఉంది. కానీ ఈ మధ్య కుదరడం లేదు. రామయ్యా వాళ్లు అడగడంతో-
‘కానీ ఎవడో దొంగోడు వస్తున్నాడని, జాగ్రత్తగా ఉండమని సార్ చెప్పాడుగా’ అన్నాడు నసుగుతూ.
‘దొంగాడా పాడా? మనం అజాగ్రత్తగా ఉంటామని ఆలూసమ్మే సార్‌కి ఎక్కేసుంటుంది. అయినా అంత దొంగలు పడి దోచుకుపోవడానికి మన హాస్పిటల్‌లో ఏం ఉన్నాయి బల్లలూ కుర్చీలూ తప్ప’ అంటూ పెద్దగా నవ్వాడు వార్డ్‌బాయ్.
‘అంతేనంటావా?’
‘కచ్చితంగా అంతే! పదండి’ అన్నాడు వార్డ్‌బాయ్.
ముగ్గురూ ఉత్సాహంగా బైటికెళ్లి పీకలదాకా తాగి తూలుకుంటూ వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్లు గొడ్లలా పడి నిద్రలోకి జారిపోయారు.
ఒంటిగంట దాటింది.
అంతవరకూ ఎవరూ చూడకుండా ఓ చెట్టు చాటున నిల్చున్న ఇద్దరు వ్యక్తులు చకచక హాస్పిటల్ గేటు దగ్గరకొచ్చారు.
గేటు తాళాలు వేసుండడంతో ఓసారి మొహాలు చూసుకున్నారు. తర్వాత ఆలోచించి పిట్ట గోడ మీదుగా లోపలికి దూకారు. ఇద్దరి మొహాలకీ ముసుగులున్నాయి. అదృష్టవశాత్తూ వాళ్లనెవరూ గమనించలేదని ఉత్సాహంగా బిల్డింగ్ కేసి నడిచారు. బాగా ఎరుగున్న స్థలంలా కారిడార్‌లోంచి చకచక నడుస్తూ ఓ చోట ఆగారు.
ఎందుకో త్రుళ్లిపడి కళ్లు తెరిచిన రామయ్య వాళ్లని చూసి కెవ్వున అరిచాడు. మరో అరుపు రాకుండా, ముసుగు వ్యక్తుల చేతుల్లోని కత్తులు ఆ అరుపుని ఆపేశాయి.
‘ఏం కావాలి మీకు?’ వణికిపోతూ అన్నాడు రామయ్య.
‘కేష్ ఎక్కడుంది?’ అడిగాడొకతను కర్కశంగా.
‘కేష్ ఇక్కడుండదు బాబూ!’ భయంభయంగా అన్నాడతను.
‘అబద్ధం. మీ డాక్టర్ రూమ్ బీరువాలో లక్షలు మూలుగుతున్నాయి. చెప్పు. ఆ గదెక్కడ?’ గద్దించాడు మరొకతను.
‘మీ హాస్పిటల్‌లో కొత్తగా ఓ నరసమ్మ చేరింది కదూ?’ అన్నాడొకతను.
‘అవును...’
‘ఆవిడ దగ్గర నగలేమైనా ఉన్నాయా?’
‘పెద్దగా ఏం లేవు’
‘పోనే్ల! చిన్న నగలైనా ఉన్నాయిగా’ అంటూ కదిలాదిద్దరూ.
రామయ్య లేవబోయాడు. అయితే వాళ్లు కొట్టిన దెబ్బలకు కుప్పకూలిపోయాడు. తర్వాత వాళ్లిద్దరూ చకచకా నడుస్తూ లూసీ గది దగ్గర ఆగారు.
‘ఈ గదేగా?’ అన్నాడొకతను.
‘అవును’ అన్నట్టు తలూపాడు రెండోవాడు.
ఇద్దరూ లూసీ గదిలోకెళ్లి తలుపులు మూశారు. గంట తర్వాత ఎలా వచ్చారో అలాగే గోడదూకి మాయమైపోయారు.
అప్పుడు కూడా లేవలేదెవరూ.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్