S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-13

‘నువ్వు.. నువ్వు.. అమ్మవారి ఆలయంలోని పూజారి శంకరయ్యోరి కూతురు చిన్నారి గౌతమివా?’ అన్నాడు విస్మయంగా. గౌతమి కళ్లు తళుక్కుమన్నాయి. ఒక్కసారిగా అతని కాళ్లకి చుట్టుకుపోయి బావురుమంది. రాయిలా కఠినంగా ఉండే దొర ఆమెని పొదివి పట్టుకుని-
‘ముందు కాస్త ఏదైనా తిను. తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాడు.
* * *
విజయ నాయక్ తన బృందంతో కలిసి సింగపడవి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ గాలించాడు. గౌతమి ఫొటో చూపించి మరీ వివరాలడిగాడు. ఆ గ్రామాల్లో అతనికి తెలిసిన వాళ్లు, అభిమానించే వాళ్లు చాలామందే ఉన్నారు. వారి సహాయంతో గాలించినా ఆమె ఉనికి ఎవరూ చెప్పలేక పోయారు. అతని ప్రయత్నం ఫలించి గౌతమి క్షేమంగా ఇల్లు చేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు చంద్ర, ప్రభూ కూడా. తరచూ అనిల్ కూడా నాయక్‌ని కలిసి నిరాశగా వెళ్లిపోతున్నాడు. క్రమేపీ గౌతమి అడవిలోని బ్లాక్ టైగర్ బందీగా ఉండి ఉంటుందన్న అనుమానం బలపడింది. నాయక్ అయోమయంలో పడిపోయాడు. శంకరయ్య గొడవ ఎక్కువవడంతో మళ్లీ నాయక్‌ని పిలిపించాడు చంద్ర. ప్రభు గౌతమిని విపరీతంగా ప్రేమిస్తున్నాడని ఎప్పుడో గ్రహించాడు నాయక్. గౌతమి బ్లాక్ టైగర్ దగ్గర చిక్కుకుపోయిందన్న అనుమానం వెల్లడిస్తే అతనెంత షాక్ తింటాడో అన్న భయంతో అతను ప్రభుని కలవడంలేదు. సి.ఎం. పిలిస్తే తప్పనిసరిగా వెళ్లాడు. అతను భయపడినట్టు అక్కడ ప్రభు లేడు.
చంద్ర రూమ్‌లోనే కూర్చుని, జరిగింది, తన అనుమానాలనీ వివరంగా చెప్పాడు. చంద్ర మొహం నల్లబడింది.
‘ఏమైనా ఆమె తొందరపడి సింహపు గుహలోకి ప్రవేశించింది సార్’ అన్నాడు నాయక్ బాధగా.
‘లేదు మిస్టర్ నాయక్! ఈ దోపిడీ వెనుక ఏదో పెద్ద నెట్‌వర్క్ జరుగుతోందనిపిస్తోంది. చంద్రయ్య మీద దాడి చేసి చంపాలనుకున్నాడు. ప్రమాదం ఊహించిన ప్రభు, డాక్టర్లు, మిస్టర్ ప్రయాగ అతను బతికినా మతి చలించిందని ప్రచారం చేశారు. అతనూ పిచ్చివాడిలా నటిస్తూనే తనని కాల్చిన వారి కోసం అనే్వషిస్తూ నిన్న ఓ చోట అతన్ని గుర్తించి, ప్రభుకి ఫోన్ చేశాడు. తీరా ప్రభు వెళ్లేసరికి, ఆ దుర్మార్గుడు జారుకున్నాడు. ఆ చంద్రయ్య మీద మళ్లీ ఏ అఘాయిత్యం చేస్తారో అని అతన్ని బైటికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభు, ప్రయాగలు.
‘డాక్టర్ గౌతమి అడవికి వెళ్లడమో, లేక కిడ్నాప్ చెయ్యబడటమో, అది కూడా ఈ నెట్‌వర్క్‌లో ఓ భాగం అనిపిస్తోంది. ఇదంతా ఆ బ్లాక్‌టైగరే చేయిస్తున్నాడన్న కథలూ పెరిగిపోతున్నాయి. ఏదైతే అదౌతుందని అడవి మీదే దాడి చెయ్యాలనిపిస్తోంది’ అన్నాడు చంద్ర కాస్త ఆవేశంగా.
‘అంత అవసరం లేదు సార్. త్వరలోనే నగలతో సహా దొంగలు దొరుకుతారు’ నమ్మకంగా అన్నాడు నాయక్.
‘అఫ్‌కోర్స్! కానీ ఆ గౌతమికి ఏం అపకారం జరుగుతుందో అని మా ప్రభు గిలగిల్లాడిపోతున్నాడు. ఆమెకేం కాదనీ, ఆమె క్షేమంగానే ఉంటుందనీ కాస్త నచ్చజెప్పండి’ అన్నాడు చంద్ర భారంగా.
‘తప్పకుండా సార్! అసలావిడ బ్లాక్‌టైగర్ దగ్గరున్నా క్షేమంగానే ఉండి ఉంటుంది’
‘ఒద్దొద్దు! అసలా బ్లాక్ టైగర్ని గురించే ఎత్తొద్దు. అసలు ఆమె అడవిలోకి వెళ్లుండదనే చెప్పండి. ప్రభు పిచ్చాడు. మరింత కంగారు పడతాడు’ అన్నాడు చంద్ర తనూ కంగారు పడుతూనే.
‘అలాగే సర్! ఆయన్ని ఉదయం కలుస్తాను’ అని మరో గంట ఏవో రహస్య చర్చలు జరిపి వెళ్లిపోయాడు నాయక్.
మర్నాడు ఉదయం నాలుగ్గంటలకే లేచి, అరగంటలో ప్రభు ఇంటికొచ్చేశాడు. ప్రభు తెల్లవారుజామునే లేచి, ముఖ్యమైన పనులు చూసుకుంటాడని అతనికి తెలుసు. అదీగాక రాత్రి ఫోన్ చేస్తే వచ్చెయ్యమన్నాడు ప్రభు ఉత్సాహంగా.
అయితే అతనెళ్లేసరికి ప్రభు మేడ దిగి రాలేదు. నాయక్ చనువుగా అతని బెడ్‌రూమ్ దగ్గరికెళ్లాడు. ఇంకా నిద్రలేవలేదా? అనుకుంటూ.
అయితే లోపల్నించి ప్రభు మాటలు వినిపిస్తున్నాయి. నౌకర్లు వినయంగా విష్ చేసి-
‘కూర్చోండి సార్’ అన్నాడు అతి వినయంగా.
అతను వెనక్కి తిరుగుతూ ఠక్కున ఆగిపోయాడు. అతని కళ్లు క్షణం తళుక్కుమన్నాయి.
‘ప్లీజ్ గౌతమీ! నా మాట నమ్మండి. అయ్ లవ్ యూ సోమచ్’ ఉద్వేగంగా అంటున్నాడు ప్రభు.
ప్రభు గౌతమితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని గ్రహించిన నాయక్‌కి ఎక్కళ్లేని ఉత్సాహం వచ్చేసింది. తలుపు తడదామని కూడా అనిపించింది. అయితే అతనిలోని సంస్కారం ఆపేసింది. నౌకర్లు ఎంత మర్యాదగా ఆహ్వానించి అక్కడికి తీసుకొచ్చినా ప్రభు బెడ్‌రూమ్‌లో వుండగా తను మేడ మీదికి రావడం కూడా సభ్యత కాదనిపించింది. కిందికొచ్చేస్తుంటే-
‘తమరు కూర్చొండయ్యా! మీరొస్తే పిలవమని మా సారు చెప్పారు’ అంటూ అతన్ని కూర్చోబెట్టి తలుపు తట్టి లోపలికి వెళ్లాడు నౌకరు. రెండు నిమిషాల తర్వాత బైటికొచ్చి-
‘సారొస్తున్నారు. తమరు కూర్చొండి. ఇప్పుడే వస్తాను’ అంటూ కిందికి పరిగెత్తాడు.
మరో రెండు నిమిషాలకి నైట్‌డ్రెస్‌తో బైటికొచ్చాడు ప్రభు సారీ చెప్తూ.
‘నేనే సారీ చెప్పాలి. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసినందుకు’ కరచాలనం చేసి నవ్వుతూ అన్నాడు నాయక్.
‘నో! నో! అలాంటిదేం లేదు. రాత్రి లేట్‌గా పడుకోవడం వల్ల మెలకువ రాలేదు. మిమ్మల్ని రమ్మని చెప్పి నేనలా పడి నిద్రపోవడం ఛ! నాకే సిగ్గుగా ఉంది’ అన్నాడు ప్రభు. నాయక్ ఏదో అంటుండగా నౌకరు కాఫీ సరంజామాతో రావడంతోఆపేశాడు. మరోసారి సారీ చెప్పి-
‘తీసుకొండి’ అంటూ స్వయంగా కాఫీ కప్పు అతని కందించాడు ప్రభు.
తర్వాత నౌకరు ఖాళీ కప్పులు తీసుకుని వెళ్లిపోయాడు.
‘అసలు నేనంత గొడ్డులా పడి నిద్రపోవడం చాలా అరుదు...’ ఏదో చెప్పబోతుంటే, సన్నగా నవ్వేసి-
‘డాక్టర్ గౌతమి ఏమంటున్నారు?’ గొంతు తగ్గించి అల్లరిగా అన్నాడు నాయక్.
‘అది మీరు చెప్పాలి. తన గురించి ఏమైనా తెలిసిందా?’ అతృతగా అన్నాడు ప్రభు. వింతగా చూశాడు నాయక్.
‘అదేవిఁటి. మీరు గౌతమిగారితో ఫోన్‌లో ఏదో మాట్లాడారు?’ అన్నాడు ఓరగా చూస్తూ. కంగారు పడిపోయాడు ప్రభు.
‘మీరు ఆవిడతో మీ ‘లౌ’ గురించి చెప్పినట్టున్నారు.. ఏదో మాటలు వినిపించి ఆవిడగారి జాడేమైనా తెలిసిందేమో అని ఆశపడ్డాను’ అన్నాడు నాయక్ నవ్వుతూ.
చిత్రంగా ప్రభు సిగ్గుపడి పోయాడు. అతనికి కల రావడం, కల్లో గౌతమితో అతి చనువుగా మాట్లాడ్డం గుర్తుంది గానీ, పైకి కలవరించినట్టు అతనికి తెలియదు.
‘ఏదో కల’ అంటూ నవ్వేశాడు.
తర్వాత గౌతమిని గురించి మాట్లాడుకున్నారు.
‘కొన్ని గ్రామాలు చూశాం. ఇంకా కొన్ని వున్నాయి. అక్కడ వుంటే ఉండొచ్చు. మీరేం టెన్షన్ పడకండి’ అన్నాడు నాయక్.
‘నాకేం టెన్షన్ లేదు. మీరు రంగంలో దిగారుగా. ఒకవేళ తను తెగించి అడవిలోకెళ్లినా, ఎలాంటి ఆపదా లేకుండా బైట పడుతుందన్న నమ్మకం నాకుంది’ అన్నాడు ప్రభు నవ్వుతూ.
అతని ధైర్యానికి విస్తుపోయాడు నాయక్.
‘అది మీ గౌతమి గారి మీద నమ్మకమా లేక ఆ బ్లాక్‌టైగర్ మీది నమ్మకమా?’ అన్నాడు సరదాగా.
‘అది మీకు తెలుసు!’ నవ్వాడు ప్రభు.
తర్వాత రహస్యంగా ఏవో చర్చించుకున్నారు. ఇద్దరూ కలిసి ఏవో నిర్ణయాలు తీసుకున్నారు.
‘చూడండి మిస్టర్ నాయక్. సి.ఎం.గారు గౌతమిని గురించి ఎంతో వర్రీ అవుతున్నారు. అందుకే కొన్ని విషయాలు ఆయనకి చెప్పలేదు. మీరూ చెప్పకండి. అసలే ఆయనకి టెన్షనె్లక్కువ’ అన్నాడు ప్రభు.
‘్భలే ఫ్రెండ్స్! మీ గురించి ఆయనా ఇలాగే చెప్పారు’ అంటూ నవ్వాడు నాయక్. వాళ్ల ఫ్రెండ్షిప్ గురించి అతనికి తెలుసు. ప్రభు తృప్తిగా నవ్వేశాడు.
* * *
పూర్తిగా తెల్లవారకుండానే ఉత్సాహంగా చంద్ర ఇంటికెళ్లాడు ప్రభు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న చంద్ర కళ్లు అతన్ని చూడగానే తళుక్కుమన్నాయి. విష్ చేసి-
‘వదినా వాళ్లు లేరా?’ అన్నాడు ప్రభు మెల్లగా.
‘వాళ్లన్నయ్య గారింటికెళ్లిందిలే, నేనే నీకు ఫోన్ చేద్దామను కుంటుండగా నువ్వే వచ్చావ్’ అన్నాడు చంద్ర బలవంతంగా నవ్వుతూ.
‘ఏవిఁటి చంద్రా, ఏదో టెన్షన్‌గా కనిపిస్తున్నావ్’ ఆతృతగా అన్నాడు ప్రభు.
‘ఈ పదవిలో టెన్షన్స్ లేకుండా ఎలా వుంటాయి గానీ ఇది చూడు’ అంటూ పేపర్ అందించాడు చంద్ర.
‘ఏవిఁటిది?’ అంటూ కవర్లో నించి ఓ కాయితం తీసి చూశాడు ప్రభు. అది చంద్ర పేరిట వచ్చిన లెటర్. అందులో ఇలా ఉంది.
‘సి.ఎం. చంద్రా!
నీకిలాంటి లెటర్ రాయాల్సొస్తుందని నేను కల్లో కూడా వూహించలేదు. కానీ రాయక తప్పలేదు. నువ్వు చాలా తెలివి కలవాడివని, పరిపాలనా సమర్థుడవని నాకు తెలుసు. నీ తెలివితేటల్ని ప్రజల దగ్గర చూపించి ఇంకా మంచి పేరు తెచ్చుకో. కానీ బడబాగ్నికన్నా భయంకరమైన ఈ బ్లాక్ టైగర్ జోలికి రాకు. చాలా చిక్కుల్లో పడతావ్. ఇవన్నీ తెలిసే నువ్వు ఇన్నాళ్లూ నా జోలికి గానీ, నా అడవి జోలికి గానీ రాలేదని నాకు తెలుసు. కానీ ఈ మధ్య నీ పి.ఏ. తదితరుల మాటలు పట్టుకొని నన్ను అంతం చేద్దామని ప్రయత్నిస్తున్నావ్. సింగపడవి ఆలయంలోని నగల్ని దొంగిలించింది అక్షరాలా మేమే. నేనీ అడవికే రారాజుని. నిజానికి నేను వయసులో వుండగా, సామాన్య పౌరుడిగా అనేకసార్లు వచ్చాను. విలువైన నగల్ని చూశాను. అయినా వాటి జోలికి పోలేదు. కానీ, ఇటీవల, ఆ నగల మీద మనసై వాటిని స్వంతం చేసుకున్నాను.
మీ నగరంలో ఎన్ని దారుణాలు, దోపిడీలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. బాంబు పేలుళ్లు, హత్యలు, మానభంగాలు, బేంక్ లూటీలు, ఆలయాల్లోని పురాతన విగ్రహ చోరీలూ లెక్కలేనన్ని జరుగుతున్నాయి. వాటికి మీరేం చేస్తున్నారు? కమిటీలు వేసి, ఎంక్వయిరీలు చేసి, దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసుల్ని తారుమారు చేసి మూసేస్తున్నారు. ఇదీ అలాగే జరుగుతుందనుకున్నాను. కానీ జరగలేదు. నువ్వు పట్టుదల వాడివి కావడంవల్లో, నీ పి.ఏ. సలహా వల్లో, అదీగాక ప్రతిపక్షాల గోల భరించలేకో, ఈ కేసుని పట్టుకుని వేలాడుతున్నావు. అక్కడే మా వాళ్లు పూజారిని బెదిరించి నోరు మూయించారు. చంద్రయ్య మమ్మల్ని గుర్తించాడనిపించి వాణ్ని చంపాలని చూశాంగానీ వాడికి భూమీద నూకలుండి ప్రాణాలు దక్కి పిచ్చాడిలా మిగిలిపోయాడు. ఇన్ని జరిగినా మీ ప్రయత్నాలు మానలేదు. ఇది చాలదని అడవులంటేనూ, దొంగలంటేనూ భయపడని విజనాయక్ అన్న ఐ.జి.ని సంప్రదించి అతని సహాయం తీసుకుంటున్నారని తెలిసింది. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానకపోతే తగ్గ ముడుపు చెల్లించాల్సొస్తుంది. మాకూ పాపభీతి కాస్త వుంది. అందుకే అమ్మవారి మంగళసూత్రాలు తెచ్చినందుకు పశ్చాత్తాపపడి దాన్ని తిరిగి ఆలయంలో చేర్చడానికి వచ్చిన నా అనుచరుణ్ని మీ నగరవాసులు దారుణంగా కొట్టి చంపారు. ఇది క్షమించరాని నేరం. నేను ఏదైనా సహిస్తానేమో గానీ నా వాళ్ల మీద ఈగవాలినా వాళ్ల అంతు తేల్చందే వదలను. నేను వృద్ధుణ్నయినా నాలో శక్తి, పౌరుషం చావలేదు. కేవలం నీ గురించి, నిస్వార్థమైన నీ పరిపాలన గురించి విని దాన్ని కూడా నేను క్షమించాను.
ముఖ్యంగా చెప్పేదేమిటంటే ఇంక నువ్వా ఆలయ దోపిడీని గురించి పూర్తిగా మర్చిపో. కాదని నీ ప్రయత్నాలు కొనసాగించావా? నిన్ను, నీకు ప్రాణ స్నేహితుడైన నీ పి.ఏ.ని, కిడ్నాప్ చేసి, నరకయాతనలు పెట్టి మరీ చంపుతాం. నీకు నగలు ముఖ్యమో, ప్రాణాలు ముఖ్యమో బాగా ఆలోచించుకో. ఈ విషయాలేమైనా మీడియ వాళ్లకి చేరిందో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కబద్దార్! - ఇట్లు నీ శత్రువు - బ్లాక్‌టైగర్
అది చదవడం పూర్తి చేసిన ప్రభు పగలబడి నవ్వాడు. విస్మయంగా చూశాడు చంద్ర.
ప్రభు లెటర్ని, కవర్ని పరిశీలనగా చూస్తూ-
‘ఈ కవరెలా వచ్చింది?’ అన్నాడు.
‘ఎవరో కుర్రాడిచ్చాడని డ్రైవర్ తెచ్చాడు ఏం?’
‘ఆ కుర్రాణ్ని అతను గుర్తు పట్టగలడా?’
‘గుర్తుపడితే వెళ్లి ఆ బ్లాక్‌టైగర్ని పట్టిస్తాడా? దార్న పోతున్న కుర్రాడికి డబ్బిచ్చో, రిక్వెస్ట్ చేసో పంపుంటాడు. ఇప్పుడదంత అవసరమా’ కాస్త విసుగ్గా అన్నాడు చంద్ర.
‘అయితే ఇప్పుడేం చేద్దామంటావ్?’
‘ఇదంతా చూస్తుంటే అయోమయంగా ఉంది’ అన్నాడు చంద్ర తపనగా. మళ్లీ నవ్వాడు ప్రభు. అలాంటి లెటర్ చూశాక కూడా అతనికి నవ్వెలా వస్తోందో అర్థం కాలేదు చంద్రకి.
‘చంద్రా! మిన్ను విరిగి మీద పడినా చలించని నువ్వేనా ఆఫ్ట్రాల్ ఓ బెదిరింపు లెటర్ చూసి ఇంత టెన్షన్ పడిపోతున్నావ్? అసలు నువ్వు మా చంద్రవేనా?’ అన్నాడు ప్రభు.
‘ఇది మామూలు లెటర్ కాదు ప్రభూ! కర్కోటకుళ్లాంటి బ్లాక్‌టైగర్ రాసిన లెటర్!’ అన్నాడు చంద్ర భారంగా.
‘కాదు! ఇది టైగర్ రాసిన లెటర్ కాదు!’
‘వ్వాట్?’ త్రుళ్లిపడ్డాడు చంద్ర.
‘అవును చంద్రా! ఇది ఇక్కడి వాళ్లు, అంటే అమ్మవారి నగల్ని దొంగిలించిన అసలు దొంగలు రాసిన ఉత్తరం. ఈ విషయంలో మనం పట్టుదలగా వున్నామని గ్రహించి, ఆ బ్లాక్‌టైగర్ జోలికైతే వెళ్లమని ఈ ప్లాన్ వేశారు.’
‘అది కాదు ప్రభూ!’
‘చంద్రా! ఈ పేపరు, రాసిన పెన్ను ఖరీదైనవి. అడవి దాటిరాని టైగర్ దగ్గర ఇలాంటివి వుండవు. అదీగాక టైగర్‌కి చదువు రాదు’ అన్నాడు ప్రభు గొంతు తగ్గించి.
‘టైగర్‌కి చదువు రాదా?.. ఇంకెవరి చేతైనా రాయించాడేమో’
‘చంద్రా! నా మాట నమ్ము! ఈ లెటర్ ఫేక్. అబ్బబ్బ! నీకో మంచి వార్త చెప్పాలని ఉత్సాహంగా వస్తే ఈ దరిద్రపు లెటర్‌తో నా మూడంతా పాడు చేశావ్’ విసుక్కున్నాడు ప్రభు.
‘ఏవిఁటి గౌతమి కనిపించిందా?’ ఆతృతగా అన్నాడు చంద్ర.
గౌతమి పేరు వినగానే ప్రభు మొహం కాస్త కళ తప్పింది. అయినా బైటపడకుండా -
‘గౌతమి కచ్చితంగా తిరిగొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ నేను చెప్పబోయేది ఆలయం దోపిడీని గురించి!’ అన్నాడు గొంతు తగ్గించి. చంద్ర కళ్లు తళుక్కుమన్నాయి.
‘ఎవరు? ఆ బ్లాక్ టైగరేనా?’ అన్నాడు ఉత్సాహంగా.
‘అది తేలే సమయం వచ్చేసింది’
‘అదా.. అది మనం ఎప్పటికప్పుడు అనుకుంటున్నదేగా’ నిరాశగా అన్నాడు చంద్ర.
‘అది కాదు. ఈసారి నేరస్తులంతా మన చేతికి చిక్కబోతున్నారు’
‘నిజమా?’
‘నిజంగా నిజం! లూసీ ఫోన్ చేసింది’
‘లూసీ?’
‘అదే.. డాక్టర్ అనిల్ దగ్గర పనిచేసే నర్స్’
‘ఓ! ఆమా? ఆమె నీకెందుకు ఫోన్ చేసింది?’
‘నాకు రోజూ ఏదో ఓ టైమ్‌లో ఫోన్ చేస్తూనే ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడుకుంటాం’
‘తను చాలా అందంగా ఉంటుందట కదా?’ అతనికేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు ప్రభు.
‘అందం మాటటుంచు. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్’ మెచ్చుకోలుగా అన్నాడు ప్రభు.
చంద్ర కళ్లు వింతగా ముడుచుకున్నాయి.
‘కొంపతీసి నువ్వూ ఆమె వల్లో పడ్డావా? ఆమె మహా ఫాస్టట. ఆమె కోసం రోజుకో బాయ్‌ఫ్రెండ్ వస్తాట్ట. అంతేకాదు. ఆ గౌతమిని ప్రాణప్రదంగా ప్రేమించిన అనిల్‌నే పడేద్దామని చూసి ప్రయత్నిస్తోందని విన్నాను.’
‘అవును! అందరూ అలాగే అనుకుంటారు. అనుకోవాలి కూడా. సరే. ఆవిడ వల్ల చాలా విషయాలు బైటికొస్తున్నాయి. ఓసారి ఆవిణ్ని కలిశాక వివరాలు చెప్తాను’ అంటూ లేచాడు ప్రభు. అయోమయంగా చూస్తూండిపోయాడు చంద్ర.
ప్రభు తలుపు లాక్ చేసి మళ్లీ వచ్చి కూర్చున్నాడు.
లూసీని కలిసొచ్చాక వివరాలు చెప్తావ్ సరే. అదేదో శుభవార్త తెచ్చానన్నావ్‌గా. దాని గురించి చెప్పలేదేం’ అన్నాడు చంద్ర.
‘ఆ విషయాలు చెప్పాలనే డోర్ లాక్ చేశాను. ఆ రహస్యాలు మన మధ్యనే ఉండాలి’ చనువుగా టేబిల్ మీదున్న ఫ్లాస్క్ లోంచి కాఫీ కప్పుల్లో పోసి ఒకటి చంద్రకిస్తూ అన్నాడు ప్రభు.
‘రహస్యాలా?’ అన్నాడు చంద్ర అతనికి థాంక్స్ చెప్పి. ప్రభు అంత చనువు తీసుకున్నాడంటే, అతనెంతో ఉత్సాహంగా ఉన్నాడని అతనికి తెలుసు.
‘యా! రహస్యాలంటే రహస్యాలు కాదు. ఎవరూ ఊహించని రహస్యాలు..’ కాఫీ తాగుతూనే ఉత్సాహంగా అన్నాడు ప్రభు.
‘ఏవిఁటి ప్రభూ! తొందరగా చెప్పు. ఏవిఁటి నువ్వు తెలుసుకున్న ఆ గొప్ప రహస్యాలు?’ అసహనంగా అన్నాడు చంద్ర.
ఖాళీ కప్పులు పక్కన పెట్టేసి మెల్లగా అసలు విషయం చెప్పాడు ప్రభు. కెవ్వుమన్నంత పని చేశాడు చంద్ర.
‘నీకేమైనా మతి పోయిందా? వాట్ డిడ్ యు సే? ఎవరో ఏదో ఊహించి వాగితే అదే నిజమనుకుంటావా?’ అంటూ కస్సుమన్నాడు. అతన్ని శాంతపరిచి ఓ గంటసేపు కూర్చుని ఎన్నో ఆధారాలు చూపించాడు ప్రభు. చంద్ర నోటంట మాట రాలేదు. తర్వాత జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందు కదలాడాయి. అతని మొహంలోకీ ఉత్సాహం వచ్చేసింది.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్