నేను.. మనువు కథను!
Published Saturday, 18 May 2019
1-
శూన్యం కాని స్థితీ కాని
గగనం లేని గాలీ లేని
వెలుతురు చేరని చీకటీ చేరని
వాయులీన ఖగోళత
అణువుకు అనంతానికి అభేదత.
-2-
శక్తీ పదార్థతల సమ్మేళనంగా అణువు
అణువుతో సంయోగించిన కాలం, స్థితీ.
కాలం పెరుగుతూ, విశ్వమూ పెరుగుతూ
ప్రభవించిన వాయు మేఘ వలయం
గ్రహాలతో నక్షత్రాలతో
పరిపుష్టమైన గగనం
పదార్థ సాంద్రత ఉష్ణతీవ్రతలతో
గోళావిష్కరణ
సౌర కుటుంబ ప్రాభవంతో
గురుత్వాకర్షణ.
-3-
కాలం స్థితీ విడివడని ఏకత
ఆ ఏకత్వంతో ఖగోళతన జవజలం
ఆ జలధిన ఈదులాడుతూ ఒక జీవం
జీవనానికై కలయ తిరుగుతున్న ప్రాణం
జల జీవానికి ప్రాణభూతంలా భూగోళం
భూగోళానికి శ్రీకరంగా నేను.
-4-
ఆ సంగమ సాగరాన
ఘర్షిస్తూ సంఘర్షిస్తూ
పారాడుతూ పోరాడుతూ
సగం మానవతనంతో ఎగసిన మత్స్యం
మనువు రక్షణలో మత్స్యం
జలతత్వంతో ముడిపడ్డ మానవతత్వం
మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణగా
పరిణామానికి శ్రీకారంగా నేను
నీట జీవం ప్రాణం జీవనంగా నేను.
-5-
నేను
మనువును, తొలి మానవుడను
అణువు మూలంగా కణకణ సంయోగాన్ని
అవును, మానవ తత్వానికి తొలి ఆత్మను
మానవ తనానికి తొలి అణువును
మానవ రూపానికి తొలి కణాన్ని
సృష్టికి ఆకరంగా నేను.
-6-
ఇహం నుండి కణం పరం నుండి కాంతి
సృష్టికి ఉద్యుక్తమైన పరాప్రకృతి
కణ పరిణామానికి తొలి అంకంగా
ఇహానికి పయనమైన కాంతి.
అవును, కాంతి వేగంతో ప్రభవించిన కాలం
విస్తృతమవుతూ కాలం విస్తరిస్తూ నేను
కాలంతో కాంతితో
చైతన్యమవుతూ నేను
నీటి నుండి మట్టిని
చేదుకుంటూ నేను.
-7-
అవును, మట్టి కేంద్రంగా
అనంత జలవలయం
అణువును కణాన్ని
సంగమింపచేసిన ఇహం
కాంతిని కాలాన్ని
సంయోగింపచేసిన పరం
ఇహానికి పరానికి
అరూప వారధిలా నేను.
అవును, మనిషికి మతిని
జతపరచిన నేను
జీవ వైవిధ్యానికి
మత్స్యావతారంగా నేను.
-8-
చరాచర వైవిధ్య సామూహిక రూపంగా సృష్టి
సృష్టికి సమాంతర పరిణామంగా నేను
దశదిశలా భవిష్యత్తులోకి
విసిరేయబడ్డ నేను.
అవును, నేను కాలాన్ని
కాంతిని పెంచుతున్నవాణ్ణి
సృష్టి ప్రకృతిని వికృతిని
పెంచుతున్న వాణ్ణి.
అవును, పరిణామ వేగానికి
తొలి వారసుణ్ణి
మత్స్యావతార మనువు తత్వాన్ని
మనువు ధర్మాన్ని చేరుతున్న మనసు మర్మాన్ని.
-9-
అమరత్వమూ లే మృతతత్వమూ లేదు
అమవస పున్నములు లేనే లేవు
ఉచ్ఛ్వాసమూ లేదు నిశ్వాసమూ లేదు
ఏకంగా శ్వాస పురుడు పోసుకున్న క్షణం
కణ స్పందన అది కాల చైతన్యం అది
మానవ రూపావిష్కరణకు తొలి అంకం అది
నాభి నుండి నాడీమండలం వరకు రూపావిష్కరణ
మత్స్యం నుండి మనువు వరకు ఇహ ఆవిష్కరణ
భిన్నత్వంలో ఏకత్వం మత్స్యావతార నేను.
-10-
మనసు నుండి జాలువారిన కామన
వెలుగును చుట్టుముట్టిన చీకటి
నిప్పును పొదువుకున్న నీరు
కాంతిని ప్రసరించిన కాలం
ఇహం నుండి శక్తి విస్ఫోటనం
పరం నుండి ప్రాణ ప్రవాహం
ఖగోళతలో వైవిధ్య జీవ చైతన్యం
భూమికలుగా తొలి అవతార నేను
మాత్సర్య మత్స్యావతారాన్ని నేను.
-11-
చిరుజీవం పెరుగుతూ పెనుజీవం కావటం
పెరిగిన కణం మూల కణంగా వెనుతిరగటం
రేపటి కోసం ఒకరిని ఒకరు ఆశ్రయించటం
చివరికి నిష్క్రమించటం సృష్టి పరిణామం
తిరోగమనం మృతతత్వానికి తొలి పరిణామం
ఇది మత్స్యావతార ఆవిష్కృత రహస్యం
అణువు కథ ఇది మనువు కథ ఇది
మనిషి కథనం ఇది మనసు కథనం ఇది
మట్టి కథ ఇది మట్టిని మెట్టిన మనిషి కథ ఇది
పరిణామ చరిత్రలో తొలి ఇతిహాసం ఇది.