S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రివ్యూ’లే గీటురాళ్లు!

అప్పట్లో చేరిన కొత్తలోనే చాలా పుస్తకాలు నేను రివ్యూ చేశాను. నా నవల ‘విడీవిడని చిక్కులు’కి బదులు బహుమతి పొందిన సింగరాజు లింగరాజుగారి ‘ఆదర్శాలు - ఆంతర్యాలు’ ప్రచురణ కాగా - ఆ నవలని నేనే రివ్యూ చేశాను. ‘మంచి నవలల్లో మంచి నవల’గా నిలుస్తుంది’ అన్నాను. అనువాద నవల ‘మన్మథరాజ్యం’ ‘కీర్తిశేషులు’ కాళ్లకూరి నారాయణరావు గారి ‘రాణి రుద్రమదేవి’ శీలా వీర్రాజుగారి ‘వెలుగు రేఖలు’, పురాణం సూర్యప్రకాశరావు గారి ‘మారే మనుషులు’ (ఇది వీక్లీ సీరియల్) కొడవటిగంటి కుటుంబరావు గారి ‘పంచ కల్యాణి’ సరితా దేవి డైరీ, ‘ప్రేమించిన మనిషి’ లాంటి ఎన్నో నవలల్ని ఆముద్దీన - ఎన్నోఎన్నో డైలీకీ రివ్యూ చేశాను. అదో వెర్రి.
కొన్నింటికి కృష్ణానంద్ అన్న పేరు వాడితే మరి కొన్నిటికి ‘వీరాజీ’ అన్న పేరే పెట్టాను. అదే టైములో ‘గోరా’ నవల ‘నారికేళపాకం’లా వుంది అంటే, అసలు కథ కాదు. దాని ‘తెనుగు అనువాదం’ అంత కఠోరంగా ఉంది. గొంతులో పచ్చి వెలక్కాయ లాగా పడ్డది. ‘గోరా’ని వెంకట పార్వతీశ కవులు అంతకు మునుపే అనువాదం చేశారు. గురుదేవులే ఇంగ్లీషులోకి తర్జుమా చేశారట. కానీ, ఈ రివ్యూ నాకు అందిన ‘గోరా’ గ్రంథం మాత్రం ఐదు వందల ఇరవై నాలుగు పుటల గ్రంథం. స్వామి శివశంకరుల వారు అనువాదం చేశారు! దీన్ని ఆకాశాని కెత్తేశారు స్వాములవారు. ‘యావద్భారత నవల’ అన్నారు. ఓకే. అది వారి అభిప్రాయం. పెద్దలు.. ఏమంటాం?
కానీ అనువాదం చాలా కృతకంగా - ‘గో’రంగా వుంది’ అన్నాడీ కుర్ర సమీక్షకుడు - అనగా నేను. అనువాదకులు చాలా గొప్పలు చెబుతూ దీన్ని -‘నోరు తెరచి చదువుతున్నప్పుడు శ్రావ్యంగా వుండేలాగున యత్నించాను’ అన్నారు ‘సారు’. శ్రవణ నవలా, ఇదీ? ఉదాహరణలు చాలా చెప్పాను అక్కడ. గానీ, ఇక్కడ గ్రంథవిస్తార భీతి చేత, మచ్చుకి కొన్ని వాక్యాలు మాత్రం.. ఇలా వున్నాయి.
‘అతని ముఖము అనవసరముగా, పెద్దదిగా, బలిష్ఠంగా ఉంటుంది. నుదురు చెవుల వైపు నెమ్మదిగా జారి ఉంటుంది..’ (9వ పుట) ఇలాగే మరో వాక్యం ‘లలిత ఏమీ పలక్కుండా మవునంగా నిలుచుని ఉంది.’ (పుట 66) ‘మార్గం ప్రక్కన వున్న వర్తకుని ఆఫీసు తోటలో ఒకానొక పరదేశ ‘లత’ నుంచి అపరిచిత పుష్పాల కోమల పరిమళము ‘గోరా’ వ్యాకుల హృదయాన్ని చేతితో దువ్వుతున్నట్లు వున్నది.’ (పు.156) ఇలా 524 పుటలు లాగి లాగి ఉటంకించాను.
శివశంకర స్వామి గారు అయ్యవారికి సన్నిహితులట. కావున, ఎవరో ధర్మాత్ములు ఆయన నోటీసుకి తీసుకు పోయారల్లే వుంది. అయ్యవారి రూములోకి వెళ్లాను. తలెత్తి నేరుగా చూడలేదు ఆయన వేపు. కాని.. ఆయన ఫకాలున నవ్వడంతో, ఉలిక్కిపడి చూశాను. ఆయన బల్ల మీద -తనకొచ్చిన లెటర్ కాబోలు, కవరొకటి వుంది. సాలోచనగా చూసి - ‘అదీ, శివశంకర స్వామి, తానే నేరుగా అనువాదం చేయలేదట. ఎవరో శిష్యులు చేస్తే, ఈయన తన పేరు మాత్రం ఇచ్చారుట’ అన్నారు అయ్యవారు.
నేనేదో, సంజాయిషీగా అనబోయాను ‘నాకు తెలియదు సార్’ ‘ఏది తెలియదు? ఆయన చేయలేదనా? లేక నేను అతని సన్నిహితుడననా?’ కనుబొమలు ఎగిరాయి గానీ, వదనం ప్రసన్నంగానే ఉంది. ‘ఓహోయ్! కోటలో పాగా’ అనుకున్నది నా మనసు-
అయ్యవారన్నారు. ‘నాకు గల స్నేహానుబంధాలకి నా ఎడిటోరియల్ స్ట్ఫాకీ లంకె లేదు. సిన్సియర్‌గా వున్నప్పుడు నాతో ప్రాబ్లెం రాదు.. కాసిని ఢక్కామొక్కీలు తినేదాకా కాస్త భద్రంగా ఉండాలి. అద్సరే గానీ, ఏదో సినిమా రివ్యూ రాస్తూ, ‘తార సావిత్రిని - మత్తశుండాలం ఏదో నడిచి వస్తున్నట్లుంది’ అని కామెంట్ చేశారట మన వాళ్లెవరో?’ అన్నారు.
నాకు తెల్సు. అది డి.కె.ఎం.గారు. కానీ, పెదవి విప్పలేదు.
‘అట్లా ఆర్టిస్టుల్ని కించపరచరాదు మనం, శ్రీరాములు గారిని సంప్రదించండి. అట్లాంటి వాళ్లని రివ్యూలకి పంపకపోవడం మంచిది’ అన్నారంతే.
ఈ సంగతి నేను ఇంతవరకూ ఎవ్వరికీ, ఆఖరికి శ్రీరాములుగారికి కూడా ‘నేరు’గా చెప్పలేదు.
‘రివ్యూలు మీరు చదివి పంపండి సార్! అందరివీ’ అన్నాను.
ఆయన కంపోజ్‌కి వెళ్లబోయే రివ్యూలు రెండు నాకిచ్చి, చదివి, నోటితో అనకుండా చేత్తో, ‘పంపేయండి’ అని సంకేతించారు.
అంత భద్రంగా వుండే అనుభవశాలి ఆయన.
కాకపోతే కృష్ణమోహన్‌కి కొన్నాళ్లపాటు విజయా, వాహినీ, నెప్ట్యూన్ స్టూడియోలలో మాత్రం జరిగే ప్రీవ్యూలకి అసైన్‌మెంట్ పడలేదు. పైన వీక్లీలో కొత్త బ్యాచ్ కె.సుబ్బారావు వున్నాడు. అతనికి ఛాన్సు తగిలింది. అతను తెలుగు ఎమ్మే (సంస్కృతం కూడా అంటాడు) నాగరాజ్ అని కలం పేరు పెట్టుకున్నాడు. దాంతో డైలీ హాలులో వున్న సూరి నాగరాజు - ఎన్.సూరి అని రివ్యూలకి పేరెట్టుకున్నాడు తప్పదు గదా...
కొత్త సినిమా చూడాలీ అంటే మద్రాసులో ఎక్కడ దొరుకుతుంది? శనివారాలు ఉదయం పాత తెలుగు సినిమాలే గానీ..
దీంతో దేవుఁడాయని మైళ్ల దూరమయినా సరే, ఆటోలో వొళ్లు హూనం చేసుకుని విజయా గార్డెన్స్ ప్రీవ్యూలకి - జర్నలిస్టులే కాదు, పిన్నాపెద్దా కూడా వెళ్లేవాళ్లు. అప్పుడు తేనాంపేట వద్ద రైలు పట్టాల నెత్తిన వో ‘రోడ్డు వంతెన’ (ఫ్లైఓవర్) లేదు. బెజవాడ, గుంటూరు మధ్య మంగళగిరి దగ్గర - రైలుబండ్లు పోతూ, వస్తూన్నప్పుడు పడిగాపులు పడ్డట్లు - ఇక్కడా పడాల్సిందే. అయితే, అక్కడ స్టూడియోలో అంతమంది వి.ఐ.పి.లు, అస్మదీయులు, టెక్నీషియన్లు అందరూ వచ్చినా, వారపత్రికలో, దినపత్రికలో, సమీక్ష పడాలీ? అంటే - సినిమా మొదలెట్టడం కుదరదు. నేనో, లేదా మరో ముఖ్య ప్రతినిధి, ఆంధ్రప్రభ ‘వెంకట్’ వచ్చేదాకా - ఆగాల్సిందే. (ఈనాటి కుర్రాళ్లు ఇది ఊహించలేరు) తప్పదు.
విజయా వారి ‘గుండమ్మ కథ’ కైతే, తారలు, వారి అనుయాయులు, డైరెక్టర్‌లు - అందరూ వచ్చేశారు. కిటకిటలాడిపోయింది. (బి.నాగిరెడ్డిగారు. బి.ఎన్.రెడ్డి గారు కూడా వున్నారనుకుంటాను) ముందు వరుసలో అంతా కూర్చున్నారు. అంచేత ‘క్రౌడ్’ కంట్రోల్డ్‌గా వుంది.
కానీ, సూర్యకాంతమ్మ (ఆమె కూడా వున్నది ఆడియన్స్‌లో) జనాల్ని అడుగడుగునా కుదిపి కుదిపి నవ్వించీ, మెప్పించీ, వదిలేసింది. ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్. వున్నారు. సావిత్రి, జమున, ఎస్.వి.ఆర్.; వామ్మో! అదెంత స్టార్ వాల్యూగల చిత్రమో చెప్పలేము.
ఆ ఇద్దరు హీరోలలో ఎవరి పేరు ‘క్రిందా’ లేదా ‘మీదా’ అన్న ‘బిల్లింగు’ తర్జనభర్జనలు రాగా - ఆ ఇద్దరి పేర్లూ ఎత్తేశారు - అని జ్ఞాపకం. అప్పటికి మా ‘వీక్లీ’లో ముళ్లపూడి రమణగారి సినిమా రివ్యూల బాణీ ఒకటి రాజ్యమేలింది. అందుకని నేను తద్భిన్నంగా, కొత్త పంథా - నాదైన బాణీని ఎంచుకున్నాను. నా రివ్యూల్లో ‘తైరు’ కొట్టడం - ‘సోపు’ వెయ్యడం - వుండేవి కావు. (సోపు వెయ్యడం అంటే అరవ్వాళ్లు పరిభాషలో ‘దధిప్రయోగం’ చేయడం) నేను సూర్యకాంతమ్మ నటనకి - పాత్రకీ కూడా ‘్ఫదా’ అయిపోయి - రివ్యూ రాశాను. అదే రివ్యూని డైలీ ఆదివారానికీ, వీక్లీకీ కూడా నేనే చేశాను. డైలీ రివ్యూ చిన్న తంటా తెచ్చింది. చిన్నదేం ఖర్మ, పెద్దదే, అది. చాలాకాలం ప్రచ్ఛన్నంగా కొనసాగింది. అంచేత, ‘కొంత’ ఆ రివ్యూని అక్కడక్కడా ‘కోట్’ చేస్తాను. తప్పదు.
(డైలీ) కథ అంటే చెవి కోసుకోవడం ఆది నుంచీ ప్రజలకు అలవాటు అయిపోయింది. దరిమిలాను కథల కోసరం కనులు కాయలు కాచేలాగా - సినిమా యుగంలో.. ఒక అలవాటయి పోయింది. ఆదిన ‘గుణసుందరి కథ’ ‘జగదేకవీరుని కథ’ ఆ మధ్య మిస్సమ్మ కథనీ తయారుచేసిన విజయా వారు - ‘చంద్రహారం’ ఫేమ్ శ్రీ కామేశ్వరరావు దర్శకత్వంలో చక్రపాణి కథనంతో ఇప్పుడు గుండమ్మ ‘కథ’ను నిర్మించారు. బ్రహ్మాండమయిన ‘రెండు’ హీరోలు ‘రెండు’ హీరోయిన్లతో - శ్రీమతి సూర్యకాంతం గుండమ్మకాగా - ఈ చిత్రం స్టార్ వాల్యూ గల చిత్రంగా రూపొందింది. అప్పటి బాణీలో కథ అంతా చెప్పాలి కనుక సరదాగా కథ చెప్పేశాను. ఇక ఆఖరి పేరా కోట్ చేస్తాను - ‘శ్రీమతి సూర్యకాంతం గుండమ్మగా చూపిన నటన - నిర్మాతలు ఈ చిత్రానికి ఆ పేరు పెట్టినందుకు సార్థకం అయి రాణించింది. ఆద్యంతం మన మన్నన పొందేలాగా ఆమె నటించింది. తతిమ్మా హేమాహేమీలు ‘కథోచితం’గా హాస్యం అందించారు.
కాకపోతే, ఇక్కడ ‘రెండు హీరోలు’ అన్న మాట ‘ప్రిక్’ చేసింది, సదరు పెద్దల్ని. ‘కండపుష్టి’గల పాత్ర, గుండమ్మ గారిది కనుక ‘పేరు’ ఆమెదే. ‘ప్రఖ్యాతీ’ ఆమెదే. మిగతా వాళ్లు..’ అన్నట్లు ధ్వనించడంతో - ‘కుర్రాడికెంత పొగరు?’ అనుకున్నారల్లే వుంది పెద్దలు.
విజయా పిక్చర్స్ పూర్ణచంద్ర రావు దగ్గర్నుంచీ అందరూ మాకు కావాల్సిన వాళ్లే.
ప్రేక్షకులకీ ఈ ‘వ్యంగ్యం’ బాగానే అనిపించింది గానీ - అదుగో, ఇక్కడ - అయ్యవారే చీఫ్ ఎడిటర్‌గా కాపాడారు.
తన ఎడిటోరియల్ సిబ్బందిని - ఒక ‘కోడి తన పిల్లల్ని రెక్కల మాటున’ పొదువుకున్నట్లు - ఆయన ఎట్లా ‘సపోర్ట్’ చేస్తారో నాకు మరో మాటు అర్థమై పోయింది.
‘్ధన్యుణ్ణి! అటువంటి గ్రేట్ ఎడిటర్ గారి శుశ్రూష నాకు లభించింది’ అనుకున్నాను.
హాలులో నాకు మళ్లీ పెద్దల పిన్నల అటెన్షన్ దొరికింది - ‘జై!’
అయితే, ఈ ‘గుండమ్మ కథ’ బ్రహ్మాండంగా సక్సెస్ అయినాకా - ఎప్పటికో, నేను వీక్లీకి మారిపోయినాక మళ్లీ కుదిరింది.
ఇన్‌ఛార్జినై పోయినాను. ‘తెర మీద - తెర వెనుక’ - ఇంటర్‌వ్యూలు చేస్తూన్నాను. నిర్మాతలలో - చక్రపాణిగారిని ఎన్నుకుని ఇంటర్వ్యూకి ప్రొసీడ్ అయ్యాను. అప్పుడు ఈ గుండమ్మగారు (రివ్యూ) మరోసారి, నేరుగా ప్రస్తావనకు చక్రపాణిగారి దగ్గరే వచ్చింది. ఆ, ఎపిసోడ్ మరోసారి చెబుతా. అది చాలా పెద్ద రంజైన కథ!...
- ఇంకా ఉంది

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com