S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జననికి జోహార్లు

‘మాతృత్వపు మమకారం మాటలకు అందనిది.. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం..’ అంటూ ఎంతగా అభివర్ణించినా అది తక్కువే.. నేటి నవ నాగరిక యుగంలో అమ్మ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు ఆమె వంటింటికే పరిమితమైతే నేడు ఆమె బాధ్యతలు ఎనె్నన్నో.. గృహిణిగా, ఉద్యోగినిగా ఆమె సేవలు అనన్య సామాన్యం.. ఆత్మీయతలు, ఆధునికతల నడుమ అనుక్షణం సతమతమవుతున్నా ఆమెలోని ఆత్మవిశ్వాసం అపారం, అమోఘం.. ఎనె్నన్ని ఒత్తిళ్లు చుట్టుముట్టినా ఇంటాబయటా నేర్పుతో, సహనంతో, సంకల్పబలంతో అడ్డంకులను అధిగమిస్తోంది.. ఇంటి బాధ్యతలు, ఉద్యోగం, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ- ఇవేవీ కుటుంబ పాలనలో అమ్మకు అవరోధం కావు..
కుటుంబ వ్యవస్థకు ‘అమ్మ’ ఓ తిరుగులేని సీఈఓ. ఆర్థిక వ్యవహారాల్లో శిక్షణ లేకున్నా, ఎంబీఏలు-ఎంటెక్‌లూ చదవకపోయినా అమ్మను మించిన ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ నిజానికి ఎవరూ లేరు. చిన్న ఇల్లే ఆమెకు అతిపెద్ద సామ్రాజ్యం. దానికి ఆమే సామ్రాజ్ఞి. ఆమె పాలనలో ఇల్లంతా చల్లగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా నిరంతరం నిశ్చింతగా ఉంటారు. ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తనే కొంగు బిగిస్తుంది. ఆకాశమంత విశాల భావాలు, సాగరమంత లోతైన ఆలోచనలు, అవనిని మరపించే క్షమాగుణం, సంక్షోభాల్లో సడలని విశ్వాసం- అమ్మకు పెట్టని ఆభరణాలు. ఆమెలో సహజమైన నాయకత్వం, ఆ నాయకత్వంలో అంతులేని మాతృత్వపు మమకారం.. అందుకే ఆమె ఆది నాయకురాలు, అధినాయకురాలు కూడా.. ప్రతీ వ్యూహంలో, నిర్ణయంలో ఆమె ప్రతిభ ప్రతిఫలిస్తుంది.. అద్భుతమైన ఇలాంటి ప్రతిభ, నైపుణ్యం ‘అమ్మ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్’లో తప్ప మనం ఇంకెక్కడా చూడలేం.. ఒంట్లో ఓపిక లేకున్నా, ఇంట్లో ఏదీ లేకున్నా ‘నావల్ల కాదు’ అని ఆమె ఎప్పుడూ నిస్తేజంగా, నిస్సహాయంగా ఉండిపోదు. ఉన్న దాంతోనే వండి ఇంటిల్లిపాదికీ వడ్డించడంలో ఆమె నేర్పు- ఏ మేనేజ్‌మెంట్ కోర్సులోనూ ఉండదు.. ఆ మమకారానికి ముగింపు లేదు, ఆ సేవకు విశ్రాంతి ఉండదు..
సవాళ్లకు ఎదురీత..
ఆధునికత, సాంకేతికత వేయి దిక్కులుగా విస్తరిస్తున్న నేటి కాలంలో అమ్మకు ఎనె్నన్నో సవాళ్లు, సమస్యలు తప్పడం లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ‘అమ్మ’ బాధ్యతలు మొదలవుతాయి. పిల్లల పెంపకం, వండి వార్చడంతోనే ఆమె బాధ్యతలు తీరిపోవు. కుటుంబ నిర్వహణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండడంలో మరిన్ని బాధ్యతలు తప్పవు. నేటి రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో అమ్మకు అదనపు బాధ్యతలు, సరికొత్త సవాళ్లు అనివార్యం. సాంకేతికత పెరిగినకొద్దీ కుటుంబ వ్యవస్థలోనూ సంక్లిష్టత ఏర్పడుతోంది. నేటి ‘డిజిటల్ యుగం’లో బయటి వాతావరణమే కాదు, ఇంట్లో వాతావరణం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా గృహిణులకు పలురకాల ఒత్తిళ్లు తప్పడం లేదు. సాంకేతికత, విద్యారంగంలో మార్పుల ఫలితంగా పిల్లల పెంపకంలో ఉద్యోగినులు ఇదివరకు లేని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, టీవీ కార్యక్రమాలు కుటుంబ వ్యవస్థపైనా, పిల్లల పెంపకంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
పసిపిల్లలకు అన్నం తినిపించడం, వారిని కుదురుగా కూర్చోబెట్టడం, మారాం చేసే చిన్నారులకు పాటలతో, ఆటబొమ్మలతో అమ్మలు లాలించడం ఒకప్పటి సంగతి. నేటి ఆధునిక కాలంలో పిల్లల చేతుల్లో ఫోన్లు, కాస్త పెద్దపిల్లలైతే ‘ట్యాబ్’లు పెట్టాల్సిందే. హైస్కూల్‌కో, కాలేజీకో వెళ్లే పిల్లలకు స్మార్ట్ఫోన్లు, వాట్సాప్- ఫేస్‌బుక్- యూట్యూబ్‌లు వగైరా సోషల్ మీడియానే ప్రపంచం. ఇలాంటి పరిస్థితిలో అమ్మ మాటే పిల్లలకు వినిపించదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పగలూ రాత్రీ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతుంటే ఇక అమ్మ ఒంటరిదైపోదా? ఈ అలవాట్లతో ఇంట్లో మాటలే కరవు.. ‘గాడ్జెట్ల’ పుణ్యమాని తల్లీపిల్లల మధ్య అడ్డుగోడలు లేస్తున్నాయి.. ఒకప్పుడు తల్లి కొంగుపట్టుకుని తిరుగుతూ ‘అది కావాలి, ఇది కావాలి’ అని అల్లరి చేసే పిల్లలకు ఇపుడు స్మార్ట్ఫోనే లోకం, టీవీయే సర్వస్వం. ఫోనో, ట్యాబో ఇస్తే తప్ప ‘అన్నం ముట్టని’ మంకుపట్టు పిల్లల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికత పెరిగాక అమ్మతో మాట్లాడడం తగ్గిస్తున్న పిల్లలు చివరకు- తమ పంతం నెగ్గించుకునేందుకు ఆమెతో ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు అనేకం.. పదే పదే ఫోన్ వాడద్దంటూ అమ్మ మందలిస్తే- పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు ‘మారిన పరిస్థితుల’కు ప్రతీకలు.
మరోవైపు మార్కులు, ర్యాంకుల ధ్యాసతో క్షణం తీరిక లేని పిల్లలు.. హాస్టళ్లలో చదువులు.. దీంతో తల్లీపిల్లల మధ్య పెరుగుతున్న అగాధం.. ఉద్యోగినులైతే పిల్లల సంరక్షణకు బేబీకేర్ సెంటర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి.. ఉద్వేగాలకు, ఉద్రేకాలకు లోనయ్యే టీనేజీ పిల్లల విషయంలోనైతే అమ్మకు కష్టాలే.. అనుకరణలు శ్రుతిమించితే, అలవాట్లు అనర్థాలకు దారితీస్తే టీనేజీ పిల్లల వల్ల ఆమెకు అవస్థలే.. సాంకేతికత పేరుతో పిల్లలు ఎటువైపు మొగ్గుతున్నారో, ఏ అలవాట్లకు దగ్గరవుతున్నారో తెలుసుకోవాలంటే- అమ్మ కూడా ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నపుడే- పిల్లలకు ఏది ఎంతవరకూ అవసరమో అమ్మ నిర్ణయించగలదు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగంతోపాటు సాంకేతికతను, పరిసరాలను, మారే పరిస్థితులనూ ఆమె గమనించాల్సిందే. మరోవైపు ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరమవుతున్న పిల్లలు.. ఆ తర్వాత పెళ్లిళ్లు, వేరు కాపురాలు.. ఇలా అన్ని దశల్లోనూ అమ్మకు వేదనే.. మానసిక, శారీరక సమస్యలతో ఆమెకు ఆవేదనే.. మాతృమూర్తికి ఈ పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబానికే కాదు, సమాజానికీ సమస్యలే..
కాలంతో పరిగెడుతూ..
ఇంటి బాధ్యతలతో అమ్మకు క్షణం తీరిక ఉండదన్నది కాదనలేని వాస్తవం. పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణతో ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకూ ఆమెకు అలసటే. పిల్లల చదువులు, వారి ఆరోగ్యం, వంటావార్పూతో ఊపిరి సలపని పని. ఉద్యోగం చేసే తల్లులకైతే సమయమే చాలదు. వారు కాలంతో పోటీపడుతూ పరుగెత్తాల్సిందే. ఇంతటి బిజీలో ఎంతటి సహనశీలికైనా ఒత్తిడి తప్పదు. తాను ఉద్యోగానికి వెళ్లినా- బడి నుంచి ఇంటికొచ్చే పిల్లలు ఏం చేస్తున్నారో అనే ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఎదిగే పిల్లల ప్రవర్తనలో, అలవాట్లలో మార్పుల వల్ల అమ్మకు మరిన్ని సమస్యలు. ఇంటికి చేరుకున్నాక భర్త, పిల్లలు ఎవరి లోకంలో వారు మునిగిపోతుంటే అమ్మకు భరించలేని ఒంటరితనం..
సాంకేతికత, వినోదం..
ఒకప్పుడు సెలవురోజునో, తీరిక వేళల్లోనో ఇంటిల్లిపాదీ కలసి టీవీ చూస్తూ ఆనందంగా గడిపేవారు. సాంకేతికత పుణ్యమాని ఇపుడు ఎవరికి తోచిన వినోదం వారిది, ఎవరికి తోచిన కాలక్షేపం వారిది. ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేకానేక వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో మమేకమవుతున్న పిల్లలు అమ్మకు ఒంటరితనాన్ని మిగుల్చుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నపుడు ఇంట్లో పెద్దలు నైతిక విలువలు, గౌరవ మర్యాదలు వంటి విషయాలను పిల్లలకు చెప్పేవారు. ఇపుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు లేని కుటుంబాల్లో విలువల గురించి పిల్లలకు చెప్పేవారే కరవయ్యారు. ఈ విషయాలను పిల్లలకు చెప్పే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండడం లేదు. అలా చెప్పేవారున్నా- వినే పరిస్థితిలో పిల్లలు లేరు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో గాడి తప్పుతున్న పిల్లల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నది కాదనలేని కఠోర వాస్తవం. పిల్లల అలవాట్లు, వారి ప్రవర్తనను గమనిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య కూడా తక్కువే. అలవాట్ల వల్ల ఎక్కడైనా అనర్థాలు జరిగితే- ‘అంతా పెంపకం లోపం..’ అని అమ్మనే ఆడిపోసుకుంటారు.
పిల్లల ఆరోగ్యం..
గతంలో వలే మైదానంలో ఆడుకునేందుకు నేటి పిల్లల్లో చాలామంది సుముఖంగా లేరు. ఇంట్లో సైతం సంప్రదాయమైన ఆటలపై వారికి ఆసక్తి ఉండడం లేదు. టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్, సోషల్ మీడియాపైనే వారు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. శారీరక శ్రమ కరువవడంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అనేక కారణాల వల్ల రక్తహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇవన్నీ అమ్మకు ఆందోళన కలిగించేవే. సామాజిక వాతావరణం కలుషితమవుతున్నపుడు పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం తల్లికి నిజంగా సవాలే. వాయు కాలుష్యం, జల కాలుష్యం బారిన పడకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఓ బాధ్యతగా మారింది. జీవనశైలిలో మార్పుల వల్ల పిల్లలు మానసిక, శారీరక అనారోగ్యాలకు లోనుకాకుండా ఉండాలంటే తల్లులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. వాతావరణంలో మార్పులతో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల కూడా అమ్మ అవగాహన పెంచుకోవాల్సిందే. వ్యక్తిత్వ వికాసమే కాదు, వ్యక్తిగత పరిశుభ్రతపైనా పిల్లలకు అన్ని విషయాలను చెప్పాల్సిన బాధ్యత అమ్మదే. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి తల్లులు తపన పడుతుంటారు.
ఉద్యోగంలో సామర్థ్యం..
సంతానం కలిగాక ఉద్యోగంలో చేరినా, ఉద్యోగం చేస్తూ అమ్మగా మారినా మహిళలు ఇంటి బాధ్యతలకు, బయట పనికీ ఒకేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చాక కొత్తగా ఉద్యోగంలో చేరేందుకు తల్లులు మానసికంగా సిద్ధమవడంలో కొంత ఉద్వేగానికి లోనవుతుంటారు. అలా మానసికంగా సిద్ధపడడంలో అంతర్లీనంగా కొంత సంఘర్షణను ఎదుర్కొంటున్నా, వారి బాధ్యతలపై ఆ ప్రభావం కనిపించదు. ఉద్యోగినులైన తల్లులు కుటుంబ పాలనలోనే కాదు, పనిచేసే చోట సైతం తమ సామర్థ్యం చాటుకుంటున్నారు. ఇంటి బాధ్యతలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఉద్యోగంపైనా అంతలా ఆసక్తి చూపుతున్నందున నేడు అనేక బహుళజాతి సంస్థలు కూడా కీలక బాధ్యతల్లో మహిళలను నియమించేందుకు మొగ్గు చూపుతున్నాయి. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్ష మెజారిటీ ఉద్యోగినుల్లో వ్యక్తమవుతోందని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
*
మంచి కోరేదే అమ్మ..

జపాన్‌లో ఒకప్పుడు ఓ చిత్రమైన పద్ధతి ఉండేదట. వయసుపైబడి ఏ పనులూ చేయలేని పరిస్థితిలో ఉండే తల్లిదండ్రులను కుమారులు తీసుకొనిపోయి ఎత్తయిన కొండప్రాంతాల్లో వదిలి వచ్చేవారట. ఆహారం కూడా సంపాదించుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి చనిపోయేవారట. ఇదే తీరున ఓ యువకుడు ముసలిదైన తన తల్లిని భుజాలపై మోసుకుని కొండలపై వదలేసి రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తన తల్లి ఏదో చేస్తున్నట్లు ఆ యువకుడు గమనించాడు. చెట్ల కొమ్మలను, పువ్వులను తెంపుతూ కింద పడేస్తున్న తల్లిని ఏమీ అనకుండా అలాగే యువకుడు గమ్యం వైపు వెళుతున్నాడు. చాలా దూరం వెళ్లాక, భుజంపై ఉన్న తల్లిని కిందకు దింపేసిన కుమారుడు ఉండబట్టలేక ఆమెను ప్రశ్నించాడు. ‘నిన్ను నా భుజంపై మోస్తూ కొండ ఎక్కుతున్నపుడు చెట్ల కొమ్మలను, పువ్వులను తెంపి ఎందుకు పడవేశావో చెప్పు..’ అని అడిగాడు. దానికి ఆ మాతృమూర్తి- ‘నాయనా.. ముసలిదాన్నయిన నన్ను కొండలపై నువ్వు వదిలేసి వెళ్లిపోయినా ఫర్వాలేదు.. మళ్లీ నేను తిరిగి ఇంటికి రాకూడదని చాలా దూరం తీసుకువచ్చావు.. నువ్వు ఒకవేళ దారితప్పి ఇబ్బంది పడతావేమోనన్న భయంతో కొమ్మలు, పువ్వులను తెంపి అలా వేశాను.. ఆ గుర్తులతోనైనా నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లు నాయనా..’ అంది. అందుకే- ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు.. మనసున్నదే అమ్మ.. మంచి కోరేదే
అమ్మ..

‘పేద తల్లుల’కు వెతలే..

మన దేశంలో పట్టణ ప్రాంత పేద తల్లులు పలు సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నట్టు తాజాగా విడుదలైన అంతర్జాతీయ నివేదిక తేటతెల్లం చేస్తోంది. 179 దేశాలకు సంబంధించి ‘తల్లుల సంక్షేమ సూచీ’లో భారత్ 140వ స్థానంలో ఉంది. ఈ విషయంలో భారత్ కంటే బంగ్లాదేశ్ మెరుగైన స్థితిలో ఉండడం గమనార్హం. మన దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పేద తల్లులు, వారి పిల్లల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ‘తల్లుల సంక్షేమ సూచీ’లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారత్ ర్యాంకు మూడు స్థానాలకు దిగజారడం మరింత ఆందోళన కలిగించే అంశం. పేద, సంపన్న వర్గాల మధ్య వ్యత్యాసం మన దేశంలో మరీ ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్న పది దేశాల్లో భారత్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక పరిస్థితుల కారణంగా పేద వర్గాల తల్లులు పిల్లల సంరక్షణపై దృష్టి సారించలేకపోతున్నారు. గృహవసతి, వౌలిక సౌకర్యాలు లేకపోవడంతో పిల్లల పెంపకంలో పట్టణ ప్రాంత పేద తల్లులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాని ‘సేవ్ ది చిల్డ్రన్’ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. పోషకాహారం, పరిశుభ్రత లోపించడంతో మురికివాడల్లోని పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇన్ని విషమ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను సంరక్షించడం, చదివించడంలో పేద తల్లులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతల వల్ల పట్టణ, నగర ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో బంధాలు సైతం బలహీనపడుతున్నాయి. తక్కువ జనాభా కలిగి, అభివృద్థి పథంలో దూసుకుపోతున్న ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తల్లులకు సమస్యలు తక్కువేనని సర్వేలు చెబుతున్నాయి. తల్లుల సంక్షేమ సూచీలో మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్ 130వ స్థానంలో, పాకిస్తాన్ 149వ స్థానంలో ఉన్నాయి. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా 33వ స్థానంలో, చైనా 61వ స్థానంలో ఉన్నాయి. సామాజిక అసమానతల వల్లే తల్లుల పరిస్థితి భారత్ వంటి దేశాల్లో ఇంకా దయనీయంగా ఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రశ్నార్థకంగా మారడంతో పట్టణ ప్రాంత పేద కుటుంబాల్లో మాతాశిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో వౌలిక వసతులను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సంక్షేమం పేరిట మన పాలకులు అమలు చేస్తున్న విధానాలతో పేదింటి తల్లులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.
పట్టణీకరణతో పాట్లు..
జీవనోపాధి నిమిత్తం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరగడంతో పేద కుటుంబాల వారు అవస్థలను ఎదుర్కొనక తప్పడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో సగం జనాభా పట్టణాల్లో, నగరాల్లో ఉంటోంది. దేశంలోని మొత్తం మురికివాడల జనాభాలో దాదాపు సగం మంది ఈ అయిదు రాష్ట్రాల్లో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు మరీ ఆందోళనకరంగా ఉన్నాయి. 2004-05 సంవత్సరాల్లో కంటే 2009-10 సంవత్సరాల్లో మన పట్టణాల్లో వలసల సంఖ్య మరీ ఎక్కువైందని ‘ప్రణాళికా సంఘం’ గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇదే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుముఖం పట్టడం గమనార్హం. పట్టణీకరణ ఫలితంగా 1977-78లో కంటే 2009-10లో ఆర్థిక అసమానతలు మరీ ఎక్కువయ్యాయి. పట్టణీకరణ, మురికివాడల పెరుగుదల వల్ల పిల్లల సంక్షేమం తల్లులకు సమస్యగా మారుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ప్రసవానికి నోచుకోని తల్లుల సంఖ్య మురికివాడల్లో ఇంకా ఎక్కువగానే ఉంది.

-పి.ఎస్.ఆర్.