పాతాళస్వర్గం-12
Published Saturday, 11 May 2019‘ఆ పల్లెల్లో గౌతమి వుందేమో అని’ అంటూ తన అనుమానాలు చెప్పాడు చంద్ర.
ఆలోచనలో పడ్డాడు నాయ్.
‘ఏవిటాలోచిస్తున్నారు? ఆ పల్లెలు కూడా భయంకరమైనవా?’ అన్నాడు ప్రభు.
‘ఛఛ అలా అని కాదు. ఇప్పుడామెని గాలించి పట్టుకోవాల్సినంత అవసరం ఏమిటా అని? కొంపతీసి ఆమె నగలతో సహా పారిపోయిందని అనుమానిస్తున్నారా?’ అన్నాడు నాయక్ ఆత్రుతగా.
‘ఛఛ! అదేం కాదు’ కంగారుగా అన్నాడు చంద్ర.
‘మరి?’
చంద్రకేం చెప్పాలో అర్థం కాలేదు.
‘అది కాదు మిస్టర్ నాయక్! ఆమె అమాయకురాలు. వృత్తిరీత్యా డాక్టర్. తండ్రి మీద పడిన మచ్చ చెరపడానికని తాత్కాలికావేశంతో వెళ్లింది. అదీగాక కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుని మనకి కొంత రహస్య సమాచారం అందించింది కూడా. అలాంటి యువతి ప్రాణాపాయ స్థితిలో వుంటే మనకి పట్టనట్టు ఉండటం ఏం న్యాయం?’ అన్నాడు భారంగా.
‘అవును సర్! ఆ ప్రాంతాల్లో మీరు కొన్నాళ్లు పని చేశారు కూడా. అందుకే మీ సహాయం కోసం ఆశిస్తున్నాం’ అన్నాడు ప్రభు.
‘ఓకే! రేపట్నించి ఆ ప్రయత్నంలోనే ఉంటాను’ అనేశాడు నాయక్. చంద్ర, ప్రభుల మొహాలు వికసించాయి. తర్వాత చాలాసేపు ఆ విషయం గురించే చర్చించుకున్నారు. వాళ్లు లేస్తుండగా ప్రభు సెల్ మోగింది.
ప్రభుకి కాంతారావు దగ్గర్నించి ఫోన్ వచ్చింది.
‘సర్! బ్లాక్ టైగర్ మనిషి దొరికాడు. అమ్మవారి నగ అమ్ముతుండగా పట్టుకున్నాం. తొందరగా రండి’ అన్నాడు కంగారుగా.
అందరూ అలర్ట్ అయిపోయారు.
* * *
ఎలా తెలిసిపోయిందో గానీ క్షణాల్లో ఊళ్లోని జనమంతా కొండ మీదికి చేరిపోయారు. ఉప్పు, నిప్పులా ఉండే దర్మారావు కాంతారావులు కూడా అక్కడే ఉన్నారు. గౌతమిని గురించిన దిగులుతో నీరసించి పోయిన అనిల్‌తో సహా అందరూ అక్కడే ఉన్నారు.
ఒంటికి ఏవో చర్మాలు, తల మీద ఈకలు, మెళ్లో దంతపు పూసలు, కళ్లచుట్టూ తెలుపు ఎరుపు చుక్కలు గల ఓ బక్కచిక్కిన వ్యక్తి ఓ చెట్టుకి కట్టేసి ఉన్నాడు. ఆవేశపరులు కొట్టిన దెబ్బల వల్ల ఒళ్లంతా గాయాలతో రక్తసిక్తమయింది. ఆవేశం చల్లారని కొందరు ఇంకా విచక్షణా రహితంగా అతన్ని కొడుతూనే ఉన్నారు. అతని కళ్లు వాలిపోతున్నా ఎవరికీ జాలి కలగలేదు.
‘్ఛస్తాడేమో? ఇంక కొట్టకండి. పోలీసులొస్తారుగా వాళ్లే చూసుకుంటారు’ అని అనిల్ వారిస్తున్నా ఎవరూ వినిపించుకోలేదు. మరికొన్ని నిమిషాల్లో పోలీసు జీపులు వచ్చేశాయి. వాళ్లని చూడగానే జనాలు పక్కకి తప్పుకున్నారు.
ఎలాగైనా వాడి మీద దాడిచేసి నగల గురించి, గౌతమి గురించి తెలుసుకోవాలని కొండంత ఆశగా వచ్చిన ప్రభు, నాయక్ అక్కడ పరిస్థితి చూసి బిగుసుకుపోయారు కొన్ని క్షణాలు.
కారణం, ఆ వ్యక్తి దాదాపు అపస్మారక స్థితిలోకెళ్లిపోయాడు. విజయ నాయక్ ఎవరి మీదా, ఎప్పుడూ రానంత ఆగ్రహం వచ్చింది.
‘ఎవరు? ఎవర్నితన్నిలా కొట్టింది’ అన్నాడు అరిచినట్టు. పోలీసులు అతణ్ణి బంధవిముక్తుణ్ని చేసి, ఇన్ని నీళ్లు నోట్లో పోశారు. నాయక్ మొహంలోని ఆగ్రహం చూసిన చాలామంది అక్కణ్నించి జారుకున్నారు. ఆటవికుడు గుటక కూడా వెయ్యలేకపోతున్నా, ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నాడు.
‘ముందు ఇతన్ని హాస్పిటల్‌లో చేరుద్దాం సర్. తర్వాత ఇతన్నించి వివరాలు తీసుకోవచ్చు’ అన్నాడు ప్రభు. అయితే నాయక్ మాట్లాడలేదు. శవాకారంలా పడున్న అతని మీదికి వంగి-
‘ఎవర్నువ్వు?’ అడిగాడు.
‘నేను.. నేను ఆ బ్లాక్ టైగర్...’ అతని మాట క్షీణించిపోయింది.
విజయ నాయక్ అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు.
‘ఇతను.. అడవి మనిషే అంటారా?’ అన్నాడు ప్రభుతో.
‘ఇంకా అనుమానం ఏంటి సార్? స్వయంగా అతనే చెప్పాడుగా బ్లాక్ టైగర్ మనిషినని. వీడి దగ్గర అమ్మవారి నగ కూడా ఉంది. అది అమ్ముతుంటే జనం గుర్తించి ఆగ్రహం పట్టలేక కొట్టారు’ అన్నాడు కాంతారావు.
‘మీరే కదూ! ప్రభుగారికి ఫోన్ చేసింది?’ అతనికేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు నాయక్.
‘అవును సర్! ఆ నగ నేనూ చూశాను. సాక్షాత్తూ ఆ పార్వతీదేవే కొండ మీద వెలిసింది. అలాంటి తల్లి నగ దొంగిలించిన వాణ్ని కొట్టడం కాదు. కొయ్యాలి’ అన్నాడు కాంతారావు కోపంగా.
‘కొట్టడానికి, కొయ్యడానికి మీరెవరు? దానికో చట్టం ఉంది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే మీరు కూడా శిక్షార్హులవుతారు’ అన్నాడు నాయక్ కఠినంగా.
‘ఎంత దొంగలైతే మాత్రం అంతలా కొడతారా? వాళ్లకి తోచలేదు సరే మీ బుద్ధెక్కడికి పోయింది’ చిరాగ్గా అన్నాడు ప్రభు.
‘అది అలా గడ్డెట్టండి! గొడ్డును బాదినట్టు బాదారు. ఇప్పుడు వీడు చస్తే?’ కయ్యానికి కాలు దువ్వే ధర్మారావు కాంతారావు మీద విరుచుకు పడ్డాడు.
‘అంటే వాణ్ని నేనే కొట్టినట్లు మాట్లాడుతున్నావేంటి? అందరూ బాదేటపుడు నువ్వు వున్నావుగా? ఆపకపోయావా?’ మరింత మండి పడ్డాడు కాంతారావు.
ధర్మారావు రెచ్చిపోయాడు. ఇద్దరూ ఎప్పట్లా కాట్లాడుకున్నారు.
‘స్టాపిట్!’ అరిచాడు నాయక్.
వెంటనే అంతా సైలెంటయి పోయారు.
‘ధర్మారావుగారూ! మీ ఇద్దరి మధ్యా శత్రుత్వం ఉంటే అది మీమీ ఇళ్ల దగ్గర తేల్చుకోండి. అంతేగానీ, పదిమందిలో, అదీ ఓ వ్యక్తి చావుబతుకుల్లో ఉండగా... ఛ!’ ఆవేశంగా అన్నాడు అనిల్. ఇంతలో అంబులెన్స్ వచ్చేసింది.
‘ఇంతకీ నగ ఏదీ?’ అన్నాడు నాయక్ గంభీరంగా.
‘వాడి మొలలోనే ఉంది’ ఎవరో మెల్లగా అన్నారు.
నాయక్ మాట మీద, అతని మొలలో ఉన్న చిన్న తోలుసంచీలోని నగ తీశాడు. నిజంగానే అది అమ్మవారి ఖరీదైన నగల్లో ఒకటి. పేషెంట్‌తో సహా అంబులెన్స్ వేగంగా దూసుకుపోయింది. హాస్పిటల్‌లో అతన్ని బతికించాలని డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ బతికించలేక పోయారు. కానీ ఆ విషయాన్ని అతి గోప్యంగా వుంచేశారు నాయక్, తదితరులు. అయితే, నాయక్, ప్రభు లాంటి వాళ్ల బుర్రలకి కావల్సినంత మేటర్ దొరకడమే కాదు కొండంత ఉత్సాహం వచ్చేసింది.
* * *
మధ్యాహ్నం పనె్నండింటికి ఓసారి శంకరయ్యని చూసి వద్దామని తన కారులో బయల్దేరాడు ధర్మారావు. ఆ పూట డ్రైవర్ రాకపోవడంతో తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అదే సమయానికి కాంతారావు కూడా బయల్దేరాడు. అతను డ్రైవర్ వున్నా ఎక్కువగా తనే డ్రైవ్ చేస్తాడు. కావాలనే చేశారో, పొరపాటునే జరిగిందో గానీ, కాస్త చేరువగా రాగానే రెండు కార్లూ రాచుకుంటూ వెళ్లడం, కార్లు రెండూ కాస్త డామేజ్ కావడం జరిగిపోయింది.
అంతే ఇద్దరూ ఉగ్ర నరసింహ మూర్తులే అయిపోయారు.
‘కళ్లు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? లేకపోతే నన్ను మర్డర్ చెయ్యాలనుకున్నావా?’ అంటూ చిందులు వేశాడు ధర్మారావు.
‘ఆఁ అవును! నిన్ను మర్డర్ చేస్తే నీ ముదనష్టపు ఆస్తంతా నాకొచ్చేస్తుంది కదా. అందుకే డాషిచ్చాను. సిగ్గు లేకపోతే సరి! తప్పు తన మీద పెట్టుకుని నన్ను దబాయిస్తున్నాడు. చూడు! నా కారెంత డామేజ్ అయ్యిందో’ అంటూ అరిచాడు కాంతారావు.
‘అబ్బో! పెద్ద ఇంపోర్టెడ్ కారు. పాతికేళ్ల నాటి డొక్కు కారు. ఈ రూపేణా అయినా వదిలిపోయిందని సంతోషపడు’ వ్యంగ్యంగా అన్నాడు ధర్మారావు.
తన కారుని డొక్కు కారన్నందుకు ఉడికిపోయాడు కాంతారావు. ఆవేశంగా అతని కాలరు పట్టుకున్నాడు. ధర్మారావు మరింత రెచ్చిపోయి అతని చెంప మీద కొట్టాడు. జనం మూగారు. అప్పుడే శంకరయ్యని చూసి వస్తున్న అనిల్ కంటపడి ఇద్దర్నీ విడదీసి -
‘సారీ! మీరిద్దరూ నాకన్నా చాలా పెద్దవారు. అలగా వాళ్లలా ఇలా రోడ్డునపడి కొట్టుకోవడం చూస్తుంటే ఛ! చూసే వాళ్లే సిగ్గుపడుతున్నారు. మీ మనసులో ఏమైనా పగలు, ప్రతీకారాలూ ఉంటే మీ ఇళ్ల దగ్గరే తేల్చుకుంటే మంచిది’ అన్నాడు కఠినంగా.
ధర్మారావూ వాళ్ల తలలు వాలిపోయాయి. సంజాయిషీగా ఏదో చెప్పబోతుంటే-
‘జరిగిన జాతర చాలు. ఇంక వెళ్లండి’ అన్నాడు అనిల్ చిరాగ్గా. మరి మాట్లాడలేదు వాళ్లు.
‘ఇంతకీ మీరిద్దరూ కలిసి ఎక్కడికి బయల్దేరారు?’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు అనిల్.
‘ఛ! ఇద్దరం కలిశా. నేను శంకరయ్య గారిని చూడాలని వచ్చాను’ కంపరంగా అన్నాడు ధర్మారావు.
‘ఈయనగారూ ఇప్పుడే వస్తాడని నాకేం తెలుసు? నేనూ ఆయన్ని చూద్దామనే వచ్చాను’ అన్నాడు కాంతారావు.
‘అయితే వెళ్లి చూడండి. కానీ ఒకరి తర్వాత ఒకరు వెళ్లండి. లేకపోతే అసలే వీక్‌గా ఉన్న ఆయన గుండె ఆగిపోగలదు’ అంటూ వెళ్లిపోయాడు అనిల్.
‘ఏవిటి.. శంకరయ్యగారి పరిస్థితి బాగోలేదా?’ ఓ నర్సుని ఆతృతగా అడిగాడు ధర్మారావు.
‘బానే వున్నారు. కానీ కూతుర్ని గురించే ఆయన బెంగంతా’ అంటూ వెళ్లిపోయిందామె.
‘ఇంకేం కూతురు? ఆ అడవిలో కెళ్లింది తిరిగి ఎక్కడొస్తుంది?’ అనుకుంటూ, ఓసారి కాంతారావుకేసి నిరసనగా చూసి లోపలికెళ్లిపోయాడు ధర్మారావు. మరి కాస్సేపటికి అతను బైటికొచ్చాక, కొరకొర చూస్తూ లోపలికెళ్లాడు కాంతారావు.
* * *
శారీరకంగానూ, మానసికంగానూ బాగా అలసిపోయిన గౌతమికి ఓ మూల బోనులోని జంతువు అరుపులు, కటిక నేల, ఏం జరుగుతుందో అన్న భయం కలిసి నిద్రకి దూరం చేశాయి.
పూర్తిగా తెల్లవారకుండానే ఇద్దరు యువకులు, ఓ ముంతతో లోపలికొచ్చారు.
‘ఇదిగో పిల్లా! నీ పేరేంటో మాకు తెలియదు. నా పేరు జీవా. వీడి పేరు సిద్దు. ఇదిగో మొహం కడుక్కుని ఇది తాగు’ అన్నాడు జీవా అన్న వ్యక్తి.
‘నా పేరు పిల్ల కాదు. గౌతమి! ఏవిటది? కాఫీనా?’ అంది గౌతమి ఆశగా.
‘కాఫీలూ గీఫీలూ ఇక్కడుండవు. తోడి జావ తాగు!’ అన్నాడు సిద్దు.
‘బ్రష్ చేసుకోవడం ఎలా?.. నీళ్లు లేవు’ గొణిగిందామె.
‘నీళ్లు లేవా. తలవైపు తాగడానికీ, ఆ గదిలో స్నానానికీ కావల్సినన్ని నీళ్లున్నాయి. స్నానం చేసి సిద్ధంగా ఉండు. దొర దగ్గరికెళ్లాలి’ అన్నాడు జీవా. నిజంగానే అక్కడ నీళ్లున్నాయి.
‘థాంక్స్ జీవా!’ అంది నవ్వుతూ. ఎలాగైనా వాళ్లతో మాటలు కలిపి, బ్లాక్ టైగర్ వివరాలు తెలుసుకోవాలని ఆమె ఆరాటం.
‘సరే. తొందరగా స్నానం చేసి సిద్ధంగా ఉండు’ అంటూ వెనక్కి తిరిగారా యువకులు.
‘సిద్దూ! మీ దొర ఎక్కడుంటాడు?’ అంది గౌతమి ఆతృతగా.
‘దర్బారులో’
‘ఆయనకి బ్లాక్ టైగర్ గురించి తెలుసా?’
జీవా, సిద్దు చురుగ్గా చూసి-
‘అది దొరనే అడుగు’ అంటూ వెళ్లిపోయారు.
గౌతమి నీరసంగా లేచి బ్రష్ చేసుకుని ముంతలోని ద్రవాన్ని టేస్ట్ చెయ్యాలని ప్రయత్నించింది కానీ దాని వాసనే ఆమెకి నచ్చక కింద పెట్టేసింది. తర్వాత స్నానం చేసి బేగ్‌లోంచి చీర అవీ తీసుకుని నీట్‌గా తయారైంది.
అప్పుడే ఓ యువతి ఉత్సాహంగా వచ్చింది. కడిగిన ముత్యంలా వున్న గౌతమిని చూస్తూ-
‘నువ్వేనా మా అడవిలోకొచ్చినమ్మాయివి? అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని వచ్చాను. నా పేరు చిన్ని. నీపేరేంటి?’ అంది గలగల మాట్లాడుతూ
పొట్టి లంగాతో చెవులకి, మెళ్ల్లోనూ చిత్రవిచిత్రమైన పూసలతో అడవి దాటి ఎరుగని అడవి కన్యలా ఉంది - చిన్ని అన్న ఆ పిల్ల. అలాంటి అలంకరణలో కూడా ఆమె అందంగానే ఉంది. మొహంలో మంచి కళ ఉంది.
‘నా పేరు గౌతమి. నీలాంటి అమ్మాయినే. మీ బ్లాక్ టైగర్ని చూడాలని వచ్చాను’ అంది గౌతమి నవ్వుతూ చనువుగా ఆమె భుజం మీద చెయ్యేసి.
అంత అందమైన పట్నం పిల్ల ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆ పిల్లకి ఆనందాన్నిచ్చినా ‘బ్లాక్ టైగర్’ అన్న మాట వినగానే తుళ్లిపడింది.
‘బ్లాక్ టైగరా?’ అంది అప్రయత్నంగా.
గౌతమి ఏదో అనేంతలో జీవా, సిద్దు వచ్చి హడావిడి పెట్టేశారు దొర రమ్మన్నాడంటూ.
‘బాబా తీసుకురమ్మన్నాడా?’ అంది చిన్ని. అప్పుడు చూశారు జీవా వాళ్ళామెని.
‘నువ్వేంటి తల్లీ. ఇక్కడ?’ అన్నారు వ్యంగ్యంగా.
‘ఈవిడ్ని చూడాలని వచ్చానే్ల. అయినా ఇప్పుడు ఈవిణ్ని బాబా దగ్గరకెందుకు?’ అంది చిన్ని.
‘అదంతా నీకెందుకు? నువ్వింటికి పో’ విసుగ్గా అన్నాడు జీవా.
‘తను మన అడవి చూడాలని అంత కష్టపడి వస్తే అంతా తిప్పి చూపించద్దూ?... అందుకే వచ్చాను’ అంది చిన్ని దర్పంగా.
‘అవన్నీ తర్వాత.. ముందు దొర దగ్గరకెళ్లాలి. ఆయన మా కోసం చూస్తున్నాడు’ అంటూ ఆమెని అతికష్టం మీద పంపేసి, గౌతమిని తీసుకుని బయల్దేరారు జీవా వాళ్లు.
‘మేం వెళ్లగానే, అడవిలోనించి పారిపోతావేమో అనుకున్నాం’ అన్నాడు సిద్దు నడుస్తూనే.
‘పారిపోయేదాన్ని ఇంత కష్టపడి ఎందుకొస్తాను?’ నవ్వింది గౌతమి.
అంత పెద్ద అడవిలో ఒంటరిగా పులి బోను పక్కగా గడిపిన ఆమెని చూసి ఆశ్చర్యపోతున్న సిద్దూ వాళ్లు ఆమె మాట్లాడిన తీరుకి మరింత ఆశ్చర్యపోయారు. మనసులో మెచ్చుకున్నారు కూడా
కాస్సేపు నడిచాక ఓ పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు ముగ్గురూ. ఆ గుహకీ పెద్ద ద్వారం ఉంది. ఆమెతో కలిసి లోపలికి నడిచారు జీవా వాళ్లు.
అది చాలా పెద్ద హాలులా ఉంది. దానికి మధ్యగా రాతితో కట్టబడిన ఎతె్తైన ఆసనం ఉంది. దాని మీద నేరేడు పండు రంగులో ఎర్రని కళ్లతో, గుప్పెడు మీసంతో బలాఢ్యుడైన ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని చూపులు వాడిగా ఉన్నాయి. గౌతమితో వచ్చిన సిద్దు, జీవా అతని కిరువైపులా నిల్చున్నారు.
‘దొరకి దణ్నం పెట్టు’ అన్నట్టు సైగ చేశాడు సిద్దు.
అప్రయత్నంగా చేతులు జోడించింది గౌతమి.
‘ఎవర్నువ్వు?’ అన్నాడా వృద్ధుడు గంభీరంగా.
అతనిలాగే గొంతు కూడా గంభీరంగా ఉంది.
‘నా పేరు గౌతమి!’
‘ఇక్కడికెందుకొచ్చావ్?’
‘చెప్తాను. కానీ ముందు మీరెవరో చెప్పండి. కేవలం కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ప్లీజ్! చెప్పండి దొరా మీరెవరు?’ మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో అంది గౌతమి.
అతని మొహం మరింత గంభీరంగా అయిపోయింది. ఆమెకేసి కొన్ని క్షణాలు చూసి-
‘నేనెవరన్నది నీకనవసరం. నువ్వు నా స్థావరానికొచ్చావు. ముందు నీ గురించి చెప్పు! బైటి వారెవరూ అడుగు పెట్టని పెట్టలేని ఈ అడవిలో ఎందుకడుగుపెట్టావ్?’ అన్నాడు.
ఈసారి మొండి ధైర్యం వచ్చేసింది గౌతమికి.
‘నిజమే! మీరెవరో నాకనవసరమే. నేను వచ్చింది కూడా మీ కోసం కాదు. ఈ ప్రాంతాల్లో వుంటాడని విన్న బ్లాక్‌టైగర్ కోసం. ఆయన గురించి తెలిస్తే చెప్పండి. ఓసారి కలిసి వెళ్లిపోతాను’ అంది గంభీరంగా. ఒక్కసారి తుళ్లిపడ్డారంతా. చుట్టూ వున్న వాళ్లు ఏదో అనబోతుంటే, వాళ్లని వారించి-
‘బ్లాక్ టైగర్ కోసమా? అతనితో నీకేం పని?’ అన్నాడు దొర కళ్లు చిట్లిస్తూ.
‘అది ఆయనకే చెప్పాలి. దయచేసి ఆయనెక్కడుంటాడో తెలిస్తే చెప్పండి. ప్లీజ్! ఒక్కసారి ఆయనతో మాట్లాడి వెళ్లిపోతాను’ రెండు చేతులూ జోడిస్తూ అంది గౌతమి.
‘నువ్వు బ్లాక్ టైగర్ని ఎప్పుడైనా చూశావా?’
‘చిన్నప్పుడెప్పుడో చూశానట. కానీ మా నాన్నగారి కాయన బాగా తెలుసు’ ఉత్సాహంగా అంది గౌతమి.
‘మీ నాన్నగారికి తెలుసా?’ పెద్దగా నవ్వాడు దొర.
‘నిజం దొరా! మా నాన్నగారికి ఆయనంటే చాలా ఇష్టం కూడా. ఆయన మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. అందుకే ఆపద సమయంలో ఆయన్ని కలవాలని కొండంత ఆశతో వచ్చాను. మీరలా నవ్వకండి!’ అంది గౌతమి చిన్నబుచ్చుకుని.
‘నవ్వకేం చెయ్యను. టైగర్‌కి అడవి తప్ప ఇంకెవరూ తెలియదు. ఎవరితోనూ పరిచయాలు లేవు. అతను మీ నాన్నకి తెలియడం ఏమిటి? మర్యాదగా నినె్నవరు పంపారో చెప్పు’ అన్నాడు దొర కఠినంగా.
గౌతమికేం చెప్పాలో అర్థం కాలేదు.
‘సరే! మీకా బ్లాక్ టైగర్ తెలియదని అర్థమై పోయింది. ఇంక వస్తాను’ అంటూ విసురుగా వెనక్కి తిరిగింది.
‘ఆగు!’ అరిచినట్టు అన్నాడు దొర.
ఆమె ఆగింది.
‘ఎక్కడికెళ్తావ్? మీ ఇంటికేగా?’
‘కాదు. ఎలాగైనా బ్లాక్‌టైగర్ని కలిసే వెళ్తాను. అతనీ ప్రాంతాల్లోనే ఉంటాడని నాకు తెలుసు’ మొండిగా అంది గౌతమి.
‘అలాగా. అయితే విను. నువ్వు వెతికే బ్లాక్‌టైగర్ని నేనే..’ ఖంగుమంది దొర గొంతు.
బిత్తరపోయింది గౌతమి.
‘వచ్చిందగ్గర్నించీ ఇదే గొడవ దొరా. బ్లాక్ టైగరెక్కడుంటాడు? బ్లాక్‌టైగర్‌తో మాట్లాడాలి’ అంటూ మా మెదళ్లు తినేసింది. నువ్వేమైనా అంటావేమో అని మేం నీ గురించి చెప్పలేదు’ అన్నాడు సిద్దు. అతనే బ్లాక్ టైగర్ అని గ్రహించిన గౌతమి మొహం వెలిగిపోయింది.
‘ఓ! థాంక్యూ దొరా! ఇంత దర్జాగా, రారాజులా వున్న నిన్ను చూసినా నువ్వే బ్లాక్‌టైగర్‌వని గుర్తించలేని ఫూల్‌ని. అయామ్ సారీ! నీతో మాట్లాడాలనుకున్న నా కోరిక తీరబోతోంది’ అంది ఉత్సాహంగా.
‘నాకెవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మా వాళ్లు దారి చూపిస్తారు. మర్యాదగా వెళ్లిపో. ఇక్కడికొచ్చిన సంగతి కూడా మర్చిపో. లేకపోతే నీకే ప్రమాదం’ అంటూ లేచాడు దొర.
కంగారు పడిపోయింది గౌతమి.
‘ప్లీజ్ దొరా! ప్రామిస్! నీ గురించి గానీ, ఈ అడవిలోని సంగతులు గానీ ఎవరికీ చెప్పను. మీరు మాత్రం నా మాటలు వినాలి’ అతని కడ్డంగా వెళ్తూ అంది.
అతను చిరాకు పడిపోయాడు.
‘నా ఓపికను పరీక్షించొద్దు గౌతమీ! ఈ అడవిలో ప్రవేశించి, నన్ను చూసిన వాళ్లెవరూ తిరిగి నగరంలో కెళ్లరు. కానీ నిన్ను పంపుతున్నాను. వెళ్లిపో’ అన్నాడు.
‘అది కాదు బ్లాక్‌టైగర్...’
‘బ్లాక్ టైగర్ కాదు.. దొర అను’ అరచినట్టు అన్నాడు జీవా.
‘సారీ దొరా! నా మీద దాడి చెయ్యబోయిన పులి నించి నన్ను కాపాడింది నువ్వేనని చెప్పారు. అంటే నా ప్రాణాన్ని రెండుసార్లు కాపాడావు. అలాంటి ప్రాణదాత ప్రాణానికి హాని చేస్తానా? మీరు నాతో మాట్లాడినా అది ప్రాణం పోయినా బైట పెట్టను’ అంది గౌతమి వేడికోలుగా.
‘ఆగు! నా మాట మీద నా అనుచరులు నిన్ను కాపాడారు. కానీ రెండుసార్లు కాదు. ఒక్కసారే’ అన్నాడు దొర.
‘లేదు దొరా! నువ్వు మర్చిపోయావ్. బాగా గుర్తు తెచ్చుకో’ అందామె కాస్త ధైర్యంగా.
‘నీకీ అడవి గురించి బాగా తెలుసు కదూ?’ ఆమెనే పరిశీలనగా చూస్తూ అన్నాడు దొర.
‘నువ్వు తప్ప నాకిక్కడేం తెలియదు’
‘నేను తెలుసా?’
‘అదే మా నాన్నకి తెలుసన్నాను కదా. అదీ ఇరవై ఏళ్ల క్రితం దారి తప్పి, గాలి వానలో వెళ్తున్న మా కుటుంబం మీద పులి దాడి చేస్తే, దాని బారి నించి మమ్మల్ని కాపాడ్డమే కాక మితిమీరిన జ్వరంతో చావుబతుకుల మధ్యన కొట్టుకుంటున్న నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి పునర్జన్మ నిచ్చిన మహానుభావుడు మీరు. నాకు సరిగ్గా గుర్తు లేకపోయినా నాన్న నాకంతా చెప్పారు’ అంది గౌతమి కృతజ్ఞతగా చూస్తూ. దొర మొహంలో విపరీతమైన మార్పు వచ్చింది.
(ఇంకా ఉంది)