S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘గోరా’ బుక్ రివ్యూ తెచ్చిన తంటా!

కామరాజ నాడార్ అరవై మూడు దాకా తమిళనాడు చీఫ్ మినిస్టర్‌గా ఒక ‘దేముడే’ అన్నట్లుగా పరిపాలించాడన్నది స్థానిక జనవాక్యం. ‘కర్మవీరుడు’ అంటారు జనాలు. మద్రాసు తర్వాత పెద్ద నగరం కోయంబత్తూరే. అక్కడా తెలుగువారిదే రెండో స్థానం. మనవేపు కోయంబత్తూరు ‘హండ్రెడ్ కౌంట్’ నేత చీరలకు విపరీతమయిన గిరాకీ. ఆ ఊరికి రైల్వే ప్లాట్‌ఫాం అదనంగా అవసరం కనుక, దాన్ని నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయడంలో ఆశ్చర్యం లేదు.
మద్రాసు నుంచి వెళ్లిన ప్రెస్ పార్టీలో నేనూ వున్నాను. నాకు - ‘ఇంత మహిమ గల నాయకుడు అని చెబుతున్నారే ఈ మితభాషిణి’ అన్నది కుతూహలం. మోచేతులకు కాస్త పైదాకా వచ్చే ఖాదీ అరచేతుల చొక్కా కామరాజ్‌గారి స్పెషాలిటీ. ‘పార్క్‌లాం’ అంటే ‘చూద్దాం’ అన్నది ఆయన మంత్ర పదం’. ఏ ‘వినతి’ అయినా, ఏ సమస్య అయినా ‘చూద్దాం’ అనడమే ఆయన స్పెషాలిటీ. జనం ప్లాట్‌ఫామ్ మీద ఓ సినిమా తారని చూడవచ్చినట్లు విరగబడ్డారు. ‘పోత విగ్రహం’లాగా వుండే ఆయన అరచేతులు విస్తరాకులంత వున్నాయి చేతి లోపలి రేఖలు చిక్కగా, ముదురుగా - కత్తితో గీసినట్లు వున్నాయి. ఒకటి గమనించాను. ఆయన చేతులు బాగా పొడుగు. క్రిందికి మోకాళ్ల దాకా, ఇంకా బాగా క్రిందికే వున్నాయి! శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడు అంటే, అతనికి మోకాళ్లు దాటి చేతులు వస్తాయి’ అని మా మామ్మ అంటూ ఉండేది. ఈ ప్రజా నాయకుడు అట్లాగా, అంత అదృష్టవంతుడైనాడన్నమాట!’
అక్కడ ‘కాపీ’ చిక్కగా ఒక గ్లాసులో పోసి, దాని క్రింద ఓ చిన్న వెడల్పు డేగిశా గినె్నలో, గ్లాసుని పెట్టి ఇస్తారు. ముఖ్యమంత్రి గారికైనా అంతే - కామరాజ్‌గారు గ్లాసులో నుంచి ‘కాపీ’ని ఆ చిన్ని డబరా గినె్నలో ఇలా వొంపుకొని - అది - చల్లారేటందుకు, ఇలా గినె్నని, ద్రవం చిందకుండా, అలా ఇలా గిరగిరా త్రిప్పుకుంటూ - ‘ఇష్షు’ అని పీల్చుకుని త్రాగటం భలే దృశ్యం. ‘పోజులు’ లేవు. జనాలకి పిచ్చెత్తిపోయే పోజు ఒక్కటే. పెద్ద అరచెయ్యిని ఇలా ఎత్తి - ‘పోలామా?’ అంటూ కదులుతూ వుంటే ఆబాలగోపాలం హర్షధ్వానాలు చేయడమే!
తిరుగు ప్రయాణంలో కూడా రైల్లో మాకు అంటే పత్రికల వాళ్లకి వేరే కంపార్ట్‌మెంట్ పెట్టారు. రైల్వే తినుబండారాలు, నాన్‌రొట్టెలు, బన్‌రొట్టెలు వగైరా తెచ్చి పడేశారు. కొబ్బరి బోండాలు కూడా (లిమిటెడ్‌గా) వున్నాయి. ఈ ‘ట్రిప్’లో నన్ను దింపిన తిరుగు స్టేషన్ కొత్తగా ఉంది.
‘బాబోయ్ మద్రాసు సెంట్రల్ మారిపోయింది’ అనుకున్నాను. గానీ అది ‘ఎగ్మూర్’ స్టేషన్. అక్కడి నుంచి నా ‘నివాసం’ చేరడానికి చచ్చినంత కలగాశాను. అయితే, ఈ ‘ఎగ్మూర్’ స్టేషన్ నాకు నచ్చింది. అక్కడ ప్లాట్‌ఫామ్ మీదికే మోటారు శకటాలు నేరుగా వచ్చేస్తాయి. ప్లాట్‌ఫామ్ మీద గేటు దగ్గర టిక్కెట్లు ఇస్తారు. నేను ఈ స్టేషన్‌ని అటు తర్వాత నా ‘సుఖం కోసం’ నవలలో అతి కీలకమయిన క్లయిమాక్స్ సన్నివేశంలో వాడుకున్నాను.. భలే స్టేషన్!
కోయంబత్తూర్ స్టేషన్‌లో, ప్లాట్‌ఫామ్ మీద షోరూమూ.. చీరెలున్నాయేమో, అమ్మకి ఒకటి కొందామా? అనుకున్నాను. గానీ సిగ్గుపడ్డాను.
కామరాజ్‌గారిని అటు తర్వాత ఒకటి రెండుసార్లు చూశాను. అదే ఇంప్రెషన్ - మరపురాని విశిష్ఠ వ్యక్తి. ‘పార్కలాం’ అనేవాణ్ని, ఎవరేనా, ఏదేనా చెబితే - ‘అదే - పార్కలాం’ - అయ్యింది లే నీ పని’ అన్నాడు పి.ఎస్.గారు. ఏమిటీ? అంటే, శ్రీరాములుగారు చెప్పారు. నన్ను ఇలా వ్రేళ్లతో సంకేతించి, పిలిచి, ‘ప్రొద్దునే్న లేచే అలవాటు వుందా?’ అన్నారు. ‘లేదు’ అస్సలు లేదు. సూర్యోదయం బదులు ఆనందంగా సూర్యాస్తమయం చూడ్డమే అలవాటు. గానీ అలా చెప్పలేనుగా? అబద్ధం చెప్పాను.
‘యస్సార్!’ తలూపాను.
‘ప్రొద్దుటే ఆరున్నర ఏడు లోపున - అక్కడ మేడ దిగి ఇక్కడ ఫస్ట్ఫో్లర్ ఎక్కేయండి’ అన్నారు. అంటే, ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట దాకా ‘నాన్‌స్టాప్’ డ్యూటీ వేశారు.
పత్రిక కార్యాలయం గేటు ఇలా తీయంగానే, తిన్నగా లోపలికే దారి. ముందు ప్రాంగణం, పూల మొక్కలూ గట్రా లేవు. చోటు చాలదు. కుంభకర్ణుడు లాగా వుండేవాడు మార్నింగ్ వాచ్‌మ్యాన్ ‘కన్నన్’.
పాపం! మంచివాడు. తర్వాత్తర్వాత నాకేమయినా ఫోన్‌కాల్స్ వస్తే, అంత దూరం వచ్చి మా బిల్డింగ్‌కి మెట్లన్నీ ఎక్కి కేకేసేవాడు. అంత ఎదురుగా ఉంది ఆఫీసు నాకు. అదీ విశేషం - అదే గొప్ప చిక్కు.
పైజమాలే తప్ప ‘లుంగీ’ కానీ, పంచె గానీ నాటికీ, నేటికీ కూడా ధరించి ఎరుగను. రెండు ప్రక్కలా జేబులున్న బుష్‌షర్టు లాంటి నైట్‌షర్టు - దాని పోకెట్స్‌లో - బ్రష్షూ బినాకా పేస్టూ, రుమాలు త్రోసేసుకుని, గేటులోంచి ఆఫీస్‌లోకి దూరిపోయేవాణ్ని.
టైము కదా ముఖ్యం.
అప్పటికే టెలిప్రింటర్ రూమ్‌లో ద్రౌపదీ వస్త్రాపహరణానంతరం లాటి సీను పలకరించేది. అంటే పి.టి.ఐ. వార్తల కాగిత తోరణం అంతా ‘ఏకాండీ’ కాయితం, అలా గజాల కొద్దీ పడుండేది. దుశ్శాసనుడు ద్రౌపది గారి చీరెలన్నీ లాగి పారేసిన దృశ్యంలాగ కానవచ్చేది. ఆ తోరణాన్ని - ఆ కొసని పట్టుకుని, తోక వేపు ఎత్తి చిన్ని బల్ల మీద - అంచున పెట్టి - ‘చింపర్’తో ఫర్‌ఫర్‌న్ర చింపటం మొదటి కార్యక్రమం. అటెండర్ వచ్చాకా, వాడందుకునేవాడు ఆ పనిని. పేజీలలో నిలువుగా, కాలమ్ కాలమ్‌కీ మధ్యన యిత్తడి బద్దలు వాడుతారు. దానికి ఓ అంచు ‘దారు’గా వుంటుంది. ఆ ఇరవైఆరు అంగుళాల బారు ముక్కలో నుంచి ఓ ఏడెనిమిది అంగుళాల ముక్క కట్ చేసి తీసుకునేవాళ్లం. దాని అంచు క్రింద ‘వార్తల చీరె’ను నొక్కిపెట్టి ‘చింపేస్తాం’ కనుక దానికి నేను ‘చింపర్’ అని పేరెట్టుకున్నాను. ఈ టెలిగ్రాములను రాత్రి దాకా జరిగిన అన్ని వార్తలు క్లుప్తంగా, సంక్షిప్తంగా చిత్రంగా తెలిసేది ఆత్రంగా అవగాహనకు వచ్చేవి.
‘ఎమ్మెస్’గారు టెలిగ్రాములలో గల ఓవర్‌లాప్‌లు, జంప్‌లు గట్రా సరిచేసి - ‘లకోటా’లు బల్ల మీదికి చేర్పించేవాడు.
అప్పుడు గోవాలో పోర్చుగీసు సైన్యాల మొహరింపు - ‘బెదిరింపు’ వార్తలు వస్తూంటే నవ్వొచ్చేది. ‘ఏనుగు మీద వీధికుక్కలు వెంటబడ్డట్లు’ అని కార్టూన్ వేయిద్దాం’ అన్నాను. ‘ఊమెన్ వస్తే చెబుదాం’ అన్నారంతా. కానీ, ఈ ఊమెన్ మహాశయుడు మళయాళీ దొర బ్రిటిష్ బుట్టటోపీ ఒకటి పెట్టుకుని వచ్చేవాడు. చెవిలో మెషిన్ తీసి - తాను తెచ్చిన కార్టూన్లు అక్కడ పడేసి వెళ్లిపోయేవాడు. హాలు దాటాకా, మళ్లీ తన చెవిలో మెషి పెట్టేసుకునేవాడు.
కాకపోతే, నేను ‘వీక్లీలోకి వెళ్లినా - ‘ఊమెన్ సారుని పైకోసారి రమ్మనమను’ అని టైమ్‌కీపర్‌కి చెప్పేవాణ్ని. కూర్చునేవాడు వచ్చి. పెద్దవాడు. ‘మళయాళీ’ డైలీల్లో మంచి డిమాండ్ ఉన్నవాడు. ‘లోకం పోకడ’ అన్న మా వీక్లీ ‘పోకెట్ కార్టూన్’కి ‘నేటివ్’ ‘టచ్’ వచ్చేలాగా చూడమనేవాణ్ని. కొన్ని ఐడియాలు రాసి చూపెట్టేవాణ్ని. వాత్సల్యంగా నవ్వేవాడు. లేచి, పొట్ట మీద బెల్టు ఇలా సర్దుకుని - ఓ చేత్తో సలాం కొట్టిగుడ్‌బై చెప్పేవాడు. ఈయన చెవిటివాడు కాకపోతేనా?’ అనేవాడు మా కుట్టినాయుడు - స్టోర్‌కీపర్. ‘బ్రహ్మాండమైన బుర్ర సామీ ఈ దొరగారిది..’ అనేవాడు అటెండర్ రామారావు.
ఈ ఇద్దరూ ఓల్డెస్ట్ ఎంప్లారుూస్. రామారావు మరాఠీ వాడు. ‘అయ్యవారి’ దగ్గర ఉంటూ ‘ఇంటికాడ’ రాధాకృష్ణ సారుని, (చిన్నప్పుడు) ఎత్తుకుని ఆడించేవాడుట. వీక్లీ హాలులో బల్ల వేసుకుని దర్జాగా కూర్చొని కునుకుతూ వుండేవాడు. కుంచితపాదం (జి.ఎం) గారొస్తేనే లేచేవాడు.
దిస్ వోల్డ్ ఫెల్లోని లేపడానికి నేను రోజూ, ఈ మెట్లెక్కలేను బాబూ’ అనేవాడు. జి.ఎమ్ కూడా నవ్వుతూ.
కుట్టినాయుడు అసలు పేరు శేషశయనం - కాబోలు తనే మర్చిపోయాడు. వయస్సో? అదీ తెల్దు.
తను బెజవాడ ఆంధ్రపత్రిక చివరి దాకా వున్నాడు. తరువాత చాలాచాలా చెప్పుకుందాం ఇతని గురించి - బుర్ర నిండా జ్ఞాపకాలు వున్నవాడు కుట్టినాయుడు.
ఆంధ్రపత్రిక మార్నింగ్ షిఫ్ట్ పడ్డాకా - మధ్యాహ్నం బుక్ రివ్యూస్ చేయడానికీ, ఈవినింగ్స్ నాటకాలు చూసి వచ్చి రాయడానికీ టైముండేది.
స్వామి శివశంకర శాస్ర్తీగారు దొడ్డ మనిషి. రవీంద్రనాథ్ ఠాకూర్‌గారి ‘గోరా’ నవలని అనువాదం చేశాడు. అట్టహాసంగా వేశారు సాహిత్య అకాడెమీ వారు. అది నాకు రివ్యూకి వచ్చింది. చదవలేక ‘చచ్చా’నంటే నమ్మండి. 524 పుటల గ్రంథరాజమది. అడుగడుగునా అతి ‘కృతకమయి’న అనువాద వాక్యాలే. రివ్యూ ఫుల్ రెండు కాలమ్స్. ‘ఏకి’ పడేశాను పై నుంచి క్రింది దాకా రివ్యూల పేజీలో పడ్డది.
‘అంత పెద్ద స్వామి గారు శివశంకర శాస్ర్తీగారిని - పైగా అయ్యవారికి క్లోజ్‌ఫ్రెండుని ఇలా ‘ఏకేస్తావా’ అంటూ ఎమ్మెస్ శర్మగారు హాలులో వి.వి.ఎన్. చెవిని పడేలాగా నిష్ఠూరాలు లేవదీశాడు. చాలా కన్నింగ్ ‘ఎమ్మెస్’గారు - ఒక్కోసారి. నారదుని అవతారం ఎత్తుతాడు. పెద్ద బొజ్జవాడు.
‘గోరా బుక్ రివ్యూతో నీ పని సరి - ఇంటికే’ అన్నాడు ఈ జోక్‌ని హాలులో షేర్ చేసింది వి.వి.ఎన్. ఒక్కడే - వ్యతిరేకించింది రామ్‌ప్రసాద్...
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com