S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినోదం..వికాసం

వేసవి సెలవులొచ్చేశాయ్..
పిల్లల ఆనందానికి అంతే లేదు..
అమ్మమ్మ, తాతయ్యల గారాల ఊరు..
పిల్లకాలువల్లో ఈతలు..
ఎండిన పొలాల్లో ఆటపాటలు..
చెట్లపై ఆడే కోతికొమ్మచ్చులు..
వెనె్నల ముంగిట్లో మంచాలు..
పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం..
ఇవన్నీ ఒకప్పుడు చిన్నారుల వేసవి సెలవుల జ్ఞాపకాలు.. ఇప్పుడు కోచింగుల వేడిలో పిల్లకాలువలు ఎండిపోయాయి. వీడియో గేములతో కోతికొమ్మచ్చులు ఓడిపోయాయి. పిల్లలకు తీరికలేదని పేదరాశి పెద్దమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. కథలు కంచికి చేరాయి. ఇక చందమామ గురించి చెప్పేదెవరు? చెప్పినా వినేదెవరు? ఒకప్పుడు సెలవులంటే జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలేవి. ఇప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలకు పెద్ద ప్రమాదమే వచ్చింది. ఏటా వేసవి సెలవులొస్తున్నా- పిల్లలకు సెలవులు మాత్రం రావడం లేదు. ప్రత్యేక శిక్షణలు, కోచింగులు వారి సమయాన్ని తినేస్తున్నాయి. అందమైన బాల్యాన్ని కఠినతరం చేస్తున్నాయి. ఉరకలు వేసే ఉత్సాహం, అలసట తెలియని ఆటపాటలు, హద్దుల్లేని ఆనందం నిండిన వారి సొంత సామ్రాజ్యాన్ని దురాక్రమిస్తున్నాయి.
గతంలో పాఠశాలలకు వేసవి సెలవులివ్వగానే పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఊళ్లోనో, నానమ్మ ఊళ్లోనో వాలిపోయేవాళ్లు. అక్కడ చుట్టుపక్కల పిల్లలు, బంధువుల పిల్లలతో సరదాలు.. అమ్మమ్మ, తాతయ్యల ముద్దుమాటలు, చిరుతిళ్లు, తాటిముంజలు.. ఇలా ఆ నలభై రోజులూ ఉత్సాహంగా గడిచిపోయేది. తల్లిదండ్రుల ఆంక్షలు లేకపోవడంతో పిల్లలు ఎటువంటి ఒత్తిడీ లేకుండా అమ్మమ్మ, తాతయ్యల గారంతో, కథలతో స్వేచ్ఛగా కాలం గడిపేవాళ్లు.. ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, జీవనోపాధి కోసం పట్టణాలకు పరుగులు.. పోటీ ప్రపంచం.. ఇవన్నీ బాల్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు అమ్మమ్మ, నానమ్మలు తమ పిల్లలను సరిగా చూసుకుంటారనే నమ్మకం లేకపోవడం, పల్లెటూర్లలోని కాలువల్లో ఈత కొడితే ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ, అదే పట్టణాల్లో అయితే సమ్మర్ క్యాంపులకు పంపించవచ్చునని అనుకుంటూ పిల్లలను అమ్మమ్మలు, తాతయ్యల దగ్గరకు పంపించడం మానేస్తున్నారు నేటి తల్లిదండ్రులు. చదువులు, ఆటపాటల్లో పిల్లలు ముందుండాలన్న ఆలోచనతో వారి ఆసక్తిని, అభిరుచులను పట్టించుకోకుండా వేసవిలోనూ లేనిపోని శిక్షణలిప్పిస్తూ వారిని అందమైన ప్రపంచానికి దూరం చేస్తున్నారు నేటి అమ్మానాన్నలు. పిల్లలు కథలు చెప్పమని అడిగితే ఫోనో, ట్యాబో తీసిచ్చే తల్లిదండ్రులకు ఇప్పుడో కథ చెప్పాలి.. సారీ ఈ కథ చదవాలి.. శ్రమ అనుకోకుండా..
ఒకప్పుడు కుంతల దేశానికి రాజు విక్రమవర్మ.. ఒకరోజు రాజుగారికి ఒక సందేహం కలిగింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే అందుకు ఏర్పాట్లు చేయమని మంత్రిని ఆదేశించాడు. ఒకరోజు సమీపంలోని ఉద్యానవనానికి రాజుగారిని తీసుకువెళ్లాడు మంత్రి. మొదట ఆకులను అంటిపెట్టుకుని ఉన్న లార్వా దశను రాజుకు చూపించి, అది తొలిదశ అని చెప్పాడు మంత్రి. తరువాత ఏడు రోజులకు ఆ లార్వా దశకు చేరుకోవడాన్ని రాజు గమనించాడు. కోశస్థ దశలో గొంగళి పురుగు తన చుట్టూ ఓ కోశాన్ని (గూడు వంటిది) అల్లుకుంటుందని, మొక్కల ఆకులను గట్టిగా పట్టుదారంతో అంటిపెట్టుకుని ఈ దశలో ఉంటుందని మంత్రి వివరించాడు. కోశస్థ దశలో గొంగళి పురుగు తన చర్మం ద్వారానే శ్వాసించడాన్ని, ఆకులను తింటూ క్రమంగా పెరగడాన్ని రాజు గమ
నించాడు. మరికొద్దిరోజులకు గొంగళి పురుగు ప్యూపా దశకు చేరుకుంది. ఈ దశనే విశ్రాంతి దశ అంటారు. నాలుగోది ప్రౌఢ దశ. ఈ దశలో గొంగళి పురుగు తన చుట్టూ ఉన్న కోశాన్ని తొలగించుకుని చిన్న సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. క్రమంగా రెక్కలను విచ్చుకునే దశలో అదెంతో సంఘర్షణను అనుభవిస్తుంది. రాజును ఈ నాలుగోదశ ఎంతగానో ఆకర్షించింది. ఈ దశలోనే పురుగు కాస్తా సీతాకోక చిలుకగా ఎలా మారుతుందనేది ప్రత్యక్షంగా చూడాలని ఆయన కోరిక. కొన్ని గొంగళి పురుగులు కోశాన్ని తొలగించుకుని సీతాకోక చిలుకలుగా మారడాన్ని ఒక రోజంతా ఆయన దగ్గరుండి పరిశీలించాడు. గొంగళి పురుగు రెక్కలు తొడుక్కునేందుకు, కోశం నుండి బయట పడేందుకు పడుతున్న సంఘర్షణ.. తరువాత కొద్దిసేపటికే అది సీతాకోక చిలుకలా మారి గాల్లోకి ఎగరడాన్ని ఆయన చూడగలిగాడు.
అక్కడ ఉన్న గొంగళి పురుగుల్లో ఒక గొంగళి పురుగు కోశం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుండగా రాజు చలించిపోయి.. చిన్నపుల్ల తీసుకుని దాన్ని కోశం నుండి బయటకు వేశాడు. అలా చేయడం ద్వారా అది పడే శ్రమ తగ్గి, గాల్లోకి ఎగిరిపోవాలనేది ఆయన ఉద్దేశం. కానీ అది కోశం నుండి బయటకు తోయగానే నేరుగా కిందపడిపోయింది. కొద్దిసేపటికే దానిలో కదలిక ఆగిపోయింది. అది చూసిన మంత్రి రాజుకు ఇలా వివరించాడు..
‘గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడం అనేది ప్రకృతి సహజం. అదలా మారే దశలో ఎంతో సంఘర్షణను అనుభవిస్తుంది. ఆ ఘర్షణ నుండే అది గాల్లోకి ఎగరడానికి అవసరమైన రెక్కలను, రాపిడి వల్ల రెక్కలు విచ్చుకునే శక్తిని సంపాదించుకుంటుంది. మీరు దాన్ని ఘర్షణ నుండి బయటపడేయడం కోసం సాయం చేశానని అనుకున్నారు. కానీ ఈ చర్య వల్ల అది పూర్తిగా రెక్కలు విచ్చుకోకుండానే పడిపోయింది. ఘర్షణ లేకుండా, సహజ ధర్మానికి విరుద్ధంగా మీరు చేసిన సాయం వల్ల అది నేరుగా బయటకు వచ్చేయడం వల్ల అది సీతాకోక చిలుకలా మారే పరిణామ క్రమం ఆరంభంలోనే దాని దశను కోల్పోయింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందనేది మీరు చూడాలనుకోవడం ధర్మమే.. కానీ దాని కోశస్థ దశ నుండి మీకు మీరుగా బయటకు లాగడం మాత్రం ప్రకృతి విరుద్ధం. మీ వల్ల అది జీవితాన్ని కోల్పోయింది’ అని చెప్పాడు మంత్రి. ఇది విన్న రాజు నొచ్చుకున్నాడు.
***
ఈ కథను ఎందుకు చెప్పానంటే నేటితరం పిల్లల పరిస్థితి కూడా కథలోని గొంగళి పురుగు లానే ఉంది. పిల్లలను సహజంగా ఎదగనివ్వాలి. శక్తియుక్తులను సంపాదించుకునే నేర్పును వారికి చిన్ననాటి నుంచే అలవర్చాలి. అందుకు వారు కొంత ఘర్షణకు గురైనా.. తల్లిదండ్రులు చలించిపోకూడదు. అన్నీ అమర్చిపెట్టి, అన్నీ సమకూర్చి, నొప్పి తెలియకుండా పెంచితే రాజుగారి కథలోని గొంగళి పురుగులా పిల్లల భవిత మారుతుంది. పిల్లలకు కష్టం వస్తే పడనివ్వాలి. వెంటనే వారిని ఆదుకోకూడదు. అప్పుడే వారి మనసు, శరీరం కష్టానికి అలవాటు పడతాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు దూరంగా ఉంటూ అన్నీ గమనిస్తూ ఉండాలి. వారికి చేతకాని పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే తల్లిదండ్రులు కలుగజేసుకోవాలి. అదే ఈ కథ సారాంశం. అందుకే పిల్లలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఎదిగేందుకు వేసవి సెలవుల్లోనే శ్రీకారం చుట్టండి. మొక్కలకు సూర్యరశ్మి ఎలాగో, చిన్నారులకు వేసవి సెలవులు అలాగ.. సూర్యరశ్మి మొక్కలకు బలాన్ని, జీవాన్ని, పచ్చటి మెరుపును ఇస్తుంది. అలాగే వేసవి సెలవులు చిన్నారులకు వికాసాన్ని, వినోదాన్ని, మానసిక ఎదుగుదలను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పదినెలల పాటు స్కూలు, పుస్తకాలతో ఎడతెరిపి లేకుండా కష్టపడిన పిల్లలకు వేసవిలో ఓదార్పు కావాలి. వేసవి వినోదం ద్వారా వారి ఒత్తిడి పారిపోవాలి. మళ్లీ బడులు తెరవగానే నూతనోత్సాహంతో కొత్త తరగతుల్లోకి అడుగులు వేయాలి. అందుకే కొంతమంది పిల్లలు బడులు తెరవగానే ఏ కొత్తప్రపంచం నుంచో వచ్చినట్లు మెరిసిపోతూ కనిపిస్తారు. అదంతా.. వారికి నచ్చిన ఆటలు ఆడిన, అల్లరి చేసిన మహిమ. మరి మీరు ఈ సెలవుల్లో ఏవిధంగా మీ పిల్లలను సరదాగా సానపెట్టబోతున్నారు..?
లేలేత సూర్యకిరణాలు ముఖంపై పడుతుంటే కళ్లు నులుముకుంటూ, బద్ధకంగా ఒళ్లు విరుస్తూ నిద్రలేచే రోజులు పోయాయి. ‘స్కూల్‌కు టైమైపోతుంది.. బస్సు వస్తుంది.. లే.. లేచి త్వరగా తయారవ్వు..’ అంటూ వంటింట్లో క్యారేజీ సిద్ధం చేయడంలో నిమగ్నమైపోయిన అమ్మ అరుపులే పిల్లలకు ‘వేకప్ కాల్..’ సెలవుల్లో అలా కాకుండా పిల్లలను ముద్దుగా, గోముగా కితకితలు పెడుతూ నవ్విస్తూ నిద్రలేపండి. పిల్లలు వెంటనే టక్కుమని నిద్రలేచేస్తారు.. అదీ చాలా హుషారుగా..
విహారయాత్ర
ముందుగా పిల్లల వేసవి సెలవులు ఇవ్వగానే తల్లిదండ్రులు కూడా కొన్నిరోజులు సెలవులు పెట్టడానికి సిద్ధమైపోవాలి. పిల్లల వేసవి సెలవుల కోసం ఓ ప్రణాళిక వేసుకోవాలి.. అందులో విహారయాత్రకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు విహారయాత్రకు వెళుతున్నాం అనగానే ఎగిరి గంతులు వేస్తారు. పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలేవో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళిక వేసుకొంటే వారు చాలా సంతోషిస్తారు. వెళ్లే ప్రదేశంలోని వాతావరణాన్ని, పరిసరాల వివరాలను తెలుసుకుని అందుకు అనువైన దుస్తులను పెట్టుకోవాలి. వేసవిలో విహారం కాబట్టి కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలను తీసుకోవాలి. సాధారణ జలుబు, జ్వరం, విరేచనాలు.. వంటి వాటికి ముందుగానే మందులు తీసుకెళ్లడం మంచిది. విహారయాత్రల్లో పిల్లలకు వచ్చే సందేహాలకు ఎటువంటి విసుగూ లేకుండా సమాధానాలను ఇవ్వాలి. వారి ఉత్సుకతకు మీ విసుగును కాకుండా మీ ప్రేమను జతచేస్తే విహారయాత్ర మరింత హాయిగా ఉంటుంది.
టెక్నాలజీ
సాంకేతిక పరిజ్ఞానం రోజుకోరకంగా కొత్తపుంతలు తొక్కుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. వంటి సామాజిక వెబ్‌సైట్లలో అంతిమంగా చాటింగ్ తప్ప చిన్నారులకు మరో వినోదం ఉండదు. ఖాళీ సమయాల్లో పిల్లలు ఇంటర్నెట్‌తో గడిపే అవకాశం, ఆసక్తి ఉన్నవారికి యూ ట్యూబ్ అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతుంది. తరచి చూడాలే కానీ వీడియోల రూపంలో ఉన్న అద్భుతమైన విజ్ఞానవాహిని ఈ వెబ్‌సైట్. చిన్నారులను ఈ చానల్స్‌తో కలపగలిగితే వారు అందులో విహారం మొదలుపెడతారు. యూట్యూబ్‌లో తెలుగు పాటలు, బాలగేయాలు మొదలుకొని, డాక్యుమెంటరీల వరకు వినోద విజ్ఞాన వీడియోలు అందుబాటులో ఉంటాయి. యానిమేషన్ బొమ్మలతో రూపొందించిన వీడియోలు ఉంటాయి. ఇక ఇంగ్లీష్ రైమ్స్‌కు లెక్కేలేదు. పెద్ద పిల్లలను యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్ వాళ్ల వీడియోలు సహజంగా ఆకర్షిస్తాయి. ఇంగ్లీష్ గ్రామర్ పాఠాల వీడియోలు ఇంగ్లీష్‌పై పట్టు సాధించడానికి పనికి వస్తాయి. సమకాలీన అంశాలపై బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా యూ ట్యూబ్‌లో ఉంటాయి. చక్కటి విశే్లషణలతో ఉండే విజువలైజ్‌డ్ డాక్యుమెంటరీలను వీక్షించడం అంటే ప్రపంచాన్ని అధ్యయనం చేయడమే..
పుస్తక పఠనం
పిల్లలకు పలురకాల బొమ్మల పుస్తకాలను అందుబాటులో ఉంచితే వారికి వాటిని చూడాలన్న, చదవాలన్న కుతూహలం కలుగుతుంది. బొమ్మల్ని చూపిస్తూ కొద్దిగా కథ చెప్పి వదిలేస్తే.. ఆపై వాటిని వారే చదవడం ప్రారంభిస్తారు. కథలు, కామిక్ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి, పిల్లలకు వినిపిస్తుంటే వారిలో ఆసక్తి పెరుగుతుంది. పిల్లలు నిద్రపోయే ముందు కథలు వినేందుకు ఇష్టపడతారు. అలా కథలు చదివి వినిపిస్తూ ఉంటే, కొన్నాళ్లకు వారికి అది అలవాటైపోతుంది. ఆ తరువాత వాళ్ళే స్వయంగా చదవడం మొదలుపెడతారు. ఎదిగే పిల్లలకు ఒక్కో వయసులో ఒక్కో రకం పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలున్న కథలు పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికత, వింతలు, శాస్తవ్రేత్తలు, పరికరాలు, సాహసగాథలు.. ఇలా ఒక్కోరోజు ఒక్కో కొత్త విషయాన్ని తెలిపే పుస్తకాలను చదివించాలి. అలా చదివించి, పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. వారి మనసులకు ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధంగా ఆసక్తి కలిగించాలి. సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల తగిన విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత పెంచాలి. పాఠశాలల్లో పిల్లల కోసం లైబ్రరీ ఉంటుంది. అందులో పిల్లలకు ఉపయోగపడే ఎనె్నన్నో పుస్తకాలుంటాయి. విషయ పరిజ్ఞానాన్ని పెంచే, ప్రముఖుల ఆదర్శ జీవితగాథలను తెలిపే అటువంటి పుస్తకాలను చదివి, వారిని ఆదర్శంగా తీసుకునే పిల్లలు భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శకులవుతారు. బాలభారతం, బాలరామాయణం వంటి రంగురంగుల బొమ్మలతో ముద్రించిన పుస్తకాలు పిల్లల్లో భక్తి భావాన్ని ఏర్పరుస్తాయి. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి ఎందరో దేశభక్తులను గురించిన పుస్తకాలు చదవడం వల్ల పిల్లల మనస్సులో దేశభక్తి పటిష్టమవుతుంది. అప్పుడే దేశ పౌరులుగా వారు తమవంతు కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చగలుగుతారు. ప్రముఖుల, ప్రసిద్ధ వ్యక్తులను గురించి తెలుసుకున్నప్పుడు వారు ఆ స్థితికి చేరుకోవడానికి ఎంతగా కృషి చేసినది, ఓటమిని గెలుపుగా మార్చుకోడానికి ఎంత పట్టుదలగా వ్యవహరించి తమ గమ్యాన్ని చేరినదీ గ్రహించగలుగుతారు. అటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని, వారిని మార్గదర్శకంగా తీసుకుని ఆ స్ఫూర్తితో తాము అనుకున్నవి సాధించగలుగుతారు. తామూ ఉన్నతస్థితికి చేరుకోవాలన్న సంకల్పం, తపన వారి మనస్సులో బాల్యం నుండే ఏర్పడుతుంది. పుస్తక పఠనంతో జీవిత లక్ష్యం ఏర్పడుతుంది. తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థితికి చేరుకోవడానికి పట్టుదలగా కృషి చేయగలుగుతారు. ఒక కలం ఎంతటి బలాన్నయినా, మానసిక శక్తినయినా, ప్రోత్సాహాన్నయినా ఇవ్వగలుగుతుంది.
మర్యాద-మన్నన
ఎంత చదువుకున్నా, ఎన్ని నేర్చుకున్నా .. మర్యాద-మన్నన నేర్చుకోకపోతే కష్టమే కాదు.. నష్టం కూడా.. అలాంటివారిని సమాజం గౌరవించదు. అందుకే పిల్లలకు చిన్నప్పుడే పద్ధతులు నేర్పించాలి. ఇవి చిన్నవే అయినా పెద్ద ఫలితాన్నిస్తాయి.
* ఎవరింటికైనా వెళ్లినప్పుడు అమాంతం తలుపులు తోసుకుని వెళ్లకుండా ‘లోపలికి రావచ్చా’ అని అనుమతి తీసుకోవాలి.
* బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు దుస్తులు, పుస్తకాలు తిరిగి శుభ్రంగా సర్దుకోవడం, ఎక్కడి వస్తువులు అక్కడ ఉంచడం అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితుల ఇళ్లలోని అల్మారాలు, ర్యాక్‌లలో ఏమేమి ఉన్నాయో వెతకడం భావ్యం కాదని చెప్పాలి.
* ఇంటికి వచ్చినవారిని పలకరించి, వారికి ఏం కావాలో మర్యాదగా అడగడం నేర్పించాలి. అతిథులకు భోజనాలు వడ్డించకముందే తమకు ముందుగా పెట్టమని మారాం చేయకూడదని చెప్పాలి. అతిథిని గౌరవించడం, ఆదరించడం నేర్పాలి.
* తల్లిదండ్రుల స్నేహితులు వచ్చినప్పుడో, ఎవరినైనా పరిచయం చేసినప్పుడో వారికి నమస్కరించి, వారితో పరుషంగా, గట్టిగా కాకుండా నెమ్మదిగా, మర్యాదగా మాట్లాడటం పిల్లలకు చిన్నవయస్సు నుంచే అలవాటు చేయాలి.
* మన దగ్గర లేని పుస్తకం మరొకరి దగ్గర తీసుకుని చదవడం తప్పు కాదు. అయితే వీలైనంత త్వరగా ఆ పుస్తకాన్ని చదివి తిరిగి అదే స్థితిలో ఇవ్వడం చాలా ముఖ్యమని వారికి తెలియజేయాలి.
* అతిథులు వెళ్లేటప్పుడు గుమ్మం వరకు వచ్చి సాగనంపాలి. వీటిని చిన్నప్పుడు అలవాటు చేయకపోతే పెద్దయ్యాక ఒంటపట్టడం కష్టం.
ఆత్మీయానుబంధాలు
మేనత్త, మేనమామ పిల్లలు, బాబాయ్, పెదనాన్న పిల్లలను ఏమని పిలవాలో తెలియక పేరు పెట్టి పిలిచే తరం ఇది. అది పిల్లల తప్పు కాదు. పెద్దలదే.. అందుకే వారిని ఆయా వరుసలకి సంబంధించిన పిలుపుతోనే పిలిస్తే ఆప్యాయత పెరుగుతుంది. సెలవుల్లో మనం వారింటికి వెళ్లడం, వారిని మనింటికి ఆహ్వానించడం చేయాలి. బంధుత్వం కలకాలం నిలవాలంటే బంధువుల మధ్య చుట్టరికాన్ని మించిన స్నేహబంధం ఉండాలి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రావడంలో పిల్లల్లో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. శారీరక, మానసిక స్థైర్యం కలుగుతుంది. ఆర్థికపరమైన అసమానతలు దూరమవుతాయి. ‘వారు-నేను’ అనే తేడా తొలగిపోయి ‘మనం’ అనే భావన పెరుగుతుంది.
ఆధ్యాత్మికం
మన పురాణాలను, ఇతిహాసాలలోని ప్రతి పాత్ర కూడా పరిణతి చెందిన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తుంది. పురాణాలు చదవడం ఆధ్యాత్మిక చింతనతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవడానికి కూడా దోహదపడుతుంది. దేవతలను పూజించడం అంటే వారు ప్రదర్శించిన దైవత్వాన్ని అర్థం చేసుకోవడమే.. నిశితంగా గమనిస్తే పూజా విధానాల్లో ఉన్న ప్రతి క్రతువు వెనుక మేధోవికాస ప్రయత్నమే ఉంటుంది. రాముని పరిణతిని తెలుసుకోవడానికి రామాయణాన్ని చదివించాలి. మహాభారతంలో పాండవులు-కౌరవులు వ్యవహరించిన వ్యూహాత్మకత ద్వారా రాజనీతి తెలుస్తుంది. వీరంతా కృష్ణుడిని కొలవడం చూస్తే ఎంతటి అధికారమైనా దైవత్వం ముందు తలవంచుతుందనే సత్యం తెలుస్తుంది. ప్రతి పురాణ పాత్ర.. తల్లిదండ్రులకు బిడ్డగా, భార్యకు భర్త, పిల్లలకు తండ్రిగా, రాజుగా, గురువుగా, శిష్యునిగా.. ఇలా అనేక బంధాలను, బాంధవ్యాలను కలిగి ఉంటుంది. ఈ బంధాలను, కర్తవ్యాలను సమతూకంగా నిర్వహించాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. పరిణతి చెందిన మేధాసంపత్తితోనే అది సాధ్యం. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ అందులోని సూక్ష్మ విషయాలను వివరించాలి. అప్పుడు వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి అవసరం లేదు. మన ఇతిహాసాల్లో లేని వ్యక్తిత్వ వికాసాలా అవన్నీ..?
సేవ
‘ఇవ్వడంలో ఉన్న ఆనందం’ పిల్లలకు అనుభవంలోకి రావాలంటే ‘వాళ్లతోనే ఇప్పించాలి’. ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడికి దోసెడు బియ్యం వేయడం, ఆకలితో ఉన్న వారికి ఒక పండు ఇవ్వడం నుంచి తనకు చిన్నవైన దుస్తులను పేదపిల్లలకు ఇవ్వడం, క్లాసు అయిపోయిన పుస్తకాలను చిన్నపిల్లలకు ఇవ్వడం వంటి వాటిని చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. సెలవుల్లో ఓ రోజు అనాథాశ్రమానికి తీసుకెళ్లి అక్కడి పిల్లల అవసరాలను తెలియజేస్తే వాళ్లలో ఆలోచన మొదలవుతుంది. ఇంటికి వచ్చి తన పాత బొమ్మలు, దుస్తులను జమచేసి మరోసారి వెళ్లడానికి సిద్ధపడిపోతారు. పిల్లలు దాచుకున్న డబ్బుతో అనాథాశ్రమంలో పిల్లలకు ఒక పూట భోజనం లేదా స్వీటు అయినా ఇప్పిస్తే.. అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం అలవాటు అవుతుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడం నేర్పితే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ తమవంతు సామాజిక బాధ్యత నిర్వహించడంలో ముందుంటారు. సమాజానికి సేవచేసే రెడ్‌క్రాస్, రోటరీ క్లబ్ వంటి సంస్థల వివరాలను పరిచయం చేసి, అవి నిర్వహిస్తున్న కార్యక్రమాలను పిల్లలకు తెలియజేస్తే చాలు. అవి పిల్లల చిన్ని మెదళ్లలో నిక్షిప్తమైపోతాయి. అవసరం వచ్చినప్పుడు ‘నేనూ చేస్తాను’ అంటూ ముందడుగు వేస్తారు.
ఆటల్లో ఆనందం
సెలవుల్లో పిల్లల అల్లరికి అంతుండదు. ‘ఎంతసేపూ ఈ గోల ఏంటి? బయటికెళ్లి ఆడుకోండర్రా..’ అనే మాటలు తరచుగా కొన్ని ఇళ్లలో వినిపిస్తూ ఉంటాయి. ఆడుకోమని చెప్పి వదిలేస్తే ఎలా? వారు ఎక్కడ ఆడుకుంటారు? పల్లెటూర్లలో అయితే సరేగానీ, పట్టణాల్లో ఎలా? అందుకే వారికి నచ్చిన ఆటలో చేర్పిస్తే.. ఆటకు ఆట.. వ్యాయామానికి వ్యాయామం. పైగా ఇంట్లో టీవీలు, కంప్యూటర్లు, ఫోన్ల ముందు కూర్చునే బాధ తప్పుతుంది. నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ సమ్మర్ క్యాంపులు కాకుండా క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవిలో నామమాత్రపు ఫీజుతో ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు ముప్పైకు పైగా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయం నుండి మరిన్ని వివరాలను పొందవచ్చు. హైదరాబాద్‌లో అయితే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నలభై రకాల క్రీడాంశాల్లో వందకు పైగా మైదానాల్లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ క్యాంప్‌లు జరుగుతాయి. ఇందులో పిల్లలకు ఇష్టమైన ఆటను, అనువైన కేంద్రాన్ని ఎంచుకుని చేరవచ్చు. స్విమ్మింగ్‌కు ప్రవేశం పొందే ముందు మాత్రం తప్పనిసరిగా పరిశుభ్రత, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* పిల్లలకు మట్టితో కుండలు చేసి రంగులు వేయడం, బుట్టలు అల్లడం వంటివి చూపించి నేర్పిస్తే వారి చేతివృత్తుల వంటివి అలవాటు అవుతాయి.
* మొక్కలు నాటి నీరు పోసి పాదులు చేస్తూ పొందిగ్గా పెంచడం పిల్లలకు అలవాటు చేస్తే వారికి ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది.
* ఎప్పుడూ తల్లిదండ్రులే కథలు చెప్పడం కాకుండా పిల్లలకు కూడా పెత్తనం ఇచ్చి కథలు చెప్పడం, చెప్పించడం చేస్తుంటే వారిలో స్టేజీ ఫియర్, సిగ్గు వంటివి దూరమై ఆత్మవిశ్వాసం పెరగుతుంది.
* సంగీతం, నాట్యం.. ఇలాంటివన్నీ వారి వారి ఆసక్తి బట్టి నేర్పించవచ్చు.
* మంచి మంచి సినిమాలను ఎంపిక చేసి పిల్లలతో పాటు కూర్చుని పెద్దలు కూడా అల్లరి చేస్తూ సినిమా చూస్తూ సరదాగా గడిపితే పిల్లలకు ఎంతో ఇష్టం. పైగా ఇలా చేయడం వల్ల వారు ఒద్దిగ్గా చెప్పిన మాట వింటారు. పిల్లలకు ఏదైనా చెప్పేటప్పుడు వారిని బుజ్జగిస్తూ ఏవేవో ఉదాహరణలు చెబుతూ ఉంటారు పెద్దలు.. అంటే నానమ్మలు, అమ్మమ్మలు.. అవన్నీ తర్క విరుద్ధమైనవి అని కొట్టేస్తుంటారు నేటి ఆధునిక విద్యావంతులైన తల్లిదండ్రులు. రాకుమారుడు చిలుక కన్నులో ప్రాణాన్ని దాచాడు అంటే దాన్ని తర్కవిరుద్ధంగా భావించకూడదు. దేన్నయినా ప్రతీకగా చెప్పడం సాహిత్య లక్షణం.. వినోదంలోనూ అంతే.. పిల్లలకు చెప్పేటప్పుడు ఇలా వినోదాత్మకంగా చెబితేనే ఆ చిన్ని మెదళ్లలోకి ఎక్కుతుంది. సీరియస్‌గా పాఠాలు చెప్పినట్లు చెబితే బోర్‌గా ఫీలవుతారు. అందుకే పెద్దలు పిల్లలకు కథలు చెప్పేటప్పుడు ఆసక్తి కలిగేందుకు ఏడు తాటిచెట్ల ఎత్తుండే రాక్షసుడు అంటూ చెబుతుంటారు. అంతేకానీ అవన్నీ తర్కానికి అనువా? విరుద్ధమా? అని ఆలోచించకూడదు. ఇవన్నీ పిల్లలకు బాల్యంలో, ముఖ్యంగా వేసవిలో మనం ఇవ్వగలిగే అపురూప కానుకలు.
*

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి