S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-11

‘ఏవిటీ?’ తుళ్లిపడ్డారిద్దరు ఆటవికులు.
‘అవును. మీ టైగర్‌తో మాట్లాడాలి’ అంది గౌతమి.
‘ఓ! నువ్వు మా దొరని పట్టించడానికొచ్చావా? అనుకుంటూనే ఉన్నాను. మీ నగరవాసుల్ని నమ్మలేం. డబ్బు కోసం ఏ గడ్డయినా తింటారు’ అంటూ ఇంకా ఏదో అనబోతున్న అతన్నాపేసింది గౌతమి.
‘అపార్థం చేసుకోకండి. మీ దొర ఒకప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆయనకి నేను తెలుసు. ప్లీజ్! ఒక్కసారి టైగర్ని చూసి వెళ్లిపోతాను’ అంది గౌతమి వేడుకోలుగా.
‘అంటే నువ్వు మా టైగర్ని చూడ్డానికొచ్చావన్న మాట. అయితే పద చూపిస్తాం’ అన్నాడొకతను. ఆమె మొహం వెలిగిపోయింది. ఆ చీకట్లో, భయంకరారణ్యంలో వాళ్ల వెంట నడక సాగించింది. వాళ్లు చకచక నడుస్తున్నా గౌతమికి ఆ నడక చాలా కష్టంగా అనిపించింది. అయినా బ్లాక్ టైగర్ని కలవబోతున్నానన్న ఆనందం ఆ కష్టాన్ని మరిపిస్తోంది.
కాసేపటి తర్వాత ఓ పెద్ద కొండ దగ్గర ఆగారు.
ఆ కొండకి ఏనుగులు సైతం అవలీలగా వెళ్లగలిగేటంత మార్గం ఉంది. ఆటవికులిద్దరూ లోపలికెళ్లి ఆమెనీ పిల్చారు. ఆమె తడబడుతూ లోపలికెళ్లింది. అంతే ప్రతిమలా అయిపోయింది.
లోపలంతా కాగడా వెలుగుతో పట్టపగల్లా ఉంది. అతి పెద్దదైన ఆ గుహలో పెద్ద హాలు, హాల్లో ఓ పక్క గద్దెలాంటి ఎతె్తైన రాతి కట్టడం, హాలు చుట్టూ విశాలమైన గదులూ ఉన్నాయి. అవన్నీ చూసి కాదు గౌతమి ప్రతిమలా అయింది. గోడల నిండా పులి చర్మాలూ, దుప్పి, దున్న లాంటి జంతువుల చర్మాలు అందంగా అలంకరించి రాజదర్బారులా ఉంది.
అది బ్లాక్‌టైగర్ దర్బారు అని గ్రహించింది గౌతమి.
‘టైగరెక్కడ?’ అంది ఉత్సాహంగా చుట్టూ చూస్తూ.
‘అదిగో అటు చూడు’ వ్యంగ్యంగా అంటూ ఓ మూల గదికేసి చూపించారు ఆటవికులు. అటు చూసిన గౌతమి గుండె క్షణం ఆగింది.
‘అదేవిటి?’ అంది అప్రయత్నంగా.
‘టైగర్! టైగర్ని చూస్తానన్నావుగా?’ పెద్దగా నవ్వాడొకతను.
‘నేనడిగింది ఈ టైగర్ని గురించి కాదని మీకూ తెలుసు. నాకు మీ బ్లాక్‌టైగర్ కావాలి’ కాస్త చిరాగ్గా అంది గౌతమి.
‘ఏ బ్లాక్ టైగరు? ఇక్కడున్నది ఈ టైగరే’ నిర్లక్ష్యంగా అన్నాడొకతను. గౌతమికి నీరసం వచ్చేసింది.
‘ఆఁ! అనుకున్నాను. అప్పుడే అనుకున్నాను. నేనడగ్గానే మీతోపాటు తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను. మీరు మా బ్లాక్‌టైగర్ తాలూకు మనుషులు కాదు. అతను గానీ, అతని మనుషులు గానీ స్ర్తిలతో ఇంత అసభ్యంగా మాట్లాడరు’ కాస్త కోపంగా అంది గౌతమి.
‘నీ గురించి మాకూ తెలుసు. మా దొరని పట్టుకుంటే లక్షలో, కోట్లో ఇస్తుంది మీ ప్రభుత్వం. దానికాశపడి ఇంత తెగించి వచ్చావ్. మా దొరని వాళ్లపరం చేసి నువ్వు మేలు పొందాలనుకుంటున్నావ్. కానీ నీ ఆటలు సాగవు’ కఠినంగా అన్నాడొకతను.
‘్ఛఛ! భగవంతుడి సాక్షిగా మీ దొరకి హాని చెయ్యడానికి రాలేదు. ఓ సహాయం కోరడానికే అతన్ని వెతుక్కుంటూ ప్రాణాలకి తెగించి అడవిలో ప్రవేశించాను. అంతేకాదు.. మీ దొరకి నేనూ, మా నాన్నా కూడా తెలుసు’ అంది గౌతమి.
‘నువ్వూ, మీ నాన్నా మా దొరకి తెలుసా?’ పెద్దగా నవ్వారిద్దరూ.
‘అసలు మీ దొరంటే బ్లాక్ టైగరేనా?’ అనుమానంగా అంది గౌతమి. వాళ్లు మాట్లాడలేదు.
‘సరే.. మీ దొర ఎవరైనా ఓసారి ఆయన్ని కలిసి వెళ్లిపోతాను. దయచేసి ఈ సహాయమైనా చెయ్యండి’ అంది వేడుకోలుగా.
‘ఏం చేసినా రేపే. ఇవాళ్టికిక్కడే గడపండి. తెల్లారాక మా దొరతో మాట్లాడి చెప్తాం’ అని గుహ ద్వారానికి పెద్ద రేకు అడ్డుగా పెట్టి వెళ్లిపోయారు ఆటవికులిద్దరూ.
అయోమయంగా కూలబడిపోయింది గౌతమి.
* * *
ప్రభు, అనిల్, మరి కొందరు కలిసి అడవి పరిసరాలు అడవి మొదట్లోనూ వెతికారు. కానీ గౌతమి గురించి ఏం తెలీలేదు.
‘్ఛ! గౌతమి పిచ్చిపని చేసింది’ గొణుక్కుంటూనే ఉన్నాడు అనిల్.
ప్రభు అడవిలో మరి కాస్త దూరం వెళ్దామన్నాడు గానీ అనిల్ ఒప్పుకోలేదు. అదెంత భయంకరమైన అడవో వర్ణిచి మరీ చెప్పాడు.
‘అవన్నీ తెలుసు కాబట్టే నేనింత భయపడుతున్నాను. మనం గౌతమిగారిని కాపాడాలి’ అన్నాడు ప్రభు.
అనిల్ ఆలోచనలో పడ్డాడు. గౌతమిని గురించి ప్రభు అంత తాపత్రయ పడ్డం కూడా నచ్చలేదతనికి.
‘ఏవిటి మిస్టర్ అనిల్. అంత ఆలోచిస్తున్నారు? ఆడపిల్ల, తెలిసీ తెలియకుండా భయంకారణ్యంలో చిక్కుకుపోయింది. అదీ మీక్కాబోయే భార్య. మీరు గాఢంగా ప్రేమించిన యువతి. తన కోసం రిస్క్ తీసుకోలేరా?’ అన్నాడు ప్రభు కాస్త సీరియస్‌గానే.
అతనంత సీరియస్‌గా అన్నా అనిల్‌కి కోపం రాలేదు. సరికదా మొహంలోకి వెలుగొచ్చింది.
‘నిజమే మిస్టర్ ప్రభూ! గౌతమి నా ప్రాణం. తనకీ నేనంటే ప్రాణం. ఎలాగైనా గౌతమిని రక్షిద్దాం’ అన్నాడు ఉద్వేగంగా.
గౌతమి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వెనుదిరగి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
అనిల్ మాట వరసకి అన్నా అతనికి అడవిలోకి వెళ్లే ధైర్యం లేదని అతని కర్థం అయిపోయింది.
అతను ఆలోచిస్తుండగానే చంద్ర పిలవడంతో కంగారుగా వెళ్లి విషయం చెప్పాడు.
‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి. ఆ తలుపులు వేసిరా!’ గంభీరంగా అన్నాడు చంద్ర. అయోమయంగా తలుపేసి వచ్చాడు ప్రభు.
‘ఇప్పుడు చెప్పు? ఏమిటి నీ బాధ?’ అతని పక్కనే కూర్చుంటూ అనునయంగా అన్నాడు చంద్ర.
‘బాధా? బాధేంటి సర్?’
‘ప్రభూ! రకరకాల సమస్యలతో సతమతమై పోతున్న నేను నీ ధోరణి చూసి మరింత బాధపడుతున్నాను. కాస్సేపు నేను సి.ఎం. నన్న సంగతి మర్చిపోయి, పాతనేస్తం అనుకుని చెప్పు. నువ్వు సర్వం కోల్పోయిన విరాగిలా అయిపోతున్నావ్? ఆ ‘క్లూ’ గురించిన ఆలోచనలతో ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నా వనిపిస్తోంది. చెప్పు! నీ మనసులో ఏం ఉంది?’ నిలదీసినట్టు అన్నాడు చంద్ర.
‘ఏం చెప్పను చంద్రా! నేనో విషమ పరిస్థితిలో చిక్కుకున్నాను?’ భారంగా అన్నాడు ప్రభు.
‘ఏవిటా విషమ పరిస్థితి? ఆ ‘క్లూ’యేగా?’
‘...’
‘ఒక్కటి చెప్పు? ఒకవైపు ‘క్లూ’ గానూ, మరోవైపు గౌతమిగానూ యాక్ట్ చేసి మనల్ని దారుణంగా మోసం చేసింది. వాడెవర్నో ప్రేమిస్తూనే నీకు ఫోన్లు చేసి పబ్బం గడుపుకుంది. ఇంత చేసిన మనకి మాట మాత్రం చెప్పకుండా, అడవిలో కెళ్తుందా? అంటే తనే ఆ బ్లాక్ టైగర్ నించి నగలు తెచ్చి, మనల్ని ఫూల్స్ చెయ్యాలని ప్రయత్నిస్తోంది. అలాంటి దాని కోసమా, నన్ను కూడా పట్టించుకోకుండా రోడ్లు పట్టి తిరుగుతున్నావ్?’ అన్నాడు చంద్ర గంభీరంగా.
‘నువ్వు అపార్థం చేసుకున్నావ్ చంద్రా! గౌతమి మనసు చాలా మంచిది. మనమంటే.. ముఖ్యంగా, నువ్వంటే అంతులేని గౌరవ మర్యాదలున్నాయి. ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. రోజుకి రెండు మూడుసార్లయినా ‘మన సి.ఎం. లాంటి సి.ఎం.లు అంతటా వుంటే మన దేశం ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది’ అని అంటూంటుంది’ అంటూ మరి కొన్ని విషయాలు చెప్పాడు ప్రభు. చంద్ర పొగడ్తలకి పొంగిపోయేవాడు కాడు. కానీ ప్రభు చెప్పిన కొన్ని విషయాలు విన్నాక అతనిక్కాస్త ఉత్సాహం వచ్చింది. గౌతమి మీద అభిమానం ఏర్పడింది. నిజానికి ఆమె మీద అతనికి సదభిప్రాయమే తప్ప దురభిప్రాయం ఏం లేదు. కానీ ప్రభు ధోరణి గమనించాక అతని మనసుని డైవర్ట్ చెయ్యాలని కాస్త దురుసుగా మాట్లాడాడు. స్ర్తిలని గౌరవించడం, ధైర్య సాహసాలు చూపించే స్ర్తిలని అభినందించడం చంద్రకి మొదట్నుంచి అలవాటే. అంతేకాదు. స్ర్తిలకి రక్షణ కల్పించడంలో చంద్రకి సాటి ఎవరూ రారు’ అని స్ర్తిలు గర్వంగా చెప్పుకుంటారు కూడా. అతను మాటల మనిషి కాదు. చేతల మనిషి’ అని ప్రతిపక్షాల వారు సైతం గొణుక్కుంటూ ఉంటారు.
గౌతమిని గురించి విన్న దగ్గర్నించీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య విదేశీయ పాలకుల్ని ఆహ్వానించి సత్సంబంధాలు ఏర్పరచుకుని ఎన్నో పథకాలకి పునాదులు వేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు. ఆ ఆనందంలో వుండగానే కొండమీది చోరీ అతని నెత్తిన పిడుగు పడేలా చేసింది. అందుకే ప్రతి చిన్న విషయానికీ తుళ్లి పడుతున్నాడు. దానికి తోడు తనకి ప్రాణ స్నేహితుడైన ప్రభు దిగులుగానూ, మూడీగానూ ఉండడం అతన్ని మరింత బాధించింది. ఎలాగైనా అతనిలోని ఆరాటాన్ని తెలుసుకోవాలనే నిర్ణయించుకున్నాడు.
‘ఏవిటి చంద్రా? సైలెంటై పోయావ్? నా మాట నమ్మడం లేదు కదూ?’ అన్నాడు ప్రభు బేలగా.
‘నమ్మకం లేక కాదు ప్రభూ! నువ్వే నాకర్థం కావడంలేదు. నువ్వు నోరు విప్పి చెప్పకపోయినా ఆ గౌతమి అంటే నీకిష్టం అని గ్రహించాను. పెళ్లికి దూరంగా వున్న నువ్వు పెళ్లికి సుముఖంగా వున్నావంటే అంతకన్నా నాకు ఆనందం ఏం ఉంటుంది? కానీ ఆ పిల్ల ఎవర్నో ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుంది. అలాంటి పిల్ల మీద మనసు పారేసుకుని ఆమెనే తల్చుకుంటూ ఇలా దిగులుగా ఉండటమే నాకు బాధగా ఉంది’ అన్నాడు చంద్ర బాధగా.
భారంగా నవ్వాడు ప్రభు.
‘్ఛ! ఇంత ఉత్సాహంగా ఉంటే దిగులుగా వున్నానంటావేంటి? ఇంక ఆ గొడవ వదిలెయ్. గౌతమి అంటే నాకిష్టం. నేనంటే తనకభిమానం. అది చాలు. నా కోసం నువ్వో ఫేవర్ చేయగలవా?’ అన్నాడు వేడికోలుగా.
‘్ఛ! అవేం మాటల్రా? ఇప్పుడు మనం సి.ఎం. పి.ఏ.లం కాదు. ప్రాణ స్నేహితులం చెప్పు. ఏం చెయ్యాలి? మీ గౌతమిని వెతికించాలా?’ నవ్వుతూ అన్నాడు చంద్ర.
‘అవును. ఎలాగైనా ఆమెని కాపాడాలి. ఆ శంకరయ్య గారిని నిర్దోషిగా నిరూపించాలి. అందరూ ఆయన్ని దొంగలా చూస్తున్నారు. ఆ బాధతోనే తండ్రిని నిర్దోషిగా నిరూపించాలని గౌతమి అంత సాహసం చేసింది. రేపు నగలు దొరికితే ఎలాగూ నిర్దోషి అని తెలిసిపోతుంది. అందుకే ఈ దోపిడీలోగానీ, నగలతో గానీ ఆయనకెలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన ఇప్పించాలి. ఆయన మనసూ కుదుటపడుతుంది’ అన్నాడు ప్రభు ఉత్సాహంగా.
చంద్ర మొహం గంభీరంగా అయిపోయింది.
‘అదెలా ప్రభూ! ఆ పంతులుగారు తను నేరం చేసినట్టు స్వయంగా ఒప్పుకున్నాడు. కారణం ఏదైనా అమ్మవారి నగలు రహస్యంగా తీసి దాచారు. ఆ నగలు, దోపిడీలో పోయిన నగలు దొరికితేగానీ ఆయన నిర్దోషిగా ప్రకటించలేం’ అన్నాడు సున్నితంగానే.
ప్రభు మొహం వెలవెలబోయింది.
‘అంటే.. పంతులుగారు ‘దోషి’ అని నువ్వు కూడా అనుకుంటున్నావా?’ అన్నాడు బాధగా.
‘నేనేమనుకుంటున్నానన్నది కాదు ముఖ్యం. ఆ పంతులుగారే చెప్పారు ఆలయంలో వున్న విలువైన నగలు తీసి ఎక్కడో దాచానని. అది తెలిసి నిలదీస్తే అవి పోయాయన్నాడు. ఆయన చెప్పింది నిజమే కావచ్చు. కానీ అదే పరిస్థితి మరొకళ్లకొస్తే, క్షమించి వదిలేస్తామా? అయినా రేపు అసలు దొంగలు దొరికితే ఆయన నిర్దోషి అని తేలిపోతుంది. డోంట్‌వర్రీ’ నవ్వుతూనే అన్నాడు చంద్ర. అంతే! గభాల్న లేచాడు ప్రభు.
‘ఏవిటి ప్రభూ! లేచావేం. ఇంకా నీతో చాలా విషయాలు మాట్లాడాలి’ అన్నాడు చంద్ర.
‘్థంక్స్ చంద్రా! ఏనాడూ నోరు తెరిచి ఇది కావాలి అని నేను అడగలేదు. ఇవాళ, కొండంత అపవాదు నెత్తినపడి, వున్న ఒక్క కూతురూ అంతర్థానమై దయనీయంగా హాస్పిటల్లో పడున్న ఆ పంతులుగారిని చూడలేక నిన్నీ సహాయం కోరాను. కానీ నువ్వు అతి నీతిపరుడిగా పేరు తెచ్చుకున్న సి.ఎం.వనీ, అయిన వాళ్లని సైతం బైటి వాళ్లలాగే చూసే మహాత్ముడివనీ మర్చిపోయి నీ సహాయం కోరాను. నన్ను క్షమించు’ అన్నాడు ప్రభు ఎర్రబడ్డ మొహం పక్కకి తిప్పుకుంటూ.
‘చిన్నతనం నించీ నాతో తిరిగిన వాడివి. నేనేమిటో, నా స్వభావం ఏవిటో నాకన్నా కూడా నీకే బాగా తెలుసు. అలాంటిది ఈ చిన్న విషయంలో అంత సీరియస్ అయిపోవడమే ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడు చంద్ర అనునయంగా.
అయితే ప్రభు చల్లబడలేదు.
‘ఇది చిన్న విషయమా? ఆ పంతులుగారు, ఆ జహ్వారీని భద్రపరచడానికే ప్రయత్నించాడు. నిజంగానే వాళ్లు నగలని దొంగిలించాలనుకున్న వాళ్లు ఇన్నాళ్లూ ఎందుకు అంత పవిత్రంగా నిజాయితీగా ఎలా ఉండగలరు? ఒకవేళ కొత్తగా దురాశ కలిగి తీశారనే అనుకుందాం. అలాంటప్పుడు వాటిని తెగనమ్మి సొమ్ము చేసుకుంటారు గానీ ప్రాణాలకి తెగించి ఆ భయంకరారణ్యంలోకి పడిపోతుందా?’ అన్నాడు తీక్షణంగా.
‘నువ్వన్న మాటలు నిజమే కావచ్చు కానీ విషయం బైటికొస్తే మనకెంత చెడ్డపేరు? నువ్వో ఐఎఎస్ ఆఫీసర్‌వి. ఇవన్నీ నీకు తెలియనివి కాదు. ఆ గౌతమి మీదున్న అభిమానం కొద్దీ దూరం ఆలోచించకుండా అన్నావేగానీ, లేకపోతే నీకూ ఈ ఆలోచన వచ్చేది కాదు. కూర్చుని శాంతంగా ఆలోచించు. న్యాయం ఏదో నీకే అర్థమవుతుంది’ అన్నాడు చంద్ర.
ప్రభు కూర్చోలేదు.
‘అబ్బబ్బ! ప్రభూ! ఇంక అలకమాని కూర్చో. ఈ కాస్సేపే మనం ఫ్రెండ్స్‌లా హాయిగా మాట్లాడుకునేది, ఈ కాస్సేపైనా నా ప్రభులాగే నవ్వుతూ కబుర్లు చెప్పు’ అన్నాడు చంద్ర.
‘నవ్వుతూ మాట్లాడ్డం సంగతేమోగానీ, ఇంకనించీ నిన్ను ఫ్రెండ్‌గానే - అంటే పి.ఏ.లా కాకుండా పేరు పెట్టి పిలుస్తాను. వీలున్నప్పుడు వచ్చి చూసి పోతుంటాను. ఇన్నాళ్లు నాకు మంచి పదవి ఇచ్చి ప్రేమాభిమానాలతో చూసినందుకు థాంక్స్!’ అన్నాడు ప్రభు గంభీరంగా.
‘నాకర్థం కావడంలేదు’
‘నేనీ జాబ్ వదిలేస్తున్నాను’
‘వ్వాట్?’ అదిరిపడ్డాడు చంద్ర.
‘అవును చంద్రా! ఇంక నీ దగ్గర పనిచెయ్యలేను. ఐఎఎస్ చదివిన వాడిని. పొట్ట పోసుకోవడానికి ఏ చిన్న ఉద్యోగమైనా దొరక్కపోదు’ ప్రభు గొంతు వణికింది.
ఆ మాటలకి చంద్రకి కోపం రాలేదు. సరికదా ఆ మాటలు లోకజ్ఞానం లేని పసివాడు అలిగి మాట్లాడినట్టు అనిపించిందతనికి.
‘ఏవిటి. కొంపతీసి ఆ గౌతమి కోసం సింగపడవికి వెళ్తావా? అన్నట్టు అక్కడికెళ్తే ఆ బ్లాక్‌టైగర్ అనే వాడుంటే నేనడిగానని చెప్పు’ అన్నాడు అల్లరిగా.
ప్రభు మొహం మరింత సీరియస్‌గా అయిపోయింది.
‘చంద్రా! నా మాటలు, నేను పడే బాధ నీకు నవ్వు తెప్పిస్తోందా?’ అన్నాడు విసురుగా.
‘నవ్వకేం చెయ్యను ప్రభూ! నీ మాటలు పసిపిల్లాడి మాటల్లా వున్నాయే తప్ప, ఓ మేధావి వర్గానికి చెందిన ఐఎఎస్ ఆఫీసర్ మాటల్లా లేవు. నా పి.ఏ.గా మరింత పేరు తెచ్చుకున్న ఘనుడివి. ఆడపిల్లలకేసి కనె్నత్తయినా చూడని శ్రీరామచంద్రుడివి. ఓ ఆడపిల్ల కోసం.. అదీ నిన్ను ప్రేమించని ఆమె కోసం. ధర్మం తప్పమనడమే కాక, ప్రాణ స్నేహితుణ్నయినా ఆమె కోసం వదులుకోవాలనుకుంటానంటే నవ్వకేం చెయ్యను?
నీ మనసులో నాకే మాత్రం స్థానం లేదనుకుంటే నిజంగానే నాకన్నా ఆమే నీకెక్కువ అనిపిస్తే, నీ ఇష్టప్రకారం చేసుకోవచ్చు’ ఎందుకో చంద్ర గొంతు వణికింది.
అప్పటిగ్గానీ అర్థం కాలేదు ప్రభుకి. చంద్రతో తనెంత దురుసుగా మాట్లాడాడో. దుఃఖం కూడా వచ్చేసింది. చంద్ర కాళ్ల దగ్గర కూలబడి -
‘సారీ చంద్రా! నా మనసు బావుండక ఏదేదో వాగేశాను. సారీ..’ అన్నాడు దీనంగా.
‘అయితే ఇంక నన్నొదిలిపోవుగా’ నవ్వుతూ అన్నాడు చంద్ర.
‘నేనెక్కడికి పోతాను చంద్రా! నిన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలనా?’ అతనికి దుఃఖం వచ్చేసింది.
‘సరిసరి! ఇక నార్మల్ స్టేజ్‌కొచ్చెయ్యి. వెంటనే ఆ గౌతమి కోసం వేగులని పంపి వెతికించాలి. అంతేగా? ఓకే’ అన్నాడు చంద్ర నవ్వుతూ.
ప్రభు మొహం వెలిగిపోయింది. అతని చేతులు పట్టుకుని ఎన్నో విధాలుగా క్షమాపణలు చెప్పుకున్నాడు.
‘సరే. మనలో మనకి క్షమాపణ లేమిటి? అడవిలోకి వెళ్లడానికి సమర్థులైన వాళ్లని గాలిద్దాం’ అన్నాడు చంద్ర.
‘దానికి సమర్థుడైనవాడు మన ఐ.జి. విజయనాయక్ చంద్రా!’ ఉత్సాహంగా అన్నాడు ప్రభు.
‘విజయ నాయక్?’
‘అవును చంద్రా! అతనికి అడవుల గురించి బాగా తెలుసు. సింగపడవి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగినవాడు. అతను కచ్చితంగా గౌతమినీ, నగలనీ కూడా తీసుకురాగలడు’
‘నిజమే! ఆ రూట్‌లోకెళ్లి చూద్దాం. కానీ, ఆ గౌతమి వచ్చి, అనిల్‌ని పెళ్లి చేసుకోగానే నువ్వు దేవదాసువై పోనని నాకు మాటివ్వాలి’ ఓరగా చూస్తూ అన్నాడు చంద్ర.
‘పో చంద్రా! పెళ్లైన ఆడపిల్లని గురించి ఆలోచించేటంత దుర్మార్గుడు కాదు నీ ఫ్రెండ్’ అన్నాడు ప్రభు సిగ్గుగా.
తర్వాత కాస్సేపు మిగతా విషయాల గురించి చర్చించుకున్నారిద్దరూ. తర్వాత బైటికొచ్చేసరికి లూసీ దగ్గర్నించి ఫోన్ వచ్చింది.
అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చిందతనికి లూసీ ఇచ్చిన కవరు సంగతి. తనని తాను తిట్టుకుంటూ గబగబా కవర్‌లోని లెటర్ చదివి-
‘హలో లూసీ!’ అన్నాడు ఉద్వేగంగా.
‘గౌతమిగారు కనిపించారా?’
‘లేదు’ దిగులుగా అన్నాడు ప్రభు.
‘ఆమె మీకు రాసిన లెటర్ చదివారా?’ గొంతు తగ్గించి మెల్లగా అంది లూసీ.
అసలే ఎర్రబడిన అతని మొహం మరింత ఎర్రబడింది.
‘చదివాను’ అన్నాడు ఆవేశంగా.
‘ఏం చేద్దామనుకుంటున్నారు?’
‘ఆ రాస్కెల్‌ని మూయించెయ్యాలను కుంటున్నాను’
‘వద్దు’ కంగారుగా అందామె.
‘అదేవిటి?’
‘తొందరపడొద్దు. త్వరలో డొంకంతా కదలబోతోంది’
‘ఏవిటి మీరనేది? డొంకేవిటి? కదలడమేమిటి?’ విస్మయంగా అన్నాడతను.
‘ఇంకా మీకర్థం కాలేదా? ఓకే! ఇప్పుడు మీకో గుడ్‌న్యూస్ చెప్పడానికే ఫోన్ చేశాను’ ఉత్సాహంగా అంది లూసీ.
‘చెప్పండి’ అన్నాడు ప్రభు ఉద్వేగంగా.
లూసీ రహస్యంగా ఏదో చెప్పింది. అతని కళ్లు తళుక్కుమన్నాయి. ఉత్సాహంగా ఆమెకి థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసి, ఆనందంగా విజిల్ వేసుకుంటూ బైటికొచ్చాడు.
* * *
సి.ఎం. దగ్గర్నించి కబురు రావడంతో కంగారుగా వెళ్లాడు విజయ నాయక్.
సి.ఎం. చంద్ర బిల్డింగ్ చాలా పెద్దది. అతను స్వతహాగా స్థితిపరుడు. కేవలం ప్రజాసేవని దృష్టిలో ఉంచుకునే రాజకీయాల్లో ప్రవేశించి అనతికాలంలోనే మంచి పేరు, సి.ఎం. పదవి సంపాదించుకున్నాడు. విజయ నాయక్ వెళ్లేసరికి చంద్ర పర్సనల్ రూమ్‌లో అతను, ప్రభు మాత్రమే ఉన్నారు. నాయక్ విష్ చెయ్యగానే-
‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా’ అన్నాడు చంద్ర. అతని సభ్యత అలాంటిది మరి!
‘నో! నాటెటాల్! చెప్పండి సర్’ అన్నాడు నాయక్.
ప్రభు తలుపులు మూసి లాక్ చేశాడు.
‘చెప్పండి’ అన్నట్టు చంద్రకేసి చూశాడు ప్రభు.
‘మరేం లేదు మిస్టర్ నాయక్! సింగపడవి దగ్గర అమ్మవారి ఆలయంలో జరిగిన దోపిడీ, హత్యల గురించీ మీకు తెలుసుగా?’ మెల్లగా అన్నాడు చంద్ర.
‘అది తెలియక పోవడం ఏమిటి సార్? ఆ విషయం విదేశాలక్కూడా పాకిపోయింది. అదీగాక దానికి సంబంధించిన ఒకతని మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందిగా. అదృష్టవశాత్తూ అతను పోలేదు’ తృప్తిగా అన్నాడు నాయక్.
‘కానీ వాటి తాలూకు ఆచూకీ ఏ మాత్రం తెలియలేదు’
‘కానీ వీటన్నింటికీ కారకుడు ఆలయ పూజారి అని విన్నాను’
‘ఉహు! ఆయన కాదు దొంగ’ గభాల్న అన్నాడు ప్రభు.
‘మరి ఆయన కూతురా?’
‘నోనో’
‘అయితే అందరూ అనుకున్నట్టు ఆ బ్లాక్ టైగర్ పనే అనుకోవాలి. కానీ వాణ్ని పట్టుకోవడం కష్టమే’ అన్నాడు నాయక్ తననెందుకు పిల్చారా అని ఆలోచిస్తూనే.

-రావినూతల సువర్నాకన్నన్