S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేసవిలో ‘వసంతం’!

రుతురాగాల వేళ మేఘసందేశాలు..
నింగిలో తేలిపోయే మబ్బులు..
పాదం పడగానే పదం పలికే ఎండుటాకులు..
గలగల గమకాల పిల్లకాలువలు..
జలజలాపారే జలపాతాల ఝంకారాలు..
అడుగులను అచ్చువేసే పచ్చని తివాచీలు..
నిశ్శబ్ద ప్రకృతిలో మన ఉఛ్వాస, నిశ్వాస లయలతో
మమేకమైన కోయిల రాగాలు..
ఆగి ఆగి చెంపలను ముద్దాడే
అల్లరి పిల్లగాలుల హొయలు..
శరీరాన్ని హత్తుకుని గిలిగింతలు పెడుతూ
నెమ్మదిగా నింగిలోకి తేలిపోయే మబ్బులు..
గువ్వపిల్లల కువకువలు..
చెకుముకి పిట్ట అరుపులు..
వీటితోపాటు ఔషధ మూలికలతో కలిసిన
మట్టివాసన మనసును తాకుతుంటే...
ఇంతకు మించిన స్వర్గం మరోటి ఉంటుందా..?
అని అనుకుంటుందీ జన్మ!
అలా అలా అప్పుడప్పుడూ ఈ
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనం నుండి
కాస్తంత సమయం వనదేవత ఒడిలో సేదతీరితే చాలు..
శరీరం, మనస్సు, ఆత్మ.. మరింత ఉత్సాహంగా పనులు చేయడానికి సిద్ధమైపోతాయి. సూరీడు మండుతున్నా.. ఎండకనె్నరని, వడగాలి విసుర్లు లేని కొండప్రాంతాల్లో వనవిహారం చేస్తూ వేసవికాలాన్ని, శీతాకాలంగా మలచుకుంటూ.. పచ్చందనమే.. పచ్చదనమే.. అనుకుంటూ ప్రకృతి ఒడిలో అభ్యంగన స్నానమాచరించేద్దాం! వేలాది జ్ఞాపకాలను ప్రోది చేసుకుందాం.. ఇందుకోసం మనం బోలెడు డబ్బులు ఖర్చుపెట్టి కాశ్మీరానికో, హిమాలయాలకో వెళ్లక్కరలేదు. మన దక్షిణ భారతదేశంలోనే వేసవికాల విడిదులైన హిల్ స్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌తో సామాన్యుడు సైతం ప్రకృతి ఒడిలో సేదతీరేలా చేసే వేసవి విడిదులేవో.. ఎక్కడెక్కడున్నాయో ఒకసారి చూసేద్దామా..!
తమిళనాడు పర్యాటక రంగం ప్రకృతి దృశ్యాలతో, అక్కడి సంస్కృతి-సంప్రదాయాలతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తమిళనాడులో హిల్ స్టేషన్స్ కూడా ఎక్కువే.. ఊటీ, కొడైకెనాల్, ఎలగిరి, కూనూర్, నీలగిరి.. ఇలా ఎన్నో.. ఇవన్నీ మనోహరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
*
ఊటీ
అరుదైన వృక్షజాతులతో, మేనిని తాకే మబ్బులతో, సన్నజాజి పొదలతో, చల్లని గాలులతో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంకీ ఫజిల్ ట్రీ అనే ఒకరకమైన చెట్లను కోతులు కూడా ఎక్కలేవు. ఇటాలియన్ ఫ్లవర్ గార్డెన్‌లో అనేక రకాల ఆర్కిడ్‌లు, పూ పొదలు కనువిందు చేస్తాయి. ప్రతి సంవత్సరం మేనెలలో అరుదైన పూలతో ఇక్కడ ‘్ఫ్లవర్ షో’ జరుగుతుంది. ఇక్కడ వేసవిలో కూడా పగటి ఉష్ణోగ్రత పది నుండి పాతిక డిగ్రీలకు మించదు. చలికాలంలో ఐదు డిగ్రీల నుండి 21 డిగ్రీలు ఉంటుంది. తోడాలు అనే స్థానిక గిరిజనుల నివాస ప్రాంతం ఇది. బ్రిటీష్ వారి కాలంలో ఊటీ ప్రాంతానికి మొట్టమొదటిసారి రైలు మార్గాన్ని వేశారు. ఊటిలో కూనూరు, కొత్తగిరి అనే మరో రెండు హిల్ స్టేషన్స్ ఉన్నాయి. పర్యటనకు సాధారణంగా ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. స్థానికంగా తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్, బాడగ భాషలను ఇక్కడి ప్రజలు మాట్లాడతారు.
చూడాల్సిన ప్రదేశాలు
* లోయర్ గార్డెన్
* న్యూ గార్డెన్
* ఇటాలియన్ గార్డెన్
* కన్సర్ వేటరీ
* ఫౌంటెన్ టెర్రస్
* నర్సరీ
* ఊటీ లేక్
* మ్యూజియం
ఇలా వెళ్ళాలి..
హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు విమానం ద్వారా ప్రయాణం చేయవచ్చు. కోయంబత్తూర్ నుండి మెట్టుపాలెం, అక్కడి నుంచి ఊటీకి రైలు మార్గం ద్వారా వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి రైలు మార్గం ద్వారా కూడా వెళ్లవచ్చు. చెన్నైకి చేరుకుంటే అక్కడి నుండి అనేక ప్రాంతాల నుండి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు.
*
ఏలగిరి
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం ఏలగిరి. ఇది పర్యాటకుల స్వర్గ్ధామం. పూర్వం ఈ ప్రాంతం అంతా ఏలగిరి జమీందార్లది. ఇప్పటికీ రెడ్డియూర్‌లో వాళ్ల ఇల్లు ఉంది. 1950లలో ఏలగిరి భారత సంస్థానంలో విలీనమైంది. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తున ఉన్న ఏలగిరి- గిరిజనులు నివసించే 14 గ్రామాల సమూహం. వివిధ గిరిజన తెగలు ఉండే ఏలగిరి, ఊటీ, కొడైకెనాల్ వంటి ఇతర పర్వత కేంద్రాల్లా అభివృద్ధి చెందలేదు. అయితే ఇటీవలే ఏలగిరి జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో పారా గ్లైడింగ్, పర్వతారోహణం లాంటి సాహస క్రీడలను అభివృద్ధి చేసింది. ఏలగిరిలో ప్రవేశించగానే నిశ్శబ్దమైన, ప్రశాంతమైన పరిసరాలు, పచ్చటి లోయలు, గులాబీ తోటలు, చల్లటి గాలులు, పళ్ళ తోటలు, తాజా పళ్ళ ఘుమఘుమలు.. ఇలా మేనంతా ఒకవిధమైన పరవశంతో నిండిపోతుంది. ఈ మైదానాల గుండా ప్రయాణించడం గొప్ప అనుభూతి.
సాహసాన్ని ఇష్టపడేవారు ఏలగిరి కొండలకు తప్పకుండా వస్తారు. ఇటీవల దీన్ని మహారాష్టల్రోని పంచగని తరువాత రెండో ఉత్తమ సహజ క్రీడా ప్రాంతంగా గుర్తించారు. ఏలగిరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అన్ని వయసుల వారికి ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ బోట్ షికార్ చేస్తూ చుట్టూ ఉన్న అందమైన పచ్చటి ప్రకృతిని తిలకించవచ్చు. పచ్చదనాన్ని కొండపై నుంచి చూడవచ్చు. ఇక్కడ టెలీస్కోప్ ద్వారా గ్రామీణ అందాలను వీక్షించవచ్చు. నిలవూర్ సరస్సు బోటింగ్ చేయదగ్గ ప్రాంతాల్లో ఒకటి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుండి 34 డిగ్రీల మధ్య ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 11 నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో దీన్ని సందర్శించడం ఉత్తమం.
చూడాల్సిన ప్రదేశాలు
* వేలవన్ దేవాలయం
* స్వామిమలై కొండ
* గులాబీ తోట
* పళ్ళ తోటలు
* సౌర పరిశోధనాసంస్థ
ఇలా వెళ్ళాలి..
బెంగళూరు విమానాశ్రయానికి ఏలగిరి చాలా దగ్గర. బెంగళూరు విమానాశ్రయం నుండి అద్దె క్యాబ్‌ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. తమిళనాడులోని పొంనేరి నుండి ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చెన్నై, సాలెం, హోసూర్, బెంగళూర్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏలగిరికి రైలులో లేదా సొంత వాహనాల్లో వెళ్లటం మంచిది.
*
కోటగిరి
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో కల కోటగిరి పెద్ద హిల్‌స్టేషన్. దీనిని కూనూర్, ఊటీ స్టేషన్‌లతో సమానంగా చెప్పవచ్చు. ఈ మూడింటిలో ఇది చిన్నది. అయినా ఇక్కడి వాతావరణం, పరిసరాల పరంగా ఇది వాటికి ఏ మాత్రం తీసిపోదు. ఈ హిల్‌స్టేషన్ సముద్ర మట్టానికి 1793 మీటర్ల ఎత్తున ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవారికి ఇది చాలా మంచి ప్రదేశం. నీలగిరిలోని వివిధ భాగాలకు ట్రెక్కింగ్‌లో తీసుకువెళ్ళే మార్గాలు ఉన్నాయి. కోటగిరి చరిత్ర పరిశీలిస్తే.. ఈ హిల్‌స్టేషన్ ఎంతో పురాతనమైనది. అయినప్పటికీ బ్రిటీష్‌వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఎలా ఉన్నదో.. ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ ‘కోటలు’ అనే గిరిజన జాతి ఉంది. వీరు ఎన్నో శతాబ్దాల నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు బయటి ప్రదేశాలవారితో కలవడానికి ఇష్టపడరు. ఇక్కడి లోతట్టు ప్రాంతాల్లో ఇంకా మానవ నాగరికత విలసిల్లలేదు.
చూడాల్సిన ప్రదేశాలు
* సెయింట్ కేథరినే ఫాల్స్
* కోటగిరి-కోడనాద్
* కోటగిరి-లాంగ్ వుడ్‌షో
* రంగస్వామి పిల్లర్, శిఖరం
* కోదనాడు వ్యూ పాయింట్
* కేథరినే వాటర్‌ఫాల్స్
* ఎల్క్ ఫాల్స్
* జాన్‌సుల్లివన్ మెమోరియల్
* నీలగిరి మ్యూజియం
* నెహ్రూ పార్క్
* స్నౌదేవ్ శిఖరం
ఇలా వెళ్ళాలి..
రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా కోటగిరి చేరుకోవచ్చు. కోటగిరి సందర్శనకు వేసవి కాలం మంచి సమయం.
*
కొల్లీహిల్స్
తమిళనాడులో ఎవరికీ తెలియని శీతల జాలం ఉంది. అదే కొల్లీహిల్స్. నమక్కల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది ఇది. ఎన్నో గిరిజన గ్రామాలకు ఆలవాలమైన ఈ గిరిశ్రేణుల పైకి వెళ్లే మార్గం అత్యంత సుందరంగా ఉంటుంది. ఎతె్తైన, దట్టమైన మానుల మధ్య సాగిపోయే రహదారి దాదాపు 70 మలుపులతో మైమరిపిస్తుంది. ప్రతి మలుపులో ప్రకృతికాంత పలకరిస్తుంది. ఒకచోట జలపాతం ఆహ్వానిస్తే.. మరోచోట చల్లనిగాలి చెంపలను సుతారంగా నిమురుతుంటే.. ఇంకోచోట లతలు పెనవేసుకున్న వృక్షాలు స్వాగతం చెబుతాయి. ఇలా అన్ని మలుపులు తిరిగి శిఖరం చేరుకున్నాక మేఘాలు మేనిని ముద్దాడుతాయి. పచ్చదనం మనసును హత్తుకుంటుంది. వేసవిలో కూడా జలజలా దూకే జలపాతాలు ఆహ్లాదాన్నిస్తాయి. కొండంతా విస్తరించి ఉన్న కాఫీ తోటల వల్ల ఆ ప్రాంతమంతా మరింత పచ్చదనంతో అలరారుతోంది. యుగాల కిందట అగస్త్య మహర్షి ఈ కొండల్లోనే తపస్సు చేశాడని స్థానికులు చెబుతారు. శతాబ్దాల క్రితం ‘ఒరి’ వంశానికి చెందిన రాజులు ఈ కొండలను కేంద్రంగా చేసుకుని రాజ్యపాలన చేశారట. ఈ కొండల్లో చాలా గిరిజన గ్రామాలున్నాయి. వీరి జీవనశైలి వింతగా ఉంటుంది. ఈ ప్రాంతం వేసవి విడిదిగానే కాదు ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధి.
చూడాల్సిన ప్రదేశాలు
* సిద్ధా గుహలు
* ఆకాశగంగ జలపాతం
* ఇట్టుక్కయి అమ్మన్ గుడి
* పళ్ళ తోటలు
ఇలా వెళ్ళాలి..
నమక్కల్ జిల్లా నుండి కొల్లీహిల్స్‌కు వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుండి సేలం వరకు రైలు మార్గం ద్వారా వెళ్లవచ్చు. అక్కడి నుండి రోడ్డుమార్గం ద్వారా కొల్లీహిల్స్ చేరుకోవచ్చు.
*
కొడైకెనాల్
తమిళనాడులో బాగా పేరున్న వేసవి విడిదుల్లో కొడైకెనాల్ ఒకటి. కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డున ఉన్న అందమైన హిల్‌స్టేషన్. కొండలు, మైదానాలు, చెట్లు, అందమైన కొలనులు, తాజాగాలి.. అన్నిటినీ మించి కనుచూపు మేర పచ్చదనం కొడైకెనాల్ ప్రత్యేకతలు. ‘హిల్‌స్టేషన్ల రారాణి’గా కూడా దీన్ని పిలుస్తారు. మధురైకి సమీపంలోని పళని కొండలపై ఉన్న ఈ ప్రాంతం సముద్రమట్టానికి 2,100 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి ప్రాంతాలు సహజ సౌందర్యానికి నెలవు. సైక్లింగ్, బోటింగ్, ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్, గోల్ఫ్.. ఇలా సాహసికులు, క్రీడాభిమానులూ ఆకర్షించే అంశాలకు కూడా ఇక్కడ లోటు లేదు.
చూడాల్సిన ప్రదేశాలు
* కొడై సరస్సు * కోకర్స్ వాక్
* సైలెంట్ వ్యాలీ * దయాల (గుణ) గుహ
* పంపార్ జలపాతం
* బెరిజం చెరువు
* వ్యూ పాయింట్
* పైన్ వృక్షారణ్యం
* శాంతి లోయ
* కురింజి ఆండవర్ ఆలయం
ఇలా వెళ్ళాలి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మధురై వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ ఉంటుంది. సమీప విమానాశ్రయం 120 కిలోమీటర్ల దూరంలోని మధురైలో ఉంది.
*
కేరళ
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అందాలకు వ్యసనపడకపోతే అది సందర్శకుడి దృష్టిలోపమే.. కేరళలోని ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలెప్పీ, కోవలం, వెంబనాడ్, కుమారకోం, అలప్పూజ, మున్నార్, తెక్కడి, వాయనాడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రం మొత్తం విహార కేంద్రాలమయమే.. ఇక్కడి పచ్చటి అడవులు, కాఫీ, టీ తోటలు, సుగంధద్రవ్యాల తోటల పరిమళాలు మనల్ని మైమరిపిస్తూ రారమ్మని ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైతే జూన్ నెలలో కేరళలోని కొన్ని ప్రాంతాలు అప్పుడే చిగురిస్తున్న ఎతె్తైన పర్వత శిఖరాలు.. ప్రకృతిలోని అందమంతటినీ తమలోనే ఇముడ్చుకున్నాయా..! అనిపిస్తుంది. కేరళలోని హిల్‌స్టేషన్లలో అందమైన జలపాతాలకు కొదవలేదు.
మున్నార్
పడమటి కనుమల పొత్తిళ్లలో ఉన్నట్టుంటుంది మున్నార్. నింగిలో తేలిపోయే మబ్బులు ఇక్కడి కొండలను ముద్దాడుతూ గమనం మరిచిపోతాయి. ఇంతలో కొండవాలులో ఉన్న తేయాకు తోటలపై నుంచి వచ్చే గాలిసోకి.. హుషారుగా ముందుకు సాగిపోతాయి. పచ్చదనానికి ఇక్కడ లోటుండదు. మూడు నదులు కలిసే ప్రాంతమే మున్నార్. సముద్రమట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఈ హిల్‌స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి మనదేశం నుండే కాదు విదేశాల నుండి కూడా లక్షలాదిగా పర్యాటకులు పిక్నిక్‌లు, వీకెండ్ డెస్టినేషన్, సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి, తనివితీరా విశ్రాంతి పొందడానికి వస్తుంటారు. మున్నార్‌ను కేరళ ‘సహజ స్పా’ అని కూడా అంటారు. మూతిరపుళా, నల్లతన్ని, కుండాల అనే మూడు పర్వత వాగుల సంగమంలో ఉంది మున్నార్. ఇక్కడి జీవన వైవిధ్యం విభిన్నం. విశాలమైన టీ తోటలు, అందమైన గ్రామాలు, అడవులు, గడ్డి మైదానాలు, అద్భుతమైన పుష్ప సంపద.. మనసును దోచేస్తాయి. ముఖ్యంగా నీలకురింజ అనే పువ్వు ప్రత్యేకం. ఇది పనె్నండు సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది. ట్రెక్కింగ్, హైకింగ్ వంటి ఆటల కోసం సాహసవంతులు, క్రీడాకారులు ఇక్కడికి వస్తుంటారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న జంతుజాలాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తారు. ప్రకృతితో మమేకమవ్వడం కోసమే వచ్చే వారు కూడా ఉంటారు. అందుకే ఏడాది పొడవునా మున్నార్‌కు పర్యాటకుల తాకిడి ఉంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు
* టీ ఎస్టేట్స్
* టాటా టీ మ్యూజియం
* పల్లివాసల్ డ్యామ్
* న్యాయకడ్, అట్టుకడ్ జలపాతాలు
* పంబదుమ్ షోలా
* ఎరవికుళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
*

తెక్కడి
కేరళలోని మరో అందమైన హిల్ స్టేషన్ ఇడుక్కి జిల్లాలోని తెక్కడి. దీనే్న ‘వైల్డ్ లైఫ్ ఆఫ్ కేరళ’ అంటారు. ఈ హిల్‌స్టేషన్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరియార్ అభయారణ్యం ఉంది. ఇక్కడ మనకు ఏనుగుల సఫారీ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఆధ్యాత్మిక చింతననీ, ప్రకృతి సోయగాన్నీ ఏకకాలంలో ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రదేశం అద్భుతమైనది. సెలవులను ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది చాలా ఉత్తమమైనది. తెక్కడిని భూలోక స్వర్గమనే చెప్పాలి. కేరళలోని కొచ్చికి 180 కిలోమీటర్ల దూరంలోని కొట్టాయం రైల్వేస్టేషన్‌కు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెక్కడి ప్రాంతం వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఆనందం, ఆహ్లాదం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా తెక్కడి అందచందాలను వీక్షించాల్సిందే..
వాయనాడ్
వాయనాడ్ ప్రకృతి సౌందర్యానికి మైమరిచిపోయి ఉండకపోతే.. సందర్శకుల దృష్టిలో ఏదో ఒక లోపం ఉందనుకోవాల్సిందే.. సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్లను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనబడే ఎత్తుపల్లాలు, ‘యూ’ ఆకారంలోని మలుపులు గుండా ప్రయాణిస్తే మనసుకు ఎక్కడలేని ఉత్సాహం, ఉల్లాసంతో పరుగులు తీయదూ.. సముద్రమట్టానికి 700 నుంచి 2,100 మీటర్ల ఎత్తువరకు ఉన్న వాయనాడ్, దక్కన్ పీఠభూమి దక్షిణ భాగంపై సగర్వంగా నిలిచి ఉంటుంది. విస్తారమైన కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోతాం. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరస్సెరీ చురమ్ అంటారు. ఇదే వాయనాడ్‌కు స్వాగతద్వారం. పొరుగునున్న కోజికోడ్ జిల్లాతో వాయనాడ్‌ను కలిపే మార్గం ఇదే.
చూడాల్సిన ప్రదేశాలు
* ఎడక్కల్ గుహలు
* తిరునెల్లి దేవాలయం
* అనంతానంత స్వామి దేవాలయం
* చెంపారా శిఖరం
* బాణాసుర సాగర్ డ్యాం
* కురువు ద్వీపం
* సూచిపార
* పంతపార మీన్ముటి జలపాతం
*
పొన్ముడి
కేరళలో ప్రముఖ పట్టణమైన తిరువనంతపురానికి ఇది కేవలం 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొన్ముడి అంటే స్వర్ణశిఖరం అని అర్థం. ఇది సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్ల ఎత్తున పడమటి కనుమల శ్రేణిలో ఉంది. ఆహ్లాదకర వాతావరణం, సుందర ప్రదేశాలు, పచ్చటి ప్రకృతి పొన్ముడిని వేసవి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి. జలపాతాలు, పచ్చని ప్రదేశాలు, మైమరిపించే ప్రకృతి సొగసులు పొన్ముడికి స్వాగతిస్తాయి. పొన్ముడి హిల్‌స్టేషన్‌కు తిరువనంతపురం నుండి ఒక సన్నని పాము మెలికల వంటి మార్గంలో సుందరమైన ప్రదేశాలను చూసుకుంటూ రోడ్డు మార్గాన ప్రయాణం చేయవచ్చు. ఎటుచూసినా ఆకుపచ్చని ప్రదేశాలతో ఈ మార్గం అలరారుతుంటుంది. కొద్దిపాటి సాహసాలు చేయాలనుకునేవారికి ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్, హైకింగ్ ప్రదేశాలు కూడా ఉంటాయి. పొడవైన, కొనలు తేలిన మలుపులు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలోని విహారంలో ఎన్నో లోయలు, సరస్సులు, సుగంధ ద్రవ్యాల తోటలు కనబడతాయి. పొన్ముడి సహజ అందాలకే కాక, ఆయుర్వేద చికిత్సలకు కూడా ప్రసిద్ధి.
చూడాల్సిన ప్రదేశాలు
* గోల్డెన్ వ్యాలీ
* పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురీ
* మినీ జూ
* అగస్త్య కూడం
* మీన్ ముట్టి జలపాతాలు
*
కర్ణాటక
పచ్చదనానికి ఆలవాలమైన కర్ణాటకలో వేసవి విడుదులు చాలానే ఉన్నాయి. వడగాలిని సైతం మలయమారుతంగా మార్చే గిరుల వల్లే కన్నడసీమ చల్లగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో పడమటి కనుమలు పరుచుకున్న చోటంతా పర్యాటక కేంద్రాలే! అవేంటో చూసేద్దామా..
కొడుగు(కూర్గ్)
పచ్చటి ప్రకృతి, జలపాతాలు, వన్యమృగాలు, పక్షులు, మూలికా వృక్షాలకు నిలయంగా పేరుపొందింది కూర్గ్. దీనే్న అధికారికంగా ‘కొడుగు’ అని పిలుస్తారు. ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’గా పేరుపొందిన కూర్గ్ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని ‘కర్ణాటక కాశ్మీర్’ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఎతె్తైన కొండలు, లోయలు, జలపాతాలు, సెలయేర్లు కనువిందు చేస్తాయి. విస్తరించిన కాఫీ తోటలు, శిఖరాల నుండి జాలువారే జలపాతాల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. కూర్గ్‌లో కొడవ, తుళు, గౌడ, కుడియాలు మొదలైన తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఎక్కువగా కొడవ జాతి వారు ఉంటారు. ఈ ప్రాంతం అంతర్జాతీయంగా కాఫీ పంటకు ప్రసిద్ధి. తేనె, యాలకులు, మిరియాలు, నారింజలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్‌కు కూర్గ్ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి వేసవికాలంలో విహారానికి సందర్శకులు కూర్గ్‌కు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
చూడాల్సిన ప్రదేశాలు
* జెస్సీ ఫాల్స్
* భాగమండలం
* టిబెటన్ స్వర్ణ దేవాలయం
* మడికెర కోట
* ఓంకారేశ్వర స్వామి ఆలయం
* తలకావేరి
ఇలా వెళ్ళాలి..
కూర్గ్‌కు వెళ్ళేందుకు ఎంతో అనుకూలమైన రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి. కూర్గ్‌కు సమీప రైల్వేస్టేషన్ మైసూర్. మైసూర్ నుండి కూర్గ్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
*
కమ్మణ్ణగుండి
ఎతె్తైన కొండలు, దట్టమైన అరణ్యం, జలజలమంటూ దూకే జలపాతాలు, అంతుబట్టని లోయలు.. ఇలా అడుగడుగునా పలకరించే అందాలతో పర్యాటకులను మురిపిస్తుంది కమ్మణ్ణగుండి. ఒకప్పుడు మైసూరు రాజులు వేసవిలో కమ్మణ్ణగుండికి విహారానికి వచ్చేవారు. ఈ ప్రాంత పర్వత శ్రేణులను ‘బాబా బూదాన గిరులు’ అని పిలుస్తుంటారు. ఇక్కడ ట్రెక్కింగ్, వౌంటెయిన్ బైకింగ్ వంటివి చేసే అవకాశం ఉంది.
చూడాల్సిన ప్రదేశాలు
* రాక్, రోజ్ గార్డెన్
* ముల్లాయనగిరి పర్వతం
* జీ పాయింట్
* కల్లత్తిపుర జలపాతం
* హెబ్బే జలపాతం
ఇలా వెళ్ళాలి
బెంగళూరు నుంచి 273 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కమ్మణ్ణగుండి. బెంగళూరు నుంచి నేరుగా బస్సులు, టాక్సీల్లో చేరుకోవచ్చు. చిక్‌మగళూరు నుంచి కేవలం 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి అయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్లచ్చు.
*
కాబిని వన్యజీవిధామ
అతి సుందరమైన, ప్రశాంతమైన పర్యాటక ప్రదేశం కాబిని. అదే పేరుతో గల నది ఒడ్డున ఈ ప్రాంతం ఉంటుంది. కర్ణాటక పర్యాటక ఆకర్షణల్లో ఇది కూడా ఒకటి. కాబిని నదిలో బోటింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడి సుగంధద్రవ్యాల తోటలు చాలా ప్రసిద్ధి.
*
తెలంగాణ ఊటీ
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరులు ప్రకృతి అందాలకు నెలవు. వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్తుంటే దారి పొడవునా పచ్చని చెట్లు పలకరిస్తాయి. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే నూతనోత్తేజాన్ని పొందుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎతె్తైన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, పురివిప్పే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు.. ఇలా ఇక్కడ ఎన్నో ప్రకృతి అందాలు మనల్ని పలకరిస్తాయి. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గిరులు అడవి అందాలతో అబ్బురపరుస్తాయి. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత పద్మనాభస్వామి ఆలయం ఆకర్షిస్తుంది. ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. అక్కడికి వెళ్లడానికి సుమారు వందమెట్లు దిగాలి. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా ప్రారంభమై హైదరాబాద్ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’గా పేర్కొంటారు. తిరుమల కొండలతో పోలిస్తే అనంతగిరి కొండలు చాలా చిన్నవి. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమని, కర్నూలు జిల్లాలోని అహోబిలం కొండలు మధ్యభాగమని, అనంతగిరి కొండలు తోక భాగమని స్థానికులు భావిస్తుంటారు. వేసవికాలంలో ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది.
ఇలా వెళ్ళాలి..
హైదరాబాద్ నగరానికి 76 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉన్నాయి. సమీప రైల్వేస్టేషన్ వికారాబాద్‌లో ఉంది.
*
ఆంధ్రా కాశ్మీర్
శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే లంబసింగికి ‘ఆంధ్రా కశ్మీర్’ అనే పేరుంది. మండువేసవి అయిన మే నెలలో కూడా ఎండ తీవ్రత మధ్యాహ్నం పనె్నండు నుంచి రెండు వరకు మాత్రమే ఉంటుంది. తరువాత వాతవారణం చల్లబడుతుంది. చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలు, కొండలపై కదలాడే మేఘాలు, కనుచూపుమేర కనిపించే కాఫీ తోటలు, ఉవ్వెత్తున దూకే జలపాతాలతో లంబసింగి ప్రాంతం కన్నులకింపుగా కనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 1,210 మీటర్ల ఎత్తులో ఉండే లంబసింగి ఘాట్‌రోడ్డులో ప్రయాణం, బైక్‌లపై రోడ్డు ట్రిప్స్ వేసే ఉత్సాహవంతులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఇలా వెళ్ళాలి..
విశాఖపట్నం నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉంది. అనకాపల్లి లేదా సబ్బవరం మీదుగా రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు.
*
అరకు
అరకువేలీ పేరు తెలియనివారుండరు. ఆంధ్రాలో అద్భుతమైన హిల్‌స్టేషన్ ఇది. భారతదేశంలో లోతైన లోయలో ఇది కూడా ఒకటి. అందమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దట్టమైన, పచ్చని అడవి, జలపాతాల సంగీత గమకాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అరకు చుట్టూ రక్తకొండ, చితమో గొంది, గాలికొండ, సుంకరి మెట్ట కొండలు ఉన్నాయి. గాలికొండ ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పొడవైన కొండగా చెబుతారు. అరకువేలీ అందమైన ప్రదేశమేకాక కాఫీ తోటలకు పేరుగాంచింది. తాజా కాఫీ గింజల సువాసనలు లోయ అంతటా వ్యాపించి ఉంటాయి. ఈ ప్రాంతం శీతాకాలంలో మితమైన చలితో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవికాలంలో ఇతర జిల్లాల, రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడకు వచ్చి సేదతీరుతారు. అరకు సందర్శనకు శీతాకాలం అనువైనది. ఇక్కడ సందర్శకులు ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా చేయవచ్చు.
ఇలా వెళ్ళాలి..
అరకు హిల్ స్టేషన్‌కు రైలు, రోడ్డు మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒకటి అరకులో ఉంది. మరొకటి అరకువేలీలో ఉంది. ఈ రెండు రైల్వేస్టేషన్లు వైజాగ్‌తో అనుసంధానించి ఉన్నాయి. అరకుకు బస్సు సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్, వైజాగ్‌ల నుండి డీలక్స్, వోల్వో బస్సు సదుపాయం ఉంది.
*
హార్స్‌లీ హిల్స్
బ్రిటీష్ వారి కాలం నుంచి వేసవి విడిదిగా ఖ్యాతి పొందిన ప్రాంతం ఇది. మండువేసవిలోనూ చల్లటి గాలితో ఉపశమనం కలిగించే గమ్యం ఇది. మునుపు ఈ ప్రాంతాన్ని ‘ఏనుగుల మల్లమ్మ కొండ’ అని పిలిచేవారు. బ్రిటిష్ ప్రభుత్వంలో కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన డబ్ల్యూ.డి. హార్స్‌లీ 1840-1843 సంవత్సరాల మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై దీన్ని తన వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత ఆయన పేరు మీదనే దీన్ని హార్స్‌లీ హిల్స్ అని పిలుస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 1,265 మీటర్ల ఎత్తులో ఉన్న హార్స్‌లీ హిల్స్‌ను చేరుకునే రహదారి మొత్తం యూకలిప్టస్ చెట్లు, వివిధ వర్ణాల పూలచెట్లు, గంధపు చెట్లతో నిండిపోయి అత్యంత రమణీయంగా దర్శనమిస్తుంది. ట్రెక్కింగ్ తదితర సాహసక్రీడలకు కూడా ఈ ప్రాంతం పేరుపొందింది. వేసవి ఎండల నుండి ఉపశమనం పొంది ఆహ్లాదంగా గడపాలనుకునేవారికి ఇది చక్కటి గమ్యం.
చూడాల్సిన ప్రదేశాలు
* గంగోత్రి సరస్సు
* మల్లమ్మ గుడి
* గాలిబండ
* రిషీవేలీ స్కూల్
* హార్స్‌లీహిల్స్ మ్యూజియం
ఇలా వెళ్ళాలి..
తిరుపతికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. మదనపల్లి వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుండి 13 కిలోమీటర్ల మేర రోడ్డుమార్గంలో హార్స్‌లీహిల్స్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది.
*
మహేంద్రగిరులు
తూర్పు కనుమల్లో అందాలు నెలకొన్న కొండలు మహేంద్రగిరులు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో పర్వత శ్రేణులపై ప్రకృతి ఎప్పుడూ పరవశిస్తూనే ఉంటుంది. చెట్లుచేమలతో పచ్చల పేరులా మెరిసిపోతున్న మహేంద్రగిరుల్లో.. అక్కడక్కడా వజ్రాలు పొదిగినట్టుగా అపురూప ఆలయాలు దర్శనమిస్తాయి. మధ్యమధ్యలో ముత్యాలు కుమ్మరించినట్లుగా నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ గిరులకు ఏడాదంతా పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి పండుగ సమయంలో ఇక్కడికి వేలాదిమంది భక్తులు తరలివస్తాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో మహేంద్రగిరులు ఉంటాయి. సముద్రమట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గిరుల్లో అరుదైన వృక్షసంపద ఉంది. వనవాసకాలంలో పాండవులు మహేంద్రగిరులపై కొంతకాలం గడిపారని చెబుతారు. ఈ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో మందిరాన్ని నిర్మించారని స్థానిక కథనం. ఇక్కడ పూటపూటకీ ఆకాశంలో రంగులు మారుతుంటాయి. తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచు, అంతలోనే చురుక్కుమనే సూర్యోదయం, ఉన్నట్టుండి హోరున కురిసే వర్షం, సాయం సంధ్యా సమయానికి ఆహ్లాదాన్ని పంచే శీతలగాలులు, రాత్రికి ఎముకలు కొరికే చలి.. ఇలా ఒక్కరోజులోనే అనుభవంలోకి వచ్చే ఇక్కడి వాతావరణానికి అచ్చెరువొందవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ వింత అనుభూతినిస్తుంది.
ఇలా వెళ్ళాలి..
శ్రీకాకుళం జిల్లా పలాస వరకూ రైలుమార్గం ఉంది. అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. *

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి