S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-10

హాస్పిటల్ అంతా నిద్రావస్థలో ఉంది. వాచ్‌మన్ మందుకొట్టేసి మత్తుగా పడుకున్నాడు. అప్పుడే ఓ పేషెంట్ తాలూకు మనిషి వచ్చి లేపాడు.
‘ఏంటి?’ విసుక్కుంటూ అన్నాడు వాచ్‌మన్.
‘బాబూ పంపుల్లో నీళ్లు రావడంలేదు. కాస్త మోటర్ వెయ్యి నాయనా!’ అన్నాడు.
‘నీళ్ళయిపోయాయా? పెద్ద గదంత వాటర్‌టాంక్ నిండా నీళ్లుంటాయి. సరిగ్గా చూడండి’ అన్నాడు వాచ్‌మన్ విసుగ్గా.
‘లేదు బాబూ! టాయిలెట్‌లో కూడా నీళ్లు రావడం లేదు’ భయంభయంగా అన్నాడు పేషెంట్ తాలూకు మనిషి.
విసుగొచ్చేసింది వాచ్‌మన్‌కి.
‘ఇంకాస్సేపటికి తెల్లారుతుంది. అప్పుడేస్తానే్ల!’ అన్నాడు నిర్లక్ష్యంగా. ఈ గొడవకి లూసీ లేచొచ్చి విషయం తెలుసుకుని,
‘నీళ్లు లేకపోతే ఎలా? వెళ్లి మోటర్ వెయ్యి’ అంది కాస్త గట్టిగా.
గొణుక్కుంటూ వెళ్లి చూశాడు.
నిజంగానే నీళ్లయిపోయాయి. అంత పెద్ద టాంక్ ఎలా ఖాళీ అయ్యిందా అని ఆశ్చర్యపోయి కొన్ని టాప్స్ ఓపెన్ చేసి ఉండటంతో, పేషెంట్స్‌ని తిట్టిపోస్తూ, టాప్స్ అన్నీ మూసేసి మోటర్ ఆన్ చేసి టాంక్ నింపేశాడు. అన్ని నీళ్లు పోతుంటే నువ్వేం చేస్తున్నావ్?’ అని తననెక్కడ తిడతాడో అని నీళ్లయిపోయినట్టు అనిల్‌కి చెప్పొద్దని పేషెంట్స్ వేడుకున్నాడు.
ఉదయం తొమ్మిది గంటలకి అనిల్ కారొచ్చి హాస్పిటల్ ఆవరణలో ఆగింది. అప్పటికే హాస్పిటల్ సిబ్బంది అలర్ట్‌గా ఉన్నారు. తను రావడం లేటయినందుకు గౌతమి ఎక్కడ బాధ పడుతుందో అని కంగారుగా వెళ్తుంటే లూసీ ఎదురై విష్ చేసింది. గౌతమి మాటలు గుర్తొచ్చి మృదువుగానే-
‘గుడ్‌మాణింగ్.. గౌతమి బ్రేక్‌ఫాస్ట్ చేసిందా?’ అన్నాడు ఆతృతగా.
‘మేడమ్ ఇంకా లేవలేదు సార్’ అందామె.
‘ఇంకా లేవలేదా? ఏం? రాత్రి పొద్దుపోయి పడుకుందా?’
‘అదే అనుకుంటాను సార్! రాత్రి చాలాసేపు గదిలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అందుకే లేపలేదు’ అంది లూసీ.
అతను ఆలోచిస్తూ మేడ మీది తన గదికేసి నడిచాడు.
తలుపు దగ్గరగా వేసుంది.
మెల్లగా తలుపు తట్టాడు. అయితే ఆమె తలుపు తెరవలేదు. రమ్మనలేదు. మృదువుగా పిల్చాడు. ఈసారీ ఎలాంటి శబ్దం లేదు. అతని కళ్లు చిత్రంగా ముడుచుకున్నాయి. తలుపు తీసి లోపలికెళ్లాడు. అయితే ఆమె బెడ్ మీద లేదు. తర్వాత బాత్‌రూమ్‌లోనూ మిగతా గదులూ చూశాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. అతని కంగారు గమనించిన స్ట్ఫాంతా వచ్చేశారు.
‘లూసీ! గౌతమీ ఏదీ?’ అన్నాడు అరిచినట్టు.
‘తెలియదు సర్! పొద్దుట్నుంచీ ఆమెని చూళ్లేదు’ హడలిపోతూ అందామె.
మరోసారి రూమ్‌లోకెళ్లి చూశాడు అనిల్.
గదిలోని టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఓ పేపర్ రెపరెప లాడుతూ కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని తీసి చూశాడు. అంతే! అతని మొహం పాలిపోయింది. చేతిలోని కాయితం జారి కింద పడిపోయింది. మరింత హడలిపోయిన లూసీ దాన్ని తీసి చూసింది. అది గౌతమి అనిల్‌కి రాసిన చిన్న లెటర్. అందులో ఇలా ఉంది.
‘డియర్ అనిల్!
పైకి నవ్వుతున్నా జరిగిన అవమానాన్ని భరించలేక పోతున్నాను. నాన్న ఆరోగ్యం క్షీణించిపోతోందని నాకు తెలుసు. మనం ఎన్ని ఉపమానాలు చెప్పినా, ఆధారాలన్నీ నానే్న నేరస్థుడని చెప్తున్నాయి. ఆ ఆధారాలని ప్రయాగగారే కాదు సి.ఎం. గారు కూడా మార్చలేరు. మా ఈ ఇక్కట్లకి ముఖ్య కారకుడు ఆ బ్లాక్ టైగర్. అతన్ని నిలదియ్యడానికే నేను సిగపడవిలోకి వెళ్తున్నాను. ఎలాగైనా అతని దగ్గర్నించి అమ్మవారి నగల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. బతికి బావుంటే నగలతో తిరిగొచ్చి మా నాన్న నిర్దోషి అని నిరూపించుకుంటాను. లేకపోతే అక్కడే సమాధి అయిపోతాను. ఇంక మా నాన్న బాధ్యత నీదే. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. బతికుంటే మళ్లీ కలుద్దాం. లేకపోతే ఇదే ఆఖరి వీడ్కోలు. అన్నట్టు నీ రివాల్వర్ తీసికెళ్తున్నాను. కొన్ని చీరలూ అవీ కూడా తీసికెళ్తున్నాను. సారీ! కాలం కలిసొస్తే కలుద్దాం’
-గౌతమి
‘ఏవిటి సర్ ఇదంతా?’ దాదాపు ఏడుస్తున్నట్టు అంది లూసీ.
‘గౌతమి తొందరపడి సింహపు గుహలో ప్రవేశించింది’ నిద్రలో అన్నట్టు అన్నాడు అనిల్.
‘ఇప్పుడెలా సార్?’
‘చూద్దాం’ అంటూ ఏదో అనబోతుండగా ప్రభు కారొచ్చి ఆగింది. అతన్ని చూసి క్షణం బిత్తరపోయిన అనిల్ తేరుకుని విష్ చేసి ఆప్యాయంగా ఆహ్వానించాడు.
‘గౌతమిగారున్నారా?’ అన్నాడు ప్రభు ఆతృతగా.
‘లేదు సర్’ వణుకుతున్న గొంతుతో అన్నాడు అనిల్.
‘లేదా? ఇంట్లో కూడా లేరే!’
‘తను పులి బోనులో అడుగు పెట్టింది సార్’ అంటూ గౌతమి రాసిన లెటర్ ఇచ్చాడు అనిల్. అది చదివిన ప్రభు బిగుసుకు పోయాడో క్షణం.
‘మైగాడ్! ఎప్పుడెళ్లారు?’ అన్నాడు అరిచినట్టు.
‘తెలియదు. నేనొచ్చేసరికే లేదు’
‘వెళ్లే అడవిలో క్కాబట్టి రాత్రి వెళ్లుండదు. అంటే పొద్దునే్న వెళ్లుండాలి’
‘అవును’
‘మరి వెతక్కుండా ఇక్కడే ఉండిపోయారేం?’ ప్రభు గొంతు తీక్షణంగా ఉంది.
‘ఎక్కడని వెతకం?’
‘ఎక్కడేవిటండీ. అడవిలోకెళ్లే దారులన్నీ వెతుకుదాం పదండి’ తొందరపెట్టాడు ప్రభు.
ఆ ఆలోచన తనకి రానందుకు సిగ్గుపడ్డాడు అనిల్.
‘ఇదిగో క్షణం’ అంటూ మరో గదిలోకి పరిగెత్తాడు.
కార్లో ఉంటానని చెప్పి వెళ్లి కార్లో కూర్చున్నాడు ప్రభు.
క్షణాల్లో హాస్పిటలంతా గోలగోలగా అయిపోయింది. గౌతమి సాహసానికి విస్తుపోయారు.
‘సర్’ మెల్లగా పిల్చింది లూసీ.
అతను తలెత్తి చూశాడు.
‘నా పేరు లూసీ సర్’ అందామె.
‘హాయ్’ యాంత్రికంగా అన్నాడతను.
‘నా పేరు లూసీ సర్’ మళ్లీ అందామె.
‘అయితే...’ అతని కళ్లల్లో విసుగు కనిపించింది.
ఓసారి అటూ ఇటూ చూసి
‘సార్! నన్నిక్కడ గౌతమిగారే పెట్టారు. నా పేరు లూసీ!’ అందామె. అతను తుళ్లిపడి చూశాడు.
‘ఓ! లూసీ! అయామ్ సారీ! కంగారులో గమనించలేదు. ఎలా ఉన్నారు?’ అన్నాడు ఆతృతగా.
‘అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది గౌతమిగారు మీకిమ్మన్నారు’ అంటూ ఓ కవరు అతని చేతికిచ్చి ఎవరో తరుముతున్నట్టు పారిపోయింది లూసీ. క్షణం ఆలోచించి ఆ కవర్ని జేబులో పెట్టుకున్నాడు ప్రభు. అతని కళ్లు అనిల్ కోసం చూస్తున్నా, మనసు మాత్రం జేబులోని కవర్‌మీదే ఉంది.
* * *
భుజాన బేగ్‌తో, చేతిలో రివాల్వర్‌తో సింగపడవిలో చకచకా నడుస్తోంది గౌతమి. ఆమెకి భయం వెయ్యలేదు సరికదా ఉత్సాహం పెరిగిపోయింది.
అడవి చిక్కగా ఉండటం వల్ల సూర్యరశ్మి ఏ మాత్రం పడటంలేదు. ఓ పక్కగా చిన్న సెలయేరు పారుతోంది. రకరకాల అడవి పూలు విరబూసి వింత వాసనలు వెదజల్లుతున్నాయి. ఓసారి పరిసరాలు చూసింది. ఏ క్షణాన్నైనా టైగర్ మనుషులు ఎదురుపడవచ్చని, తనని అడ్డగిస్తారని, టైగర్‌ని కలవందే వెనుదిరిగి లేదని గట్టిగా చెప్పాలనీ ఆమె ఉద్దేశం. అయితే ఆమె ఆశించినట్టు ఎవరూ కనిపించలేదు.
‘ఇదేవిటి? ఈ ప్రాంతమంతా టైగర్ మనుషులుంటారనీ, బయటి వాళ్లు అడుగుపెట్టగానే రేచుల్లా వెంటపడి వెనక్కి పంపేస్తారనీ అంటారు. కానీ ఇంతదూరం నడిచినా ఎవరూ రాలేదేమిటి? అంటే జనాలనుకునేవన్నీ ఊహాగానాలన్నమాట. అసలీ అడవిలో బ్లాక్ టైగర్ అన్న వ్యక్తి ఉంటాడా? అదీ వాళ్లు ఊహించుకున్నదేనా?’ అనుకుంది. తర్వాత మళ్లీ నడక సాగించింది.
అలా మధ్యాహ్నం దాకా నడుస్తూనే ఉంది. కాళ్ల నొప్పి, నీరసం వచ్చేశాయి గానీ ఎవరూ ఆమెకెదురు పడలేదు. కాస్సేపు ఓ చెట్టు కింద కూర్చుని, బ్యాగ్‌లో నించి బ్రెడ్, జామ్ తిని యేటి నీళ్లు తాగింది.
‘ఓహ్! భలే థ్రిల్లింగ్‌గా ఉంది’ అనుకుంటూ కాస్సేపలాగే కూర్చుండిపోయింది. చెట్ల మీద పక్షులు వింతవింతగా అరుస్తున్నాయి. నడిచి నడిచి అలసిపోవటం వల్ల, ఇంత తిని నీళ్లు తాగడం వల్ల ఆమెకి నిద్ర ముంచుకొచ్చేసింది. బేగ్ తల కింద పెట్టుకుని ఆ చెట్టు కిందే పడుకుంది. అలా నిద్రలోకి జారిపోయింది.
ఎక్కణ్నించో ఓ నక్క కర్ణకఠోరంగా అరవడంతో తుళ్లిపడి లేచి వాచ్ చూసుకుంది.
‘మైగాడ్! నాలుగున్నరై పోయిందే’ అనుకుంటూ మళ్లీ నడక సాగించింది ఆటవికుల కోసం అనే్వషిస్తూ.
‘ఇప్పుడు వాళ్లు కనిపించకపోతే?’ అన్న ఊహ రాగానే వణుకొచ్చేసింది. ఆ అడవిలో సింహాలతోపాటు మరెన్నో క్రూరమృగాలుంటాయని, చీకటి పడితే అవి వీరవిహారం చేస్తాయని ఆమెకు తెలుసు. ఆమె ఉత్సాహమంతా మాయమై ఆ స్థానంలో భయం చోటు చేసుకుంది. తిరిగి వెళ్లిపోదామని కూడా అనుకుంది. కానీ, దారీతెన్నూ లేని అడవిలో వచ్చిన దారి మర్చిపోయింది. గుండె వేగం పెరిగిపోయింది. ఓసారి పరిసరాలు పరికించింది. ఏ సింహమైనా వస్తే గభాల్న చెట్టెక్కెయ్యాలని, కాస్త దూరంలో ఆమె ఎక్కగల చెట్లు కనిపించడంతో అటుకేసి నడిచింది.
అలా చెట్లని చూసుకుంటూ చాలాసేపు నడిచింది. లేళ్లు, నెమళ్లు లాంటివి ఉత్సాహంగా తిరుగుతున్నాయి. లోపల భయంగా ఉన్నా, చీకట్లు ముసిరి, పగలే చీకటిగా వుండే అడవి సూర్యాస్తమయం అయ్యేసరికి మరింత చీకట్లావరించి దారీతెన్నూ కనిపించడంలేదు. ముందు చూపుతో వెంట తెచ్చుకున్న టార్చ్‌లైట్‌తో నడక సాగించింది. ఇంకాస్సేపు చూసి ఏ చెట్టో ఎక్కి తెల్లారాక మళ్లీ అనే్వషణ సాగించాలనుకుంది. అప్పుడే గౌతమికి ఓ ఆలోచన వచ్చింది. రెండు చేతులూ నోటి దగ్గరగా పెట్టుకుని మైక్‌లోలా ‘బ్లాక్‌టైగర్’ పేరుతో గట్టిగా అరిచింది. ఆ అరుపునకు బ్లాక్ టైగర్ రాలేదు గానీ, ఓ బెంగాల్ టైగర్ వచ్చి ఆమె కెదురుగా సెటిలై ఆమెకేసే చూస్తోంది.
గౌతమి పైప్రాణాలు పైనే పోయినట్టయింది. అయినా ధైర్యం తెచ్చుకుని టార్చ్‌లైట్ దాని కళ్లల్లో పడేలా వేసింది.
దానికి చిరాకు పెరిగినట్టుంది. భయంకరంగా గాండ్రిస్తూ రెండడుగులు ముందుకు వేసింది. గౌతమి గుండె ఆగిపోతుందా అన్నంత వేగంగా కొట్టుకోసాగింది. చిరు జంతువులు కంగారుగా పరుగులు తీశాయి. తండ్రి చెప్పిన గతం గుర్తొచ్చి ‘నాకీ అడవిలోనే చావు రాసి పెట్టినట్టున్నాడా దేవుడు. అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు చావు తప్పదు’ అనుకుంటూ కళ్లు మూసుకుంది. మరో క్షణంలో పులి ఆమె మీద దూకేదే. కానీ ఓ కేక విని ఠక్కున ఆగిపోయింది. ఆ కేక విని గౌతమి కూడా కళ్లు తెరిచింది. మరోసారి ‘సింధూ’ అన్న కేక వింతగా చేసిన వూళ లాంటి శబ్దం వినిపించడం, అంత భయంకరమైన పులి, పిల్లిలా చెట్లలోకెళ్లి మాయమవడం జరిగిపోయాయి.
ఆమె తేరుకునేలోగానే బలాఢ్యులైన ఇద్దరు యువకులు యమ భటుల్లా వచ్చారక్కడికి. వాళ్ల చేతుల్లో పెద్దపెద్ద కాగడాలున్నాయి. కళ్లు మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. మెళ్లో పూసలు, తల మీద ఈకల కిరీటాలూ లేకపోయినా వాళ్లు అడవి మనుషులే అని అర్థమై పోయింది గౌతమికి. హఠాత్తుగా ఉత్సాహం వచ్చేసింది.
‘్థంక్స్! సమయానికొచ్చి నా ప్రాణాలు కాపాడారు’ అంది కృతజ్ఞతగా చేతులు జోడిస్తూ. వాళ్లు మొహాలు చూసుకున్నారు. తర్వాత-
‘ఎవర్నువ్వు?’ అన్నారు కఠినంగా.
‘నా పేరు గౌతమి. బ్లాక్‌టైగర్‌తో పనుండి వచ్చాను’ అంది నిర్భయంగా.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్