అమ్మవార్లకు ‘దృశ్య’ నీరాజనం
Published Sunday, 21 April 2019బోనాలు. ఒక తన్మయత్వపు వేడుక. మహంకాళి, పోచమ్మ తదితర స్ర్తి దేవతలను శతాబ్దాలుగా ఆరాధిస్తూ తమ కాలాతీత నమ్మకాలను వర్తమానంతో మిళితం చేసుకుని, భవిష్యత్తు పట్ల విశ్వాసం నింపుకునే వేడుక. బోనాలు అంటే భోజనం. బువ్వ. వివిధ స్ర్తి దేవతల పేరుతో తాము కొలిచే మహంకాళికి భక్తులు ఇష్టంతో సమర్పించే భోజనం బోనాలు. వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో స్ర్తి దేవతలకు ఆహారాన్ని నివేదించే సంప్రదాయాలు ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకునే ‘బోనాలు’ జాతర ప్రత్యేకమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ‘బోనాలు’ పండుగను రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక పండుగగా ప్రకటించింది. ఈ నిర్ణయం ఎంతో సంబురంగా జరుపుకునే బోనాలు పండుగకు మరింత జోష్‌ను తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సంస్కృతికి సంబంధించి వచ్చిన నాలుగు పుస్తకాల్లో ఆర్ట్ ఎట్ తెలంగాణ, గాడెస్ ఆఫ్ ఫోక్, కల్చర్ ఎట్ తెలంగాణ తరువాత వచ్చిన తాజా పుస్తకం ‘బోనాలు: మహంకాళి జాతర.’
‘తెలంగాణ సాహిత్య కళావేదిక’ సాహిత్య అభిమానులకు ఒక అపురూపమైన బోనాన్ని ‘బోనాలు: మహంకాళి జాతర’ అనే అరుదైన పుస్తకం రూపంలో సమర్పించింది. ఈ అక్షయ పాత్రకు సినీ దర్శకుడు, లలిత కళారాధకుడు అయిన బి.నరసింగరావు ప్రధాన సంపాదకుడు (చీఫ్ ఎడిటర్) రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ పదకర్త. వింటే భారతానే్న వినాలేమో కాని, చూస్తే బోనాలనే చూడాలి.
తమ దృష్టికి వచ్చిన, తాము సేకరించిన దాదాపు 10 వేల ఫొటోగ్రాఫ్‌ల నుంచి బోనాలకు తాము ఇవ్వదలుచుకున్న దృశ్య రూపానికి అనుగుణంగా ప్రధాన సంపాదకులు 129 ఫొటోగ్రాఫ్‌లను ఎంపిక చేసుకున్నారు. ఈ పుస్తకంలోని 300 పేజీలలో 14 మంది ఫొటోగ్రాఫర్లు తమదైన దృష్టి కోణంతో దర్శించిన ఈ చిత్రాలు చూపరులను ఆయా సందర్భాలలోకి తీసుకెళ్తాయి. వీటికి అదనంగా పెయింటింగ్‌లు, మ్యాప్‌లు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కాఫీటేబుల్ బుక్‌గా పొరపడే అవకాశం ఉంది. పెద్దపెద్ద ఆఫీసుల్లో, గొప్పవారింట కలవవలసిన వారి కోసం వేచి చూడాల్సిన సందర్భాల్లో, విమాన ప్రయాణాల్లో సమయం సద్వినియోగం కావడానికి కాఫీ టేబుల్ పుస్తకాలను ఉంచుతారు. అవి అందంగా కన్పిస్తాయి. చూడదగ్గ బొమ్మలుంటాయి. కాస్సేపట్లో తిరగేయవచ్చు. రిఫరెన్స్ గ్రంథంగా రూపొందిన ఈ పుస్తకం ఆ కోవలోనిది కాదు. అనూజువల్ బుక్. అసాధారణమైనది. ఇందులోని ప్రతి పదమూ ఎంతో పరిశోధాత్మక హృదయంతో రాసింది. ప్రతి చిత్రమూ మేధోదృష్టితో తీసినది. ఆ అమరికలో ఒక సౌందర్యలహరి తొణికిసలాడుతుంది. పుస్తకం కవర్ ప్రైస్ 3,000 రూపాయలు. ప్రతి గ్రంథాలయమూ, సామాజిక సంస్థా తమ సేకరణలో ఉంచుకోదగినది.
శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్ లక్కా పసుపు పారాణి పాదచిత్రం బ్యాక్ కవర్‌గా వెలువడిన బోనాలు: మహంకాళి జాతర పుస్తకాన్ని స్పర్శించి లోపలి పుటలలోకి వెళ్తుంటే ఒక దేజావూ అనుభవం కలుగుతుంది. ఆ అనుభూతిని ఎలా వర్ణించడం? భారతరత్న దివంగత బిస్మిల్లాఖాన్ ఇలా చెప్పేవారు. వారణాసిలో పంచగంగఘాట్ సమీపంలోని బాలాజీ మందిర్ రాతిని స్పర్శిస్తే చేతుల ద్వారా ఒక స్వరం ప్రవహించేదట. ఆ సుర్‌ను సమస్త శరీరం ఆలకించేదట. బాలాజీ మందిర్ స్పర్శలో తాను విన్న స్వరానే్న షహనాయి ద్వారా విన్పించేందుకు ప్రయత్నిస్తా (వహి సుర్ మై ఆప్‌కు సునానేకా కోషిస్ కర్‌తాహూ) అనేవారు భారతరత్న. స్థలకాలాదులకు అతీతమైన ఒక దివ్యానుభవాన్ని తత్‌క్షణంలో పొందడమే కదా దేజావూ అంటే!
అనాది కాలం నుంచి స్ర్తి దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామ క్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న జీవధార ఆ సంప్రదాయం. ఇందులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధి విధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. జంటనగరాల ప్రజలు జరుపుకునే బోనాలు జాతర, స్ర్తి దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఏ విధంగా?
ప్రధాన సంపాదకులు పుస్తకంలోకి స్వాగతం పలుకుతూ బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం అంటారు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖాల్లో నువ్వు తోడుగ ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం. పురాతన కాలం నుంచి బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. నేటి మహానగరాలైన హైదరాబాద్, సికిందరాబాద్‌లు, పల్లెలుగా ఉన్నప్పటి నుంచి బోనాలు జాతర జరుగుతోంది. ఈ రెండు పల్లెలు పల్లెలుగా స్థిరపడక ముందు ఇప్పటి సికిందరాబాద్‌కు శివారు గ్రామమైన ‘చిన్నతొకటె’ జంటనగరాలలో తొలి జనావాసం. నాంపల్లి, చిక్కడపల్లి లాంటి నేటి జనసమ్మర్థపు ప్రాంతాలు అప్పట్లో చెరువులు, కుంటలతో కూడిన సుక్షేత్రాలు. స్థానిక పాలకులు, కులీ కుతుబ్‌షాలు, నిజామ్‌లు.. ఎందరెందరో పాలకులు మారినా, పల్లెలు మహానగరమైనా బోనాలు ప్రజల జీవన శైలిలో నిత్యనూతనంగానే ఉంది. ఎనిమిదవ నిజాం పాలనలో 1908లో హైద్రాబాద్‌కు మూసీనది వరద వలన కలిగిన నష్టం అంతా ఇంతా కాదు. అప్పటి పాలకుడు స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు గంగమ్మను శాంతించమని పూజలు చేశాడు. కానుకలిచ్చాడు.
రామోజు హరగోపాల్ రచన ‘కుంఫిణీ చరిత్ర’ ప్రకారం కుంఫిణీ రికార్డులలో ఉదహరించిన స్ర్తి దేవతలలో ఇప్పటికీ 33 మంది స్ర్తి దేవతలు పూజలందుకుంటున్నారు. ఎల్లమ్మ, బాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, కాళమ్మ వంటి పేర్లతో భక్తులు ఆయా దేవతలను కొలుస్తున్నారు. పగలు పోయి చీకటి ప్రవేశిస్తే, ఆ చీకటిలో చల్లదనాన్నిచ్చే చంద్రకాంతి : స్ర్తి దేవతలు తమను నమ్ముకున్న భక్తులకిచ్చే ప్రశాంతి. అందుకు కృతజ్ఞతగా ప్రజలు బోనాలు సమర్పిస్తారు. సాధారణ దినాల్లో కూడా దారిలో పోతూ పోతూ ఏ మైసమ్మ గుడో, ఎల్లమ్మ గుడో, నల్లపోచమ్మ గుడో కన్పించినపుడు ఒక్క క్షణం తమ చేతులను హృదయానికి హత్తుకుంటారు సాధారణ జనం. ఆ క్షణంలో 33 కోట్ల మంది దేవతలు భక్తులపై పూలజల్లు కురిపిస్తారు. కష్టాలు, కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులతో, అనారోగ్యాలు, ఈతిబాధలతో సతమతమయ్యే భక్తుల హృదయాలు తేటబడతాయి.
విశ్వాసానికి హేతువులుండవు. ముందు తరాల నుంచి సంక్రమించిన అనుభవాలతో కూడిన అనుభూతే విశ్వాసులకు ప్రమాణం. తల్లి గర్భంలోంచి ఊపిరి పోసుకుని ప్రకృతి గర్భంలోకి మరలా ప్రవేశించడమే జీవితం. తమకు జన్మనిచ్చినది, తమను తనలో కలుపుకునేది ఈ మధ్యలో తమను రక్షించేది ఆదిశక్తి. ఈ శక్తి చక్రచలనం నిరంతర ప్రక్రియ. అందుకు సంకేతం బోనాలు. బోనాలు సమర్పిస్తూ పల్లె జనులు అనేక పాటలు పాడుకుంటారు. జముకు బైండ్లవాండ్ల పాట ఈ సందర్భంగా తలచుకోదగినది.
మా వూరి పోశమ్మనే
పోశమ్మ కాశమ్మనే
పొలిమేర గాసేటి
పోతలింగయ్యనే
పాదపాదాన
పరిపరి దండాలు
సికిందరాబాద్‌లోని మహంకాళి ఆలయాన్ని కామన్ ఎరా 1815లో సురిటి అప్పయ్య స్థాపించారు. అప్పటి నుంచి 1953లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ నిర్వహణను తమ అధీనంలోకి తెచ్చుకునేవరకూ, సురిటి వారి కుటుంబం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించింది. తొలినాళ్ల ఉత్సవాలను, ఏనుగు అంబారీపై అమ్మను ఊరేగించే దృశ్యాలను కండ్ల ముందుకు తెచ్చే అపురూపమైన తెలుపు - నలుపు ఛాయాచిత్రాలు ఈ పుస్తకానికి చారిత్రక ప్రాధాన్యతనిచ్చాయి.
ఎ.శరత్‌బాబు, కె.రమేష్‌బాబు, సత్యనారాయణ గోల, ఆర్.మధుగోపాల్‌రావు, డి.ఎం.అర్జున్, రామా వీరేష్‌బాబు, నగర గోపాల్, పి.విజయభాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్ లక్కా, డి.రవీందర్‌రెడ్డి, కందుకూరి రమేష్ బాబు, ప్రభాకర్ బిలుక, జి.్భస్కర్, మైసా బాలకృష్ణ (బాలు)లు తమ ఫొటోగ్రాఫ్‌ల ద్వారా మూడు దశాబ్దాలుగా జంటనగరాల్లో జరుగుతున్న బోనాలు జాతర రూప చిత్రాలతో కనువింద చేస్తారు. అన్నవరం శ్రీనివాస్ ప్రాథమిక వర్ణాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగ్‌లు బోనాల సంప్రదాయపు అపురూప భావచిత్రాలు.
బోనాలు జాతర మూలపుటేర్లను స్పర్శిస్తూ మామిడి హరికృష్ణ పాఠకులకు పాత రాతియుగం నుంచి లభించిన ఆధారాలను తెలియజేస్తారు. సతిగా తనను తాను భర్త చితిపై ఆహుతి చేసుకున్న స్ర్తిమూర్తులను దేవతలుగా ఆరాధించిన సంప్రదాయం దక్షిణ భారతదేశంలో, పంజాబ్, గుజరాత్ ప్రాంతాలలో ఉన్న వైనాన్ని తెలియజేస్తారు.
మదర్ రైట్స్ గ్రంథ రచయిత ‘బారన్ ఒమర్ రోల్ఫ్’ పరిశీలనల నుంచి అనేక ఆసక్తికర అంశాలను పుస్తకంలో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా మాతృదేవతారాధనలను ఉటంకిస్తూ గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి ప్రజలను అంటురోగాల నుంచి కాపాడే దేవతలుగా పూజలందుకొనే వైనాన్ని తెలియజేస్తారు. క్రీ.పూ.20,000 సంవత్సరాల నాటికే తమిళనాడులోని అడిచెన్నలూరు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమలు, స్ర్తి దేవతల సారూప్యతను వివరిస్తూ సింధు నాగరికతలో (ఇండస్ వ్యాలీ) మాతృదేవత ప్రధాన దైవంగా స్థిరపడిన వైనాన్ని గుర్తు చేస్తారు. క్రీ.పూ.1750-600 సంవత్సరాలలో సింధు ప్రాంతాన్ని అతిక్రమించి ఉపఖండంలోకి విస్తరించిన ఆర్యుల జీవన శైలిని, వారి వైదిక సంస్కృతిలో మాతృదేవతలకు, స్ర్తిలకు ప్రాధాన్యతను ఇవ్వని రీతులను ‘బోనాలు: మహంకాళి జాతర’ పుస్తకం వివరిస్తుంది. అల్పయిన్, మంగోలాయిడ్ సమూహాల వలెనే ఆర్యులు స్రీతలకు ప్రాధాన్యతనివ్వదు. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు సమాజం పరిణామం చెందడం ప్రారంభమవుతుంది. ఇంద్రుడు పితృస్వామ్య వ్యవస్థకు ప్రతీక కాగా, ఆయన భార్య కేవలం ఇంద్రాణి (ఇంద్రుడి భార్య) హోదాకే పరిమితం అవుతుంది.
వింధ్యకు దిగువ భాగాన గల దక్షిణ భారతదేశంలో (మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర తమిళనాడు, కర్నాటక, కేరళ) వివిధ ప్రాంతాలను పర్యటించి సేకరించిన సమాచారంతో బ్రిటిష్ చరిత్రకారుడు హెన్రీవైట్ హెడ్ రచించిన ‘ద విలేజ్ గాడెసెస్ ఆఫ్ సౌత్ ఇండియా’ (1921)లో పలు ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో బోనాలు జరిగిన రీతిని హెన్రీ వైట్ కళ్లకు కట్టినట్లు రాశారు. కలరా, మశూచి తదితర రోగాలు గ్రామాన్ని పీడించినపుడు గ్రామ పెద్ద (రెడ్డి) ఆదివారం, గురువారం కాని ఇతర వారాల్లో ఫలానా రోజు పెద్దమ్మకు బోనాలు సమర్పించాలని నిర్ణయిస్తారు. కుమ్మరితో పెద్దమ్మ ఆకృతి చేయిస్తారు. వడ్ల కులానికి చెందిన వ్యక్తి దేవతను ఉంచే దిమ్మెను, వాహనాన్ని తయారుచేస్తారు. ఎంపిక చేసిన దున్నపోతును పెద్దమ్మకు బలి ఇచ్చేందుకు సిద్ధపరుస్తారు. ఊరి దళితుడు పండుగ గురించి, పెద్దమ్మకు బలి ఇచ్చే దున్నపోతు గ్రామాల్లోని అందరి ఇళ్ల వద్దకు రానున్న వైనం గురించి డప్పుకొడుతూ తెలియజేస్తారు. గ్రామస్తులు దున్నపోతుకు సాక పోస్తారు. పసుపు కుంకుమలను నుదుట రాస్తారు. వెంట వచ్చిన వారికి అన్నపానీయాలిస్తారు. నిర్ణీత ప్రాంతంలో పెద్దమ్మను కొలువచేసి ఎదురుగా అన్నపు బోనాలు ఉంచుతారు. ఆ బోనంపై ఒక పొట్టేలును నిలబెట్టి రెండుగా చేసి తొలి బలి ఇస్తారరు. ఆ రక్తం అన్నపు బోనంపై చిందుతుంది. ఆ రక్తాన్ని దేవతపై చల్లుతారు. అనంతరం దున్నపోతును బలి ఇస్తారు. దున్నపోతు కుడికాలును నరికి దున్నపోతు నోటిలో పెడతారు. అదేంటంటే సంప్రదాయం అంటారు. దున్నపోతు నుంచి కారిన రక్తాన్ని జాగ్రత్తగా మట్టి పాత్రలో ఒడిసిపడతారు. ఇతర గ్రామస్తులెవరైనా ఆ రక్తాన్ని దొంగతనంగా తీసుకువెళితే దేవతకు తాము సమర్పించిన బోనాల ఫలితం తమ గ్రామాలకు దక్కదని, ఇతర గ్రామస్తులకు చెందుతుందని ఆ జాగ్రత్త పాటిస్తారు.
దున్నపోతు తలపై కొవ్వుతో వెలిగించిన దీపాన్ని ఉంచుతారు. దాదాపు తెల్లవారుఝాము వరకూ, బోనాల కార్యక్రమం ముగిసే వరకూ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. గ్రామంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు కోళ్లు, మేకలు, పొట్టేళ్లు పెద్దమ్మకు సమర్పిస్తారు. వీటిని దళితులు బలిగా ఇస్తారు. మాంసాహారం తినని బ్రాహ్మణ తదితర కులస్తులు కూడా పెద్దమ్మను దర్శించుకుని నమస్కరిస్తారు. కొబ్బరికాయలు కొడతారు. పాయసాలు వంటి బోనాలు సమర్పిస్తారు. జాతరకు చివరి అంకంలో బోనంలో దున్నపోతు రక్తాన్ని కలిపి పొలి, పొలి అని అరుస్తూ గ్రామంలోని ఇళ్లపై, పొలాలలో చల్లుతారు. తద్వారా తమ నివాసాలు, పొలాలు రోగ విముక్తిని పొందుతాయని భావిస్తారు.
కొమ్ము వాయిద్యాలతో, వేప మండలను తిప్పుతూ, పసుపు కుంకుమలను చల్లుతూ, తాము బలి ఇచ్చిన దున్నపోతు తలను గ్రామ పొలిమేరలు దాటి పొరుగూరి పొలిమేరలలో ఉంచి గ్రామస్తులు పెద్దమ్మకు మొక్కుతారు. తద్వారా తమ గ్రామంపై పెద్దమ్మకు కలిగిన ఆగ్రహం పొరుగూరి వైపు మళ్లుతుందని విశ్వసిస్తారు. అనంతరం దున్నపోతు తలను గ్రామానికి చెందిన మాదిగ కులస్తుడు తీసుకువెళ్తాడు. గృహస్తులందరూ ఆ మాంసంతో చేసిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు.
హెన్రీవైట్ దాదాపు 98 సంవత్సరాల క్రితం ప్రత్యక్షంగా చూసి వర్ణించిన పై తరహా బోనాలు నిజామాబాద్ జిల్లాలోని కేశపల్లి గ్రామంలో గత సంవత్సరం జరిగాయని తెలుగు వెలుగు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించడం గమనార్హం!
హైదరాబాద్ బోనాలు
మనిషి నేటి రూపాన్ని ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాలు సంప్రదాయంలో, స్థల కాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలినాళ్లలో గ్రామాలకు పరిమితమైన బోనాలు, మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా మారింది. వాస్తవానికి నగరం పునాదిలో ఉన్నది గ్రామాలే కదా. సాధారణంగా పండుగల సందర్భంగా నగరంలోని వ్యక్తులు తమతమ కుటుంబాలతో తమ గ్రామాలకు తరలి వెళ్తారు. హైద్రాబాద్ సికిందరాబాద్‌లలో శ్రావణ - ఆషాఢ మాసాలలో నెల రోజులు (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారమున్న జూన్ - జూలై - ఆగస్టు మాసాలలో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి చీమల వరుసలుగా తరలి వస్తారు. తమను, పిల్లాజెల్లలను రోగాల బారి నుంచి కాపాడండమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ - ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు.
గోల్కొండ బోనాలు
హైద్రాబాద్‌లో జరిగే బోనాలకు సంబంధించిన రికార్డులు కుతుబ్‌షాహీ పాలనా కాలంలోని 1675 నుంచి లభిస్తాయి. అబుల్ హసన్ తానీషా గోల్కొండలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి 1675లో అంగరంగ వైభవంగా రంగులీనే బోనాలు ఉత్సవానికి శ్రీకారం చుడతాడు. ఆ విధంగా రేణుక ఎల్లమ్మ దేవాలయమూ, అక్కడ ఏటా జరిగే బోనాలు చరిత్రలో భాగమయ్యాయి. దాదాపు 260 సంవత్సరాలు గోల్కొండ రేణుక ఎల్లమ్మ ఆలయానికే పరిమితమైన బోనాలు తదనంతర కాలంలో లష్కర్, లాల్ దర్వాజా, ధూల్‌పేటలలోని మహంకాళి ఆలయాలకూ విస్తరిస్తాయి. క్రమేణా ఈ ఆలయాలూ గోల్కొండ రేణుక ఎల్లమ్మ ఆలయంలో వలెనే బోనాలకు ప్రధాన కూడళ్లుగా మారాయి.
లష్కర్ బోనాలు
లష్కర్ అంటే సైన్యం. సికిందరాబాద్‌లో సైన్యం బసచేసి ఉండేది కాబట్టి సికిందరాబాద్‌ను ‘లష్కర్’ అంటారు. మిలిటరీలో డోలీలను మోసే లష్కర్ వాసి సురిటి అప్పయ్య 1815లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహంకాళి ఆలయాన్ని దర్శిస్తాడు. అక్కడ అనేకులు కలరా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. తిరిగి వచ్చాక లష్కర్‌లోనూ ఆ విపత్తులు సంభవించాయి. తమ కుటుంబీకులను, ప్రజలను రోగ విముక్తులను చేస్తే నీకు ఆలయాన్ని కట్టిస్తానమ్మా అని ఉజ్జయిని మహంకాళికి అప్పయ్య మొక్కుకుంటాడు. కలరా, ఇతర అంటువ్యాధులు తగ్గి లష్కర్‌లో ఆరోగ్య పరిస్థితులు ఏర్పడిన తరువాత లష్కర్‌లో దారు (చెక్క) ప్రతిమతో మహంకాళిని రూపొందింపజేసి ఆలయంలో ప్రతిష్ఠింపజేస్తాడు.
ఆ తర్వాత 1864లో ఆలయం సమీపంలోని బావిని బాగుచేయిస్తుండగా మాణిక్యాలదేవి విగ్రహం లభిస్తుంది. మహంకాళి ఆలయపు గర్భగుడి పక్కనే మాణిక్యాలదేవి విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠాపన చేస్తారు. ఆ విధంగా ఉజ్జయిని మహంకాళి దేవత, స్థానిక గ్రామ దేవతగా ప్రజల పూజలు అందుకుంటున్నది. అప్పటి నుంచి లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. సురిటి వంశస్తులు పాలక మండలిలో వ్యవస్థాపక సభ్యులుగా ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు.
లాల్‌దర్వాజా బోనాలు
గోల్కొండ, లష్కర్, తర్వాత లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయపు బోనాలు ప్రసిద్ధి చెందినవి. ఈ ఆలయ నిర్మాణం కోసం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1905లో భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి మహరాజా కిషన్ ప్రసాద్ ఇక్కడి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సింహవాహిని మహంకాళికి ఆయన బహూకరించిన బంగారు బోనం ఈ ఆలయపు ఆకర్షణ. లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వలె ఇక్కడ కూడా రంగం నిర్వహిస్తారు. మాతంగి శ్యామల - రంగం సందర్భంగా భవిష్యత్ వాణిని వెల్లడిస్తూ భక్తుల నుంచి ప్రార్థనలు స్వీకరిస్తుంది. భవిష్యవాణిని విన్పించిన అనంతరం సింహవాహిని మహంకాళి అమ్మవారిని మేళతాళాలతో, ఆటపాటలతో ఊరేగింపుగా భక్తుల సందర్శనార్థం తీసుకువెళతారు.
ధూల్‌పేట బోనాలు
ధూల్‌పేటలోని మహంకాళి ఆలయానికి కూడా నూరేండ్ల చరిత్ర ఉంది. పాలకమండలి మాత్రం 1925వ సం.లో ఏర్పడింది. కాంతం అంతయ్య, బాలయ్యలు విరాళంగా ఇచ్చిన భూమిలో ఈ ఆలయం స్థాపించారు. ఇక్కడ జరిగే బోనాలకూ మిగిలిన మూడు చోట్లా జరిగే బోనాల అంతటి ప్రాధాన్యత ఉంది.
బోనాల నిర్వహణకు
పూర్వరంగం
బోనాలను ‘పంగ్యం’గా పిలిచే ఐదుగురు పూజారులు నిర్వహిస్తారు. వీరంతా బాలినేని, పంబాల, మాత, కొలకాడు, మాసిదేవి అనే దిగువ కులాలకు చెందినవారు. గౌతమ పురాణం ప్రకారం పంగ్యంలు పూజలు నిర్వహిస్తారు.
ఆచారవంతులు
బోనాల సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహించేందుకు పదిమంది నిర్వాహకులను నియమిస్తారు. పెద్ద కాపు, పెద్ద గొల్ల, పెద్ద గౌడ్, పెద్ద కుమ్మరి, బైనేని, పెద్ద చాకలి, బడుగురాజు, పెద్ద మేదరి, కొలకాడు, మాత అనే వారిని ఆచారవంతులుగా పిలుస్తారు. ఈ విధానంలో బైండ్ల, పంబల, మాతంగి కులస్థులు ప్రధానపాత్ర వహిస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్ల, మాదిగ, బైనీడు, గిల్ల కురుమ, గౌడ్, కమ్మరి, కస్కూరు, పద్మశాలి, ఆసాదులు, మాతంగులు తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తారు. వీరిలో కుమ్మరి ప్రధానపాత్ర వహిస్తాడు. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, గంగమ్మ తదితర స్ర్తి దేవతలను రూపొందించడం. గండ దీపాలను తయారుచేయడం, గ్రామస్తులందరి తరఫున బోనాలను దేవతకు సమర్పించడాన్ని బట్టి కుమ్మరికిగల ప్రాధాన్యతను గమనించవచ్చు. పై కులాలకు చెందిన వారు బోనాలను ప్రత్యక్షంగా సమర్పించరు. కుమ్మరి ద్వారానే సమర్పిస్తారు. పై కులాల వారు ఘటం అనే పాత్రలో తెచ్చిన బోనాన్ని తమ ఇండ్లల్లో నివేదిస్తారు. క్రింది కులాల వారు పై కులాల వారు సామరస్యంగా జరుపుకునే జాతరగా కూడా బోనాలును అభివర్ణించవచ్చు.
బోనాలకు, ఘటాలకు పసుపును పూసి, కుంకుమ బొట్లు పెడతారు. గవ్వలను అలంకరణకు వినియోగిస్తారు. వేప మండలను వింజామరలుగా వీయడం కన్పిస్తుంది. గ్రామ దేవతలకు కల్యాణం చేయడం ఆ సందర్భంగా పటాలు తయారుచేసి సూర్యచంద్రుల వంటి బొమ్మలతో అలంకరించడం, బోనం కుండలు, తొట్టెలతో ఊరేగింపు జరపడం, ఉత్సవాల్లో కొరడాలతో ముందుండి నిమ్మకాయలు కొరుకుతూ వీరంగం చేసే పోతురాజు.. ఆటపాటల ఊరేగింపులు బోనాల ఊరేగింపుల ప్రత్యేకత. ఆలయాల వద్ద భక్తులు మొక్కులుగా సమర్పించిన కోళ్లు, మేకలను పోతురాజులు నోటితో గావు పట్టి రక్తాన్ని వీరావేశంతో ఉమ్మువేయడం, భక్తులు పూనకాలు పోవడం బోనాలులో విశేషం. బోనాలులో రెండవ రోజు రంగం అనే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అవివాహిత అయిన మాతంగి రంగం అనే వేదికను ఎక్కి భవిష్యవాణిని చెబుతుంది. భక్తులకు వారు చేసిన మంచి చెడ్డలు చెప్పి, భవిష్యత్తులో సంభవించగల ఆపదలను తొలగించుకోవడానికి ఎట్లా నడుచుకోవాలో హితబోధ చేస్తుంది. రంగం ఎక్కిన మాతంగి ఆ సమయంలో సాక్షాత్తూ అమ్మవారే.
అక్షరాలలో చెప్పలేని రాగరంజిత వర్ణ వైభవాన్ని ‘బోనాలు: మహంకాళి జాతర’ పుస్తకం అనుభవంలోకి తెస్తుంది. *