S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యసనం( కథ)

రత్నగిరి జమీందారు దగ్గర ఆదాయ వ్యయాలన్నీ చూడటానికి చలమయ్య అనే గణికుడు ఉండేవాడు. జమీందారుకి ఆయన నమ్మినబంటు.
చలమయ్యకి ఒక అలవాటు వుండేది. అదేమంటే తాంబూలం అతిగా తీసుకోవడం. అతని దగ్గర వెండితో చేసిన పాతకాలం అడపం పెట్టె ఒకటి వుండేది. అది అతనికి తాత నుంచి సంక్రమించింది. అందులో అతనికి కావలసిన తాంబూల దినుసులన్ని వుండేవి. దినంలో అనేకసార్లు తాంబూలం వేసుకోనిదే చలమయ్యకు బుర్ర పనిచేసేది కాదు.
ఇదిలా వుండగా, చలమయ్య కొడుకు వున్న వూర్లో గురువుల వద్ద విద్య పూర్తి చేశాడు. పట్టణం వెళ్లి పెద్ద చదువులు చదువుకోవాలని వాడి కోరిక. ‘అంత తాహతు మనకు లేదురా!’ అని చలమయ్య వాడికి చెప్పి చూశాడు. కానీ వాడు పట్టు వీడే రకం కాదు.
దాంతో చలమయ్య భార్య, ‘ఏమండీ! నాదొక ఆలోచన. మీరు జమీందారుగారికి నమ్మకస్తులు కదా! ఆయన గారిని ఆర్థిక సహాయం అడగండి. వాడి చదువు పూర్తయ్యాక కావాలంటే వడ్డీతో సహా తీర్చేద్దాం’ అంది.
భార్య సలహా చలమయ్యకి మహా బాగా నచ్చింది. జమీందారుగారితో ఈ విషయం చెప్పి, తన కోరిక బయటపెట్టాడు చలమయ్య.
జమీందారు ముఖం ముడిచి, ‘డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయటయ్యా! మూడేళ్ల నుండి వర్షాలు సరిగా పడక, పంటల్లేక, పన్నులు వసూలు కాని విషయం నీకు తెలియంది కాదు గదా! అయినా దుబారా ఖర్చులు నువ్వు తగ్గించుకుంటే, నీ కొడుకు చదువు నీకొక సమస్య కాదు!’ అన్నాడు.
‘దుబారా ఖర్చా? నేను చేస్తున్నానా?’ అన్నాడు చలమయ్య ఆశ్చర్యంగా.
‘దుబారా కాకపోతే ఏమిటయ్యా! నువ్వు దినమంతా అదే పనిగా తాంబూలం వేస్తుంటావ్! దానికి ఎంత ఖర్చవుతుందేమిటి? అది దుబారా ఖర్చుకాక మరేమిటి?’ అని రెట్టించి అడిగాడు జమీందారు.
చివుక్కుమంది చలమయ్యకి. మారు మాటాడకుండా ఇంటికి వచ్చి, భార్యతో చెప్పి, బాధ పడ్డాడు. ‘జమీందారు దగ్గర పగలనక రేయనక శ్రమ పడి పని చేస్తూంటే, అవసరం వచ్చినపుడు ఆదుకోవాల్సింది పోయి, సూటిపోటి మాటలన్నాడే! తాంబూలం వేసుకోవడం అనే చిన్న అలవాటు. పెద్ద చెడు అలవాటుగా చూపి, గేలి చేశాడే! తాంబూలం ఆపేస్తే, చదువుకు అయ్యే ఖర్చు వస్తుందా? చూడబోతే జమీందారు గారికి నా మీద ఏదో అసూయ ఉన్నట్టుంది. మనసొప్పక ఏదో అన్నాడు గాని.. డబ్బు ఇవ్వను ఇష్టం లేకపోతే ఆ మాట అంటే సరిపోయేది గదా! ఇదంతా ఎందుకు..?’ ఇలా రాత్రంతా ఆలోచనలతో గడిపాడు చలమయ్య.
తెల్లారేసరికి అతనొక స్థిర నిర్ణయానికి వచ్చేశాడు. అడపం పెట్టెను అటక మీదకు విసిరేసి దివాణానికి వెళ్లాడు. ఏకాగ్రతతో తన పని తాను చేసుకోసాగాడు.
నాలుగయిదు రోజులు జమీందారు చలమయ్యను గమనించాడు. అడపం పెట్టె చేతిలో లేదు. తాంబూలం మాట లేదు. చలమయ్యను చేరబిలిచి, ‘తాంబూలం వేసుకోవడం మానేసినట్టున్నావు’ అన్నాడు.
‘అవును, మీరు చెప్పినట్లే చేసి, మిగిల్చినంత మిగులుస్తాను. ఇంకా కావాల్సిన మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలా? అని ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఇంటి ఖర్చులోను కొంత పొదుపు చేయగలను అన్పిస్తున్నది’ అన్నాడు చలమయ్య.
‘బావుంది, ఇక నీ పిల్లవాడి చదువు గురించి నువు ఆలోచించనక్కరలేదు. ఆ సంగతి నేను చూస్తాను. నువు సహాయం అడిగినపుడు నేను తాంబూలం గురించి మాట్లాడాను. నీకు రోషం వచ్చింది. మంచిదే! తాంబూలం చెడ్డ అలవాటని గాదు నేనన్నది. ఏదయినా ఎక్కువయితే అది వ్యసనం కిందే లెక్క. అది ఆరోగ్యానికి భంగం, అనవసర వ్యయం కూడా. ఆ విషయం నీకు తెలియడానికే కాస్త పరుషంగా మాట్లాడాను. నువు నీ తప్పు దిద్దుకున్నావ్. అయినా నువు ఈ మాట వినే వుంటావ్...
ఒక అలవాటుకయ్యే ఖర్చు, ఒక విద్యార్థికి విద్య నిస్తుంది అని. అది నిజమని నా అభిప్రాయం. నీ పిల్లవాడికి సహాయం చేయకూడదు అనుకునేంత పిసినారిని కాదు. ఆ విషయం నీకూ తెలుసు. ఇక నీ కొడుకు చదువు గురించి బెంగ మానేయ్. నేను చూసుకుంటాను’ అన్నాడు ఆప్యాయంగా జమీందారు.
తన తప్పును తాను తెలుసుకోవడానికే ఆ రోజు జమీందారు అలా మాట్లాడారు. ఆయన సహృదయాన్ని అపార్థం చేసుకున్నానే అనుకుంటూ కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరించాడు చలమయ్య.
ఆ తర్వాత ఏ ఇబ్బందీ లేక చలమయ్య కొడుకు విద్య పూర్తయి, వాడు మంచి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టాడు.

-డా. గంగిశెట్టి శివకుమారి 9441895343