S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసంతం వెనుకే గ్రీష్మం

శిశిరం వెనుకే వసంతం.
వసంతం వెనుకే పరుగెత్తుకుంటూ గ్రీష్మం వస్తుంది.
ఎండలు మండే రోజుల్లో చెట్లు చక్కగా చిగురించి పూయడం ఏమిటి?
వసంత శోభను చూసి మురిసిపోనివ్వకుండా గడపదాటి బయటకు పోనివ్వకుండా ఎండలు ఏమిటి?.. ఆలోచనలు చుట్టుముట్టాయి గ్రీష్మను.
కొత్త కాపురం మొదలయ్యింది. ఇంకా అదును పదును రాలేదు.
బిడియం లేకుండా భర్తతో మాట్లాడే చనువు ఇంకా ఏర్పడలేదు.
గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు... సౌకర్యాలకు లోటు లేదు...
ఆప్యాయంగా మాట్లాడే అత్తమామలు.. కలుపుగోలుగా వుండే తోడికోడలు.. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఏదో అసంతృప్తి.
మెట్టినిల్లులో వుంటే పుట్టింటి మీద ధ్యాస. అక్కడికి వెళ్తే మళ్లీ అత్తగారింటి దారిని వెతుక్కుంటూ మనస్సు పరుగులు...
‘మనం కట్నకానుకలు ఇచ్చే స్థితిలో లేమని తెలిసి కూడా మీ అత్తగారు నినే్న కోడలిగా ఎంచుకుంది.. వాళ్లు చెప్పినట్లు నడుచుకో!’ తరచూ అమ్మ ఫోన్‌లో హితబోధ.
‘వ్యాపారం పని మీద చీరాల వెళ్తున్నాను కారులో.. వెళ్లే దారిలోనే కదా మీ ఊరు వచ్చేది.. నాతోపాటు వచ్చెయ్యి’ అన్నాడు వసంత్ గ్రీష్మతో.
పుట్టింటికెళ్లే అవకాశం వచ్చిందని ఒకప్రక్క సంబరం.. ‘లేడికి లేచిందే ప్రయాణమన్నట్లు’ కోడలు నిద్ర లేవంగానే పుట్టింటి వైపు పరుగులు తీస్తుందేమిటి?’ అని అత్తగారు అనుకుంటారేమోనన్న సందేహం... భార్య మొహంలో కదలాడుతున్న భావాలు చదివేశాడు వసంత్.
‘దిగులుగా కన్పిస్తున్నావట.. వారం రోజుల్నించి సరిగ్గా భోజనం కూడా చెయ్యడం లేదట. పుట్టింటి మీద గాలి మళ్లినట్లుంది’ అంది మా అమ్మ.
‘అదేం లేదు.. బాగానే వున్నాను..’ అంది గ్రీష్మ.
‘నువ్వు చిక్కినా అందంగా వుంటావన్న విషయం నాకు తెలుసు. మా వాళ్లకు తెలియదు కదా! నీ వాలకం చూసి కంగారుపడుతూ వుంది మా అమ్మ. నిన్ను మునిపల్లె తీసుకువెళ్లమని మా అమ్మే చెప్పింది.’
‘మీరేదో వ్యాపారం పని మీద వెళ్తున్నారు.. మీతో నేనెందుకు? ఇక్కడకు వచ్చి వారం రోజులు కూడా కాలేదు.. ఒకవేళ మా ఊరు వెళ్లాలనుకుంటే బస్సులో వెళతాను’ అంది గ్రీష్మ.
అప్పుడే హాల్లోకి వచ్చిన గ్రీష్మ అత్తగారు ఆ మాటలు వింది.
‘బస్సులో ఎందుకమ్మా? అబ్బాయి కారులో వెళ్తున్నాడు కదా! వాడితో వెళ్లు! వారం రోజులు మీ ఊళ్లో ఉండు. నువ్వెప్పుడు రావాలనుకుంటే అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి కారులో తీసుకువస్తాడు’ అంది ఆమె.
బ్యాగ్‌లో బట్టలు సర్దుకుని వసంత్‌తో కార్లో బయల్దేరింది.
భార్య మొహంలో చొచ్చుకువచ్చిన సంతోషాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆడపిల్లకు పుట్టింటితో బంధం కలకాలం ఉంటుందనుకున్నాడు. పుట్టింట్లో వుంటే ఆడవాళ్లకు బీపీ తగ్గడం, అత్తగారింట్లో బీపీ పెరగడం సహజమేమో ననుకున్నాడు. మెట్టినింట్లో ఎన్ని సౌకర్యాలు, అపురూపంగా చూసుకున్నా మొగ్గు పుట్టింటిమీదే ఉంటుంది.
కార్లో వసంత్ ప్రక్కన కూర్చున్న గ్రీష్మకు ‘అదృష్టమంటే తనదే’ అనుకుంది.
అత్తగారింట్లో కాలు కింద పెట్టనివ్వరు. తోడికోడలు వంటగదిలోకి రానివ్వదు. ‘మీ ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకో! పిల్లలు పుట్టేక వంటగదిలోకి ఎటూ రాక తప్పదు’ అనేది.
‘కడుపు పండితే కబుర్లు అన్నీ పిల్లలకే! కట్టుకున్న మొగుడితో మాట్లాడటానికి తీరిక ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఉంటాడు బావగారు. వాళ్లకు ఇంకా సంతానం కలుగలేదు. ఇంట్లో చిన్నపిల్లాడు దోగాడాలని వాళ్ల కోరిక.
అత్తగారైతే నగల పెట్టెలన్నీ తన ముందు ఉంచి ‘నీకు నచ్చినవి వేసుకో! నచ్చకపోతే జ్యుయిలరీ మార్ట్‌కు వెళ్లి కొత్తవి కొనుక్కో!’ అంటుంది.
‘మీ ఊరు వచ్చాం!’ అన్నాడు వసంత్.
మునిపల్లెను చూడగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఊరు వదిలి వారం రోజులు కూడా కాలేదు. ఎన్నో సంవత్సరాల తరువాత సొంత ఊరికి వచ్చినట్లుగా ఉంది.
‘కార్లో నా పక్కన కూర్చున్నావు గానీ సరదాగా ఒక్కమాట మాట్లాడలేదు’ అన్నాడు వసంత్.
అతని చేతిని నిమిరింది నవ్వుతూ.
ఆ చిన్న స్పర్శకే కదిలిపోయాడతను.
స్నేహితుడి పెళ్లిలో గ్రీష్మను చూసి పరవశించిపోయాడు.
వారం రోజుల తరువాత కారులో వదిన, తల్లితో కలిసి గ్రీష్మ ఇంటికి కార్లో వచ్చాడు. సరాసరి ఇంట్లోకి చొరవగా వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యపోయింది.
‘నువ్వేనా గ్రీష్మవి! పొన్నూరులో స్నేహితుడి పెళ్లిలో నిన్ను చూశాడట మా మరిది.. నువ్వు బాగా నచ్చావట’ అంది అనన్య గ్రీష్మ చెయ్యి పట్టుకుని.
ఆ అబ్బాయి తల్లి తన బుగ్గలు నిమిరి ‘చిదిమి దీపం పెట్టుకోవొచ్చు. నీ చెయ్యి పట్టుకున్న అమ్మాయి నా పెద్దకోడలు.. అక్కడ సిగ్గుపడుతూ నిలబడ్డాడే వాడే నా రెండో కొడుకు.. వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నా రెండో కోడలివి అవుతావ్’ అంది పద్మజ.
హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి చిన్న పెట్టె తీసింది వసంత్ తల్లి.
‘వెండి పట్టీలు ఇస్తూ ‘మా వాడిని ఇష్టపడితే కాళ్లకు వేసుకో! మా అబ్బాయి నీకు నచ్చకపోతే, మరొకరు నీ మనస్సులో ఉంటే వెండి పట్టీలు తిరిగి ఇచ్చెయ్యి’ అంది పద్మజ.
అపురూపంగా కన్పించాయి. వాటిని చేతితో నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు.
‘ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదేమో! పట్టీలు కాళ్లకు వేసుకోలేదు’ అన్నాడు వసంత్.
‘ముక్కూ మొహం తెలియని వాళ్లు ఇచ్చిన కాలి పట్టీలు వేసుకుంటుందా వెంటనే. ఆ పిల్ల తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దూ?! పట్టీలు మనకు వాపసు ఇచ్చేయ్యలేదుగా’ అంది అనన్య.
వంటగది వైపు పరుగెత్తింది.
అమ్మ గారెలు వండుతూ వుంది.
వేడివేడిగా ఎప్పుడు తిందామా అన్న ఆతృతలో ఉన్నాడు పక్కనే కూర్చున్న తండ్రి.
‘చుట్టాలు వచ్చారు.. హాల్లోకి వచ్చి మాట్లాడండి’ అంది తను.
‘మన ఇంటికి ఎవరు వస్తారే? అప్పులు ఇచ్చిన వాళ్లై ఉంటారు.. నాన్న ఇంట్లో లేడని చెప్పాల్సింది నువ్వు’ అన్నాడు నాన్న చిరాకు పడిపోతూ.
వచ్చిన వాళ్లు ఎంత మందో కనుక్కుని ప్లేట్లలో గారెలు సర్ది కూతురిని పట్టుకుని వెళ్లమని చెప్పింది.
విసుక్కుంటూ వచ్చాడు నాన్న హాల్లోకి.
ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ వాళ్లది. లారీలు, ప్రైవేటు బస్సులు ఉన్నాయి వాళ్లకి. పటమట లంకలో పెద్ద భవనం ఉంది. కట్నం తీసుకోకుండా తనను కోడలిగా చేసుకుంటామని పద్మజ చెప్పగానే సంబరపడిపోయారు అమ్మానాన్నలు.
వాళ్లు కూర్చున్న మంచం మీద సరైన దుప్పటి లేదు. కూర్చోవడానికి సరైన కుర్చీలు లేకే మంచం వాల్చింది.
కోడిపుంజు మంచం మీదకు ఎగిరి రెట్ట వేసింది.
తను అదిలిస్తున్నా మంచం దిగలేదు కోడిపుంజు.
నవ్వుతున్నాడు వసంత్ తన అవస్థ చూసి.
మళ్లీమళ్లీ అతన్ని చూడాలని ఉన్నా సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది.
గారెలు ప్లేటు అతని చేతికి అందిస్తుంటే తన కళ్లల్లోకి సూటిగా చూశాడతను. కంగారుపడింది. ఆ కంగారులో అతని కాలు తొక్కింది.
‘్ఫరవాలేదు’ అన్నాడతను తన చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి వదిలేశాడు.
గారెలు అతను ఎంతో ఇష్టంగా తినడం చూస్తూ ఉండిపోయింది...
‘ఏమిటి? దేవిగారు ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి ముందు కారు ఆగి ఐదు నిమిషాలవుతుంది.. కారు దిగరా? మళ్లీ విజయవాడ వెళ్లిపోదామా?’ అన్నాడు వసంత్.
ఆలోచనలు తెగిపోయాయి...
కారు దిగి ఇంట్లోకి వెళ్లిపోయింది.
వెనక్కు తిరిగి చూస్తే తన బ్యాగ్ వసంత్ భుజాన తగిలించుకుని తన వెనుక వస్తున్నాడు.
‘సారీ.. సారీ! ఏదో ఆలోచనల్లో పడి నా బ్యాగ్ నేనే మర్చిపోయాను’ అంది అతని దగ్గర నుంచి బ్యాగ్ అందుకుని.
‘బ్యాగ్ నేనే తెచ్చేవాడిని ఇంట్లోకి.. ‘చిన్న బ్యాగ్ కూడా మోయలేనంత సుకుమారంగా తయారయ్యావా? నీ బ్యాగ్ మీ ఆయన చేత మోయిస్తున్నావా?’ అని మీ అమ్మానాన్నలు అంటారేమోనని నీకు ఇచ్చేశాను’ అన్నాడతను.
ఇంట్లోకి అడుగుపెట్టి నలువైపులా చూసింది.
అంతా కొత్తగా అన్పించింది.
చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఇల్లు వారం రోజులకే మారిపోయిందా? హాల్లో ఎవరూ లేరు.. తన గదిలోకి వెళ్లింది.. అన్నయ్య ఆ గదిని ఆక్రమించుకున్నాడు. అన్నయ్య ప్యాంట్లు, షర్ట్స్ చిందరవందరగా గచ్చు మీద పడి ఉన్నాయి. గదిలో ఓ మూల సిగరెట్ ముక్కలు కన్పించాయి..
తను ఆ గదిలో ఉన్నప్పుడు ఎంత నీట్‌గా ఉండేది?
పెరట్లోకి వెళ్లింది. అమ్మ బట్టలు ఉతుకుతూ కన్పించింది. గ్రీష్మను చూసి ఆశ్చర్యపోయింది.
‘ఒక్కదానివే వచ్చావేమిటే? అల్లుడుగారు రాలేదా? అత్తగారింట్లో పొట్లాట పెట్టుకుని వచ్చావా?’ కంగారు కంగారుగా అడిగిందామె.
‘అదేం లేదులే! మీ అల్లుడుగారే తీసుకువచ్చారు నన్ను. ఆయనకు చీరాలలో ఏవో పనులు ఉన్నాయట.. నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆయన వెళ్తారు. హాల్లో కూర్చున్నారు మీ అల్లుడు.. కాఫీ కలుపు అర్జెంట్‌గా’ అంది గ్రీష్మ తల్లి భుజం మీద వాలిపోయి.
‘పాలు అయిపోయాయి. పాల ప్యాకెట్ తీసుకు రావాలి!’ చిల్లర డబ్బులు కోసం వంట గదిలో డబ్బాలు వెతికింది.
చిల్లర డబ్బుల కోసం తల్లి పడుతున్న అవస్థ చూసి తన బ్యాగ్‌లోని వంద రూపాయల నోటు తీసిచ్చింది.
పాల ప్యాకెట్ కోసం తల్లే సెంటర్ వైపు వెళ్లడానికి సిద్ధమవుతూ వుంటే చిరాకు పడింది గ్రీష్మ.
‘అన్నయ్య లేడా ఇంట్లో? నానే్నం చేస్తున్నారు?’ అడిగింది తల్లిని.
‘ఆ విషయాలు తరువాత చెబుతాను’ అంటూ చెప్పుల కోసం వెతుక్కుని కన్పించకపోవడంతో సెంటర్‌కు నడిచి వెళ్లింది అనసూయ. పాల ప్యాకెట్టు తెచ్చి కాఫీ కలిపింది.
కాఫీ తాగి వసంత్ వెళ్లిపోయాడు.
‘అత్తగారింట్లో ఎలా ఉందే?’ కూతురిని అడిగింది.
‘ఎలా ఉండటం ఏమిటి? మా అత్తగారిల్లు నువ్వు చూశావుగదా?!’
‘అది కాదే! నిన్ను బాగా చూసుకుంటున్నారా?’
‘వాళ్లకు వేరే పనేం లేదా ఏమిటి? నన్ను చూస్తూ కూర్చుంటారా ఏమిటీ? క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారుంటారు. అన్నయ్య ఏడి?’ అడిగింది గ్రీష్మ.
‘పోలీసులు మీ అన్నయ్యను లాకప్‌లో ఉంచారు’
‘ఎందుకు?’ ఆదుర్దాగా అడిగింది తల్లిని.
‘స్నేహితులు గుడి దగ్గర పేకాట ఆడుతుంటే వాళ్ల పక్కన మునిపల్లె వినాయకుడిలా కూర్చున్నాడు. మీ అన్నయ్య కూడా పేకాట ఆడుతున్నాడని పోలీసులు లాక్కెళ్లారు. మీ నాన్న తెలిసిన వాళ్లతో చెప్పించి అన్నయ్యను విడిపించే ప్రయత్నం చేస్తున్నారు’ అంది అనసూయ.
‘వదిన కన్పించదేం?’
‘మీ అన్నయ్యతో పోట్లాడి పుట్టింటికి వెళ్లింది.’
‘పొట్లాట ఎందుకు వచ్చింది?’
‘ఉద్యోగం సద్యోగం లేకుండా మీ అన్నయ్య ఖాళీగా ఉన్నాడని మీ వదినకు లోకువ! నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. తలొంచుకుని కూర్చుంటాడు గానీ భార్యను ఒక్క మాట అనడు... సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగం కోసం. చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. పాపం! వాడు మాత్రం ఏం చేస్తాడు?’ అంది ఆమె నిట్టూర్పు విడుస్తూ.
... సత్యం అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు. గోల్డ్ మెడలిస్ట్.. ఉద్యోగానికి సరిపడా అర్హతలు, సమర్థత ఉన్నా ఒక్కోసారి ఉద్యోగం దొరకదు. అన్నయ్యలో ఓర్పు, సహనం ఉన్నాయి. ఏ విషయంలోనూ ఎవరినీ నిందించడు. అందుకే అమ్మ అన్నయ్యను మునిపల్లె వినాయకుడని అంటూ ఉంటుంది. మునిపల్లె ఊరి మధ్య పొన్నూరు - గుంటూరు రహదారిలో పెద్ద వినాయక విగ్రహం ఉంది. మాటా పలుకు లేకుండా కూర్చునే వాళ్లను ఆ ప్రాంతంలో మునిపల్లె వినాయకుడని అంటూ ఉంటారు...
అదే సమయంలో సుబ్బయ్య వచ్చాడు ఇంట్లోకి సరాసరి.
‘కూర్చోండి! అన్నయ్యగారూ!’ అంది అనసూయ.
‘బావయ్య ఉన్నాడా ఇంట్లో?’ అడిగాడు సుబ్బయ్య.
‘లేడండీ.. ఏదో పని మీద బయటకు వెళ్లారు’ సమాధానమిచ్చింది అనసూయ.
‘ఎప్పుడు వచ్చినా ఇంట్లో లేడనే చెబుతూ ఉంటారు. ఇంట్లో కన్పించడు. ఊళ్లో కన్పించడు. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడేమిటి? దమ్మిడీకి పనికిరాడు.. క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటాడు.. మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగీ నా చెప్పులు అరిగిపోతున్నాయి. బావ వచ్చేదాకా ఇంట్లోనే కూర్చుంటా! బయట ఎండ మండిపోతూ ఉంది’ అన్నాడతను మంచం మీద కూర్చుంటూ.
వసంత్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినట్లయితే తమ పరువు గంగలో కలిసిపోయేది. అతనికి తండ్రి రెండు లక్షల దాకా బాకీ ఉన్నాడు. ఎలా తీరుస్తాడో? ఉన్న ఎకరం పొలం అమ్మాల్సి వస్తుందేమో! ముందు ముందు ఎలా గడుస్తుంది?
..అన్నీ చికాకులే! అనవసరంగా పుట్టింటికి వచ్చిందేమో!
సుబ్బయ్య దృష్టి గ్రీష్మ పెట్టుకున్న నగల మీద, కట్టుకున్న ఖరీదైన చీర మీద పడింది.
‘నీకేం తల్లీ! నీ అదృష్టం బాగుండి కలవారి కోడలయ్యావు.. నా ఇద్దరి కూతుళ్లకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు.. మీ నాన్న బాకీ తీరిస్తే పెద్దమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అసలు నాది బుద్ధితక్కువ! పాత చుట్టం.. అవసరం వచ్చినప్పుడు అక్కరకు వస్తాడులేనని రెండు లక్షలు ఇచ్చాను. వడ్డీతో కలిపి నాలుగయ్యింది.. గట్టిగా అడగలేను.. మెత్తగా ఉండే వాళ్లను చూస్తే ఎవరికైనా మొత్తబుద్ధి వేస్తుంది..’ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూనే ఉన్నాడు.
...తన తండ్రి బాకీ తీర్చలేని పరిస్థితిలోనే ఉండాలని సుబ్బయ్య మనసులో కోరుకుంటూ ఉంటాడు. అసలుకు వడ్డీ పెరిగిపోయి ఇల్లు, ఎకరం పొలం సొంతం చేసుకోవాలని అతని ఎత్తుగడ... కూతుళ్లకు పెళ్లిళ్లు చెయ్యలేని స్థితిలో అతనేం లేడు. అతను చెప్పేవన్నీ అబద్ధాలే!..
‘ఇంట్లో ఏదన్నా ఉంటే పట్టుకురా చెల్లెమ్మా! ఉదయం ఏం తినకుండా రోడ్డు మీద పడ్డాను’ అన్నాడతను అనసూయతో.
సున్నుండలు, కారప్పూస ప్లేటులో పట్టుకు వచ్చింది.
పుట్టింటికి వచ్చింది తను.. తనను పక్కన క్చూబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడుతూ సున్ముండ పెడదామనుకుని ఉంటుంది అమ్మ.. పానకంలో పుడకలా సుబ్బయ్య ఇంట్లో తిష్టవేశాడు.
గంటసేపు కూర్చుని ‘మళ్లీ వస్తాన’ని చెప్పి వెళ్లాడతను.
బట్టలు మార్చుకుని మంచం మీద పడుకుంది గ్రీష్మ.
పడక గది నిండా పాత బ్యాగులు, అట్టపెట్టెలు పేరుకుపోయి ఉన్నాయి. అందరి దాపరికాలు ఆ గదిలోనే!
పాత సీలింగ్ ఫ్యాన్‌కేసి చూస్తూ పడుకుంది.
తల్లి వచ్చి గ్రీష్మ ప్రక్కన మంచం మీద కూర్చుంది.
‘మనసూడి గేదె ఈనింది. ఉదయం జున్నుపాలు అమ్మేసుకున్నాం! నువ్వు వస్తావని తెలీక.. రేపు చేసి పెడతాను జున్ను. నీకెంతో ఇష్టం కదా!’ అంది అమ్మ కూతురి భుజం మీద చెయ్యివేసి.
అప్పుడు గుర్తుకు వచ్చాడు చిన్నాన్న. తను వచ్చినప్పటి నుండి సీతయ్య బాబాయ్ ఇంట్లో కన్పించలేదు.
‘బాబాయ్ ఏడి? కన్పించలేదు.. ఎక్కడికి వెళ్లాడు?’ తల్లిని అడిగింది.
‘నువ్వు అత్తగారింటికి వెళ్లిన రోజే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఆచూకీ తెలియలేదు. వెళ్లే ముందు నాతో అరగంటసేపు మాట్లాడేడు. ఎవరికీ ఉపయోగం లేని బ్రతుకు! చావు కోసం ఎదురుచూస్తూ గడపడం కంటే నేను చేసేదేముంది?’ అని నాతో అన్నాడు. ‘అలా మాట్లాడకు! నీ జబ్బు నయమవుతుంది.. మళ్లీ పొలం పనులు చేసుకోగలుగుతావ్’ అని అనునయించే ప్రయత్నం చేశాను. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ బాబాయ్ నాలుగేళ్ల కుర్రాడు. నేనే సొంత కొడుకులా పెంచాను.. మనకు ఇబ్బందులు కల్పించడం ఎందుకని వెళ్లిపోయినట్లున్నాడు!’ అంది అనసూయ చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ.
... ఎనిమిదేళ్ల కిందట బాబాయికి టైఫాయిడ్ వచ్చింది. ఆరు నెలలు జ్వరం పట్టి పీడించింది. తగ్గినట్లే తగ్గి మళ్లీ టైఫాయిడ్ తిరగబెట్టింది. ప్రాణాలు పోయాయనే ఇంట్లో అందరూ అనుకున్నారు. కోలుకున్నాడు గానీ.. పనిపాటలు చేసుకునే ఓపిక లేదు.. పెళ్లి చేసుకోలేదు.. తనంటే ప్రాణం బాబాయికి.. తను కాపురానికి వెళ్లే రోజు రెండు వేల రూపాయలు తన చేతిలో ఉంచి ‘మళ్లీ ఎప్పుడు కన్పిస్తావో తల్లీ’ అన్నాడు తన తల నిమురుతూ.
బాబాయ్ చేతివేలుకు ఆకుపచ్చ రాయితో మెరుస్తూ కన్పించే ఉంగరం కన్పించలేదు ఆ క్షణంలో.
సీతయ్య బాబాయ్‌ని తలచుకుని బాధపడింది గ్రీష్మ.
‘మీ అత్తగారింటికి వెళ్లేక మన సంగతులు వాళ్లకు చెప్పకు!’ అంది అనసూయ కూతురితో.
అమ్మ దగ్గర వారం రోజులు ఉందామనుకుంది.
ఐదారు గంటలు ఉండేసరికే మనస్సంతా గజిబిజిగా తయారయింది. బ్యాగ్‌లోని సెల్‌ఫోన్ తీసుకుని వసంత్‌కు ఫోన్ చేసింది.
‘రేపు ఉదయం మీరు విజయవాడ తిరిగి వెళ్లేటప్పుడు నన్ను పికప్ చేసుకోండి! నేనూ మీతోపాటు వచ్చేస్తాను’ అంది గ్రీష్మ భర్తతో.
* * *
మునిపల్లె నుంచి వచ్చేక గ్రీష్మ ముభావంగా ఉండటం గమనించాడు. కారణం అడిగినా చెప్పలేదు వసంత్‌కు.
రెండ్రోజులు అతను కన్పించలేదు.
ఏ పని మీద బయటకు వెళ్లినా తను అడుగకపోయినా అతను చెప్పే వెళతాడు. మొదటిసారిగా కంగారుపడింది.
అత్తగారిని అడిగింది ఆదుర్దాగా భర్త గురించి.
గ్రీష్మ కంగారు చూసి ఆమె ముచ్చటపడి ‘వ్యాపారం పని మీద ఎక్కడికో వెళ్లి ఉంటాడు. నాక్కూడా చెప్పలేదమ్మాయ్.. వాడే వచ్చేస్తాడులే!’ అంది ఆమె సన్నగా నవ్వుతూ.
‘తన కొడుకును గురించి ఆలోచించే మరో వ్యక్తి ఇంట్లో ఉందని’ అనుకుని మురిసిపోయింది.
వారంరోజుల తరువాత గ్రీష్మకు ఫోన్ వచ్చింది తల్లి నుంచి.
‘మీ అన్నయ్యను పోలీసులు వదిలేశారే తల్లీ! విజయవాడలో మీ అన్నయ్యకు మంచి ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తానన్నారు అల్లుడుగారు.. మూడ్రోజులు మనింట్లోనే ఉన్నారు అల్లుడుగారు.. ‘నువ్వక్కడ.. అల్లుడు ఇక్కడేమిటి? మీరిద్దరూ పోట్లాడుకున్నారా?’ అనుకున్నాను మొదట్లో.. ఆ తరువాత మన ఇంటి వ్యవహారాలన్నీ తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ‘అంత మంచి అల్లుడు దొరకడం నా అదృష్టమే తల్లీ! నిడుబ్రోలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం మీద మీ బాబాయి తిరుగుతున్నాడని ఎవరో చెబితే మీ నాన్న, అల్లుడుగారు వెళ్లి తీసుకువచ్చారు. సుబ్బయ్యకు ఇవ్వాల్సిన బాకీ తీరిపోయింది అల్లుడి దయ వల్ల’ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ చెప్పుకుపోతూనే ఉంది అనసూయ.
ఎదురుగా నిలబడ్డ వసంత్‌ని చూసి ఫోన్ ఆఫ్ చేసి, అతన్ని అల్లుకుపోయింది గ్రీష్మ.
‘మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పి వెళ్లండి’ అంది గ్రీష్మ చెమర్చిన కళ్లతో.
వారిద్దరూ అనురాగ గోపురం కట్టుకోవడానికి పునాది పడింది పటిష్టంగా.. ఎంత పెద్ద భవంతినైనా కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా!
ఆమె కనురెప్పలను తన పెదవులతో సుతారంగా తాకాడు. పాలు తేనె కలిసిపోయి జాలువారినట్లుగా ఉంది ఆ సంగమం...
*
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు
మెయిల్‌లో పంపాలి.
*

అలపర్తి రామకృష్ణ.. 9908587876