గాలిపటం (కథ)
Published Saturday, 6 April 2019తరగతి గది కిటికీ పక్కన కూర్చున్న పదేళ్ల చిన్నాకు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలు పక్షుల్లా కనిపించాయి.
బడి వదిలాక కూడా ఇంటికి వస్తుంటే పిల్లలంతా మిద్దెలపైనా వీధి చివరనున్న బయలు ప్రదేశంలో గాలిపటాలు ఎగురవేస్తూ కనిపించారు. ఇంటికి రాగానే తండ్రిని అడిగాడు గాలిపటం కొనివ్వమని. అసలే అప్పుల వాళ్లు అప్పుడే ఇంటికొచ్చి కోప్పడి వెళ్లారేమో రోజుకూలీ అయిన అతని తండ్రి డబ్బుల్లేవంటూ విసుక్కున్నాడు.
తల్లిని అడిగితే దినపత్రిక కాగితాలతో ఆమె గాలిపటం తయారుచేసి ఇచ్చింది. దాన్ని పట్టుకుని వీధి చివరికెళ్లాడు కానీ, అక్కడ మిగిలిన వారి రంగుల పతంగుల నడుమ వెలసిపోయినట్లు కళావిహీనంగా తన గాలిపటం కనిపించి అక్కడే పడేసి వచ్చేశాడు.
రోజూ అతని కళ్లు ఎగురుతున్న గాలిపటాల్ని ఆశగా చూస్తూ తానలాంటిది ఎగురవేయ లేకపోయినందుకు బాధపడ్తూ గడుపుతుంటే, ఒకరోజు ఎక్కడి మిద్దెపై నుంచో దారం తెగిన గాలిపటమొకటి ఎగిరొచ్చి ఇంటి ముందున్న మల్లె పందిరి మీద పడింది.
అది చూసి పరుగున వెళ్లి దాన్ని జాగ్రత్తగా చిరగకుండా తీసి చూశాడు. అది చాలా అందంగా ఎరుపు పసుపు కలిసిన రంగులతో మురిపిస్తూ కనిపించింది. మరింత దారం దానికి కట్టి వీధి చివరికెళ్లాడు పరుగు పరుగున చిన్నా.
అందరితో కలిసి అలా ఓ రెండు నిమిషాలు గాలిపటాన్ని వదిలాడో లేదో పక్కనుంచీ ఓ ఏడేళ్ల పిల్లాడి ఏడుపు చెవిన పడింది.
గాలిపటం కోసం మారాం చేస్తున్నాడా పిల్లాడు. కొని పెట్టింది పట్టుకోలేక వదిలేస్తే మళ్లీమళ్లీ కొనలేనని కోప్పడుతున్నాడు పిల్లాడి తండ్రి. అదేమీ పట్టనట్టు ఏడుపు పెద్దది చేశాడు కూడా. దాంతో దెబ్బలు వేయబోయాడు ఆ పిల్లాడి తండ్రి.
‘నా గాలిపటం తీసుకో. నేను చాలాసేపు ఆడుకున్నాలే’ అని పిల్లాడి చేతికి దారం అందించాడు చిన్నా.
పిల్లాడు కళ్లు తుడుచుకుని ఆడుకోసాగాడు. వాడి తండ్రి మెచ్చుకోలుగా చిన్నా భుజం నిమిరాడు. తను ఆశించింది పొందటం కంటే వేరొకరి ఆశను తీర్చిన ఆనందంతో నవ్వుతున్న పిల్లాడి ముఖంలోని కళ్లల్లోని సంతోషం చూసి చిన్నా మనసు గాలిపటమై పరవశించి విహరించింది.