S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-6

ఆలయం కేసి వచ్చినప్పుడల్లా కూడా శంకరయ్యని ఓ హంతకుడిగా చూస్తూ గుసగుసలాడుకునేవారు. ఇదంతా గౌతమికి బాధ కలిగించడమే కాదు. తండ్రి ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆయనేమై పోతాడో అన్న భయం పట్టుకుంది. అయినా నోరెత్తలేని పరిస్థితి! అందుకే పిచ్చిదానిలా ఎక్కడెక్కడో తిరుగుతోంది. ప్రతిరోజూ కాబోయే భర్త అనిల్ దగ్గరికెళ్లడం, ఓ డాక్టర్‌గా అతనికి చేదోడువాదోడుగా ఉండడం అలవాటే కాబట్టి ఇప్పుడూ అలాగే వెళ్తోందనుకున్నాడు తండ్రి. అయితే, తన ఇక్కట్లు చెప్పి అతన్ని కూడా బాధించడం ఎందుకు అనుకుందో ఏమో అక్కడికి వెళ్లకపోవడమే కాక అతన్ని తప్పించుకు తిరుగుతోంది.
ఆ రోజు తండ్రికి చెప్పి బైటికి వెళ్లబోతున్న గౌతమి, ఫోన్ మోగడంతో వెనక్కి వచ్చి రిసీవ్ చేసుకుంది. అంతే! ఆమె మొహం వెలవెలబోయింది.
‘ఎవరమ్మా ఫోన్ చేసింది?’ ఆమె మొహంలోని భావాలు చదివిన శంకరయ్య ఆదుర్దాగా అడిగాడు.
‘ఎస్.పి.గారు’
‘ఏమంటారు? దొంగల గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా?’ అన్నాడాయన ఆశగా.
‘కాదు. ఎస్పీగారు, కొత్త సిబిఐ ఆఫీసర్ని, పిఎం గారి పిఏ ని తీసుకుని వస్తున్నారట’ నీరసంగా అంది గౌతమి.
‘పిఎం గారి పి.ఏ.నా? ఆయనెందుకు?’ కంగారుగా అన్నాడు శంకరయ్య.
‘ఆయన పి.ఎం.గారి ఫ్రెండ్ కూడానట. చాలా విషయాలు ఆయనే చూసుకుంటాట్ట. ఇప్పుడొచ్చి అందరూ కలిసి ప్రశ్నలతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారనుకుంటా’ చిరాగ్గా అంది గౌతమి. శంకరయ్య మొహం మరింత పాలిపోయింది. వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారా తండ్రీ కూతుళ్లు.
మరో గంటకి రెండు కార్లు, ఒక జీపు ఇంటి ముందు ఆగాయి. బిలబిల్లాడుతూ దిగారంతా. కంగారుగా లేచి బయటికొచ్చారు తండ్రీ కూతుళ్లు. ఎస్.పి. చెప్పిన వాళ్లే కాక, ధర్మారావు కాంతారావు వాళ్లు కూడా రావడంతో క్షణం తెల్లబోయి, ఆ పై తేరుకుని అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించారు తండ్రీ కూతుళ్లు. చంద్రయ్య కొండ కిందికెళ్లాడు. ఎస్.పి. ప్రభుని, స్పెషలాఫీసర్ ప్రయాగని పరిచయం చేశాడు. గౌతమీ వాళ్ల గురించి ప్రభూ వాళ్లకీ చెప్పాడు. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాక అందరూ కూర్చున్నారు. కొన్ని క్షణాలు అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. శంకరయ్య వాళ్లు మాత్రం ‘మళ్లీ ఏం బాంబు పేలుస్తారో’ అన్నట్టు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
‘కంగారు పడకండమ్మా. ప్రయాగగారికంతా తెలుసు. ఈయన మనవారే. ఆ బ్లాక్ టైగర్ గురించి మీకు తెలిసింది చెప్పండి’ అన్నాడు ధర్మారావు.
‘అవును పంతులుగారూ! నేరం చెయ్యని మీరు ఎందుకు భయపడాలి. ఉన్నదున్నట్టు చెప్పండి’ సున్నితంగా అన్నాడు ప్రయాగ.
‘జరిగిందంతా మీ పోలీసులకి.. అదే ఎస్.పి. గారికి చెప్పాం. ఒకసారి కాదు. చాలాసార్లు చెప్పాం’ గంభీరంగా అంది గౌతమి.
‘అది కాదు డాక్టర్ గౌతమీ! కేసుని గురించి మొత్తం చెప్పాం. కానీ మనిషి దగ్గర్నించి మరో మనిషికి వెళ్లే వార్త రకరకాలుగా ఉండొచ్చు. అందుకే, ఆ దోపిడీ గురించి మీకు తెలిసింది దయచేసి మళ్లీ ఒకసారి చెప్పండి’ అన్నాడు ప్రభు అనునయిస్తున్నట్లు.
కోపాన్ని అదుపులో ఉంచుకొని అంతకు ముందు చెప్పిన విషయాలే మళ్లీ చెప్పారా తండ్రీ కూతుళ్లు.
‘అయితే మీకా బ్లాక్‌టైగర్ గురించి ఏం తెలియదంటారు’ వాళ్ల మొహాల్లోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ప్రయాగ.
‘తెలియదు’ గభాల్న అంది గౌతమి.
‘ఓకే! ఓసారి గుళ్లొకెళ్దామా?’
ఆ మాటకి తండ్రీ కూతుళ్ల మొహాలెందుకో కళ తప్పాయి.
‘పదండి పంతులుగారూ! నేరం చెయ్యని మనకెందుకు భయం’ ప్రయాగకేసి కొరకొర చూస్తూ అన్నాడు కాంతారావు.
‘పదండి. నాకెందుకూ భయం’ అంటూ లేచాడు శంకరయ్య.
‘పర్లేదు. ఇప్పుడొద్దు లెండి. గుడెక్కడికి పోతుంది. మనమెక్కడికి పోతాం. తీరిగ్గా ఓ రోజు చూద్దాం. అన్నట్టు శంకరయ్యగారూ! ఇక్కడ.. అంటే ఈ కొండ మీద మీరెన్నాళ్ల నించీ ఉంటున్నారు?’ అన్నాడు ప్రయాగ.
ఆయన చెప్పాడు.
‘అయితే ఆ బ్లాక్ టైగర్ గురించి మీకు తెలిసుండాలే?’
‘సారీ! ఆ టైగర్ మా బంధువూ కాదు. అతను ఎప్పుడూ దైవ దర్శనానికి రానూ లేదు’ గంభీరంగా అంది గౌతమి.
ప్రయాగ కోపం తెచ్చుకోలేదు. సన్నగా నవ్వి -
‘మీ బాధ నేనర్థం చేసుకోగలను డాక్టర్! కానీ, ఎంతైనా పోలీసు వాళ్లం కదా. అనుమానాలెక్కువ. అందుకే మీరూ విసుక్కోకుండా అడిగిన వాటికి శాంతంగా జవాబులు చెప్తే మాకూ తృప్తిగా ఉంటుంది’ అన్నాడు.
‘సారీ! అడగండి’ అంది గౌతమి.
ప్రయాగ దోపిడీని గురించి ఏవేవో అడిగాడు. ఎస్.పి. ప్రభులు కూడా తమ అనుమానాల్ని బైటపెట్టారు. అందరికీ శాంతంగానే జవాబులు చెప్పారు గౌతమి, శంకరయ్యలు కూడా.
‘సరే ఒకటి రెండు రోజుల్లో గర్భగుడి అవీ కూడా చూద్దాం’ అంటూ లేచాడు ప్రయాగ. మిగతా వాళ్లూ లేచారు. ఎందుకో శంకరయ్య, గౌతమి మొహాలు తేరుకున్నాయి.
‘వస్తాం డాక్టర్ గౌతమీ’ రెండు చేతులూ జోడిస్తూ అన్నాడు ప్రభు. ఆమె కూడా తలపంకిస్తూ నమస్కరించింది. తర్వాత అందరూ ఆ తండ్రీ కూతుళ్లకి చెప్పి బైటికి నడిచారు. వారితోపాటు బైటికొచ్చిన గౌతమి -
‘్థంక్యూ సర్’ అంది ప్రయాగ నుద్దేశించి.
‘్థంక్సా? ఎందుకు?’
‘అందరిలా మీరు కూడా మమ్మల్ని అనుమానించనందుకు!’
‘అప్పుడే అంతలా ఆనంద పడిపోకండి. అసలు దొంగలు దొరికేదాకా ఎవర్నరయినా అనుమానించడం మా డిపార్ట్‌మెంట్ ఆనవాయితీ. దానికి మీరు అతీతులు కారు’ నవ్వాడు ప్రయాగ.
ఇదంతా చూస్తున్న ధర్మారావుకి ఒళ్లు మండిపోయింది. ‘ఇంకా ఎవర్నో అనుమానించడం ఏవిటి సర్? జాగిలాలు కూడా అడవిలోకి పరిగెత్తాయి’ అన్నాడు కాస్త చిరాగ్గా.
‘కానీ అవి అడవిలోకి వెళ్లలేదు’ గభాల్న అన్నాడు శంకరయ్య. కంగారుగా చూసింది గౌతమి. అదేం గమనించనట్టు మరోసారి చెప్పి వెళ్లిపోయారంతా.
* * *
రాత్రి పనె్నండు గంటలు కావస్తోంది. ప్రయాగ వాళ్లు వచ్చి కూడా నాలుగైదు రోజులైంది. అన్నట్టు మర్నాడో, మూడో నాడో రాలేదు. కానీ ధర్మారావూ, కాంతారావు విడివిడిగా వచ్చి ప్రయాగ వాళ్లు ఏదో గూడుపుఠాణి చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆ నేరాన్ని మీ మీద పడేసి జైలుకి పంపినా పంపగలరు’ అని హెచ్చరించారు. అందుకే ఆ తండ్రీ కూతుళ్ల కంటికి కునుకు రావడంలేదు. శంకరయ్య ఆరోగ్యం మరింత దెబ్బతింది. దిక్కుతోచని గౌతమి శంకరయ్యలాగే నిద్ర నటిస్తోంది. చంద్రయ్య వుంటే ఏదో లల్లాయి పదాలు పాడుతూండేవాడు. కానీ ఆ రోజు భార్యకేదో సుస్తీ చేసి రాలేదు. అందుకే పరిసరాలు నిశ్శబ్దంగా మరింత భయపెడుతున్నాయి.
అప్పుడే ఎవరో వస్తున్న అలికిడి అయి తుళ్లిపడి కిటికీలోంచి చూసింది గౌతమి. ఆమె గుండె ఆగినంత పనయింది. నలుగురు అడవి మనుషులు కాగడాలతో తమ ఇంటికేసే వస్తున్నారు. విషయం విన్న శంకరయ్య వణికిపోయాడు. అప్పుడే తలుపులు విరిగేంతలా బాదారు ఆటవికులు. గౌతమికి ఒకలాటి తెగింపు వచ్చేసింది.
నగల కోసమే వచ్చి ఉంటారు. ఏమైనా సరే.. ఆ నగలు మాత్రం వాళ్లకి దక్కనివ్వకూడదు’ అంటూ సెక్యూరిటీ కోసం ఇచ్చిన గన్ స్టడీగా పట్టుకుని తండ్రిని తలుపు తియ్యమంది. వాళ్లు మారువేషంలో వచ్చిన దొంగలో, పోలీసులో అని ఆమె ఉద్దేశం. శంకరయ్య అయిష్టంగానే వణుకుతూ తలుపు తీశాడు. అంతే! వెల్లువలా లోపలికొచ్చేశారా నలుగురూ.
‘వేషం బానే వేశారు. ఇంతకీ ఎవరు మీరు? ఇంత రాత్రప్పుడు ఎందుకొచ్చారు.’ భయాన్ని పైకి కనిపించకుండానే వ్యంగ్యంగా అంది గౌతమి.
‘ఇక్కడ పూజారి శంకరయ్యంటే నువ్వేగా!’ ఆమె మాట పట్టించుకోకుండానే శంకరయ్య కేసి తీక్షణంగా చూస్తూ అన్నాడొకతను.
‘అవును మీరెవరు?’ లోగొంతుకతో అన్నాడాయన వాళ్లని పరిశీలనగా చూస్తూ.
‘ఇక్కడేవో డ్రామాలాడుతున్నారంట. నాలుగు రోజులు బతికుండాలంటే మా దొర చెప్పినట్టు చెయ్యండి’ అని నలుగురూ ఏవో సైగలు చేసుకుని తమ దగ్గరున్న ఓ కాగితం మడత తీసి వాళ్ల ముందు పడేసి, వచ్చిన వాళ్లు వచ్చినట్టే బైటికెళ్లి క్షణాల్లో మాయమై పోయారా నలుగురూ. కొన్ని క్షణాలు శిలల్లా వుండిపోయిన ఆ తండ్రీ కూతుళ్లు వణికే చేతులతో కిందపడున్న కాయితం మడత తీసి పులిబొమ్మతో వున్న ఆ లెటర్ చదివి కొయ్యబారిపోయారు.
అందులో ఇలా వుంది.
‘ఏయ్ పంతులూ! మర్యాదగా మీ నాటకాలకి తెరదించండి. వెంటనే గుట్టమీద జరిగే రగడ ఆగిపోవాలి. ఆ పోలీసోళ్లకి ఏం చెప్తారో నాకు తెలియదు. ఇంక ఆ నగల గురించి అందరూ మర్చిపోవాలి. లేకపోతే అన్యాయంగా మా కొండ దేవరకి బలైపోతారు ఖబడ్దార్! - బ్లాక్‌టైగర్.
అది చదివిన తండ్రీ కూతుళ్ల మొహాలు పాలిపోయాయి.
‘ఏవిట్నాన్నా ఇదంతా?’ తడారిపోతున్న గొంతుతో అంది గౌతమి.
‘వాళ్లు మనం అనుకున్నట్టు వేషగాళ్లు కాదమ్మా! ఆ బ్లాక్‌టైగర్ మనుషులే’ వణికిపోతూ అన్నాడు శంకరయ్య.
‘మైగాడ్!’ అప్రయత్నంగా అంది గౌతమి. తర్వాత తేరుకుని వీధి తలుపులు లాక్ చేసి వచ్చి తండ్రి పక్కన కూర్చుని-
‘నాన్నా! ఓ మాటడుగుతాను. నిజం చెప్తావా?’ అంది మెల్లగా.
భయంగా చూశారాయన.
‘ఆ బ్లాక్‌టైగర్ మీకు తెలుసు కదూ?!’ అందామె గంభీరంగా.
‘ఊఁ తెలుసు’ అన్నాడాయన.
‘ఏమంటాడు? ఈ నగలు కూడా ఇమ్మంటాడా?’ అంది గౌతమి. తండ్రికేసి పరిశీలనగా చూస్తూ.
‘అలా అని రాయలేదుగా?’
‘మరి మనల్నెందుకు బెదిరిస్తున్నాడు?’
‘అదే నాకూ అర్థం కావడంలేదమ్మా. గౌతమీ! మనం ఈ కొండమీది నుంచి వెళ్లిపోదామమ్మా!’ దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు శంకరయ్య. తుళ్లిపడింది గౌతమి. తర్వాత తేరుకుని-
‘చూడు నాన్నా! ఇన్నాళ్లనించీ నువ్వేం చెప్పినా, నాకెన్ని అనుమానాలున్నా నేనేం రెట్టించి అడగలేదు. అదీ నిన్ను బాధపెట్టడం ఇష్టంలేక. కానీ ఇప్పుడు ఊరుకోలేను. నీకూ ఆ బ్లాక్‌టైగర్‌కీ మధ్య వున్న సంబంధం ఏమిటో చెప్పి తీరాలి. చెప్పు! కర్కోటకుడైన ఆ గజదొంగకీ, దైవాన్ని నమ్ముకుని బ్రతికే నీకూ మధ్య ఉన్న బంధం ఏమిటి? ఎందుకతన్ని రక్షించాలని ఆరాటపడుతున్నావు?’ అంది గంభీరంగా.
ఇంక తప్పదనుకున్న శంకరయ్య గతం ఆమె ముందుంచాడు.
* * *
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్