S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-5

చాలా రోజుల తర్వాత ఫోన్ చేసింది క్లూ. ఆమె గొంతు వినగానే ప్రభుకి ప్రాణం లేచొచ్చినట్టయింది.
‘హలో మిస్ క్లూ?’ అన్నాడు ఉత్సాహంగా.
‘మిస్ కాదు. మిసెస్. మిసెస్ క్లూ ఎవిడెన్స్’ నవ్విందామె.
‘వ్వాట్?’
‘ఎస్! నా పేరు క్లూ. మా వారి పేరు ఎవిడెన్స్. వెరసి నా పేరు క్లూ ఎవిడెన్స్’ మళ్లీ నవ్విందామె.
‘బావుంది, చెప్పండి’ తనూ నవ్వుతూ అన్నాడతను.
‘మీరే చెప్పాలి. మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది?’
‘ఎక్కడా? మీరు క్లూ ఇవ్వలేదే?!’ కాస్త చనువుగా అన్నాడు ప్రభు.
‘ఇచ్చానుగా. ఆ క్లూని బట్టే పోలీసులు పూజారి గారింటి మీద నిఘా వేసింది!’
‘అఫ్‌కోర్స్. కానీ ఎన్ని విధాలుగా అడిగినా ఆ పూజారిగారు నగల గురించి నోరు తెరవడం లేదు. ఆయన తప్ప అక్కడ అనుమానించతగ్గ వాళ్లెవరూ కనిపించడంలేదు.’
‘అంటే ఆ దోపిడీ పూజారిగారే చేశారని నిర్ణయించేశారా?’ కాస్త వ్యంగ్యంగా అందామె.
‘ఆయన మీదే అందరికీ, ముఖ్యంగా పోలీసులకి అనుమానం’
‘కానీ ఆయన్ని మామూలు పూజారిలా కాక పెద్ద విఐపిలా చూస్తారనీ, ఓ ఐఎఎస్ ఆఫీస్‌కిచ్చినంత మంచి ఇల్లు, ఇతర సౌకర్యాలూ ఇచ్చారని విన్నానే.’
‘అవును. ఆ విశ్వాసం కూడా లేదతనికి!’ కోపంగా అన్నాడతను. ఆమె నవ్వింది.
‘ఎందుకు నవ్వారు?’ ఆశ్చర్యంగా అన్నాడు ప్రభు.
‘ఏం లేదు. ఇంతకీ ఆ పూజారే దొంగ అని ఎందుకనుకుంటున్నారు?’ అందామె కుతూహలంగా.
‘వాళ్లు దొంగలని ఎవరూ అనడంలేదు. కానీ దొంగల గురించి, దొంగతనాన్ని గురించి ఆ తండ్రీ కూతుళ్లకి తెలుసని, కావాలనే చెప్పడం లేదనీ అనుకుంటున్నారు.’
‘మీ అంచనా కరెక్టే కావచ్చు’ క్షణం ఆగిందామె.
‘మిసెస్ క్లూ! మీరు నాకో ఫేవర్ చెయ్యగలరా?’ వేడికోలుగా అన్నాడు ప్రభు.
‘చెప్పండి. నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను.’
‘మాట తప్పరుగా’
‘ఉఁహూ. చెప్పండి’
‘ఒక్కసారి మనం కలుసుకుని మాట్లాడాలి. ప్లీజ్...’ ఒకలాంటి ఉద్వేగంగా అన్నాడతను.
‘అమ్మో! ఈ విషయం బయటికి పొక్కిందంటే’ భయంగా అందామె.
‘నో! ఎవరికీ తెలియనివ్వను ప్రామిస్’ చిన్నపిల్లాడిలా అన్నాడతను.
‘మీ ఫ్రెండ్‌క్కూడా!’
‘ఫ్రెండా?’
‘అదే సి.ఎం. చంద్ర’
త్రుళ్లిపడ్డాడు ప్రభు.
‘సి.ఎం. గారి గురించా? నిజమే. ఆయన అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు’ అన్నాడు తేరుకుని. ఆమె గలగలా నవ్వేసింది.
‘సర్లెండి. ఇది రహస్యంగా ఉంచుతానన్నారు. అది చాలు. నన్ను కలిసి మాట్లాడితే మీకు ఫలితం ఉంటుందంటే తప్పకుండా కలుద్దాం’ అంది.
‘్థంక్యూ! థాంక్యూ వెరీమచ్! అయితే మనం ఎప్పుడు, ఎక్కడ కలుద్దాం?’ ఉత్సాహంగా అన్నాడు ప్రభు.
‘తొందరపడకండి. మరి!
‘నోనో! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఎక్కడ కలుద్దామో చెప్పండి. మీ గురించి ఎవరికీ, ముఖ్యంగా ఆ బ్లాక్ టైగర్‌కి అస్సలు తెలియనివ్వను’ అన్నాడతను నమ్మకంగా.
‘్థంక్స్’
‘చెప్పండి. ఎక్కడ కలుద్దాం?’
‘రేపు ఆదివారం సాయంత్రం?’
‘ఎక్కడ?’
ఆమె గొంతు తగ్గించి చెప్పింది. తర్వాత-
‘మీరు నన్ను గుర్తించడానికి నేను బురఖాలో ఉంటాను. మీరు సి.ఎం. గారి మనిషిలా కాక సామాన్యుడిలా రావాలి. ఇవాళ ఫోన్ చేసి ఓ క్లూ ఇద్దామనుకున్నాను. దాని గురించి కూడా కలిసినప్పుడు మాట్లాడదాం’ అంటూ ఫోన్ కట్ చేసేసింది.
ఉత్సాహంగా లేచాడు ప్రభు.
* * *
గౌతమి పరధ్యానంగా నడుస్తోంది. ఆమెని రాసుకుంటున్నట్టు వెళ్లి ఆమె పక్కగా ఆగింది అనిల్ కారు. తుళ్లిపడి కోపంగా తిరిగి చూసిన గౌతమి అతన్ని చూసి బలవంతంగా నవ్వింది. అనిల్ కారు దిగి ఆమెకేసి సూటిగా చూస్తూ-
‘గౌతమీ! నువ్వు ఇండియాలోనే వున్నావా?’ అన్నాడు గంభీరంగా. ఆమె భారంగా నవ్వింది.
‘అలా నవ్వకు. నాకు చిరాకు’ అన్నాడతను విసురుగా.
‘నీకలాగే ఉంటుంది నా పరిస్థితిలో నువ్వుంటే..’ గౌతమి గొంతు వణికింది. అతను కంగారుగా చూసి - ‘ముందు కారెక్కు’ అన్నాడు గంభీరంగా. ఆమె వౌనంగా కారులో కూర్చుంది. అతను డ్రైవ్ చేస్తూనే-
‘ఏమైంది గౌతమీ.. నువ్వు క్లినిక్‌కి రావడం లేదు. ఫోన్‌లో దొరకడం లేదు. మీ ఇంట్లోనూ వుండడం లేదు. ఇలా రోడ్డు మీద పిచ్చిదానిలా నడుచుకుంటూ పోతున్నావ్. నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది గౌతమీ. మళ్లీ ఆ బ్లాక్ టైగర్ ఏమైనా బెదిరిస్తున్నాడా?’ అన్నాడు వణుకుతున్న గొంతుతో.
‘బ్లాక్ టైగర్ కాదు. ఈ పోలీసులే పెద్ద టైగర్లయిపోయారు. మమ్మల్ని దొంగలుగానే కాదు.. దేశద్రోహులుగా కూడా చూస్తున్నారు. దాంతో నాన్న ఆరోగ్యం మరింత దెబ్బతింది. ఎలాగో ఆ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమే ఓ సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసింది. అతన్ని కూడా మా మీద సిఐడిలా పంపారేమో అని నా అనుమానం. ఈ పరిస్థితుల్లో క్లినిక్‌కి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు’ దుఃఖం నిండిన గొంతుతో అంది గౌతమి.
అతను కదిలిపోయాడు. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని దొంగతనానికి కారకుడనుకుంటున్న బ్లాక్ టైగర్ని తిట్టిపోశాడు. ‘మీకు నేనున్నాను’ అంటూ ఎన్నోవిధాలుగా ధైర్యం చెప్పాడు.
మరో పది నిమిషాల్లో తమ ఇంటి ఆవరణలోకొచ్చి, ఆమెని చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. నౌకరు అందించిన కాఫీ వౌనంగా తాగింది గౌతమి. కాస్సేపు ఆమెకి ధైర్యంగా ఉండమని చెప్పి-
‘ఇంతకీ అలా రోడ్డున పడి నడుస్తూ ఎక్కణ్ణించి వస్తున్నావ్?’ అన్నాడు కుతూహలంగా. ఎందుకో క్షణం కంగారు పడిందామె. మళ్లీ తేరుకుని నవ్వేస్తూ-
‘తెలిసిన వాళ్లింటి కెళ్లొస్తున్నాను. నా బైక్ ట్రబులిచ్చింది. అందుకే సరదాగా నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతకీ ననె్నందుకు తీసుకొచ్చావో చెప్పలేదు’ అంది. విషయం చెప్పడం ఇష్టం లేదని గ్రహించిన అనిల్ భారంగా నిట్టూర్చి-
‘గౌతమీ! డాడీ వాళ్లు ఎవరూ లేరు. ఇవాళ ఇక్కడుండిపోకూడదా?’ అన్నాడు వేడుకోలుగా.
హఠాత్తుగా ఆమె మొహంలో మార్పొచ్చేసింది. అతని కౌగిలిలో వున్నట్టున్న ఆమె గభాల్న లేచింది.
‘ఏమైంది గౌతమీ’ ఆశ్చర్యంగా చూశాడతను. తనలా అడగడం, ఆమె ఎన్నో రాత్రులు సరదాగా కబుర్లు చెప్తూ గడపడం అలవాటే. అలా అని అతను ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు.
‘సారీ అనిల్’ వాచీ చూసుకుంటూ మెల్లగా అందామె.
‘గౌతమీ’
‘అవును అనిల్. కాస్త అర్జంటు పనుంది. సారీ! మళ్లీ కలుద్దాం’ అంటూ పరుగు లాంటి నడకతో బైటికొచ్చేసింది గౌతమి.
‘ఆగు. నేను డ్రాప్ చేస్తాను’ అని అనిల్ అంటున్నా వినిపించుకోకుండా అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి కూర్చుంది గౌతమి. దూసుకుపోతున్న ఆటోని చూస్తూ ప్రతిమలా నిల్చుండిపోయాడు అనిల్.
* * *
ఆదివారం పూర్తిగా తెల్లవారకుండానే లేచాడు ప్రభు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదతనికి. తెల్లవార్లూ ‘క్లూ’ని గురించి, ఆమె చెప్పబోయే విషయాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. చీకట్లు తొలగకుండానే లేచి స్నానపానాదులు ముగించి తన గదిలో కూర్చుండిపోయాడు. సాయంకాలం దాకా ఎలా గడపాలా అనుకుంటూ చాలా కాలం తర్వాత టీవీ ఆన్ చేసి ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడు. అయినా అతని ధ్యాస టీవీ ప్రోగ్రామ్స్ మీద లేదు. ‘క్లూ’ చెప్పిన హోటల్ బ్రహ్మపుత్ర రూఫ్ గార్డెన్ కేసే పరుగులు తీస్తోంది.
‘్ఛ! మహామహా క్లిష్ట పరిస్థితుల్నే తేలిగ్గా తీసుకుని అవలీలగా ఫేస్ చేసే తను, ఈ విషయంలో ఇంత టెన్షన్ పడటం ఏమిటి? ఇది దొంగల్ని పట్టుకోవాలన్న ఇంట్రస్టా? లేక సూటిగా, మధురంగా మాట్లాడే ‘క్లూ’ని చూడాలన్న ఆరాటమా’ అని తన మీద తనే విసుక్కున్నాడు.
ఎలాగో మధ్యాహ్నం దాకా గడిపి, లేచి అన్యమనస్కంగానే భోజనం చేశాడు. తన ప్రవర్తనకి ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతున్నారని గ్రహించి, వాళ్ల ప్రశ్నలకి దొరక్కుండా..
‘చాలా ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎవరూ డిస్ట్రర్బ్ చేయకండి’ అంటూ తప్పించుకుని, అతి భారంగా సాయంత్రం దాకా తన గదిలోనే గడిపి అయిదు గంటలు కాగానే, ఉత్సాహంగా లేచి స్నానం చేసి నీట్‌గా డ్రస్సప్పయ్యాడు. ఇంట్లో ఏదో చెప్పి కారు తీసుకెళ్లకుండానే బైటికి నడిచాడు.
‘క్లూ’ ఎలా ఉంటుందో, ఎనే్నళ్లుంటాయి. తనతో ఫోన్‌లో మాట్లాడినట్టే మాట్లాడుతుందా? బురఖాలో వస్తానంది. కొంపతీసి ఆమె ముస్లిం యువతి కాదు కదా. అయినా నా పిచ్చిగానీ ఆమె ఎవరైతే తనకేవిటి? తనిచ్చే క్లూస్ కావాలంతే’ అని తన ఆలోచనలకి తనే ఆనకట్ట వేసి, ఆమె చెప్పినట్టే, అటుగా వెళ్తున్న ఓ ఆటోలో కూర్చుని ‘హోటల్ బ్రహ్మపుత్ర’ అన్నాడు.
ఆటో కదిలింది.
‘బ్రహ్మపుత్ర’ స్టార్ హోటలవడం, ఊరికి కాస్త దూరంగా ఉండటం వల్ల ఓ మాదిరివాళ్లు ఆ ఛాయలకే వెళ్లరు. ప్రభు ఆ హోటల్‌కి చాలాసార్లు వచ్చాడు మందీ మార్బలంతో. సరదాగా సంభాషణల్లో పాల్గొన్నాడు. కానీ ఈసారెందుకో అతని గుండె వేగం పెరిగింది. హోటల్‌లో అడుగుపెడుతుండగా.. ఎరుగున్న వాళ్లెవరైనా కనిపిస్తారేమో అన్నట్టు జాగ్రత్త పడుతూ సరాసరి రూఫ్ గార్డెన్ కేసి వెళ్లిపోయాడు. ఓ మూలగా వున్న టేబుల్ ముందు కూర్చుని ఆతృతగా పరిసరాలు పరికించాడు. అయితే బురఖాలో వున్న స్ర్తిలెవరూ కనిపించలేదు. ఎందుకో తేలిగ్గా ఊపిరి తీసుకుని ‘క్లూ’ రాక కోసం చూస్తూ కూర్చున్నాడు. అక్కడ చాలా మందే వున్నా ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు. కాబట్టి అతని ముఖ కవళికలు ఎవరూ గమనించలేదు. మరో అరగంట గడిచింది. అతనిలో చిరాకు మొదలయింది. ‘అసలు వస్తుందా? తనని ఆట పట్టించడానికలా చెప్పిందా?’ అన్న అనుమానం కూడా వచ్చింది. అసహనంగా కదిలాడు.
‘హలో’ మృదువుగా వినిపించిందో గొంతు.
తుళ్లిపడి తిరిగి చూసిన ప్రభు మొహం వెలిగిపోయింది. వచ్చింది బురఖా ధరించిన మహిళే.
‘హలో’ అన్నాడు ఇంత మొహం చేసుకుని లేస్తూ.

‘సారీ! అనుకోకుండా లేటయింది’ నొచ్చుకున్నట్టు అంటూ అతనికెదురుగా కూర్చుందామె.
‘పర్లేదు. అసలొచ్చారు’ నవ్వుతూ అన్నాడతనూ కూర్చుంటూ.
‘వస్తానని చెప్పాక రాకుండా ఉంటానా’ నవ్విందామె.
‘ఏం తీసుకుంటారు?’ కాస్త చనువుగా అన్నాడతను.
‘మీ ఇష్టం’ అందామె మృదువుగా.
ఇద్దరూ ఏదో తిన్నాననిపించి కాఫీ తాగారు.
‘బురఖా గుర్తుతో నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. మరి మీరు ననె్నలా గుర్తుపట్టారు?’ అన్నాడు ప్రభు కుతూహలంగా.
‘మీ చూపుల్ని బట్టి..’ నవ్విందామె.
‘చిన్న రిక్వెస్ట్’
‘చెప్పండి’
‘ఆ బురఖా తీసేస్తే...’
‘సారీ.. మీక్కావలసింది నా క్లూస్’ అతని మాట పూర్తి కాకుండానే అందామె.
‘అఫ్‌కోర్స్. మీ మొహంలో మారే భావాలు తెలియవు. తెలియకపోతే ఫ్రీగా మాట్లాడలేం. అందుకే కాస్సేపు ఆ బురఖా తీసెయ్యండి. నా మాటల మీదా, నా మీదా నమ్మకం లేకపోతే మీ ఇష్టం’ అన్నాడు ప్రభు గంభీరంగా.
‘ఓకే! మీరు నాకో హామీ ఇస్తే బురఖా లేకుండానే మాట్లాడతాను’ అందామె.
‘ఏవిటి?’ ఉత్సాహంగా అన్నాడతను.
గార్డెన్‌లో వున్న వాళ్లలో ఒకరిద్దరు వాళ్లకేసి కుతూహలంగా చూడ్డంతో ఏదో చెప్పబోయిన ‘క్లూ’ ఆపేసి-
‘ఇక్కడ మాట్లాడ్డం కుదరదు. మనం రూమ్‌కెళ్లి మాట్లాడుకుందాం’ అంది చాలా మెల్లగా.
‘రూమ్‌కా?’ బిత్తరపోయాడు ప్రభు.
‘ఎస్! ఇదే హోటల్‌లో ఓ రూమ్ బుక్ చేశాను. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటే సేఫ్. అదీ మీకు అభ్యంతరం లేకపోతేనే’
‘్ఛఛ! నాకేం అభ్యంతరం?’ మనసులో కంగారు పడుతూనే పైకి ధైర్యంగా అన్నాడు ప్రభు.
ఆమె నవ్వింది.
‘ఎందుకు నవ్వారు?’ విస్మయంగా చూస్తూ అన్నాడతను.
‘ఏం లేదు. సీఎం గారి దగ్గరుండే ఓ ధైర్యస్థుడైన యువకుడు, నాలాంటి ఓ ఆడపిల్లని చూసి కంగారు పడుతుంటే నవ్వకేం చెయ్యను?’ మళ్లీ నవ్విందామె.
అతని మొహం చిన్నబోయింది.
‘అంత పిరికివాణ్నేం కాదు’ మాట మాత్రం చెప్పకుండా ‘రూమ్ తీసుకున్నాను. అక్కడ మాట్లాడుకుందాం’ అనగానే కాస్త షాకయ్యానంతే!’ అన్నాడు చిన్నపిల్లాడిలా.
‘కానీ మీరలా షాకవకూడదు. ఎందుకంటే పెద్దపెద్ద షాకింగ్ న్యూస్‌లలు మీకు చెప్పబోతున్నాను’ గంభీరంగా అంది క్లూ.
‘ఓకే! మీరేం చెప్పినా వినడానికి సిద్ధంగా వున్నాను’ స్థిరంగా వుందతని గొంతు. తర్వాత బిల్ పే చేసి ఇద్దరూ కలిసి ఇవతలికొచ్చారు. కొందరు వాళ్లని వింతగా చూస్తుంటే-
‘స్టార్ హోటల్స్‌లో కూడా ఈ దొంగ చూపులేవిటి?’ గొణుక్కున్నాడు ప్రభు. ఆమె నవ్వింది.
‘మనిద్దర్నీ చూసి కాస్త అయోమయంలో పడ్డారు. నేను బురఖాలో వున్న ముస్లిం యువతిని. మీరు పక్కా హిందువులానే వున్నారు. అదీగాక ఇద్దరం కలిసి రాలేదు. అందుకే వాళ్లకంత కుతూసలం. ఎంతైనా మన మనస్తత్వాలు అంత తేలిగ్గా మారవు కదండీ’ అంది నవ్వుతూనే.
అది తనని దృష్టిలో పెట్టుకుని కూడా అన్నట్టు ఫీలయ్యాడతను. అదేం గమనించని ‘క్లూ’ అతన్ని తీసుకుని ఓ గదిలోకెళ్లి తలుపు లాక్ చేసింది. ఆ తర్వాత అతనితో చాలాసేపు మాట్లాడి బురఖా తీసేసింది.
అంతే! ఆమె అందానికీ, ఆకర్షణకీ కొయ్యబారిపోయాడు ప్రభు. అతన్ని చనువుగా కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పిందామె. అతని మొహంలో ఆనందం, విస్మయం! రెండు తర్వాత లేచారిద్దరూ.
* * *
ఆలయపు దొంగతనాన్ని గురించి తెలియలేదు గానీ కొండ చుట్టూ పోలీసుల రాకపోక లెక్కువై పోయాయి. చంద్రయ్య అనే అతను సెక్యూరిటీగా చేరాడు. అతను ధైర్యస్థుడే కాదు, ఆ పరిసరాలన్నీ బాగా తెలిసిన వాడు. అందరికీ బ్లాక్ టైగర్ మీదే అనుమానంగా వున్నా, అసలలాంటి వ్యక్తి ఉన్నాడా? లేక ఆ పేరు పెట్టుకుని దోపిడీలు చేస్తూ ఆ పేరు ఉపయోగించుకుంటున్నారా?’ అన్న అనుమానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుతోనూ, ఇతర పోలీసు ఆఫీసర్స్‌తోనూ గంటల తరబడీ చర్చించి ‘ప్రయాగ’ అనే సిబిఐ ఆఫీసర్‌కి దొంగతనం తాలూకు బాధ్యతల్ని అప్పగించాడు చంద్ర. ప్రయాగకి ఎలాంటి దొంగల్నయినా ఇట్టే పట్టెయ్యగలడు అన్న పేరుంది. పోలీసు బలగానికి మాత్రం శంకరయ్య మీదే చాలా అనుమానాలున్నాయి. కానీ ఆధారాలేం దొరకలేదు.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్