S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పత్రికారంగంలో అక్షర శ్రామికునిగా..

తిలక్ మహాశయుడు కుల మతాతీత సంఘీభావాన్ని, ఆ జాతీయోద్యమ దీప్తిని ప్రజ్వలింపజేసేటందుకు ముంబాయిలో ‘గణపతి బప్పా మోరియా’ ఉత్సవాలను మొదలుపెట్టిన చరిత్ర నేపథ్యంలోనే - కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారు 1908, వినాయక చవితినాడు ఆంధ్రసచిత్ర వారపత్రికను - కార్యాలయంలో విఘ్నేశ్వర పూజా సంబరాలతో ప్రారంభించారు. అదే సంప్రదాయాన్ని తీసుకుని ఆంధ్రపత్రిక మొదట, మద్రాసుకి, పధ్నాలుగు జహంగీర్ వీధిలోకి - అక్కణ్నుంచి తంబుచెట్టి వీధిలోకి వస్తూ - 1914 నుంచీ - మాంచి యుద్ధకాలంలో దినపత్రికగా కూడా అవతరించింది.
ఏటా, ఈ వినాయక చవితి నవరాత్రులు దక్షిణాదికి కొత్త అయినా, ఆంధ్రపత్రిక సిబ్బంది - అంతస్తుల తేడాలు మరిచి, చేసుకుంటున్నారు. నేను సరిగ్గా 1961 ఆ సంబరాల కాలంలోనే కలం చేతబట్టుకుని - అడుగుపెట్టాను ఎడిటోరియల్ హాలులోకి. ఆంధ్రపత్రిక ‘వీక్లీ’ మీద మా ‘చిన్నసారు’ -(నిజానికి నా జాబ్‌మెంటార్) పేరు - ‘సంపాదకుడు - శివలెంక రాధాకృష్ణ’ అని పడటం మొదలెట్టింది అప్పుడే. మూణ్నెల్లే అయింది - అయ్యవారి పేరు ‘చీఫ్ ఎడిటర్’ అని వేశారు.
మధ్యాహ్నం విరామ సమయం తర్వాత, బల్ల దగ్గరికి నేను వచ్చేసరికి - బల్ల మీద అడ్డాకు దొప్పల్లో ప్రసాదం పెట్టి ఉంది. నేను సంకోచిస్తున్నాను. ‘శంకర్’ ఆపాటికే నాకు ప్రసన్నుడై పోయాడు. ‘తినుమీ! పిల్లయార్ పూజ, ఆఫీసెల్లే’ అన్నాడు. అర్థం చేసుకున్నాను. ‘చందా ఇవ్వలేదే?’ అన్నాను. ‘అప్పరం ఇద్దువులే, తినుమీ’ అంటూ టి.పి. ఆపరేటర్, టి.వేణు వచ్చాడు. (‘తిక్కవేణు’ అని పేరెట్టాను, ఆనక) ఒక్కో డిపార్టుమెంటు, ఒక్కోరోజు చేస్తారీ నవరాత్రి పూజలు. ఆఖరిరోజున అమృతాంజన్, ఆనక అయ్యవారి తరఫున - అదే విజయవాడలో అయితే అమృతాంజన్‌కి బదులు - ‘దుర్గా కళామందిర్’ సిబ్బంది చేసేవారు. అదీ సంగతి.
బెజవాడలో సినిమా రివ్యూలు చేయాల్సి వచ్చినప్పుడు - ‘సినిమా తీయడం ఎలా?’ అన్న ఒక చిన్న పుస్తకం సంపాదించాను. ‘బుక్‌వరల్డ్’లో దాన్ని శ్రద్ధగా చదివేను. స్క్రిప్టు - షాట్ డివిజన్ - వగైరాలాంటి టెక్నికల్ డీటైల్స్‌ని తెల్సుకున్నాను. ‘వీరాజీ’ అన్న పేరు కాక ‘కృష్ణానంద్’ అన్న పేరు వాడుకున్నాను - సినిమాలకి ‘బుక్‌వరల్డ్’ అంటే గాంధీనగరంలోని పాత పుస్తకాల షాపులకి నేను పెట్టిన ‘ముద్దు పేరు’... అక్కడ పేరుకే ‘పాత’గానీ ‘కొత్త’ పాపులర్ నవలలు కూడా, గప్‌చిప్‌న ఆవిష్కరణకు నోచుకుంటాయ్. ‘హెరాల్డ్ రాబిన్స్’ లాంటి లేటెస్ట్ ‘క్రేజీ కింగ్’ కయినా అక్కడే అరంగేట్రం జరగాలి. జర్నలిజం మీద బుక్స్ వెదికాను - ప్రబోధా బుక్ సెంటర్లోనూ వెదికాను.
నాకు ఓ ఐడియా ఉంది - దినపత్రిక వర్క్ గురించి. ఎలా అంటే - మా రావూరుగారు, రెంటాల వారు, బెల్లంకొండ వారు, తిరుమల మహాశయులు, బొమ్మారెడ్డిగారు, పరకాల, నిడమర్తిగార్ల నుంచి - ఏ.బి.కె. దాకా - అలాగే, ఎల్లోరా, శార్వరి, రాఘవ (అజంతా ఆ తరువాత పరిచయం) లాంటి దినపత్రిక ‘వీరుల’తో పరిచయాలు, ఎడిటోరియల్ హాలు, ప్రెస్ - అనే వాటితో కూడా పరిచయం ఏర్పడ్డం వల్ల.. -‘రెండు టాప్ బాక్సులు, రెండు బాటమ్ బాక్సులు’ రాసొచ్చాను ఇప్పుడే’ అనేవాడు రావూరు సత్యన్నారాయణ రావుగారు. ‘బ్యానర్ రాసి ఇచ్చి వస్తున్నా’ననేవాడు రెంటాలగారు. ఇక్కడ మద్రాసు ఆం.ప్ర. డైలీ హాలులో కూర్చున్నానిప్పుడు. నా బల్ల - ఇన్‌ఛార్జ్ శ్రీరాములు గారి పెద్ద బల్లకి కుడిప్రక్క మొట్టమొదట వున్న చిన్నబల్ల. ఆ వరస అన్నీ చిన్నబల్లలే. కాస్త పొడుగూ పొట్టీ తేడాగా. హాలులో అన్నీ ఒకటే. ఎదురుగా అసిస్టెంట్ ఎడిటర్ సూర్యప్రకాశరావు - ప్రక్కన వి.వి. నరసింహారావు (ప్రభ నుంచి మైగ్రేట్ అయినవాడు, ‘బ్రహ్మయ్యగారి అల్లుడు’ బిరుదాంకితుడు.) ఆ ప్రక్కన, అసెంబ్లీ అయిటమ్స్ అన్నీ - ‘ట్రాన్స్ లిటరేషనే కనుక - అంటే, ఇంగ్లీషు అక్షరాలలో వచ్చే తెలుగు అయిటమ్స్‌ని, తడుముకోకుండా రాయగల ఏకైక వ్యక్తి - జె.బి. శర్మగారు కూర్చొనేవారు. (టెలిప్రింటర్ ఒకేఒక్కటుండేది. హైదరాబాద్ నుంచి సొంత లైను అది. హై.బా. అయిటమ్స్ అన్నీ తెలుగు లిపిలోకి మేం మార్చి రాయాలి. ఆనక వర్కర్లు కంపోజ్ చెయ్యాలి. అన్నీ కేవలం ‘ఇరవై ఆరు’ అక్షరాల్లో పొదగబడి వచ్చేవి.
విలేఖరుల టెలిగ్రాములు - ట్రాన్స్‌లిటరేషన్‌లో రావడానికి లేదు. ఎందుకంటే, అప్పటికి టెలిగ్రాఫ్ సర్వీస్ కూడా కేవలం ‘కట్ట కడకట్టా’ అంటూ మోర్స్‌కోడే.. టెలిప్రింటర్ సర్వీసు ఇంకా లేదు. అందుకే అన్నాను నేను ‘స్టోన్ ఏజ్’ నుంచి ఆనక ‘లోహ యుగం’ నుంచీ - ఇప్పటి ఎలక్ట్రానిక్ ‘ఈరా’ దాకా, క్రిందా, మీదా దొర్లుతూ ఎదిగిన ‘జర్నలిస్టు వాణ్ని’ అని.
వెనక్కి తిరిగి చూస్తే అదంతా, ఓ మాయా, రొమాంటిక్ ప్రపంచంలాగా - ‘ఔనా? నిజమేనా!’ అనిపిస్తుంది. ఏభై ఏండ్లలో - థాంక్స్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్‌నెట్! న్యూస్ పేపర్ రూపురేఖా విలాసాలే - ఎడ్లబండి నుంచి ఎగిరే విమానంలాగా మారిపోయాయి! గొప్ప అభివృద్ధి.
ఐనా, నాకెందుకో చాలా వెలితిగా అనిపించింది. అంతా చీకటిగా, మధ్యలో ఓ ‘చిరు ఆశాదీపం’ లాగా ఉంది స్థితి. నా స్కూలు, క్లాస్‌మేట్స్ అంతా పెద్ద పొజీషన్స్‌లోకి వెళ్లినా, కొందరు కూలబడినా సరే ‘ఇంచిపేట’ - మా ఇంట వాళ్లదే సందడి. పోస్ట్‌మ్యాన్ చేతినిండా, బరువుగా ఉత్తరాలు మోసుకొచ్చే విధంగా అభిమానులు - వాకాటి, మంజుశ్రీ, జ్యేష్ఠ, కొండముది లాంటి హేమాహేమీలు మొదలుకొని - కేవలం నన్ను రచయితగా మాత్రమే తెలిసి, అలా ప్రేమిస్తున్న అభిమానులు రాసే - ఈ ఉత్తరాల కట్టలు ఇక ఆగుతాయా? రీ డైరెక్ట్ అయి రావా?’ అన్న వెలితి...
ఐతే, ‘ఎదిగీ ఎదగని మనుషులు’ సీరియల్ నా కథలు పడుతున్న వేర్వేరు పత్రికలు, ప్రభ, విశాలాంధ్ర, జయశ్రీ, యువ వగైరాలు రకరకాల రీడైరెక్టు అవుతూనే ఉన్నాయి. (్థంక్స్ టు తమ్ముడు అండ్ నా యూనివర్సిటీ రూమ్మేట్ గోపాలం - మా అమ్మకి వాళ్ల చేయూతే ఎల్లవేళలా)
థియరీ ఎంత అధ్యయనం చేసినా ప్రాక్టికల్స్ కష్టం. పి.టి.ఐ. (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) ఒక్కటే తప్ప యు.ఎన్.ఐ లేదు అప్పటికి మాకు. హైదరాబాద్ డైరెక్ట్ లైన్ టెలిప్రింటర్ ఉండేది. మిగతావి విలేఖరుల టపా, టెలిగ్రామ్స్, అరుదుగా టెలిఫోన్‌లు. ఇండెక్స్ డిపార్ట్‌మెంట్లు, రిఫరెన్స్ సెక్షన్లు - ఇళ్లే. ఇక్ష్వాకుల నాటి రాజుల్లో ఒకడు తంతే, ఇక్కడ హాల్లో బల్ల మీద పడ్డ ‘నల్లబొచ్చుకుక్క’ లాంటి శంకర నారాయణ్‌గారి ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు బుక్ ఒకటి మా బల్లల మీద చక్కర్లు కొట్టేది. (ఆశ్చర్యంగా ఉందా?!)
‘అబ్బే! నా బల్ల’ కాళ్లకీ, అంచులకీ లెక్కలేనన్ని వాతలు కనబడ్డాయి. మద్రాసులో - ఏ ‘ఎలక్ట్రిక్ పోల్’ చూసినా తాంబూలం సున్నం మచ్చలు, రోడ్లమీద కిల్లీ మరకలు కనబడేవి. అలాగా - ఈ,నా బల్లని - శంకర్, బాలకృష్ణలు (నాకు ఈ ఇద్దరూ తొందరగా ఫ్రెండ్స్ అయిపోయారు. భడవలిద్దరికీ తెలుగు నేనే నేర్పాను) తంటాలు పడి క్లీన్ చేశారు. ఇంతకీ, ఆ బల్ల మీద పండిత హరీత శివశంకర శర్మగారు - ‘నిత్యాగ్ని హోత్రప్రియుడు’ కూర్చునేవారట. హారిత శివశర్మగారు అనే పేరుతో వీక్లీలో - ‘హరివంశం’ సీరియల్ రాస్తున్న సాంబశివరావుగారే మా ‘హరిత శివశర్మాజీ’. ఆయనే ఎడిటోరియల్స్ రాసేవారు. ఓ వృద్ధ సింహం లాగా వుండేదాయన మొహం. ఎడిటోరియల్ రాసుట, ‘్భరతి’ చూసుట కూడా ఆయన పనే. ‘సిగరెట్ బట్టీ’లు, బల్ల యొక్క చెంపలకీ, దాని కాళ్లకీ నొక్కేస్తూనే, కబుర్లు చెప్పేవాడు ఆయన. అయితే గొప్ప ‘స్కాలరు’ ఆయన.
శ్రీరాములుగారు పదకొండు గంటల వేళ - ఛాతీమీద ఒక ఫైళ్ల పుస్తకాల కట్ట ఇలా హత్తుకుని మోస్తూ వస్తూంటే - ఆ కొసన కూర్చున్న ప్రసాద్ (పాలపర్తి రామప్రసాద్) ‘శ్రీరాముని దయ చేతను ఆరూఢిగ సకల జనులు ఔరా, యనగా!’ అంటూ, ప్రకాశరావుగారికి ‘సైగ’ అందించేవాడు. పాపం! ఆ బ్రామ్మడు ఆలస్యంగా రావడం ఎంత మాత్రం కాదది. ప్రొద్దునే్న లేచి శ్రీరాములు సారు - ‘అయ్యవారింటికి వెళ్తారు. అక్కడ పేపర్లు, వార్తలు అలా సకల విషయాల మీద ‘మంథనం’ సాగుతుంది. అయ్యవారు ఎడిటోరియల్ దేని మీద, ఎట్లా రాయాలీ అన్న ‘బ్రీఫింగ్’ ఇస్తారు. అది పట్టుకుని ఆఫీసుకు వచ్చి (లంకమేతా గోదావరీత’ అన్నంత దూరం) ‘సాంబయ్య గారికి’ ఇవ్వాలి. అదీ ‘అయ్యవారి’ ఎడిటింగ్ తడాఖా!
బాపుగారి, ‘మనవాళ్లు’, క్రింద డైలీలో, ఊమెన్ గారి ‘లోకం పోకడ’ (రెండూ పోకెట్ కార్టూన్లు) పైన, వీక్లీలో (అనగా పై అంతస్తులో వీక్లీ కార్నర్ ఉండేది.) ప్రచురింపబడుతూ ఉండేవి. అప్పుడే, శంకర్ వేస్తున్న ‘ఎప్పుడూ ఇంతే’నన్న వ్యంగ్య చిత్ర శీర్షిక పాఠకుల్ని తినేసేది. అదే టైమ్‌లో శ్రీశైల జీర్ణోద్ధరణ నిధిని వసూలు చేస్తోంది ఆంధ్రపత్రిక. అప్పుడే, ‘మనమూ - మన దేహ స్థితీ’ - గాలి బాలసుందర్రావు గారి శీర్షిక వస్తోంది. (ఈయనే, ఆనక నటుడు చంద్రమోహన్‌కి మామగారైనాడు) వి.వి.ఎన్. లాగే, బొమ్మకంటి సుబ్బారావు గారు కూడా. ఆంధ్రప్రభ నుండి మైగ్రేట్ - రుూయన, హాల్లో కాస్త భిన్నంగా వుండేవారు.
నరసింహారావు గారికి, నేను మొదటి పేజీ మీద - ‘ఖేసరాసరా’ అని రాస్తే - ఎందుకో దుఃఖం వచ్చేది. అదే వరుసలో కూర్చున్న అగస్త్యేశ్వర్రావుగారు (రెగ్యులర్ లేట్ కమ్మర్, అయినా దొడ్డమనిషి) (ఆనక రుూన ‘బాలూ’ అంటే, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారి మామగారైనాడు) ‘పోనిద్దురూ, కుర్రవాడు, నోవలిస్టూ - కొత్తగా ఉంటుందని అలా రాస్తున్నాడు’ అంటూ నవ్వేవాడు.
ఇక, నేను అయిటమ్ రాస్తే, తప్పకుండా దానికొక హెడ్డింగ్ పెట్టి పంపేవాణ్ని, ప్రకాశరావు గారి బల్ల మీదికి. అందరూ రాసిన అయిటమ్స్ అన్నీ ఆయన చూసి, చదివి, వాటికి హెడ్డింగ్‌లు - అవసరాన్నిబట్టి - సింగిల్ కాలమ్ లేదా డబుల్, ట్రిబుల్ కాలమ్ హెడ్డింగ్‌లు పెట్టి - అవుట్‌గోయింగ్ ‘ట్రే’లో పడేసేవాడాయన. అదీ ఆయన డ్యూటీ. ఐతే, నేను కష్టపడి అక్షరాలు లెక్కపెట్టి హెడ్డింగులు పెట్టడం ముందే నేర్చుకుని - చెయ్యి నలగాలని, పెట్టేవాణ్ని. దగ్గరికి పిలిచి ‘హెడ్డింగులు నేను పెడతా సామీ’ అనేవాడు.. వద్దని వారిస్తున్నట్లు.
హాలులో ఆ చివర కొత్త బాలుడు సూరి నాగరాజు, ఏ.బి.వి. నరసింహారావులు నాలాగే కొత్త సరుకు. పైన వీక్లీలో - సుబ్బారావు, మందరపు లలిత కూడా కొత్త శాల్తీలు. అంటే పోయినేడాది స్ట్ఫా కోసం ఆగస్ట్‌లో పత్రిక వేసిన ప్రకటన దరిమిలా పరీక్ష జరిగి తర్వాత సెలక్షన్ వగైరాలు జరిగి, ఛాన్స్ పొందిన కొత్త మొహాలు.. అన్న మాట! అనగా, నేను ఆనందవాణిలో వుంటూ, సదరు ప్రకటనే చూడకుండా - కొంచెం ముందు వెనుకలుగా ‘సబ్’ లేదా ‘కబ్’ ఎడిటర్‌గా, నేరుగా వచ్చేశానన్నమాట. (హవ్ లక్కీ!)
సరిగ్గా ఆ టైములో వీక్లీలో ‘తెలిసిన రహస్యం’ అన్న కథ (27.9.61) పడ్డది. అందరూ ‘హా! తెలిసెన్ నీ రహస్యం!’ అంటూ నవ్వుతూ అభినందించారు. పైగా, ఒక్కరైనా ‘కృష్ణమూర్తీ’ అని పిలవలేదు.’ ‘వీరాజీ’యే అందరి నోటా నలిగిన పేరైంది. సీనియర్ సబ్ ‘డి.కె.ఎం’గారు అనగా కథా రచయిత ద్రోణంరాజు కృష్ణమోహన్ కూడా నా బల్ల దగ్గరకొచ్చి, అదే పనిగా కబుర్లు చెప్పేవాడు. శ్రీరాములుగారు బల్ల మీద పేపర్ వెయిట్‌తో ఇలా ‘టక్‌టక్’మని కొట్టి - వార్నింగ్ ఇచ్చేవారు. గప్‌చిప్! అదీ సంగతి!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com