పదవీ విరమణ
Published Saturday, 16 March 2019
ఆరున్నర సంవత్సరాలు న్యాయవాదిగా పని చేశాను. ఆ తరువాత పోటీ పరీక్ష రాసి మేజిస్ట్రేట్ అయినాను. జిల్లా జడ్జీగా పని చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేసే అవకాశం వచ్చింది. దాని కాలపరిమితి 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు. ఏది ముందు అవుతే అది వర్తిస్తుంది. నాకు 62 సంవత్సరాలు రావడంవల్ల పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
న్యాయవాది కాకముందే నేను కథలూ, కవిత్వం రాసేవాడ్ని. ఆ తరువాత కూడా కొనసాగింది. కథలూ, కవిత్వమే కాకుండా న్యాయపరమైన పుస్తకాలూ, వ్యాసాలు రాయడం మొదలైంది. లెక్కలేనన్ని వ్యాసాలు, లెక్కపెట్టే విధంగా పుస్తకాలూ రాశాను. ఇంకా రాస్తున్నాను.
నా ఉద్యోగ పదవీ విరమణ తరువాత అందరూ నన్ను ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు.
‘పదవీ విరమణ చేశావు కదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు’ అని.
అందరికీ ఒకే ఒక సమాధానం చెబుతున్నాను.
‘నేను న్యాయవాది కాక ముందు నుంచే నేను ఓ పని చేసేవాడిని. అదే కథలూ కవిత్వం రాసేవాడిని. ఇప్పుడూ అదే చేస్తున్నాను.’
ఇంకా ఇలా చెబుతున్నాను.
‘రచయితలకు, కళాకారులకూ పదవీ విరమణ వుండదు. సృజనకారులందరికీ పదవీ విరమణ ఉండదు. వాళ్లు ఎప్పుడూ పదవిలోనే వుంటారు. వాళ్లు సృజన చేస్తూనే వుంటారు. అందరి సంగతి ఏమోగానీ నా సంగతి మాత్రం చెబుతున్నాను. నేను పదవీ విరమణ చేయలేదు. కథలూ, కవిత్వం, లీగల్ వ్యాసాలూ పుస్తకాలూ రాస్తూనే వున్నాను. మరో విషయం కూడా చెప్పాలి. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను.’
నేను రాసిన కథలూ కవిత్వాలూ చదువుకొని అవి నేనే రాశానా అని సంతోషపడుతూ వుంటాను. ఒక రకంగా గర్వపడుతూ వుంటాను.
సృజనకారులకు పదవీ విరమణ వుండదు.
వాళ్ల ఆనందం కోసం ఇతరుల ఆనందం కోసం వాళ్లు సృజన చేస్తూనే ఉంటారు.